యుగయుగాల ఆకాంక్ష

73/88

72—“నన్ను జ్ఞాపకము చేసికొనుటకై...”

“నేను మీకు అప్పగించినదానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి -యిది నా కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని -యీ పాత్ర నారక్తము వలననైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.” 1 కొరి 11:23-26. DATel 736.1

క్రీస్తు రెండు ఆర్థిక వ్యవస్థల సంధికాలంలోను, రెండు గొప్ప పండుగల మధ్యకాలంలోను నిలబడి ఉన్నాడు. నిష్కళంకమైన దేవుని గొర్రెపిల్ల అయిన ఆయన పాపపరిహారార్థ బలిగా తన్నుతాను సమర్పించుకోనున్నాడు. నాలుగువేల సంవత్సరాలుగా తన మరణాన్ని సూచిస్తూ వచ్చిన ఛాయారూపకాల్ని ఆచారాల్ని ఆయన ఈరీతిగా అంతం చేయనున్నాడు. తన శిష్యులతో కలిసి పస్కాను భుజిస్తున్నప్పుడు దాని స్థానంలో తన బలిదానానికి స్మారక చిహ్నంగా ఉండే సంస్కారాన్ని క్రీస్తు స్థాపించాడు. యూదుల జాతీయ పండుగ గతించిపోనుంది. క్రీస్తు నెలకొల్పిన ఆచారం అన్ని దేశాల్లోను అన్నియుగాల్లోను ఆయన అనుచరులు ఆచరించాల్సి ఉన్నారు. DATel 736.2

ఐగుప్తు దాస్యం నుంచి విడుదలకు జ్ఞాపకార్థంగా పస్కా ఆచరణ జరిగేది. సంవత్సరాలు గతించేకొద్దీ పిల్లలు ఈ సంస్కారం అర్థం ఏమిటి ని అడిగినప్పుడు దీని వెనుక చరిత్రను వారికి చెప్పాలని దేవుడు ఆదేశించాడు. అద్భుతమైన ఈ విడుదల చరిత్రను పదేపదే చెప్పడం ద్వారా వారి మనసుల్లో దాన్ని తాజాగా ఉంచాలి. ప్రభుభోజన సంస్కారం క్రీస్తు మరణం ఫలితంగా కలిగిన విడుదలకు జ్ఞాపకార్థంగా స్థాపితమయ్యింది. ఆయన శక్తితోను మహిమతోను రెండోసారి వచ్చేవరకు ఈ సంస్కారాన్ని ఆచరించాల్సి ఉంది. మన పక్షంగా ఆయన చేస్తున్న గొప్ప పనిని మన మనసుల్లో తాజాగా ఉంచుకునే మార్గం ఇదొక్కటే! DATel 736.3

ఐగుప్తు నుంచి తమ విడుదల సమయంలో ఇశ్రాయేలు ప్రజలు నడుములు బిగించుకుని చేతుల్లో కరలు పట్టుకుని ప్రయాణానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు. ఈ సంస్కారాన్ని వారు ఆచరించిన తీరు వారి పరిస్థితికి తగినట్టుగా ఉంది. ఎందుకంటే వారు ఐగుప్తుదేశం నుంచి నెట్టివేయబడడానికి సిద్ధంగా ఉన్నారు. వారు అరణ్యం గుండా బాధాకరమైన ప్రయాణం చేయాల్సి ఉన్నారు. కాని క్రీస్తు కాలంలో పరిస్థితులు మారిపోయాయి. వారిప్పుడు పరదేశం నుంచి బహిష్కృతులు కావడంలేదు. వారు తమ స్వజాతి స్వదేశప్రజలు. తమకు కలిగిన విశ్రాంతికి అనుగుణంగా ప్రజలు పడుకుని పస్కా రాత్రి భోజనాన్ని భుజించారు. భోజన బల్లచుట్టూ మంచాలు వేశారు. వాటి పై అతిథులు ఎడమ చేతిమీద ఆనుకుని భోజనం చెయ్యడానికి కుడిచేతిని ఖాళీగా ఉంచారు. ఈ స్థితిలో ఒక అతిథి తన పక్కన ఎత్తులో కూర్చున్న వ్యక్తి రొమ్ముపై తన తలను పెట్టుకోవచ్చు. పాదాలు మంచంకొనపై ఉండడంవల్ల కాళ్లు కడిగే వ్యక్తి చుట్టూ తిరిగి కాళ్లు కడగవచ్చు. DATel 737.1

