అపొస్తలుల కార్యాలు

35/59

34—అంకిత భావంతో సేవ

తన జీవితంలోను తాను బోధించిన పాఠాల్లోను క్రీస్తు స్వార్థరహిత సేవకు సంపూర్ణమైన సాదృశ్యాన్నిచ్చాడు. ఈ సేవకు ఆరంభం దేవుడే. దేవుడు తనకోసం తానే జీవించడు. లోకాన్ని సృజించి సకల చరాచరజగాన్ని సంరక్షించటంద్వారా ఆయన ప్రతినిత్యం ఇతరులకు సేవచేస్తున్నాడు. “ఆయన చెడ్డవారి మీదను మంచి వారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదను అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు” మత్తయి 5:45. ఈ సేవాదర్శాన్ని తండ్రి కుమారుడికి అందించాడు. సేవ చేయుటమంటే ఏంటో తన ఆదర్శం ద్వారా ప్రదర్శించటానికి యేసు మానవజాతికి శిరస్సుగా ఉన్నాడు. యేసు జీవితమంతా ఓ సేవా నిబంధన కింద సాగింది. ఆయన అందరికీ సేవచేశాడు. అందరికీ పరిచర్య చేశాడు. AATel 254.1

తన శిష్యుల మధ్య ఈ సూత్రాన్ని నెలకొల్పటానికి ఆయన పదేపదే ప్రయత్నించాడు. యాకోబు యోహాన్లు ప్రముఖ స్థానాలకోసం మనవి చేసినప్పుడు ఆయన ఇలా స్పందించాడు, “మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను. మీలో ఎవడు ముఖ్యడై యుండగోరునో వాడు దాసుడై యుండవలెను. ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదుగాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగ తన ప్రాణము నిచ్చుటకు వచ్చెను.” మత్తయి 20:26-28. AATel 254.2

తన ఆరోహణం నాటినుంచి లోకంలో తన సేవను క్రీస్తు తాను ఎంపిక చేసుకొన్న ప్రతినిధుల ద్వారా కొనసాగిస్తున్నాడు. ఆ ప్రతినిధుల ద్వారానే ఆయన మనుషులతో మాట్లాడటం, వారికి సేవలందించటం చేస్తున్నాడు. సంఘానికి శిరస్సు అయిన ఈ మహానాయకుడు దేవుని వల్ల అభిషేకం పొంది తన ప్రతినిధులుగా వ్యవహరించే మనుషుల ద్వారా తన సేవను పర్యవేక్షిస్తాడు. AATel 254.3

వాక్య బోధ ద్వారా సిద్ధాంత ప్రకటన ద్వారా దేవుడు తన సంఘ నిర్మాణానికి పిలిచేవారి బాధ్యత గురుతరమైంది. వారు క్రీస్తు స్థానంలో పనిచేస్తూ దేవునితో సమాధాన పడాల్సిందిగా ప్రజలను ఆహ్వానించాల్సి ఉన్నారు. దేవుని వద్ద నుంచి వివేకాన్ని శక్తిని పొందితేనేగాని వారు ఈ కర్తవ్యాన్ని సాధించలేరు. AATel 254.4

క్రీస్తు బోధకులు తాము ఎవరి మధ్య పనిచేస్తున్నారో ఆ ప్రజలకు ఆధ్యాత్మిక సంరక్షకులు. వారి సేవ కావలికాసేవారి సేవ వంటిది. పూర్వం పట్టణ ప్రాకారాలపై కావలికాసేందుకు కావలివాళ్లను నియమించేవారు. ఆ కావలివారు ప్రాకారాల పై ఆయా స్థలాల నుంచి కాపాడాల్సిన వివిధ బాగాల్ని పరిశీలించి శత్రువు రాకను పసిగట్టి హెచ్చరిక చేసేవారు. కావలివారి నమ్మకమైన సేవల మీదే పట్టణంలోని ప్రజల క్షేమం ఆధారపడి ఉండేది. నిర్దిష్ట సమయాల్లో ఈ కావలివారు పిలుచుకొంటూ, అందరూ మెళుకువగా ఉండేటట్లు, పట్టణానికి ఏముప్పు వాటిల్లకుండేటట్లు చూడాల్సి ఉన్నారు. క్షేమవార్త లేదా హెచ్చరిక ఒకనోటినుంటి ఒకనోటికి వెళ్తూ పట్టణమంతా మారుమోగేది. AATel 255.1

