యుగయుగాల ఆకాంక్ష
51—“జీవపు వెలుగు”
“మరల యేసు - నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు గలిగి యుండునని వారితో చెప్పెను.” DATel 514.1
ఈ మాటలన్నప్పుడు యేసు పర్ణశాలల పండుగకు సంబంధించిన ప్రత్యేక సేవలు జరుగుతున్నప్పుడు ఆలయం ఆవరణలో ఉన్నాడు. ఈ ఆవరణ మధ్యలో రెండు దీపస్తంభాలున్నాయి. వాటికి ఊతంగా నిలబడి రెండు ఎత్తయిన ధ్వజాలున్నాయి. సాయంత్రం బలి అనంతరం దీపాలన్నిటినీ ముట్టించారు. వాటి వెలుగు యెరూషలేము అంతటా వ్యాపించింది. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన మేఘస్తంభం జ్ఞాపకార్థంగా ఈ ఆచార కర్మను నిర్వహించారు. మెస్సీయా రాకను సూచించే ఆచారంగా కూడా దాన్ని పరిగణించారు. సాయంత్రం దీపాలు వెలిగించినప్పుడు ఆలయం ఆవరణ ఆనందోత్సాహాలికి నెలవుగా మారేది. వయసు మళ్లిన పెద్దలు, ఆలయ యాజకులు, ప్రజాధికారులు, వాద్య సంగీతంతోను లేవీయుల వేద పారాయణంతోను లయ కలుపుతూ నాట్యం చేశారు. DATel 514.2
యెరూషలేమును వెలిగించిన వెలుగులో ఇశ్రాయేలు పై వెలుగు ప్రకాశింపజెయ్యడానికి మెస్సీయా వస్తాడన్న నిరీక్షణను ప్రజలు వ్యక్తం చేశారు. కాగా యేసుకి ఆ దృశ్యం ఇంకా విస్తృత భావాన్ని వ్యక్తం చేసింది. తేజోవంతమైన ఆలయ దీపాలు చుట్టూ వెలుగును ఎలా విరజిమ్ముతున్నాయో అలాగే ఆధ్యాత్మిక వెలుగుకి మూలమైన క్రీస్తు లోకంలోని చీకటిని పారదోలి లోకాన్ని వెలుగుతో నింపుతాడు. ఆ సంకేతం సంపూర్ణమైంది. తన సొంత చేతితో ఆయనే ఆకాశంలో నిలిపిన ఆ బ్రహ్మాండమైన జ్యోతి మహిమాన్విత మైన ఆయన పరిచర్యకు వాస్తవమైన ప్రతీక. DATel 514.3
అది ఉదయం. ఒలీవల కొండపై సూర్యుడు అప్పుడే ఉదయించాడు. తళతళ మెరిసే పాలరాతి రాజభవంతులపై సూర్యకిరణాలుపడి కళ్లు మిరిమిట్లు గొలిపేటట్లు ప్రకాశిస్తోన్నాయి. ఆలయం గోడలికి పొదిగిన బంగారంపై ఆ కిరణాలుపడి వెలుగులు విరజిమ్ముతోన్నాయి. యేసు ఆ వెలుగు వంక చూపిస్తూ “నేను లోకమునకు వెలుగును” అన్నాడు. DATel 515.1
ఈ మాటలు విన్న ఒక శిష్యుడు చాలా కాలం తర్వాత ఆ సమున్నత వాక్యభాగంలో ఈ మాటల్ని ప్రతిధ్వనించాడు, ” ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను; ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహించకుండెను.” “నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.” యోహాను 1:4, 5, 9. క్రీస్తు పరలోకానికి ఆరోహణమైన చాలా కాలం తర్వాత పేతురు పరిశుద్ధాత్మ ఆవేశంవల్ల రాస్తూ క్రీస్తు వినియోగించిన సంకేతాన్ని జ్ఞప్తికి తెచ్చాడు. “మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క నా హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది.” 2 పేతు. 1:19; DATel 515.2
దేవుని ప్రత్యక్షతలోని వెలుగు తన ప్రజలకు ఆయన సన్నిధికి చిహ్నంగా ఉంది. ఆదిలో సృజనాత్మక వాక్యపరంగా చీకటి లోనుంచి వెలుగు ప్రకాశించింది. విస్తారమైన ఇశ్రాయేలు సైన్యాల్ని నడిపిస్తూ పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలోను వెలుగు నిక్షిప్తమై ఉండేది. సీనాయి పర్వతం మీద ప్రభువుని దేదీప్యమానమైన వెలుగు ఆవరించింది. గుడారంలో కృపాసనం మీద వెలుగు నిలిచి ఉండేది. సొలొమోను దేవాలయం ప్రతిష్ఠితమైన తరుణంలో ఆలయం వెలుగుతో నిండింది. మెళుకువగా ఉండి మందల్ని కాస్తోన్న గొల్లలికి దూతలు విమోచన వర్తమానాన్ని తెచ్చినప్పుడు బేల్లె హేము కొండలమీద వెలుగు ప్రకాశించింది. DATel 515.3
దేవుడు వెలుగుతో నిండి ఉంటాడు. “నేను లోకమునకు వెలుగును” అన్నప్పుడు క్రీస్తు దేవునితో తన ఏకత్వాన్ని సర్వమానవకుటుంబంతో తన బాంధవ్యాన్ని ప్రకటిస్తోన్నాడు. ఆదిలో, “అంధకారములో నుండి వెలుగు ప్రకాశింప” జేసింది ఆయనే (2కొరి 4:6). సూర్యచంద్రనక్షత్రాల వెలుగు ఆయనే. సంకేతాలు, ఛాయారూపాలు, ప్రవచనం ద్వారా ఇశ్రాయేలు పై ప్రకాశించిన వెలుగు ఆయనే.. కాగా ఆ వెలుగును ఒక్క యూదు జాతికే ఇవ్వలేదు. సూర్యకిరణాలు భూమి మారుమూల ప్రాంతాల్లోకి ఎలా చొచ్చుకుపోతాయో అలాగే నీతి సూర్యుడి వెలుగు ప్రతీ ఆత్మ మీద ప్రకాశిస్తుంది. DATel 515.4
“నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.” DATel 516.1