పస్కాభోజనం వడ్డించిన భోజన బల్లవద్దే యేసు ఇంకా కూర్చుని ఉన్నాడు. పస్కాకాలంలో తినే పులియని రొట్టెలు ఆయన ముందున్నవి. పస్కాకు పులియని ద్రాక్షారసం బల్లమీద ఉంది. అనింద్యమైన తన బలిని సూచించడానికి క్రీస్తు ఈ చిహ్నాన్ని వినియోగిస్తోన్నాడు. పాపానికి మరణానికి సంకేతమైన పులియడం “నిర్దోషమును నిష్కళంకమునగు గొట్టె పిల్ల” ని సూచించలేదు. 1 పేతురు 1:19. DATel 737.2

“వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి -మీరు తీసికొని తినుడి. ఇది నాశరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నెపట్టుకొని, కృతజాఇతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరును త్రాగుడి ఇది నా రక్తము. అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో నాతోకూడ నేను ఈ ద్రాక్షారసము క్రొత్తగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాననెను.” DATel 737.3

ప్రభు భోజన సంస్కారంలో యూదా ఉన్నాడు. నలుగకొట్టబడనున్న తన శరీరాన్ని, చిందించబడాల్సి ఉన్న తన రక్తాన్ని సూచించే చిహ్లాల్ని యేసు వద్దనుంచి అందుకున్నాడు. “నున్న జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడి” అన్న ఆయన మాటలు విన్నాడు. అక్కడ దేవుని గొర్రెపిల్ల సముఖంలోనే కూర్చుని ఆ ద్రోహి తన దుష్ట సంకల్పాన్ని గురించి ఆలోచిస్తోన్నాడు. క్రోధంతో ప్రతీకారంతో నిండిన తలంపులు తలస్తోన్నాడు. DATel 738.1

యూదా ప్రవర్తనను తాను అవగాహన చేసుకున్నాననడానికి తిరుగులేని నిదర్శనాన్ని పాదాలు కడిగే సమయంలో క్రీస్తు ఇచ్చాడు. “నాలో అందరు పవిత్రులుకారు” (యోహా 13:11) అని ఆయనన్నాడు. ఈ మాటల్ని బట్టి క్రీస్తు తన ఆంతర్యాన్ని చదివేశాడని ఈ దొంగ శిష్యుడు గ్రహించాడు. క్రీస్తు ఇప్పుడు మరింత స్పష్టంగా మాట్లాడాడు. వారు బల్లవద్ద కూర్చుని ఉండగా శిష్యుల వంక చూస్తూ ఆయన ఈ మాటలన్నాడు, “మిమ్మునందరిని గూర్చి నేను చెప్పలేదు. నేను ఏర్పరచుకొనినవారిని ఎరుగుదునుగాని -నాతో కూడ భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ యెత్తెను.” DATel 738.2

శిష్యులు ఇప్పుడు సయితం యూదాను అనుమానించలేదు. కాని క్రీస్తు తీవ్రంగా ఆందోళన చెందినట్లు గ్రహించారు. వారందరినీ ఏదో భయం ఆవరించింది. ఏదో భయంకర ఘటన చోటుచేసుకుంటుందన్న భయం కలిగింది. ఆదేంటో వారికి గ్రాహ్యం కాలేదు. వారందరూ మౌనముద్రలో ఉండగా యేసిలా అన్నాడు, “మిలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” ఈ మాటలకు వారు నిర్ఘాంతపోయారు. తమ పరమ గురువుతో తమలో ఎవరు ఇంత దారుణంగా వ్యవహరించగలరు? అని ఆందోళన చెందుతోన్నారు. ఆయన్ని ఏ కారణంవల్ల ఎవరికి అప్పగిస్తారు? అలాంటి దురాలోచన ఎవరి హృదయంలో పుడుతుంది? ఆయన బోధలు వినడానికి తన ప్రేమను పంచుకోడానికి, తనతో సహవాసానికి ఆయన అంతగా అభిమానించి ఎన్నుకున్న ఇంకెవ్వరికీ లేని అదృష్టం భాగ్యం కలిగిన, పన్నెండు మందిలో అతడు ఒకడు కాకపోవచ్చును అనుకున్నారు! DATel 738.3

