యుగయుగాల ఆకాంక్ష

72/88

71—సేవకులకు సేవకుడు

యెరూషలేములో ఒక ఇంటి పై గదిలో యేసు ఆయన శిష్యులు భోజనానికి బల్లచుట్టూ కూర్చుని ఉన్నారు. పస్కాపండుగ జరుపుకోడానికి వారు సమావేశమయ్యారు. ఈ పండుగను తన శిష్యులతో ఒంటరిగా ఆచరించాలని రక్షకుడు ఆకాంక్షించాడు. తన గడియ వచ్చిందని ఆయనకు తెలుసు. పస్కాపశువు ఆయనే. పస్కాపశువును తినవలసిన నాడే ఆయన బలిదానం జరగనుంది. ఉగ్రత గిన్నెలోని పానీయాన్ని తాగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. త్వరలో ఆయన శ్రమల అంతిమ బాప్తిస్మం పొందనున్నాడు. దానికి ముందు ఆయనకి ఇంకా కొంత ప్రశాంత సమయం ఉంది. ఈ సమయాన్ని తన ప్రియ శిష్యులను బలపర్చేందుకు వినియోగించాలని భావించాడు. DATel 724.1

క్రీస్తు జీవితమంత స్వార్థంలేని సేవాజీవితం. “పరిచారము చేయించుకొనుటకు” కాదు “పరిచారము చేయుటకు” (మత్త 20:28) అన్నది ఆయన చేసిన ప్రతీకార్యం నేర్పేపాఠం. అయితే ఆ ఆపాఠాన్ని శిష్యులు ఇంకా నేర్చుకోలేదు. ఈ చివరి పస్కాపండుగ రాత్రి భోజనమప్పుడు ఆయన ఇదే పాఠాన్ని ఒక సాదృశ్యం ద్వారా మళ్లీ బోధించాడు. అది వారి మనసుల్లోను హృదయాల్లోను నిరంతరంగా ముద్రపడి నిలచిపోయింది. DATel 724.2

యేసుకీ ఆయన శిష్యులికీ మధ్య జరిగిన సమావేశాలు సామాన్యంగా ప్రశాంతంగా ఆనందంగా గడిపిన సమయాలు. వాటికి వారెంతో విలువనిచ్చారు. పస్కా రాత్రి భోజనాలు ప్రత్యేకాసక్తితో నిండిన సన్నివేశాలు. అయితే ఈ సారి యేసు మనసు కలత చెందింది. ఆయన హృదయం బరువుగా ఉంది. ఆయన ముఖంపై దుఃఖఛాయ కనిపించింది. పైగదిలో ఆయన శిష్యుల్ని కలిసినప్పుడు ఏదో ఆయన్ని కలవరపర్చుతున్నట్లు వారు గమనించారు. దానికి హేతువు తెలియకపోయినా వారు ఆయనపట్ల సానుభూతి చూపారు. DATel 724.3

భోజనం బల్ల చుట్టూ అందరూ కూర్చున్నప్పుడు వేదనతో నిండిన హృదయంతో దుఃఖస్వరంతో ఇలా అన్నాడు, “నేను శ్రమపడక మునుపు మితో కూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి - మీరు దీనిని తీసికొని నాలో పంచుకొనుడి; ఇక మీదట దేవుని రాజ్యము వచ్చువరకు నేను ద్రాక్షారసము త్రాగనని నాతో చెప్పుచున్నాను.” DATel 725.1

తాను లోకంలో నుంచి నిష్క్రమించి తన తండ్రి వద్దకు వెళ్లిపోవలసిన సమయం వచ్చిందని క్రీస్తుకు తెలుసు. లోకంలో ఉన్న తన వారిని ఆయన ప్రేమించాడు. చివరి వరకు వారిని ప్రేమించాడు. ఇప్పుడు ఆయన సిలువ నీడను నిలిచి ఉన్నాడు. ఆ బాధ ఆయనకు వేదన కలిగిస్తోంది. తన అప్పగింత గడియలో తనను అందరూ విడిచిపెడ్తారని ఆయన ఎరుగును. నేరస్తులు అనుభవించాల్సిన సిగ్గుకరమైన క్రూరమైన పద్ధతిలో తాను మరణించనున్నట్లు ఆయనకి తెలుసు. ఎవరిని రక్షించడానికి తాను వచ్చాడో ఆ ప్రజల కృతఘ్నతను క్రూరత్వాన్ని ఆయన ఎరుగును. తాను చేయాల్సిన త్యాగం ఎంత గొప్పదో ఎంతమంది విషయంలో అది నిరర్ధకమో ఆయనకు తెలుసు. తన ముందన్నదంతా ఎరిగిన ఆయన తాననుభవించనున్న అవమానం చిత్రహింస గురించిన ఆలోచనలతో కలత చెంది ఉండడం సహజమే. కాని ఆయన తన పన్నెండు మంది శిష్యుల గురించి ఆలోచించాడు. వారు ఆయనతో తన సొంత మనుషుల్లా ఉన్నారు. వారు తన పరాభవం దుఃఖం చిత్రహింస అన్నీ ముగిసాక లోకంలో శ్రమలు కష్టాలు అనుభవించడానికి మిగిలిపోతారు. తాననుభవించాల్సిన శ్రమల గురించి తలంచినప్పుడుల్లా వారిని గురించి తలంచేవాడు. ఆయన తన్ను గురించి ఎన్నడూ ఆలోచించలేదు. వారిని గురించిన శ్రద్ధ వారిని గురించిన ఆసక్తి ఆయన తలంపుల్లో ప్రాధాన్యం వహించాయి. DATel 725.2

