అపొస్తలుల కార్యాలు

34/59

33—శ్రమల నడుమ సేవానిరతి

దేవుని సేవ పోషణకు సరియైన మద్దతును గూర్చిన స్పష్టమైన లేఖన బోధనను విశ్వాసుల ముందు పెడ్తూ, సువార్త సేవకుడుగా తాను సొంత పోషణార్థం లౌకికమైన “పని చేయకుండుటకు . . . అధికారము లేని” (1 కొరింథీ 9:6) వాణ్ని కానని అన్నా పౌలు తన పరిచర్యలో అనేక సందర్భాల్లో నాగరికత గల గొప్ప పట్టణాల్లో స్వీయపోషణ నిమిత్తం చేతిపని చేశాడు. AATel 245.1

యూదు సమాజంలో శారీరక శ్రమను గౌరవభంగంగా పరిగణించేవారు కాదు. హెబ్రీయులు తమ బిడ్డలకు కష్టపడి పనిచేసే అలవాటు నేర్పాలని మోషే ద్వారా దేవుడు ఉపదేశించాడు. శారీరక శ్రమ అంటే ఏంటో ఎరుగకుండా యువతను పెరగనివ్వటం పాపంగా పరిగణించేవారు. ఓ చిన్నారిని పరిశుద్ధ హోదాకు విద్య కరపవలసిఉన్నా వాస్తవ జీవితాన్ని గూర్చిన జ్ఞానం తప్పనిసరి అని భావించేవారు. తల్లిదండ్రులు ధనికులైనా దరిద్రులైనా ప్రతీ యువకుడికి ఓ చేతిపని నేర్పేవారు. ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఈ తర్బీతు ఇవ్వటం అశ్రద్ధ చేశారో వారిని ప్రభువు ఉపదేశాన్ని బేఖాతరు చేసిన వారిగా పరిగణించేవారు. ఈ సంప్రదాయం ప్రకారం చిన్నతనంలోనే పౌలు డేరాలు కుట్టే వృత్తిని నేర్చుకొన్నాడు. AATel 245.2

క్రీస్తు అనుచరుడు కాక పూర్వం పౌలు ఉన్నత హోదాను అలంకరించాడు. జీవనోపాధికి కాయకష్టం మీద ఆధారపడాల్సిన అవసరం లేకపోయింది. కాకపోతే అనంతరం క్రీస్తు సేవ పురోగతికి తన ద్రవ్యాన్ని పూర్తిగా వాడేసిన తర్వాత స్వీయ పోషణ నిమిత్తం కొన్నిసార్లు తన పాత వృత్తిని అవలంబించేవాడు. ముఖ్యంగా ప్రజలు తన పరిచర్యను అపార్థం చేసుకున్న స్థలాల్లో ఈ పని చేసేవాడు. AATel 245.3

చేతులతో పనిచేసి తన్నుతాను పోషించుకొంటూ పౌలు మొట్టమొదటగా థెస్సలొనీకలో సువార్తను ప్రకటించినట్లు చదువుతున్నాం. అక్కడ విశ్వాసులకు రాస్తూ వారికి పౌలు ఇలా గుర్తుచేశాడు, మేము “అపొస్తలులమైయున్నందున అధికారము చేయుటకు సమర్ధులమైయున్నను . . . ఘనత మేము కోరలేదు”. ఇంకా ఇలా అన్నాడు, “అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును నాకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండ కూడదని రాత్రింబగళ్లు కష్టముచేసి జీవనము చేయుచు మికు దేవుని సువార్త ప్రకటంచితిమి”. 1 థెస్స 2:6,9. వారికి రాసిన రెండో ఉత్తరంలో తానూ తన తోటి సువార్తికులూ “ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు” అని మళ్లీ వెలిబుచ్చారు. ‘మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని” మేము రాత్రనక పగలనక పనిచేశాం “మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనపరచుకొనుటకే యీలాగు చేసితిమి గాని, మాకు అధికారము లేదని చేయలేదు” 2 థెస్స 3:8,9. AATel 245.4