ఆయన మాటల భావాన్ని గ్రహించి ఆ మాటలు ఎంత వాస్తమైనవో వారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారిలో భయం పుట్టింది. తమ్ముని తాము నమ్మలేకపోయారు. రక్షకునికి వ్యతిరేకమైన ఆలోచన ఎక్కడైనా ఉందేమోనని అందరూ తమ హృదయాల్ని పరీక్షించుకున్నారు. బాధాకరమైన భావోద్రేకాలతో ఒకరి తర్వాత ఒకరు “ప్రభూవా నేనా?” అని అడిగారు. యూదా మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు. చివరికి యోహాను తీవ్ర వేదనతో “ప్రభువా, వాడెవడు?” అని అడిగాడు. అందుకు యేసిలా సమాధానమిచ్చాడు, “నాతో కూడ పాత్రలో చెయ్యి ముంచినవాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్యకుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయనపోవుచున్నాడు గాని యెవని చేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి యుండని యెడల వానికి మేలు.” “ప్రభువా, నేనా?” అని అడిగినప్పుడు శిష్యులు ఒకరి ముఖంలోకి ఒకరు పరీక్షిగా చూశారు. యూదా నిశ్శబ్దం అందరినీ ఆకర్షించింది. ప్రశ్నించడం ఆశ్చర్యం వ్యక్తం చెయ్యడం నడున గందరగోళంలో, యోహాను ప్రశ్నకు జవాబుగా క్రీస్తు చెప్పిన మాటలు యూదాకు వినిపించలేదు. ఇలా గుండగా తక్కిన శిష్యుల్లాగే అతడూ “బోధకుడా, నేనా? అని ప్రశ్నించాడు. అందుకు యేసు “నీవన్నట్టే” అని గంభీరంగా పలికాడు. DATel 739.1

తన రహస్యం బయట పడ్డందుకు యూదా విస్మయం చెందాడు. అతడిలో గందరగోళం ఏర్పడింది. యూదా ఆగదిలోనుంచి వెళ్లిపోడానికి హడావిడిగా లేచాడు. “యేసు -నీవు చేయుచున్నది త్వరగా చేయుమని చెప్పగా ... వాడు ఆ ముక్కపుచ్చుకొని వెంటనే బయటికి వెళ్లెను : అప్పుడు రాత్రి వేళ” క్రీస్తు వద్ద నుంచి బయట ఉన్న చీకటిలోకి వెళ్లినప్పుడు ఆ ద్రోహికి అది రాత్రి. DATel 739.2

ఈ చర్య తీసుకునే వరకూ యూదా పశ్చాత్తాపపడడానికి అవకాశం ఉంది. కాని అతడు ప్రభువు సముఖంలో నుంచి, తోటి శిష్యుల మధ్యనుంచి వెళ్లిపోయినప్పుడు, చివరి తీర్మానం అయిపోయింది. అతడు హద్దును దాటి వెళ్లిపోయాడు. DATel 739.3

శోధనకు గురి అయిన ఈ ఆత్మతో వ్యవహరించడంలో యేసు అద్భుతమైన సహనాన్ని దీర్ఘశాంతాన్ని ప్రదర్శించాడు. యూదాని రక్షించడానికి చేయగలిగిందంతా చేయకుండా విడిచి పెట్టలేదు. యేసుని అప్పగించడానికి రెండుసార్లు ఒప్పందం ఖరారు చేసుకుని తర్వాత కూడా యూదా పశ్చాత్తాపపడడానికి యేసు అవకాశం ఇచ్చాడు. ఈ ద్రోహి హృదయంలోని రహస్య ఆలోచనల్ని చదవడం ద్వారా తన దేవత్వాన్ని గురించి విశ్వసనీయమైన నిదర్శనాన్ని క్రీస్తు యూదా కి చ్చాడు. ఇది ఈ కపట శిష్యుడు పశ్చాత్తాపపడడానికి చివరి తరుణం. దైవమానవ హృదయం చెయ్యగల ఏ విజ్ఞప్తినీ చెయ్యకుండా ఆయన విడిచి పెట్టలేదు. దురహంకారం తిప్పివేసిన కృపా తరంగాలు గెల్చుకునే బలమైన ప్రేమ ప్రవాహంగా తిరిగివచ్చింది. తన అపరాధం బహిర్గతమయ్యిందన్న కలవరంతో యూదా మరింత రెచ్చిపోయాడు. తన అప్పగింత కార్యాన్ని పూర్తి చేయ్యడానికి ప్రభురాత్రి భోజనం నుంచి వెళ్లాడు. DATel 740.1