ఈ చివరి సాయంత్రం తన శిష్యులతో చెప్పడానికి ఆయనకు చాలా ఉంది. వారికి చెప్పాలని ఆయన ఆశించినదంతా స్వీకరించడానికి వారు సిద్ధంగా ఉండి ఉంటే, వారికి తీవ్ర హృదయవేదన, ఆశాభంగం, అవిశ్వాసం తప్పి ఉండేవి. కాగా తాను చెప్పాల్సిన సంగతుల్ని శిష్యులు తట్టుకోలేరని యేసు గుర్తించాడు. వారి ముఖాల్లోకి చూసినప్పుడు తన హెచ్చరిక మాటలు ఓదార్పుమాటలు ఆయన పెదవుల మీదే నిలిచిపోయాయి. కొన్ని క్షణాలు నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆయన దేనికో వేచి ఉంటున్నట్లు కనిపించింది. శిష్యులికి అది ఇబ్బందికరంగా ఉంది. క్రీస్తు దుఃఖముఖాన్ని చూసినప్పుడు వారిలో పుట్టిన సానుభూతి ఇకలేదు. తన బాధలు శ్రమల గురించి ఆయన చెబుతున్న దుఃఖకరమైన మాటలు వారిని కదిలించలేదు. వారు ఒకరి వంక ఒకరు చూస్తున్న కొరకొర చూపులు వారిలోని అసూయను పోరాట ప్రవృతిని ఎండగడ్తున్నాయి. DATel 726.1

“తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అనువాదము వారిలో” పుట్టింది. తన సముఖంలోనే సాగుతున్న వివాదం ఆయన్ని దుఃఖపర్చింది. ఆయన హృదయం గాయపడింది. క్రీస్తు తన రాజ్యాధికారాన్ని చేపడ్డాడని దావీదు సింహాసనంపై ఆసీనుడవుతాడన్న తమ ప్రియమైన అభిప్రాయాన్ని వారింకా పట్టుకుని ఉన్నారు. ప్రతీవారు తమ హృదయంలో దేవుని రాజ్యంలో అత్యున్నత స్థానాన్ని ఆశిస్తున్నారు. వారు తమను గురించి ఇతరుల్ని గురించి తమ సొంత అంచనాలు వేసుకుని, తమకన్నా తమసహోదరులు ఎక్కువ యోగ్యులని భావించే బదులు తమ్ముని తాము ప్రథములుగా ఎంచుకుంటోన్నారు. క్రీస్తు సింహాసనానికి ఒకడు కుడిపక్క ఒకడు ఎడమపక్క కూర్చోడానికి యాకోబు యోహానులు మనవి చెయ్యడాన్ని తక్కిన శిష్యులు హర్షించలేదు. వారికి కోపం వచ్చింది. ఆ ఇద్దరూ అహంకరించి అత్యున్నత స్థానాన్ని కోరడం తక్కిన పదిమందిని ఆందోళనపర్చింది. మనస్పర్థలు తలెత్తే ప్రమాదం ఏర్పడింది. తమను అపార్థం చేసుకున్నారని తమ విశ్వసనీయతను ప్రత్యేక వరాలను అభినందించలేదని వారు బాధపడ్డారు. యాకోబు యోహానులతో యూదా అతికఠినంగా వ్యవహరించాడు. DATel 726.2

శిష్యులు భోజనం గదిలో ప్రవేశించినప్పుడు వారి హృదయాలు అపోహలు అనుమానాలతో నిండి ఉన్నాయి. యూదా క్రీస్తుకి దగ్గరగా ఎడమపక్క కూర్చున్నాడు. యోహాను ఆయన కుడిపక్క కూర్చున్నాడు. అత్యున్నత స్థానమంటూ ఉంటే యూదా దాన్ని దక్కించుకోడానికి కృత నిశ్చయంతో ఉన్నాడు. ఆ స్థానం క్రీస్తు పక్క స్థలమన్న అభిప్రాయం ఉంది. యూదా మిత్రద్రోహి. DATel 727.1

