యుగయుగాల ఆకాంక్ష
69—ఒలీవల కొండమీద
“ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది” (మత్త. 23:38) అని యాజకులు అధికారులతో క్రీస్తు అన్నమాటలు వారి హృదయాల్లో గుబులు పుట్టించాయి. వారు ఆ మాటల్ని లెక్కచెయ్యనట్లు కనిపించినా, వాటి అర్థం ఏమిటా అని తలలు పట్టుకొంటున్నారు. ఏదో కనిపించని ప్రమాదం బెదిరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ జాతికి గర్వకారణమైన దేవాలయం త్వరలో శిధిలాల కుప్ప కానుందన్నది కావచ్చా అది? ఏదో విపత్తు సంభవించనుందన్న భయం శిష్యుల్ని కూడా పట్టిపీడించడంతో వారు యేసువద్ద నుంచి నిర్దిష్టమైన ప్రకటనకు వేచి ఉన్నారు. ఆయనతో దేవాలయం నుంచి బయటకి వస్తున్నప్పుడు వారు ఆలయ పటిష్ఠతను సౌందర్యాన్ని ఆయన గమనానికి తెచ్చారు. ఆలయానికి ఉపయోగించిన రాళ్లు స్వచ్ఛమైన తెల్లని పాలరాళ్లు. వాటిలో కొన్ని రాళ్లు చాలా పెద్ద పరిమాణంలో ఉన్నాయి. గోడలోని ఒక భాగం నెబుకద్నెజరు సైన్యం జరిపిన దాడికి తట్టుకుంది. తాపీ పనివారి నైపుణ్యం వల్ల అది రాళ్లగని నుంచి తవ్వితీసిన ఏకశిలగా కనిపించింది. బ్రహ్మాండమైన ఆ గోడలు ఎలా కూలి శిధిలమౌతాయో అన్నది శిష్యులకి అంతుచిక్కడం లేదు. DATel 704.1
ఆలయ వైభవానికి క్రీస్తు దృష్టిని ఆకర్షించడం జరిగినప్పుడు ప్రభువు మనసులో ఎలాంటి తలంపులు చెలరేగుతూ ఉండవచ్చు! ఆయన ముందున్న దృశ్యం నిజంగా ఎంతో సుందరంగా ఉంది. కాని ఆయన నేను అదంతా చూస్తున్నాను అని విచారంగా అన్నాడు. భవనాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ గోడలు దృడమైనవి అవి నాశనం కానివి అని వారంటున్నారు. అయితే నా మాటలు వినండి. “రాతిమీద రాయి యొకటి యైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడు” దినం వస్తుంది. DATel 704.2
ఈ మాటల్ని క్రీస్తు చాలామంది వింటుండగా అన్నారు. ఆయన ఒలీవల కొండమీద ఒంటరిగా కూర్చుని ఉన్నప్పుడు పేతురు, యోహాను, యాకోబు, అంధేయ ఆయన వద్దకు వచ్చారు. “ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నియు నెరవేరబోవు కాలమునకు ఏ గురుతులు కలుగును?” అని ఆయన్ని అడిగారు. యెరూషలేము నాశనాన్ని గురించి ఆయన రాకడ దినాన్ని గురించి శిష్యుల ప్రశ్నలికి ఆయన వేర్వేరుగా జవాబు చెప్పలేదు. ఈ రెండు సంఘటనల వివరాల్నీ ఆయన మిళితం చేశాడు. తాను చూసిన విధంగా శిష్యులికి భవిష్యత్ సంఘటనల్ని ఆయన వివరించి ఉంటే, వారు ఆ దృశ్యాన్ని తట్టుకోగలిగేవారుకారు. వారిపట్ల దయగొని ఆ రెండు సంభవాల వివరాల్నీ కలగలిపి చెప్పి వాటి భావాన్ని వారే అధ్యయనం చేసి తెలుసుకోడానికి విడిచిపెట్టాడు. యెరూషలేము నాశనాన్ని గురించి ప్రస్తావించినప్పుడు, ఆయన ప్రవచనిక వాక్కులు ఆ ఘటనను దాటి వెళ్లాయి. తమ అపరాధాల నిమిత్తం లోక ప్రజలికి శిక్ష విధించడానికి ప్రభువు తన స్థానం నుంచి లేచినప్పుడు చోటుచేసుకునే చివరి అగ్నిని, హతమైన వారిని అప్పుడు భూమి ఇక దాచకుండా తనరక్తాన్ని బయట పెట్టడాన్ని ప్రస్తావించాడు. ఈ ఉపదేశమంతా శిష్యులికి మాత్రమే కాదు ఈ లోక చరిత్ర చివరి కాలంలో నివసించే వారికి కూడా ఆయన ఉద్దేశించాడు. DATel 705.1
