అపొస్తలుల కార్యాలు

33/59

32—ఉదార సంఘం

పౌలు కొరింథు సంఘానికి రాసిన తన మొదటి ఉత్తరంలో లోకంలో దైవ సేవ పోషణ నిమిత్తం అవలంబించాల్సిన సామాన్య సూత్రాల్ని పొందుపర్చాడు. అపొస్తలుడిగా తన సేవల్ని గురించి రాస్తూ ఇలా ప్రశ్నించాడు: AATel 237.1

“ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువుచేయునా? ద్రాక్షతోటవేసి దాని వలము తిననివాడెవడు? మంద కాచి మందపాలు త్రాగనివాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడ వీటిని చెప్పుచున్నది గదా? కళ్ళము తొక్కుచున్న యెద్దుమూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించువాడా? అవును, మనకొరకే గదా యీ మాటలు వ్రాయబడెను? ఏలయనగా, దున్నువాడు ఆశతోదున్నవలెను, కళ్లము తొక్కించువాడు పంటలో పాలు పొందునను ఆశతో తొక్కింపవలెను”. AATel 237.2

“మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తియుండగా నా వలన శరీర సంబంధమైన ఫలములు కోసికొనుట గొప్ప కార్యమా? ఇతరులు మీ పైని యీ అధికారములో పాలు కలిగిన యెడల మాకు ఎక్కువ కలదుగదా? అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తను ఏ అభ్యంతరమైనను కలుగుజేయుటకై అన్నిటిని సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు బలిపీఠము నొద్ద కని పెట్టుకొని యుండువారు బలిపీఠముతో పాలివారైయున్నారనియు మీరెరుగరా? ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించియున్నాడు”.1 కొరింథీ 9:7-14. AATel 237.3

దేవాలయ సేవలు చేసే యాజకుల పోషణ నిమిత్తం ప్రభువు ప్రణాళికను పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఈ ప్రత్యేక బాధ్యతకు నియుక్తులైన వారందరూ సహోదరుల పోషణతో సేవలందించారు. వారికి వీరు ఆధ్యాత్మిక పరిచర్య చేశారు. “మరియు లేవి కుమాళ్లులోనుండి యాజకత్వము పొందువారు . . . ప్రజల యొద్ద పదియవ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొందియున్నారు.” హెబ్రీ 7:5. ఆలయ యాజకత్వానికి సంబంధించిన పరిశుద్ధ బాధ్యతలకు ప్రభువు లేవి గోత్రాన్ని ఎంపిక చేశాడు. యాజకుడి గురించి ప్రభువు ఈ ఉపదేశం ఇచ్చాడు, “నిత్యము యెహోవా నామమున నిలిచి సేవచేయుటకు . . . అతనిని . . . నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనియున్నాడు.” (ద్వితీ 18:5). ఆదాయంలో పదో భాగం తనదని ప్రభువంటున్నాడు. పదోభాగాన్ని అట్టి పెట్టుకోటాన్ని దొంగిలించటంగా పరిగణిస్తాడు. “సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవెనని ప్రభువు నియమించి యున్నాడు”. అనంతరం తిమోతికి రాస్తూ పనివాడు జీతమునకు పాత్రుడు’ - అన్నప్పుడు సువార్త పోషణకు ఏర్పాటయిన ఈ ప్రణాళికను దృష్టిలో ఉంచుకొనే పౌలు మాట్లాడాడు. 1 తిమోతి 5:18. AATel 237.4

