యుగయుగాల ఆకాంక్ష

69/88

68—ఆలయ ఆవరణంలో

“ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండిరి. వారు గలిలయలోని బేత్సయిదావాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి - అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము అని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి అంద్రియతో చెప్పెను, అంద్రియయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి.” DATel 695.1

ఈ సమయంలో క్రీస్తు పరిచర్య ఘోరంగా పరాజయం పొందినట్లు కనిపించింది. యాజకులు పరిసయ్యులతో జరిగిన సంఘర్షణలో ఆయనే విజేత అయినా, తనను మెస్సీయాగా వారెన్నడూ స్వీకరించరని స్పష్టమయ్యింది. అంతిమ వేర్పాటు వచ్చింది. శిష్యుల దృష్టికి పరిస్థితి అయోమయంగా ఉంది. అయితే క్రీస్తు తన కర్తవ్య సిద్ధిని సమిపిస్తోన్నాడు. యూదు జాతికి మాత్రమే కాదు సర్వలోకానికి సంబంధించిన ఘటన సంభవించబోతోంది. “మేము యేసును చూడగోరుచున్నాము” అని లోకం ఆకలితో చేస్తోన్న ఆక్రందన్ని ప్రతిధ్వనిస్తూ చేసిన మనవిని క్రీస్తు విన్నప్పుడు, ఆయన ముఖం వెలుగుతో ప్రకాశించింది. అందుకాయన ఇలా స్పందించాడు, “మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది.” గ్రీకుల మనవిలో తన మహత్తర త్యాగం ఫలితాలికి మచ్చును ఆయన చూశాడు. DATel 695.2

రక్షకుని పరిచర్య చివరి కాలంలో ఈ మనుషులు పశ్చమాన్నుంచి వచ్చారు, క్రీస్తు జనన సమయంలో తూర్పు నుంచి జ్ఞానులు వచ్చినట్లు. క్రీస్తు పుట్టిన కాలంలో యూదులు తమ ఆలోచనలు, భవిష్యత్తును గూర్చిన ప్రణాళికల్లో తలమునకలై ఆయన రాకను గుర్తించలేదు. అన్యమతం అవలంబించే దేశం నుంచి రక్షకుణ్ని పూజించడానికి జ్ఞానులు తమ కానుకలతో వచ్చారు. అలాగే ఈ గ్రీసు దేశస్తులు లోకంలోని జాతుల్ని, గోత్రాల్ని ప్రజల్ని సూచిస్తూ యేసుని చూడడానికి వచ్చారు. ఆ మాదిరిగానే లోకంలోని అన్ని దేశాలు యుగాల ప్రజల్ని రక్షకుని సిలువ ఆకర్షిస్తుంది. అలాగే “అనేకులు తూర్పు నుండియు, పడమట నుండియు వచ్చి అబ్రహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు.” మత్త 8:11. DATel 695.3

యెరుషలేములో క్రీస్తు విజయుడుగా ప్రవేశించడాన్ని గూర్చి గ్రీసు దేశస్తులు విన్నారు. యాజకుల్ని అధికారుల్ని దేవాలయంలో నుంచి ఆయన తరిమివేశాడని ఆయన దావీదు సింహాసనాన్ని అధిష్టించి ఇశ్రాయేలు రాజుగా పరిపాలన చేస్తాడని కొందరు ఊహించి ఆ సమాచారాన్ని అంతటా ప్రచురించారు. ఆయన కర్తవ్యం పరిచర్య గురించిన సత్యాన్ని తెలుసుకోవాలని ఈ గ్రీకులు ఆకాంక్షించారు. “మేము యేసును చూడగోరుచున్నాము” అన్నారు. వారి కోరిక నెరవేరింది. ఆ మనవి తన వద్దకు వచ్చినప్పుడు దేవాలయంలో యేసు ఉన్న స్థలం కేవలం యూదులకే ప్రవేశార్హత ఉన్నస్టలం. ఆయన ఆలయం వెలుపల ఆవరణంలోకి వెళ్లి గ్రీసు దేశస్తులతో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు. DATel 696.1

