అపొస్తలుల కార్యాలు

15/59

14—సత్యాన్వేషి

తన పరిచర్య సందర్భంగా అపొస్తలుడు పేతురు లుద్దలోని విశ్వాసుల్ని సందర్శించాడు. అక్కడ ఎనిమిది ఏళ్లుగా పక్షవాతంతో బాధపడున్న ఐనెయాను స్వస్తపర్చాడు. “ఐనెయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపర్చుచున్నాడు. నీవులేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని” అపొస్తలుడు చెప్పగా “వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరు అతని చూచి ప్రభువుతట్టు తిరిగిరి.” AATel 94.1

లుద్దకు సమీపంగావున్న యొప్పేలో దోర్కా ఆను పేరుగల మహిళ నివసిస్తుంది. ఆమె చేసిన ధర్మకార్యాల్ని బట్టి జనులు ఆమెను బహుగా ప్రేమించారు. ఆమె క్రీస్తుకు మంచి శిష్యురాలు. ఆమె జీవితం సత్కార్యాల సమాహారం. ఎవరికి వస్త్రాలు అవసరమో ఎవరికి సానుభూతి అవసరమో ఆమెకు తెలుసు. బీదవారికి దు:ఖంలోవున్న వారికి అవసరమైన సహాయం ఆమె అందించేది. ఆమె సహాయక కార్యాలు ఆమె నోటి మాటలకన్నా శక్తిమంతంగా పనిచేశాయి. AATel 94.2

“ఆ దినములయందామె కాయిలాపడి చనిపోయెను.” యొప్పేలోని సంఘానికి ఆమె మరణం గొప్ప నష్టం. పేతురు లుద్దలో ఉన్నాడని విని విశ్వాసులు ఈ వర్తమానంతో అతని వద్దకు దూతల్ని పంపారు, “తడవుచేయక తమ యొద్దకు రావలెనని వేడుకొనుటకు.... పంపిరి. పేతురు లేచి వారితో కూడా అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసికొని వచ్చిరి. విధవరాండ్రందరువచ్చి యేడ్చుచు దోర్కా తమతోవున్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములును చూపుచు అతని యెదుట నిలిచిరి.” దోర్కా జీవించిన సేవాపూరిత జీవితం దృష్ట్యా వారు దు:ఖించడంలో ఆమె మృతదేహం పై కన్నీళ్లు కార్చడంలో ఆశ్చర్యం లేదు. AATel 94.3

వారి దుఃఖాన్ని చూసినప్పుడు అపొస్తలుని హృదయం చలించింది. దుఃఖిస్తున్న మిత్రుల్ని అక్కడినుంచి తీసుకు వెళ్ళిపోవలసిందిగా కోరుతూ పేతురు మోకరించి దోర్కాను బతికించి ఆమెకు ఆరోగ్యం అనుగ్రహించమంటూ దేవునికి ప్రార్థించాడు. ఆమె శవం తట్టుతిరిగి, “తబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను.” దోర్కా సంఘానికి గొప్ప సేవ చేసింది. ఆమె నిపుణత శక్తి ఇతరులకు ఇంకా దీవెనకరంగా ఉండేందుకు, తన శక్తిని ప్రదర్శించడం ద్వారా క్రీస్తు సేవను బలపర్చడానికి, దోర్కాను శత్రుభూమి నుంచి తిరిగి తీసుకురావడం అవసరమని దేవుడు తలంచాడు. AATel 94.4

పేతురు యొప్పేలోవున్న తరుణంలో కైసరయలోవున్న కొర్నేలీకి సువార్తను అందించడానకి దేవుడు అతణ్ని పిలిచాడు. AATel 95.1