దైవసేవ పోషణకు పదోభాగం చెల్లింపు ఒక భాగం మాత్రమే. ఇంకా ఎన్నో అర్పణల్ని కానుకల్ని దేవుడు పేర్కొన్నాడు. యూదు వ్యవస్థలో దైవసేవ వ్యాప్తికి బీదలకు సహాయం అందించటానికి ప్రజలు ఉదారత కలిగి నివసించేవారు. ప్రత్యేక సందర్భాల్లో ప్రజలు స్వేచ్ఛార్పణలిచ్చేవారు. కోతల సమయంలో ప్రథమ ఫలాలుగా ధాన్యం, ద్రాక్షరసం, నూనె వంటి పొలం పంటలు ప్రభువుకి ప్రతిష్టార్పణలుగా అర్పించేవారు. పొలాల్లోని పరిగె, చేలలోని మూలలు బీదలకు విడిచి పెట్టేవారు. గొర్రెల బొచ్చు కత్తిరించినప్పుడు ఆ బొచ్చులో ప్రథమఫలం, గోధుమలు నూర్చినప్పుడు అందులోని ప్రథమఫలం దేవునికి ప్రత్యేకించి ఉంచేవారు. అలాగే జంతువుల్లోని తొలిచూలును దేవునికి సమర్పించేవారు. జ్యేష్ఠ పుత్రుడికి విమోచన వెల అర్పించి తల్లిదండ్రులు విడిపించుకొనేవారు. ప్రజలు ప్రథమఫలాల్ని ప్రభువుకి గుడారంలో సమర్పించేవారు. వాటిని యాజకులు వినియోగించుకొనేవారు. AATel 238.1

ప్రతీ విషయంలోను తనదే ప్రథమ స్థానమని ఈ క్రమబద్ద విరాళ వ్యవస్థ ద్వారా ఇశ్రాయేలీయులకి నేర్పించాలని ప్రభువు ఉద్దేశించాడు. తమ పొలాలకు, తమ మందలకు తమ పశుసంపదకు సొంతదారుడు దేవుడే అని పంటపండటానికి అవసరమైన ఎండను వానను పంపించింది తానేనను ఈ విధంగా దేవుడు వారికి గుర్తు చేశాడు. తమకున్నదంతా దేవునిదేనని వారు దేవుని ఆస్తికి ధర్మకర్తలు మాత్రమేనని నేర్పించాడు. AATel 238.2

ఆ యూదులకన్నా ఎన్నో తరుణాలు అధిక్యతలు కలిగి ఉన్న క్రైస్తవులు వారికన్నా తక్కువ ఉధారంగా విరాళాలివ్వాలని దేవుడు ఉద్దేశించలేదు. “ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు” అని ప్రభువు అన్నాడు. లూకా 12:48. హెబ్రీయులు ఇవ్వాల్సిఉన్న విరాళాలు చాలామట్టుకు ఆ జాతీయుల క్షేమాభివృద్ధి కోసం ఉపయుక్తమయ్యాయి. ఇప్పుడైతే దేవుని సేవ ప్రపంచమంతా వ్యాపించి ఉంది. సువార్త అనే భాగ్యాన్ని క్రీస్తు తన అనుచరుల చేతుల్లో పెట్టాడు. రక్షణ శుభవార్త వెల్లడి బాధ్యతను క్రీస్తు వారి పై పెట్టాడు. పూర్వం ఇశ్రాయేలు ప్రజల బాధ్యతల కన్నా నేడు మన బాధ్యతలు మరింత సమున్నతమైనవి. AATel 238.3

దైవ సేవ విస్తరించే కొద్దీ ఆర్థిక సహాయానికి మనవులు అధికమవుతుంటాయి. ఈ అవసరాల్ని తీర్చేందుకుగాను క్రైస్తవులు ఈ ఆజ్ఞ శిరసావహించాలి, “నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నామందిరపు నిధిలోనికి తీసుకొనిరండి”, మలాకీ 3:10. క్రైస్తవులుగా చెప్పుకొనే వారందరూ తమ దశమభాగాలు కానుకలు నమ్మకంగా చెల్లిస్తే దేవుని ధనాగారంలో ద్రవ్యం సమృద్ధిగా ఉంటుంది. ఇది జరిగినప్పుడు అమ్మకాల సంతలు, లాటరీలు, విందులు, వినోదాల ద్వారా సువార్త పరిచర్యకు నిధులు సమీకరించాల్సిన అగత్యం ఉండదు. AATel 239.1