తమ చేతుల్తో పనిచేయటానికి నిరాకరించిన వారిని పౌలు థెస్సలొనీకలో కలుసుకొన్నాడు. అనంతరం ఈ తరహా ప్రజల్ని గురించే పౌలు ఇలా రాశాడు: “మీలో కొందరు ఏపనియు చేయక పరుల జోలికి పోవుచు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు, సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరటవారికి ఆజ్ఞా పూర్వకముగా హెచ్చరించుచున్నాము”. థెస్సలొనీకలో పరిచర్య చేసిన కాలంలో వారికి ఆదర్శం చూపించటానికి పౌలు జాగ్రత్తగా వ్యవహరించాడు. “మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు -ఎవడైనను పనిచేయనొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిని గదా”, 11,12,10 వచనాలు. AATel 246.1

సంఘంలోకి మత ఛాందసాన్ని ప్రవేశపెట్టటం ద్వారా దైవ సేవకుల కృషిని దెబ్బతియ్యటానికి ప్రతీ యుగంలోనూ సాతాను ప్రయత్నిస్తూ వచ్చాడు. పౌలు దినాల్లో, అనంతర శతాబ్దాల్లో, దిద్దుబాటు కాలంలో ఇదే పరిస్థితిని సృష్టించాడు. ప్రపంచానికి ఎంతో మేలు చేసిన విక్లిఫ్, లూథర్ మొదలైన సంస్కర్తలెందరో అత్యావేశ పరుల్ని, అస్థిరుల్ని, భ్రష్ట ప్రవృత్తి గలవారిని వంచించే సాతాను మోసాల్ని ఎదుర్కొన్నారు. మనసు యధార్థ పరిశుద్ధత సాధనకు ప్రాపంచిక ఆలోచనల్ని అధిగమించి, మనుషుల్ని శారీరక శ్రమకు దూరంగా ఉంచుతుందని సాతానుచే వంచితులైన కొందరు ప్రబోధిస్తున్నారు. మరికొందరు లేఖన వాక్యాలికి తీవ్రభావాలు అంటగట్టి, పని చెయ్యటం పాపమని, క్రైస్తవులు తమకు తమ కుటుంబాలకు సంక్షేమాన్ని గురించిన ఆలోచనలు చేయకూడదని, వారు తమ సమయమంతా ఆధ్యాత్మిక విషయాల పైనే గడపాలని ప్రబోధిస్తున్నారు. అపొస్తలుడు పౌలు బోధనలు, ఆదర్శం ఈ తీవ్ర భావాలను ఖండించాయి. AATel 246.2

థెస్సలొనీకలో ఉన్న కాలంలో తన జీవనానికి పౌలు పూర్తిగా తన పని ద్వారా వచ్చే సంపాదన మీదే ఆధారపడలేదు. ఆ నగరంలో తన అనుభవాల్ని గురించి అనంతరం ప్రస్తావిస్తూ థెస్సలొనీకలో తానున్నప్పుడు తాము పంపిన ఆర్థిక సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఫిలిప్పీయ విశ్వాసులికి ఇలా రాశాడు, “థెస్సలొనీకలో కూడ మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి” ఫిలిప్పీ 4:16. ఈ సహయం పొందినప్పటికీ, తాను పేరాశగలవాణ్నని ఎవరూ ఆరోపించకుండా ఉండేందుకు, శారీరక శ్రమ విషయంలో ఛాందసవాదులకు చెంప పెట్టుగా ఉండేందుకు శ్రద్ధగా పని చెయ్యటంలో థెస్సలొనీకయుల ముందు మంచి ఆదర్శాన్ని నిలపటానికి పౌలు శ్రద్ధ వహించాడు. AATel 246.3