వారిలో మరొక విషయం వివాదాంశమయ్యింది. విందుకి విచ్చేసిన అతిథులు పాదాల్ని ఒక సేవకుడు కడగడం ఆచారం. ఈ సందర్భంలో ఏందుకు ఏర్పాట్లు జరిగాయి. పాదాలు కడగడానికి నీళ్లు, బేసిను, తువాలు సిద్ధంగా ఉన్నాయి. కాని సేవకుడులేడు. ఆ పాత్రను శిష్యులు పోషించాల్సి ఉన్నారు. అయితే అతిశయంతో నిండి ఉన్న శిష్యులు ఎవరూ సేవకుడి పాత్ర పోషించడానికి సమ్మతంగా లేరు. అందరూ సాంఘిక అలక్ష్యాన్ని, తాము చేయాల్సిందేమయినా ఉండవచ్చునన్న స్పృహలేని నిర్లిప్తతని ప్రదర్శించారు. తమ మౌనం వల్ల వారు అణకువ చూపడానకి నిరాకరించారు. DATel 727.2

ఈ దుర్బల ఆత్మలపై సాతాను విజయం సాధించలేని స్థితికి వీరిని క్రీస్తు ఎలా తీసుకురావాలి? శిష్యులమని చెప్పుకున్నంత మాత్రాన వారు శిష్యులుకాబోరని లేక తన రాజ్యంలో స్థానానికి భరోసా ఉండదని వారికి ఎలా బోధపర్చగలడు? నిజమైన గొప్పతనమంటే ప్రేమ పూర్వక పరిచర్య వాస్తవికమైన వినయం అని ఆయన ఎలా చూపించాలి? వారి హృదయాల్లో ప్రేమను రగిలించి తాను చెప్పాలని ఆశిస్తోన్న, సంగతుల్ని వారికి సుబోధకం ఎలా చెయ్యగలడు? DATel 727.3

శిష్యులు ఒకరికొకరు పరిచర్య చేసుకోడానికి కదలలేదు. వారు ఏమి చేస్తారా అని ఆయన కనిపెట్టొన్నాడు. అప్పుడు ఆ పరమ బోధకుడు బల్లవద్దనుంచి లేచాడు. పై వస్త్రం తీసి పక్కన పెట్టి, తువాలు తీసుకుని దాన్ని చుట్టుకున్నాడు. శిష్యులు అదంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఏం జరుగుతుందోనని నిశ్శబ్దంగా ఉత్కంఠతో కనిపెడున్నారు. “అంతట పళ్లెములో నీళ్లుపోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొనియున్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను.” ఈ చర్య శిష్యుల కళ్లు తెరిపించింది. సిగ్గు పరాభవం వారి హృదయాల్ని నింపాయి. ఆయన నిశ్శబ్ద మందలింపును వారు గ్రహించి తమ్మును తాము సరికొత్త దృక్కోణం నుంచి చూసుకున్నారు. DATel 727.4

శిష్యుల పట్ల, తన ప్రేమను క్రీస్తు ఇలా వ్యక్తం చేశాడు. వారి స్వార్థ స్వభావం ఆయనకి దుఃఖం కలిగించింది. తమ సమస్య సందర్భంగా ఆయన వారితో వివాదానికి దిగలేదు. దానికి బదులు వారికి ఎన్నడూ మరపురాని ఒక సాదృశ్యాన్ని ఇచ్చాడు. వారిపట్ల ఆయన ప్రేమ మారదు లేక ఆరిపోదు. తండ్రి అన్నిటిని తన చేతుల్లో పెట్టాడని తాను దేవుని వద్దనుంచి వాచ్చానని దేవుని వద్దకు వెళ్లాలని ఆయనకు తెలుసు. తన దేవత్వం గురించి ఆయన ఎరుగును. కాని ఆయన తన రాజ కిరీటాన్ని రాజ దుస్తుల్ని పక్కన పెట్టి సేవకుడి పాత్ర పోషించాడు. DATel 728.1

