యుగయుగాల ఆకాంక్ష

71/88

70—“మిక్కిలి అల్పులైన యీనా సహోదరులలో...”

“తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడైయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన యెదుట పోగుచేయబడుదురు .... ఆయన వారిని వేరుచేయును.” క్రీస్తు ఒలీవల కొండమీద తన శిష్యులికి తీర్పుదిన దృశ్చాన్ని ఈ విధంగా చిత్రించాడు. దాని తీర్మానం ఒక్క అంశం మీద ఉంటుందని ఆయన సూచించాడు. వివిధ జాతుల ప్రజలు ఆయన ముందు సమావేశమైనప్పుడు అక్కడ రెండే రెండు తరగతుల ప్రజలుంటారు. బీదలు బాధపడుతున్న ప్రజల రూపంలో తనకు వారు ఏమి చేశారు లేక ఏమిచేయడం నిర్లక్ష్యం చేశారు అన్న దానిమీద వారి నిత్య భవిష్యత్తు నిర్ణయించడం జరుగుతుంది. DATel 717.1

తమ విమోచనార్థం తన ప్రాణం త్యాగం చెయ్యడంలో తాను చేసిన మహాకార్యాన్ని క్రీస్తు ఆరోజున ప్రజలకు వివరిస్తాడు. తనకు వారు చేసిన నమ్మకమైన సేవను వివరిస్తాడు. తన కుడిచేతి పక్క ఉన్నవారితో ఆయన ఇలా అంటాడు, “నా తండ్రి చేత ఆశీర్వదింపబడినవారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని నా కొరకు సిద్ధము చేయబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. పరదేశినైయుంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై యుంటిని, నన్ను చూడవచ్చితిరి చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరి.” అయితే క్రీస్తు ప్రశంసిస్తున్నవారు తాము ఆయనకు సేవ చేస్తున్నట్లు ఎరుగరు. గలిబిలి పడి వారు అడిగిన ప్రశ్నలకు ఆయన ఇలా జవాబు చెబుతాడు, “మిక్కిలి అల్పులైన యీ నాసహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి.” DATel 717.2

మనుషులు తమను ద్వేషించి హింసించి శ్రమలకు గురిచేయనున్నారని శిష్యుల్ని యేసు హెచ్చరించాడు. అనేకుల్ని తమ గృహాలనుంచి తరిమివేస్తారని, తాము పేదరికాన్ని అనుభవిస్తారని వారిని హెచ్చరించాడు. అనేకులు దు: ఖాన్ని లేమిని అనుభవిస్తారని, అనేకుల్ని, చెరసాలలో వేస్తారని చెప్పాడు. తన నిమిత్తం స్నేహితుల్ని లేక గృహాన్ని వదిలివేసేవారందరికీ ఈ జీవితంలో వందరెట్లు దీవెనలు వాగ్దానం చేశాడు. ఇప్పుడు తమ సహోదరులికి పరిచర్య చేసే వారందరికి ప్రత్యేక దీవెన ఉంటుందని హామీ ఇచ్చాడు. నా నిమిత్తం బాధలు పొందుతున్న అందరిలోను మీరు నన్ను గుర్తించాలని యేసు చెప్పాడు. మీరు నాకు ఎలా పరిచర్య చేస్తారో అలాగే వారికీ పరిచర్య చెయ్యాలి అన్నాడు. మీరు నాశిష్యులనడానికి ఇది నిదర్శనం అన్నాడు. DATel 718.1

దేవుని కుటుంబంలోకి జన్నించేవారందరూ ప్రత్యేకరీతిగా మన రక్షకునికి సహోదరులు. క్రీస్తుపట్ల ప్రేమ ఆయన కుటుంబ సభ్యులందరినీ ఐక్యపర్చుతుంది. ఆ ప్రేమ ఎక్కడ ప్రదర్శితమైతే అక్కడ ఈ పరిశుద్ధ బాంధవ్యం వెల్లడవుతుంది. “ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును.” 1యోహాను 4:7. DATel 718.2