బోధకుల్ని ఉద్దేశించి ప్రభునిలా అంటున్నాడు: “నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించియున్నాను గనుక నీవు నానోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవియ్యగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు నీవు ఆదుర్మార్గునికి నామాట తెలియజేయని యెడల ఆదుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందునుగాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్థతను విడువవలెనని నీవు అతనికి హెచ్చరిక చేయగా . . . నీవు నీ ప్రాణమును దక్కించుకొందువు”. యెహెజ్కేలు 33:7-9. AATel 255.2

దైవ సంఘానికి సంరక్షకులుగాను దైవ మర్మాలకు గృహనిర్వాహకులుగాను నియమితులైన వారివి గంభీరమైన బాధ్యతలని ప్రవక్త పలికిన మాటలు విశదం చేస్తున్నాయి. వారు సీయోను పట్టణ గోడల పై నిలిచి శత్రువు రాకను గమనించి ప్రజలకు హెచ్చరిక చేయాల్సి ఉన్నారు. ఆత్మలు శోధనకు లొంగే ప్రమాదం ఉంది. సువార్త ప్రబోధకులు తమ సేవల్ని నమ్మకంగా నిర్వహిస్తేనేగాని ఆత్మలు నశించటం తథ్యం. ఏ కారణం వల్లనైనా వారి ఆధ్యాత్నిక శక్తులు మందగిల్లి మొద్దుబారి నందున ఎదురవుతున్న అపాయాన్ని గ్రహించలేక దైవ ప్రజలకు హెచ్చరిక చేయకపోతే నశించేవారి రక్షణకి దేవుడు వారిని బాధ్యులు చేస్తాడు. AATel 255.3

సీయోను గోడల పై కావలికాసేవారు దేవునికి దగ్గరగా నివసిస్తూ పరిశుద్దాత్మ ప్రభావానికి లోనవుతూ, ఆయన తమ ద్వారా పనిచేస్తూ మనుషులికి తామున్న అపాయకర పరిస్థితిని గురించి వారికి హెచ్చరిక చేసి సురక్షిత స్తానానికి వారికి దారి చూపే విశేషావకాశం కలిగి ఉన్నారు. అతిక్రమానికి తప్పక కలిగే పర్యవసానాన్ని గురించి ప్రజల్ని హెచ్చరిస్తూ వారు సంఘం ఆసక్తుల్ని ప్రయోజనాల్ని కాపాడాల్సిఉన్నారు. ఏ వేళలోనూ వారు బద్దకించటానికి ప్రమత్తులవ్వటానికి లేదు. వారు తమ కర్తవ్య నిర్వహణలో తమ సర్వశక్తుల్ని వినియోగించటం అవసరమౌతుంది. వారి కంఠాలు బూరలకుమల్లే బిగ్గరగా మోగాల్సి ఉంటుంది. వారు తడబడూ అనిశ్చితంగా ఎన్నడూ పలకకూడదు. వారు జీతం కోసం పనిచెయ్యకూడదు. సువార్త ప్రకటించకపోతే తమకు శ్రమ కలుగుతుందన్న గుర్తింపుతో వారు పనిచెయ్యాలి. దేవుడు ఎంపిక చేసుకొన్నవారు, సమర్పణ రక్తంతో ముద్రితులైనవారు రానున్న నాశనం నుంచి స్త్రీలను పురుషులను రక్షించాల్సి ఉన్నారు. AATel 255.4

క్రీస్తుతో జతగా పనిచేసే పనివాడు తన సేవ పవిత్రమైందని ఎరిగి దాన్ని విజయవంతంగా నెరవేర్చేందుకు అవసరమయ్యే శ్రమను త్యాగాన్ని గూర్చిన స్పృహ కలిగి పనిచేస్తాడు. సొంత సుఖాన్నే సౌలభ్యాన్నే పరిగణించడు. తన్నుతాను మర్చిపోతాడు. తప్పిపోయిన గొర్రెల్ని వెదకటంలో అలసిఉన్న తన పరిస్థితిని గుర్తించడు. చలి ఆకలి బాధల్ని లెక్కచెయ్యదు. అతడి గురి ఒక్కటే - నశిస్తున్న ఆత్మల్ని రక్షించటం. AATel 256.1