ప్రపంచంలో గొప్ప మేధావులున్నారు. వారు ప్రతిభావంతులు, అద్భుతమైన పరిశోధనలు జరిపిన వారు. వారి మాటలు ఆలోచనను ప్రోత్సాహించి విశేషమైన జ్ఞాన క్షేత్రాల్ని ఆవిష్కరించాయి. ఈ వ్యక్తుల్ని మార్గదర్శకులుగాను మానవ జాతికి ఉపకారులుగాను గౌరవించడం జరుగుతోంది. అయితే వీరికన్నా ఉన్నతమైన వాడున్నాడు. “తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి అనగా తన నామము నందు విశ్వాసముంచువారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.” “ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను.” యోహాను 1:12, 18. పూర్వం మానవ దాఖలాల ప్రారంభం నాటినుంచి ప్రపంచంలోని ప్రతిభావంతుల జాబితాను సంకలనం చేయవచ్చు. కాని ఈ వెలుగు వారికి ముందునుంచే ఉంది. సౌర వ్యవస్థలోని చంద్రుడు నక్షత్రాలు సూర్యకాంతిని ఎలా ప్రతిబింబిస్తాయో అలాగే ప్రపంచంలోని మేధావులు - తమ సిద్ధాంతాలు వాస్తవమైనంత మేరకు - నీతిసూర్యుడి కిరణాల్ని ప్రతిబింబిస్తారు. ముత్యం లాంటి ప్రతీ ఆలోచన, ప్రతిభా వికాసం లోకానికి వెలుగైన ప్రభువు వద్దనుంచే వస్తోంది. ఈ రోజుల్లో “ఉన్నత విద్య” గురించి ఎంతో వింటున్నాం.” “బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తమైయున్న” ఆ ప్రభువువలన కలిగేదే నిజమైన “ఉన్నత విద్య”. “ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.” కొలస్స 2:3; యోహా1:4; “నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు గలిగి యుండును” అన్నాడు యేసు. DATel 516.2
“నేను లోకమునకు వెలుగు” అన్నమాటల్లో మెస్సీయా తానేనని యేసు ప్రకటించాడు. ఇప్పుడు క్రీస్తు బోధిస్తోన్న ఆలయంలో వృద్ధుడైన సుమెయోను “అన్య ప్రజలకు నిన్ను బయలు పరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను” ఆయన్ని గురించి మాట్లాడాడు. లూకా 2:32. ఇశ్రాయేలు ప్రజలందరికి సుపరిచితమైన ఒక ప్రవచనాన్ని సుమెయోను ఈ మాటల్లో ఆయనకు వర్తింపజేస్తోన్నాడు. యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ ఇలా వెల్లడించాడు, “నీవు యాకోబు’ గోత్రపు వారిని ఉద్దరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించునట్టును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమై యుండుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించియున్నాను.” యెష 49:6. ఈ ప్రవచనం మెస్సీయాను గూర్చి మాట్లాడున్నట్లు సాధారణ అవగాహన. “నేను లోకమునకు వెలుగను” అని యేసు అన్నప్పుడు తాను చెప్పినట్లు ఆయన మెస్సీయా అని ప్రజలు గుర్తించారన్నది నిస్సందేహం. DATel 517.1
ఆయన చెబుతున్నది పరిసయ్యులికి ప్రధానులికి అహంకారంతో కూడని ఊహాగానంగా కనిపించింది. తమ వంటి ఒక మనిషి ఆ విధంగా ఊహించడం వారికి మింగుడు పడలేదు. ఆయన మాటల్ని లెక్క చెయ్యనట్లు నటించిన వారు నీవెవరవు? అని ప్రశ్నించారు. తానే క్రీస్తునని ఒప్పుకోడానికి ఆయన్ని ఒత్తిడి చేస్తోన్నారు. ఆయన వస్త్రధారణ ఆయన పరిచర్య ప్రజల ఊహలకు విరుద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తానే మెస్సీయానని ఆయన ప్రకటించడం ప్రజలు ఆయన్ని నిరాకరించడానికి దారి తియ్యవచ్చునని ఆయన జిత్తులమారి ప్రత్యర్థుల నమ్మకం. DATel 517.2
“నీవెవరవు? అన్న వారి ప్రశ్నకు “మొదట నుండి నేను మీతో పలికాడు. తన మాటల్లో వెల్లడి చేసిందే ఆయన ప్రవర్తనలో వెల్లడయ్యింది. తాను బోధించిన సత్యానికి ఆయన ప్రతిరూపం. “నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు. ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచి పెట్టలేదు.” తానే మెస్సీయానని నిరూపించడానికి ఆయన ప్రయత్నించలేదు. కాని తండ్రితో తన ఏకత్వాన్ని ప్రదర్శించాడు. దేవుని ప్రేమకు’ వారి మనసుల తలుపు తెరచి ఉంటే వారు యేసుని స్వీకరించే వారు. DATel 517.3
ఆయన శ్రోతల్లో అనేకులు ఆయన్ని విశ్వసించారు. వారితో ఆయనిలా అన్నాడు, “మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.” DATel 518.1
ఈ మాటలు పరిసయ్యులికి కోపం రప్పించాయి. తమ జాతి దీర్ఘకాలంగా పరపాలనకింద మగ్గుతోన్న సంగతిని విస్మరించి వారిలా స్పందిచారు, “మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడును, ఎవనికిని దాసులమై యుందలేదే; మీరు స్వతంత్రులుగా చేయబడుదురని యేల చెప్పుచున్నావు? ” ద్వేషానికి బానిసలు, పగ ప్రతీకార ఆలోచనలతో నిండినవారు ఆయిన ఈ మనుషుల వంకచూసి యేసు ఇలా అన్నాడు, “పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” దుర్బుద్ధి అదుపులో ఉన్నవారు అతి నికృష్టమైన బానిసత్వం కింద ఉన్నారు. DATel 518.2
తన్నుతాను దేవునికి సమర్పించుకోడానికి సమ్మతించని ప్రతీ ఆత్మ వేరొక శక్తి అదుపులో ఉంటుంది. ఆ వ్యక్తి తన సొంతం కాదు. అతడు స్వేచ్ఛ గురించి మాట్లాడవచ్చు గాని అతడు అతి నీచమైన బానిసత్వంలో ఉన్నాడు. సత్యం తాలూకు సౌందర్యాన్ని చూడడానికి అతనికి అనుమతి ఉండదు. అతడి మనసు సాతాను అదుపులో ఉంటుంది. తన స్వబుద్ది ప్రకారం తన సొంత తీర్మానాల్ని బట్టి వ్యవహరిస్తున్నట్లు అతడు ప్రగల్భాలు పలకవచ్చు. కాని అతడు సాతాను చిత్తాన్నే నెరవేర్చుతుంటాడు. ఆత్మను బంధిస్తోన్న ఈ పాప దాస్య శృంఖలాల్ని విరగగొట్టడానికి క్రీస్తు వచ్చాడు. “కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు.” “క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమమునుండి” మనలను “విడిపించెను” రోమా 8:2. DATel 518.3