యూదాకి శ్రమ ప్రకటించడంలో క్రీస్తుకున్న మరో ఉద్దేశం తన శిష్యులికి కృప చూపించడం. ఇలా ఆయన తాను మెస్సీయానని వారికి నిరూపించుకున్నాడు. ఆయన ఇలా అన్నాడు, “జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగక మునుపు మీతో చెప్పుచున్నాను.” క్రీస్తు తనకు జరగనున్న దాన్ని గురించి తెలియదన్నట్లు మౌనంగా ఉండి ఉంటే, తమ ప్రభువుకి దివ్యదృష్టి లేదని, దొమ్మిగా వచ్చిన ప్రజలకు అప్పగించబడ్డప్పుడు నివ్వెరపోయాడని శిష్యులు భావించేవారు. దానికి ఒక ఏడాది ముందు తాను పన్నెండుమందిని ఎంపిక చేసుకున్నానని అందులో ఒకడు దుష్టుడని యేసు శిష్యులితో చెప్పాడు. తన విశ్వాసఘాతుకం తన ప్రభువికి పూర్తిగా తెలిసిపోయిందని సూచిస్తూ ఆయన యూదాతో అన్నమాటలు ఆయన పరాభవం శ్రమలకాలంలో ఆయన శిష్యుల విశ్వాసాన్ని బలపర్చుతాయి. అంతట యూదా తన భయంకర అంతానికి వచ్చినప్పుడు ఆ ద్రోహి విషయంలో యేసు ప్రకటించిన దుర్గతిని వారు గుర్తు చేసుకుంటారు. DATel 740.2

రక్షకునికి మరో ఉద్దేశం ఉంది. అతడు ద్రోహి అని తెలిసినప్పటికీ అతడి విషయంలో తన పరిచర్యను ఆయన ఆపలేదు. “మీలో అందరు పవిత్రులుకారు” అని ఆయన అన్నప్పుడు లేదా భోజన బల్లవద్ద “నాతోకూడ భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమయెత్తెను” (యోహా 13:11, 18) అన్నప్పుడు శిష్యులు ఆయన మాటల్ని అవగాహన చేసుకోలేదు. అనంతరం ఆయన అర్థం స్పష్టమైన తర్వాత ఘోర పాపాలు చేసేవారి పట్ల దేవుని ఓర్పును, కృపను గూర్చివారు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. DATel 740.3

యేసు యూదాను మొదటి నుంచి ఎరిగి ఉన్నప్పటికీ ఆయన అతడి పాదాలు కడిగాడు. అప్పగింతదారుడు ప్రభుభోజనంలో ఆయనతో పాలుపొందే ఆధిక్యతను పొందాడు. దీర్ఘశాంతం గల రక్షకుడు పాపి తనను స్వీకరించడానికి, పశ్చాత్తాపం పొందడానికి, పాపమాలిన్యం నుంచి శుద్ధి పొందడానికి ప్రతీ అవకాశాన్ని, ప్రతీ ప్రేరణను ఇచ్చాడు. ఈ సాదృశ్యం మనకోసమే. ఒక సహోదరుడు పొరపాటులోను పాపంలోను ఉన్నట్లు మనం భావిస్తే, మనం అతడికి దూరంగా ఉండకూడదు. అతణ్ని వేర్పాటుగా ఉంచడం ద్వారా అతణ్ని శోధనకు గురిచెయ్యడం గాని లేక సాతాను రణరంగంలో విడిచిపెట్టడం గాని చెయ్యకూడదు. ఇది సంఘ పద్దతికాదు. శిష్యులు తప్పులు చేస్తున్నారు, తప్పులు చేసేవారు గనుక ఆయన వారి పాదాలు కడిగాడు. ఒక్కడు తప్ప పన్నెండుమందిలోనూ అందరూ ఈ విధంగా పశ్చాత్తాపం పొందారు. DATel 741.1