శిష్యుల పక్కకు తిరిగి క్రీస్తు ఇలా అన్నాడు, “ఎవడును మిమ్మును మోసము చేయకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరటవచ్చి - నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు.” అబద్ద మెస్సీయాలు బయలుదేరి సూచక క్రియలు చేస్తున్నట్లు చెప్పుకుంటూ యూదు జాతి విమోచనకు సమయం వచ్చిందని చెబుతారు. వీరు అనేకుల్ని మోసం చేస్తారు. క్రీస్తు మాటలు నెరవేరాయి. ఆయన మరణానికి యెరూషలేము ముట్టడికి మధ్యకాలంలో చాలామంది అబద్ద మెస్సీయాలు బయలుదేరారు. అయితే ఈ హెచ్చరిక లోకంలోని ఈ యుగంలో నివసిస్తున్నవారికి కూడా ఆయన ఇచ్చాడు. యెరూషలేము నాశనానికి ముందు ప్రబలిన మోసాలే యుగాల పొడవున సాగుతూ వచ్చాయి. అవి ఇప్పుడు కూడా చోటుచేసుకుంటాయి. DATel 705.2
“మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవిగాని అంతము వెంటనే రాదు.” యెరూషలేము నాశనానికి ముందు మనుషులు సర్వాధికారం కోసం కుస్తీలు పట్టారు. చక్రవర్తుల్ని హత్య చేశారు. సింహాసనానికి వారసుల్ని వధించారు. యుద్ధాలు జరిగాయి. యుద్ధ పుకార్లు ప్రచారమయ్యాయి. ఇవి జరుగవలసియున్నది గాని అంతము (ఒక జాతిగా యూదు జాతి అంతం) వెంటనే రాదు జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును ఇవన్నియు వేదనలకు ప్రారంభము” అన్నాడు యేసు. రబ్బీలు ఈ సూచనల్ని చూసినప్పుడు దేవుడు ఎంపికచేసిన ప్రజల్ని దాస్యంలో ఉంచినందుకు దేశాలపై దేవుడు వెలిబుచ్చిన తీర్పులు ఇవి అంటారు. ఈ సూచనలు మెస్సీయా రాకకు సూచికలని వారు వెల్లడిచేస్తారు. మోసపోవద్దు అవి ఆయన తీర్పు ఆరంభం. ప్రజలు తమను తామే నమ్ముకున్నారు. నేను వారిని స్వస్తపర్చడానికి వారు పశ్చాత్తాపపడలేదు. మారుమనసు పొందలేదు. దాస్యం నుంచి తమ విడుదలకు సూచనలుగా వారు కోరుతున్న సూచనలే వారి నాశనానికి సూచనలు. DATel 706.1
“అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుజేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనులచేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి, యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు. ఇదంతా క్రైస్తవులు అనుభవించారు. తండ్రులు తల్లులు తమ బిడ్డల్ని పట్టి ఇచ్చారు. బిడ్డలు తల్లిదండ్రుల్ని పట్టి ఇచ్చారు. స్నేహితులు స్నేహితుల్ని సన్ హెడ్రిన్ కి అప్పగించారు. సైఫన్ని యాకోబుని ఇంకా ఇతర క్రైస్తవుల్ని, చంపడం ద్వారా హింసకులు తమ ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నారు. DATel 706.2
యూదు ప్రజలు మారుమనసు పొందడానికి దేవుడు తన సేవకుల ద్వారా వారికి చివరి అవకాశం ఇచ్చాడు. వారి అరెస్టులోను, వారి విచారణలోను, వారిని చెరలో వేయడంలోను తన సాక్ష్యం ద్వారా ఆయన తన్నుతాను ప్రదర్శించుకున్నాడు. అయినా న్యాయమూర్తులు వారికి మరణశిక్ష విధించారు. వారు నివసించడానికి ప్రపంచం అర్హమైన స్థలంకాదు. వారిని చంపడం ద్వారా యూదులు దేవుని కుమారుణ్ని మళ్లీ సిలువవేశారు. మళ్లీ అదే జరుగుతుంది. అధికారులు మత స్వేచ్ఛను నియంత్రించడానికి చట్టాలు చేస్తారు. దేవునికి మాత్రమే చెందే హక్కును వారు తమ చేతుల్లోకి తీసుకుంటారు. దేవుడు మాత్రమే అదుపుచేయాల్సిన మనస్సాక్షిని ఒత్తిడి చేయవచ్చని వారు భావిస్తారు. ఈ దిశలో ఇప్పుడు సైతం వారు పనిని ప్రారంభిస్తోన్నారు. తాము ఇక ముందుకి సాగలేని పరిస్థితి వచ్చేవరకు ఈ పనిని వారు చేస్తూనే ఉంటారు. నమ్మకమైన, ఆజ్ఞలు ఆచరించే తన ప్రజల పక్షంగా దేవుడు కలుగజేసుకుంటాడు. DATel 706.3
