అపొస్తలుల కార్యాలు

17/59

16—అంతియొకయలో సువార్త సందేశం

హింస ప్రబలడం చేత యెరూషలేము నుంచి శిష్యులు చెదిరిపోయిన అనంతరం పాలస్తీన పరిసర ప్రాంతాన్ని దాటి సువార్త శీఘ్రంగా వ్యాప్తి చెందింది. ముఖ్య కేంద్రాల్లో చిన్న చిన్న విశ్వాసుల సమూహాలు ఏర్పడ్డాయి. శిష్యుల్లో కొందరు “ఫేనీకే, కుప్ర, అంతియొకయ” వరకు వాక్యం బోధిస్తూ సంచరించారు. వారి సువార్త కృషి సామాన్యంగా హెబ్రీ యూదులు గ్రీకు యూదులకే పరిమితమై ఉండేది. ఈ యూదులు లోకంలోని నగరాలన్నిటిలోనూ పెద్ద సంఖ్యలో ఉండేవారు. AATel 110.1

సువార్తను సంతోషంగా అంగీకరించిన పట్టణాల్లో అంతియొకయ ఒకటి. ఆ కాలంలో అంతియొకయ సిరియకు రాజధాని. ఆ మహానగరంలో నుంచి సాగుతున్న వాణిజ్యం కారణంగా ఆయా జాతుల ప్రజలు ఆ నగరానికి రావడం జరిగేది. అదీగాక, అంతియొకయ విలాసాలకు వినోదాలకు పేరుగాంచిన నగరం. ఆరోగ్యకరమైన పరిసరాలు, చుట్టూ చక్కని ప్రకృతి, దాని సిరిసంపదలు, సంస్కృతి, సంస్కారం ఇవి దాని ఆకర్షణలు. అపొస్తలుల కాలంలో ఆనగరం సుఖసౌఖ్యాలకు దుర్మార్గతకు పేరుగాంచింది. AATel 110.2

అంతియొకయలో కుప్రకు, కురేనేకు చెందిన విశ్వాసులు ప్రభువైన యేసును గూర్చిన సువార్త బహిరంగంగా బోధించారు. “ప్రభువు హస్తము వారికి తోడైయుండెను.” వారి కృషి ఫలించింది. “నమ్మినవారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి.” AATel 110.3

“వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో నున్న సంఘపువారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి.” తాను సేవచేయాలన్న కొత్త స్థలం చేరిన వెంటనే దైవ కృప మూలంగా అప్పటికే జరిగిన సేవను బర్నబా చూశాడు. అతను “సంతోషించి, ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరిని హెచ్చరించెను.” AATel 110.4

అంతియొకయలో బర్నబా సేవలకు మంచి ఫలితాలు కలిగాయి. అనేకులు సువార్తను అంగీకరించి విశ్వాసులై సంఘంలో చేరారు. సువార్త పరిచర్య విస్తరించే కొద్దీ దేవుని కృపల్ని ఇంకా అధికంగా అందించడానికి సరియైన సహాయం అవసరాన్ని బర్నబా గుర్తించి పౌలుతో సంప్రదించడానికి తార్పు వెళ్లాడు. దానికి కొద్దికాలం క్రితం పౌలు యెరూషలేము నుంచి వెళ్లిన తర్వాత “సిరియ, కిలికియ ప్రాంతములలో” “తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును” ప్రకటించాడు. గలతీ 1:21,23. పౌలు వద్దకు వెళ్లి తనతో కలిసి సువార్త సేవ చేసేందుకు బర్నబా పౌలును ఒప్పించాడు. AATel 110.5