కొర్నేలీ రోమా పటాలంలో శతాధిపతి. భాగ్యవంతుడు. గొప్పవంశంలో జన్మించినవాడు. బాధ్యతాయుతమైన హోదాలో వున్నవాడు. జన్మను శిక్షణను విద్యను బట్టి అన్యుడు. యూదులతో తన పరిచయంద్వారా దేవుని గూర్చి తెలుసుకొన్నాడు. యధార్ధహృదయంతో దేవుని ఆరాధిస్తూ బీదలకు కనికరం చూపించడం ద్వారా తన విశ్వాసాన్ని కనపర్చుకొన్నాడు. ఆ ప్రాంతంలో కొర్నేలీ దాతృత్వానికి ప్రఖ్యాతి పొందాడు. తన భక్తి జీవితంవల్ల అతనికి యూదుల మధ్య అన్యుల మధ్య మంచివాడన్న పేరున్నది. తనకు పరిచయం ఉన్నవారందరిపై అతని ప్రభావం దీవెనకరంగా వుంది. లేఖనాలు అతన్ని ఈ విధంగా వర్ణిస్తున్నాయి. “అతడు తన యింటివారందరితో కూడా దేవునియందు భయభక్తులుగలవాడైయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయువాడు.” AATel 95.2

భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్త దేవుడేనని మనసారా నమ్ముతూ కొర్నేలీ ఆయనను ఘనపర్చాడు. ఆయన అధికారాన్ని అంగీకరించాడు. జీవిత సమస్యలన్నిటిలోను దేవుని జ్ఞానాన్ని అన్వేషించాడు. కుటుంబ జీవితంలోను అధికార బాధ్యతల నిర్వహణలోను యెహో వాకు నమ్మకంగా నిలిచాడు. తన ప్రణాళికల అమలులోగాని తన బాధ్యతల నిర్వహణలోగాని దేవుని అనుగ్రహం లేకుండా ఏమిచేయలేనని గుర్తించిన అతడు తన గృహంలో దేవునికి బలిపీఠం నిర్మించుకొన్నాడు. AATel 95.3

కొర్నేలీ ప్రవచనాల్ని విశ్వసించి మెస్సీయాకోసం ఎదురుచూసినప్పటికీ క్రీస్తు జీవితంలోను మరణంలోను ప్రకటితమైన సువార్తను గూర్చిన జ్ఞానం అతనికి లేదు. అతను యూదు సంఘ సభ్యుడు కాడు. కనుక రబ్బీలు అతన్ని అన్యుడిగాను అపవిత్రుడిగాను పరిగణించి ఉండవచ్చు. అబ్రహాము విషయం “నేను అతనిని ఎరుగుదును” అన్న పరిశుద్ధ పరిశీలకుడు కొర్కేలీని కూడా ఎరిగివున్నాడు. అతని వద్దకు నేరుగా పరలోకం నుంచే దూతను పంపించాడు. AATel 95.4

ప్రార్థనలో ఉన్న కొర్నేలీకి దూత ప్రత్యక్షమయ్యాడు. పేరు పెట్టి తనను దూత పిలిచినప్పుడు శతాధిపతి భయపడ్డాడు. అయినా ఆ దూత దేవుని వద్ద నుంచి వచ్చినట్లు అతడెరుగును. “ప్రభువా, యేమని అడిగెను” అందుకు దూత, “నీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యెప్పేకు మనుష్యులను పంపి పేతురు అనుమారు పేరుగల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని యింట దిగియున్నాడని అతనితో చెప్పెను.” AATel 95.5

స్పష్టమైన సూచనలు, అవి పేతురు ఎవరితో బసచేస్తున్నాడో అతని వృత్తిని సైతం వివరించడం, ప్రతీ వ్యక్తి చరిత్ర, వ్యాపారం దేవునికి తెలుసునని వ్యక్తం చేస్తున్నవి. సామాన్య కార్మికుడి శ్రమ అనుభవంతో ఆయనకు ఎంత పరిచయం ఉన్నదో సింహాసనాసీనుడైన రాజు పనితో కూడా ఆయనకు అంతే పరిచయం ఉన్నది. AATel 96.1

