అపొస్తలుల కార్యాలు

36/59

35—యూదులకు రక్షణ

అనేక తప్పనిసరి ఆలస్యాల దరిమిల పౌలు ఎట్టకేలకు కొరింథు చేరుకున్నాడు. గతంలో కొరింథులో దైవసేవ ఏమంత సాఫీగా సాగలేదు. కొంతకాలం తీవ్ర ఆందోళన చోటుచేసుకొంది. సువార్త వెలుగును మొట్టమొదటగా తమకందించిన వ్యక్తిగా తొలి విశ్వాసుల్లో చాలామంది పౌలును అభిమానించారు. ఈ విశ్వాసుల్ని కలుసుకొని వారి నమ్మకాన్ని ఉద్రేకాన్ని చూసినప్పుడు కొరింథులో తన కృషి వ్యర్థం కాలేద గ్రహించి ఆనందించాడు. AATel 263.1

క్రీస్తు నందు తమకు వచ్చిన ఉన్నతమైన పిలుపుపట్ల ఒకప్పుడు నిర్లక్ష్యం ప్రదర్శించిన కొరింథు విశ్వాసులు ఇప్పుడు బలీయమైన క్రైస్తవ వర్తమానం కలిగి ఉన్నారు. వారి మాటలు క్రియలు దైవకృపకున్న పరివర్తన శక్తిని వెల్లడించాయి. అన్యమతానికి మూఢనమ్మకాలికి కేంద్రమైన ఆపట్టణంలో ఇప్పుడు వారు మంచికి మారు పేరుగా నిలిచారు. శ్రమలవల్ల అలసి కృషించిన ఈ అపొస్తలుడి జీవితానికి ఈ ప్రియ స్నేహితులు నూతన విశ్వాసుల సహవాసంలో విశ్రాంతి లభించింది. AATel 263.2

తాను కొరింథులో గడిపిన కాలంలో పౌలు నూతన విస్తృత సేవారంగాల కోసం ఎదురుచూశాడు. రోముకు ప్రయాణించాలన్న ఆలోచన తన మనసంతా నింపింది. నాటి ప్రపంచంలో ప్రసిద్ధ కేంద్రమైన రోము నగరంలో క్రైస్తవ విశ్వాసం బలంగా పాదుకొనాలన్నది పౌలు కోరిక. అదే అతడి ప్రియమైన ప్రణాళిక. రోములో అప్పటికే ఒక సంఘం స్థాపితమయ్యింది. ఇటలీలోను ఇతరదేశాల్లోను జరగాల్సిన సేవకు రోములోని విశ్వాసుల సహకారాన్ని కూడగట్టుకోవాలని పౌలు ఆశించాడు. ఈ సహోదరుల మధ్య తన కృషికి మార్గం సుగమం చేసుకోటానికి -వారిలో చాలామంది అతనికి తెలియనివారు. - వారికి ఒక ఉత్తరం రాసి రోమును సందర్శించటంలో తన ఉద్దేశాన్ని స్పెయిన్లో సిలువ ధ్వజాన్ని ప్రతిష్ఠించాలన్న తన ఆశను వ్యక్తం చేశాడు. AATel 263.3

రోమీయులికి రాసిన ఉత్తరంలో సువార్త మహత్తర సూత్రాల్ని వివరించాడు పౌలు. యూదులు అన్యుల సంఘాన్ని కుదిపివేస్తున్న అంశాలపై తన వైఖరిని వివరించి, ఒకప్పుడు యూదులకు మాత్రమే చెందిన నిరీక్షణలు వాగ్దానాలు ఇప్పుడు అన్యులు కూడా పొందుతారని చెప్పాడు. AATel 264.1

క్రీస్తు పై విశ్వాసం ద్వారా నీతిమందుడుగా తీర్పు పొందటమన్న సిద్ధాంతాన్ని పౌలు విస్పష్టంగా శక్తిమంతంగా బోధించాడు. రోములోని క్రైస్తవులకు వచ్చిన ఉపదేశం వల్ల ఇతర సంఘాలు కూడ లబ్ధి పొందుతాయని పౌలు నిరీక్షించాడు. అయితే తన మాటల దీర్ఘకాలిక ప్రభావాన్ని పౌలు స్పష్టంగా చూడలేకపోయాడు. విశ్వాసమూలంగా నీతిమంతుడని తీర్పును గూర్చి పొందటాన్ని సత్యం పశ్చాతప్తులైన పాపుల్ని జీవమార్గంలోకి నడిపించటానికి అన్ని యుగాల్లోనూ శక్తిమంతమైన దీపంగా నిలిచింది. లూథర్ మనసును మసకబార్చిన చీకటిని పటాపంచలు చేసి పాపాన్ని శుద్ధి చేసే క్రీస్తు రక్తాన్ని బహిర్గతం చేసింది. పాపభారంతో కుంగిపోతున్న వేలాది ఆత్మల్ని క్షమాపణను శాంతిని ఇచ్చే యధార్థమూలం వద్దకు ఈ వెలుగే నడిపిస్తున్నది. రోమీయులకు రాసిన ఉత్తరం నిమిత్తం ప్రతి క్రైస్తవుడు దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. AATel 264.2