హింస కలిగిన ప్రతీ సందర్భంలో దాన్ని చూచేవారు దేవునికి అనుకూలంగానో వ్యతిరేకంగానో తీర్మానాలు చేసుకుంటారు. అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న వారికి సానుభూతి వ్యక్తం చేసేవారు క్రీస్తుతో తమ అనుబంధాన్ని చూపిస్తారు. ఇతరులు అభ్యంతరపడతారు. ఎందుకంటే సత్యం తాలూకు సూత్రాలు వారి పనుల్ని ప్రత్యక్షంగా ఖండిస్తాయి. అనేకులు తూలిపడిపోతారు. శ్రమలు కలిగినప్పుడు తమ్ముని తాము కాపాడుకోడానికి విశ్వాస భ్రష్టతకు పాలుపడేవారు అబద్దసాక్ష్యం పలికి తమసహోదరుల్ని పట్టి ఇస్తారు. సత్యాన్ని విసర్జించేవారి అస్వాభావికమైన క్రూరమైన మార్గాల గురించి మనం ఆశ్చర్యపడకుండా క్రీస్తు దీన్ని గురించి మనల్ని హెచ్చరించాడు. DATel 707.1
యెరూషలేము మీదికి రావలసి ఉన్న నాశనాన్ని గురించి ఒక సూచననిచ్చి ఎలా తప్పించుకోవాలో వారికి తెలిపాడు: “యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమిపమైయున్నదని తెలిసికొనుడి అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను, దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను. పల్లెటూళ్లలోని వారు దానిలో ప్రవేశింపకూడదు అని లేఖనములలో వ్రాయబడినవన్నియు నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు.” నలభై ఏళ్ల తర్వాత యెరూషలోము నాశనం సమయంలో పాటించడానికి ఈ హెచ్చరికను ఇవ్వడం జరిగింది. క్రైస్తవులు ఈ హెచ్చిరకను పాటించారు. ఆ పట్టణం నాశనమైనప్పుడు ఒక్క క్రైస్తవుడు కూడ మరణించలేదు. DATel 707.2
“మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవించకుండవలెనని ప్రార్థించుడి” అని యేసు చెప్పాడు. సబ్బాతును చేసిన ఆయన దాన్ని సిలువకు కొట్టి రద్దు చెయ్యలేదు. ఆయన మరణం ద్వారా సబ్బాతు రద్దుకాలేదు. ఆయన సిలువపై మరణించి నలభై సంవత్సరాలుగా శిష్యులు తాము పారిపోవడం సబ్బాతున జరగకూడదని ప్రార్థించాల్సి ఉన్నారు. DATel 707.3
యెరూషలేము నాశనం నుంచి క్రీస్తు అంతకన్నా గొప్ప సంభవానికి వెళ్లాడు. ఈ లోక చరిత్ర గొలుసులో అది చివరి లింకు. అదే దైవకుమారుడు మహిమతో రావడం. ఈ రెండు ఘటనల మధ్య దీర్ఘ శతాబ్దాల అంధకారం, తమ సంఘానికి రక్తపాతం, కన్నీళ్లు, హృదయవేదనతో నిండిన శతాబ్దాలు యేసు దృష్టికి గోచరించాయి. ఈ దృశాల్ని శిష్యులు అప్పుడు తట్టుకునేవారు కారు. వాటిని సూచన ప్రాయంగా చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు, “లోకారంభము నుండి ఇప్పటివరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన యెడల ఏశరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడినవారి నిమిత్తము ఆదినములు తక్కువ చేయబడును. ” లోకం మున్నెన్నడూ ఎరుగని ఆ శ్రమ వెయ్యి సంవత్సరాలు పైచిలుకు కాలం క్రీస్తు అనుచరులికి రావలసి ఉంది. లక్షలాది క్రీస్తు సాక్షులు వధకు గురికావలసిఉన్నారు. తన ప్రజల్ని కాపాడడానికి దేవుడు తన హస్తాన్ని చాపి ఉండకపోతే అందరూ నశించేవారే. “ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును” అన్నాడాయన. DATel 708.1