విస్తారమైన జనసంఖ్యగల అంతియొకయ నగరం పౌలు సువార్త సేవలకు అనువైన నగరం అయ్యింది. పౌలు పాండిత్యం, వివేకం ఉత్సాహం ఆనగర నివాసుల పైన ఆనగరాన్ని దర్శించే సందర్శకుల పైన బలమైన ప్రభావాన్ని ప్రసరించాయి. బర్నబాకు అవసరమైన సహాయాన్ని కూడా పౌలు అందించగలిగాడు. ఒక ఏడాదిపాటు వీరిరువురూ కలిసి సేవచేసి లోక రక్షకుడు నజరేయుడైన యేసే అన్న రక్షణ వర్తమానాన్ని ప్రచురించారు. AATel 111.1

క్రీస్తు అనుచర్లు క్రైస్తవులని మొట్టమొదట అంతియొకయలో పిలువబడ్డారు. వారి బోధకు వారి బోధనలకు సంభాషణలకు ప్రధానాంశం క్రీస్తే గనుక వారికా పేరు వచ్చింది. ఆయన సన్నిధి తన శిష్యులతో ఉన్న శుభదినాల్లో చోటు చేసుకొన్న ఘటనల గురించి వారు నిత్యమూ ప్రస్తావించుకొంటూ ఉండేవారు. ఆయన బోధనల్ని గురించి, ఆయన మహత్కార్యాల గురించి విసుగు విరామం లేకుండా ప్రస్తావించు కొనేవారు. గెతే మనే తోటలో ఆయన పడ వేదన గూర్చి, ఆయన అప్పగింతను గూర్చి, ఆయన విచారణను గూర్చి, ఆయన మరణాన్ని గూర్చి, తన శత్రువులు ప్రదర్శించిన ద్వేషాన్ని ఆయన భరించడాన్ని గూర్చి, శత్రువులు పెట్టిన హింసను గూర్చి, తనను హింసిస్తున్నవారిపై దయా హృదయంతో ఆయన చేసిన దివ్యప్రార్థనను గూర్చి కన్నీళ్లు కార్చుతూ, వణకుతున్న కంఠస్వరంతో వారు మాట్లాడేవారు. ఆయన పునరుత్థానం, ఆరోహణం, పాప మానవుల పక్షంగా ఆయన నిర్వహిస్తున్న మధ్యవర్తి పాత్ర- ఇవి వారు చర్చించుకోడానికి ఆనందించే అంశాలు. వారు క్రీస్తును బోధించారు గనుక తండ్రికి తమ ప్రార్థనల్ని ఆయన ద్వారా సమర్పించేవారు గనుక అన్యులు వారిని క్రైస్తవులుగా వ్యవహరించడం మంచిదే. AATel 111.2

వారికి క్రైస్తవులన్న పేరు పెట్టింది దేవుడే. ఇది రాజవంశపు నామం. క్రీస్తును స్వీకరించిన వారందరూ ఈ నామం ధరిస్తారు. అనంతరం యాకోబు ఈ నామం గురించే ఇలా రాశాడు, “ధనవంతులు నా మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్నవారు వీరేగదా?” యాకోబు 2:6,7 పేతురు ఇలా అంటున్నాడు. “ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమ పరచవలెను”. “క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన యెడల మహిమా స్వరూపియైన ఆత్మ అనగా దేవుని ఆత్మ నా మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.” 1 పేతురు 4:16,14. AATel 111.3

తాము “ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును” తమకు సహకరించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడని అంతియొకయ విశ్వాసులు గుర్తించారు. ఫిలిప్పీ 2:13. నిత్యజీవానికి సంబంధించిన విషయాలంటే ఆసక్తి సుతరామూలేని ప్రజల మధ్య నివసిస్తూ వారిలో యధార్థ హృదయుల్ని ఆకట్టుకొని తాము అమితంగా ప్రేమిస్తూ సేవచేస్తున్న ప్రభువుని వారికి పరిచయం చేయాలని ప్రయత్నించారు. వారు తమ నిరాడంబర సేవలో తాము బోధించే దైవవాక్యం ప్రభావవంతం కావడానికి పరిశుద్దాత్మ మీద ఆధారపడి పనిచేశారు. కనుక ఆయా జీవిత పరిస్థితుల్లో క్రీస్తుపై తమకున్న విశ్వాసాన్ని గూర్చివారు అనుదినం సాక్ష్యం ఇచ్చారు. AATel 112.1