యూదా పస్కాకి ముందు యాజకుల్ని శాస్త్రుల్నీ రెండోసారి కలుసుకుని తమకు యేసుని అప్పగించడానికి వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయినా, ఏ పాపం ఎరుగనట్లు, తర్వాత శిష్యులతో కలిసిపోయి భోజనానికి సిద్ధబాటు కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాడు. యూదా ఉద్దేశాల గురించి శిష్యులికి ఏమి తెలియదు. యేసు మాత్రమే అతడి రహస్యాన్ని చదవగలిగాడు. అయినా ఆయన అతణ్ని బయటపెట్టలేదు. యేసు అతడి ఆత్మను రక్షించడం కోసం ఆకలిగొన్నాడు. యెరూషలేము విషయంలో వేదన చెంది ఎలా దుః ఖించాడో అలాగే యూదా కోసం హృదయవేదన చెందాడు. నిన్ను నేను ఎలా విడువను అంటూ ఆయన హృదయం విలపిస్తోంది. బలవంతం చేసే ఆ ప్రేమ తాలూకు శక్తిని యూదా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. రక్షకుని చేతులు ఆ మురికి పాదాలు కడిగి వాటిని తువాలుతో తుడుస్తున్నప్పుడు యూదా హృదయం ఉద్వేగభరితమై అక్కడికక్కడే తన పాపాన్ని ఒప్పుకోవాలనుకున్నాడు. కాని అతడు తన్నుతాను తగ్గించుకుని వినయమనస్కుడు కాలేదు. పశ్చాత్తాపపడకుండా గుండెను రాయి చేసుకున్నాడు. కాసేపు పక్కన పెట్టిన పాత ఉద్వేగం అతణ్ని మళ్లీ అదుపుచెయ్యనారంభించింది. ఇప్పుడు శిష్యుల పాదాలు క్రీస్తు కడగడం యూదాకి అభ్యంతరంగా ఉంది. క్రీస్తు తన్ను తాను ఇంతగా తగ్గించుకుంటే ఆయన ఇశ్రాయేలు రాజు కాజాలడని అతడు తలంచాడు. లోక సంబంధమైన రాజ్యపాలనలో లోక గౌరవం సంపాదించాలన్న ఆశ అడిఆశ అయ్యింది. క్రీస్తుని వెంబండించినందువల్ల కలిగే లాభమేమి లేదని యూదా గ్రహించాడు. తన ఊహ ప్రకారం ఆయన తన్నుతాను భ్రష్టపర్చుకోడం చూసిన తర్వాత ఆయన్ని విడిచి పెట్టాలని, తాను మోసపోయినట్లు వెల్లడించుకోవాలని అతడు దృఢనిశ్చయానికి వచ్చాడు. అతణ్ని దయ్యం పట్టింది. యేసుని పట్టి ఇవ్వడానికి కుదుర్చుకున్న ఒప్పందాన్ని నెరవేర్చడానికి తీర్మానించుకున్నాడు. DATel 728.2

బల్లవద్ద తన స్థానాన్ని ఎన్నుకోడంలో మొదటివాడిగా ఉండడానికి యూదా ప్రయత్నించాడు. సేవకుడిగా క్రీస్తు అతడికి ముందు పరిచర్య చేశాడు. ఎవరిపట్ల అతడు ఎక్కువ క్రోధంగా ఉన్నాడో ఆ యోహాను ఆయన చివరగా పరిచర్య చెయ్యడానికి మిగిలాడు. అయితే యోహాను దీన్ని గద్దింపుగా గాని కించపాటుగా గాని పరిగణించలేదు. క్రీస్తు చేస్తున్న పనిని పరిశీలస్తోన్న శిష్యులు తీవ్రంగా చలించారు. ఆయన పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు “ప్రభువా నీవు నాపాదములు కడుగుదువా?” అన్నాడు. తన్నుతాను అంతగా తగ్గించుకున్న క్రీస్తును చూడడం పేతురుకి చెప్పు దెబ్బలా ఉంది. “నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యిక మీదట తెలిసికొందువు” అని క్రీస్తు చెప్పాడు. దేవుని కుమారుడని తాను విశ్వసిస్తోన్న తన ప్రభువు దాసుడుగా పరిచర్య చెయ్యడం చూడలేకపోయాడు. ఆయన ఇలా తన్నుతాను తగ్గించుకోడాన్ని అతనిలోని ప్రతీ అణువూ వ్యతిరేకించింది. ఈ కార్యనిర్వహణకే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడని అతడు గుర్తించలేదు. “నీ వెన్నడును నాపాదములు కడుగరాదు” అని పేతురు ఖరాఖండిగా చెప్పాడు. DATel 729.1

పేతురుకి క్రీస్తు ఇలా గంభీరంగా బదులిచ్చాడు, “నేను నిన్నుకడుగని యెడల నాతో నీకు పాలు లేదు.” పేతురు నిరాకరించిన సేవ ఉన్నతశుద్ధికి చిహ్నం. ఆత్మకు అంటిన పాపవు మరకనుంచి హృదయాన్ని శుద్ధి చెయ్యడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు. తన పాదాలు కడగవద్దని పేతురు క్రీస్తుని వారించడంలో పేతురు అల్ప శుద్ధీకరణలో ఇమిడి ఉన్న ఉన్నత శుద్ధీకరణను తోసిపుచ్చుతున్నాడు. తన ప్రభువుని నిజంగా నిరాకరిస్తున్నాడు. మన శుద్ధీకరణకు సేవచెయ్యడానికి ప్రభువుని అనుమతించడం ఆయన్ని కించపరచడం కాదు. మన నిమిత్తం దేవుడు చేసిన ఏర్పాటును కృతజ్ఞతతో స్వీకరించి చిత్తశుద్ధితో క్రీస్తు సేవ చెయ్యడమే నిజమైన వినయం. “నేను నిన్ను కడుగని యెడల నాతో నీకు పాలులేదు.” అన్న మాటలతో పేతురు తన అహంకారాన్ని మొండితనాన్ని విడిచి పెట్టాడు. క్రీస్తు నుంచి విడిపోవడమన్న ఆలోచనను భరించలోకపోయాడు. అది అతడికి నిత్యమరణమయ్యేది. “ప్రభువా, నాపాదములు మాత్రమేగాక నాచేతులు నా తలకూడ కడుగుము” అని పేతురు అనగా, “స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగుకొనక్కరలేదు, అతడు కేవలము పవిత్రడయ్యెను” అన్నాడు. DATel 729.2