ఈ ఉత్తరంలో యూదుల విషయంలో పౌలు తన హృదయభారాన్ని వెలిబుచ్చుతున్నాడు. తనలో మార్పు కలిగిన నాటినుంచి తన యూదు సహోదరులు సువార్త సందేశాన్ని స్పష్టంగా గ్రహించటానికి దోహదపడాలన్న వాంఛ ఉండేది. “ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునైయున్నది” అంటున్నాడు పౌలు. AATel 264.3

అపొస్తలుడి వాంఛ సామాన్యమైందికాదు. నజరేయుడైన యేసును వాగ్రత్త మెస్సీయాగా అంగీకరించటంలో విఫలులైన ఇశ్రాయేలీయుల రక్షణ కోసం పనిచేయాల్సిందిగా విజ్ఞాపన చేస్తూ పౌలు నిత్యం ప్రార్థించాడు. రోములోని విశ్వాసులనుద్దేశించి ఇలా అన్నాడు, “క్రీస్తు నందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడ సాక్ష్యమిచ్చు చున్నది. సాధ్యమైన యెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై యుండగోరుదును. వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచా రాదులును వాగ్దానములు వీరి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు.” AATel 264.4

యూదులు దేవుడు ఎన్నుకొన్న ప్రజలు. మానవజాతి యావత్తును వారి ద్వారా ఆశీర్వదించాలన్నది దేవుని ఉద్దేశం. వారి మధ్యనుంచే దేవుడు పలువురు ప్రవక్తల్ని లేవదీశాడు. విమోచకుడు వస్తాడని, ఆయన్ను వారు నిరాకరించి చంపుతారని ఆయనను వాగ్దత్త రక్షకుడుగా గుర్తించటంలో ముందుండవలసిన వీరే ఆపని చేస్తారని ఆ ప్రవక్తలు ముందే చెప్పారు. AATel 264.5

శతాబ్దాల్ని వీక్షిస్తూ ప్రజలు ప్రవక్తలు ఒకరి తర్వాత ఒకర్ని తుదకు దైవకుమారుడు యేసును విసర్జించటం చూస్తున్న ప్రవక్త యెషయా దైవ ప్రజల్లో లెక్కించబడని అన్యులు విమోచకుణ్ని అంగీకరించటం గురించి రాయటానికి దేవావేశం పొందాడు. ఈ ప్రవచనాన్ని ప్రస్తావిస్తూ పౌలిలా అంటున్నాడు: “మరియు యెషయా తెగించి - నన్ను వెదకనివారికి దొరికితిని; నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే -అవిధేయులై యెదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని.” AATel 265.1

ఇశ్రాయేలీయులు తన కుమారుణ్ని నిరాకరించినప్పటికీ దేవుడు వారిని విసర్జించలేదు. తన వాదనను కొనసాగిస్తూ పౌలంటున్న మాటలు వినండి: “అలాగైన యెడల నేనడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించెనా? అట్లనరాదు. నేను కూడ ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రము నందు పుట్టినవాడను. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలీయాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనోక్కడనే మిగిలియున్నాను, నాప్రాణము తీయజూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని యెదుడ అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమని చెప్పుచున్నది? బయలునకు మోకాళ్లూనని యేడు వేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొని యున్నాను. ఆలాగుననే అప్పటి కాలమందు సయితము కృప యొక్క యేర్పాటుచొప్పున శేషము మిగిలియున్నది.” AATel 265.2

ఇశ్రాయేలీయులు తొట్రిల్లి పడిపోయారు. అయినా వారు మళ్లీ లేవటం అసాధ్యంకాదు. “వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన యెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును! అన్యజనులగు నాతో నేను మాటలాడుచున్నాను. నేను అన్యజనులకు అపొస్తలుడనైయున్నాను గనుక ఏ విధముననైనను నా రక్తసంబంధులకు రోషము పుట్టించి, వారిలో కొందరినైనను రక్షింపలెనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధాన పరచుట అయిన యెడల, వారిని చేర్చుకొనుట యేమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా?” AATel 265.3