అంతియొకయలో క్రీస్తు అనుచర్లు నివసించిన జీవితం నేడు లోక మహానగరాల్లో నివసించే విశ్వాసులందరికీ ఆదర్శప్రాయం. సమర్థత అంకిత భావం గల పనివారు నగరాల్లో బహిరంగ సువార్త సభలు జరపడానికి ఎంపిక కావడం దేవుని సంకల్పం అయినా ఈ నగరాల్లో నివసించే సంఘసభ్యులు కూడా ఆత్మల్ని క్రీస్తు వద్దకు నడిపించడంలో తమ వరాల్ని ఉపయోగించాలన్నది ఆ సంకల్పంలో భాగమే. దేవుని పిలుపుకు హృదయపూర్వకంగా సానుకూలంగా స్పందించడంలో అమూల్యమైన దీవెనలున్నాయి. అంలాటి అనుచర్లు క్రీస్తు చెంతకు ఆత్మల్ని నడిపించే కృషిలో జ్ఞానయుక్తమైన, వ్యక్తిగతమైన కృషికి సానుకూలంగా స్పందించే ఆత్మల్ని మరేవిధంగాను చేర్చడం సాధ్యం కాదని గుర్తిస్తారు. AATel 112.2

ఈనాడు లోకంలో దేవుని సేవ పురోగమనానికి బైబిలు సత్యాన్ని అందించే క్రీస్తు ప్రతినిధులు అవసరం. పెద్ద పెద్ద నగరాల్లోని ప్రజలకు రక్షణ హెచ్చరికను అందించడానికి అభిషేకం పొందిన పాదుర్లు మాత్రమే సరిపోరు. బోధకుల్ని మాత్రమే గాక వైద్యుల్ని, నర్సుల్ని గ్రంథ విక్రయ సేవకుల్ని, బైబిలు ఉపదేశకుల్ని వివిధ వరాలు బైబిలు జ్ఞానం కలిగి దైవ కృపశక్తిని అనుభవిస్తూ సత్యం ఎరుగని నగరాల్లోని ప్రజల ఆధ్యాత్మిక అవసరాల పరిగణన ఉన్న సంఘ సభ్యుల్ని దేవుడు పిలుస్తున్నాడు. కాలం వేగంగా గతించిపోతున్నది. చేయాల్సింది మాత్రం ఎంతో ఉంది. ప్రస్తుత తరుణాల్ని సద్వినియోగపర్చే ప్రతీ సాధనాన్ని ఉపయోగించుకోవాలి. AATel 112.3

అన్య ప్రజానీకానికి ప్రత్యేక పరిచర్య చేసేందుకు ప్రభువు తనను పిలిచాడన్న నమ్మకాన్ని పౌలు బర్నబాతో కలిసి అంతియొకయలో చేసిన పరిచర్య బలపర్చింది. తాను మారుమనసు పొందిన తరుణంలో తాను అన్యులకు సువార్తికుడు కావాల్సి ఉన్నాడని పౌలుకు ప్రభువు వ్యక్తం చేశాడు. “వారు చీకటిలో నుండి వెలుగులోనికిని సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి నాయందు విశ్వాసముచేత పాపక్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు, వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను.” అ.కా. 26:18. అననీయకు ప్రత్యక్షమైన దూత పౌలు గురించి ఇలా అన్నాడు. “అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నానామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై యున్నాడు” అ.కా. 9:15 దరిమిల తన క్రైస్తవానుభవంలో యెరూషలేములోని దేవాలయంలో పౌలు ప్రార్థిస్తున్నప్పుడు పరలోక దూత అతనికి ప్రత్యక్షమై, “వెళ్లుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదును” అన్నాడు. అ.కా. 22:21. AATel 112.4