మనుషులు తమ ద్రవ్యాన్ని తమ వ్యసనాలకు, తిని తాగటానికి, తమ ఆభరణాలు అలంకరణలకు, తను గృహాల్ని అలంకరించుకోటానికి వ్యయం చేస్తుంటారు. వీటి కోసం చాలామంది సంఘసభ్యులు ఖర్చు పెట్టటానికి దుబారాచేయటానికీ వెవకాడరు. కాని దైవ సేవా వ్యాప్తికి విరాళం ఇవ్వమన్నప్పుడు వారు ముందుకురారు. తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు తాము అనవసరంగా ఖర్చు పెట్టేదానికన్నా ఎంతో తక్కువ మొత్తం ఇస్తారు. క్రీస్తు సేవ నిమిత్తంగాని ఆత్మల రక్షణ నిమిత్తంగాని వారికి ఆసక్తిగాని అనురక్తిగాని ఉండవు. అలాంటివారి క్రైస్తవ జీవితం రుజాగ్రస్తమై అణగారిపోవటంలో ఆశ్చర్యమేముంది! ఉపకారం, దయాళుత్వం, సత్యసంధతకు సంబంధించిన సేవ దేవుడు మానవులకు అప్పగించిన ఉన్నతమైన, పవిత్రమైన సేవ. ఎవరి హృదయం క్రీస్తు ప్రేమతో ప్రకాశిస్తుందో ఆవ్యక్తి ఈ సేవను వ్యాప్తి చెయ్యటంలో చేయూతనివ్వటం తన విధి మాత్రమేకాక తనకు గొప్ప ఆనందాన్నిచ్చే అంశమని పరిగణిస్తాడు. AATel 239.2

న్యాయంగా దేవునికి చెందే ఆర్థిక వనరుల్ని శరీరాశలు తీర్చుకోడానికి నడిపించేది మనిషిలోని దురాశే. “మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నాయొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీయొద్ద దొంగలితిమని మీరందురు. పదియవ భాగమును కృతజ్ఞతార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరును నాయొద్ద దొంగిలించుచునేయున్నారు. మీరు శాపగ్రస్తులై యున్నారు” (మలాకీ 3:8,9) అంటూ తన ప్రవక్త ద్వారా తన ప్రజలను మందలించినప్పుడు ఈ దురాశా స్వభావాన్ని ప్రభువు ఎంతగా ద్వేషించాడో ఇప్పుడూ అంతే ద్వేషిస్తున్నాడు. AATel 239.3

ఉదార గుణం దైవగుణం. సిలువమిద క్రీస్తు మరణంలో ఈ ఉదారస్పూర్తి వెల్లడయ్యింది. మనకోసం తండ్రి తన అద్వితీయ కుమారుణ్ని త్యాగం చేశాడు. క్రీస్తు అనుచరులు ఉదారశీలురు కావటానికి కల్వరి సిలువ స్పూర్తినివ్వాలి. సిలువపై వెల్లడైన నీతి సూత్రం ఇవ్వటం, ఇంకా ఇవ్వటం. “ఆయన యందు నిలిచియున్నవాడనని చెప్పుకొనునాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్దుడైయున్నాడు”. 1 యోహాను 2:6. AATel 239.4

స్వార్థ స్వభావం సాతాను గుణం. లోకాన్ని ప్రేమించేవారి నియమమేంటంటే అందుకోటం, ఇంకా అందుకోటం. ఈ రకంగా వారు ఆనందాన్ని సుఖాన్ని పొందగలమని భావిస్తారు. అయితే వారి కృషి ఫలితం దుఃఖం మరణం. AATel 240.1