విమోచన విషయంలో ఒత్తిడి లేదు. ఇందులో బాహ్యశక్తి వినియోగం లేదు. తాను ఎవర్ని సేవిస్తాడో ఎంపిక చేసుకోడానికి దేవుని ఆత్మ ప్రభావం కింద మానవుడికి స్వేచ్ఛ ఉన్నది. ఒక ఆత్మ తన్నుతాను దేవునికి సమర్పించుకున్నప్పుడు చోటుచేసుకునే మార్పులో సమున్నత స్వేచ్చా భావం ఉంది. ఆత్మ తనంతట తానే పాపాన్ని బహిష్కరించాలి. నిజమే సాతాను నియంత్రణ నుంచి మనంతట మనం స్వతంత్రులం కాలేం. కాని పాపం నుంచి స్వతంత్రులం కావాలని మనం కోరుకున్నప్పుడు మనకున్న అవసరంలో మనకులేని, మనకు అతీతమైన శక్తి కోసం మొర పెట్టుకున్నప్పుడు మన ఆత్మకు సంబంధించిన శక్తులు పరిశుద్ధాత్మ శక్తిని సంతరించుకుంటాయి. అంతట అవి దేవుని చిత్తాన్ని అనుసరించడానికి మన చిత్తం ఆదేశాలికి విధేయంగా వ్యవహరిస్తాయి. DATel 519.1
మానవుడు స్వతంత్రుడు కావడం ఒకే ఒక షరతుపై సాధ్యపడుతుంది. క్రీస్తుతో ఐక్యత సాధించడమే ఆ షరతు. “సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును;” కీస్తే సత్యం. మనసును నిర్వీర్యం చేసి ఆత్మ స్వాతంత్ర్యాన్ని నాశనం చెయ్యడం ద్వారా మాత్రమే పాపం విజయం సాధించగలుగుతుంది. దేవునికి లోబడి ఉండడమంటే ఒక వ్యక్తి తిరిగి తన సొంతమవ్వడం. తన నిజమైన మహిమను గౌరవాన్ని మానవుడు తిరిగి పొందడం. మనం లోబడి జీవించాల్సిన దైవధర్మశాస్త్రం “స్వాతంత్ర్యము ఇచ్చునియమము.” యాకోబు 2:12; DATel 519.2
పరిసయ్యులు తాము అబ్రహాము సంతానం అని అతిశయంగా చెప్పుకున్నారు. తాము అబ్రహాము క్రియులు చేయడం ద్వారానే ఆ మాటను ధ్రువర్చుకోవలసి ఉంటుందని యేసు వారికి విశదం చేశాడు. యధార్ధమైన అబ్రహాము పిల్లలు అబ్రహాము మల్లే దేవునికి విధేయులై నివసిస్తారు. తనకు దేవుడిచ్చిన సత్యాన్ని ప్రకలిస్తున్న వాడిని చంపడానికి ప్రయత్నించరు. క్రీస్తుకి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతోన్న రబ్బీలు అబ్రహాము క్రియల్ని చెయ్యడం లేదు. కేవలం అబ్రహాము వంశావళికి చెందడంలో విలువలేదు. అదే స్వభావాన్ని కలిగి ఉండి అవేకార్యాలు చేయడంలో ప్రదర్శితమయ్యే ఆధ్యాత్మిక అనుబంధం లేకుండా వారు అబ్రహాము సంతానం కాలేరు. DATel 519.3
క్రైస్తవ లోకాన్ని దీర్ఘకాలంగా ఆందోళనకు గురిచేస్తోన్న ఒక సమస్యపై అనగా అపొస్తలుల వారసత్వ సమస్యపై కూడా ఈ నియమం ప్రభావం బలంగా పడుతోంది. అబ్రహాము వంశం నుంచి రావడం పేరును బట్టి వంశావళిని బట్టి కాక ప్రవర్తనలో పోలికను బట్టి నిరూపితమయ్యింది. అలాగే అపొస్తలుల వారసత్వం మతాధికార ప్రసారం మిద కాక ఆధ్యాత్మిక బాంధవ్యం మీద ఆనుకొని ఉంటుంది. అపొస్తలుల సేవా స్ఫూర్తితో క్రియాశీలమయ్యే జీవితం, వారు బోధించిన సత్యంపట్ల నమ్మకం, దాని ప్రబోధన- ఇదే అపోస్తలుల వారసత్యానికి నిజమైన నిదర్శనం. ప్రారంభసువార్త బోధకుల వారసులుగా మనుషుల్ని తీర్చిదిద్దే నియమం ఇదే. DATel 519.4
యూదులు అబ్రహాము పిల్లలవడాన్ని యేసు అంగీకరించలేదు. ఆయనిలా అన్నాడు, “మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు.” వారు ఎగతాళిగా ఇలా సమాధానమిచ్చారు, ” మేము వ్యభిచారము వలన పుట్టన వారముకాము. దేవుడొక్కడే మాతండ్రి” ఇవి ఆయన జన్మసంబంధిత పరిస్థితుల్ని గూర్చి ఎత్తిపొడుపు మాటలు. ఆయన్ని విశ్వసించడం మొదలు పెట్టిన వారి ముందు ఆయన్ని కించపర్చడానికి ఉద్దేశించిన పుల్లవిరుపు మాటలు. ఈ అసభ్య ప్రస్తావనని యేసు పట్టించుకోలేదు. కాని ఇలా అన్నాడు, “దేవుడు నా తండ్రియైన యెడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని నుండి బయలుదేరి వచ్చియున్నాను.” DATel 520.1
వారి క్రియలు అబద్ధికుడు హంతకుడు అయిన వాడితో వారి బాంధవ్యాన్ని చాటి చెప్పాయి. యేసన్నాడు, “మీరు నా తండ్రియగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు • నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై యుండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు.... నేను సత్యమునే చెప్పుచున్నాను. గనుక మీరు నన్ను నమ్మరు.” యోహా 8:44,45. యేసు సత్యాన్ని ఘంటాకంఠంగా చెప్పినందుకు యూదు నేతలు ఆయన్ని స్వీకరించలేదు. స్వనీతిపరులైన ఈ మనుషుల్ని కోపోద్రిక్తుల్ని చేసింది సత్యమే. సత్యం తప్పు తాలూకు భ్రాంతిని బట్టబయలు చేసింది. వారి బోధనను క్రియల్ని ఖండించింది. అది వారికి నచ్చలేదు. తప్పు చేశామని ఒప్పుకునే కన్నా సత్యానికి కళ్లుమూసుకోడానికి వారు సిద్ధమయ్యారు. వారు సత్యాన్ని ప్రేమించలేదు. అది సత్యమైనా వారు దాన్ని అభిలషించలేదు. DATel 520.2
“నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న యెడల మీరెండుకు నన్ను నమ్మరు?” మూడు సంవత్సరాలు దినదినం తన విరోధులు క్రీస్తుని వెంబడించి ఆయన ప్రవర్తనలో ఏదో మచ్చను కనుక్కోడానికి ప్రయత్నించారు. సాతాను అతడి దుష్ట పరివారం ఆయన్ని పరాజయం పాలు చెయ్యడానికి ఎంతగానో శ్రమించారు. అయినా వారు ఆయనలో ఎలాంటి పొరపాటు కనుక్కోలేకపోయారు. దయ్యాలు సైతం ” నీవు దేవుని పరిశుద్ధుడవు” అని ఒప్పుకోవలసి వచ్చింది. మార్కు 1:24. పరలోకం దృష్టిలోను, నీతిమంతుల లోకాల దృష్టిలోను, పాపమానవుల దృష్టిలోను యేసు ధర్మశాస్త్రాన్ననుసరించి నివసించాడు. ఇతరుల పెదవుల నుంచి దేవదూషణగా పరిగణించబడే మాటలు - ” ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును” అన్న మాటలు ఆయన పలికాడు. వాటిని ఎవరూ కాదనలేకపోయారు. DATel 521.1
క్రీస్తులో ఏ పాపాన్నీ తాము కనుక్కోలేకపోయినప్పటికీ యూదులు ఆయన్ని అంగీకరించకపోవడం వారికి దేవునితో ఎలాంటి సంబంధం లేదని నిరూపించింది. తన కుమారుని వర్తమానంలో వారు ఆయన స్వరాన్ని గుర్తించలేదు. క్రీస్తుపై తీర్పు వెలిబుచ్చుతున్నామని వారు భావించారు కాని ఆయన్ని విసర్జించడం ద్వారా వారు తమ పై తామే తీర్పును ప్రకటించుకుంటున్నారు. “దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. వారు దేవుని సంబంధులు కారుగనుకనే మీరు వినరు” అని యేసు చెప్పాడు. DATel 521.2
ఇది నిత్యమూ వాస్తవమైన పాఠం. దైవవాక్యంలో ఏదో తప్పు కనుగొని తద్వారా తాము స్వతంత్ర భావాలు కలవారిమని గొప్ప ప్రతిభ కలవారమని చూపించుకోడానికి ప్రయత్నిస్తూ దైవవాక్యం గురించి కీచులాడడానికి దైవవాక్యాన్ని విమర్శించడానికి ఉబలాట పడేవారెందరో ఉన్నారు. తాము బైబిలు విషయంలో తీర్పు చెబుతున్నామనుకుంటారు గాని వాస్తవంలో వారు తమపై తామే తీర్పు వెలువరించుకుంటోన్నారు. పరలోకంలో ప్రారంభమై నిత్యకాలం కొనసాగే సత్యాల్ని అభినందించే సామర్థ్యం తమకు లేదని వారు వెల్లడించుకుంటారు. పర్వతంలా బ్రహ్మాండమైన దేవుని నీతి సమక్షంలో వారి ఆత్మకు భయం కలుగదు. వారు పుల్లలు ఎండుగడ్డి వెదక్కుంటూ తీరిక లేకుండా ఉంటారు. ఈ పనుల్లో వారు తమ లౌకిక స్వభావాన్ని దేవున్ని అభినందించే సామర్యాన్ని కోల్పోతోన్న హృదయాన్ని కనపర్చుకుంటారు. దైవ స్పర్శకు ప్రతిస్పందించే హృదయం గల వ్యక్తి దేవుని గూర్చిన జ్ఞానాన్ని వృద్ధి పర్చుకోడానికి తోడ్పడేదాన్ని, ప్రవర్తనను శుద్ధి పర్చి సమున్నత పర్చేదాన్ని అన్వేషిస్తాడు. ప్రకాశవంతమైన సూర్య కిరణాలు తనపై పడి అందమైన రంగులు అద్దేందుకోసం పుష్పం సూర్యుడి తట్టు ఎలా, తిరుగుతుందో అలాగే క్రీస్తు ప్రవర్తనలోని కృపలతో ప్రవర్తనను అలంకరించుకునేందు కోసం ఆత్మ నీతి సూర్యుని తట్టు తిరుగుతుంది. DATel 521.3
యూదుల పరిస్థితికి అబ్రహాము స్థితికి మధ్యగల తీవ్ర విభిన్నతను వివరించడాన్ని యేసు కొనసాగించాడు. ” మీ తండ్రియైన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను.” DATel 522.1
వాగ్దాత్త రక్షకుణ్ని చూడాలని అబ్రహాము ఎంతో ఆశించాడు. తన మరణానికి ముందు మెస్సీయాను చూడాలని చిత్త శుద్ధితో ప్రార్ధించాడు. అతడు క్రీస్తుని చూశాడు. అతనికి మానవాతీతమైన వెలుగును దేవుడిచ్చాడు. అతడు క్రీస్తు పరిశుద్ధ ప్రవర్తనను గుర్తించాడు. ఆయన దినాన్ని చుశాడు, చూసి ఎంతో ఆనందిచాడు. పాపం నిమిత్తం దేవుని బలిదాన దృశ్యాన్ని అతనికి చూపించాడు దేవుడు. ఈ బలియాగాన్ని గూర్చిన సాదృశ్యం తనకే అనుభవమయ్యింది. “నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును.... దహన బలిగా.... సమర్పించుము” అన్నది అతనికి వచ్చిన ఆజ్ఞ. ఆది 22:2 వాగ్దానపుత్రుణ్ని బలిపీఠం మీద పడుకో పెట్టాడు. ఆ కుమారుడిపైనే అతని ఆశలన్నీ నిలిచాయి. కత్తి పైకెత్తి బలిపీఠం పక్క నిలబడి దేవుని ఆజ్ఞ మేరకు కుమారుణ్ని వధించడానికి సిద్ధమై ఉండగా పరలోకం నుంచి ఒక స్వరం ఇలా అనడం వినిపించింది, “ఆ చిన్న వాని మిద చెయ్యివేయకుము అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనబడుచున్నది.” ఆది 22:12. అబ్రహాము క్రీస్తు దినాన్ని చూడడానికీ, లోకం పట్ల దేవుని కున్న గొప్ప ప్రేమను గుర్తించడానికీ అబ్రహాముపై ఈ భయంకర వేదననున విధించడం జరిగింది. ఆ ప్రేమ ఎంత గొప్పదంటే మానవుణ్ని భ్రష్టస్థితి నుంచి లేపేందుకు మిక్కిలి హీనమైన మరణం మరణించడానికి దేవుడు తన ఏకైక కుమారుణ్ని అర్పించాడు. DATel 522.2