ఇమ్మానుయేలు రక్తసిక ధ్వజం కింద పనిచేసే వ్యక్తి సాహస, కృషి, ఓర్పు, సహనం అవసరమైన ఆయన సేవను చేస్తాడు. సిలువ యోధుడు సందేహించకుండా యుద్ధ ప్రాంగణంలో నిలబడ్డాడు. శత్రువు తన పై దాడి జరిపితే అతడు సహాయం కోసం ఆశ్రయ దుర్గాన్ని ఆశ్రయిస్తాడు. వాక్యంలోని వాగ్దానాల్ని ప్రభువు వద్దకు తెస్తూ ఆ తరుణంలో నిర్వర్తించాల్సిన విధులకు అవసరమైన బలాన్ని పొందుతాడు. పైనుంచి వచ్చే శక్తి తనకు అవసరమని గుర్తిస్తాడు. అతడు సాధించే విజయాలు ఆత్మోన్నతికి నడిపించవు. బలవంతుడైన ఆ ప్రభువుమీద మరెక్కువ ఆధారపడి ఉండటానికి అవి దోహదపడ్డాయి. ఆ మహాశక్తి మీద ఆధారపడ్డప్పుడు రక్షణ వర్తమానాన్ని శక్తిమంతంగా అందించటానికి సామర్థ్యం పొందుతాడు. ఆ వర్తమానం ప్రజల మనసుల్లో ప్రతిధ్వనిస్తుంది. AATel 256.2

వాక్యబోధ చేసే వ్యక్తి దేవునితో ప్రార్థన ద్వారా ప్రతీ ఘడియా సంప్రదిస్తూ వాక్య పఠనం చేస్తూ నివసించాలి. ఇదే శక్తికి మూలం. బోధకుడికి తన బోధనుంచి వచ్చే ప్రభావం కన్నా అధిక శక్తి దేవునితో అతడి సంప్రదింపుల నుంచి వస్తుంది. ఈ శక్తిని అతడు పోగొట్టుకోకూడదు. విధి నిర్వహణ కోసం శ్రమల్ని తట్టుకోటం కోసం బలం ప్రసాదించమని, అగ్నితో తన పెదవులు స్పృశించమని కాదనలోని రీతిలో అతడు దేవునితో విజ్ఞాపన చెయ్యాలి. నిత్యసత్యాలపై క్రీస్తు రాయబారుల పట్టు తరచుగా ఎంత బలహీనంగా ఉంటుంది! మనుషులు దేవునితో నడచినట్లయితే వారిని ఆయన బండసందున దాస్తాడు. ఇలా దాగి ఉండే మోషేకుమల్లే వారు దేవుని చూడగలుగుతారు. ఆయన అనుగ్రహించే శక్తివల్ల వెలుగువల్ల వారు మరెక్కువ అవగాహన కలిగి పరిమితమైన తమ గ్రహింపును మించి ఎంతో ఎక్కువ సాధించగలుగుతారు. AATel 256.3

సాతాను తన కపటాన్ని మోసాల్ని నిరాశ నిస్పృహలకు గురి అయిన వారిపై విజయవంతంగా ప్రయోగిస్తాడు. బోధకుణ్ని నిరాశ ఆవరించినప్పుడు అతడు తన అవసరాల్ని దేవుని ముందు ఉంచాలి. ఆకాశం మబ్బు కమ్మి భయంకరంగా కనిపించినప్పుడు పౌలు దేవుణ్ని మరెక్కువగా విశ్వసించాడు. శ్రమలు కడగండ్లు అంటే ఏంటో పౌలుకి అందరికన్నా ఎక్కువ అవగాహాన ఉంది. శోధన సంఘర్షణలు చుట్టుముట్టినప్పుడు పరలోకం దిశలో అడుగులువేస్తూ అతడు వెలిబుచ్చిన ఆశాభావాన్ని వినండి: “మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్ర ముండు మా చులకని శ్రమ మాకొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగుచేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు.” 2 కొరింథీ 4:17,18. అదృశ్యం నిత్యం అయినవాటి మీదే పౌలు దృష్టి కేంద్రీకృతమయ్యుంది. తాను అతిలోక శక్తుల్తో పోరాడున్న విషయం గుర్తించి పౌలు దేవుని మీద ఆధారపడ్డాడు. అతని శక్తి ఇందులోనే ఉంది. అదృశ్యుడైన ఆ ప్రభువును వీక్షించటం ద్వారా ఆత్మకు బలం శక్తి లభిస్తాయి. మనసు పైన ప్రవర్తన పైన లోకానికున్న పట్టు విడిపోతుంది. AATel 257.1