క్రీస్తు మహిమను పొందే గడియ వచ్చింది. ఆయన సిలువ నీడలో నిలబడి ఉన్నాడు. తాను చేయనున్న త్యాగం అనేకమంది కుమారుల్ని కుమార్తెల్ని దేవుని వద్దకు తెస్తుందని గ్రీకుల విచారణ ఆయనకు సూచించింది. తాము కలలోనైనా చూచిఉండని స్థితిలో గ్రీకులు తనను చూడనున్నారని ఆయనకు తెలుసు. ఆయన్ని బందిపోటు దొంగ హంతకుడు అయిన బరబ్బా పక్కన నిలబెట్టి, విడిచి పెట్టడానికి క్రీస్తును గాక బరబ్బాను ప్రజలు ఎన్నుకోడం వారు చూస్తారు. యాజకులు అధికారుల ప్రోత్సాహంతో ప్రజలు తమ ఎంపికను చేసుకోడం వారు వింటారు. “క్రీస్తనబడిన యేసును ఏమి చేతును?” అన్న ప్రశ్నకు “సిలువవేయుము” (మత్త. 27:22) అన్న సమాధానం వింటారు. మానవుల పాపాల నిమిత్తం ఈ ప్రాయశ్చిత్తం చెయ్యడం ద్వారా తన రాజ్యం సంపూర్ణమై లోకమంతా వ్యాపిస్తుందని క్రీస్తుకు తెలుసు. తాను పునరుద్దారకుడుగా పనిచేస్తానని, తన పరిశుద్దాత్మ విజయం సాధిస్తాడని ఆయన ఎరుగును. కాసేపు భవిష్యత్తులోకి చూశాడు. లోకంలో అన్ని ప్రాంతాల్లోను “ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొట్టె పిల్ల” అని ప్రకటిస్తోన్న స్వరాన్ని విన్నాడు. (యోహా. 1:29) యూదులు అన్యజనులు అన్న అడ్డుగోడ కూలిపోయి అన్ని జాతులు, అన్ని భాషలు అందరు ప్రజలు రక్షణ వర్తమానాన్ని విన్నప్పుడు, ఈ పరదేశుల్లో గొప్ప పంట వాగ్దానాన్ని ఆయన చూశాడు. తన నిరీక్షణ నెరవేర్పు అయిన దీనికి ఎదురు చూపు ఈ మాటల్లో వ్యక్తమౌతోంది, “మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది అయితే ఈ మహిమ కలగవలసిన మార్గం ఆయన మనసులో నుంచి ఎన్నడూ పోలేదు. వడివడిగా వస్తోన్న తన మరణం వెనుక అన్యజనుల సమీకరణ జరగాల్సి ఉంది. ఆయన మరణం ద్వారా మాత్రమే లోకం రక్షణ పొందాల్సి ఉంది. గోధుమ గింజవలె మనుష్యకుమారుడు భూమిలో వడి, మరణించి సమాధిఅయి కనబడకుండా ఉండాలి. అయినా ఆయన మళ్లీ జీవించాల్సి ఉన్నాడు. DATel 696.2

శిష్యులికి గ్రాహ్యమయ్యేందుకోసం క్రీస్తు ప్రకృతి విషయాల ద్వారా తన భవిష్యత్తును వారికి తెలియజేశాడు. తన కర్తవ్య ఫలం తన మరణం ద్వారా ఒనగూడాల్సి ఉంది. ఆయన ఇలా అన్నాడు, “గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును. అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును.” గోధుమ గింజ భూమిలో పడి చచ్చినప్పుడు అది మొలకెత్తి పైకి వచ్చి ఫలాన్నిస్తుంది. అలాగే క్రీస్తు మరణం దేవుని రాజ్యానికి ఫలాన్నిస్తుంది. కూరగాయల రాజ్య చట్టం ప్రకారం, ఆయన మరణం ఫలితంగా జీవం ఉత్పత్తి కావలసి ఉంది. DATel 697.1