ఇప్పుడు సుస్పష్టమైన మాటల్లో ప్రభువు తన రెండో రాకను గూర్చి చెబుదున్నాడు. ఈ లోకంలో ఆయన రాకకు ముందు ప్రబలే అపాయాల గురించి హెచ్చరిస్తున్నాడు. “ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన యెడల నమ్మకుడి, అబద్ద క్రీస్తులును అబద్ద ప్రవక్తలును వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచకక్రియలను మహత్కార్యములను కనబరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను. కాబట్టి ఎవరైనను అరణ్యములో ఉన్నాడని మితో చెప్పినను వెళ్లకుడి - ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును.” యెరూషలేము నాశనానికి ఒక గుర్తుగా చెబుతూ క్రీస్తు ఇలా హెచ్చరించాడు, “అనేకులైన అబద్ద ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు.” అనేకమంది అబద్ద ప్రవక్తలు వచ్చారు, పెద్ద సంఖ్యలో ప్రజల్ని అరణ్యంలోకి నడిపించారు. ఇంద్రజాలికులు, మంత్రగాళ్లు తమకు అద్భుత శక్తులున్నాయని చెప్పుకుంటూ ప్రజల్ని పర్వత ప్రాంతాల్లోని ఏకాంత స్థలాలికి తీసుకుపోయారు. అయితే ఈ ప్రవచనం చివరి దినాల గురించి కూడా మాట్లాడ్తోంది. ఈ గుర్తును రెండో రాకడకు సూచనగా ఇవ్వడం జరిగింది. క్రీస్తు అనుచరుల్ని మోసపుచ్చడానికి ఈరోజుల్లోనూ అబద్ద క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు అద్భుతాలు చేస్తున్నారు. “ఇదిగో అరణ్యములో ఉన్నాడు” అన్న కేకల్ని మనం వినడంలేదా? మరణించిన వారి ఆత్మలతో సంప్రదింపులు జరుపుతామంటూ చెప్పుకునేవారు ఏర్పాటు చేసే వేలాది సమావేశాల్నుంచి “ఇదిగో లోపలిగదిలో ఉన్నాడు” అన్న పిలుపు ఇప్పుడు విబడడం లేదా? భూతమతం (ప్రేతాత్మవాదం) చెబుతున్నది ఇదే. అయితే క్రీస్తేమి చెబుతున్నాడు? దాన్ని నమ్మకుడి. “మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును.” DATel 708.2
రక్షకుడు తన రాకడకు గుర్తుల్నిస్తున్నాడు. అంతే కాదు ఈ గుర్తుల్లో మొట్టమొదటిది ఎప్పుడు కనిపిస్తుందో నిర్దిష్టంగా చెపుతున్నాడు, “ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలించబడును. అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రములవారు రొమ్ముకొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పొగుచేతురు.” DATel 709.1
పోపుల పాలనకింద జరిగిన భయంకరహింస అంతమొందిన తర్వాత చీకటి సూర్యుణ్ని కమ్మడం, చంద్రుడు కాంతి హీనుడవ్వడం జరుగుతుందని క్రీస్తు చెప్పాడు. తర్వాత ఆకాశం నుంచి నక్షత్రాలు రాలాలి. ఆయన ఇలా అంటున్నాడు, “అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపుకొమ్మ లేతదై చిగిరించినప్పుడు వసంత కాలము యింక సమీపముగా ఉన్నదని నాకు తెలియును. ఆప్రకారమే మిరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే యున్నాడని తెలిసికొనుడి” మత్త. 24:32, 33. DATel 709.2
క్రీస్తు తన రాకడకు గుర్తులిచ్చాడు. తాను దగ్గరలోనే ద్వారం దగ్గరే ఉన్నట్లు మనం తెలుసుకోవచ్చునని ఆయన చెబుతోన్నాడు. ఈ గుర్తుల్ని చూసేవారిని గురించి ఆయనిలా అంటున్నాడు, “ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదు,” ఈ గురుతులు కనిపిస్తున్నాయి. ప్రభువు రాకడ అతిసమీపంలో ఉందని ఇప్పుడు మనకు నిస్సందేహంగా తెలుసు, “ఆకాశమును భూమియు గతించునుగాని నామాటలు ఏమాత్రమును గతింపవు” అంటున్నాడు ప్రభువు. DATel 710.1