పౌలు మొట్టమొదటగా కొరింథును సందర్శించినప్పుడు తానెలాంటి ప్రజల మధ్య ఉన్నాడో గ్రహించాడు. వారు కొత్తగా వచ్చిన వారి ఉద్దేశాల్ని అనుమానించే ప్రజలు. సముద్ర తీరప్రాంతంలో ఉన్న గ్రీకు ప్రజలు వ్యాపారవేత్తలు. వ్యాపార లావాదేవిల్లో రాటుదేలటంతో దైవభక్తి అంటే వ్యాపారంలో లాభమేనని, నమ్మకంగానో అపనమ్మకంగానో డబ్బు సంపాదించటమే ప్రధానమని ధృడంగా నమ్మారు. వారి గుణలక్షణాలు పౌలు ఎరగనివి కావు. ధనం సంపాదించటానికే తాను సువార్త సేవ చేపట్టాడని తన్ను నిందించటానికి పౌలు వారికి ఎలాంటి అవకాశం ఇవ్వదలచు కోలేదు. ఆ విషయంలో పౌలుకి కొరింథి శ్రోతల వద్దతు లభించేదే కాని అతడు ఈ హక్కును విడిచి పెట్టుకోటానికి సిద్ధమయ్యాడు. అలా చేస్తే సువార్తను లాభార్జనకు బోధిస్తున్నాడన్న అపనింద సువార్త సేవకుడుగా తన మంచి పేరును విలువను దెబ్బతీస్తుందని పౌలు భయపడ్డాడు. తన వర్తమానం శక్తిమంతంగా నిలిచేందుకు దురవగాహనకు అన్ని అవకాశాల్ని తొలగించటానికి వీలు ప్రయత్నించాడు. AATel 247.1

కొరింథు పట్టణం చేరిన వెంటనే “పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్యయైన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్లెను.” “పౌలు అదే వృత్తి గలవాడు” యూదులంతా రోము విడిచి పెట్టి వెళ్లిపోవాలంటూ కౌదియ జారీ వచ్చింది. కొరిథులో వారు డేరాల తయారీ వ్యాపారం ప్రారంభించారు. పౌలు వారిని గురించి భోగట్టా చేసి వారు దైవభక్తిగల జంట అని, తమ చుట్టూ ఉన్న దుష్ప్రభావాల నుంచి వారు తప్పించుకోజూస్తున్నారని పౌలు తెలుసుకొన్నాడు. వీరు “వారితో కాపురముండెను. వారు కలిసి పనిచేయు చుండిరి . . . అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజమందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచునుండెను”. అ.కా. 18:2-4. AATel 247.2

అనంతరం సీల, తిమోతీలు పౌలును కొరింథులో కలిశారు. ఈ సహోదరులు సువార్త పోషణ నిమిత్తం మాసిదోనియ సంఘాల నుంచి నిధులు తెచ్చారు. AATel 247.3

కొరింథులో ఓ బలమైన సంఘం స్థాపించిన అనంతరం ఆ సంఘానికి తాను రాసిన రెండో ఉత్తరంలో వారి మధ్య తాను జీవించిన జీవితం ఎలాంటిదో పౌలు పునర్విమర్శించాడు. వారిని ఇలా ప్రశ్నించాడు. “మిమ్మును హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేను తగ్గించుకొనినందున పాపము చేసితినా? మీకు పరిచర్య చేయుటకై నేనితర సంఘముల వలన జీతము పుచ్చుకొని, వారి ధనము దొంగిలినవాడనైతిని. మరియు నేను మీ యొద్దనున్నప్పుడు నాకక్కర కలిగియుండగా నేనెవని మిదను భారము మోపలేదు; మాసిదోనియ నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయములోను నేను మీకు భారముగా ఉండకుండ జాగ్రత్త పడితిని. ఇక ముందుకు జాగ్రత్తపడుదును. క్రీస్తు సత్వము నీ యందు ఉండుట వలన అకయ ప్రాంతములందు నేనీలాగు అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరితరము కాదు.” 2 కొరింథీ 11:7-10. AATel 247.4

కొరింథులో ఈ విధంగా తానెందుకు వ్యవహరించాడో పౌలు వివరిస్తున్నాడు. నిందించచూస్తున్నవారికి “కారణము దొరకకుండ కొట్టివేయుటకు” అలా వ్యవహరించాడు. 2 కొరింథీ 11:12. డేరాలు తయారుచేస్తూనే పౌలు సువార్త ప్రచారాన్ని నమ్మకంగా కొనసాగించాడు. తన సేవల్ని గురించి పౌలే ఇలా అంటున్నాడు, “సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన, అపొస్తలుని యొక్క చిహ్నములు పూర్తమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను.” ఇంకా పౌలిలా అంటున్నాడు, “నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములో తప్ప, మరి ఏ విషయములో మిరితర సంఘముల కంటె తక్కువ వారైతిరి? నేను చేసిన యీ అన్యాయమును క్షమించుడి ఇదిగో యీ మూడవసారి నా యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు మిమ్నునే కోరుచున్నాను . . . కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను; నన్ను నేను వ్యయపరచుకొందును”. 2 కొరింథీ 12:12-15. AATel 248.1