భూమిని దున్నే వారి ముందు ఈ సాదృశ్యం నిత్యమూ ఉంటుంది. శ్రేష్టమైన భాగాన్ని పారవేయడం ద్వారా మనుషులు ఏటికేడాది తమకు అవసరమైన ధాన్యపు నిల్వల్ని సమకూర్చుకుంటారు. ప్రభువు కాపుదల కింద అది దుక్కిచాళ్ల కింద దాగి ఉండాలి. అప్పుడు మొలక ఆతర్వాత వెన్ను ఆతర్వాత వెన్నులో ముదురుగింజలు వస్తాయి. అయితే గింజ నేలలో పడి కనిపించకుండా దాగి, నశించిపోయినట్లు, పైకి కనిపించేవరకు ఈ అభివృద్ధి జరగదు. DATel 697.2

నేలలో పడి ఉన్న విత్తనం ఫలాలు ఫలిస్తుంది. తిరిగి అది విత్తనంగా పాతబడుంది. ఇలా పంట సమృద్ధి అవుతుంది. అలాగే కల్వరి సిలువపై క్రీస్తు మరణం నిత్యజీవ వలాలు ఫలిస్తుంది. దాని ఫలితంగా నిత్యజీవయుగాలు పొడవునా జీవించేవారు ఈ త్యాగాన్ని గూర్చి ధ్యానిస్తారు. DATel 698.1

తన జీవాన్ని అది కాపాడుకునే గొధుమ గింజ ఫలాల్ని ఉత్పత్తి చేయలేదు, అది ఒంటరిగా ఉంటుంది. తాను కోరుకున్నట్లయితే క్రీస్తు తన్ను తాను మరణం నుంచి కాపాడుకునేవాడు. కాని ఆయన ఇలా చేస్తే ఆయన ఒంటరిగా నివసించాలి. కుమారుల్ని కుమార్తెల్ని దేవుని వద్దకు తేలేడు. తన ప్రాణాన్ని పోగొట్టుకోడం ద్వారా మాత్రమే ఆయన మానవాళికి జీవాన్నివ్వగలడు. మరణించేందుకు భూమిలోకి వెళ్లడం ద్వారా మాత్రమే ఆ గొప్ప పంటకు ఆయన విత్తనం కాగలడు. ప్రతీ జాతి నుంచి, ప్రతీ ప్రజ నుంచి, భాష నుంచి, జనుల నుంచి వచ్చి దేవుని రాజ్య ప్రవేశం కోసం విమోచన పొందేవారే ఈ పంట. DATel 698.2

అందరూ నేర్చుకోవాల్సిన ఆత్మత్యాగ పాఠాన్ని క్రీస్తు ఈ సత్యంతో అనుసంధానపర్చుతోన్నాడు: “తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకొనును.” క్రీస్తుతో జత పనివారుగా పనిచేస్తూ ఫలాలు వలించే వారందరూ మొదట భూమిలో పడి చనిపోవలసి ఉన్నారు. లోకపు అవసరం దుక్కిచాలులో జీవితం పడాలి. స్వార్థప్రేమ, స్వార్థ ప్రయోజనం మరణించాలి. ఆత్మత్యాగ నిబంధనే ఆత్మ రక్షణ నిబంధన. వ్యవసాయదారుడు ధాన్యాన్ని భూమిలోకి చల్లడం ద్వారా దాన్ని భద్రపర్చుకుంటున్నాడు. మానవ జీవితంలో కూడా ఇలాగే ఇవ్వడమే జీవించడం. దేవుని సేవకు మానవుడి సేవకు అంకితమైన జీవితమే సురక్షిత పరిరక్షిత జీవితం. ఈలోకంలో క్రీస్తు నిమిత్తం తమ ప్రాణాన్ని త్యాగం చేసేవారు దాన్ని నిత్యజీవితం కోసం దాచుకుంటారు. DATel 698.3

స్వార్థం కోసం ఖర్చయ్యిన జీవితం తినేసిన గింజలాంటిది. అది మాయమవుతుంది కాని అది వృద్ధి చెందదు. స్వార్థం కోసం ఒకడు పోగుజేసుకో గలిగిందంతా పోగుజేసుకోవచ్చు. స్వార్థం కోసం జీవించి, ఆలోచించి ప్రణాళికలు తయారుచేసుకోవచ్చు. కాని, అతడి జీవితం గతించిపోతుంది. అతడికి ఏమి ఉండదు. స్వార్థ జీవన సూత్రం స్వీయ నాశన సూత్రం. DATel 699.1

“ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతని ఘనపరచును” అన్నాడు యేసు. క్రీస్తుతో త్యాగపు సిలువను మోస్తున్న వారందరు ఆయనతో ఆయన మహిమను పంచుకుంటారు. అవమానాన్ని, బాధను భరించినప్పుడు క్రీస్తు పొందిన ఆనందాన్ని పొందడమే శిష్యులు ఆయనతో పొందాల్సిన మహిమ. వారు ఆయన ఆత్మ త్యాగ ఫలం. వారిలో ఆయన ప్రవర్తన, స్వభావం క్రియాశీలమవ్వడమే ఆయన ఆశించే ప్రతిఫలం. అదే యుగాల పొడవున ఆయన ఆనందం. తమ సేవ, త్యాగం ఫలితంగా ఆయనతో వారు పంచుకునే ఈ ఆనందం ఇతరుల హృదయాల్లోను జీవితాల్లోను కనిపిస్తుంది. వారు క్రీస్తుతో సహసేవకులు. తన కుమారుణ్ని అభిమానించేటట్లు దేవుడు వారిని అభిమానిస్తాడు. DATel 699.2

అన్యజనుల సమీకరణను ఛాయారూపకంగా సూచించే గ్రీకుల వర్తమానం మొత్తం తన కర్తవ్యాన్ని యేసు మనుసుకి తెచ్చింది. విమోచన కార్యం - పరలోకంలో ప్రణాళిక రూపొందినప్పటి నుంచి ఇప్పుడు సమీపంలో ఉన్న తన మరణం వరకు - ఆయన ముందు చలనచిత్రంలా కదిలింది. దైవ కుమారుణ్ని ఒక మర్మపూరితమైన మేముం కమ్మినట్లనిపించింది. దాని చీకటిని ఆయన దగ్గర ఉన్నవారు కూడా గుర్తించాడు. ఆయన ఆలోచనలో మునిగి కూర్చున్నాడు. తుదకు నిశ్శబ్దాన్ని, బద్దలు చేస్తూ ఆయన దుఃఖస్వరం ఇలా అంది, “ఇప్పుడు నా ప్రాణము కలవరపడచున్నది, నేనేమందును? తండ్రీ, యీ గడియ తటస్థింపకుండ నన్ను తప్పించుము.” ఎదురు చూపులో క్రీస్తు తన దుఃఖ పాత్రలోని దాన్ని అప్పుడే తాగుతున్నాడు, తాను ఒంటరిగా ఎదుర్కోడానికి విడువబడనున్న, దేవుడు కూడా తనను విడిచిపెడ్తాడన్నట్లు కనిపిస్తోన్న, మొత్తబడ్డ వానిగా, దేవుని వలన బాధింపబడు వానిగాను అందరూ తనను చూడనున్న గడియ నుంచి ఆయన మానవత్వం భయపడింది. ప్రజల ముందు నిందలు సిగ్గు భరించడానికి, నేరస్తుడుగా పరిగణించబడడానికి, అవమానకరమైన మరణం పొందడానికి ఆయన వెనకాడాడు. చీకటి శక్తులతో తన సంఘర్షణను గూర్చిన భయం, మానవుల అపరాధ భారం, పాపం కారణంగా తండ్రి ఉగ్రత క్రీస్తుకు తొట్రుబాటు కలిగించాయి. ఆయన ముఖంపై మరణఛాయ అలముకొంది. DATel 699.3