క్రీస్తు ఆదర్శం ప్రభు భోజన సంస్కారం నుంచి ఎవర్నీ బహిష్కరించకూడదని చెబుతోంది. పరిశుద్దాత్మ దీన్ని విస్పష్టంగా బోధిస్తోన్నాడు. 1 కొరి 5:11. దీనికిమించి ఎవరూ తీర్పు తీర్చకూడదు. ఆ ఆచారానికి ఎవరు అర్హులో ఎవరుకారో అన్న నిర్ణయాన్ని దేవుడు మానవులికి విడిచి పెట్టడం లేదు. ఎందుకంటే హృదయాన్ని ఎవరు చదవగలరు? గోధుమల్లో గురుగుల్ని ఎవరు గుర్తించగలరు? “ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, ఆలాగు చేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను.” “ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును.” “ప్రభువు శరీరమని వివేచింపక తినిత్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తినిత్రాగుచున్నాడు.” 1 కొరి. 11:28,27, 29. DATel 741.2

ఈ సంస్కారాల్ని ఆచరించడానికి విశ్వాసులు సమావేశమైనప్పుడు మానవ నేత్రాలికి కనిపించని పరలోక దూతలు అక్కడ హాజరవ్వుతారు. సమావేశంలో ఒక యూదా ఉండవచ్చు. ఉంటే చీకటి లోక రాజు దూతలు అక్కడుంచారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అదుపును నిరాకరించేవారందరు వారిని కనిపెడూ ఉంటారు. పరలోక దూతలు కూడా ఉంటారు. అలాంటి ప్రతీ సందర్భంలోను అదృశ్యులైన ఈ సందర్శకులు హాజరవ్వుతారు. ఆ సమావేశంలోకి సత్యాన్ని ఆచరించనివారు పరిశుద్ధతను ప్రేమించని వారే కాక ఆరాధనలో పాలు పొందడానికి వచ్చేవారుండవచ్చు. వారిని బహిష్కరించకూడదు. యేసు శిష్యుల పాదాల్ని యూదా పాదాల్ని కడిగినప్పుడున్న సాక్షులు అక్కడుంటారు. ఆ దృశ్యాన్ని మానవులకన్నా అధికులు వీక్షించారు. DATel 742.1

తాను స్థాపించిన సంస్కారంపై ముద్రవెయ్యడానికి పరిశుద్దాత్మ ద్వారా క్రీస్తు అక్కడుంటాడు. పశ్చాత్తాపాన్ని సూచించే ఒక్కచూపు, ఒక్క ఆలోచన ఆయన గమనాన్ని ఆకర్షించకుండా ఉండడం జరగుదు. పశ్చాత్తాపపడేవారి కోసం విరిగినలిన హృదయం గలవారికోసం ఆయన వేచి ఉన్నాడు. ఆ ఆత్మను స్వీకరించడానికి అంతా సిద్ధంగా ఉంది. యూదా పాదాలు కడిగిన ఆ ప్రభువు ప్రతీ హృదయానికి అంటిన పాపవు మరకను కడగడానికి ఆశగా ఎదురుచూస్తోన్నాడు. DATel 742.2

అయోగ్యులైనవారు కొందరు హాజరవుతున్నందుకు ప్రభుభోజన పరిస్కారంలో పాలు పొందకుండా ఎవరూ నిలిచిపోకూడదు. ప్రతీ శిష్యుడు ఇందులో బహిరంగంగా పాలుపొందడం ద్వారా క్రీస్తుని తన రక్షకునిగా స్వీకరిస్తున్నానని వెల్లడిచెయ్యాలి. ఈ సమావేశాలలోనే క్రీస్తు తనవారిని కలిసి తన సముఖం వలన వారిని బలో పేతుల్నిచేస్తాడు. ఇవి ఆయన నియమించిన సమావేశాలు. అయోగ్యమైన హృదయాలు చేతులు ఈ పవిత్రాచారాన్ని నిర్వహించవచ్చు. ఆయినా తనవారికి పరిచర్య చెయ్యడానికి క్రీస్తు అక్కడ ఉంటాడు. తనపై బలంగా విశ్వాసం ఉంచి వచ్చే వారందరిని ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుడు సమకూర్చే ఈ పరిశుద్ధ సమావేశానికి హాజరుకావడం నిర్లక్ష్యం చేసేవారందరూ గొప్పగా నష్టపోతారు. వారిని గురించి “మిలో అందరు పవిత్రులుకారు” అని చెప్పడం సమంజసం. DATel 742.3