ఈ మాటల్లో శారీరక శుద్ధికన్నా ఎక్కువ భావం ఇమిడి ఉంది. క్రీస్తు ఇంకా అల్ప శుద్ధీకరణ ఉదాహరించే ఉన్నత శుద్ధీకరణను గురించే మాట్లాడున్నాడు. స్నానం చేసి వచ్చిన వ్యక్తి పరిశుభ్రంగా ఉన్నాడు. కాని చెప్పులున్న పాదాలు త్వరలో మురికయ్యాయి. మళ్లీ వాటిని శుభ్రపరచడం అవసరమయ్యింది. కనుక పాపం, అశుభ్రతల శుద్ధీకరణకు ఏర్పాటైన ఆ జీవపు ఊటలో పేతురు అతడి సహోదరులు శుద్ధి పొందారు. వారిని తనవారిగా క్రీస్తు గుర్తించాడు. అయితే శోధన వారిని పాపంలోకి నడిపించింది. కనుక వారికి శుద్ధీకరించే కృప అవసరమయ్యింది. వారి పాదాల నుంచి మురికిని కడిగివెయ్యడానికి యేసు తువాలు నడుముకి చుట్టుకున్నప్పుడు ఆక్రియ ద్వారా ప్రాతికూల్యం, ఈర్య, గర్వాన్ని కడిగి వెయ్యడానికి పూనుకున్నాడు. వారి మురికి పాదాలు శుభ్రం చెయ్యడం కన్నా దాని పర్యవసానం దీర్ఘకాలికమైంది. అప్పుడు వారిలో ప్రబలుతున్న స్వభావంతో వారిలో ఒక్కడు కూడా క్రీస్తుతో సహవాసానికి సిద్ధంగాలేడు. వినయం అనురాగం కలిగి నివసించే స్థితికి వస్తే తప్ప వారు పస్కారాత్రి భోజనానికి గాని లేక క్రీస్తు ఇప్పుడు నెలకొల్పనున్న స్మారకార్థపు ఆచారంలో పాలు పొందడానికి గాని వారు సిద్ధంగా లేరు. వారి హృదయాలు శుద్ధిపొందాలి. గర్వం, స్వార్థచింతన విభేదాల్ని ద్వేషాన్ని సృష్టిస్తాయి. కాని, వారి పాదాలు కడగడంలో యేసు వీటన్నిటిని కడిగివేశాడు. మనోభావాల్లో మార్పుకలిగింది. వారిని చూసి క్రీస్తు “నారును పవిత్రులు” అని చెప్పగలిగాడు. ఇప్పుడు వారి హృదయాలు ఒకటయ్యాయి. వారు ఒకరిపట్ల ఒకరు ప్రేమకలిగి ఉన్నారు. వారిప్పుడు వినయంగా, నేర్చుకోడానికి సిద్ధంగా ఉన్నారు. యూదా మినహా తక్కిన వారందరూ అత్యున్నత స్థానాన్ని ఇతరులికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వినయవిధేయతలతో కృతజ్ఞతతో నిండిన హృదయాలతో ఇప్పుడు వారు క్రీస్తు మాటల్ని స్వీకరించగలిగారు. DATel 730.1

పేతురు తక్కిన శిష్యులవలె మనం కూడా క్రీస్తు రక్తంలో శుద్ధి పొందుతున్నాం. అయినా దుష్టితో సంబంధం వలన శుభ్రంగా ఉన్న హృదయానికి తరచు మురికి అంటుకుంటుంది. కనుక శుద్ధీకరించే కృపకోసం మనం క్రీస్తు వద్దకు రావడం అవసరం. మురికిగా ఉన్న తన పాదాల్ని తన ప్రభువు చేతుల స్పర్శకు సమర్పించడానికి పేతురు వెనుదీశాడు, అయితే మనం మన పాపహృదయాన్ని ఆయన స్పృశించడానికి ఎంత తరచుగా తీసుకువస్తాం! మన దురాగ్రహం, మన బడాయి, అతిశయం ఆయనకు ఎంత దుఃఖకరం! అయినా మన బలహీనతలన్నిటిని, మన దుర్నీతి అంతటిని మనం ఆయన వద్దకు తేవాలి. మనల్ని ఆయన శుద్ధిచేయగలడు. ఆయన మనల్ని శుభ్రం చేస్తేనే గాని ఆయనతో సహవాసానికి మనం సిద్ధంగా ఉండం. DATel 731.1