క్రీస్తు గొప్ప మహిమతో మేఘాలపై వస్తున్నాడు. ఆయన వెంట ప్రకాశిస్తున్న దూతల సమూహం వస్తుంది. మరణించినవారిని లేపడానికి జీవిస్తున్న పరిశుద్ధుల్ని మహిమలోకి మార్చడానికి ఆయన వస్తాడు. తనను ప్రేమించి తన ఆజ్ఞల్ని కాపాడున్న వారిని సన్మానించి తన వద్దకు తీసుకవెళ్లడానికి ఆయన వస్తాడు. ఆయన తన వారిని మర్చిపోలేదు. తన వాగ్దానాన్ని మర్చిపోలేదు. కుటుంబం పునస్సంయోగమౌతుంది. మరణించిన మనవారి వంక చూసినప్పుడు, దేవుని బూర మోగడం, “మృతులు అక్షయులుగా లేపబడ”డం “మనము మార్పుపొంద”డం (1 కొరి. 15:52) జరుగనున్న ఆ ఉదయం గురించి మనం ఆలోచించవచ్చు. ఇంక కొంచెం కాలం మాత్రమే. అంతట మనం రాజుని చూస్తాం ఇంక కొంచెం కాలం మాత్రమే ఆయన మన కళ్లనీళ్లను తుడిచివేస్తాడు. ఇంక కొంతకాలమే అంతట మనల్ని, “తనమహిమ యెదుట ఆనందముతో నిర్దోషులుగా నిలువ” బెట్టాడు. యూద 24. అందుకే, తన రాకడకు గుర్తుల్ని ఇచ్చినప్పుడు ఆయనిలా అన్నాడు, “ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు పైకెత్తికొనుడి. మా విడుదల సమిపించుచున్నది.” DATel 710.2
కాని తన రాకడ దినం సమయం క్రీస్తు చెప్పలేదు. తన రెండో రాకడ దినంగాని గడియగాని తాను తెలుపలేనని ఆయనే తన శిష్యులికి స్పష్టంగా చెప్పాడు. ఇది వెల్లడించడానికి ఆయనకు స్వేచ్ఛ ఉండి ఉంటే తాము నిత్యం మెళుకువగా ఉండి కనిపెట్టాల్సిందిగా శిష్యులికి చెప్పాల్సిన అవసరం ఏంటి? మన రక్షకుని రాకడ దినం గడియ తమకు తెలుసునని చెప్పేవారున్నారు. భవిష్యత్తును చదివి చెప్పడంలో వారు గొప్ప చిత్తశుద్ధిని ప్రదర్శిస్తారు. అయితే వారిని నమ్మవద్దంటున్నాడు ప్రభువు. మనుషకుమారుని రెండోరాక సమయం దేవునికి మాత్రమే తెలిసిన మర్మం. DATel 710.3
తన రాకడ సమయంలో లోక పరిస్థితిని గూర్చిన తన ప్రస్తావనను క్రీస్తు కొనసాగిస్తూ ఇలా అంటోన్నాడు, “నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయు ఆలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుకొనుచు నుండిరి. జలప్రళయము వచ్చి అందరిని కొట్టుకొనిపోవువరకు ఎరుగకపోయిరి. “నిత్యత్వానికి సిద్ధపడేందుకు వెయ్యి సంవత్సరాల లౌకిక సుపరిపాలనని క్రీస్తు ఇక్కడ మన దృష్టిముందుంచడం లేదు. నోవహు కాలంలో పరిస్థితులు ఎలాగున్నవో అలాగే మనుషకుమారుడు వచ్చేటప్పుడూ ఉంటాయని ఆయన చెబుతున్నాడు. DATel 711.1
నోవహు దినాల్లో పరిస్థితులు ఎలాగున్నాయి? “నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా” చూచాడు. ఆది. 6:5 జలప్రళయ పూర్వప్రజలు దేవుని నుంచి తొలగిపోయారు. ఆయన చిత్రాన్ని జరిగించడానికి నిరాకరించారు. తమ సొంత ఆలోచనలు వక్ర అభిప్రాయాల ననుసరించి నివసించారు. వారి నాశనానికి కారణం వారి దుర్మార్గతే. ఈనాటి ప్రపంచంకూడా అదే మార్గంలో నడుస్తోంది. వెయ్యేండ్ల సుపరిపాలన సూచనలు ఏమి కనిపించడం లేదు. దైవ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేవారు దుష్టత్వంతో లోకాన్ని నింపుతున్నారు. వారు పందాలు వేయడం, గుర్రపు పందాలు కాయడం, జూదమాడడం, దుర్వ్యయం చేయడం, కామక్రీడల్లో మునిగిపోవడం, అదుపులేని ఉద్రేకాలు కలిగిఉండడం- ఇవి లోకంలో పెచ్చు పెరిగి దౌర్జన్యానికి దారితీస్తోన్నాయి. DATel 711.2