బోధకుడు తాను ఏ ప్రజల మధ్య సేవచేస్తున్నాడో వారితో కలిసిమెలిసి ఉండాలి. వారితో ఏర్పడే పరిచయం ద్వారా అతడు తన బోధను వారి అవసరాలకు అనుగుణంగా మలుచుకోగలుగుతాడు. బోధకుడు తన ప్రసంగాన్ని ముగించినప్పుడే అతడి పని మొదలవుతుంది. అతడు వ్యక్తిగతంగా చెయ్యాల్సిన పని ఉంటుంది. ప్రజల్ని తమగృహల్లో కలుసుకోవాలి. వారితో కలిసి ప్రార్థన చెయ్యాలి. దైవసేవకులు తమ గృహాలకు వెళ్లి దేవుని ఉన్నత మార్గాన్ని తమకు చూపించేంత వరకూ దేవుని వాక్యంలోని సత్యాల్ని ఎన్నడూ గ్రహించని కుటుంబాలెన్నో ఉన్నాయి. కాకపోతే, ఈ సేవ చేసే వారి హృదయాలు క్రీస్తు హృదయంతో కలిసి స్పందించటం అవసరం. AATel 257.2

“నాయిల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము” (లూకా 14:23) అన్న ఆదేశంతో చాలా అర్థం ఇమిడి ఉంది బోధకులు. వారు సువార్త పరిచర్య చేస్తున్న వారికి దగ్గరవుతూ కుటుంబాల్లో సత్యాన్ని బోధించాలి. ఇలా దేవునితో సహకరించి పనిచేస్తే ఆయన వారికి ఆధ్యాత్మిక శక్తినిస్తాడు. తమ పనిలో వారిని క్రీస్తు నడిపిస్తాడు. వారు మాట్లాడటానికి మాటలిస్తాడు. అవి శ్రోతల హృదయాల్సి హత్తుకొంటాయి. ప్రతీ సువార్తికుడికీ పౌలుతో ఇలా చెప్పే ఆధిక్యత కలుగుతుంది, “దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు”, “ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు దేవుని యెదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచవలెనని . . . . సాక్ష్యమిచ్చుచుంటిని.” అ.కొ. 20:27,20,21. AATel 257.3

రక్షకుడు ప్రతీ గృహాన్ని సందర్శించి వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపర్చాడు. దు:ఖిస్తున్న వారిని ఓదార్చాడు, శ్రమలకు గురి అయిన వారిని శాంతింపజేశాడు, నిరీక్షణ లేనివారికి శాంతిని ప్రకటించాడు. చిన్న పిల్లన్ని ఎత్తుకొని ఆశీర్వదించాడు. తల్లులతో నిరీక్షణ ఓదార్చుతో నిండిన మాటలు మాట్లాడాడు. శ్రమలు దు:ఖాలు అనుభవిస్తున్న మనుషుల పట్ల దయ కనికరాలు ప్రదర్శించాడు. తనకోసం కాదు పరులకోసం ఆయన కష్టించాడు. ఆయన అందరికీ దాసుడయ్యాడు. తనకు పరిచయమైన వారందరికీ నిరీక్షణను ఇచ్చి బలోపేతుల్ని చెయ్యటమే ఆయనకు అన్నపానాలుగా ఉండేది. రబ్బీలు బోధిస్తున్న సంప్రదాయాలు సిద్ధాంతాలకు భిన్నమైన సత్యాల్ని ఆయన బోధించగా విన్న స్త్రీ పురుషుల్లో నిరీక్షణ వెల్లువెత్తింది. ఆయన బోధలోని నిజాయితీ ఆయన మాటలపై గట్టి నమ్మకం పుట్టించేది. సువార్త పరిచారకులు క్రీస్తు పని చేసిన పద్దతిని నేర్చుకోవాల్సి ఉంది. AATel 258.1