“యెప్పేకు మనుష్యులను పంపి పేతురు అను మారు పేరుగల సీమోనును పిలిపించుము.” సువార్త సేవపట్ల వ్యవస్థీకృత సంఘంపట్ల దేవునికి గౌరవం ఉన్నాదనడానికి దేవుడిచ్చిన నిదర్శనం ఇది. కొర్సేలీకి సిలువకథ చెప్పడానికి దూతను నియమించలేదు. శతాధిపతి కొర్నేలీలాగే మానవ బలహీనతలకు శోధనలకు గురిఅయిన మనిషి, సిలువ మరణం పొంది తిరిగి లేచిన రక్షకుని గురించి అతనికి చెప్పాల్సివున్నాడు. AATel 96.2

ప్రజల మధ్య తన ప్రతినిధులుగా ఎన్నడు పాపంలో పడని దూతల్ని దేవుడు ఎంపిక చేసుకోడు గాని రక్షించడానికి తాము ఎవరికోసం కృషిచేస్తున్నారో వారి స్వభావంవంటి స్వభావంగల మనుషుల్ని ఎంపికచేసుకొంటాడు. లోకానికి రక్షణ తేవడానికి దైవ మానవ రక్షకుడు అవసరమయ్యాడు. “శోధింపశక్యముకాని క్రీస్తు ఐశ్వర్యమును” ప్రచురించడమన్న పరిశుద్ధబాధ్యతను దేవుడు మనుష్యులకు అప్పగించాడు. ఎఫెసీ 3:8. AATel 96.3

జ్ఞాని అయిన దేవుడు సత్యాన్ని అన్వేషిస్తున్నవారికి సత్యం తెలిసిన తోటి ప్రజలతో పరిచయం కలిగిస్తాడు. వెలుగు పొందినవారు చీకటిలోవున్న వారికి వెలుగు అందించడం అన్నది దేవుని ప్రణాళిక. మనసుల్ని హృదయాల్ని మార్చే శక్తిగల సువార్త తన పనిని చేయడానికి మనుషులు సర్వజ్ఞాని అయిన దేవునివద్ద నుంచి శక్తి సామర్థ్యాలు పొంది సాధనాలుగాను సేవాదళంగాను రూపొందుతారు. AATel 96.4

ఆ దర్శనానికి కొర్నేలీ సంతోషంగా లోబడ్డాడు. శతాధిపతి “తన యింటి పనివారిలో ఇద్దరిని, తన యొద్ద ఎల్లప్పుడు కని పెట్టుకొని యుండువారిలో భక్తి పరుడైన ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నియు వివరించి వారిని యెప్పేకు పంపెను.” AATel 96.5

కొర్నేలీతో సమావేశం అనంతరం యొప్పేలోవున్న పేతురువద్దకు దేవదూత వెళ్ళాడు. ఈ సమయంలో పేతురు తాను బసచేస్తున్న ఇంటి మిద్దెమిద ఘన చేస్తున్నాడు. అతను “మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను; ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై” దర్శనంలోకి వెళ్ళాడు. పేతురు శారీరక ఆహారం కోసం మాత్రమే ఆకలిగా లేడు. ఆ ఇంటి మిద్దె మీదనుంచి యెప్పేపట్టణాన్ని దాని పరిసర ప్రాంతాన్ని చూసి తనలాటి ప్రజల రక్షణకోసం ఆకలిగా ఉన్నాడు. క్రీస్తు శ్రమలు మరణం గురించి లేఖనాల్లోని ప్రవచనాల్ని వారికి చూపించి వివరించాలన్నది పేతురు ప్రగాఢ వాంఛ. AATel 96.6

దర్శనంలో పేతురు, ” ఆకాశము తెరువబడుటయు, నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటివంటి యొక విధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులును, ప్రాకు పురుగులును, ఆకాశ పక్షులును ఉండెను. అప్పుడు - పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమతనికి వినబడెను. అయితే పేతురు -వద్దు ప్రభువా, నిషిధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెప్పుడును తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవమారు ఆశబ్దము అతనికి వినబడెను. ఈలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను.” AATel 97.1

