యుగయుగాల ఆకాంక్ష

51/88

50—ఉచ్చుల నడుమ

పండుగ జరుగుతోన్న కాలంలో యేసు యెరూషలేములో ఉన్నంత కాలం గూఢచారులు ఆయన్ని వెంబడించారు. ఆయన్ని మౌనంగా ఉంచడానికి రోజుకు రోజు కొత్త పథకాలు తయారు చేస్తోన్నారు. ఆయన్ని దౌర్జన్యంగా ఆపాలని ఆలోచిస్తోన్నారు. అంతే కాదు. ఈ గలిలయ బోధకుణ్ని ప్రజల ముందు సిగ్గుపర్చాలని నిశ్చయించుకున్నారు. DATel 503.1

పండుగకు ఆయన హాజరైన మొదటి రోజు ప్రధానులు ఆయన వద్దకు వచ్చి తాను ఏ అధికారంతో బోధిస్తోన్నదీ చెప్పమని డిమాండు చేశారు. ప్రజల దృష్టిని ఆయనపై నుంచి మళ్లించి, బోధించడానికి ఆయనకున్న అధికారానికి వారి గమనాన్ని మళ్లించి, తద్వారా తమ ప్రాధ్యాన్యాన్ని అధికారాన్ని చాటుకోవాలని వారు అభిలషించారు. DATel 503.2

“నేను చేయు బోధ నాదికాదు; నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయనిశ్చయించుకొనిన యెడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధించున్నానో తెలిసికొనును” అన్నాడు యేసు. యోహాను 7:16, 17. ఈ అపహాసకుల ప్రశ్నకు యేసు ఆ పంథాలోనే జవాబివ్వకుండా రక్షణకు అవసరమైన సత్యంతో వివరణాత్మకంగా జవాబిచ్చాడు. సత్యాన్ని గ్రహించి అభినందించడం మనసు మీదకన్నా హృదయం మిద ఎక్కువ ఆధారపడి ఉంటుందని చెప్పాడు. సత్యాన్ని ఆత్మలోకి స్వీకరించాలి. అది చిత్తం నివాళిని కోరుతుంది. సత్యాన్ని వివేకానికి మాత్రమే సమర్పిస్తే దాన్ని స్వీకరించడంలో అహంకారం ఆటంకం కాబోదు. అయితే హృదయంలో కృపచేసే పని ద్వారా దాన్ని పొందాల్సి ఉన్నాం. దేవుని ఆత్మ బయలుపర్చే ప్రతీ పాపాన్ని విడిచి పెట్టడం పైనే దాని స్వీకరణ ఆధారపడి ఉంటుంది. సత్యాన్ని గూర్చిన జ్ఞానం సంపాదించడానికి ఎన్ని వసతులున్నా సత్యాన్ని అంగీకరించడానికి హృదయం తెరచుకుని ఉండకపోతే దాని సూత్రాలికి విరుద్ధంగా ఉన్న అలవాట్లు అభ్యాసాల్ని విసర్జించకపోతే వాటివల్ల ఒనగూడే మేలు ఏమి ఉండదు. ఆయన చిత్తమేంటో తెలుసుకోవాలని దాని ప్రకారం నడుచుకోవాలనే కోరిక కలిగి ఈ విధంగా దేవునికి తమ్ముని తాము అంకితం చేసుకునే వారికి సత్యం తమ రక్షణార్ధమైన దేవుని శక్తిగా వెల్లడవుతుంది. వారు ఎవరు దేవుని తరపున మాట్లాడున్నాడో ఎవరు తనంతట తానే మాట్లాడున్నాడో తెలులసుకోగలుగుతారు. పరిసయ్యులు తమ చిత్రాన్ని దేవునికి అంకితం చేసుకోలేదు. వారు సత్యాన్ని తెలుసుకోవాలని అన్వేషించడంలేదు. దాన్ని తెలుసుకోకుండా ఉండేందుకేదో సాకును కనుగోడానికి ప్రయత్నిస్తోన్నారు. వారు తన బోధను అవగాహన చేసుకోకపోవడానికి కారణం ఇదేనని వారికి క్రీస్తు చెప్పాడు. DATel 503.3