తన కృప అన్యజనుల మధ్య ఇశ్రాయేలు ప్రజల మధ్య ప్రదర్శితం కావాలన్నది దేవుని ఉద్దేశం. ఈ విషయం పాతనిబంధన ప్రవచనాల్లో తేటతెల్లంగా ఉంది. ఈ ప్రవచనాల్లో కొన్నింటిని అపొస్తలుడు తన వాదనలో ఉటంకిస్తున్నాడు: “ఒక ముద్దలో నుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారములేదా? ఆలాగు దేవుడు తన ఉగ్రతను ఆగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటమును ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటముల యెడల, అనగా యూదులలోనుండి మాత్రముకాక, అన్యజనులలో నుండియు ఆయన పిలిచిన యెడల, తన మహిమైశ్వర్యము కనుపరచవలెననియున్న నేమి? ఆ ప్రకారము -నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు, పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు మా ప్రజలు కారని యేచోటను వారితో చెప్పబడెనో, ఆచోటనే జీవముగల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును.” హోషేయ 1:10 చూడండి. AATel 265.4

ఇశ్రాయేలీయులు ఒకజాతిగా విఫలులైనప్పటికీ వారిలో శేషించి రక్షణకు అర్హులైన వారు చాలామంది ఉన్నారు. రక్షకుని రాక సమయంలో నమ్మకంగా ఉన్న స్త్రీలు పురుషులు అనేకమంది ఉన్నారు. వారు స్నానికుడైన యోహాను వర్తమానాన్ని సంతోషంగా స్వీకరించారు. ఈ విధంగా మెస్సీయాను గూర్చిన ప్రవచనాల్ని నూతనంగా పఠించటానికి వారు స్ఫూర్తిని పొందారు. తొలినాళ్ళలో క్రైస్తవ సంఘం ఏర్పడ్డప్పుడు, నవ ్మకంగా ఉన్న ఈ యూదులే ఆ సంఘ సభ్యులు. ఆ యూదులు నజరేయుడైన యేసును తాము కని పెట్టిన మెస్సీయాగా స్వీకరించారు. “ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైతే కొమ్మలును పరిశుద్ధములే.” పౌలు ఈ శేషాన్ని గురించే మాట్లాడున్నాడు. AATel 266.1

ఇశ్రాయేలీయుల్లో శేషించినవారిని కొన్ని కొమ్మలు విరిగిపోయిన ఒలీవచెట్టుతో పౌలు పోల్చుతున్నాడు. అన్యజనుల్ని మంచి ఒలీవకు అంటుకట్టబడ్డ అడవి ఒలీవ కొమ్మలతో పోల్చుతున్నాడు. అన్యవిశ్వాసులకి రాస్తూ పౌలిలా అంటున్నాడు, “అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి, ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన యెడల, ఆ కొమ్మల పైన నీవు అతిశయింప కుము. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నదిగాని నీవు వేరును భరించుటలేదు. అందుకు - నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసమునుబట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు, గర్వింపక భయపడుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచి పెట్టని యెడల నిన్నును విడిచి పెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును నీవు అనుగ్రహప్రాప్తుడవై నిలిచియున్నయెడల నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము, అట్లు నిలువని యెడల నీవును నరికివేయబడుదువు.” AATel 266.2

అవిశ్వాసంవల్ల, తన విషయంలో దేవుని ఉద్దేశాల్ని తిరస్కరించటం వల్ల ఒక జాతిగా ఇశ్రాయేలీయులు దేవునితో తమ సంబంధాన్ని పోగొట్టుకున్నారు. తల్లిచెట్టునుంచి వేరు చేయబడ్డ కొమ్మల్ని నిజమైన వేరుతో అనగా దేవునికి నమ్మకంగా నిలిచినవారిలో శేషించిన వారితో దేవుడు ఐక్యపర్చగలిగాడు. విరిచివేసిన కొమ్మలగురించి మాట్లాడూ, “వారును తమ అవిశ్వాసములో నిలువకపోయిన యెడల అంటుగట్టబడుదురు, దేవుడు వారిని మరల అంటుకట్టుటకు శక్తిగలవాడు” అంటున్నాడు అపొస్తలుడు. అన్యజనులికి అతడిలా రాస్తున్నాడు, “నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టునుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన యెడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటుకట్టబడరా? సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరు చున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను. AATel 267.1

“విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులోనుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడియున్నట్లు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు. సువార్త విషయమైతే వారు మిమ్మునుబట్టి శత్రువులుగాని, యేర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులైయున్నారు. ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. మీరు గత కాలమందు దేవునికి అవిధేయులైయుండి, యిప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలేనే మీ యెడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందునిమిత్తము, ఇప్పుడు వారు విధేయులైయున్నారు. అందరి యెడల కరుణ చూపవలెనని దేవుడు అందరిని అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించియున్నాడు. AATel 267.2

“ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు, ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగియున్నవి. యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక.” AATel 267.3

యూదులు అన్యజనుల హృదయాల్ని మార్చటానికి దేవుడు సమర్థుడని, ఇశ్రాయేలీయులికి వాగ్దానం చేసిన ఆశీర్వాదాల్ని క్రీస్తును విశ్వసించిన ప్రతీ విశ్వాసికి ఇస్తాడని పౌలు ఈ రకంగా విశదీకరించాడు. దైవ ప్రజల్ని గురించి యెషయా చేసిన ప్రకటనను పౌలు పునరుద్ఘాటిస్తున్నాడు. ” ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండునను శేషమే రక్షింపబడునని యెషయాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము- సైన్యములకధిపతియగు ప్రభువు మనకు సంతానము శేషింపజేయక పోయిన యెడల సొదొమవలె నగుదుము, గొమొట్టాను పోలియుందుము.” AATel 268.1

యెరూషలేము నాశనమైన సమయంలో ఆలయం శిధిలాల కుప్పగా మిగిలినప్పుడు వేలాదిమంది యూదుల్ని అన్యదేశాల్లోకి బానిసలుగా అమ్మివేశారు. ఎడారిలోని తీరాన ఉన్న ఓడ శిధిలాల్లా వారు లోకమంతటా చెదిరిపోయారు. పద్దెనిమిది వందల సంవత్సరాలపాటు యూదులు లోకంలో వివిధ దేశాల్లో సంచరించారు. ఏ ఒక్క దేశంలోనూ వారు ఒక జాతిగా తమ పూర్వ ప్రతిష్టను వైభవాన్ని తిరిగి సంపాదించుకునే ఆధిక్యతను పొందలేకపోయారు. శతాబ్దాలుగా వారు అవమానానికి, ద్వేషానికి, హింసకు గురి అయ్యారు. వారిది శ్రమలు హింసతో నిండిన పౌరసత్వం. AATel 268.2

యేసును విసర్జించిన తరుణంలో ఒక జాతిగా యూదులికి భయంకర నాశనం తథ్యమన్న ప్రకటన జరిగినప్పటికీ దేవునికి నమ్మకంగా నిలిచి భక్తిగా జీవించిన యూదు పురుషులు స్త్రీలు యుగాల పొడవునా అనేకమంది ఉన్నారు. తమ బాధల్ని శ్రమల్ని వారు నిశ్శబ్దంగా అనుభవించారు. శ్రమల్లో వారిని దేవుడు ఓదార్చాడు. వారి భయంకర పరిస్థితిని సానుభూతితో పరికించాడు. తన వాక్యాన్ని సరిగా గ్రహించటానిక శక్తినియ్యమని పూర్ణహృదయంతో హృదయ వేదనతో చేసిన వారి ప్రార్థనల్ని ఆయన విన్నాడు. తమ తండ్రులు నిరాకరించి సిలువ వేసిన దీన నజరేయునిలో ఇశ్రాయేలు నిజమైన మెస్సీయాను కొందరు చూశారు. ఎంతోకాలంగా సంప్రదాయం, తప్పుడు విశ్లేషణల మాటున పడి ఉన్న సుపరిచిత ప్రవచనాల ప్రాముఖ్యాన్ని తమ మనసు గ్రహించే కొద్దీ, క్రీస్తును వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించేందుకు ఎంపికచేసుకొన్నవారి హృదయాలు మహత్తర వరానికై కృతజ్ఞతతో నిండుతాయి. AATel 268.3