శిష్యులతో కలిసి రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకోడంలో క్రీస్తు తాను వారికి విమోచకుడిగా ప్రమాణం చేశాడు. ఆయన వారికి నూతన నిబంధనను ఇచ్చాడు. దాని ప్రకారం ఆయన్ని స్వీకరించేవారందరూ దేవుని పిల్లలు, క్రీస్తుతో కలిసి వారసులవుతారు. ఈ నిబంధన ప్రకారం ఈ లోక జీవనానికి రానున్నలోక జీవనానికి దేవుడు అనుగ్రహించగల ప్రతీ దీవెన వారిదవుతుంది. ఈ నిబంధనను క్రీస్తు రక్తం ధ్రువీకరించాల్సి ఉంది. ప్రభుభోజన సంస్కారం తమలో ప్రతీ ఒక్కరి నిమిత్తం వ్యక్తిగతంగా ప్రభువు చేసిన అనంత త్యాగాన్ని సర్వమానవజాతి నిమిత్తం చేసే త్యాగంలో భాగంగా శిష్యుల ముందు ఉంచుతుంది. DATel 743.1

అయితే ప్రభుభోజన సంస్కారం సంతాప సమయం కాకూడదు. దీని ఉద్దేశం అది కానే కాదు. ప్రభుభోజన బల్లచుట్టూ ఆయన శిష్యులు సమావేశమైనప్పుడు తమ పొరపాట్లు జ్ఞాపకం చేసుకుంటా సంతాపడకూడదు. తమ గత మతానుభవం ఉన్నతమయ్యిందో లేక దిగజారిపోయిందో అని తలంచుకుంటా ఉండకూడదు. తమకు తమ సహోదరులకు మధ్య ఉన్న భేదాల్ని జ్ఞాపకం చేసుకోకూడదు. ఇదంతా దీనికి ముందు జరగాల్సిన సిద్ధబాటులో భాగంగా జరగాలి. ఆత్మపరీక్ష, పాపపు ఒప్పుకోలు, విభేదాల నివృత్తి, సయోధ్య ఇవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు క్రీస్తుని కలవడానికి వస్తారు. వారు సిలువ ఛాయలో కాదు దాని రక్షణ కాంతిలో నిలబడాలి. వారు తమ ఆత్మను నీతిసూర్యుని కాంతికిరణాలికి తెరిచి ఉంచాలి. మిక్కిలి ప్రశస్తమైన క్రీస్తు రక్తం వలన శుద్ధి పొందిన హృదయాలతో, అదృశ్యమైనా ఆయన సముఖం తమతో ఉన్నదన్న స్పృహతో, ఆయన చెప్పిన ఈ మాటల్ని వారు వినాలి, “శాంతి మీకనుగ్రహించి వెళ్లుచున్నాను, లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు.” యోహాను 14:27. DATel 743.2

నేను మీకోసం మరణించానని వారు పాప స్పృహకలిగి జ్ఞాపకముంచుకోండి అంటోన్నాడు మన ప్రభువు. నా నిమిత్తం క్రూరత్వానికి హింసకు శ్రమలకు గురి అయినప్పుడు నేను మిమ్ముల్ని ఎంతో ప్రేమించాను గనుక మీకోసం నా ప్రాణాన్నిచ్చానని జ్ఞాపకం ఉంచుకోండి. మీ విధులు కఠినంగాను భారంగాను కనిపించినప్పుడు, మీ నిమిత్తం నేను సిలువను మోశానని సిగ్గును భరించానని గుర్తుంచుకోండి. కఠోర పరీక్ష ఎదురైనప్పుడు నా గుండె ధైర్యం చెడిపోతే నాకోసం విజ్ఞాపన చెయ్యడానికి ఈ విమోచకుడు నివసిస్తోన్నాడని గుర్తుంచుకోండి. DATel 743.3

ప్రభుభోజన సంస్కారం క్రీస్తు రెండో రాకను సూచిస్తోంది. శిష్యుల మనసుల్లో ఈ నిరీక్షణను స్పష్టంగా ఉంచడానికి దీన్ని ఆయన ఉద్దేశించాడు. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోడానికి వారు సమావేశమైనప్పుడల్లా ఆయన “గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి - దీనిలోనిది మీరందరు త్రాగుడి ఇది నారక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మితోకూడ నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు, ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నానని” ఎలా అన్నాడో వారు చెప్పుకునేవారు. తమ ప్రభువు తిరిగి వస్తాడన్న నిరీక్షణ వారికి తమ శ్రమలలో ఓదార్పు నిచ్చింది. “మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.” 1కొరి. 11:26) అన్న మాటలు వారికి చెప్పనలవిగానంత ప్రశస్తమైనవి. DATel 744.1