నిజమైన బోధకుడెవరో మోసగాడెవరో గుర్తించడానికి ఇప్పుడు ఆయన ఓ పరీక్ష ఇచ్చాడు. “తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు ఆయన యందు ఏ దుర్నీతీయు లేదు.” యోహాను7:18. స్వీయ మహిమను వెదకేవాడు తనంతట తానే మాట్లాడాడు. స్వార్ధస్వభావం దాని మూలాన్ని చెప్పకనే చెబుతుంది. అయితే క్రీస్తు దేవుని మహిమను వెదకుతోన్నాడు. ఆయన దేవుని మాటలు మాట్లాడాడు. సత్యాన్ని బోధించడానికి ఆయనకున్న అధికారానికి ఇదే నిదర్శనం. తమ హృదయాల్ని చదివినట్టు కనపర్చడం ద్వారా యేసు రబ్బీలకి తన దేవత్వానికి నిదర్శనం ఇచ్చాడు. బేతెస్ధ స్వస్తత నాటినుంచి వారు ఆయన్ని మట్టుపెట్టడానికి కుట్రచేస్తోన్నారు. ఈ రకంగా వారు తాము కాపాడున్నట్టు చెప్పుకొంటున్న ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తోన్నారు. “మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆధర్మశాస్త్రమును గైకొనడు; మీరెందుకు నన్ను చంపజూచుచున్నారు?” అని వారిని నిగ్గదీశాడు. DATel 504.1

ఈ మాటలు మెరుపువంటి వెలుగులా ప్రకాశించి తాము పడి నాశనం కావడానికి సిద్ధంగా ఉన్న కూపాన్ని ఆ రబ్బీలికి ప్రదర్శించాయి. కాసేపు వారు భయంతో వణికారు. తాము అనంత శక్తితో తలపడున్నామని వారు గుర్తించారు. అయినా ఆ హెచ్చరికను వారు పట్టించుకోలేదు. ప్రజలపై తమ పట్టును కొనసాగించేందుకు వారి కుతంత్రాలు కుట్రలు గోప్యంగా సాగాలి. యేసు సంధించిన ప్రశ్నను దాటవేస్తూ “నీవు దయ్యము పట్టిన వాడవు ఎవడు నిన్ను చంపజూచుచున్నాడు?” అన్నారు. యేసు చేస్తోన్న అద్భతాలు దురాత్మ ప్రేరణవల్ల జరుగుతున్న కార్యాలని సూచించారు. DATel 505.1

ఈ నిందారోపణను క్రీస్తు పట్టించుకోలేదు. బేతెస్ధలో తాను నిర్వహించిన స్వస్తత సబ్బాతాచరణకు అనుగుణంగానే ఉన్నదని, ధర్మశాస్త్రం పై యూదులు ఇస్తోన్న భాష్యంతో ఇది ఏకీభవిస్తోందని ఆయన చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు. “మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు.” ధర్మశాస్త్రం ప్రకారం ప్రతీ మగ శిశువుకి ఎనిమిదోనాడు సున్నతి చేయాలి. ఆ దినం సబ్బాతు రోజున వచ్చినా దాన్ని ఆ రోజున నిర్వహించాలి. అలాగైనప్పుడు “విశ్రాంతి దినమున ఒక మనుష్యుని సంపూర్ణ స్వస్థతగల వానిగా” చేయడం ధర్మశాస్త్ర స్ఫూర్తికి మరెంతో అనుగుణంగా ఉండాలి గదా? “వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి” అని వారిని హెచ్చరించాడు. DATel 505.2

ప్రధానులు నిరుత్తరులయ్యారు. “వారు చంపవెదకువాడు ఈయనే కాడా? ఇదిగో ఆయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు; ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలసికొని యుందురా?” అని అనేక మంది ప్రజలు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. DATel 505.3