దేవుడు తమను దీవించటం కొనసాగినంతకాలం దేవుని పిల్లలు ఆయనకు చెల్లించాల్సిన భాగాన్ని చెల్లించటం వారి విధి. వారు ప్రభువుకి చెల్లించాల్సిన భాగాన్ని చెల్లించటమేకాదు, ఆయన ధనాగారంలోకి కృతజ్ఞతార్పణలు, ధారాళ విరాళాలు తేవాల్సిఉన్నారు. ప్రశస్తమైన తమ ఆస్తిలోను, పవిత్రమైన తమ సేవల్లోను వారు తమ సమృద్దిలో నుంచి సృష్టికర్తకు ప్రథమ ఫలాలు సంతోషంతో సమర్పించాలి. ఇలా చేసివారు గొప్ప దీవెనలు పొందగలుగుతారు. దేవుడు వారి ఆత్మల్ని ఎన్నడూ ఆగని నీటి సరఫరా గల తోటలా వృద్ధిచేస్తాడు. చివరి పంటను సమకూర్చే తరుణంలో వారు తమ సేవద్వారా ప్రభువుకు సమర్పించే పనలు వారి వరాల నిస్వార్థ వినియోగానికి ప్రతిఫలంగా నిలుస్తాయి. AATel 240.2

దేవుడు ఎంపిక చేసుకొన్న సువార్త సేవకులు పూర్తిగా ఆ సేవకే అంకితమైన ఉన్నప్పుడు వారి పోషణ బాధ్యత వారికే విడిచి పెట్టకుండా సహోదరులు వారిని ఉదార స్వభావంతో ఆర్థికంగా ఆదుకోవాలి. సువార్త పరిచర్యలో పాలు పొందటానికి గాను తమ లౌకిక జీవనోపాధిని వదులుకొనేవారి విషయంలో సంఘసభ్యులు ఉదారంగా వ్యవహరించాలి. దైవ సేవకుల్ని ప్రోత్సహించినప్పుడు దైవసేవ గొప్ప ప్రగతి సాధిస్తుంది. అయితే మనుషులు స్వార్థాశల వల్ల తమ సహాయాన్ని నిలిపివేస్తే బోధకులు బలహీనపడ్డారు. వారి ప్రయోజకత్వం తీవ్రంగా కుంటుబడ్తుంది. AATel 240.3

నమ్మకంగా సువార్త పరిచర్యచేసే సేవకులు జీవితావసర వస్తువులు లేక అష్టకష్టాలు పడటం చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు ఊరకుంటూనే దేవుని అనుచరులమని చెప్పుకొనే వారిపట్ల దేవుని ఆగ్రహం రగుల్కోంటుంది. స్వార్థపరులైన వీరు లెక్క అప్పజెప్పాల్సి ఉంటుంది. వీరు ప్రభువు ద్రవ్యాన్ని దుర్వినియోగపర్చినందుకే కాదు, తమ కార్యాచరణవల్ల నమ్మకమైన దైవ సేవకులకు తాము కలిగించే ఆందోళణ హృదయ వేదనలకు జవాబుదారులవుతారు. సువార్త సేవకు పిలుపుపొంది తమ కర్తవ్య నిర్వహణలో తమకున్నదంతా త్యాగం చేసే సేవకులు తాము అందిస్తున్న పరిచర్యకు ఫలితంగా తమపోషణకు తమ కుటుంబ పోషణకు సరిపోయేటంత వేతనం పొందల్సిఉన్నారు. AATel 240.4

మానసికమైన, భౌతికమైన ఆయా సేవాశాఖల్లో నమ్మకంగా పనిచేసేవారు, కార్మికులు మంచి వేతనాలు సంపాదించవచ్చు. సత్యాన్ని ప్రచురించేసేవ, ఆత్మల్ని క్రీస్తు వద్దకు నడిపించే కృషి సామాన్యమైన ఏ కృషికన్నా ఎంతో ప్రాముఖ్యమైంది కాదా? ఈ సేవలో నిమగ్నమైన సేవకులు సమృద్ధి వేతనానికి అర్హులు కారా? నైతికమైన, భౌతికమైన హితాన్ని ప్రోది చేసే శ్రమకు మనం ఇచ్చే తులనాత్మక విలువను బట్టి లోకసంబంధమైన విషయాల్ని దైవ సంబంధిత అంశాల్ని మనం ఎంత అభినందిస్తున్నదీ వెల్లడిచేస్తాం. AATel 241.1