ఇల’ అవ్యజనుల విశాల సువార్త సేవారంగంలో ప్రవేశించడానికి ప్రభువు పౌలుకు ఆదేశాన్నిచ్చాడు. సువిశాలమూ కష్టసాధ్యమూ అయిన ఈ పరిచర్యకు పౌలును సిద్ధం చేయడానికి అతన్ని తనతో సన్నిహిత సంబంధంలోకి తెచ్చి సుందరమైన, మహిమతో విండిన పరలోక దృశ్యాల్ని గూర్చిన దర్శనాన్ని ప్రభువు అతనికి ఇచ్చాడు. “అనాది నుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపర్చబడిన మర్మము” (రోమా 16:25) “తన చిత్తమును గూర్చిన మర్మమును” (ఎఫెసీ 1:9) తెలియపర్చే పరిచర్యమ ప్రభువు అతనికి నియమించాడు. “ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపర్చబడియున్నట్లుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియపర్చబడలేదు. ఈ మర్మమేమనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసు నందు యూదులతో పాటు సమాన వారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును వాగ్దానములో పాలివారనైయున్నారనునదియే... నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్సుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను” అంటున్నాడు పౌలు. ఎఫెసీ 3:5-11. AATel 113.1

పౌలు బర్నబాలు అంతియొకయ విశ్వాసులతో ఉన్న సంవత్సరంలో దేవుడు వారి సేవలను బహుగా ఆశీర్వదించాడు. అయితే పౌలుగాని బర్నబాగాని సువార్త సేవకు ఇంకా అభిషేకం పొందలేదు. ఇప్పుడు వీరిద్దరూ తమ క్రైస్తవానుభవంలో తమకు దేవుడు భారమైన సువార్త సేవాబాధ్యతలు అప్పగించడానికి సిద్ధంగా ఉన్న స్థితికి ఎదిగారు. ఆ బాధ్యతల నిర్వహణలో సంఘం అందించగల ప్రతీరకమైన సహాయం వారికి అవసరమవుతుంది. AATel 113.2

“అంతియొకయలో నున్న సంఘములో బర్నబా, నీగే రనబడిన సుమెయోను, కురేనీయుడైన లూకియ ... మనయేను, సౌలు అను ప్రవక్తలును బోధకులును ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్దాత్మ - నేను బర్నబాను పౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను”. అన్యజనుల మధ్య సువార్త పరిచారకులుగా ఈ అపొస్తలుల్ని పంపకముందు వారిని ప్రత్యేకంగా దేవునికి ప్రతిష్ఠించి ఉపవాస పూర్వకంగాను ప్రార్థన పూర్వకంగాను వారి మీద చేతులుంచారు. సువార్త సత్యాల్ని బోధించడానికే గాకుండా బాప్తిస్మం ఇవ్వడానికి, సంఘాన్ని వ్యవస్థీకరించడానికి ఈ విధంగా వారు మతపరమైన అధికారాన్ని పొందారు. AATel 113.3

ఈ సమయంలో క్రైస్తవ సంఘం ప్రాముఖ్యమైన శకంలో ప్రవేశిస్తున్నది. ఇప్పుడు అన్యజనులకు సువార్త ప్రకటన పటిష్ఠంగా సాగాల్సి ఉంది. పర్యవసానంగా అనేక మంది సంఘంలోకి రావాల్సి ఉన్నారు. ఈ కార్యాచరణకు నియమితులైన అపొస్తలులు అనుమానాలకు, ద్వేషానికి, అసూయకు గురికావలసి ఉన్నారు. యూదుల్ని, అన్యుల్ని ఎంతో కాలంగా వేరుచేసిన “మధ్యగోడ” (ఎఫెసీ 2:14) ను పడగొట్టడాన్ని గూర్చిన వారి బోధనలు. వారు అసత్యబోధకులన్న ఆరోపణకు వారిని గురిచేసి సువార్త బోధకులుగా వారి అధికారాన్ని అనేక మంది యూదులు ప్రశ్నించడానికి స్వాభావికంగా దారి తీయనున్నాయి. తన సేవకులకు ఎదురుకానున్న సమస్యల్ని దేవుడు ముందే చూసి నారి పరిచర్య సవాలుకు అతీతంగా ఉండేందుకుగాను వారిని బహిరంగ సువార్త పరిచర్య నిమిత్తం ప్రత్యేకించాల్సిందిగా దేవుడు సంఘాన్ని ఉపదేశించాడు. అన్యులకు సువార్త ప్రకటించడానికి దేవుడు వారిని నియమించాడన్నదానికి వారి అభిషేకమే బహిరంగ నిదర్శనం. AATel 114.1