యేసు శ్రోతల్లో పెక్కుమంది. యెరూషలేము నివాసులు. యేసుకి వ్యతిరేకంగా అధికారులు చేస్తోన్న కుట్రలు తెలుసిన వారు. వారు యేసుకి ఆకర్షితులయ్యారు. ఆయన దేవుని కుమారుడని వారు బలంగా నమ్మారు. అయితే వారిలో సందేహం పుట్టించడానికి సాతాను సిద్ధమయ్యాడు. మెస్సీయాను గూర్చి ఆయన రాకను గూర్చి తమకున్న తప్పుడు అభిప్రాయాలు సాతాను కృషికి మార్గం సుగమం చేశాయి. క్రీస్తు బెల్లెహేములో జన్మిస్తాడని కాని కొంతకాలం తర్వాత ఆయన మాయమవుతాడని ఆయన మళ్లీ కనిపించినప్పుడు ఎక్కడ నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదని ప్రజలు సామాన్యంగా నమ్మేవారు. మెస్సీయాకి మానవత్వంతో ఎలాంటి స్వాభావిక సంబంధబాంధవ్యాలూ ఉండవని నమ్మినవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. మెస్సీయా మహిమను గురించి ప్రజల్లో ఉన్న ఉన్నతాభిప్రాయానికి నజరేయుడైన యేసు దీటుగా లేడు గనుక అనేకులు ” ఈయన ఎక్కడివాడో యెరుగుదుము క్రీస్తు వచ్చునప్పుడు ఆయన యెక్కడివాడో ఎవడును ఎరుగడు” అన్న సామాన్యాభిప్రాయానికి చెవినిస్తోన్నారు. DATel 505.4

ప్రజలు ఇలా సందేహం విశ్వాసం మధ్య ఊగిసలాడుండగా యేసు వారి తలంపులు ఎరిగి ఇలా సమాధానం ఇచ్చాడు, “మీరు నన్నెరుగుదురు; నేనెక్కడివాడనో యెరుగుదురు; నా యంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు ఆయనను మీరెరుగరు.” యేసు మూలం తమకు తెలుసునని వారు భావించారు. కాని ఆ విషయంలో వారు అజ్ఞానులు. వారు దేవుని చిత్తాన్ననుసరించి నివసించి ఉంటే ఆయన తన కుమారుణ్ని వారికి ప్రత్యక్షపర్చినప్పుడు వారూ ఆయన కుమారుణ్ని ఎరిగి ఉండేవారు. DATel 506.1

శ్రోతలు క్రీస్తు మాటల్ని అవగాహన చేసుకున్నారు. అనేక నెలల క్రితం సన్ హెడ్రిన్ సభలో తాను దేవుని కుమారుణ్నని చేసిన ప్రకటనలోని మాటల్నే ఆయన పునరుద్ఘాటించాడు. అధికారులు అప్పుడు ఆయన్ని చంపజూసినట్లు ఇప్పుడూ ఆయన్ని పట్టుకోడానికి ప్రయత్నంచారు. కాని ఓ అగోచరమైన శక్తి అడ్డుకొంది. వారి ఆగ్రహానికి హద్దులు నియమించింది. ఇంతవరకే ఇక ముందుకి రావడానికి లేదని శాసించింది. DATel 506.2

అనేకమంది ఆయన్ని విశ్వసించారు. వారు “క్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసిన వాటి కంటే ఎక్కువైన సూచక క్రియలు చేయునా?” అని అన్నారు. జరుగుతున్నదంతా జాగ్రత్తగా పరిశీలిస్తోన్న పరిసయ్యులు నాయకులు ప్రజలలో పెల్లుబుకుతోన్న సానుభూతిని చూశారు. ప్రధానయాజకుల వద్దకు హుటాహుటీగా వెళ్లి క్రీస్తును బంధించడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన్ని బంధించడానికి భయపడారు. వారి ఉద్దేశాన్ని తాను చదవ గలినట్లు యేసు వారికి కనపర్చుకున్నాడు. ” ఇంక కొంత కాలము నేను మీతో కూడ సుందును తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్లుదును” అన్నాడు. వారి ఎగతాళికి ద్వేషానికి అతీతంగా త్వలోనే ఆశ్రయం పొందనున్నాడు. మళ్లీ దూత గణాల పూజలందుకోడానికి తండ్రి వద్దకు వెళ్లనున్నాడు. అక్కడికి తన హంతకులు ఎన్నడూ రాలేరు. DATel 506.3

ఎగతాళిగా రబ్బీలు ఇలా అన్నారు, ” మనము ఆయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోవుచున్నాడు? గ్రీసు దేశస్థులలో చెదరి పోయిన వారి యొద్దకు వెళ్లి గ్రీసు దేశస్తులకు బోధించునా?” తమ ఎగతాళి మాటల్లో తాము క్రీస్తు కర్తవ్యాన్ని వర్ణిస్తోన్నామని ఈ అపహాసకులు భావించలేదు. అవిధేయులికి వ్యతిరేకులికి దినమంతా ఆయన తన చెయ్యి చాపాడు కాని తనను ఎరుగని వారు ఆయన్ని అంగీకరిస్తారు. తనను వెదకని వారిమధ్య ఆయన ప్రత్యక్షమవుతాడు. రోమా 10:20,21; DATel 507.1