“శేషమే రక్షింపబడును” అన్న యెషయా ప్రవచనం ఈ తరగతి ప్రజల్ని ప్రస్తావిస్తున్నది. పౌలు దినాలనుంచి నేటి వరకూ దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా యూదుల్ని అన్యజనుల్ని పిలుస్తూనే ఉన్నాడు. “దేవునికి పక్షపాతములేదు” అంటున్నాడు పౌలు “గ్రీసు దేశస్థుల కును గ్రీసుదేశస్థులు కాని వారికిని” యూదులకును రుణస్తుడిగా పౌలు తన్నుతాను పరిగణించుకున్నాడు. కాగా ఇతరులకన్నా యూదులకున్న విశేషావకాశాన్ని పౌలు ఎన్నడూ విస్మరించలేదు. ఎందుకంటే “దేవోకులు యూదుల పరముచేయబడెను.” “నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడ రక్షణకలుగజేయుటకు అది (సువార్త) దేవుని శక్తియైయున్నది. ఎందుకనగా - నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.” యూదుల విషయంలోను అన్యజనుల విషయంలోను, సమానంగా శక్తిమంతమైన క్రీస్తు తాలూకు ఈ సువార్తను గురించి తాను సిగ్గుపడటం లేదని రోమీయులికి రాసిన ఉత్తరంలో పౌలు ప్రకటిస్తున్నాడు. AATel 268.4

యూదులికి ఈ సువార్తను సంపూర్ణంగా ప్రకటించినప్పుడు అనేక మంది క్రీస్తును మెస్సీయాగా స్వీకరిస్తారు. యూదు ప్రజల రక్షణ నిమిత్తం కృషి చేయాలన్న నిబద్ధతగలవారు బోధక వర్గంలో బహుకొద్దిమందే ఉన్నారు. కాని ఇలా విడవబడ్డవారికీ ఇంకా అనేకులికీ క్రీస్తు కృప ఆయన పై నిరీక్షణను గూర్చిన వర్తమానం అంది తీరాలి. AATel 269.1

సువార్త ప్రకటన చివరికాలంలో, అంతవరకూ అలక్ష్యం చేసిన తరగతుల ప్రజల కోసం ప్రత్యేక సేవ జరగాల్సిన ఆ సమయంలో తన సువార్త సేవకులు లోకంలో అన్నిచోట్లా ఉన్న యూదుల పట్ల ప్రత్యేక ఆసక్తి చూపించాలని దేవుడు కోరుతున్నాడు. యెహోవా నిత్య సంకల్పాన్ని విశదపర్చటంలో పాత, కొత్త నిబంధనల లేఖనాల్ని జోడించి ఉపయోగించినప్పుడు అనేకమంది యూదులకు అది నూతన సృష్టి ప్రారంభంలా ఆత్మకు పునరుత్థానంలా కనిపిస్తుంది. సువార్త శకంలోని క్రీస్తును పాత నిబంధన లేఖన పుటల్లో చిత్రీకరించటం, పాతనిబంధనను కొత్త నిబంధనను ఎంతో స్పష్టంగా వివరించటం చూసినప్పుడు నిద్రపోతున్న వారి మనసులు మేల్కొంటాయి, వారు క్రీస్తును రక్షకుడుగా స్వీకరిస్తారు. అనేకులు విశ్వాస మూలంగా క్రీస్తును తమ విమోచకుడుగా అంగీకరిస్తారు. వారి విషయంలో ఈ మాటలు నెరవేరాయి, “తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను” యోహాను 1:12. AATel 269.2

తార్సువాడైన పౌలులా లేఖనాల్లో దిట్టులైనవారు యూదుల్లో కొందరున్నారు. వీరు ధర్మశాస్త్రం మార్పులేనిదని ఎలుగెత్తి చాటుతారు. దీన్ని ఇశ్రాయేలు దేవుడు మన దినాల్లోనే నెరవేర్చుతాడు. ఆయన హస్తం రక్షించలేనంత కురుచగా లేదు. సుదీర్ఘ కాలంగా నిర్లక్ష్యానికి తృణీకారానికి గురి అయిన వారికోసం దేవుని సేవకులు విశ్వాసంతో పనిచేసినప్పుడు ఆయన రక్షణ వెల్లడవుతుంది. AATel 269.3

“ఆందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా, యాకోబు కుటుంబమునుగూర్చి యీలాగు సెలవిచ్చుచున్నాడు - ఇకమీదట యాకోబు సిగ్గుపడడు. ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. అతని సంతానపువారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచునప్పుడు నా నామమును పరిశుద్ధపర చుదురు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు. ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. చంచల బుద్దిగలవారు వివేకులగుదురు. సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు” యెషయా 29:22-24. AATel 270.1