అపొస్తలుల కార్యాలు

32/59

31—ఆచరించిన వర్తమానం

ఎఫెసు నుంచి పౌలు ఇంకొక మిషనరీ ప్రయాణం మీద బయలుదేరాడు. క్రితం తాను ఐరోపాలో పరిచర్య ప్రారంభించిన స్థలాల్ని ఈ సమయంలో మళ్లీ సందర్శించాలనుకొన్నాడు. “క్రీస్తు సువార్త ప్రకటించుటకు” కొంతకాలం త్రోయలో ఉన్నప్పుడు తన వర్తమానం వినటానికి సిద్ధంగా ఉన్న కొంతమందిని కనుగొన్నాడు పౌలు. అనంతరం ఈ స్థలంలో తన సేవల్ని గురించి ప్రస్తావిస్తూ “ప్రభువునందు నాకు మంచి సమయము” ప్రాప్తించింది అన్నాడు. త్రోయలో తన సేవ విజయవంతంగా సాగినప్పటికీ అక్కడ ఎక్కువ కాలం ఉండలేకపోయాడు. “సంఘములన్నిటిని గూర్చిన చింత” ముఖ్యంగా కొరింథులోని సంఘాన్ని గూర్చిన చింత అతడికి అధికమయ్యింది. త్రోయలో తీతును కలుసుకొని కొరింథు సంఘ సహోదరులికి తాను రాసి పంపిన హితవు మందలింపు సందేశానికి వారి స్పందనను గురించి తెలుసుకోటానికి ఎదురుచూశాడు. ఈ విషయంలో అతడికి ఆశాభంగం ఎదురయ్యింది. ఈ అనుభవం గురించి రాస్తూ, “సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది” లేకపోయింది అన్నాడు. కనుక త్రోయనుంచి బయలుదేరి మాసిదోనియకు వెళ్లాడు. అక్కడ ఫిలిప్పీలో తిమోతీని కలుసుకొన్నాడు. AATel 228.1

కొరింథు సంఘం గురించి పౌలు ఆందోళనగా ఉన్న ఈ సమయంలో మంచి జరుగుతుందన్న ఆశాభావంతో పౌలున్నాడు. అయినా, ఆ సంఘానికి తాను పంపిన హితోపదేశాన్ని వారు అపార్థం చేసుకొంటారేమోనను తీవ్ర విచారానికి లోనయ్యాడు. అనంతరం పౌలిలా రాశాడు, “మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను.” AATel 228.2

కొరింథీయ విశ్వాసుల్లో గొప్ప పరివర్తన కలిగిందన్న సంతోషకరమైన వార్తను ఈ దైవ సేవకుడు తెచ్చాడు. పౌలు ఉత్తరంలోని ఉపదేశాన్ని అనేకమంది అంగీకరించి తమ పాపాలనిమిత్తం పశ్చాత్తాపపడ్డారు. ఇక వారి జీవితాలు క్రైస్తవమతానికి తలవంపులు తేలేదు. వారి జీవితాలు ప్రగాఢమైన దైవభక్తికి స్ఫూర్తినిచ్చాయి. AATel 228.3

అపొస్తలుడి ఆనందానికి హద్దులులేవు. తమ హృదయాల్లో జరిగిన మంచి పని నిమిత్తం ఆనందం వ్యక్తం చేస్తూ కొరింథీయులికి ఇంకో ఉత్తరం రాశాడు: “నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖ పెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్ప కాలము మట్టుకే దుఃఖ పెట్టెనని తెలిసికొనియున్నాను” తన ఉపదేశాన్ని ఆసంఘ సభ్యులు తృణీకరిస్తారేమోనన్న తలంపు వేధించినప్పుడు అంత ఖండితంగాను కఠినంగాను రాసినందుకు కొన్నిసార్లు సంతాపపడ్డాడు. “మీరు దుఃఖపడితిరని సంతోషించుటలేదుగాని మీరు దు:ఖపడి మారు మనస్సు పొందితిరని యిప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మావలన మీరు నష్టము పొందకుండుటకై, దైవచిత్తాను సారముగా దు:ఖపడితిరి.” దైవకృప వల్ల హృదయంలో చోటు చేసుకొనే పశ్చాత్తాపమే పాపాన్ని ఒప్పుకొని విడిచి పెట్టటానికి నడిపిస్తుంది. కొరింథీయ విశ్వాసుల జీవితాల్లో ఈ ఫలాలు కనిపించినట్లు అపొస్తలుడు ప్రకటించాడు. ” ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మిలో పుట్టించెనో చూడుడి.” AATel 229.1