యేసు శిష్యులతో ఇలా అన్నాడు, “మీలో అందరు పవిత్రులు కారు.” ఆయన యూదా పాదాలు కడిగాడు. కాని అతడి హృదయం ప్రభువుకి సమర్పితం కాలేదు. అది శుద్ధీకరణ పొందలేదు. యూదా తన్నుతాను క్రీస్తుకి సమర్పించకోలేదు. DATel 731.2

క్రీస్తు శిష్యుల పాదాలు కడిగి తన పైవస్త్రం తీసుకుని మళ్లీ కూర్చున్న తర్వాత వారితో ఇలా అన్నాడు, “నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు, ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయనే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను నా పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము నారును చేయ వలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని. దాసుడు తన జమానునికంటె గొప్పవాడు కాడు. పంపబడినవాడు తన్ను ఎంపినవానికంటె గొప్పవాడుకాడు.” DATel 731.3

తాను తమ పాదాలు కడిగినప్పటికీ అది తన గౌరవానికేమి భంగం కలిగించలేదని తన శిష్యులికి బోధపర్చాలని క్రీస్తు అభిలషించాడు. ‘బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరట్లు పిలుచుట న్యాయమే.” ఆయన అంత సమున్నతుడు గనుక ఆ సేవ మర్యాదను ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. క్రీస్తుకున్న ఔన్నత్యం ఎవ్వరికీ లేదు. అయినా ఆయన తన్నుతాను తగ్గించుకుని మిక్కిలి దీనమైన సేవను చేశాడు. స్వాభావిక హృదయంలో స్థానం ఏర్పర్చుకుని స్వార్ధ ప్రయోజనం ద్వారా పటిష్ఠమయ్యే స్వార్థం తన ప్రజల్ని తప్పుదారి పట్టించకుండేందుకు స్వయంగా క్రీస్తే మనకు వినయానకి ఆదర్శమయ్యాడు. ఈ అంశాన్ని మానవుడికి అప్పగించడం దేవునికి ఇష్టం లేదు. అది అంత ప్రాముఖ్యమైన అంశంగా పరిగణించాడు గనుకనే దేవునితో సమానుడైన ఆయనే స్వయంగా తన శిష్యులికి దాసుడిగా సేవ చేశాడు. అత్యున్నత స్థానం కోసం వారు సిగపట్లు పడుతుంటే, ఎవరిముందు ప్రతీమోకాలు వంగుతుందో, ఎవరికి సేవ చెయ్యడం మహిమదూతలు గొప్పభాగ్యంగా ఎంచుకుంటారో ఆ ప్రభువు వంగి తన శిష్యుల పాదాలు కడిగాడు. తనను పట్టి ఇవ్వనున్న యూదా పాదాల్ని కూడా ఆయన కడిగాడు. DATel 731.4

తన జీవితంలోను బోధలోను స్వార్థరహిత సేవకు క్రీస్తు పరిపూర్ణ ఆదర్శం. స్వార్ధరహిత సేవకు మూలం దేవుడే. దేవుడు తనకోసం తాను జీవించడు. లోకాన్ని సృజించడం ద్వారాను, సర్వాన్నీ పరిరక్షించడం ద్వారాను ఆయన నిత్యం ఇతరులికి సేవ చేస్తోన్నాడు. “ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మిదను తన సూర్యుని ఉదయింపచేసి, నీతిమంతుల మీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.” మత్త 5:45.’ ఈ సేవాదర్శాన్ని దేవుడు కుమారునికి అప్పగించాడు. సేవ చెయ్యడం ఎలాగో తన ఆదర్శం ద్వారా నేర్పించేందుకు యేసు మానవుడై మానవాళికి శిరసయ్యాడు. ఆయన జీవితం యావత్తు సేవా నియమానికి అనుగుణంగా సాగింది. ఆయన అందరికీ సేవ చేశాడు. అందరికీ పరిచర్యచేశాడు. ఈ విధంగా ఆయన దేవుని ధర్మశాస్త్రానుసారంగా నివసించాడు. ధర్మశాస్త్రానికి ఎలా విధేయులమై నివసించాలో తన జీవితం ద్వారా మనకు చూపించాడు. DATel 732.1

తన శిష్యుల మధ్య ఈ నియమాన్ని స్థిరపర్చడానికి యేసు పదే పదే ప్రయత్నించాడు. ఉన్నత స్థానాలికి యాకోబు యెహానులు మనవి చేసినప్పుడు ఆయనిలా అన్నాడు, “మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు పరిచారకుడై యుండవలెను” మత్త 20:26. నా రాజ్యంలో అధిక్యం సర్వాధిక్యం అన్న నియమం లేదు. ఒకే గొప్పతనం ఉంది. అది వినయం తెచ్చే గొప్ప తనం. పరులికి అంకితభావంతో పరిచర్య చెయ్యడంలోనే విశిష్ఠత ఉంది. DATel 732.2