తీర్చు దినాన క్రీస్తు ఎవర్ని ప్రశంసిస్తాడో వారు వేదశాస్త్రం ఎరిగినవారు కాకపోవచ్చు. కాని వారు ఆయన నియమాల్ని అనుసరించేవారు. దేవుని ఆత్మ ప్రభావం ద్వారా వారు తమ ఇరుగుపొరుగువారికి సహాయంగా ఉంటారు. అన్యజనుల్లో సయితం దయాస్పూర్తి గలవారున్నారు. జీవవాక్యం వారి చెవిని పడకముందు నుంచి విషనెరీల పట్ల సుహృద్భావం కలిగి తమ ప్రాణాల్ని పణంగా పెట్టే వారికి సేవలందిస్తున్నారు. అన్యజనుల్లో తెలియకుండా దేవున్ని ఆరాధించేవారున్నారు. వారికి మానవ సాధనాల ద్వారా సత్యం అందలేదు. అయినా వారు రక్షణ పొందుతారు. ‘లిఖిత రూపంలో ఉన్న దైవధర్మశాస్త్రాన్ని వారు ఎరుగకపోయినా ప్రకృతి ద్వారా మాట్లాడే ఆయన స్వరాన్ని విని ధర్మశాస్త్రం కోరే పనుల్ని వారు చేస్తున్నారు. పరిశుద్ధాత్మ వారిని స్పృశించాడని, వారు దేవుని బిడ్డలుగా గుర్తింపు పొందారని వారి క్రియలు వెల్లడిస్తున్నాయి. DATel 718.3

“మిక్కిలి అల్పులైన యీ నాసహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి” అన్నమాటలు రక్షకుని నోటి నుంచి వినడం జాతుల్లోను అన్యజనుల్లోను మిక్కిలి అల్పులైన వారికి ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంది! వారికి ఎంత ఆనందం కలుగుతుంది! ఆయన పలికే ఈ ప్రశంసా వాక్యాలు విని తన అనుచరులు ఆశ్చర్యాన్ని అమితానందాన్ని వ్యక్తం చేసేటప్పుడు అనంత ప్రేమామయుని హృదయం ఎంత ఆనందిస్తుంది! DATel 719.1

క్రీస్తు ప్రేమ ఏ ఒక్క తరగతికి వర్గానికి పరిమితం కాదు. దీన స్వభావం గల ప్రతీ వ్యక్తిని ఆయన తన బిడ్డగా భావిస్తాడు. మనం పరలోక కుటుంబ సభ్యులమయ్యేందుకుగాను ఆయన ఐహిక కుటుంబ సభ్యుడయ్యాడు. ఆయన మనుషకుమారుడు గనుక ఆదాము కుమారులు కుమార్తెల్లో ప్రతీ ఒక్కరికీ సహోదరుడు. తన అనుచరులు తమచుట్టూ నశిస్తూ ఉన్నలోకంతో తమకు సంబంధంలేనట్లు భావించకూడదు. వారు మహత్తర మానవ స్రవంతిలో ఒక భాగం. పాపులకు పావనులకు వారిని సహోదరులుగా పరలోకం పరిగణిస్తోంది. పడిపోయినవారిని, తప్పులు చేస్తున్న వారిని, పాపులను క్రీస్తు అక్కున చేర్చుకుంటాడు. పడిపోయిన ఆత్మను పైకిలేపడానికి చేసే ప్రతీ సహాయం, ప్రతీ కారుణ్య కార్యం తనకు చేసినట్టుగా ఆయన పరిగణిస్తాడు. DATel 719.2

రక్షణకు వారసులైన వారికి పరిచర్య చేయడానికి దేవుడు పరలోక దూతల్ని పంపుతాడు. వారెవరో ఇప్పుడు మనకు తెలియదు. ఎవరు జయించి పరిశుద్దుల వారసత్వంలో పాలుపంచుకోబోతున్నారో ఇంకా వెల్లడి కాలేదు. కాని దుఃఖిస్తున్నవారిని ఓదార్చడానికి అపాయాన్ని ఎదుర్కుంటున్న వారిని కాపాడడానికి, మనుషుల మనసుల్ని క్రీస్తు పైకి తిప్పడానికి పరలోక దూతలు భూమి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు సంచిరిస్తోన్నారు. వారు ఒక్క వ్యక్తిని కూడా నిర్లక్ష్యం చెయ్యరు. దాటి వెళ్లిపోరు. దేవుడు పక్షపాతికాడు, తాను సృజించిన వారందరినీ సమదృష్టితో చూస్తాడు. DATel 719.3

