అపొస్తలుల కార్యాలు

16/59

15—చెరసాలలో నుంచి విడుదల

“దాదాపు అదే కాలమందు హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా” పట్టుకొన్నాడు. అప్పటిలో యూదా ప్రభుత్వం రోమా చక్రవర్తి క్లాడియసు పాలన కింద హేరోదు అగ్రిప్ప చేతుల్లో ఉన్నది. హేరోదుకి గలిలయ ఉపపాలక హోదా కూడా ఉన్నది. హేరోదు యూదుమత భక్తుడు. యూదుమత ఆచారాన్ని అమలుపర్చండలో పట్టుదల గలవాడిగా కనిపించాడు. యూదుల అభిమానాన్ని సంపాదించి తన్మూలంగా తన పదవిని గౌరవ ప్రతిష్ఠల్ని భద్రపర్చు కోవాలన్న కోరికతో క్రీస్తు అనుచరుల ఇళ్లు, వస్తువులు దోచుకోడం ద్వారా, సంఘంలోని ప్రముఖుల్ని ఖైదులో వేయండం ద్వారా క్రీస్తు సంఘాన్ని హింసిస్తూ యూదుల్ని సంతోషపెట్టడానికి పూనుకొన్నాడు. యోహాను సహోదరుడు యాకోబును ఖైదులో వేసి కత్తితో నరికి చంపమని ఒక హంతకుణ్ణి పంపాడు. ఇంకొక హేరోదు యోహానుని శిరచ్ఛేదనం చేయించాడు. ఈ దుష్కార్యాలు యూదులకు సంతోషం కలిగిస్తున్నట్లు చూసి అతను పేతురును కూడా ఖైదులో వేశాడు. AATel 102.1

ఈ క్రూర దుష్కృతాలు పస్కా పండుగ సమయంలో జరిగాయి. ఐగుప్తు దాస్యం నుంచి తమకు కలిగిన విడుదల సూచకంగా పండుగ జరుపుకొంటూ, దైవ ధర్మశాస్త్రం పట్ల ఎనలేని ఉత్సాహం చూపుతున్నట్లు నటిస్తూ, అదే సమయంలో క్రీస్తు పై విశ్వాసం గల వారిని హింసించి హత్య చేయడం ద్వారా ఆ ధర్మశాస్త్రంలోని ప్రతీ సూత్రాన్ని యూదులు అతిక్రమిస్తున్నారు. AATel 102.2

యాకోబు మరణం విశ్వాసులకు తీరని సంతాపం విస్మయం కలిగించింది. పేతురుని కూడా చెరసాలలో వేసినప్పుడు సంఘమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. AATel 102.3

హేరోదు యాకోబును చంపినప్పుడు యూదులు అతన్ని మెచ్చుకొన్నారు. కొందరు యాకోబును రహస్యంగా వధించినందుకు ఎక్కువ సంతోషించలేదు. కారణమేంటంటే అది అందరూ చూస్తుండగా జరిగి ఉంటే అది విశ్వాసులకు వారి సానుభూతి పరులకు మరెక్కువ భయం పుట్టించేదని వారి భావన. పేతురుని అందరూ చూస్తుండగా చంపాలన్న ఉద్దేశంతో హేరోదు అతన్ని బంధించి ఉంచాడు. అయితే ఆ సమయంలో ప్రజలంతా యెరూషలేములో సమావేశమైన్నప్పుడు అగ్ర అపొస్తలుడైన పేతురుని వధించడానికి ప్రజల ముందుకు రప్పించడం క్షేమం కాదన్న హితవు వినిపించింది. చంపడానికి అతన్ని తీసుకొని వెళ్లడం జనసమూహాల సానుభూతిని రెచ్చగొట్టవచ్చునని అధికారులు భయపడ్డారు. AATel 102.4