అప్పుడు తండ్రి చిత్తానికి ఆయన తన్నుతాను అప్పగించుకున్నాడు. “ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చితిని. తండ్రీ, నీ నామము మహిమపరచుము” అని చెప్పాడు. క్రీస్తు మరణం ద్వారానే సాతాను రాజ్యం పతనమౌతుంది. ఈ విధంగానే మానవ విమోచన సాధ్యపడుంది. దేవుడు మహిమను పొందుతాడు. యేసు వేదన పొందడానికి తన్ను తాను అర్చించుకోడానికి అంగీకరించాడు. “తండ్రి నీ నామము మహిమపరచుము” అన్నాడు. క్రీస్తు ఈ మాటలు చెప్పగా తన తల పైగా నిలిచి ఉన్న మేఘంలో నుంచి ఈ సమాధానం వచ్చింది : “నేను దానిని మహిమపరచితిని మరల మహిమపరతును.” పశువుల తొట్టె మొదలు ఈ మాటలు చెప్పే వరకూ క్రీస్తు తన జీవితమంతా తండ్రిని మహిమపర్చాడు. ఇక రానున్న శ్రమకాలంలో తన దేవ మానవ బాధల్లో ఆయన తన తండ్రి నామాన్ని మహిమ పర్చుతాడు. DATel 700.1

ఆ స్వరం వినిపించినప్పుడు అనంత శక్తితో నిండిన ఆయుధాలు మోహరించినట్లు మేఘంలో నుంచి వెలుగు తళుక్కుమని ఆయన చుట్టూ వెలుగు వలయం ఏర్పడింది. ప్రజలు ఈ దృశ్యాన్ని భయంతో ఆశ్చర్యంతో చూశారు. మాట్లాడడానికి ఎవరూ సాహసించలేదు. నిశ్శబ్దంగా ఊపిరి బిగబట్టుకుని క్రీస్తుపై దృష్టి సారించి అందరూ నిలబడి ఉన్నారు. తండ్రి సాక్ష్యం ముగిసిన వెంటనే ఆ మేఘం పైకి వెళ్లి అంతరిక్షంలో చెదిరిపోయింది. తండ్రి కుమారుల మధ్య కంటికి కనిపించే సహవాసం అప్పటికి సమాప్తమయ్యింది. DATel 700.2

“కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము - ఉరిమెననిరి. మరికొందరు - దేవదూత ఒకడు ఆయనతో మాట్లా డెననిరి.” తెలుసుకోడానికని వచ్చిన గ్రీకులు మేఘాన్ని చూశారు, ఆ స్వరాన్ని విన్నారు, వర్తమాన భావాన్ని గ్రహించారు, క్రీస్తు ఎవరని వాస్తవంగా గ్రహించారు. దేవుడు పంపిన వానిగా వారికి ఆయన ప్రత్యక్ష పర్చబడ్డాడు. DATel 700.3

యేసు పరిచర్య ఆరంభంలో, ఆయన బాప్తిస్మ సమయంలో దేవుని స్వరం వినిపించింది. కొండపై ఆయన రూపాంతరం చెందినప్పుడు దేవుని స్వరం వినిపించింది. ఇప్పుడు ఆయన పరిచర్య సమాప్తం కానున్న సమయంలో మూడోసారి ఆ స్వరం వినిపించింది. ఇప్పుడు క్రితంలో కన్నా ఎక్కువ మంది ప్రజలు ప్రత్యేక పరిస్థితుల్లో ఆ స్వరం విన్నారు. యూదుల పరిస్థితిని గూర్చి యేసు అప్పుడే అతి గంభీరమైన సత్యాన్ని పలికాడు. ఆయన తన చివరి విజ్ఞాపన చేశాడు. వారి నాశనాన్ని ప్రకటించాడు. ఇప్పుడు దేవుడు తన కుమారుని పరిచర్యపై తన ఆమోద ముద్ర వేశాడు. ఇశ్రాయేలు నిరాకరించిన ఆయన్ని దేవుడు గుర్తించాడు. “ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీకొరకే వచ్చెను” అని యేసు వారితో చెప్పాడు. అది ఆయన మెస్సీయా అనడానికి తిరుగులేని రుజువు. యేసు సత్యమే పలికాడని ఆయన దేవుని కుమారుడని తండ్రి వద్ద నుంచి వచ్చిన సూచన అది. DATel 701.1