యేసు దేవుని కుమారుడని నమ్మిన వారిలో అనేకులు యాజకులు రబ్బీల తప్పుడు బోదలవల్ల అపమార్గం పట్టారు. మెస్సీయా “సీయోను కొండమీదను యెరూషలేములోను రాజగును” “సముద్రమునుండి సముద్రము వరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును” అన్న ప్రవచనాల్ని ఈ బోధకులు గొప్ప శక్తితో వల్లించారు. (యెషయా 24:23; కీర్త 72:8) ఇక్కడ సూచించిన మహిమా ప్రభావాలికి యేసు దీన స్వరూపానికి మధ్య ఉన్న పోలికలు తేడాల్ని గురించి అవమానకరంగా మాట్లాడారు. తమ దుర్బోధకు అనుగుణంగా ఉండేటట్లు ప్రవచన వాక్యాల్ని వక్రీకరించారు. ప్రజలు తమకుతామే దైవవాక్యాన్ని పఠించి ఉంటే వారు తప్పుతోవ పట్టేవారు కాదు. క్రీస్తు ఏ పరిచర్య చేశాడో ఆ సేవనే చేయాల్సి ఉన్నాడని యెషయా అరవయ్యెకటో అధ్యాయం చెబుతోంది. ఏభైమూడో అధ్యాయం ఆయన విసర్జనను గురించి లోకంలో ఆయన శ్రమల్ని గురించి చెబుతోంది. ఏభై తొమ్మిదో అధ్యాయం యాజకులు రబ్బీల ప్రవర్తనను వర్ణిస్తోంది. DATel 507.2

తమ అవిశ్వాసాన్ని విడిచి పెట్టాల్సిందిగా మనుషుల్ని దేవుడు ఒత్తిడి చెయ్యడు. వారి ముందు వెలుగు చీకటి సత్యం అబద్దం ఉంటాయి. ఏది ఎంపిక చేసుకుంటారో నిర్ణయించుకోవలసింది వారే. మంచి చెడుల మధ్య తేడాని గుర్తించే శక్తి మానవుడి మనసుకు ఉంది. మనుషులు భావోద్రేకాన్ని బట్టి కాక లేఖనంతో పోల్చుకుంటూ బలమైన నిదర్శనాన్ని జాగ్రత్తగా పరిశీలించి తీర్మానం చేసుకోవాలని దేవుడు సంకల్పించాడు. యూదులు తమ పూర్వదురభిప్రాయాల్ని పక్కన పెట్టి, యేసు జీవితానికి సంబంధించిన వాస్తవాల్ని లిఖిత ప్రవచనవాక్యాల్తో పోల్చి పరిశీలించి ఉంటే ఈ దీన గలిలయుడి జీవితంలోను, పరిచర్యలోను ప్రవచనాల అన్యయాన్ని నెరవేర్పుని గుర్తించేవారు. DATel 507.3

యూదులు మోసపోయినట్లు నేడు అనేకులు మోసపోతోన్నారు. మత ప్రబోధకులు తమ సొంత అవగాహన సంప్రదాయాల ప్రకారం బైబిలుని అద్యయనం చేస్తోన్నారు. సత్యం ఏంటో తెలుసుకోడానికి ప్రజలు బైబిలుని సొంతంగా పరిశోధించరు. నాయకుల తీర్మానాన్ని అంగీకరించి తమ ఆత్మల్ని వారికి అప్పగిస్తోన్నారు. వాక్యకాంతిని విస్తరింపజెయ్యడానికి దేవుడు తన వాక్యబోధను వాక్యోపదేశాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ప్రతీ వ్యక్తి బోధనని చేయ నిశ్చయించుకొనిన యెడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా యంతట నేనే బోధించుచున్నానో వాడు తెలిసికొనవలెను.” యోహాను7:17; DATel 508.1