దేవుని నుంచి అబ్రహాము మిక్కిలి విలువైన పాఠం నేర్చుకున్నాడు. తన మరణానికి ముందు క్రీస్తుని చూడాలన్న కోరిక వ్యక్తం చేసిన తన ప్రార్ధన నెరవేరింది. అబ్రహాము క్రీస్తుని చూశాడు. మానవమాత్రుడు చూసి బతకగలిగినదంతా అతడు చూశాడు. పూర్తి సమర్పణ చేసుకోడం ద్వారా తనకు కలిగిన క్రీస్తు దర్శనాన్ని అతడు అవగాహన చేసుకోగలిగాడు. ఫాషుల్ని నిత్య నాశనం నుంచి రక్షించడానికి తన ఏకైక కుమారుణ్ని ఇవ్వడంలో దేవుడు మానవుడు చేయగలిగిన త్యాగం కన్నా సమున్నతము మహాద్భుతము అయిన త్యాగాన్ని చేస్తోన్నాడని అతనికి కనపర్చాడు. DATel 523.1
అబ్రహాము అనుభవం ఈ ప్రశ్నకు జవాబు నిచ్చింది. “ఏమి తీసికొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేలకొలరి పొట్టేళ్ళను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా ? నా పాప పరిహారమునకై నాగర్భఫలమును నేనిట్లునా?” మికా 6:6, 7. ” నాకుమారుడా దేవుడే దహనబలికి గొట్టిపిల్లను చూచుకొనును” అన్నమాటల్లోను (ఆది 22.8) ఇస్సాకు బదులు దేవుడు ఏర్పాటుచేసిన బలిలోను ఏ మానవుడూ తనకు తాను ప్రాయశ్చిత్తం చేసుకోడం సాధ్యపడదని వ్యక్తమయ్యింది. అన్యమత బలి అర్పణ వ్యవస్థ దేవునికి ఏ మాత్రం అంగీకారం కాదు. పాప పరిహారార్థ బలిగా తన కుమారుణ్ని గాని లేక తన కుమార్తెను గాని ఏ తండ్రి అర్పించడం దేవునికి అంగీకృతం కాదు. లోక పాపాన్ని దైవ కుమారుడు మాత్రమే మోయగలడు. DATel 523.2
రక్షకుని త్యాగపూరిత కర్తవ్యాన్ని అబ్రహాము తన బాధ ద్వారా చూడగలిగాడు. కాని అహంకారంతో నిండిన తమ హృదయానికి హితం కాని దాన్ని గ్రహించడానికి ఇశ్రాయేలు ప్రజలు ఇష్టపడలేదు. అబ్రహామును గురించి క్రీస్తు చెప్పిన మాటలు ఆ ప్రజలికి ఏమంత ప్రాధాన్యమైనవిగా తోచలేదు. పరిసయ్యులు మరింత రెచ్చిపోయి ఎగతాళి చెయ్యడానికి ఆ మాటలు ఉపకరించాయి. యేసు పిచ్చివాడని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెటకారంగా ఇలా స్పందించారు, “నీకింకను ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రహామును చూచితివా?” DATel 523.3
గాంభీర్యంగా హుందాగా యేసు ఇలా బదులు పలికాడు, “అబ్రహాము పుట్టకమునుపే నేను ఉన్నాని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” DATel 524.1
ఆ మహాసభ నిశ్శబ్దనుయ్యింది. నిత్యసాన్నిధ్యాన్ని సూచించేందుకు దేవుడు మోషేకి ఇచ్చిన దేవుని నామాన్ని ఈ సామాన్య గలిలయ బోధకుడు తన నామంగా చెప్పుకున్నాడు. తాను స్వయంభువునన్నాడు. “పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము..... ప్రత్యక్ష” మవుతూ వచ్చిన ఇశ్రాయేలుకు వాగ్దానం చేయబడ్డ విమోచకుణ్ని నేనేనన్నాడు. (మీకా 5:2) DATel 524.2
యాజకులు రబ్బీలు యేసు దేవ దూషకుడంటూ మళ్లీ విరుచుకుపడ్డారు. తాను దేవునితో ఉన్నవాడనని క్రితంలో చెప్పడం ఆయన ప్రాణం తియ్యడానికి వారిని రెచ్చగొట్టింది. కొన్ని మాసాల తర్వాత వారిలా ప్రకటించారు, “నీవు మనుషుడవైయుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదు.” యెహా 10:33. ఆయన దేవుని కుమారుడు గనుక అలాగని ఆయన ఖండితంగా చెప్పుతున్నాడు. కనుక ఆయన్ని చంపడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. అనేకమంది ప్రజలు యాజకులు రబ్బీలతో ఏకమై ఆయన మీదికి విసరడానికి రాళ్లు తీసుకున్నారు, “కాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్లిపోయెను.” DATel 524.3
చీకటిలో వెలుగు ప్రకాశిస్తోంది. కాని “చీకటి దాన్ని అభినందించలేదు.” యోహా 1: 5,ఆర్.వి DATel 524.4
“ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్వవారా? అని ఆయనను అడుగగా యేసు - వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను.... ఇట్లు చెప్పి నేలమీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మిద ఆ బురద పూసి - నావు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్ధము. వాడు వెళ్లి కడుగుకొని చూపుగలవాడై వచ్చెను.” DATel 524.5
పాపానికి శిక్ష ఈ జీవితంలోనే కలుగుతుందని యూదులు సాధారణంగా విశ్వసించేవారు. ప్రతీ శ్రమ ఏదో అపరాధానికి శిక్షగా వారు పరిగణించేవారు. ఆ అపరాధం బాధితుడిదే కావచ్చు లేక అతడి తలిదండ్రులిదే కావచ్చు. శ్రమ అంతా దైవధర్మశాస్త్ర ఉల్లంఘన పర్యవసానమన్నది నిజమే. అయితే ఈ సత్యాన్ని వక్రీకరించడం జరిగింది. పాపానికీ దాని పర్యవసానాలికీ కర్త అయిన సాతాను వ్యాధి మరణం దేవుని వద్ద నుంచి వస్తున్నాయని వాటిని ఆయన పాపానికి శిక్షగా నిరంకుశంగా విధిస్తాడనీ నమ్మడానికి ప్రజల్ని నడిపిస్తోన్నాడు. కనుక గొప్ప విపత్తుకు లేక ఆపదకు గురి అయిన వ్యక్తి ఘోర పాపిగా పరిగణన పొందే అదనపు భారం మోయాల్సి ఉండేది. DATel 525.1