ఎఫెసులో అతడు మూడు సంవత్సరాల పాటు ఆప్రాంతమంతటా బలమైన సువార్త ఉద్యమం జరిపాడు. సుదీర్ఘమైన ఈ సువార్త పరిచర్యకాలంలో పౌలు మళ్ళీ తన వృత్తిని చేపట్టాడు. కొరింథులోలాగే ఎఫెసులో కూడా అకుల ప్రిస్కిల్లల సముఖం వల్ల అపొస్తలుడికి ఎంతో ఆదరణ కలిగింది. తన రెండో మిషనెరీ ప్రయాణం అంతంలో పౌలు ఆసియాకు తిరిగి వెళ్లినప్పుడు వీరు అతడి వెంట వెళ్లారు. AATel 248.2

పౌలు తన చేతుల్తో పని చెయ్యటాన్ని వ్యతిరేకించినవారు కొందరున్నారు. అది సువార్త బొధకుడైన పౌలు యాంత్రిక పనికి వాక్యపరిచర్యకు ఇలా ఎందుకు ముడి పెట్టాలి అని ప్రశ్నించారు. పనివాడు వేతనానికి పాత్రుడు కాడా? మరింత మెరుగుగా వినియోగించాల్సిన సమయాన్ని డేరాల తయారీకి వినియోగించటం దేనికి? అన్నారు. AATel 248.3

అయితే ఇలా ఖర్చయ్యిన సమయం వృధాపుచ్చిన సమయంగా పౌలు పరిగణించలేదు. అకుల్లతో కలసి పనిచేస్తున్న సమయంలో ఆమహోపాధ్యాయుడైన ప్రభువుతో అనుబంధం కలిగి ఉండేవాడు. రక్షకుణ్ని గూర్చి సాక్ష్యం చెప్పటంలో, అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వటంలో ముందంజ వేసేవాడు. పౌలు మనసు ప్రతి నిత్యం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అన్వేషిస్తూ ఉండేది. తోటి పనివారికి ఆధ్యాత్మిక విషయాల పై ఉపదేశం ఇచ్చేవాడు. ఒట్టించి పనిచెయ్యటంలోను క్రమం పాటించటం లోను వారికి ఆదర్శంగా నిలిచాడు. పౌలు చురుకైన, నిపుణతగల కార్యకర్త, మెళుకువ లెరిగిన వ్యాపారి, “ఆత్మయందు తీవ్రతగల” వాడై “ప్రభువును” సేవించాడు. రోమా 12:11. డేరాలు కుట్టే తన వృత్తిలో పనిచేస్తున్నప్పుడు తాను వేరే విధంగా చేరలేని తరగతి ప్రజలతో పౌలుకు పరిచయం ఏర్పడేది. సామాన్య కళల్లో నైపుణ్యం దేవుని వరమని పౌలు తన సహచరులకు చెప్పేవాడు. దేవుడే ఆవరాన్ని దాన్నుపయోగించే తెలివిని ఇస్తాడని చెప్పేవాడు. అనుదినం చేసే పనుల్లో సయితం దేవున్ని గౌరవించాలని బోధించాడు. పరిశ్రమ వల్ల సున్నితత్వం కోల్పోయిన అతడి చేతులు క్రైస్తవ బోధకుడుగా అతడు చేస్తున్న దుఃఖభరిత విజ్ఞప్తుల శక్తిని ఏమాత్రం తగ్గించలేదు. AATel 248.4

కొన్నిసార్లు పౌలు రాత్రింబగళ్లు పనిచేసేవాడు. స్వీయపోషణ నిమిత్తమే గాకుండా తోటి సువార్తికుడికి సాయపడటానికి శ్రమించి పనిచేసేవాడు. తన సంపాదనను లూకాతో పంచుకొనేవాడు. తిమోతికి ఆర్థికంగా సాయం చేసేవాడు. ఇతరుల అవసరాలు తీర్చే ప్రయత్నంలో కొన్నిసార్లు పస్తులు కూడా ఉండేవాడు. పౌలు నిస్వార్థజీవి. తన పరిచర్య చరమదశలో మిలేతులో సమావేశమైన ఎఫెసు పెద్దలకు వీడ్కోలు పలుకుతున్న తరుణంలో, పనివల్ల కరకుగా ఉన్న తన చేతుల్ని వారి ముందు పైకెత్తి ఇలా అనగలిగాడు. ” ఎవని వెండినైనను, బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నాచేతులు కష్టపడినవని మీకే తెలియును. మీరు ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలెననియు, పుచ్చుకొనుట కంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూసితిని.” అ.కా. 20:33-35. AATel 249.1