పండుగ చివరి రోజున యేసుని బంధించడానికి యాజకులు ప్రధానులు పంపిన అధికారులు ఆయన్ని బంధించకుండా వచ్చారు. “ఎందుకు మీరాయనను తీసికొని రాలేదు?” అని వారిని యాజకులు ప్రధానులు ప్రశ్నించారు. ” ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదు” అని వారు సమాధానమిచ్చారు. DATel 508.2

వారు పాషాణ హృదయులైనా ఆయన మాటలు వారిని కరిగించాయి. ఆయన ఆలయ ఆవరణలో మాట్లాడున్నప్పుడు తనను పట్టి ఇచ్చేమాట ఏదైనా దొరుకుతుందేమోనని వారు ఆయనకు సమీపంగా ఉంటు ఉన్నారు. అయితే వారు ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు తాము వచ్చిన పనిని మర్చిపోయి దర్శనంలో ఉన్నవారిలా అలాగే నిలబడి చూస్తోన్నారు. క్రీస్తు వారి ఆత్మలకు తన్నుతాను ప్రత్యక్షపర్చుకున్నాడు. యాజకులు ప్రధానులు చూడడానికి సిద్ధంగా లేనిదాన్ని అనగా దేవత్వ మహిమతో నిండిన మానవత్వాన్ని వారు వీక్షించారు. ఈ తలంపులో ఆయన పలికిన మాటలతో వారి హృదయాలు ఎంతగా నిండిఉన్నాయంటే “ఎందుకు మారాయనను తీసికొని రాలేదు?”అన్న ప్రశ్నకు వారు ” ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదు” అని మాత్రమే బదులు పలకగలిగారు. DATel 508.3

మొదటి సారిగా క్రీస్తు సముఖంలోకి వచ్చినప్పుడు యాజకులు ప్రధానులు కూడా వీరిలాంటి అనుభూతిని పొందారు. వారి హృదయాలు తీవ్రంగా చలించాయి. “ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడ లేదు” అన్న భావన వారికి కలిగింది. అయితే వారు పరిశుద్ధాత్మ స్వరం వినిపించకుండా చెవులు మూసుకున్నారు. ఈ గలిలయుడు చట్ట సాధనాల్ని సయితం ప్రభావితం చేస్తోన్నాడని గ్రహించి కోపంగా ఇలా కేకలు వేశారు, “మీరు కూడా మోసపోతిరా? అధికారులలోగాని పరిసయ్యులలో గాని యెవడైనను ఆయన యందు విశ్వాసముంచెనా? అయితే ధర్మశాస్త్ర మెరుగని యీ జనసముహము శాపగ్రస్తమైనది.” DATel 509.1

సత్యాన్ని గూర్చిన వర్తమానాన్ని ప్రకటించగా విన్నవారు “అది నిజమా?” అని అడగడం చాలా అరుదుగాని దాన్ని ఎవరు ప్రబోధిస్తున్నది పరిగణించవచ్చు. దాన్ని అంగీకరించేవారి సంఖ్యను బట్టి వేలాది ప్రజలు దాన్ని అంచానా వేసుకోవచ్చు. “విద్యావంతుల్లోను మత నాయకుల్లోను ఎవరైనా దాన్ని నమ్మారా?” అన్న ప్రశ్న ఇంకా వినిపిస్తోంది. భక్తి జీవితం పట్ల ఆసక్తి చూపనివారు క్రీస్తు దినాల్లోలాగే నేడూ ఎక్కువమంది లేరు. ఆ రోజుల్లో లాగే నేడూ ప్రజలు నిత్యజీవ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేసి ఐహిక ప్రయోజనాలకోసం ప్రయాసపడొన్నారు. సత్యాన్ని అంగీకరించడానికి అధిక సంఖ్యాకులు సిద్ధంగా లేరన్నది లేదా లోకంలో ప్రఖ్యాతి గాంచిన వారు లేదా మతనాయకులు దాన్ని అంగీకరించడం లేదన్నది సత్యానికి ప్రతికూల వాదన కాదు. DATel 509.2