క్రీస్తు ఇంకా ఇలా అన్నాడు, “ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమిమీద నుండి పైకెత్తబడిన యెడల అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందును... తాను ఏవిధముగా మరణము పొందవలసియుండెనో సూచించుచు ఆయన ఈ మాటలు చెప్పెను. ” ఇది లోకం ఎదుర్కొంటున్న క్లిష్టపరిస్థితి. నేను లోకానికి ప్రాయశ్చిత్తం అయితే లోకం వెలుగుతో ప్రకాశిస్తుంది. మానవుల ఆత్మలపై సాతాను పట్టు విడిపోతుంది. చెరిగిపోయిన దైవ స్వరూపం మానవాళిలో పునరుద్దరణ పొందుతుంది. విశ్వసించే భక్త జన కుటుంబం తుదకు వరలోక ‘గృహాన్ని స్వతంత్రించుకుంటుంది. ఇది క్రీస్తు మరణం ఫలితంగా చోటుచేసుకునే పరిణామం. తన ముందుకు వచ్చిన ఈ విజయ దృశ్యాన్ని తిలకిస్తూ రక్షకుడు ధ్యానంలో మునిగిపోయాడు. క్రూరమైన, అవమానకరమైన, భయంకరమైన శ్రమలతో నిండిన సిలువ తేజోవంతమైన మహిమతో ప్రకాశించడం చూశాడు. DATel 701.2

అయితే మానవ విమోచన కార్యమంతా సిలువ సాధించిందే కాదు. దేవుని ప్రేమ విశ్వానికి ప్రదర్శితమౌతుంది. ఈ లోక పాలకుడైన సాతాను అంతమెందుతాడు. దేవునిపై సాతాను ఆరోపణలు తప్పని నిరూపితమౌతాయి. అతడు పరలోకానికి తెచ్చిన అవమానం తుడుపు పడుతుంది. దేవదూతలు మానవులు విమోచకునికి ఆకర్షితులవుతారు. “నేను భూమి మీద నుండి పైకెత్తబడిన యెడల అందరిని నా యొద్దకు ఆకర్షించుకొందును” అని ఆయనన్నాడు. DATel 702.1

యేసు ఈ మాటలన్నప్పుడు చాలామంది ఆయన చుట్టూ ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి ఇలా అన్నాడు, “క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్యకుమారుడగు ఈయన ఎవరు? .... అందుకు యేసు- ఇంక కొంతకాలము వెలుగు మిమధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు నాకు వెలుగు ఉండగానే నడువుడి, చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగడు. వారు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను.” DATel 702.2

“ఆయన వారి యెదుట యిన్ని, సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి.” ఒకసారి వారు రక్షకుణ్ని ఇలా అడిగారు, “అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచకక్రియ చేయనున్నావు?” యోహా. 6:30. లెక్కకుమించినన్ని గుర్తుల్ని ఇచ్చాడు. కాని వారు తమ కళ్లను చెవుల్నీ మూసుకున్నారు. ఇప్పుడు తండ్రి తానే స్వయంగా మాట్లాడాడు గనుక ఇంకే గుర్తును కోరడానికి అవసరం లేకపోయినా వారింకా ఆయన్ని విశ్వసించడానికి నిరాకరిస్తున్నారు. DATel 702.3

“అయినను అధికారులలో కూడ అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని, సమాజములో నుండి వెలివేయ బడుదుమేమోయని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ” వారు దేవుని ఆమోదం కన్నా మనుషుల పొగడ్తల్ని ఎక్కువ ప్రేమించారు. నిందను అవమానాన్ని తప్పించుకోడానికి వారు క్రీస్తుని ఎరుగమని బొంకారు. నిత్యజీవాన్ని అందుకోడానికి నిరాకరించారు. అప్పటి నుంచి యుగాల పొడవునా ఎంతమంది ఇదే పని చేస్తున్నారు! రక్షకుడు చేసిన ఈ హెచ్చరిక వీరందరికీ వర్తిస్తుంది: “తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును.” “నన్ను నిరాకరించి నామాటలను అంగీకరింపని వారికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వారికి తీర్పు తీర్చును” అవి యేసు అన్నాడు. యోహా. 12:48. DATel 702.4

పాపం, వీరు తాము శిక్షననుభవించాల్సిన సమయాన్ని ఎరుగరు! క్రీస్తు నెమ్మదిగా తీవ్ర విచారంతో ఆలయప్రాంగణాన్ని విడిచి వెళ్లాడు. ఎన్నడు తిరిగి రాకుండా వెళ్లిపోయాడు. DATel 703.1