కదిలించే బోధలు ప్రజల్ని మేల్కొలిపే విజ్ఞప్తులు చేసి వారు క్రీస్తును నమ్మేటట్లు పేతురు ఉద్రేకపర్చేవాడు. యాజకులు ఎంత బలంగా వాదించినా అతన్ని ఎదుర్కోలేకపోయేవారు. అలాంటి విజ్ఞప్తి ఇప్పుడు పేతురు చేస్తాడేమోనని యాజకులు పెద్దలు భయపడ్డారు. క్రీస్తును ప్రబోధించడంలో పేతురు ప్రదర్శించిన ఉత్సాహం అనేకులు సువార్తను విశ్వసించడానికి దారి తీసింది. ఆరాధన నిమిత్తం యెరూషలేము పట్టణంలో సమావేశమైన ప్రజల ముందు తన విశ్వాసాన్ని సమర్థించుకోడానికి పేతురుకి అవకాశం ఇస్తే ప్రజలు పేతురుని విడుదల చేయమంటూ చక్రవర్తిని కోరతారని అధికారులు భయపడ్డారు. AATel 103.1

ఆయా సాకులతో పస్కా గడిచే వరకు అధికార్లు పేతురు మరణాన్ని ఆలస్యం చేస్తుండగా సంఘసభ్యులు ఆ సమయాన్ని ఆత్మ పరీక్ష చేసుకోడంలోను ప్రార్థనలోను గడిపారు. పేతురు కోసం ఎడతెగకుండా ప్రార్థించారు. దైవ సేవకు పేతురు అత్యవసరమని వారందరూ విశ్వసించారు. దేవుని సహాయం లేకపోతే క్రీస్తు సంఘం ధ్వంసం అయ్యే పరిస్థితి ఏర్పడిందని సభ్యులు గుర్తించారు. AATel 103.2

ఇలాగుండగా ప్రతీ ప్రాంతం నుంచి పండుగ ఆచరించడానికి వచ్చినవారు దైవారాధనకు ప్రతిష్ఠితమైన దేవాలయాన్ని వెదుక్కుంటూ వచ్చారు. బంగారంతోను వజ్రాలతోను మెరుస్తున్న దేవాలయం కన్నులకు సుందరమైన వైబోగమైన దృశ్యం. అయితే కోటి ప్రభలతో వెలుగుతున్న ఆ భవనంలో యెహోవా ఇక కనబడడం లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఒక రాజ్యంగా దేవునిని విడిచి పెట్టేశారు. తన ఇహలోక పరిచర్య చివరిలో చివరిసారిగా యేసు దేవాలయం లోపల చూసినప్పుడు, “ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది” అన్నాడు. మత్తయి 23 : 38. దీనికి ముందు దైవాలయాన్ని తన తండ్రి గృహం అని యేసు పిలిచేవాడు. అయితే ఆ ఆలయం నుంచి దైవకుమారుడు బైటికి వెళ్లడంతో దైవ మహిమకోసం నిర్మితమైన ఆ ఆలయం నుంచి దేవుని సముఖం ఎన్నడూ తిరిగి రాకుండా వెళ్లిపోయింది. AATel 103.3

తుదకు పేతురు మరణానికి నిర్ణీత దినం ఏర్పాటయింది. శ్వాసుల ప్రార్థనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సహాయం కోసం వారు విజ్ఞప్తి చేస్తున్న తరుణంలో చెరసాలలో ఉన్న బందీని దేవదూతలు జాగ్రత్తగా కాపాడూ ఉన్నారు. AATel 103.4

క్రితం అపొస్తలులు ఖైదు నుంచి తప్పించుకోవడం మనసులో ఉంచుకొని హేరోదు ఈసారి గట్టి ముందస్తు చర్యలు తీసుకొన్నాడు. విడుదలకు ఎలాంటి అవకాశం లేకుండా పేతురుకి పదహారు మంది వంతుల వారీగా రాత్రింబగళ్లు కాపలా కాశారు. తన చెరసాల గదిలో ఇద్దరు భటుల మధ్య రెండు గొలుసులతో ఆ యిద్దరు భటుల చేతులకూ పేతురు రెండు చేతుల్ని బంధించారు. వారికి తెలియకుండా పేతురు ఎటూ కదలడానికి వీలులేదు. ఖైదు తలుపులు భద్రంగా బిగించి బైట ఒక భటుణ్ణి కావలి ఉంచడంతో తప్పించడానికి గాని తప్పించుకోడానికి గాని ఎలాంటి అవకాశమూ లేదు. అయితే మానవుడి ప్రమాదం దేవునికి అవకాశం. AATel 103.5