తాము ఎవరి నిమిత్తం పాటు పడ్తున్నారో ఆప్రజల ఆధ్యాత్మికావసరాల్ని తీర్చేందుకు ఏది అవసరమో దాన్ని దైవ వాక్యధనాగారం నుంచి తీసుకొని వచ్చి సరఫరా చేయాల్సి ఉన్నారు. ఈ విధంగానే వారు తమకు దేవుడిచ్చిన బాధ్యతను నిర్వర్తించ గలుగుతారు. క్రీస్తు తాను ప్రతి నిత్యం పొందుతున్న ఉపదేశాన్ని ప్రజలకు ఉపదేశిస్తున్నప్పుడు ఆయనలో ఏ ఆత్మ నివసించాడో ఆ పరిశుద్దాత్మే ఆయన బోధకు జ్ఞానానికి శక్తికి మూలమై లోకంలో ఆయన సేవను నిర్వహించటానికి దోహదడతాడు. AATel 258.2

సువార్త పరిచర్యలో ఉన్న కొందరు విజయవంతులు కాకపోవటానికి కారణం ప్రభువు సేవపై వారు తమ పూర్తిగమనాన్ని నిలుపకపోటమే. ఆత్మల్ని రక్షకుని చెంతకు నడిపించే కార్యంపై మితిలేని ఆసక్తి తప్ప బోధకులకు మరే ఇతర ఆసక్తి ఉండకూడదు. క్రీస్తు పిలుపు అందుకొన్న జాలరులు వెంటనే తమ వలలు విడిచి పెట్టి ఆయన్ను వెంబడించారు. బోధకులు తమ వ్యక్తిగత వ్యాపారాసక్తుల్ని అనుసరిస్తూ అదే సమయంలో దేవుని సేవను చేయటం సాధ్యంకాదు. ఇలా పంపిణీ అయిన ఆసక్తి ఆధ్యాత్మికవగాహనను మసకబార్చుతుంది. మనసు లౌకిక విషయాలతోనే నిండుతుంది. క్రీస్తు సేవ మరుగున పడుంది. దేవుని సేవావసరాలకు అనుగుణంగా పరిస్థితుల్ని మలుచుకొనే బదులు వారు పరిస్థితులకు అనువుగా ఉండేటట్లు దైవ సేవను మార్చటానికి ప్రయత్నిస్తారు. AATel 258.3

బోధకుడి ఉన్నతమైన పిలుపు నెరవేర్పుకు అతడి సర్వశక్తులూ అవసరం. అతడి ఉత్తమ సమర్థతలు దేవునికి చెందుతాయి. అదృష్టం మీద ఆధారపడే పనులు లేదా తాను చేస్తున్న గొప్ప సేవనుంచి తనను పక్కకు మళ్లించే వ్యాపారం అతడు చేయకూడదు. “సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు, తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెనని యీ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు” (2 తిమోతి 2:4) అంటున్నాడు పౌలు. బోధకుడు మినహాయింపులు లేకుండా ప్రభువు సేవకు తన్నుతాను అంకితం చేసుకోటం అవసరమని పౌలు నొక్కి చెబుతున్నాడు. తన్ను తాను దేవునికి పూర్తిగా సమర్పించుకొన్న బోధకుడు తన పవిత్రమైన పిలుపుకు అడ్డుతగిలే ఏ వ్యాపారాన్నైనా చేయటానికి సమ్మతించడు. అతడు లోక ప్రతిష్టను లేదా లోక భాగ్యాన్ని ఆశించడు. అతడి పరమోద్దేశం మానవాళికి నిత్యజీవ భాగ్యాన్ని ఇవ్వటానికి తన్నుతాను అర్పించుకొన్న రక్షకుణ్ని గూర్చి ప్రకటించటమే. అతడి ఆశ ఈలోకంలో సిరిసంపదలు పోగు చేసుకోటం కాదు గాని ఆసక్తి లేని ప్రజలకు ద్రోహులైన జనులకు నిత్యజీవాన్ని గూర్చిన సత్యాల్ని అందించటం. గొప్ప లౌకిక పరమైన లాభాలు సమకూర్చే వ్యాపారంలో పాలుపొందటానికి అతడు ఆహ్వానం పొందవచ్చు. అలాంటి శోధనలకు అతడిచ్చే సమాధానం ఇది, “ఒకడు సర్వలోకమును సంపాగించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము?” మార్కు 8:36. AATel 258.4