యెరూషలోము నాశనానికి సంబంధించిన ప్రవచనంలో క్రీస్తు ఇలా అన్నాడు, “అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తరువాత అంతము వచ్చును.” ఈ ప్రవచనం మళ్లీ నెరవేరుంది. ఆనాటి దుర్మారత నేటి తరంలో తన ప్రతిరూపాన్ని చూసుకుంటోంది. సువార్త ప్రకటనకు సంబంధించిన ప్రవచనం కూడా ఇలాగే. యెరూషలేము పతనానికి ముందు పౌలు పరిశుద్దాత్మ ఆవేశం వలన రాస్తూ “ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి” (కొలొ. 1:23) సువార్త ప్రకటితమయ్యిందన్నాడు. అలాగే ఇప్పుడు మనుష్యకుమారుని రాకముందు నిత్యసువార్తను “ప్రతి వంశమునకు ఆయా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును” (ప్రక. 14:6, 14) ప్రకటితం కావాల్సి ఉంది. దేవుడు “భూలోకమునకు తీర్పు తీర్చబోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు” అ.కా’ 17:13. ఆ దినం ఎప్పుడు వస్తుందో క్రీస్తు మనకు చెబుతున్నాడు. లోకమంతా మారుమనసు పొందుతుందని ఆయన చెప్పడం లేదు. కాని “ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యరమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తరువాత అంతమువచ్చును” అంటున్నాడు. సువార్తను లోకానికి అందించడం ద్వారా ప్రభువు రాకను వేగిరపరచడం మనచేతుల్లో ఉంది. మనం దేవుని దినం కోసం ఎదురు చూడడమే కాదు దాన్ని వేగవంతం చెయ్యాలి కూడా. 2 పేతు. 3:12. ప్రభువు సంకల్చానుసారంగా క్రీస్తు సంఘం తన నియమిత కర్తవ్యాన్ని నిర్వహించి ఉంటే ఇంతకు ముందే యావత్ ప్రపంచానికి హెచ్చరిక అందేది. ప్రభువైన యేసు శక్తితోను గొప్ప మహిమతోను భూమికి వచ్చేవాడు. DATel 711.3
తన రాకడకు గుర్తులిచ్చాక క్రీస్తు ఇలా అన్నాడు, “మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమిపమాయెనని తెలిసికొనుడి.” “మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి,” రానున్న తీర్పులు గురించి దేవుడు మనుషుల్ని ఎల్లప్పుడూ హెచ్చరిస్తాడు. తమ కాలానికి ఆయన ఉద్దేశించిన వర్తమానాన్ని విశ్వసించి ఆమేరకు ఆయన ఆజ్ఞలకు విధేయులై నివసించినవారు అవిధేయులైన అవిశ్వాసులపై పడ్డ తీర్పుల నుంచి తప్పించుకున్నారు. “ఈ తరములో నీవే నాయెదుట నీతివంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటివారును ఓడలో ప్రవేశించుడి” అంటూ దైవ వాక్కు నోవహుకు వచ్చింది. నోవహు ఆమాటకు విధేయుడయ్యాడు, రక్షించబడ్డాడు. లోతుకి “లెండి ఈ చోటు విడిచి పెట్టిరండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవుచున్నాడు” అన్న వర్తమానం వచ్చింది. ఆది. 7:1, 19:14. లోతు పరలోక దూతల కాపుదలకు అంగీకరించాడు, రక్షణ పొందాడు. అలాగే క్రీస్తు శిష్యులికి యెరూషలేము నాశనాన్ని గూర్చిన హెచ్చరిక వచ్చింది. రానున్న విధ్వంసానికి చిహ్నం కోసం కనిపెట్టి దాన్ని చూసి ఆపట్టణం నుంచి పారిపోయిన వారు ఆనాశనం నుంచి తప్పించుకున్నారు. అలాగే క్రీస్తు రెండో రాకడ గురించి ఈలోకానికి సంభవించనున్న సర్వనాశనాన్ని గురించి ఇప్పుడు మనకు హెచ్చరిక వస్తోంది. హెచ్చరికను పాటించేవారు జీవిస్తారు. DATel 712.1
ఆయన వచ్చేసమయం మనకు ఖచ్చితంగా తెలియదు గనుక మెలకువగా ఉండాలి అన్న ఆదేశం మనకు వస్తోంది. “ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ” లూకా 12:37. ప్రభువు రాక కోసం మేల్కొని ఉండేవారు ఎదురుచూస్తు సోమరితనంగా ఉండరు. ప్రభువుపట్ల అవిధేయులైన వారికి ఆయన తీర్పుల విషయంలో క్రీస్తు వస్తున్నాడన్న ఎదురుచూపు భయం పుట్టించాలి. ఆయన కృపను నిరాకరించి తాము చేసిన ఘోర పాపం గుర్తింపుకు వారిని అది మేలుకొలపాలి. ప్రభువు రాకకోసం