యాజకులు ప్రధానులు యేసుని బంధించడానికి మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయన్ని ఎక్కువ కాలం స్వేచ్ఛగా విడిచి పెత్తే ప్రజలు తమ నాయకుల్ని విడిచిపెట్టి ఆయనకు ఆకర్షితులు కావడం ఖాయమని ఆయన్ని వెంటనే హతమార్చడమే తమకు క్షేమమని యోచించారు. ఆ చర్చ రసకందాయంలో పడున్న తరుణలో దానికి హఠాత్తుగా అడ్డుకట్ట పడింది. నీకొదేము ” ఒక మనుష్యుని మాట వినకమునునపు వాడు చేసినది తెలిసికొనక మునుపును, మనధర్మశాస్త్రము అతనికి తీర్పుతీర్చునా?” అని ప్రశ్నించాడు. ఆ సభ నిశ్శబ్దమయ్యింది. నీకొదేము మాటలు వారి మనస్సాక్షిని మేలుకొల్పాయి. ఒక వ్యక్తి చెప్పేది వినకుండా అతణ్ని దోషిగా ప్రకిటించడం సాధ్యపడలేదు. న్యాయం మాట్లాడ్డానికి సాహసించిన నీకొదేము వంక కొరకొర చూస్తూ ఉన్న అహంకారులైన ఆ ప్రధానులు మౌనం వహించడానికి ఇదే కారణం కాదు. తమలో ఒకడు యేసు ప్రవర్తనను అభినందించి ఆయనకు మద్దతుగా మాట్లాడడం వారికి విభ్రాంతి కలిగించింది. అనంతరం నీకొదేముని ఉద్దేశించి వారు వ్యంగ్యంగా ఇలా అన్నారు, “నీవును గలిలయుడవా? విచారించిచూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడు.” DATel 509.3

ఈ వ్యతిరేకత ఆ సభ చర్యల్ని ఆపుచేసింది. సభలో విచారణ జరపకుండా యేసుని నేరస్తుడిగా ప్రకటించాలన్న తమ ఉద్దేశాన్ని ప్రధానులు అమలు పర్చలేకపోయారు. తాత్కాలికంగా పరాజయంపాలై “ఎవరి ఇంటికి వారు వెళ్లిరి. యేసు ఒలీవల కొండకు వెళ్లెను.” DATel 510.1

నగరం తాలూకు ఉద్రిక్త, గంధరగోళ వాతావరణం నుంచి, ఆతురతతో నిండిన జన సమూహాలునుంచి, విద్రోహక రబ్బీల నుంచి యేసు నిష్క్రమించి ప్రశాంతతకు నెలవైన ఒలీవల తోపులోకి వెళ్లాడు. అక్కడాయన దేవునితో ఏకాంతంగా ఉండవచ్చు. ఉదయాన్నే లేచి దేవాలయానికి తిరిగి వచ్చాడు. తన చుట్టూ ప్రజలు చేరగా ఆయన వారి మధ్య కూర్చుని వారికి బోధించాడు. DATel 510.2

కాసేపటికే ఆయన బోధకు అంతరాయం ఏర్పడింది. కొందరు పరిసయ్యులు శాస్త్రులు భయంతో వణకుతోన్న ఒక స్త్రీని ప్రభువు ముందుకి ఈడ్చుకు వచ్చి ఏడో ఆజ్ఞను అతిక్రమించిందంటూ ఆమె పై నేరం మోపారు. ఆమెను యేసు ముందుకి గెంటి మర్యాదనటిస్తూ ఆయనతో ఇలా అన్నారు, “అట్టి వారిని రాళ్లు రువ్విచంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావు? DATel 510.3

వారి దొంగ మర్యాద వెనుక ఆయన్నిహతమార్చడానికి చేసిన కుట్ర దాగి ఉంది. ఆయన్ని తప్పుపట్టి ఆ సాకుతో హతమార్చడానికి ఆ అవకాశాన్ని అదనుగా తీసుకున్నారు. ఆయన ఏ తీర్పు చెప్పినా ఆయన్ని తప్పుపట్టవచ్చునన్నది వారి ఎత్తుగడ. ఆమెను విడిచిపెడితే ఆ కారణంగా ఆయన మోషే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నట్లు ఆరోపించవచ్చని, ఆమె మరణదండనకు అర్హురాలని తీర్పు చెప్పితే ఆయన రోమా ప్రభుత్వానికి చెందిన అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడని నిందించవచ్చని వారు భావించారు. DATel 510.4