సువార్త సేవ మద్దత్తుకు నిధుల కొరత లేకుండేందుకు, సువార్త పరిచర్య నిమిత్తం వచ్చే విజ్ఞప్తుల సాఫల్యానికి దైవ ప్రజలు ధారాళంగా విరాళాలివ్వటం అవసరం. దైవ సేవావసరాల్ని సంఘాల ముందుంచి సభ్యులు ఉదారంగా ఇవ్వటానికి వారిని చైతన్య పర్చటానికి బోధకుల పై గొప్ప బాధ్యత ఉంది. దీన్ని అశ్రద్ధ చేసినప్పుడతడు, ఇతరుల అవసరాలు తీర్చటానికి సంఘాలు ముందుకిరానప్పుడు, ప్రభువుకార్యం దెబ్బతినటమే కాదు విశ్వాసులకు ఒనగూడే మేలు నిలిచిపోతుంది. AATel 241.2

పేదలు సయితం దేవునికి కానుకలు అర్పించాలి. తమకన్నా ఎక్కువ అవసరంలో ఉన్నవారికి సహాయం అందించటానికి స్వార్థాన్ని ఉపేక్షించటం ద్వారా వారు క్రీస్తు కృపను పంచేవారై ఉండాలి. ఆత్మత్యాగం అనే పేదవాడి అర్పణ దేవుని ముందు పరిమళ ధూపంలా పైకి లేస్తుంది. స్వార్థ త్యాగానికి సంబంధించిన ప్రతీ చర్య ఇచ్చేవాడి హృదయంలో ఉపకారస్ఫూర్తిని బలోపేతం చేస్తుంది. తాను భాగ్యవంతుడైనా మన నిమిత్తం ధీనుడై, మనం ధనవంతులమయ్యేందుకు తాను దరిద్రుడైన ఆ ప్రభువుకు మనల్ని సన్నిహితులు చేస్తుంది. AATel 241.3

తనకున్న రెండు కాసుల్ని కానుకగా సమర్పించిన విధవరాలి చర్య, పేదరికంతో సతమతమౌతున్నప్పటికీ దైవకార్య విస్తరణకు తమ కానుక ద్వారా సాయపడాలన్న కోరిక గలవారిని ప్రోత్సహించేందుకు దాఖలు చేయటం జరిగింది. “తన జీవనమంతయు” ఇచ్చిన ఈ స్త్రీ పై తన శిష్యుల గమనాన్ని క్రీస్తు నిలిపాడు. మార్కు 12:44. ఆత్మత్యాగం లేకుండా పెద్ద పెద్ద మొత్తాలిచ్చిన వారి కానుక కన్నా ఆమె కానుక ఎక్కువ విలువైందిగా ప్రభువు పరిగణించాడు. వారు తమ సమృద్ధిలో చిన్నభాగన్ని ఇచ్చారు. ఈ కానుక ఇవ్వటానికి ఆ విధవరాలు తన జీవనానికి అవసరమైన వాటిని త్యాగం చేసింది. తన రేపటి అవసరాన్ని దేవుడు సరఫరా చేస్తాడని విశ్వసించింది. ఆమెను గురించి రక్షకుడిలా అన్నాడు, “కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెను” 43వ వచనం. ఈవి విలువ దాని మొత్తాన్ని బట్టిగాక దాని నిష్పత్తిని బట్టి ఈవి ఇవ్వటాన్ని ప్రేరేపించిన ఉద్దేశాన్ని బట్టి నిర్ధారించాలని ప్రభువు ఈ రీతిగా బోధించాడు. AATel 241.4