ఈ దర్శనం గద్దింపును ఉపదేశాన్ని రెండింటినీ పేతురుకి అందించింది. క్రీస్తు మరణం ద్వారా కలిగిన రక్షణ భాగ్యంలో అన్యులు యూదులతో సహవారసులన్న దేవుని చిత్తాన్ని ఈ దర్శనం పేతురుకి తెలియజేసింది. అప్పటి వరకూ శిష్యుల్లో ఎవరూ అన్యులకు సువార్త ప్రకటించలేదు. క్రీస్తు మరణం ద్వారా కూలిపోయిన అడ్డుగోడ వారి మనసులో ఇంకా నిలిచేవున్నది. వారి పరిచర్య యూదులకు మాత్రమే పరిమితమైవున్నది. ఎందుచేతనంటే సువార్త అనుగ్రహించే దీవెనలు అన్యులకు ఉద్దేశించినవి కావని వారి నమ్మకం. AATel 97.2

అనేకమంది అన్యులు పేతురు తక్కిన అపొస్తలుల బోధను అమితాసక్తితో విన్నారు. పెక్కుమంది గ్రీకు యూదులు క్రీస్తును విశ్వసించారు. అయితే అన్యుల మార్పులన్నిటిలో కొర్నేలి మార్పు ప్రాముఖ్యాన్ని సంతరించుకొన్నది. AATel 97.3

క్రీస్తు సంఘం సరికొత్త సేవారంగంలో ప్రవేశించడానికి సమయం వచ్చింది. అనేక యూదు విశ్వాసులు అన్యులకు మూసివేసిన తలుపు ఇప్పుడు తెరుచుకొన్నది. కనుక సువార్తను అంగీకరించిన అన్యులు తప్పనిసరి సున్నతి ఆచారాన్ని పాటించకుండా యూదు విశ్వాసులతో సమానులుగా పరిగణన పొందాల్సివున్నారు. AATel 97.4

తన యూదు శిక్షణవల్ల అన్యులకు వ్యతిరేకంగా పేతురు మనసులో నిలిచివున్న పూర్వభావాల్ని తొలగించడానికి ప్రభువెంత జాగ్రత్తగా పనిచేశాడు! దుప్పటి దానిలోని జంతువులు పురుగుల దర్శనం ద్వారా అపొస్తలుని పూర్వదురభిప్రాయాన్ని తొలగించి, పరలోకంలో అందరూ సమానులన్న ప్రాముఖ్యమైన సత్యాన్ని బోధించడానికి, క్రీస్తు ద్వారా అన్యులు సువార్త దీవెనలు ఆధిక్యతల్లో పాలిభాగస్తులవుతారని తెలపడానికి ఆయన ప్రయత్నించాడు. AATel 97.5

దర్శన భావం గురించి పేతురు ధ్యానిస్తుండగా కొర్నేలీ పంపిన మనుషులు యెప్పే చేరుకొని తానున్న ఇంటిగుమ్మం వద్ద నిలబడ్డారు. అంతట పరిశుద్ధాత్మ పేతురుతో ఇలా అన్నాడు, “ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెదకుచున్నారు. నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్లుము. నేను వారిని పంపి యున్నాను.” AATel 98.1

పేతురుకి ఇది కష్టమైన ఆదేశం. తన మీద పెట్టబడ్డ బాధ్యతను ప్రతీ అడుగునా అయిష్టంగా చేపట్టాడు. ఆ ఆదేశానికి అవిధేయుడు కాలేకపోయాడు. పేతురు ఆ మనుష్యుల యొద్దకు దిగివచ్చి - “ఇదిగో మీరు వెదకువాడను నేనే; మీరు వచ్చిన కారణమేమని అడిగెను. అందుకు వారు - నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యూదుజనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలీయను ఒక మనుష్యుడున్నాడు. అతడు నిన్ను తనయింటికి పిలువనంపించి నీవు చెప్పుమాటలు వినవలెనని పరిశుద్ధ దూతవలన బోధింప బడెనని తెలిపిరి.” AATel 98.2

అప్పుడే దేవుడు పంపిన ఆ దేశానుసారంగా వారితో వెళ్లడానికి అపొస్తలుడు అంగీకరించాడు. ఆ మరుసటి ఉదయం ఆరుగురు సహోదరులతో కలిసి కైసరయకు బయలుదేరాడు. అన్యుల్ని సందర్శించేటప్పుడు తాను పలికే మాటలకు చేసే క్రియలకు వీరు సాక్షులు కావల్సివున్నారు. ఎందుకంటే యూదు బోధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందుకు తాను సంజాయిషి చెప్పవలసివుంటుందని పేతురుకు తెలుసు. AATel 98.3