ఆ దృశ్యాన్ని యేసు కా పేపు చుశాడు - వణుకుతూ సిగ్గుతో నిలిచి ఉన్న బాధితురాలు, ముఖాలపై కాఠిన్యం తాండవిస్తోన్న, కాస్తంత మానవత్వం కనికరం లేని ఉన్నతాధికారులు, నిష్కలంకమైన, పవిత్రమైన ఆయన స్వభావం ఆ దృశ్యం నుంచి వెనకడుగు వేసింది. ఈ విషయాన్ని తన ముందుకి ఎందుకు తెచ్చారో ఆయనకు బాగా అర్థమయ్యింది. న్యాయపరిరక్షకులు కాబోతున్న ఈ పెద్ద మనుషులే యేసును ఇరకాటంలో పెట్టడానికిగాను ఈ బాధితురాలిని పాపంలోకి దింపారు. వారి ప్రశ్నవిన్నట్లు ఎలాంటి సూచన ఇవ్వకుండా ఆయన వంగి, తన దృష్టి నేలపై నిలిపి మట్టి లో రాయనారంభించాడు. DATel 511.1

ఆయన చేస్తున్న జాప్యాన్ని ప్రదర్శిస్తున్న ఉదాసీనతను ఇక తట్టుకోలేక ఆ నిందారోపకులు ఆయన్ని ప్రశ్నించడానికి ఆయన దగ్గరకు వచ్చారు. యేసు దృష్టిని అనుసరించి వారి దృష్టి ఆయన కాళ్ల వద్ద ఉన్న నేల మీద పడ్డప్పుడు వారి ముఖవైఖర్లు మారిపోయాయి. వారి రహస్యపాపాలు వారి ముందు రాసి ఉన్నాయి. ఇదంతా పరిశీలిస్తోన్న ప్రజలు వారి ముఖాలు అర్ధాంతరంగా మారిపోడం చూసి అంత ఆశ్చర్యాన్ని సిగ్గును కలిగిస్తోన్నదేంటో తెలుసుకోడానికి ముందుకి తోసుకువచ్చారు. DATel 511.2

చట్టంపట్ల తమకు మితినలేని గౌరవం ఉన్నదని చెప్పుకుంటున్నప్పటికీ ఈ రబ్బీలు ఆ స్త్రీపై నేరాలు మోపడంలో ఆ చట్టంలో షరతుల్ని నిర్లక్ష్యం చేస్తోన్నారు. వారు అందరినీ సమానంగా శిక్షించాలి. ఆమెపై నిందమోపుతున్న వారి చర్య పూర్తిగా చట్టవిరుద్ధం. యేసు వారి కళ్లను వారి వేలితోనే పొడిచాడు. ఆ కేసులో సాక్షి రాళ్లురువ్వడం ద్వారా శిక్షించడంలో మొట్టమొదటి రాయి విసరాలని చట్టం నిర్దేశిస్తోంది. ఇప్పుడు ఆయన పైకి లేచి దురాలోచనలు చేస్తోన్న పెద్దమనుషులు వంక చూస్తూ “మిలో పాపములేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును.” అన్నాడు. మళ్లీ వంగి నేలమీద రాయడం కొసాగించాడు. DATel 511.3

మోషే ధర్మశాస్త్రాన్ని ఆయన తోసిపుచ్చలేదు. రోమా అధికారాన్ని అతిక్రమించలేదు. నేరారోపకులు విఫలులయ్యారు. ఇప్పుడు తమ టక్కరి పరిశుద్ధత అనే వస్త్రం చినిగిపోగా వారు ఆ అనంత పరిశుద్ధుని సముఖంలో అపరాధులుగా నిలబడ్డారు. తమ అంతర్గత దుర్మార్గత ఆ జనసమూహం ముందు బట్టబయలవుతుందేమోనని వారు భయకంపితులయ్యారు. తలలు వంచుకుని నేల చూపు చూసుకుంటూ వారు ఒకరి తర్వాత ఒకరు జారుకున్నారు. ఆ బాధితురాలు, జాలిగొన్న రక్షకుడు మాత్రమే మిగిలిపోయారు. DATel 512.1

యేసు పైకిలేచి ఆ స్త్రీ వంక చుస్తూ ఇలా అన్నాడు, ” అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్షవిధింపలేదా? అని అడిగినప్పుడు ఆమె - లేదు ప్రభువా అనెను. అందుకు యేసు - నేనును నీకు శిక్షవిధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుము.” DATel 512.2