మనం ఎన్నడూ మరచిపోకూడని విషయాలివి. బలవంతం చేసే శక్తిగల యేసు ప్రేమను మన మనసుల్లో ఎప్పుడూ తాజాగా ఉంచుకోవాలి. మనపట్ల వ్యక్తమైన దేవుని ప్రేమను మన జ్ఞానేంద్రియాలకి అవగాహన పర్చడానికి క్రీస్తు ఈ సంస్కారాన్ని స్థాపించాడు. క్రీస్తు ద్వారా తప్ప మరేవిధంగానూ మన ఆత్మలు ‘దేవునితో ఏకమవ్వలేవు. సహోదరుడికి సహోదరుడికి మధ్య ఐక్యత ప్రేమలను యేసుప్రేమ నిరంతరంగా పటిష్టం చేయాలి. ఆయన ప్రేమను మనకు సార్థకం చెయ్యగలిగేది క్రీస్తు మరణం తప్ప ఇంకేదికాదు. ఆయన మరణం కారణంగా ఆయన రెండో రాక కోసం మనం ఉత్సాహానందాలతో ఎదురుచూడగలుగుతాం. ఆయన త్యాగమే మన నిరీక్షణకు కేంద్రబిందువు. మనం మన విశ్వాసాన్ని దీనిపై నిలపాలి. DATel 744.2

మన రక్షకుడు భరించిన సిగ్గును శ్రమల్ని లాంఛనప్రాయంగా పరిగణించడం ఎక్కువగా ఉంది. ప్రభువు వాటిని ఒక ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. దైవభక్తిని గూర్చిన మర్మాన్ని గ్రాహ్యం చేసుకోడానికి మన ఇంద్రియాలు చైతన్యం పొందాల్సిన అవసరం ఉంది. మన ప్రాయశ్చిత్తార్థమై క్రీస్తు భరించిన శ్రమల్ని ప్రస్తుతం మనం గ్రహించేదానికన్నా ఎంతో ఎక్కువగా గ్రహించే ఆధిక్యత అందరికీ ఉంది. “విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు” “మోషే సర్పమును ఏలాగు ఎత్తైనో ఆలాగే” మనుష్యకుమారుడు ఎత్తబడ్డాడు. (యోహా 3:14, 15) మరణిస్తున్న రక్షకుడు వేలాడున్న కల్వరిసిలువను మనం వీక్షించాలి, నమ్ముకోవాలి. క్రీస్తుపై మన విశ్వాసం మిదే మన నిత్యజీవం ఆనుకుని ఉంది. DATel 744.3

మన ప్రభువిలా అన్నాడు, “మీరు మనుష్యకుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనేగాని మీలో మీరు జీవము గలవారు కారు... నా శరీరము నిజమైన ఆహారమును నారక్తము నిజమైన పానమునై యున్నవి.” యోహా. 6:53-56. మన శారీరక స్వభావం విషయంలో ఇది నిజం. మనం ప్రస్తుతం జీవిస్తునది యేసు మరణాన్నిబట్టే. మనం తింటున్న ఆహారం నలుగకొట్టబడ్డ ఆయన శరీరం కొన్నదే. మనం తాగుతున్న నీళ్ళు ఆయన చిందించిన రక్తం కొన్నవే. భక్తుడుగాని పాపాత్నుడుగాని అనుదినం తినే ఆహారం క్రీస్తు శరీరం వల్ల రక్తం వల్ల పోషకాహారం అవుతుంది. ప్రతీ ఆహార దినుసుమిద కల్వరి సిలువముద్ర ఉంటుంది. దీని ప్రతిబింబం ప్రతీ నీటి ఊటలోను కనిపిస్తుంది. తన త్యాగాన్ని సూచిస్తూ పైగదిలో జరిగిన ప్రభుభోజన సంస్కారం నుంచి ప్రకాశిస్తోన్న వెలుగు మన దినదినాహారానికి ఏర్పాట్లు చేస్తోంది. కుటుంబం తినే భోజనం ప్రభుభోజన బల్ల, కుటుంబం ప్రతీ పూట తినే ఆహారం ప్రభుభోజనం అవుతాయి. DATel 745.1