సాతాను ఈ ప్రలోభాన్ని క్రీస్తు ముందు కూడా ఉంచాడు. క్రీస్తు దాన్ని అంగీకరించినట్లయితే లోకాన్ని విమోచించటం జరగదని అతడికి బాగా తెలుసు. ఈనాడు ఇదే శోధనను వివిధ రూపాల్లో దైవ సేవ కుల ముందుంచుతాడు సాతాను. దానికి ఆకర్షితులయ్యేవారు తమ కర్తవ్యం పట్ల నిబద్ధత కలిగిఉండరని అతడికి తెలుసు. AATel 259.1

తన సువార్త పరిచారకులు ధన సంపాదనకు కృషి చెయ్యాలన్నది దేవుని సంకల్పం కాదు. దీని విషయమై పౌలు తిమోతికి ఇలా రాశాడు. “ధనా పేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము.” క్రీస్తు రాయబారులు తాము జీవించే జీవితం ద్వారా మాట్లాడే మాటల ద్వారా “ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులుకాక, అస్థిరమైన ధనము నందు నమ్మిక యుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికయుంచుడని. ... వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలు చేయువారును సత్క్రియలు అనుధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి” ఆజ్ఞాపించాల్సి ఉన్నారు. తిమోతి 6:10,11,17,19. AATel 259.2

పౌలు అనుభవాలు, సువార్త పరిచర్య పరిశుద్ధతను గూర్చిన పౌలు ఉపదేశం సువార్త సేవ చేస్తున్న బోధకులకు సహాయాన్ని స్ఫూర్తిని అందిస్తాయి. పాపుల పట్ల పౌలుకి మితిలేని ప్రేమ. ఆత్మల్ని రక్షించటానికి తన సర్వశక్తుల్ని ధారబోశాడు. పౌలుని మించిన నిస్వార్థపరుడు సహన శీలుడైన పరిచారకుడు ఇంకొక్కడు లేడు. తాను పొందిన ఉపకారాల్ని పరులకు మేలు చేసేందుకు ఉపయుక్తం కావలసిన వాటిగా పరిగణించేవాడు. రక్షకుణ్ని గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి ఒక్క తరుణాన్ని కూడా అతడు జారవిడువలేదు. కష్టంలో ఉన్నవారికి చేయూత నివ్వటానికి ఒక్క అవకాశాన్ని కూడా పోనివ్వలేదు. సువార్త ప్రకటిస్తూ సంఘాలు స్తాపిస్తూ ఒక చోటునుంచి ఇంకోచోటికి వెళ్లాడు. మాట్లాడటానికి తరుణం దొరికినప్పుడల్లా తప్పును ప్రతిఘటించి ప్రజలకు నీతిమార్గం ఆవిష్కరించేవాడు. AATel 259.3

పౌలు తాను స్థాపించిన సంఘాన్ని మర్చిపోలేదు. ఒక మిషనరీ ప్రయాణం అనంతరం పౌలు బర్నబాలు తాము స్థాపించిన సంఘాలకు తిరిగి వెళ్లి సభ్యుల్ని సందర్శించారు. సంఘాల్లో నుంచి కొంతమందిని సువార్త సేవకు తర్బీతు చెయ్యటానికి ఎంపిక చేశారు. AATel 260.1

పౌలు పరిచర్యలో భాగమైన ఈ విశేషత నుంచి నేటి బోధకులు నేర్చుకోవలసిన పాఠం ఉంది - యువకుల్ని సువార్త పరిచారకులుగా తీర్చిదిద్దటం తన మిషన్లీ ప్రయాణాల్లో యువకుల్ని వెంటబెట్టుకొని వెళ్లేవాడు. వారు ఈ విధంగా అనుభవం సంపాదించుకొని బాధ్యతల్ని నిర్వహించటానికి సమర్ధులయ్యేవారు. వారిని విడిచి మరోచోటకి వెళ్లినా పౌలు వారి పనిని గూర్చి తెలుసుకొనేవాడు. వారి విజయ సాధనపై పౌలుకెంత ఆసక్తి ఉందో అతడు తిమోతికి తీతుకి రాసిన ఉత్తరాలే వివరిస్తాయి. AATel 260.2