క్రీస్తు సేవ నిర్వహణలో కష్టాలు లేమి అనుభవిస్తున్నామని బోధకులు బాధపడుంటే పౌలు పనిచేసిన కర్మాగారాన్ని వారు ఊహలో దర్శిస్తే మంచిది. దేవుడు ఎన్నుకొన్న ఈ వ్యక్తి క్రీస్తు చిత్రపటానికి క్యాన్వాసును రూపొందిస్తున్న సమయంలో తన భుక్తిని తాను సంపాదించుకొంటున్నాడు. చేతుల్తో పనిచేసి దాన్ని సంపాదిస్తున్నాడు. AATel 249.2

పని దీవెనేగాని శాపం కాదు. సోమరితనం దైవభక్తిని నాశనం చేస్తుంది, దేవుని ఆత్మను దుఃఖ పెడుంది. నీరు నిలవున్నగుంత కంపుకొడుతుంది. స్వచ్ఛమైన నీళ్లతో ప్రవహించే ఏరు దేశమంతా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని నింపుతుంది. శారీరక శ్రమను నిర్లక్ష్యం చేసేవారు త్వరలో బలహీనులవుతారని పౌలుకు తెలుసు. చేతుల్తో పని చెయ్యటం ద్వారా కండరాలకి వ్యాయామం చేకూర్చి బలాన్ని పొంది తద్వారా సువార్తలో ఎదురుకానున్న కష్టాల్ని లేముల్ని సహించాలని యువ బోధకులకు నేర్పించాలని పౌలు ఆశించాడు. తన శరీరంలోని అన్ని భాగాలకీ సరైన వ్యాయామం సమకూర్చకపోతే తన సొంత బోధనకు పటుత్వం ఉండదని పౌలు గుర్తించాడు. AATel 249.3

జీవితంలోని సామాన్య విధుల్ని నమ్మకంగా నిర్వహించటం ద్వారా ఒనగూడే విలువైన వ్యాయామాన్ని సోమరిపోతులు పోగొట్టుకొంటున్నారు. కృప గల దేవుడు అనుగ్రహించే సుఖాన్ని అనుభవించటానికే వేలాదిమంది నివసిస్తుంటారు. దేవుడు తమకు ఇచ్చిన ధనానికి ప్రభువుకి కృతజ్ఞతార్పణలు చెల్లించటం వారు మర్చిపోతారు. తమకు దేవుడచ్చిన వరాల్సి విజ్ఞతతో ఉపయోగించటం ద్వారా తాము ఉత్పత్తిదారులూ వినియోగదారులూ కావచ్చునని వారు మర్చిపోతారు. వారు తనకు సహాయకులుగా చేయాలని దేవుడు కోర్టున్నపనిని వారు అవగాహన చేసుకొంటే వారు బాధ్యతను తప్పించుకోరు. AATel 250.1

దేవుడు తమను సువార్త పరిచర్యకు పిలిచాడని భావించే యువకుల సాఫల్యం వారు తమ పరిచర్యను ఏవిధంగా ప్రారంభిస్తారో దానిమీద ఆధారపడి ఉంటుంది. దేవుడు ఎంపిక చేసుకొన్నవారు తాము పొందిన ఉన్నతమైన పిలుపుకు రుజువు కనపర్చుతారు. సమర్థమైన సేవకులుగా పెరగటానికి తరుణాల్ని అన్వేషిస్తారు. ప్రణాళిక రచనకు, వ్యవస్థీకరణకు, అమలుకు అగత్యమైన అనుభవం సంపాదించటానికి కృషి సల్పుతారు. తమ పిలుపు పరిశుద్ధతను అభినందిస్తూ ఆత్మ క్రమశిక్షణ ద్వారా వారు ఎక్కువగా మరింత ఎక్కువగా రక్షకునిలా తయారవుతారు. ఆయన దయాళుత్వాన్ని ప్రేమను సత్యాన్ని ప్రదర్శిస్తారు. తమకు దేవుడిచ్చిన వరాల్ని వృద్ధిపర్చుకోటానికి శ్రద్ధాసక్తులు కనపర్చే కొద్దీ వారికి సంఘం జ్ఞానయుక్తంగా సహకరించాలి. AATel 250.2