క్రీస్తు అన్న మాటలు మన ఆధ్యాత్మిక స్వభావం గురించి మరింత వాస్తవం! ఆయన ఇలా అంటోన్నాడు, “నా శరీరము తిని నారక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు” కల్వరి సిలువపై ఆయన పానార్పణగా పోసిన జీవితాన్ని స్వీకరించడం ద్వారానే మనం పరిశుద్ధంగా జీవించడం సాధ్యపడుతుంది. ఆయన వాక్యాన్ని స్వీకరించడం ద్వారా ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేయడం ద్వారా ఈ జీవితాన్ని మనం జీవించగలం. ఈ విధంగా మనం ఆయనతో ఒకటవ్వగలం. “నా శరీరము తిని నారక్తం త్రాగువాడు నా యందును నేను వానియందును నిలిచియుందుము. జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రిమూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నామూలముగా జీవించును.” యోహా. 6:54, 56, 57. ఈ లేఖనం ప్రత్యేకించి పరిశుద్ధ ప్రభుభోజన సంస్కారానికి వర్తించే లేఖనం. ప్రభుచేసిన మహాత్యాగాన్ని విశ్వాసం పరిగణించే కొద్దీ క్రీస్తు ఆధ్యాత్నిక జీవితాన్ని ఆత్మ జీర్ణించుకుంటుంది. ఆ ఆత్మ ప్రతీ ప్రభుభోజన సంస్కారం నుంచి ఆధ్యాత్మిక శక్తిని పొందుతుంది. ప్రభుభోజన సంస్కారం విశ్వాసికి క్రీస్తుతో అనుబంధం ఏర్పర్చుతుంది. అది ఇలా తండ్రితో కూడా అనుబంధాన్ని ఏర్పర్చుతుంది. ఒక విలక్షణమైన రీతిలో మానవుల్ని ఇది దేవునితో అనుసంధానపర్చుతుంది. , DATel 745.2

క్రీస్తు శరీరాన్ని రక్తాన్ని సూచించే రొట్టెని ద్రాక్షారసాన్ని మనం స్వీకరించేటప్పుడు మేడ పై గదిలో నాడు జరిగిన ప్రభుభోజన సంస్కారంలో ఊహల్లో పాల్గొంటాం. లోకపాపం మోసిన ఆయన అనుభవించిన వేదనవల్ల పునీతమైన తోటలో నడుస్తున్నట్టు భావిస్తాం. దేవునితో మనల్ని సమాధానపర్చడంలో ఆయన పడ్డ శ్రమల్ని తిలకిస్తాం. అది మన నిమిత్తం సిలువ పొందినవానిగా క్రీస్తును చూపిస్తుంది. DATel 746.1

సిలువను పొందిన రక్షకుణ్ని వీకిస్తూ పరలోక రాజు చేసిన త్యాగం అర్ధాన్ని పరమార్గాన్ని మరింత స్పష్టంగా గ్రహిస్తాం. రక్షణ ప్రణాళిక మనముందు మహిమతో నిలుస్తుంది. కల్వరిని గురించిన ఆలోచన మన హృదయాల్లో పవిత్ర భావోద్రేకాల్ని మేలుకొలుపుతుంది. మనమనసుల్లోను, పెదవుల మీద దేవునికి గొర్రెపిల్ల స్తోత్రము ఉంటుంది. ఎందుకంటే కల్వరి దృశ్యాన్ని మనసులో తాజాగా ఉంచుకునే ఆత్మలో గర్వం ఆత్మారాధన వర్ధిల్లడం దుర్లభం . DATel 746.2

రక్షకుని సాటి లేని ప్రేమను వీక్షించే వ్యక్తి ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. అతడి హృదయం పవిత్రంగా ఉంటుంది. అతడి ప్రవర్తన మారిపోతుంది. ఈ ప్రేమను కొంతమేరకు ప్రతిబింబించడానికి లోకానికి వెలుగుగా ఉండడానికి అతడు బయలుదేరి వెళ్లాడు. క్రీస్తు సిలువను మనం ఎంత ఎక్కువగా ధ్యానిస్తే అపొస్తలులు వినియోగించిన ఈ సాహిత్యాన్ని మనం అంత ఎక్కువగా వినియోగిస్తాం, “మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవునుగాక, దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును నిలువ వేయబడియున్నాము.” గలతీ 6: 14. DATel 746.3