సేవాభారమంతా తామే మోసే బదులు అనుభవజులైన సువార్త సేవకులు యువసేవకుల్ని తర్బీతు చేసి వారిపై ఆభారాన్ని మోపితే వారెంతో ఉదాత్త సేవ చేసేవారవుతారు. AATel 260.3

క్రీస్తు సేవకుడుగా తనమీద ఉన్న బాధ్యతను పౌలు ఎన్నడూ విస్మరించలేదు. లేదా తన అజాగ్రత్త కారణంగా ఆత్మలు నశిస్తే దానికి తనను దేవుడు జవాబుదానిరి చేస్తాడని ఎన్నడూ మర్చిపోలేదు. సువార్తను గురించి అతడిలా ప్రకటించాడు, “దేవుని వాక్యమును, అనగా యుగములలోను తరములలోను మరుగుచేయబడియున్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మియందున్న క్రీస్తు, మహిమను నిరీక్షణయై యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి యిప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణముగా చేసి ఆయన యెదుట విలువబెట్టవలెనని, సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యనికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి పోరాడుచు ప్రయాసపడుచున్నాను.” కొలొస్స. 1:25-29. AATel 260.4

ఈ మాటలు క్రీస్తు సేవకుడి ముందు ఓ ఉన్నత లక్ష్యాన్ని ఉంచుతున్నాయి. అయినా తమ్మును తాము క్రీస్తు నియంత్రణకు సమర్పించుకొని అనుదినం క్రీస్తు పాఠశాలలో పాఠాలు నేర్చుకొనే వారికి ఈ లక్ష్యసాధన సులభమే. దైవాజ్ఞకున్న శక్తి అపరిమితం. ఆ శక్తి ఎంతో అవసరమైన బోధకుడు తలుపు వేసుకొని ప్రభువుతో ప్రార్థనలో సమయం గడిపితే వినేవారికి రక్షణార్థమైన రక్షణ సువాసనగా పరిణమించే వర్తమానాన్ని పొందుతాడు. AATel 261.1

తన “పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక” సువార్త పరిచారకుడు తాను బోధిస్తున్న సత్యాలకు అనుగుణంగా నివసించాలని పౌలు రచనలు సూచిస్తున్నాయి. కొరింథీయ విశ్వాసులకు రాసిన ఉత్తరంలో తన సొంత పరిచర్యను గురించిన వివరణను మనకు విడిచి పెట్టాడు : “శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరముల లోను ఉపవాసములలోను మిగుల ఓర్పుగలవారమై పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘ శాంతము దయతోను పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్వము చెప్పుటవలనను దేవుని బలము వలనను కుడియెడమల నీతి ఆయుధములు కలిగి ఘనతా ఘనతల వలనను సుకీర్తి దుష్కీరుల వలనను దేవుని పరిచారకులమైయుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించు కొనుచున్నాము. మేము మోన గాండ్రమైనట్లుండియు సత్యవంతులము; తెలియబడని వారమైనట్లుండియు బాగుగ తెలియబడినవారము; చనిపోయినవారమైనట్లుండియు ఇదిగో బ్రదుకుచున్నవారము; శిక్షింపబడినవారమైనట్లుండియు చంపబడనివారము; దు:ఖింపబడినవారమై నటుండియు ఎల్లప్పుడు సంతోషించు వారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము.” 2 కొరింథీ 6:3, 4-10. AATel 261.2

అతడు తీతుకు ఇలా రాశాడు: “అటువలెనె స్వస్థబుద్దిగలవారై యుండవలెనని యౌవన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడుమాట యేదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను.” తీతుకు 2:6-8. సత్యమనే విత్తనాలు చల్లి పంటకు ఎదురుచూస్తూ భూమి పై వ్యర్థ స్థలాలకు వెళ్లే తన సువార్త సేవకులకంటే ప్రశస్తమైన వారు దేవుని దృష్టిలో ఇంకెవ్వరూ ఉండరు. నశించినవారిని వెదకే తన సేవకుల ఆందోళనను క్రీస్తు తప్ప ఇంకెవ్వరూ అవగాహన చేసుకోలేరు. ఆయన వారికి తమ ఆత్మనిస్తాడు. అప్పుడు వారి కృషి ద్వారా జనులు పాపం విడిచి పెట్టె నీతిని అనుసరిస్తారు. AATel 261.3