మెలకువగా ఉండి కనిపెట్టేవారు సత్యాన్ని అనుసరించి నివసించడం ద్వారా తమ ఆత్మల్ని శుద్ధీకరించుకుంటారు. మెలకువగా ఉండి జాగ్రత్తగా కనిపెట్టడంతో పాటు వారు చిత్తశుద్ధితో పనిచేస్తారు. ప్రభువు తలుపుదగ్గరే ఉన్నాడని వారెరుగుదురు గనుక ఆత్మల రక్షణ నిమిత్తం పనిచేసే దైవ దూతలతో సహకరించి ఉత్సాహోద్రేకాలతో పనిచేస్తారు. “తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు, ప్రభువు తన ఇంటివారి మీద నియమించిన నమ్మకమైన బుద్ధిగల సేవకులు వీరే” (లూకా 12 :42) ఈ కాలానికి అవసరమైన సత్యాన్ని వారు ప్రకటిస్తున్నారు. హనోకు, అబ్రహాము, మోషే తమ తమ కాలానికి ఏర్పాటయిన సత్యాన్ని ప్రకటించారు. అలాగే ఇప్పుడు క్రీస్తు సేవకులు తమ కాలానికి దేవుడిచ్చిన ప్రత్యేక హెచ్చరికను అందిస్తారు. DATel 713.1
కాగా క్రీస్తు ఇంకొక వర్గాన్ని మన దృష్టికి తెస్తున్నాడు: “అయితే దుష్టుడైన యొకదాసుడు- నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలు పెట్టి , త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుండెను ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు” వస్తాడు. DATel 713.2
దుష్టసేవకుడు “నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడు” అని తన మనసులో అనుకున్నాడు. క్రీస్తు రాడని అతడు అనడు. ఆయన రెండోసారి వస్తాడన్న నమ్మకాన్ని ఎగతాళి చెయ్యడు. కాని తన మనసులోను తన క్రియలు మాటల ద్వారాను ప్రభువు త్వరాగా వస్తాడు అన్న నమ్మకాన్ని ప్రజల మనసుల్లో నుంచి బహిష్కరిస్తాడు. మనుషులు అహంకారంగా అజాగ్రత్తగా ఉండి ఆలస్యం చెయ్యడానికి అతడి ప్రభావం దారితీస్తుంది. వారు తమ లోకాశల్లో, మత్తులో స్థిరపడిపోతారు. లౌకికమైన ఆవేశాలు, దుష్ట తలంపులు వారి మనసును నింపుతాయి. దుష్ట సేవకుడు తాగుబోతులతో కలిసి తిని తాగుతాడు. లోకంతో కలిసి వినోదాల్లో మునిగితేలాడు. యజమానుడికి నమ్మకంగా ఉన్న సాటి సేవకుల్ని కొడతాడు. వారిపై నిందలు మోపి శిక్షిస్తాడు. లోకంతో మమేకమౌతాడు. ఒకేలాంటి వారు అపరాధంలో కలిసి పెరుగుతారు. ఆ కలిసిపోవడం భయంకర పరిణామం. లోకం ఉచ్చులో అతడు ఇరుక్కుపోతాడు. “ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతో కూడ వానికి పాలు నియమించును. DATel 714.1
“నీవు జాగరూకుడవై యుండని యెడల నేను దొంగవలె వచ్చెదను, ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు.” ప్రక. 3:3. క్రీస్తు రాకడ అబద్ధ బోధకులికి ఆశ్చర్యం కలిగిస్తుంది. వారు “సమాధానం క్షేమం” అంటున్నారు. యెరూషలేము పతనానికి ముందు యాజకులు అధికారుల్లా వారు లౌకిక ప్రతిష్ఠకు సంఘాన్ని వినియోగించు కుంటారు. కాల సూచనలు దీనినే సూచిస్తున్నట్లు వారు భాష్యం చెబుతారు. అయితే పరిశుద్ధ లేఖనం చెబుతున్నదేంటి? “వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును” 1 థెస్స 5:3. భూమిపై నివసించే వారందరిమీద, ఈ లోకాన్ని తమ గృహంగా చేసుకునేవారందరి మీద దేవుని దినం ఉచ్చులా పడుతుంది. ఆ దినం వారిమీదికి దొంగలా వస్తుంది. DATel 714.2