సువార్త ప్రబోధ సేవకు తమను దేవుడు పిలిచాడని తలంచే వారందరూ తమ భారాన్ని తమకుటుంబాల భారాన్ని మోయటానికి ఆర్థిక వనరులికి పంఘంపై ఆధారపడటాన్ని సంఘం ప్రోత్సహించకూడదు. పరిమితానుభవం ఉన్న కొందరు పొగడ్తవల్ల, విజ్ఞతలేని ప్రోత్సాహాన్ని బట్టి పూర్తి ఆర్థిక మద్దత్తును కోర్తారు. దేవుని సేవా వ్యాప్తికి ఉద్దేశించిన నిధుల్ని సుఖజీవితం గడిపేందుకు సువార్త సేవ చేపట్టాలని భావించే వారి పై వ్యయం చేయటం తగదు. AATel 250.3

తమ వరాల్ని ప్రతిభను సువార్త పరిచర్యలో ఉవయోగించాలని ఆకాంక్షించే యువకులకి థెస్సలొనీకలోను, కొరింథులోను, ఎఫెసులోను తదితర స్థలాల్లోను పౌలు ఆదర్శం మంచి పాఠాలు నేర్పుతుంది. అనర్గళంగా ప్రసంగించగల వక్త అయినప్పటికీ, ఒక ప్రత్యేకమైన పరిచర్య నిర్వహణ నిమిత్తం దేవుని వలన ఎంపిక అయినప్పటికీ అతడు చేతులతో పని చెయ్యటాన్ని మానలేదు. తాను అమితంగా ప్రేమించిన సువార్త సేవ నిమిత్తం త్యాగాలు చెయ్యటంలో విసుగు చెందలేదు. కొరింథీయులకి ఇలా రాశాడు పౌలు, “ఈ గడియ వరకు ఆకలిదప్పులు గలవారము, దిగంబరులము; పిడిగుద్దలు తినుచున్నాము; నిలువరమైన నివాసము లేక యున్నాము. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. నిందింపబడియు దీవించుచున్నాము. హింసింపబడుయు ఓర్చుకొనుచున్నాము.”1 కొరింథీ 4:11,12. AATel 250.4

శ్రేష్టమైన మానవోపధ్యాయుల్లో ఒకడైన పౌలు అతిసామాన్య విధుల్ని నెరవేర్చాడు, అత్యున్నత వాధుల్ని కూడా నిర్వర్తించాడు. ప్రభువు సేవ నిర్వహిస్తు న్నప్పుడు పరిస్థితుల దృష్ట్యా అవసరం ఏర్పడ్డప్పుడు అతడు ఇష్టపూర్వకంగా తన వృత్తిని చేపట్టేవాడు. అయినా సువార్త ప్రత్యర్థుల వ్యతిరేకతను ఎదుర్కోడానికి లేదా అత్మల్ని క్రీస్తు వద్దకు నడిపించటానికి ఓ విశేషావకాశాన్ని కల్పించటానికి తన లౌకిక సంబంధమైన పనిని పక్కన పెట్టటానికి అతడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. అతడి ఉత్సాహం కఠిన పరిశ్రమ సోమరితనానికి విలాస జీవనానికి మందలింపు. AATel 251.1