పేతురును రాతితో కట్టిన కొట్టులో బంధించారు. దాని తలుపుల్ని ఇనుపకమ్మెలతో గట్టిగా మూశారు. బందీల్ని క్షేమంగా ఉంచడానికి కావలి కాస్తున్న భటుల్ని బాధ్యుల్ని చేశారు. కాగా మానవ సహాయాన్ని పనిచేయనీయకుండా అడ్డుతగిలే గడియలు, ఇనుపకమ్మెలు పేతురుని విడిపించడంలో దేవుని విజయాన్ని పరిపూర్ణం చేయడానికి తోడ్పడ్డాయి. సర్వశక్తునికి వ్యతిరేకంగా హేరోదు చెయ్యి ఎత్తుతున్నాడు. అతడు పూర్తిగా పరాజయం పొందాల్సి ఉన్నాడు. యూదులు తుదముట్టించడానికి చూస్తున్న విలువైన ప్రాణాన్ని తన శక్తిని ప్రదర్శించడం ద్వారా కాపాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. AATel 104.1

అది పేతురు మరణానికి ఏర్పాటయిన దినానికి ముందు రాత్రి. పేతురుని కాపాడడానికి పరలోకం నుంచి ఒక దూత వచ్చాడు. దైవ భక్తుణ్ణి బంధించడానికి మూసి ఉన్న బలమైన తలుపులు మనుషుల సహాయం లేకుండా తెరుచుకొంటాయి. సర్వోన్నతుని దూత లోపలికి వెళ్ళగానే శబ్దం ఏమీ లేకుండా తలుపులు మూసుకొంటాయి. దూత గదిలో ప్రవేశిస్తాడు. పేతురు అక్కడ పడుకొని ఉంటాడు. ప్రశాంతంగా గుండెమీద చెయ్య వేసుకొని నిద్రస్తూ ఉంటాడు. AATel 104.2

దూతను ఆవరించిన వెలుగుతో గది వెలుగుతుంది. అది అపొస్తలుణ్ణి మేలు కొల్పదు. దూత చేయి తాకిడి గుర్తించి “త్వరగా లెమ్ము” అనే స్వరం వినిపించేవరకూ నిద్రలేవడు. తన గది వెలుగుతో నిండినట్లు గొప్ప మహిమతో నిండిన దూత తన ముందు నిలిచినట్లు గుర్తించడు. దూత చెప్పిన మాటకు లోబడ్డాడు. పైకి లేచేటప్పుడు చేతులు ఎత్తగా చేతులకున్న గొలుసులు ఊడిపోయినట్లు గమనిస్తాడు. AATel 104.3

“నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుము” అని పరలోక దూత అతణ్ని ఆదేశిస్తాడు. పేతురు ఆ ప్రకారం యాంత్రికంగా చేస్తాడు. ఆపరలోక సందర్శకుడి పై దృష్టి సారిస్తూ తాను చూస్తున్నది కలా దర్శనమా అని విస్మయం చెందుతాడు. “నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్ము” అంటాడు దూత మళ్లీ. సాధారణంగా మాటలాడే పేతురు మాటలాడకుండా వెనక వస్తుండగా దూత తలుపు వద్దకు నడుస్తాడు. భటుణ్ణి దాటి బలంగా గడియవేసి ఉన్న తలుపు వద్దకు వారు వస్తారు. ఆ తలుపు దానికదే తెరుచుకొని మూసుకొంటుంది. లోపలి భటులు వెలపటి భటులు కదలకుండా నిలబడే ఉంటారు. AATel 104.4