ఈ విధంగా యూదులు యేసుని తిరస్కరించడానికి మార్గం ఏర్పడింది. మన “వ్యసనములను” వహించిన ఆయన్ని యూదులు “వ్యాధి ననుభవించిన వాడుగా” పరిగణించారు. వారు ఆయనకి తమ ముఖాలు చాటేసుకున్నారు. యెష 53:4,3; DATel 525.2
దీన్ని నివారించడానికి దేవుడు ఒక పాఠాన్ని రూపొందించాడు. బాధ సాతాను వల్ల కలుగతోందని, దేవుడు తన కృపాబాహుళ్యం వల్ల దాన్ని రద్దుచేస్తాడని యోబు చరిత్ర విశదం చేస్తోంది. యోబు మిత్రలు ఏ పొరపాటుకు మందలింపు పొందారో యూదులు క్రీస్తును నిరాకరించడంలో అదే పొరపాటును పునరావృత్తం చేశారు. DATel 525.3
పాపానికి బాధకి మధ్య గల సంబంధం గురించి యూదుల నమ్మకమే క్రీస్తు శిష్యులకీ ఉంది. యేసు ఆ తప్పును సరిద్దినప్పటికీ మనుషుడి శ్రమలకి కారణాన్ని విశదం చెయ్యలేదు గాని దాని ఫలితమేంటో చెప్పాడు. దాని మూలాన దేవుని కార్యాలు వెల్లడవుతాయి. “నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును” అని చెప్పాడు. అప్పుడు ఆ గుడ్డివాడి కళ్లను మట్టితో పూసి సిలోయము కోనేటిలో కడుగుకోడానికి అతణ్ని పంపించాడు. ఆ మనుషుడికి దృష్టి వచ్చింది. తాను సాదారణంగా ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు ఈ రీతిగా క్రీస్తు తన శిష్యుల ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ఎవరు పాపం చేశారో ఎవరు చెయ్యలేదో అన్న సమస్యను చర్చించమని ఆయన తన శిష్యుల్ని కోరలేదు గాని ఆ గుడ్డి వాడికి చూపును పునరుద్ధరించడంలో దేవుని కృపను శక్తిని అవగాహన చేసుకోవాలని ఆయ కోరాడు. దినంలోగాని లేక ఆ గుడ్డివాడు తన కళ్లుకడుక్కోడానికి వెళ్లిన కోనేటిలో గాని స్వస్తత గూర్చే శక్తి లేదన్నది సుస్పష్టం ఆశక్తి క్రీస్తులో మాత్రమే ఉంది. DATel 525.4
ఆ స్వస్తత పరిసయ్యులికి ఆశ్చర్యం కలిగించింది. వారి ద్వేషం మరింత పెరిగింది. ఎందుకంటే ఆ అద్భుతకార్యం యేసు సబ్బాతునాడు చేశారు. DATel 526.1
ఆయువకుడి ఇరుగుపొరుగు వారు అతడు గుడ్డివాడై ఉన్నప్పుడు అతణ్ని ఎరిగినవారు “వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనువాడు కాడా?” అని ఆశ్చర్యపడ్డారు. అతడు అతడే అన్న నమ్మకం వారికింకా కలుగలేదు. ఎందుకంటే అతడికి చూపు వచ్చాక అతడి ముఖవర్చస్సు మారిపోయింది. అతడు చాలా తెలివిగా చెలాకీగా వేరే వ్యక్తిలా కనిపించాడు. ప్రజలు ఒకరినొకరు ప్రశ్నించుకోడం మొదలు పెట్టారు. “వీడే” అని కొందరు, “వీని పోలియున్న యొకడని” కొందరు అన్నారు. అయితే దృష్టి పొందిన ఆ వ్యక్తి “నేనే” అని చెప్పి ఆ సందేహాన్ని తీర్చాడు. అప్పుడతడు యేసుని గురించి ఆయన తనను ఎలా స్వస్తపర్చాడోదాన్ని గురించి వివరించాడు. వారు “ఆయన ఎక్కడని అడుగగా వాడు నేనెరుగననెను”. DATel 526.2
అప్పుడు వారు అతణ్ని ఓ పరిసయ్యుల మండలి ముందుకి తీసుకుని వచ్చారు. అక్కడ మళ్లీ నీవు ఎలా దృష్టిని పొందావని అతణ్ని ప్రశ్నించారు. “నా కన్నుల మిద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితినని వారితో చెప్పెను. కాగా పరిసయ్యులలో కొందరు - ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుటలేదు. గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి.” పరిసయ్యులు యేసుని పాపిగా కనపడేటట్లు చెయ్యాలనుకున్నారు. అందుకే ఆయన్ని మెస్సీయాగా గుర్తించలేదు. సబ్బాత్తును స్థాపించింది ఆయనేనని దాని ఆచరణ విధులు ఆయన బాగా ఎరిగిన వాడని ఆయనే ఆగుడ్డివాణ్ని స్వస్తపర్చాడని వారెరుగలేదు. సబ్బాతు ఆచరణలో నిష్ఠగా ఉన్నట్లు కనిపించారు. అయినా సబ్బాతు నాడు హత్య చెయ్యడానికి వ్యూహాలు పన్నుతోన్నారు. అయితే ఈ అద్భుతాన్ని గూర్చి విన్న వారిలో చాలామంది చలించి ఆ క్రియ చేసినవాడు సామాన్య మానవుడు కాడని బలంగా విశ్వసించారు. సబ్బాతును ఆచరించడంలేదు గనుక యేసు పాపి అన్న ఆరోపణకు జవాబుగా ప్రజలు “పాపియైన మనుష్యుడు ఈలాటి సూచకక్రియలేలాగు చేయగలడు?” అని ప్రశ్నించారు. DATel 526.3
రబ్బీలు మళ్లీ ఆ గుడ్డివాణ్ని “నీ కన్నులు తెరచినందుకు నీవతని గూర్చి యేమనుకొనుచున్నావని యడుగగా వాడు ఆయన ప్రవక్త అనెను.” అంతట అతడు పుట్టుకతోనే గుడ్డివాడై ఇప్పుడు చూపు పొందలేదని పరిసయ్యులు అన్నారు. అతడి తలితండ్రుల్ని పిలిపించి వారినిలా ప్రశ్నించారు, “గ్రుడ్డివాడై పుట్టెనని వారు చెప్పు నా కుమారుడు వీడేనా?” DATel 527.1
తాను గుడ్డివాడిగా ఉన్నానని తనకు చూపు కలిగిందని బాధితుడైన వ్యక్తే ప్రకటిస్తోన్నాడు. అయినా పరిసయ్యులు తాము తప్పుచేశామని ఒప్పుకునే కన్నా తమ జ్ఞానేంద్రియాల సాక్ష్యాన్నే తోసిపుచ్చడానికి తెగబడ్డారు. దురభిమానం అంత శక్తిమంతమైంది. పరిసయ్యులు నీతి అంత వికృతమైంది. DATel 527.2