అవసరంలో ఉన్న, బాధపడుతున్న క్రీస్తు బిడ్డలికి నా తలుపు తెరచినప్పుడు మీరు అదృశ్యులై ఉన్న దేవదూతల్ని ఆహ్వానిస్తున్నారు. పరలోక నివాసుల సాహచర్యాన్ని ఆహ్వానిస్తున్నారు. వారు సంతోష సమాధానాల పరిశుద్ధ వాతావరణాన్ని తమతో తెస్తారు. వారు తమ పెదవుల మీద స్తుతితో వస్తారు. దానికి ప్రతిస్పందిస్తూ పరలోకం నుంచి గానం వినిపిస్తుంది. దయతో నిండిన ప్రతీ కార్యం అక్కడ సునాద సంగీత మవుతుంది. ఈ నిస్వార్థ కార్యకర్తల్ని తన ప్రశస్త ఐశ్వర్యంలో భాగంగా తండ్రి తన సింహాసనం నుంచి పరిగణిస్తాడు. DATel 719.4

క్రీస్తు ఎడమ చేతి పక్క ఉన్నవారిని అనగా బీదలు బాధల్లో ఉన్నవారి : రూపంలోని తనను నిర్లక్ష్యం చేసిన వారిని, తమ అపరాధ స్పృహలేని వారిని సాతాను గుడ్డివారిని చేశాడు. కనుక తమ సహోదరులకు తాము ఏమి చెయ్యాల్సిఉన్నారో అన్న తెలివిడి వారికి లేకపోయింది. వారు స్వారాలోచనల్లోనే తలమునకలై ఉన్నారు. ఇతరుల అవసరాల్ని పట్టించకోలేదు. బాధలు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న తన బిడ్డలికి సహాయం ఆదరణ అందించేందుకుగాను ఆస్తిపరులికి దేవుడు ధనాన్నిచ్చాడు. పేదలైన తమ సహోదరులకన్నా తాము ఘనులము అధికులము అని వారు గర్వపడతారు. ఆ పేదవారి స్థానంలో తమ్మును తాము ఊహించుకుని వ్యవహరించరు. పేదవారి శోధనల్ని శ్రమల్ని వారు అర్థం చేసుకోరు. కనుక వారి హృదయంలో ప్రేమ ఉండదు. విలాసవంతమైన గృహాల్లోను వైభవోపేతమైన చర్చిల్లోను సమయం గడపుతూ ధనికులు బీదలకు దూరంగా ఉంటారు. అవసరంలో ఉన్నవారి కోసం దేవుడిచ్చిన ఆర్థిక వనరుల్ని అతిశయాన్నీ, స్వార్థాన్ని పెంచడానికి వినియోగిస్తారు. దేవుని దయానురాగాల్ని గూర్చిన జ్ఞానం అందించకుండ వారు పేదల్ని అనుదినం దోచుకుంటున్నారు. ఎందుకంటే పేదల జీవితావసరాలు తీర్చడానికి ఆయన సకల ఏర్పాట్లను చేశాడు. జీవితాన్ని కుంచించే పేదరికాన్ని వారు అనుభవిస్తారు. వారు తరచు ఈర్య అసూయ దురాలోచనలు కలిగి ఉండడానికి పేదరికం దారి తీస్తుంది. లేమి ఒత్తిడిని ఎరుగనివారు తరచు పేదవారిని ద్వేషించి తాము భిక్షగాళ్లుగా భావించుకునేటట్లు వారిపట్ల ప్రవర్తిస్తారు. DATel 720.1

క్రీస్తు ఇదంతా చూస్తున్నాడు కనుక ఆయన ఇలా అంటోన్నాడు - ఆకలిగా ఉన్నవాణ్ని దప్పికగా ఉన్నవాణ్ని నేనే. పరదేశినై ఉన్నది నేనే. జబ్బుగా ఉన్నవాణ్ని నేనే. చెరసాలలో మగ్గినవాణ్ని నేనే. బోలెడంత ఆహారంతో నిండిఉన్న బల్లవద్దకూర్చుని వారు విందు ఆరగింస్తుండగా మురికి వాడలోని గుడిసెలో లేక జనసంచారం లేని వీధిలో నేను ఆకలితో అలమంటించాను. సర్వహంగులు గల ఈ గృహంలో మీరు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే నాకు తలదాచుకోడానికి చోటులేదు. ఈ పెట్టెనిండా వెలగల దుస్తులుంటే నేను బట్టలు లేని నిరుపేదనై ఉన్నాను. మీరు వినోదాల్లో మునిగి తేలుతుంటే నేను చెరసాలలో మగ్గాను. DATel 720.2