నూతన విశ్వాసులు దైవసేవలో గొప్ప కార్యాలు సాధించేందుకు వారిని స్పూర్తితో నింపటానికి అపొస్తలుడైన పౌలు సంఘాల్లో తన పరిచర్యలో నిర్విరామంగా కృషిచేశాడు. దానశీలం కలిగి ఉండాల్సిందంటూ విశ్వాసుల్ని తరచు ఉద్భోదించేవాడు. లోగడ తమమధ్య తాను చేసిన సేవల్ని గురించి ఎఫెసు పెద్దలతో మాట్లాడూ పౌలిలా అన్నాడు. “మీరు ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు, పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని”. “కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును. సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడుము తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును” అంటూ కొరింథీయులికి రాశాడు పౌలు. అ.కా. 20:35, 2 కొరింథీ 9:6,7. AATel 242.1

దాదాపు మాసిదోనియ విశ్వాసులందరూ నిరు పేదలే. అయితే వారి హృదయాలు దేవునిపట్ల ఆయన సత్యంపట్ల ప్రేమతో ఉప్పొంగాయి. సువార్త సేవా వ్యాప్తికి వారు ఇచ్చారు. యూదు విశ్వాసుల సహాయార్థం అన్యవిశ్వాసుల సంఘాల్లో చందాలు పట్టినప్పుడు మాసిదోనియ విశ్వాసుల దాతృత్వం సంఘాలన్నిటికీ ఆదర్శంగా నిలిచింది. కొరింథీయ విశ్వాసులకి రాస్తూ పౌలు ఈ విషయాలపై వారి దృష్టిని నిలిపాడు, “మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడియున్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఏలాగనగా వారు బహు శ్రమలవలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరు పేదలైనను వారి దాతృత్యము బహుగా విస్తరించెను....మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు, వారు తమ సామర్ధ్యము కొలదియేగాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతటతామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను” 2 కొరింథీ 8:1-4. AATel 242.2

మాసిదోనియ విశ్వాసుల త్యాగశీలత దేవునికి తమ సంపూర్ణ సమర్పణ ఫలితంగా వచ్చింది. దైవాత్మ ప్రేరణ కింద “మొదట ప్రభువునకు . . . తమ్మును తామె అప్పగించుకొనిరి” (2 కొరింథూ 8:5). ఆతర్వాత సువార్తసేవ మద్దతు నిమిత్తం వారు ద్రవ్యం ధారాళంగా ఇచ్చారు. ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయాల్సిన అవసరం లేకపోయింది. ఇతరుల అవసరాల్ని తీర్చటానికి గాను తమ్మును తాము ఉపేక్షించుకోటానికి జీవితావసర వస్తువుల్ని త్యాగం చెయ్యటానికి వారు సంతోషించినప్పుడు తమ కానుకల్ని అంగీకరించాల్సిందిగా బతిమాలారు. తమ స్వాభావిక నిరాడంబరతతో, చిత్తశుద్ధితో, సహోదరుల పట్ల మమతానురాగాలతో వారు తమ్మునుతాము ఉపేక్షించుకొని దాతృత్వ ఫలాలు విస్తారంగా ఫలించారు. AATel 242.3

కొరింథులోని విశ్వాసుల్ని సత్యంలో బలో పేతుల్ని చేయటానికి పౌలు తీతును పంపినప్పుడు వారిలో దాతృత్వ సుగుణాన్ని పాదుకొల్పాల్సిందని చెప్పి దానికి తన సొంత విజ్ఞప్తిని జతచేసి వ్యక్తిగతంగా ఓ ఉత్తరం రాశాడు. “మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమనందును సమస్త జాగ్రత్త యందును నాకు మాయెడలనున్న ప్రేమయందును ఏలాగు వృద్ది పొందుచున్నారో ఆలాగే మీరు కృపయందుకూడ అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి”. “కావున తల పెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఏలాగు కలిగెనో, ఆలాగే మీ కలిమికొలది సంపూర్తియగునట్లు వారు ఆ కార్యము ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగియుంటే శక్తికి మించి కాదు గాని కలిమికొలదియే యిచ్చినది ప్రీతికరమవును.” “మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మియెడల సమస్తవిధములైన కృపను విస్తరింపచేయగలడు. . . మీరు ప్రతి విషయములో పూర్లేదార్య భాగ్యము గలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధిపొందును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును”. 2 కొరింథీ 8:7,11,12 : 9:8-11. AATel 242.4