శిష్యుల పాదాలు కడిగిన తర్వాత ఆయన ఈ మాటలన్నాడు, “నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని” ఈ మాటల్లో క్రీస్తు కేవలం ఆతిథ్య ఆచరణను మాత్రమే ఆదేశించడం లేదు. ప్రయాణం చేసి వచ్చిన అతిథుల పాదధూళిని కడిగివెయ్యడం కన్నా ఎక్కువే ఇమిడి ఉంది. క్రీస్తు ఇక్కడ ఒక మతాచారాన్ని స్థాపిస్తున్నాడు. మన ప్రభువు చేసిన ఈ కార్యంవల్ల హీనమైన ఈ సేవ ఒక పవిత్రాచారమయ్యింది. వినయం పై, సేవానిరతి పై ఆయన నేర్పిన పాఠాలు శిష్యులు నిత్యం గుర్తుంచుకునేందుకు దీన్ని ఆచరించాల్సి ఉన్నారు. DATel 733.1

ఈ ఆచారం ప్రభు సంస్కార ప్రక్రియకు సిద్ధబాటు నిమిత్తం క్రీస్తు నియమించిన ఆచారం. ఆధిక్యం కోసం గర్వం, విభేదం, పోరాటం మనసులో ఉండగా హృదయం క్రీస్తుతో సహవాసంలో ప్రవేశించలేదు. ప్రభువు శరీరాన్ని రక్తాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండలేం. అందుచేత ఆయన పొందిన అవమానానికి చిహ్నంగా ముందు ఈ వినయాచారాన్ని ఆచరించాలని యేసు నియమించాడు. DATel 733.2

ఈ సంస్కారాన్ని ఆచరించడానికి వచ్చేటప్పుడు దైవప్రజలు ప్రభువు చెప్పిన ఈ మాటలు గుర్తుచేసుకోవాలి, “నేను మీకు చేసినపని నాకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక హెరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన యెడల నారును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని దాసుడు తన యాజమానునికంటె గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన యెడల మీరు ధన్యులగుదురు.” ఇతరులకన్నా తానే గొప్పవాణ్నని భావించడం, స్వార్ధ ప్రయోజనాలకి పాటు పడడం, అత్యున్నత స్థానానికి ప్రయత్నించడం మనుషుడిలో స్వభావ సిద్ధంగా ఉన్న ప్రవృత్తి. ఇది తరచుగా దురాలోచనలకు విద్వేషానికి దారి తీస్తుంది. అపార్ధాలు అపోహలు తొలగించి, మానవుణ్ని తన స్వార్దాన్నుంచి ఆత్మ ఔన్నత్యం నుంచి కిందకి తెచ్చి, అతడిలో వినయ మనసు పుట్టించి తన సహోదరుడికి సేవ చెయ్యడానికి అతణ్ని నడిపించడానికి ప్రభు భోజనానికి ముందు వినయ సంస్కారం ప్రభువు ఏర్పాటు చేశాడు. DATel 733.3

ఆత్మ పరిశీలనకు, పాప స్పృహకు, పాప క్షమాపణ నిశ్చయతకు అనుకూలంగా ఆ సమయాన్ని రూపొందించడానికి పరిశుద్దాత్మ అక్కడ ఉంటాడు. స్వార్థ హృదయాల్లో చెలరేగే ఆలోచనా ధోరణిని మార్చడానికి క్రీస్తు తన కృపాసంపూర్ణతతో అక్కడ ఉంటాడు. తమ రక్షకుని వెంబడించే వారి భావోద్వేగాల్ని పరిశుద్దాత్మ చైతన్యపర్చుతాడు. మన నిమిత్తం రక్షకుడు భరించిన సిగ్గును పరాభవాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు తలంపులు ఒకదానితో ఒకటి అనుసంధానపడ్డాయి. జ్ఞాపకాల గొలును ఏర్పడుంది. దేవుని దయాళుత్వాన్ని గురించి, మిత్రుల ప్రేమానురాగాల్ని గూర్చిన సహృదయతని గూర్చిన జ్ఞాపకాలు అవి. విస్మరించిన దీవెన, దుర్వినియోగమైన దయ, అలక్ష్యం చేసిన కరుణ మనసులోకి వస్తాయి. ప్రేమ అనే పచ్చని మొక్కను పెరగనివ్వకుండా చేసిన ద్వేషపు వేరులు బయలుపడ్డాయి. ప్రవర్తన దోషాలు, నిర్లక్ష్యం చేసిన విధులు, దేవుని పట్ల ప్రదర్శించిన కృతఘ్నత, మన సహోదరులు చూపిన అనాదరణ జ్ఞాపకం వస్తాయి. పాపం దేవుని దృష్టికి ఎలా కనిపిస్తుందో అలాగే మనకు కనిపిస్తుంది. మన తలంపులు ఆత్మ సంతృప్తితో కాక ఆత్మ నిందతోను, సిగ్గుతోను నిండి ఉంటాయి. వైరుధ్యం, వేర్పాటు సృష్టించిన ప్రతీ అడ్డుగోడను కూలగొట్టడానికి మనసు బలోపేతమౌతుంది. చెడు తలంచడం చెడుగా మాట్లాడం ఇక ఉండదు. పాపాల్ని ఒప్పుకోడం వాటికి క్షమాపణ పొందడం జరుగుతుంది. ఆత్మను స్వాదీనపర్చుకునే క్రీస్తు కృప హృదయంలోకి వస్తుంది. క్రీస్తు ప్రేమ హృదయాల్ని ఐక్యపర్చుతుంది. DATel 734.1