బాధితుడి తలిదండ్రుల్ని భయభ్రాంతుల్ని చేయడమన్నదొక్కటే పరిసయ్యులికి మిగిలి ఉన్న ఆశాభావం. నిజాయితీ నటిస్తూ వారు ఇలా అన్నారు, ” ఇప్పుడు వీడెలాగు చూచుచున్నాడో యెరుగము.” అతడి తలిదండ్రులు ఆ విషయంపై రాజీకి భయపడ్డారు. ఎందుకంటే యేసును క్రీస్తుగా ఎవరు అంగీకరిస్తారో వారిని సమాజమందిరంలో నుంచి వెలి వేస్తామని ప్రకటించారు. అనగా వారిని సమాజంమందిరంలో నుంచి ముప్పయి రోజులు వెలివేస్తారు. ఈ కాలవధిలో వెలివేతకు గురి అయిన గృహంలో చిన్నపిల్లలికి సున్నతి జరగడం, మరణించిన ప్రియలకోసం దుఃఖించడం నిషిద్ధం. ఇలాంటి తీర్పు గొప్ప విపత్తుగా పరిగణించబడేది. దీని వల్ల పశ్చాత్తాపం కలుగకపోతే మరింత కఠినమైన శిక్షను విధించేవారు. తమ కుమారుడి విషయంలో జరిగిన మహాకార్యం ఆ తలిదండ్రుల్లో విశ్వాసం పుట్టించింది. అయినా వారిలా బదులు పలికారు, “వీడు మా కుమారుడనియు వాడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదుము. ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో యెరుగము; ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మేమెరుగము. వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి. తన సంగతి తానే చెప్పుకొనగలడు.” ఈరకంగా వారు తమ బాధ్యతను తమ కుమారుడి మీదికి నెట్టివేశారు. ఎందుకంటే వారు క్రీస్తుని ఒప్పకోడానికి భయపడ్డారు. DATel 527.3
పరిసయ్యుల అయోమయ స్థితి - వారు ప్రశ్నలు వేయడం, వారి దురభిమానం, వారు వాస్తవాల్ని నమ్మకపోవడం - జనసందోహాల కళ్లు మరీముఖ్యంగా సామాన్య ప్రజానీకం కళ్లు తెరిపిస్తోంది. యేసు తన సూచక క్రియల్ని తరచు బహిరంగ వీధిలో చేసేవాడు. ఆయన ఎల్లప్పుడూ బాధను నివారించే పరిచర్యను నిర్వహించాడు. పరిసయ్యులు అంటున్నట్లు దేవుడు అలాంటి అద్భుతకార్యాలు ఒక అబద్ద ప్రవక్త ద్వారా చేస్తాడా? అన్నదే అనేకుల మనసుల్లో తలెత్తుతున్న ప్రశ్న. ఈ అంశంపై వివాదం రెండు పక్కల ఆసక్తికరంగా తయారవుతోంది. DATel 528.1
యేసు చేస్తున్న పనికి తాము ప్రచారం చేస్తోన్నామని పరిసయ్యులు గుర్తించారు. ఆయన అద్భుతాలు చెయ్యడం లేదని చెప్పలేకపోయారు. ఆ గుడ్డివాడు సంతోసంతో తుళ్ళుతూ కృతజ్ఞతలు వ్యక్తం చేస్తోన్నాడు. ప్రకృతిలోని అద్భుతాల్ని సొగసుల్ని చూసి, భూమిద ఆకాశంలోను ఉన్న సౌందర్యాన్ని చూసి ఆనందపరవశుడయ్యాడు. అతడు తన అనుభవం గురించి స్వేచ్ఛగా వివరిస్తోన్నాడు. మాటల్తో అతడి నోరు నొక్కెయ్యడానికి వారు మళ్లీ ప్రయత్నించారు, “దేవుని మహిమ పరచుము; ఈ మనుష్యుడు పాపియని మేమెరుగుదము.” అంటే ఈయన నీకు చూపునిచ్చాడని మళ్లీ చెప్పవద్దు. ఈ కార్యం చేసింది దేవుడే అన్నారన్నమాట. DATel 528.2
గుడ్డివాడు ఇలా సమాధానమిచ్చాడు, “ఆయన పాపియోకాడో నేనురుగను; ఒకటి మాత్రము నేనెరుగుదును; నేను గ్రుడ్డివాడనైయుండి ఇప్పుడు చూచుచున్నాను.” DATel 528.3
“ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరిచెను?” అని వారు మళ్లీ ప్రశ్నించారు. తాను మోసానికి గురి అయ్యానని అతణ్ని నమ్మించేందుకు వారు ఎన్నో మాటలు చెప్పి అతణ్ని తికమక పెట్టాలనుకున్నారు. సాతాను అతడి దుష్ట దూతలు పరిసయ్యుల పక్షంగా తమ శక్తియుక్తుల్ని జత చేశారు. తమ మనసుల్లో బలపడున్న నమ్మకాన్ని వారు మొద్దుబార్చారు. దృష్టి పొందిన వ్యక్తిని బలపర్చడానికి దేవదూతలు కూడా భూమికి వచ్చారు. DATel 528.4
పుట్టుగుడ్డివాడు విద్యలేనివాడు అయిన ఇతడితో వ్యవహరించడం కన్న ఇంకెవరితో నైనా వ్యవహరించడం మేలని ఈ పరిసయ్యులు గ్రహించలేదు. తాము ఎవరితో వివాదానికి దిగుతున్నారో ఆయన్ని వారు ఎరుగరు. ఆ గుడ్డివాడి మనసును దివ్యకాంతి నింపింది. అతణ్ని నమ్మకుండా చెయ్యడానికి ఈ వేషధారులు ప్రయత్నించగా, దేవుడు అతడికి శక్తినిచ్చి తన బలమైన నిశితమైన సమాధానాల ద్వారా తాను తమ కూహకాలకు లొంగేవాణ్ని కానని చూపించడానికి సహాయం చేశాడు. అతడు వారికి లా సమాధానమిచ్చాడు, “ఇందాక మీతో చెప్పితిని గాని వారు వినకపోతిరి మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా యేమి?... అందుకు వారు నీవే వాని శిష్యడవు మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదము గాని వీడెక్కడ నుండి వచ్చెనో యెరుగమని చెప్పి వానిని దూషించిరి.” DATel 529.1