రెండో తలుపు వద్ద కూడా లోపట బైట భటుల కాపలా ఉంది. దూత, దూత వెనక పేతురు ఉండగా మొదటి తలుపుకుమల్లే అదీ తెరుచుకొంటుంది. తెరుచుకొన్నప్పుడు శబ్దం ఉండదు. వారు బయిటికి వెళ్లిపోగా తలుపులు యధావిధిగా శబ్దం ఏమీ లేకుండా మూసుకొంటాయి. అలాగే వారు మూడో తలుపు నుంచి కూడా బైటికి వెళ్లి వీధిని చేరుకొంటారు. మాటలు ఉండవు. అడుగుల సవ్వడి కూడా ఉండదు. ప్రకాశమానమైన వెలుగునడుమ దూత ముందు నడుస్తుంటే బిత్తరపోతూ కలకంటున్నానా అనుకొంటూ పేతురు దూత వెనుక వెళ్తాడు. అలా వారు ఒక వీధిలో వెళ్తూ ఉంటారు. దేవదూత వచ్చిన కార్యం పూర్తి అయ్యింది గనుక అతడు అర్థాంతరంగా మాయమవుతాడు. AATel 105.1

దేదీప్యమానమైన ఆ కాంతి మాయమయ్యింది. కన్నుమిన్ను కానని చీకటిలో పేతురు మిగిలిపోయాడు. తన కళ్లు చీకటికి అలవాటు పడి ఉండడం వల్ల ఆ చీకటి క్రమేపి తగ్గినట్లనిపించింది. తానొక్కడే ఆ వీధిలో ఉన్నట్లు చలిగాలి ముఖానికి కొడుతున్నట్లు పేతురు గుర్తించాడు. ఆ పట్టణంలో తాను తరచు సందర్శించే స్థలంలో తాను ఇప్పుడు ఉన్నట్లు తనకు స్వేచ్ఛ లభించినట్లు పేతురు గుర్తించి తెల్లవారాక చివరిసారిగా ఆ స్థలం సందర్శించడం జరుగుతున్నదనుకొన్నాడు. AATel 105.2

గత కొన్ని ఘడియల్లో చోటు చేసుకొన్న ఘటనల్ని గుర్తు చేసుకోడానికి ప్రయత్నించాడు. కాళ్లకు చెప్పులు వంటిమీద బట్టలు తొలగించి తనను ఇద్దరు భటుల మధ్య బంధించడం కొంత సేపటికి తాను నిద్రించడం అతనికి జ్ఞాపకం వచ్చింది. తన దేహం వంక చూసుకొన్నప్పుడు తన వంటి మీద దుస్తులు కాళ్లకు చెప్పులు ఉన్నట్లు కనుగొన్నాడు. బరువైన సంకెళ్లు ధరించడం వల్ల వాచిన తన చేతులికి సంకెళ్లు లేవని గ్రహించాడు. తనకు లభించిన విడుదల (భ్రమగాని కలగాని దర్శనంగాని కాదని అది పచ్చి నిజమని పేతురు గుర్తించాడు. తెల్లవారిన తర్వాత తాను మరణించాల్సి ఉన్నాడు. కాని దేవదూత వచ్చి తనను చెరనుంచి మరణం నుంచి విడుపించాడు. “ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండియు యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండియు నన్ను తప్పించి యున్నాడని యిప్పుడు నాకు నిజముగా తెలియునని అనుకొనెను”. AATel 105.3

సహోదరులు ఎక్కడైతే సమావేశమై తన నిమిత్తం ప్రార్థన చేస్తున్నారో అపొస్తలుడు అక్కడికే వెళ్లాడు. “అతడు తలవాకిట తలుపుతట్టుచుండగా రాదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గురుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తికొనిపోయి - పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు - నీవు పిచ్చిదానివనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. AATel 105.4

పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపుతీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. అతడు-ఊరకుండుడని వారికి చేసైగ చేసి ప్రభువు తన్ను చెరసాలలో నుండి యేలాగు తీసికొని వచ్చెనో వారికి వివరించి”... “బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను.” విశ్వాసుల హృదయాలు సంతోషంతో స్తోత్రార్పణలతో నిండాయి. దేవుడు వారి ప్రార్థనలు విని పేతురును హేరోదు చేతినుంచి రక్షించాడు. AATel 105.5