సిద్దబాటు పాఠం ఈ రీతిగా నేర్చుకున్నప్పుడు ఉన్నత ఆధ్యాత్మిక జీవితం జీవించాలన్న కోరిక పుడుతుంది. ఈ కోరికకు పరిశుద్దాత్మ సానుకూలంగా స్పందిస్తాడు. ఆత్మ సమున్నతమౌతుంది. మన పాపాలికి క్షమాపణ లభించిందన్న గుర్తింపుతో ప్రభుభోజన సంస్కారంలో మనం పాలు పొందవచ్చు. నీతి సూర్యుడు క్రీస్తు వెలుగు ఆత్మ మందిరంలోని హృదయ కవాటాల్ని కాంతితో నింపుతుంది. మనం “లోక పాపములను మోసికొనిపోవు దేవుని గొట్టెపిల్లను” వీక్షిస్తాం. యోహా 1:29. DATel 734.2

ఈ ఆరాధన స్ఫూర్తిని స్వీకరించే వారికి అది కేవలం ఆచారం అవ్వదు. అది నిత్యం బోధించే పాఠం “ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులై యుండుడి” అన్నది. గల 5:13. తన శిష్యుల పాదాలు కడగడంలో, పరలోక రాజ్యపు నిత్య జీవ ఐశ్వర్యానికి వారిని వారసులు చెయ్యడానికి ఏ పరిచర్య అయినా అది ఎంత దీనమైనదైనా చేస్తాననడానికి ఆయన నిదర్శనం ఇచ్చాడు. అదే ఆచారాన్ని ఆచరించడంలో ఆవిధంగానే తమ సోదరులికి సేవ చేస్తామంటూ ఆయన శిష్యులు వాగ్దానం చేస్తారు. ఈ ఆచారాన్ని సరిగా ఆచరించినప్పుడల్లా ఒకరికొకరు సహకరించుకుని ఒకరికొకరు మేలు చేసుకునేందుకు దేవుని ప్రజలు ఒక పవిత్ర బాంధవ్యంలో ప్రవేశిస్తున్నారు. రక్షకుని సేవారంగంలా వారి పరిచర్య రంగం విశాలంగా ఉంటుంది. మన సేవ అగత్యమైన వారితో ఈ లోకం నిండి ఉంది. పేదలు, నిరీక్షణ లేనివారు, అజ్ఞానులు ఎక్కడ పడితే అక్కడున్నారు. మేడపై గదిలో క్రీస్తుతో సహవాసం చేసేవారు ఆయన పరిచర్య చేసినట్లు పరిచర్య చెయ్యడానికి బయలుదేరి వెళ్తారు . DATel 735.1

అందరి సేవలూ అందుకున్న యేసు అందరికీ సేవకుడుగా ఉండడానికి వచ్చాడు. ఆయన అందరికీ పరిచర్య చేశాడు కాబట్టి తిరిగి అందరూ ఆయనకు సేవచేసి ఆయన్ని ఘనపర్చుతారు. ఆయన దైవగుణలక్షణాల్ని పంచుకుని రక్షణ పొందేవారిని చూసి ఆయనతో ఆనందించే వారందరూ ఆయన స్వార్ధరహిత సేవాదర్శాన్ని అనుసరించాల్సి ఉన్నారు. DATel 735.2

“నేను మీకు చేసిన ప్రకారము నారును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని” అన్నమాటల్లో ఇదంతా వ్యక్తమయ్యింది. ఆయన స్థాపించిన ఈ ఆచారం ఉద్దేశం ఇదే. ఆయన ఇలా అంటోన్నాడు, “ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక,” ఈ సంగతుల ఉద్దేశం నాకు తెలుసుగనుక, “వీటిని చేసినయెడల మీరు ధన్యులగుదురు.” DATel 735.3