ఆకలితో ఆలమటిస్తోన్న పేదవారికి వారు ముష్టిగా చిన్న రొట్టిముక్క ఇచ్చినప్పుడు ఎముకలు కొరికే చలినుంచి వారిని కాపాడేందుకు వారు ఆ పలచని బట్టలు ఇచ్చినప్పుడు మీరు వాటిని మహిమ ప్రభువుకి ఇస్తున్నామని గుర్తుంచుకున్నారా? మీ జీవిత కాలమంతా ఈ బాధిత ప్రజల రూపంలో నేను నా పక్కనే ఉన్నాను. మీరునన్ను వెదకలేదు. నాతో సహవాసాన్ని కోరలేదు. మీరెవరో నేనెరుగను. DATel 721.1

భూమిపై క్రీస్తు నివసించిన స్థలాన్ని సందర్శించడం, ఆయన నడిచిన చోట నడవడం, ఏ సరస్సు పక్క బోధించడానికి ఆయన ఇష్టపడే వాడో దాన్ని చూడడం, తరచు ఆయన తన దృష్టిని ఏ కొండలోయలపై నిలిపేవాడో వాటిని దర్శించడం గొప్ప భాగ్యంగా అనేకులు భావిస్తోన్నారు. కాని యేసు అడుగుజాడల్లో నడవడానికి మనం నజరేతుకో, లేక కపెర్నహోముకో, లేక బేతనియకో వెళ్లనవసరం లేదు. ఆయన అడుగుజాడల్ని వ్యాధిగ్రస్తుల పడక పక్క, పేదవారి గుడిసెల్లో, గొప్ప నగరాల గల్లీల్లో, ఆదరణ కోసం పరితపిస్తోన్న మానవ హృదయాలు ఎక్కడుంటాయో అక్కడ మనం కనుగోగలం. భూమి మిద ఉన్నప్పుడు ఆయన ఇతరులకు సేవచేసినట్లు సేవ చెయ్యడం ద్వారా మనం ఆయన అడుగుజాడల్లో నడవగలం. DATel 721.2

చెయ్యడానికి ఏదో అందరికీ ఉంటుంది. “బీదలు ఎల్లప్పుడును మీతో కూడ ఉందురు.” (యోహా 12:8) అని యేసు అన్నాడు. కనుక ఆయనకు సేవ చెయ్యడానికి తమకు స్థలం లేదని ఎవరూ భావించకూడదు. అజ్ఞానానికి పాపానికి బందీలై నశించడానికి సిద్ధంగా ఉన్న కోట్లాదిమంది ప్రజలు తమపట్ల క్రీస్తు ప్రేమను గురించి కనీసం వినలేదు. వారి పరిస్థితిలో మనం మన పరిస్థితిలో వారు ఉండి ఉంటే మనకు వారేమి చెయ్యాలని కోరతాం? DATel 721.3

మన శక్తి మేరకు మనం వారికి చెయ్యడం మన పవిత్ర బాధ్యత. మనలో ప్రతీ ఒక్కరు చివరి తీర్పులో నిలబడేది పడిపోయేది నిర్ణయించే క్రీస్తు జీవిత నియమం “మనుష్యులు నాకు ఏమి చేయవలెనని వారు కోరుమరో ఆలాగుననే మీరును వారికి చేయుడి” అన్నది. మత్త 7:12. DATel 722.1

దుఃఖిస్తున్న వారికి, శోధనకు గురి అయిన వారికి పరిచర్య చెయ్యడానికి సమర్ధతగల సంఘాన్ని స్థాపించడానికి రక్షకుడు తన విలువైన ప్రాణాన్ని అర్పించాడు. ఒక విశ్వాసుల సమూహం పేదలు, విద్యలేనివారు అనామకులు కావచ్చు. అయినా వారు గృహంలోను, తమ పరిసరాల్లోను సంఘంలోను, “ఆవలి ప్రదేశములలో” సయితం వారు పనిచేసుకోవచ్చు. ఆ పని ఫలితాలు నిత్యత్వమంత దీర్ఘకాలికమైనవి. DATel 722.2