ఉదయం జనులు పేతురు మరణం చూడడానికి పెద్ద సంఖ్యలో గుమికూడారు. పేతుర్ని తీసుకురావడానికి హేరోదు అధికారుల్ని చెరసాల వద్దకు పంపాడు. ఆయుధాల ప్రదర్శనతోను భటుల మోహరింపుతోను బందీని తేవాల్ని ఉన్నారు అధికార్లు. ఈ తతంగమంతా అపొస్తలుడు తప్పించుకు పారిపోకుండేందుకే కాక సానుభూతిపరుల్ని భయపెట్టడానికి రాజు అధికారాన్ని ప్రదర్శించుకోడానికి సాగింది. AATel 106.1

ఖైదు తలుపుముందు కావలి కాస్తున్న భటులు పేతురు తప్పించుకు న్నాడన్నాని తెలుసుకోగానే భయభ్రాంతులయ్యారు. ఖైదీ తప్పించుకొంటే అతని ప్రాణాలకు బదులు తమ ప్రాణాలు పోతాయని రాజు ఖండితంగా చెప్పాడు. అందుచేత భటులు అప్రమత్తంగా ఉన్నారు. అధికార్లు పేతురు కోసం చెరసాల వద్దకు వచ్చినప్పుడు భటులు తలుపువద్దే ఉన్నారు. గడియలు ఇనుపకమ్మెలు వేసే ఉన్నాయి. భటుల చేతులికి ఖైదీ చేతులకి కలిపి వేసిన గొలుసులు భటులు చేతుల చుట్టూ ఇంకా ఉన్నాయి. కాని ఖైదీ మాత్రం లేడు. AATel 106.2

పేతురు తప్పించుకొన్నాడన్న వార్త విన్న వెంటనే హేరోదు అగ్గిమిద గుగ్గిలమయ్యాడు. కాపలా ఉన్న భటులు అపనమ్మకంగా ఉన్నారని నిందిస్తూ వారికి మరణదండన విధించాడు. ఏ మానవ శక్తీ పేతుర్ని తప్పించలేదని హేరోదుకు విధితమే కాని తన ఎత్తుగడను వమ్ముచేసింది దేవుని శక్తి అని ఒప్పుకోకూడదని అతను నిర్థారించుకొన్నాడు. దేవునికి వ్యతిరేకంగా నిలిచాడు. AATel 106.3

చెరసాలలో నుంచి పేతురు విడుదల జరిగిన కొద్దికాలానికి హేరోదు కైసరయ వెళ్లాడు. ప్రజల అభిమానాన్ని మెప్పును పొందడానికి అక్కడ పెద్ద ఉత్సవం ఏర్పాటు చేశాడు. దేశం నలుమూలలనుంచి జల్సారాయుళ్లు వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. తిని తాగి తందనాలాడారు. ఆచారకర్మల నడుమ గొప్ప ఆడంబరంతో హేరోదు ప్రజలకు దర్శనమిచ్చి ప్రజలనుద్దేశించి వాగ్దాటితో ప్రసంగించాడు. అతను ధరించిన వస్త్రం వెండి బంగారాలతో తళతళ మెరుస్తున్నది. ఆ వస్త్రం మడతల్లోనుంచి సూర్యకిరణాలు కళ్లు జిగేలుమనేలా మెరుస్తున్నాయి. వీటితో అతను చూడముచ్చటగా కనిపించాడు. ఠీవి తొణికిసలాడున్న అతని రూపం అతను మాట్లాడున్న ముచ్చటైన భాష ప్రజల్ని ఉర్రూతలూగించాయి. తిని తాగడం వల్ల విచక్షణ సెలవు తీసుకోడంతో వారు హేరోదు తళుకు బెళులకు వ్యవహార శైలికి వాగ్దాటికి మంత్రముగ్ధులయ్యాలు. ఉత్సాహంతో గంతులు వేస్తూ అతని మీద ప్రశంసలు కురిపించారు. మానవులెవ్వరూ అతనిలా కనిపించడంగాని వాగ్దాటితో ప్రసంగించడంగాని చేయలేదన్నారు. అతన్ని రాజుగా గౌరవిస్తూ వస్తుండగా ఇక నుంచి అతన్ని అందరూ దేవుడుగా పూజించాలని అన్నారు. AATel 106.4