పేతురు కొర్నేలీ ఇంటిలో ప్రవేశించినప్పుడు ఆ అన్యుడు అతనికి సామాన్య సందర్శకుడికి నమస్కరించినట్లుగాక దేవుడు గౌరవించి తనవద్దకు పంపిన వ్యక్తిగా అతన్ని సన్మానించాడు. రాజుముందు లేక ఉన్నతాధికారి ముందు మనుషులు వినయంగా వంగడం, పిల్లలు తల్లిదండ్రుల ముందు వంగడం తూర్పుదేశాల్లోని ఆచారం. అయితే తనకు బోధించేందుకు దేవుడు పంపిన వ్యక్తిపట్ల మర్యాద సూచకంగా కొర్నేలీ అపొస్తలుడి పాదాలపై పడి పూజించాడు. పేతురుకి భయం పుట్టింది. వెంటనే శతాధిపతిని పైకి లేపుతూ “నీవు లేచి నిలువుము నేను కూడ నరుడనే” అన్నాడు. AATel 98.4

తన దూతలు తమ కార్యారమై బయలుదేరి వెళ్లగా శతాధిపతి “తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలి” చి” వారు కూడ సువార్త వినవలెనని ఆశిస్తూ పేతురు కోసం కనిపెడ్తూ ఉన్నాడు. పేతురు వచ్చేసరికి చాలా మంది సమావేశమై అతని మాటలు వినడానికి ఆసక్తిగా కని పెడ్తున్నారు. AATel 98.5

సమావేశమైన వారితో పేతురు మొట్టమొదట యూదుల ఆచారం గురించి మాట్లాడాడు. యూదులు అన్యులతో సాంఘికంగా కలిసి మెలిసి ఉండడం చట్టబద్ధం కాదని, అలా జరిగినప్పుడు ఆచారపరమైన అపవిత్రత కలుగుతుందని యూదులు పరిగణిస్తారని పేతురు పేర్కొన్నాడు. “అన్యజాతి వానితో సహవాసము చేయుటయైనను అట్టివానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మముకాదని మీకు తెలియును అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడనియైనను అపవిత్రుడని యైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి యున్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియు చెప్పక వచ్చితిని గనుక ఎందునిమిత్తము నన్ను పిలిపించితిరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పెను”. AATel 99.1

కొర్నేలీ తన అనుభవం గురించి దేవదూత చెప్పిన మాటలు గురించి ఇలా అన్నాడు “వెంటనే నిన్ను పిలిపించితిని. నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నియు వినుటకై యిప్పుడు మేమందరము దేవుని యెదుట ఇక్కడ కూడియున్నాము.” AATel 99.2

అందుకు పేతురిలా అన్నాడు, “దేవుడు పక్షపాతికాడని నిజముగా గ్రహించియున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును”. AATel 99.3

ఆసక్తిగా వింటున్న ఆ ప్రజలకు క్రీస్తు జీవితం గురించి, ఆయన అద్భుతకార్యాన్ని గురించి, ఆయన అప్పగింతను గురించి, సిలువ మరణం గురించి, ఆయన వునరుత్థానం ఆరోహణం గురించి, మానవ ప్రతినిధిగాను ఉత్తరవాధిగాను పరలోకంలో ఆయన చేస్తున్న పని గురించి అపొస్తలుడు బోధించాడు. పాపికి రక్షణ నిరీక్షణ క్రీస్తే అని అక్కడున్న వారికి వివరిస్తున్నప్పుడు తనకు కలిగిన దర్శనం భావాన్ని పేతురు మరింత స్పష్టంగా గ్రహించగలిగాడు. తాను బోధిస్తున్న సత్యం స్ఫూర్తితో అతని ముఖం ప్రకాశించింది. AATel 99.4