ఈ సేవను నిర్లక్ష్యం చేస్తున్నందువల్ల అనేకమంది యువ శిష్యులు తమ క్రైస్తవానుభవంలో తప్పటడుగుల స్థాయిని దాటి వెళ్ళలేకపోతున్నారు. తమతో “నీ పాపములు క్షమింపబడియున్నవి” అని యేసు అన్నప్పుడు తమ హృదయాల్లో ప్రకాశించిన వెలుగును అవసరంలో ఉన్నవారికి సహాయం చెయ్యడం ద్వారా ఆరిపోకుండా కాపాడుకోగలిగేవారు. యువతను తరచు ప్రమాదాలకు గురిచేసే వారి అలుపెరుగని శక్తిని ఇతరులికి మేలు చేసే కృషికి మళ్ళించవచ్చు. ఇతరులకు మేలు చెయ్యడానికి చేసే కృషిలో స్వారం మరుగున పడుంది. DATel 722.3

ఇతరులికి పరిచర్య చేసే వారికి ప్రధాన కాపరి పరిచర్య చేస్తాడు. వారే జీవ జలాల్ని తాగి తృప్తి చెందుతారు. వారు ఉత్సాహం ఉద్రేకాల్ని రేపే వినోదాల్ని లేక తమ జీవితంలో కొంత మార్పును ఆకాంక్షించరు. నశించడానికి సిద్ధంగా ఉన్న ఆత్మల్ని రక్షించడం ఎలా అన్నదే వారికి ఆసక్తి గొలిపే అంశం. సాంఘిక సహవాసం సహాయపడుంది. రక్షకుడి ప్రేమ హృదయాల్ని ఆకర్షించి ఐక్యంగా ఉంచుతుంది. DATel 722.4

మనం దేవునితో జతపనివారమని గుర్తించినప్పుడు ఆయన వాగ్దానాల్ని గురించి నిర్లక్ష్యంగా మాట్లాడం. అవి మన హృదయాల్లో మంటల్లా మండుతుంటాయి. మన పెదవులపై అగ్నిలా రగులుతుంటాయి. DATel 722.5

అజ్ఞానులు, క్రమశిక్షణ రహితులు, తిరుగుబాటుదారులు అయిన ప్రజల్ని నడిపించడానికి దేవుడు మోషేని పిలిచినప్పుడు ఆయన ఈ వాగ్దానం చేశాడు, “నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను నీకు విశ్రాంతి కలుగజేసెదను.” ఆయన ఇంకా “నిశ్చయముగా నేను నీకు తోడైయుందును” అన్నాడు. నిర్గ 33:14; 3:12. శ్రమలు బాధలు అనుభవిస్తున్నవారి కోసం క్రీస్తు స్థానంలో పని చేసేవారందరికీ ఈ వాగ్దానం వర్తిస్తుంది. DATel 722.6

మానవుడి పట్ల తన ప్రేమలో దేవుడు లోకం పట్ల తన ప్రేమను ప్రదర్శిస్తున్నాడు. ఈ ప్రేమను మనలో నాటడానికి, మనల్ని ఒకే కుటుంబంలో సభ్యుల్ని చెయ్యడానికి మహిమరాజు మనలో ఒకడయ్యాడు. “నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మరొకని నొకడు ప్రేమించవలెను” (యోహా 15:12). ఆయన చివరి మాటలు నెరవేరినప్పుడు; ఆయన ప్రేమిస్తున్న రీతిగానే మనం లోకాన్ని ప్రేమించినట్లయితే, అప్పుడు మన నిమిత్తం ఆయన కర్తవ్యం నెరవేరినట్లే. మనం పరలోకానికి అనుకూలంగా ఉండడానకి శిక్షణ పొందుతాం. ఎందుకంటే మన హృదయాల్లో పరలోకం ఉంది. DATel 723.1

“చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశనము నందు పడుటకు జోగుచున్నవారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనిన యెడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గాక. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా” సామె 24:11, 12. క్రీస్తుకు సేవ చెయ్యని వారని. స్వారాలోచనలతో నిండి దేవునికి దూరమైపోయిన వారిని తీర్పు దినమందు విశ్వన్యాయాధిపతి దుష్టుల జాబితాలో చేర్చుతాడు. వారు కూడా ఇదే ఖండనకు గురి అవుతారు. DATel 723.2

ప్రతీ ఆత్మకు దేవుడు ఒక విధినిస్తాడు. ప్రధాన కాపరి ప్రతీవారిని ఇలా ప్రశ్నిస్తాడు “నీకియ్యబడిన మంద నీ సౌందర్యమైన మంద ఎక్కడనున్నది?” “నీవు నీకు స్నేహితులుగా చేసికొనినవారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పెదవు?” యిర్మీ 13:20, 21. DATel 723.3