ఆ స్త్రీ భయంతో వణకుతూ యేసు ముందు నిలబడింది. “మిలో పాము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును” అన్న ఆయన మాటలు ఆమెకు మరణ తీర్పులా వినిపించాయి. ఆమె కళ్లెత్తి రక్షకుడి ముఖం చూడలేకపోయింది. నిశ్శబ్దంగా తన మరణం కోసం ఎదురుచుస్తోంది. తనపై నేరం మోపినవారు నిరుత్తరులై తికమక పడూ వెళ్లిపోడం చూసి ఆమె విస్మయం చెందింది. అంతట “నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుము” అన్న ప్రభువు మాటలు వింది. యేసు పాదాల మీదపడి కృతజ్ఞహృదయంలో వెక్కివెక్కి ఏడుస్తూ కన్నీటి ప్రవాహం మధ్య తన పాపాల్ని ఒప్పుకుంది. DATel 512.3

ఇది ఆమెకు ఓ నూతన జీవితానికి నాంది. పరిశుద్ధమైన ప్రశాంతమైన దైవ సేవకు అంకితమైన జీవితానికి ఆరంభం. పతనమైన ఈ ఆత్మను లేవదియ్యడంలో అతి భయంకర శారీరకవ్యాధిని స్వస్తపర్చడం కన్నా గొప్ప అద్భుతకార్యాన్ని యేసు చేశాడు. నిత్య నాశనాన్ని కలిగించే ఆధ్యాత్మిక వ్యాధిని స్వస్తపర్చాడు. మారుమనసు పొందిన ఈ స్త్రీ ఆయనకు నమ్మకమైన భక్తురాలయ్యింది. కృపాపూరితమైన ఆయన క్షమాపణకు త్యాగపూరిత ప్రేమతోను, భక్తితోను ఆమె ప్రతిస్పందించింది. DATel 512.4

ఈ స్త్రీని క్షమించి మంచి జీవితం జీవించడానికి ప్రోత్సహించడంలో యేసు ప్రవర్తన సౌందర్యం, పరిపూర్ణత, నీతితో నిండి ప్రకాశించింది. పాపాన్ని ఉపశమింపజెయ్యడంగాని లేక దాని దోషిత్వాన్ని తగ్గించడంగాని లేక ఖండించడంగాని చెయ్యక రక్షించడానికే ఆయన కృషి చేశాడు. ఈ స్త్రీని లోకం ద్వేషించింది. కాని క్రీస్తు ఆమెను ఓదార్చి ఆమెకు నిరీక్షణ నిచ్చాడు. పాపరహితుడు పాపి బలహీనత విషయంలో జాలిపడ్డాడు. ఆమెకు ఆభయ హస్తం చాపాడు. కపట భక్తిపరులైన పరిసయ్యులు నిందలు ఆరోపిస్తుండగా “నీవు వెళ్లి ఇక పాపము చేయకుము” అని యేసు అన్నాడు. DATel 513.1

తప్పులు చేసే వారిని వారించకుండా తమను అధోగతి మార్గాన విడిచి వారి వంక చూడకుండా వెళ్లిపోవడం క్రీస్తు అనుచరుడి లక్షణం కాదు. ఇతరుల్ని నిందించడంలోను, వారికి శిక్షపడేటట్లు చూడడంలోను చురుకుగా పనిచేసే వారు తరచుగా తాము ఎవర్ని నిందిస్తోన్నారో వారి కన్నా ఎక్కువ అపరాధులు. మనుషులు పాపాన్ని ప్రేమిస్తూ పాపిని ద్వేషిస్తారు. క్రీస్తు పాపాన్ని ద్వేషిస్తాడు పాపిని ప్రేమిస్తాడు. ఆయన్ని అనుసరించే వారందరూ ఈ స్వభావాన్నే కలిగి ఉంటారు. క్రైస్తవ ప్రేమ నిందించడానికి దూరంగా ఉంటుంది. మారిన మనసును గుర్తించడంలో, క్షమించడంలో, ప్రోత్సాహించడంలో, సంచారిని పరిశుద్ధ మార్గంలో నడిపంచడంలో ఆ . మార్గంలో అతడి పాదాల్ని నిలపడంలో ముందుంటుంది. DATel 513.2