అగత్యమైన శారీరక శ్రమ నుంచి పూర్తిగా ఎవరైతే విముక్తి పొందుతారో వారే సువార్తను విజయవంతంగా చాటించగలరు అన్నభావం సంఘంలో బలం పుంజుకొంటుండగా దాన్ని పౌలు ఆదర్శం వ్యతిరేకించింది. అంకిత భావంతో సేవచేసే స్వచ్ఛంద బోధకులు సువార్త సత్యాలతో పరిచయం లేని ప్రజల నడుమ ఏమి సాధించ గలుగుతారో అన్నదాన్ని పౌలు ప్రయోగాత్మకంగా చూపించాడు. దైవసేవ పురోగతికి తమ శక్తిమేరకు కృషి చెయ్యాలని కష్టపడి పని చేసుకొనే అనేకమందికి పౌలు ఆదర్శం స్ఫూర్తినిచ్చింది. అకుల ప్రిస్కిల్లలు తమ సమయమంతా సువార్త పరిచర్యకు వినియోగించటానికి పిలుపుపొందలేదు. అయినప్పటికీ అపొలో సత్యాన్ని సంపూర్ణంగా తెలుసుకొనేందుకు ఈ సామాన్య కార్మికుల్ని దేవుడు ఉపయోగించుకొన్నాడు. తన కార్యసిద్ధికి దేవుడు వివిధ సాధనాల్ని ఉపయోగిస్తాడు. ప్రత్యేక వరాలున్న కొందరు తమ శక్తిసామర్థ్యాలన్నిటినీ సువార్త బోధకు అంకితం చెయ్యటానికి ఎంపిక అవుతుండగా అభిషేకం పొందని అనేకమంది స్వచ్చంద సువార్త సేవకులుగా ఆత్మల రక్షణలో ముఖ్యమైన పాత్రలు పోషించటానికి పిలుపు పొందుతున్నారు. AATel 251.2

స్వయంపోషక సువార్తికుల ముందు విశాల సేవారంగం ఉంది. కొంత సమయం ఏదో రూపంలో కాయకష్టంలో గడపటం ద్వారా అనేకమంది సువార్త సేవలో విలువైన అనుభవాలు గడింపవచ్చు. అత్యవసర రంగాల్లో పనిచెయ్యటానికి సమర్థులైన కార్యకర్తల్ని ఈ పద్ధతిలో తయారుచేయవచ్చు. వాక్య సేవలో అవిశ్రాంతంగా కృషి చేసే త్యాగశీల దైవ సేవకుడు తన హృదయంలో పెనుభారాన్ని మోస్తూ ఉంటాడు. తన సేవను గంటలతో కొలవడు. వేతనం అతడి సేవను ప్రభావితం చెయ్యదు. ప్రతికూల పరిస్థితులు తన విధి నుంచి అతణ్ని తిరగగొట్టలేవు, అతడి పిలుపు దేవుని వద్ద నుంచి వచ్చింది. తనకు ఇచ్చిన పనిని ముగించిన తర్వాత అతని ప్రతిఫలం దేవుని వద్దనుంచి వస్తుంది. AATel 251.3

అలాంటి సువార్త సేవకులు అనవసరమైన ఆందోళనల నుంచి స్వేచ్ఛగా ఉండాలన్నది దేవుని సంకల్పం. పౌలు తిమోతికిచ్చిన ఉపదేశాన్ని ఆచరించటానికి వారికి తరుణముండాలన్నది ఆయన ఉద్దేశం, ” నీ అభివృద్ది అందరికి తేటగా కనబడు నిమిత్తము నీతిని మనస్కరించుము” 1 తిమోతి 4 : 15. మనసు శరీరం చురుకుగా పనిచేయటానికి చాలినంత వ్యాయమం సమకూర్చటానికి వారు జాగ్రత్త వహించాల్సి ఉండగా వారు తమ సమయంలో ఎక్కువభాగం లౌకికఉపాధి సంబంధిత శ్రమలో గడపటం దేవుని ప్రణాళిక కాదు. AATel 252.1