పౌలు బర్నబాలు తమ ఆదేశాన్ని దేవుని వద్దనుంచి పొందే ఉన్నారు. వారిపై చేతులుంచే ఆచారం కొత్త సుగుణాన్నిగాని నైతిక అర్హతనుగాని వారికి అదనంగా చేకూర్చలేదు. ఒక నియమిత హోదాకు అది గుర్తింపు పొందిన పద్ధతి. ఆ హోదాగల వ్యక్తి అధికారానికి అది గుర్తింపును, ఆ కార్యం ద్వారా దేవుని పనిపై సంఘం తన ఆమోద ముద్ర వేసింది. AATel 114.2

ఇది యూదులకు ఎంతో ప్రధానమైన ఆచారం. యూదుడైన ఒక తండ్రి తన పిల్లల్ని దీవించేటప్పుడు వారి తలలమీద భక్తిపూర్వకంగా చేతులుంచేవాడు. బలిఆర్పణకు ఒక పశువును ప్రత్యేకించేటప్పుడు యాజక హోదా ఉన్న వ్యక్తి ఆపశువు మీద తన చేతులు ఉంచేవాడు. అంతియొకయ సంఘంలోని బోధకులు పౌలు బర్నబాల తలలమీద చేతులుంచినప్పుడు ఏర్పాటైన పనిని నిర్వహించడానికి ఆ అపొస్తలుల పై దీవెనలు కుమ్మరించాల్సిందిగా ఆ క్రియ ద్వారా వారు దేవునిని వేడుకొన్నారు. AATel 114.3

తర్వాత కొంతకాలానికి చేతులు ఉంచడం ద్వారా అభిషేకించడం దుర్వినియోగం అయ్యింది. అభిషేకం పొందినవారి మీదికి వెంటనే ఏదో శక్తి వచ్చేటట్లు వారు ఏరకమైన సువార్త బాధ్యతల నిర్వహణకైనా అర్హతగల వారన్నట్లు అభిషేకానికి అసమంజస ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఈ ఇద్దరు అపొస్తలుల్ని హస్త నిక్షేపంద్వారా ప్రత్యేకించడంవలన వారి మీదకి ప్రత్యేక శక్తి ఏదైనావచ్చిన దాఖలా ఏమిలేదు. వారికి అభిషేకం జరిగిన సంగతి భవిష్యత్తులో వారి సేవపై దాని ప్రభావం - ఇవే దాఖలైవున్నాయి. AATel 114.4

ఒక నిర్దిష్ట సేవ నిమిత్తం పౌలును బర్నబాను పరిశుద్ధాత్మ ప్రత్యేకించిన పరిస్థితులు, తన సంఘంలో ఏర్పాటైన సాధనాల ద్వారా ప్రభువు పనిచేస్తాడన్న విషయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. దీనికి ముందు కొన్ని సంవత్సరాల క్రితం పౌలు విషయంలో తన సంకల్పం ఏమిటో ప్రభువే అతనికి తెలియపర్చి వెంటనే అతన్ని దమస్కులో కొత్తగా ఏర్పడ్డ సంఘ సభ్యులతో అనుసంధానపర్చాడు. అంతేకాదు. మారుమనసు పొందిన ఈ పరిసయ్యుడి వ్యక్తిగతానుభవం గురించి ఆ సంఘాన్ని చీకటిలో ఉంచలేదు ప్రభువు. అప్పుడు దేవుడిచ్చిన ఆదేశం అమలు పర్చాల్సి వచ్చినప్పుడు అన్యజనులకు సువార్త అందించడానికి దేవుడు ఎంపిక చేసుకొన్న సాధనంగా పౌలును అతని సహసేవకుడు బర్నబాను గూర్చి సాక్ష్యం ఇస్తూ వారిని అభిషేకించే కార్యాన్ని పరిశుద్దాత్మ సంఘానికి అప్పగించాడు. అంతట అంతియొకయ సంఘ నాయకులు “ఉపవాసమునుండి ప్రార్థనచేసి వారిమీద చేతులుంచి వారిని పంపిరి”. AATel 115.1