దొమ్మీలు నీచమైన వినోదాలతో నిండి ఐహిక భద్రతతో ఈ లోకం నిద్రిస్తోంది. ప్రభువు రాకడని మనుషులు చాలా దూరానికి నెట్టివేస్తోన్నారు. హెచ్చరికల్ని హుష్ కాకి అంటోన్నారు. “సమస్తమును సృష్టి ఆరంభమున నున్నట్టే నిలిచియున్నదే,” “నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును” అని వారు అతిశయంగా చెబుతారు. (2 పేతు. 3:4, యెష. 56:12) వినోదాలు విలాసాల్లో మనం కూరుకుపోతాం. అయితే క్రీస్తు “ఇదిగో నేను దొంగవలె నచ్చుచున్నాను” అంటున్నాడు. ప్రక. 16:15, 16. అదే సమయంలో “ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను?” అని లోకం ప్రశ్నిస్తున్నప్పుడు గుర్తులు నెరవేర్తున్నాయి. “సమాధానం క్షేమం” అంటూ వారు కేకలు వేస్నున్నప్పుడు ఆకస్మిక నాశనం వస్తుంది. అపహసించేవాడు సత్యాన్ని నిరాకరించేవాడు దురభిమాని అయినప్పుడు, డబ్బు సంపాదించే వివిధ మార్గాల్లో నియమాలికి విలువ నివ్వకుండా పని సాగుతున్నప్పుడు, జ్ఞానార్జన నిమిత్తం విద్యార్ధి బైబిలు మినహా అన్ని మార్గాల్ని అన్వేషిస్తున్నప్పుడు, క్రీస్తు దొంగవలె వస్తాడు. DATel 714.3
లోకంలో సమస్తం సంక్షోభంలో ఉంది. కాలానికి సంబంధించిన సూచనలు విపత్తును సూచిస్తున్నాయి. జరుగనున్న సంభవాలు తమ నీడల్ని ముందుగానే ప్రదర్శిస్తున్నాయి. దేవుని ఆత్మ భూమి మీద నుంచి నిష్క్రమిస్తున్నాడు. నీటి మీద ప్రమాదం వెనుక ప్రమాదం చోటు చేసుకుంటోంది. తుపాన్లు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు, వరదలు, హత్యలు సంభవిస్తోన్నాయి. భవిష్యత్తును చదవగలవారు ఎవరు? భద్రత ఏది? మానవుడిలో గాని లౌకికమైన దేనిలోగాని భరోసాలేదు. మనుషులు తాము ఎన్నుకున్న ధ్వజం కింద వడివడిగా గుమిగూడుతున్నారు. వారు తమ నాయకుల కదలికల్ని అసహనంతో కనిపెడున్నారు. తమ ప్రభువు రాకకోసం మెలకువగా ఉండి కనిపెడ్తూ పనిచేస్తున్న వారు ఉన్నారు. ఇంకొక తరగతి ప్రజలు ప్రప్రథమ భ్రష్టుడు సాతాను వెనుక వరసలో నిలబడ్తున్నారు. మనం చేరడానికి కృషి చేయాల్సిన పరలోకం ఉందని తప్పించుకోవాల్సిన నరకం ఉందని నమ్మేవారు బహుకొద్దిమంది మాత్రమే. DATel 715.1
ఈ సంక్షోభం మనల్ని ఆవరిస్తోంది. సూర్యుడు గగనంలో యధావిధిగా ప్రకాశిస్తున్నాడు. ఆకాశవిశాలం దేవుని మహిమను వెల్లడిస్తున్నది. మనుషులు తింటూ తాగుతూ ఉన్నారు, మొక్కలు నాటుతున్నారు. వ్యాపారులు కొంటున్నారు అమ్ముతున్నారు. అత్యున్నత స్థానం కోసం మనుషులు ఒకర్నొకరు గెంటుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సరదారాయుళ్ళు వినోదకాముకులు థియేటర్లలోను, గుర్రపుపందాల్లోను, జూదగృహాల్లోను తమ సమయాన్ని గడుపుతోన్నారు. ప్రజల ఉత్సాహం మిన్నంటుతోంది. అయితే కృపకాల గడియలు వేగంగా గతించిపోతోన్నాయి. ప్రతీవారి కేసు నిరంతరంగా తీర్మానం కావడానికి సిద్ధంగా ఉంది. తనకు ఎక్కువ సమయం లేదని సాతానుకు తెలుసు. కృపకాలం అంతమొంది కృపాద్వారం నిరంతరంగా మూసుకునే వరకూ మనుషుల్ని మోసగించడానికి, మనుషుల మనసుల్ని చెడుతో నింపడానికి, వారిని తన వశంలో ఉంచుకోడానికి సాతాను తన అనుచరుల్ని రంగంలోకి దించుతున్నాడు. DATel 715.2
ఒలీవల కొండ నుంచి రక్షకుడు పలికిన హెచ్చరిక నాటినుంచి శతాబ్దాల పొడవున మనకు వస్తున్నది. “నా హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము ఆకస్మాత్తుగా మిమిదికి ఉరివచ్చినట్టు రాకుండ ఈవిషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.” “కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్ధన చేయుచు మెలకువగా ఉండుడి. ” DATel 716.1