ఇప్పుడు పచ్చి దుర్మార్గుణ్ణి కొనియాడున్న ప్రజలు కొన్ని సంవత్సరాల క్రితం యేసు వద్దు, అతన్ని సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారు | ప్రయాణాల వల్ల ముతకబారి మరకలు పడి ఉన్న వస్త్రాల కింది ఎవరి దివ్య ప్రేమామృత హృదయం దాగి ఉండేదో ఆ క్రీస్తును యూదులు తిరస్కరించారు. మానవులెవ్వరూ చేయలేని కార్యాలు చేస్తున్న క్రీస్తు శక్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉన్నప్పటికీ సామాన్యుడిగా కనిపించే బాహ్యకారం వెనుక ప్రాణాధిపతి అయిన ఆ ప్రభువు మహిమను వారి కళ్లు కానలేకపోయాయి. కాని తన దుష్ట క్రూర హృదయాన్ని వెండి బంగరు తళుకులతో మెరిసే దుస్తులతో కప్పుకొన్న అహంకారి, వదరుబోతు అయిన హేరోదును, దేవుడిగా పూజించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. AATel 107.1

ప్రజలు తనకు అర్పిస్తున్న ప్రశంసలకు శ్రద్ధాంజలికి తాను అర్హుణ్ని కానన్న సంగతి హేరోదుకి తెలిసినా ప్రజల పూజలు అందుకోడం తన హక్కుగా అతను పరిగణించాడు. “దేవుడు మాట్లాడున్నాడు, మానవుడుకాదు” అంటూ ప్రజలు కేకలు వేస్తుంటే అతని హృదయం విజయోత్సాహంతో ఎగసిపడింది. అతని ముఖం పై గర్వం చిందులువేసింది. AATel 107.2

హఠాత్తుగా అతనిలో మార్పు కనిపించింది. అతడి ముఖం పాలిపోయింది, బాధను సూచిస్తూ వికృతమయ్యింది. వళ్లంతా చెమటలు పట్టాయు. బాధతోను భయంతో నిశ్చేష్టితుడైనట్లు నిలబడి ఉన్నాడు. అంతట భయభ్రాంతులైన తన మిత్రుల పక్కకు నిస్తేజమైన పాలిపోయిన ముఖం తిప్పి పీల స్వరంతో, వారు దేవుడిగా హెచ్చించిన వ్యక్తి మరణం గుప్పిట్లో ఉన్నాడు అన్నాడు. AATel 107.3

తీవ్రమైన బాధను అనుభవిస్తున్న హేరోదును అక్కడ నుంచి మోసుకొని వెళ్లారు. కొద్దిసేపటి క్రితమే అతను ప్రజల మెప్పును పూజల్ని అందుకొన్న ఘనుడు. తనకన్నా శక్తిమంతుడు ఘనుడు అయిన పరిపాలకుని చేతుల్లో ఇప్పుడు తానున్నట్లు తను గుర్తించాడు. అతనికి పశ్చాత్తాపం పుట్టింది. క్రీస్తు అనుచరుల్సి నిర్దాక్షిణ్యంగా తాను హింసించడం గురుకు వచ్చింది. యాకోబును చంపమని తాను ఇచ్చిన ఆదేశం గుర్తుకు వచ్చింది. అపొస్తలుడు పేతురుని మట్టు పెట్టడానికి తాను వేసిన పథకం గుర్తుకు వచ్చింది. సిగ్గుతోను ముప్పిరి కొన్న ఆగ్రహంతోను చేరసాల భటుల పై అన్యాయంగా ఎలా మరణశిక్ష విధించాడో గుర్తుకు తెచ్చుకొన్నాడు. దయలేని హింసకుడిగా ప్రవర్తించిన తనను ఇప్పుడు దేవుడు శిక్షిస్తున్నాడని గుర్తించాడు. అతను శారీరకంగాను, మానసికంగాను పడుతున్న బాధకు ఉపశమనం లేదు. అతను కనిపెట్టనూ లేదు. AATel 107.4

“నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు” (నిర్గమ 20:3) అన్న దైవధర్మశాసనం హేరోదుకు తెలిసిందే. ప్రజల పూజను అంగీకరించి దుర్మార్గతను ఒడిగట్టుకొన్నానని తద్వారా యెహోవా ఉగ్రత తన మీదికి తానే తెచ్చుకొన్నానని అతడు గుర్తించాడు. AATel 108.1

పేతురుని చెరసాల నుంచి విడిపించడానికి పరలోకం నుంచి వచ్చిన దూతే దేవుని ఉగ్రతను, తీర్పును హేరోదుకి అందించడానికి నియుక్తుడయ్యాడు. నిద్రలేపడానికి దూత పేతురుని తట్టాడు. అతడి గర్వాన్ని అణచి సర్వశక్తుని శిక్షావిధిని అమలు పర్చడంలో దూత దుర్మార్గుడైన రాజును వేరే విధంగా తట్టాడు. ప్రతిఫలం ఇచ్చే దేవుని తీర్పుకింద హేరోదు శారీరకంగాను మానసికంగాను గొప్ప బాధననుభవించి మరణించాడు. దేవుడిచ్చిన ఈ తీర్పు ప్రజల పై గొప్ప ప్రభావం చూపింది. అపొస్తలుడు విచిత్రంగా చెరసాలనుంచి విడుదల పొందాడని అతన్ని హింసించిన హింసకుడు దేవుని శాపానికి గురిఅయి నేలకూలాడని సకల ప్రాంతాలకూ వార్త పాకింది. అనేకులు క్రీస్తును విశ్వసించడానికి ఇది గొప్ప సాధనమయ్యింది. AATel 108.2

దేవుని గూర్చిన సత్యం కోసం వెదకుతున్న ఒక వ్యక్తి వద్దకు దూత నడుపుదలకింద వెళ్లిన ఫిలిప్పు అనుభవం; దేవుని వర్తమానంతో కొర్నేలీ వద్దకు దేవదూత వెళ్లడం; మరణశిక్షపడి ఖైదులో ఉన్న పేతురుని దేవదూత విడిపించడంఇవన్నీ భూలోకానికి పరలోకానికి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చూపిస్తున్నాయి. AATel 108.3

దేవదూత సందర్శనలు దైవ సేవకులకు బలాన్ని, ఉద్రేకాన్ని సమకూర్చాలి. దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చడానికి, పశ్చాత్తాపం లేనివారిని కాపాడడానికి, మనషుల్ని క్రీస్తు చెంతకు నడిపించడానికి అపొస్తలుల దినాల్లో సిద్ధంగా ఉన్నట్లే, నేడు కూడా దూతలు సిద్ధంగా ఉండి లోకమంతా సంచరిస్తున్నారు. దూతల్ని మనం వ్యక్తిగతంగా చూడలేం. అయినా మనల్ని నడిపిస్తూ మనకు మార్గనిర్దేశం చేస్తూ మనల్ని కాపాడూ వారు మనతో ఉంటారు. AATel 108.4

సంకేతాత్మకమైన నిచ్చెన లోకంలోని ప్రజలకు పరలోకాన్ని దగ్గరలోకి తెస్తుంది. దాని చివరి మెట్టు దేవుని సింహాసనాన్ని అంటుకొంటుంది. దు:ఖాలు బాధలు అవసరాల్లో ఉన్నవారి ప్రార్థనల్ని దేవుని వద్దకు అక్కడనుంచి దీవెనల్ని. నిరీక్షణను ధైర్యాన్ని, సహాయాన్ని తీసుకొని దేవుని బిడ్డలకోసం దేవదూతలు ఈ నిచ్చెనపై నిత్యమూ ఎక్కుతూ దిగుతూ ఉంటారు. వెలుగుతో ప్రకాశించే ఈ దూతలు ఆత్మలో పరలోక వాతావరణాన్ని సృష్టించి మనల్ని నిత్యుడైన దేవుని తట్టుకి లేపుతారు. మన స్వాభావిక దృష్టితో దూతల స్వరూపాన్ని మనం చూడలేం. పరలోక విషయాల్ని ఆధ్యాత్మిక దృష్టితో మాత్రమే చూడగలుగుతాం. పరలోక స్వరాల లయబద్ధతను ఆధ్యాత్మిక చెవి మాత్రమే వినగలుగుతుంది. AATel 108.5

“యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టు ఆయన దూత కావలియుండి వారిని రక్షించును”. కీర్తనలు 34:7. తాను ఎంపికచేసుకొన్నవారిని విపత్తుల్లోనుంచి “చీకటిలో సంచరించు తెగులు” నుంచి “మధ్యాహ్నమందు పాడుచేయు రోగము” నుంచి కాపాడవలసిందిగా దేవుడు తన దూతలను ఆదేశిస్తాడు కీర్తనలు 91:6. అధైర్యం చెందుతున్న భక్తులను ఉత్సాహపర్చి వారి మనసుల్ని లౌకిక చింతలకు అతీతంగా నిలపడానికీ దైవ సింహాసనం చుట్టూ చేరిన విజేతలు పొందబోతున్న తెల్లని వస్త్రాలు, కిరీటాలు, విజయ సూచక అంజూరపు మట్టలు విశ్వాసం ద్వారా చూడడానికి దేవదూతల మాటలు వారిని పదేపదే ఉద్రేకపర్చుతాయి. AATel 109.1

శ్రమలకు బాధలకు శోధనలకు గురిఅయినవారికి దగ్గరగా ఉండడం దూతలు నిమగ్నమై ఉన్న సేవ. క్రీస్తు ఎవరి నిమిత్తం ప్రాణత్యాగం చేశాడో ఆ ప్రజాళి పక్షంగా నిర్విరామంగా పరిచర్య చేస్తూ ఉంటారు దేవదూతలు. పాపులు తమ హృదయాల్సి రక్షకునికి అర్పించినప్పుడు దేవదూతలు సంతోషకరమైన ఆవార్తను పరలోకానికి తీసుకు వెళ్తారు. అప్పుడు పరలోకవాసుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. “అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబదితొమ్మిది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటె మారుమనస్సు పొందు ఒక్కపాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును” లూకా 15:7. చీకటిని తొలగించి క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని ప్రచురించడంలో మనం చేసే ప్రతీ విజయవంతమైన ప్రయత్నం గురించి నివేదికను పరలోకానికి తీసుకువెళ్లారు. ఆ కార్యాన్ని తండ్రి ముందువారు వివరించేటప్పుడు పరలోకంలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతాయి. AATel 109.2

నిరాశ నిస్పృహలు కలిగించే పరిస్థితుల్లో దేవుని సేవకులు పోరాటంతో సాగిస్తున్న సేవను పరలోకనివాసులు గమనిస్తూ ఉన్నారు. క్రైస్తవులు రక్షకుని ధ్వజం కింద ఏకమై విశ్వాసమనే మంచి పోరాటం పోరాడూ ముందడుగు వేస్తూ కొత్త విజయాలు సాధిస్తున్నారు. కొత్త ప్రశంసలు అందుకొంటున్నారు. విశ్వాసులైన సామాన్య ప్రజలకు పరిచర్య చేయడానికి పరలోకంలోని దూతలందరు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఈ లోకంలోని దైవసేవక సమూహాలు స్తుతిగానం చేస్తుండగా పరలోకంలోని గాయక బృందం గళం కలిపి దేవునికి ఆయన కుమారునికి స్తోత్రం చెల్లిస్తారు. AATel 109.3

దేవదూతల పరిచర్య విషయంలో మనకు మరింత అవగాహన అవసరం. యధారమైన ప్రతి భక్తునికి దూతల సహకారం ఉంటుందన్న విషయం జ్ఞాపకముంచు కోడం మంచిది. దేవుని పై విశ్వాసం ఉంచి ఆయన వాగ్దానాల నెరవేర్పును ఆశించేవారందరికీ వెలుగుతోను, శక్తితోను నిండిన అదృశ్వ దూత సమూహాలు పరిచర్య చేస్తూ ఉంటారు. కెరూబులు, సెరీపులు సాటిలేని బలం గల దూతలు “రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరిచారము” చేయడానికి దేవుని పక్క నిలిచి ఉంటారు. హెబ్రీ 1:14. AATel 109.4