హఠాత్తుగా పరిశుద్ధాత్మ దిగి రావడం వల్ల పేతురు బోధకు అంతరాయం కలిగింది. “పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధవిన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరు పరిశుద్ధాత్మ వరము అన్యజనులమీద సయితము కుమ్మరింప బడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపర్చుచుండగా వినిరి.” AATel 99.5

“అందుకు పేతురు - మనవలె పరిశుద్దాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను.” AATel 99.6

సువార్త ఈ విధంగా వారికి వచ్చింది. పరాయివారు పరదేశులు అయినవారిని దేవుని భక్తులతోను దేవుని కుటుంబ సభ్యులతోను సువార్త సమానుల్ని చేసింది. కూర్చవలసివున్న పంటలో కొర్నేలీ అతని కుటుంబం ప్రథమఫలం. ఆ అన్య నగరంలో ఈ కుటుంబం ద్వారా దైవ పరిచర్య ప్రబలంగా సాగి వ్యాప్తి చెందింది. AATel 100.1

నేడు ఘనుల మధ్య సామాన్యుల మధ్య ఆత్మలకోసం దేవుడు వెదకుతున్నాడు. లోకంలోని తన పరిచర్యలో కొర్నేలీ వంటి మనుషులు పాలుపంచుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని ప్రజలంటే వారికి సానుభూతి ఉంది. కాని లోకంతో తమకున్న బంధాలు వారిని కట్టివేస్తున్నాయి. క్రీస్తు పక్క నిలబడడానికి వారికి నైతిక ధైర్యం కావాలి. తమ బాధ్యతలు సహవాసాలు కారణంగా గొప్ప ప్రమాదంలో ఉన్న ఈ వ్యక్తుల కోసం ప్రత్యేక కృషి జరగాలి. AATel 100.2

హెచ్చు తరగతి ప్రజలకు సువార్త అందించడానికి నిజాయితీ నమ్రత గల పనివారికోసం దేవుడు పిలుపునిస్తున్నాడు. యధార్థంగా మార్పు పొందిన మనుషుల రూపేణా అద్భుతాలు చోటు చేసుకోవాల్సి ఉన్నాయి. అవి ఇంకా జరగడం లేదు. లోకంలో ఉన్న ఘనులు అద్భుతాలు చేసే దేవుని శక్తికి మించినవారు కారు. దేవునితో సహకార్యకర్తలుగా పని చేసేవారు అవకాశాన్ని అందిపుచ్చుకొని తమ విధిని ధైర్యంగాను నమ్మకంగాను నిర్వహిస్తే బాధ్యతగల హోదాల్లో ఉన్నవారిని ప్రతిభ గల వారిని దేవుడు క్రైస్తవులుగా మార్చుతాడు. పరిశుద్ధాత్మ శక్తి వల్ల అనేకులు దైవ ధర్మ సూత్రాన్ని అంగీకరిస్తారు. వారు సత్యాన్ని నమ్మి దాన్ని ఇతరులకు అందించడంలో దేవుని చేతిలో సాధనాలుగా ఉంటారు. నిర్లక్ష్యానికి గురి అయిన ఈ తరగతి ప్రజల నిమిత్తం వారికి ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడుతుంది. దైవ సేవ నిమిత్తం వారు తమ సమయాన్ని ఆర్థిక వనరుల్ని వినియోగిస్తారు. ఇలా సంఘానికి జనసత్వాలు చేకూర్తాయి. AATel 100.3

కొర్నేలీ తనకు అందిన ఉపదేశానికి విధేయుడై నివసించినందున సందర్భాల్ని సంఘటనల్ని అనుకూలంగా మలిచి ఇంకా ఎక్కువ సత్వాన్ని దేవుడు అతనికిచ్చాడు. తనను సత్వంలోకి నడిపించగల వ్యక్తితో ఈ రోమా అధికారికి పరిచయం కలిగించడానికి కొర్నేలీ వద్దకు పేతురు వద్దకు దేవుడు ఒక దూతను పంపాడు. AATel 100.4

దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నవారు మన ప్రపంచంలో మన అంచనాకన్నా ఎక్కువమందే ఉన్నారు. పాపమనే చీకటితో నిండిన ఈ లోకంలో వజ్రాలవలె విలువైన ఆత్మలు ప్రభువుకి ఉన్నాయి. వారి వద్దకు ఆయన తన దూతల్ని పంపుతాడు. క్రీస్తును అంగీకరించడానికి మనుషులు అన్ని స్థలాల్లోనూ సిద్ధంగా ఉన్నారు. లోక భాగ్యంకన్న దేవునిగూర్చిన జ్ఞానం విలువైనది కోరదగినది అని భావించి ఆ వెలుగును నమ్మకంగా ప్రసరించడానికి అనేకులు ముందుకు వస్తారు. క్రీస్తు ప్రేమ తమను బలవంతం చేయగా ఆయన వద్దకు రమ్మంటూ ఇతరుల్ని వారు బలవంతం చేస్తారు. AATel 100.5

పేతురు ఒక అన్యుడి ఇంటికి వెళ్ళి అక్కడ సమావేశం అయినవారికి బోధించాడని యూదయలో ఉన్న సహోదరులు విని ఆశ్చర్యపడ్డారు, అభ్యంతరం వ్యక్తం చేశారు కూడా. తమకు మొండి సాహసంగా కనిపించిన ఆక్రియ తన బోధకే ప్రతిబంధకాలు సృష్టిస్తుందని సహోదరులు భయపడ్డారు. తర్వాత పేతుర్ని కలుసుకొన్నప్పుడు, “నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడ భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి”. AATel 101.1

పేతురు దాని కథ కమామిషు వారికి తెలియజేశాడు. తనకు వచ్చిన దర్శనాన్ని వారికి వివరించి సున్నతి చేసుకోడం చేసుకోకపోడం అన్న ఆచారాన్ని ఇక ఆచరించాల్సిన పనిలేదని అన్యుల్ని అపవిత్రులుగా పరిగణించాల్సిన పని కూడా లేదని ఆ దర్శనం తనకు చెప్పినట్లు తెలిపాడు. అన్యుల వద్దకు వెళ్లవలసిందిగా తనకు ఆదేశం రావడం, కొర్నేలీ మనుషులు తన వద్దకు రావడం, తాను కైసరయకు వెళ్లడం, కొర్నేలీతో సమావేశం కావడం వీటన్నిటిని గూర్చి పేతురు వారికి వివరించాడు. శతాధిపతితో తన సమావేశం సారాంశం పేతురు వారికి చెప్పాడు. శతాధిపతి తన దర్శనం గురించి తనకు చెప్పినట్లు తన కోసం మనుషుల్ని పంపమని ఆ దర్శనం ఆదేశించినట్లు కొర్నేలీ తనతో చెప్పినట్లు పేతురు వారికి తెలిపాడు. AATel 101.2

“నేను మాటలాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికిని దిగెను. అప్పుడు - యోహాను నీళ్ళతో బాప్తిస్మమిచ్చెను గాని మీరు పరిశుద్దాత్మలో పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకొంటిని కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నందు మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడ సమాన వరము అనుగ్రహించి యుండగా, దేవుని అడ్డగించుటకు నేను ఏపాటివాడనని చెప్పెను”. AATel 101.3

ఈ మాటలు విన్న మిదట సహోదరులు ఇక మాట్లాడలేదు. పేతురు చేసింది దేవుని ప్రణాళిక నెరవేర్పుగా జరిగిన కార్యమని, తమ పూర్యదురభిప్రాయాలు నేర్పాటు స్వభావం సువార్త సేవాస్పూర్తికి విరుద్ధమని గ్రహించి, “అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సు దయచేసియున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.” AATel 101.4

ఈ ప్రకారంగా వారి పూర్వదురభిప్రాయాలు, యుగాలుగా సిద్ధపడ్డ వేర్పాటు ఆచారం ఎలాంటి సంఘరణా లేకుండా తొలగిపోవడం, అన్య ప్రజలకు సువార్త ప్రకటించేందుకు మార్గం తెరుచుకోడం జరిగింది. AATel 101.5