దేవుడు తన సంఘాన్ని వెలుగుకు సాధనంగా చేసి దాని ద్వారా తను ఉద్దేశాల్ని చిత్తాన్ని తెలియపర్చాలని సంకల్పించాడు. సంఘంతో నిమిత్తం లేకుండా సంఘానుభవానికి వ్యతిరేకంగా తన సేవకుల్లో ఏ ఒక్కరికీ ఏ అనుభవాన్నీ ఆయన ఇవ్వడు. లేదా సంఘానికి తెలియకుండా సర్వసంఘానికి ఉద్దేశించి ఏ ఒక్క వ్యక్తికీ తన చిత్రాన్ని ప్రభువు తెలియపర్చడు. తన సేవకులు ఆత్మవిశ్వాసం పెంచుకొని తమను తామే ఎక్కువ నమ్ముకోకుండా దేవుడు తన సేవను నిర్వహించడంలో ఎవరిని ఎంపిక చేసుకొని నడిపిస్తున్నాడో ఆ నేతలపై వారు ఎక్కువ విశ్వాసం ఉంచేందుకు ఆయన తన సంకల్పం చొప్పున ఆ నేతల్ని సంఘంతో సన్నిహిత సంబంధంలో ఉంచుతాడు. AATel 115.2

వ్యక్తిగత స్వతంత్రతకు మొగ్గుచూపేవారు సంఘంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. స్వతంత్రత కోరే స్వభావం వ్యక్తి తన్నుతానే నమ్మేటట్లు చేసే తత్వాన్ని పుట్టిస్తుందన్న విషయం గుర్తించలేని స్థితిలో ఉండి సహోదరుల సలహాల్ని విజ్ఞతను ముఖ్యంగా తన ప్రజల్ని నడిపించడానికి దేవుడు నియమించిన నాయకుల్ని లెక్కచేయకుండా తన సొంత జ్ఞానాన్ని తెలివితేటల్ని నమ్ముకొనేటట్లు చేస్తుంది. దేవుడు తన సంఘానికి విశేషమైన అధికారాన్ని శక్తిని ఇచ్చాడు. ఆ అధికారాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయడంగాని తృణీకరించడంగాని చేయకూడదు. సంఘాధికారాన్ని తృణీకరించేవాడు దేవుని స్వరాన్ని తృణీకరించేవాడవుతాడు. AATel 115.3