తనకు మిషనెరీలుగా సేవచేయటానికిగాను తమ పొలాన్ని వ్యాపారాన్ని అవసరమైతే తమ కుటుంబాల్ని విడిచి పెట్టటానికి సమ్మతించే మనుషులకు దేవుడు పిలుపు నిస్తున్నాడు. ఆ పిలుపును అంగీకరించేవారుంటారు. ఇతర దేశాలకు వెళ్లి విగ్రహారాధకులు అనాగరిక ప్రజల మధ్య పని చెయ్యటానికి గృహసౌఖ్యాల్ని, మిత్రుల సహవాసాన్ని, భార్యని, పిల్లల్ని కూడా విడిచి పెట్టినవారు గతంలో ఉన్నారు. క్రీస్తు పట్ల ప్రేమ, నశించినవారి అవసరాల్ని గుర్తింపు వారిని కదిలించాయి. ఆ కృషిలో పలువురు తమ ప్రాణాలు పోగొట్టుకొన్నారు. అయినా వారి స్థానాల్ని ఆక్రమించటానికి ఇతరులు లేచారు. ఇలా క్రమక్రమంగా క్రీస్తు సేవ ముందుకు వెళ్లింది. కన్నీటితో చల్లిన విత్తనాలు విస్తారమైన పంటపండాయి. దేవుని గూర్చిన జ్ఞానం విస్తరించింది. అన్యమతం ప్రబలున్న దేశాల్లో సిలువపతాక ప్రతిష్టాపన జరిగింది. AATel 262.1

ఒక్క పాపి మారుమనసు పొందటంకోసం బోధకుడు తన వనరులన్నిటినీ వినియోగించాలి. దేవుడు సృజించిన, క్రీస్తు విమోచించిన ఆత్మ దాని ముందున్న అవకాశాల్ని బట్టి దానికున్న ఆధ్యాత్మిక లాభాల్ని బట్టి, దైవ వాక్యం పటిష్ఠం చేయటంతో దానికి కలిగే సామర్థ్యాన్ని బట్టి, సువార్త అందించే నిరీక్షణ ద్వారా దానికి ఒనగూడే అమర్త్యతను బట్టి గొప్ప విలువను సంతరించుకొంటుంది. ఒక్క గొర్రెను రక్షించటానికి క్రీస్తు తొంభైతొమ్మిది గొర్రెల్ని విడిచి పెత్తే మనం దానికన్నా తక్కువ చెయ్యటం న్యాయమా? క్రీస్తు పనిచేసినట్లు పనిచెయ్యటం క్రీస్తు త్యాగం చేసినట్లు త్యాగం చెయ్యటాన్ని నిర్లక్ష్యం చెయ్యటం, పరిశుద్ధ నిధుల విషయంలో నమ్మక ద్రోహం చెయ్యటం దేవుని అవమానించటం అవ్వదా? AATel 262.2

చిత్త శుద్ధిగల బోధకుడి హృదయం ఆత్మలను రక్షించటానికి తహతహ లాడ్తుంది. అతడు తన సమయాన్ని తన శక్తిని వెచ్చిస్తాడు. శ్రమ చెయ్యటానికి వెనకాడడు. తన ఆత్మకు అంత ఆనందాన్ని శాంతిని ఉత్సాహాన్ని తెచ్చిన సువార్త సత్యాల్ని ఇతరులు వినాలి. క్రీస్తు ఆత్మ అతడికి తోడుగా ఉంటాడు. అతడు లెక్క అప్పచెప్పవలసినవాడిలా ఆత్మలకోసం ఎదురుచూస్తాడు. తన దృష్టి కల్వరి సిలువమిద నిలిపి, సిలువపై వేలాడిన రక్షకుణ్ని వీక్షిస్తూ, ఆయన కృప మీద ఆధారపడి, ఆయన తన రక్షణగా, తనబలంగా తన సామర్థ్యంగా తనతో చివరి వరకూ ఉంటాడని విశ్వసించి అతడు దేవునికి సేవచేస్తాడు. అతడు దైవ ప్రేమ వాగ్దానంతో కూడిన ఆహ్వానాల్తో విజ్ఞాపనలతో ఆత్మల్ని క్రీస్తు వద్దకు నడిపించటానికి కృషి చేస్తాడు. ” పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్న” వారిలో అతడు ఒకడుగా పరలోకంలో పరిగణన పొందుతాడు. ప్రకటన 17:14. AATel 262.3