అతడు భరిస్తోన్న శ్రమ యేసు ప్రభువు గుర్తించాడు. అతడు క్రీస్తుకు సాక్షిగా ఉండేందుకు ప్రభువు అతడికి కృపను వాగ్దాటిని ఇచ్చాడు. పరిసయ్యులికి అతడి సమాధానం గాయపర్చే మాటలతోనిండి ప్రశ్నించేవారికి మందలింపుగా నిలిచింది. తాము లేఖనాలకు వివరణకర్తలమని దేశానికి మత విషయాల్లో మార్గదర్శకులమని చెప్పుకునే వారు. అయినా ఒకరు సూచకక్రియలు చేస్తుంటే ఆయన శక్తికి ప్రవర్తనకు అధికారానికి మూలమేంటో తెలుసుకోలేనంత అజ్ఞానులు వారు. “ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరెరుగక పోవుట ఆశ్యర్యమే; అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగ్రుడ్డివాని కన్నులెవరూ తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్దనుండి వచ్చినవాడు కానియెడల ఏమియు చేయనేరడు” అన్నాడతడు. DATel 529.2
ఇతడు తన విమర్శకుల్ని దీటుగా ఎదుర్కున్నాడు. అతడి పాదం తిరుగులేనిది. పరిసయ్యులు నిర్ఘాంతపోయారు. నిశ్శబ్దం పాటించారు. అతడి పదునైన పదజాలం వారిని మంత్ర ముద్దుల్ని చేసింది. కొద్ది క్షణాలు నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆగ్రహంతో నిండిన యాజకులు రబ్బీలు తమ అంగీల్ని దులుపుకున్నారు. అతణ్ని రాచుకున్నందువల్ల అవి మైలపడ్డవన్నట్లు తమకాళ్లకు అంటుకున్న ధూళి దులుపి, “నీవు కేవలము పాపివై పుట్టిన వాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా?” అని దూషించారు. అతణ్ని వెలివేశారు. DATel 529.3
అతడికి జరిగిన పరాభావం గురించి యేసు విన్నాడు. అనంతరం అతన్ని కనుగొని ఇలా అన్నాడు, “నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచుచున్నావా?” DATel 530.1
ఆ గుడ్డివాడు తనను స్వస్తపర్చిన ప్రభువు ముఖాన్ని చూడడం అదే మొదటిసారి. సభయందు తన తల్లి తండ్రి ఆందోళనతో నిండి ఉండడం చూశాడు. రబ్బీల కొరకొరచూపుల ముఖాలు చూశాడు. ఇప్పుడు అతడి కళ్లు ప్రేమానురాగాలు, శాంతి సమాధానాల్తో నిండిన యేసు ముఖాన్ని వీక్షిస్తోన్నాయి. అతడు ఇప్పటికే ఎంతో ప్రమాదాన్నెదుర్కొని ఆయన్ని దైవశక్తి గలవాడని గుర్తించి ప్రకటించాడు. ఇప్పుడు అతడికి ఇంకా ఉన్నత ప్రత్యక్షత కలిగింది. DATel 530.2
“నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా?” అన్న రక్షకుని ప్రశ్నకు గుడ్డి వాడు, ” ప్రభువా నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడు? అని ప్రశించడం ద్వారా జవాబిచ్చాడు. అందుకు యేసు “నీ వాయనను చూచుచున్నావు; నీతో మాటలాడుచున్నవాడు ఆయనే” అన్నాడు. అతడు రక్షకుని పాదాలపై పడి పూజించాడు. శారీరక దృష్టి మాత్రమే కాదు అతడి అవగాహన నేత్రాలు కూడా తెరుచుకున్నాయి. క్రీస్తు అతడి ఆత్మకు ప్రత్యక్షమయ్యాడు. అతడు ఆయన్ని దేవుడు పంపిన వానిగా స్వీకరించాడు. DATel 530.3
ఒక పరిసయ్యుల సమూహం దగ్గరలో సమావేశమయ్యింది. వారిని చూసినప్పుడు తన మాటలు పనుల ప్రభావం మధ్య నిత్యమూ ప్రదర్శితమయ్యే భేదం ఆయనకు జ్ఞాపకం వచ్చింది. ఆయనిలా అన్నాడు, ” చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేనీ లోకమునకు వచ్చితిని. ” గుడ్డి కళ్లు తెరవడానికి, చీకటిలో కూర్చున్న వారికి వెలుగునివ్వడానికి క్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. తన్నుతాను లోకానికి వెలుగుగా ప్రకటించుకున్నాడు. అప్పుడే ఆయన చేసిన అద్భుతకార్యం ఇందుకు నిదర్శనం. రక్షకుడు వచ్చినప్పుడు ఆయన్ని వీక్షించిన ప్రజలు ఆయన దివ్య సముఖం ప్రత్యక్షతను అంతకు ముందెవ్వరూ చూచి ఉండనంత సంపూర్ణంగా వీక్షించారు. దేవుని గూర్చిన జ్ఞానం మరింత సంపూర్ణంగా వెల్లడయ్యింది. అయితే ఈ వెల్లడిలోనే ప్రజలపై తీర్పు వెల్లడవుతుంది. వారి ప్రవర్తన పరీక్ష జరిగింది. వారి భవిష్యత్తు నిర్ధారితమయ్యింది. DATel 530.4
ఆ గుడ్డివాడికి శారీరక దృష్టిని ఆధ్యాత్మిక దృష్టిని ప్రసాదించిన దైవశక్తి ప్రదర్శన పరిసయ్యుల్ని మరింత గాఢమైన చీకటిలో విడిచి పెట్టింది. క్రీస్తు మాటలు తమకు వర్తిస్తాయన్న భావంతో ఆయన శ్రోతల్లో కొందరు “మేమును గ్రుడ్డివారమా?” అని ప్రశ్నించారు. “మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును” అని యేసు బదులు పలికాడు. మీరు సత్యాన్ని గ్రహించడాన్ని దేవుడు సాధ్యపరచకపోతే, మీ అజ్ఞానం వల్ల జరిగింది. పాపం కాదు. “చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు.” మేము చూడగలమని మీరు నమ్ముతూ చూపుపొందే ఒకే ఒక సాధనాన్ని నిరాకరిస్తోన్నారు. తమ అవసరాన్ని గుర్తించిన వారందరికీ ఇవ్వడానికి క్రీస్తు అనంత సహాయంతో వచ్చాడు. అయితే పరిసయ్యులు తమకు అవసరం ఉందని సహాయం అవసరమని ఒప్పుకోలేదు. క్రీస్తు వద్దకు రావడానికి వారు నిరాకరించారు. అందువలన వారు గుడ్డితనంలోనే మిగిలిపోయారు. తమ గుడ్డితనానికి వారే బాధ్యులు. “నా పాపము నిలిచియున్నది” అని యేసన్నాడు. DATel 531.1