సువార్త నిమిత్తం వ్యయం చేయటానికి తమ్మునుతాము వ్యయపర్చుకోటానికి నమ్మకమైన ఈ సేవకులు సన్నద్ధంగా ఉన్నప్పటికీ వీరు శోధనకు అతీతులుకారు. సంఘం సరియైన ఆర్థిక మద్దతు ఇవ్వటంలో విఫలమైనందువల్ల ఆందోళన భారంతో కృంగిపోతున్నప్పుడు కొందరు తీవ్రశోధనకు గురి అవుతారు. తమ కృషిని తక్కువగా పరిగణించటం జరిగినప్పుడు వారు నిరుత్యాహానికి గురి అవుతారు. నిజమే, తమ ప్రతిఫలం కోసం వారు తీర్చుదినానికి ఎదురుచూస్తారు. ఇది వారిని ఉత్సాహ పర్చుతుంది. అయితే వారి కుటుంబాలికి తిండి, బట్ట అవసరం ఉంటుంది. దైవాదేశం నుంచి తమకు విముక్తి కలిగిందన్న భావన వారికి కలిగితే వారు సంతోషంగా కష్టపడి తమ చేతుల్తో పనిచేసుకొంటారు. కాని తమకు ఆర్థిక వనరులు సమకూర్చాల్సినవారు తమ హ్రస్వదృష్టివల్ల విఫలులైనా, తమ సమయం దేవునిదని వీరు గుర్తిస్తారు. శోధనను అధిగమించి తమ లేములు తీర్చే ఉపాధిని సంపాదించి తమకు ప్రాణప్రదమైన సువార్త పరిచర్యను కొనసాగించి పురోభివృద్ధి సాధిస్తారు. ఇది చేయటానికి వారు పౌలు మాదిరిని అనుసరించి కష్టపడి చేతుల్తో పనిచేస్తూ సువార్త పరిచర్యను కొనసాగించాల్సి రావచ్చు. తమ ఆసక్తుల్ని గాక లోకంలో దేవుని సేవ ప్రయోజనాల్ని వ్యాప్తి చెయ్యటానికి వారు ఇది చేస్తారు. AATel 252.2

ఆర్థిక వనరుల కొరతవల్ల చేయాల్సి ఉన్న సేవను చేయటం అసాధ్యమని కొన్నిసార్లు దైవసేవకుడికి అనిపించవచ్చును. తమకు అందుబాటులో ఉన్న సదుపాయాలో తాము చేయాల్సిన పరిచర్యను చేయలేకపోతామేమోనని కొందరి భయం. అయితే వారు విశ్వాసంతో ముందుకు సాగితే ప్రభువు రక్షణను చూడగలుగుతారు. వారి సేవలు వర్ధిల్లుతాయి. లోకంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా తన అనుచరులను ఆదేశించిన ప్రభువు తన ఆదేశం మేరకు తన వార్తను చాటటానికి పూనుకొనే ప్రతివారిని సంరక్షిస్తాడు. AATel 252.3

తన సేవా నిర్మాణం సందర్భంగా ప్రభువు తన సేవకులకు ప్రతీ విషయాన్ని తేటతెల్లం చెయ్యడు. వారి విశ్వాసాన్ని పరీక్షించటానికి కొన్నిసార్లు విశ్వాససంతో ముందుకు సాగాల్సిన పరిస్థితుల్ని సృష్టిస్తాడు. తరచు కష్టాలు శోధనలతో నిండిన పరిస్థితుల్లోకి తెచ్చి తను పాదాలు యోర్థాను నీళ్లను తాకినప్పుడు ముందుకు సాగమని ఆదేశిస్తాడు. ప్రగాఢ విశ్వాసంతో తన భక్తుల ప్రార్థనలు పైకెగసే అట్టిసమయాల్లో వారికి మార్గం తెరిచి ప్రభువు వారిని బయటికి తీసుకొనివస్తాడు AATel 252.4

దేవుని ద్రాక్షతోటలోని పేద ప్రజల పట్ల దైవ సేవకులు తమ బాధ్యతల్ని గుర్తించి ప్రభువు మాదిరిగా నిర్విరామంగా ఆత్మల రక్షణార్థం కృషి చేస్తే వారి ముందు దేవదూతలు నడిచి మార్గం సుగమం చేస్తారు. సేవ ముందుకు సాగటానికి అగత్యమైన వనరులు సరఫరా అవుతాయి. ఉత్తేజులైనవారు తమ పక్షంగా జరిగే సేవకొనసాగింపుకు ఉదారంగా ద్రవ్యం ఇస్తారు. సహాయం అర్థిస్తూ వచ్చే ప్రతీ పిలుపుకూ వారు సానుకూలంగా స్పందిస్తారు. స్వదేశంలోనేగాక విదేశాల్లో కూడా దేవుని సేవ సాగటానికి నిధులు అర్పించటానికి దేవుని ఆత్మ ప్రతీ హృదయాన్ని ప్రేరేపిస్తుంది. తక్కిన స్థలాల్లో సేవ చేసే సువార్తికులికి ఈ విధంగా శక్తి చేకూర్తుంది. ప్రభువు సంకల్పించిన రీతిగా ఆయన సేవ ప్రగతి చెందుతుంది. AATel 253.1