తమ సొంత ఆలోచనే ఉత్తమమైనదని భావించే వ్యక్తులు గొప్ప ప్రమాదంలో ఉన్నారు. లోకంలో తన సేవను స్థాపించడానికి దాన్ని విస్తరించడానికి దేవుడు ఎవరిద్వారా పని చేస్తున్నాడో ఎవరు ఆయన వెలుగుకు సాధనాలో ఆ నాయకులనుంచి అలాంటి వారిని వేరుచేయడానికి సాతాను నిత్యమూ కృషిచేస్తాడు. రక్షణ సత్యం ప్రగతి విషయంలో బాధ్యతలు వహించడానికి దేవుడు నియమించిన నాయకుల్ని లక్ష్యపెట్టకపోవడం లేదా తృణీకరించడం, దేవుడు తన ప్రజలకు సహాయం చేయడానికి, వారిని ఉద్రేక పర్చడానికి, బలో పేతుల్ని చేయడానికి ఏర్పాటుచేసిన సాధనాల్ని తృణీకరించడమే. సువార్త సేవలోని ఏ వ్యక్తి అయినా వీరిని కాదని తనకు వెలుగు ప్రత్యక్షంగా దేవుని వద్దనుంచే రావాలనుకోడం సాతాను వంచించి పడదోయగల స్లలంలోకి తన్నుతాను నెట్టుకుపోవడమే అవుతుంది. విశ్వాసులందరూ పరస్పరం సన్నిహిత సంబంధం కలిగి నివసిస్తూ క్రైస్తవుడు క్రైస్తవుడితోను సంఘం సంఘంతోను ఐకమత్యంగా ఉండాలని జ్ఞానియైన దేవుడు సంకల్పించాడు. ఈ విధంగా మానవ మాత్రులు దేవునితో సహకరించడానికి సామర్థ్యం పొందుతారు. సాధనాలన్నీ పరిశుద్ధాత్మ నడుపుదలకు లోబడి ఉంటాయి. దేవుని కృపనుగూర్చిన వర్తమానాన్ని లోకానికి అందించడానికి విశ్వాసులందరూ ఏకమై సంఘటిత కృషిసాగిస్తారు. AATel 116.1

తాను పొందిన అభిషేకం తన జీవిత కర్తవ్యంలో ఒక నూతనమైన ప్రధానమైన శకానికి నాందిగా పౌలు పరిగణించాడు. క్రైస్తవ సంఘంలో అపొస్తలుడుగా తన సేవ ప్రారంభాన్ని ఈ తేదీనుంచే పౌలు లెక్క పెట్టాడు. AATel 116.2

అంతియొకయలో సువార్త ప్రజ్వలంగా వెలుగుతుండగా యెరూషలేములో మిగిలి ఉన్న అపొస్తలులు ప్రాముఖ్యమైన సేవను కొనసాగిస్తున్నారు. ప్రతీ సంవత్సరం పండుగ సమయాల్లో అనేకమంది యూదులు అన్ని దేశాలనుంచి యెరూషలేము దేవాలయానికి ఆరాధన నిమిత్తం వచ్చేవారు. ఈ యాత్రికుల్లో కొందరు గొప్ప భక్తిపరులు, ప్రవచనాల్ని అధ్యయనం చేసిన బైబిలు విద్యార్థులు. వారు వాగ్దానం చేయబడ్డ మెస్సీయా రాకకోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. యెరూషలేము పరదేశులతో నిండి ఉండగా అపొస్తలులు క్రీస్తును గురించి నిర్భయంగా బోధిస్తున్నారు. అలా బోధించడం తమకు ప్రాణహాని అని ఎరిగికూడా వారు క్రీస్తును బోధించారు. వారి సేవలకు పరిశుద్ధాత్మ అండదండలు ఉన్నాయి. అనేకమంది సువార్త సత్యాన్ని స్వీకరించారు. లోకంలోని ఆయాదేశాలనుంచి వచ్చిన వారు తమ తమ దేశాలకు గృహాలకు వెళ్ళి, అన్ని తరగతుల ప్రజల మధ్య సువార్త సత్యాల్ని వెదజల్లారు. AATel 116.3

ఈ సేవలో ప్రధానంగా పనిచేసిన ప్రముఖ అపొస్తలులు పేతురు, యాకోబు యోహానులు. తమ తోటి పౌరులకు సువార్త ప్రకటించడానికి దేవుడు తమను నియమించాడని వారు విశ్వసించారు. చూసిన సంగతులు గురించి విన్న సంగతులగురించి సాక్ష్యమిస్తూ సేవ చేస్తూ “ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము”ను బోధిస్తూ “మీరు పిలువ వేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని” వారికి చెప్పారు. (2 పేతురు 1:19, అ.కా. 2:36). AATel 117.1