స్వార్థరహితమైన దాతృత్వం తొలిదినాల సంఘాన్ని ఆనందోత్సాహాలో నింపింది. తమ సేవలు చీకటిలో కొట్టుమిట్టాడున్న ప్రజలకు సువార్తను చేరవేస్తున్నందుకు వారు ఆనందించారు. తాము దైవకృపను ఊరకనే పొందలేదని వారి దాతృత్వం చాటిచెప్పింది. ఆత్మశుద్ధీకరణ ద్వారా తప్ప అట్టి Z. దార్యాన్ని ఉదయింపజేసేది ఇంకేమి ఉంటుంది? విశ్వాసుల దృష్టికి అవిశ్వాసుల దృష్టికి అది కృప చేసిన మహత్కార్యం. AATel 243.1

ఆధ్యాత్మిక వృద్ధికి క్రైస్తవ దాతృత్వానికి మధ్య దగ్గర సంబంధం ఉంది. తమ జీవితాల్లో తమ విమోచకుని దానశీలతను వెల్లడి చేసే ఆధిక్యత తమకున్నందుకు క్రీస్తు అనుచరులు సంతోషించాలి. వారు ప్రభువుకి ఇచ్చే కొద్దీ తమ ధనం వారిముందు పరలోక ధనాగారానికి చేరుందన్న వాగ్దానం ఉంది. తమ ఆస్తిని భద్రపర్చుకోవాలని మనుషులు వాంఛిస్తున్నారా? అయితే వారు తమ ఆస్తిని సిలువ గాయాలు పొందిన క్రీస్తు చేతుల్లో పెట్టటం మంచిది. తమ ఆస్థిని వృద్ధిపర్చుకోవాలన్న ఆశ వారికుందా? ఉంటే వారు ఈ దైవోపదేశాన్ని పాటించటం అవసరం, “నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొత్తలో ధాన్వము సమృద్ధిగా నుండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలిపారును”. సామెతలు 3:9,10. వారు తను ఆస్తిని తమ స్వార్ధ ప్రయోజనాలకు అట్టి పెట్టుకొంటే అది వారికి నిత్యనాశనం తెచ్చి పెడుంది! కాని వారు తమ ధనాన్ని దేవునికి సమర్పిస్తే ఆ ఘడియనుండే దానిపై దేవుని ముద్రపడుంది. AATel 243.2

దాని మీది ముద్ర ఎన్నడూ మార్పులేని ముద్ర. _ “నీళ్లున్న స్థలాల పక్క విత్తనాలు విత్తే మీరు ధన్యులు” (యెషయా 32:20) అంటున్నాడు దేవుడు. దేవుని సేవకుగాని మానవాళి ప్రయోజనాలికిగాని ఎక్కడ మనం దేవుడిచ్చిన వరాల్ని వనరుల్ని నిత్యం ఇవ్వాల్సిన అవసరం ఉంటుందో ఆ యివ్వటం లేమి కలిగించదు. “వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దాని కన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు”. సామెతలు 11:24, వ్యవసాయదారుడు విత్తనాల్ని వెదజల్లటం ద్వారా అధిక ధాన్యం సంపాధిస్తాడు. దేవుడిచ్చిన దీవెనల్ని నమ్మకంగా పంచేవారు ఇలాగే అధిక దీవెనలు సొంతం చేసుకొంటారు. వారు ఇవ్వటం ద్వారా తమ దీవెనల్ని అధికం చేసుకొంటారు. “ఇయ్యుడి. అప్పుడు మీకెయ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు” అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. లూకా 6:38. AATel 243.3