కొంతకాలంగా సంఘాల నిమిత్తం పౌలు మనసులో పెద్దభారం ఉంది అది అతడు భరించలేనంత గొప్ప భారం. విశ్వాసుల పరంగా తాను స్థాపించిన సేవను నాశనం చేయటానికి అబద్ధ బోధకులు ప్రయత్నించారు. పౌలుని చుట్టుముట్టిన ఆందోళనలు, నిరాశ నిస్పృహలు ఈ మాటల్లో వ్యక్తమౌతున్నాయి, “మేము బ్రదుకుదుమను నమ్మకము లేక యుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారము వలన క్రుంగిపోతిమి.” AATel 229.2

ఇప్పుడు ఆ ఆందోళనకు ఒక్క కారణం తొలగిపోయింది. తాను కొరింథీయులికి రాసిన ఉత్తరానికి అనుకూల స్పందన లభించినట్లు విన్నప్పుడు అమితానందంతో పౌలిలా అన్నాడు: “కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు, ఆయన శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను ఏఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. ఈ ఆదరణ, మేము కూడి పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై యున్నది. మీరు శ్రమలలో ఏలాగు పాలివారైయున్నారో, ఆలాగే ఆదరణలోను పాలివారైయున్నారని యెరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమైయున్నది.” AATel 229.3

వారికి కలిగిన మారుమనసు నిమిత్తం, కృపలో వారి పెరుగుదల నిమిత్తం సంతోషం వ్యక్తం చేస్తూ వారిలోని ఆ పరివర్తనకు పౌలు దేవునికి స్తోత్రం చెల్లించాడు. “మా ద్వారా ప్రతి స్థలమునందును క్రీస్తును గూర్చి మన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము, రక్షింపబడు వారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై యున్నాము.” ఆనాటి ఆచారం ప్రకారం, యుద్ధంలో విజయం సాధించిన సైనికాధికారి ఓడిపోయిన వారిని బందీలుగా తేవటం జరిగేది. అలాంటి తరుణాల్లో ధూపర్తి వాహకుల్ని నియమించేవారు. సైన్యం విజయ నినాదాలతో తిరిగి వస్తున్నప్పుడు ఆ సువాసన మరణించనున్న బందీలకు తమ మరణసమయం సమీపిస్తున్నదని సూచించే మరణార్థమైన మరణపు వాసన. కాని విజేతల దయ సంపాధించినందువల్ల జీవించాల్సిఉన్న బందీలకు అది తమ స్వేచ్ఛకు సమయం ఆసన్నమౌతున్నదని సూచించే జీవార్ధమైన జీవపు వాసన. AATel 230.1

ఇప్పుడు పౌలు హృదయం విశ్వాసం నిరీక్షణతో నిండి ఉంది. కొరింథులో సాగుతున్న దైవ సేవ విషయంలో సాతాను జయం లభించదని గ్రహించాడు. హృదయం నిండా ఉన్న కృతజ్ఞతను దేవునికి వెలిబుచ్చాడు. క్రీస్తు విరోధుల పై లభించిన విజయాన్ని తాను తన సహచర సేవకులు రక్షణ జ్ఞానాన్ని విస్తరించటం ద్వారా పండుగ జరుపుకోవాల్సి ఉన్నారు. సువాసనమల్లే సువార్త పరిమళం లోకమంతా వ్యాపించాల్సి ఉంది. క్రీస్తును రక్షకుడుగా స్వీకరించే వారికి సువార్త జీవాత్తమైన జీవపు వాసనకావాల్సి ఉంది. అవిశ్వాసంలో మొండిగా కొనసాగే వారికి అది మరణార్థమైన మరణపు వాసన కానుంది. AATel 230.2

సువిశాల సేవాపరిధిని గుర్తిస్తూ, “ఇట్టి సంగతులకు చాలినవాడెవడు?” అంటూ పౌలు ఆశ్చర్యపోయాడు. దైవ బోధకుణ్ని లేదా తన బోధను క్రీస్తు విరోధులు తృణీకరించకుండా ఉండే క్రీస్తును బోధించటం ఎవరికి సాధ్యం? విశ్వాసులు సువార్త సేవ పవిత్ర బాధ్యతను గుర్తించాలని పౌలు ఆకాంక్షించాడు. దైవ వాక్యాన్ని నమ్మకంగా బోధిస్తూ, దానితోపాటు పవిత్రంగా నివసించటం ద్వారా మాత్రమే బోధకుడు దేవునికి ఇష్టుడుగా జీవించి ఆత్మల్ని రక్షించగలుగుతాడు. దైవ సేవ ఔన్నత్యాన్ని గుర్తించి ఈ నాటి బోధకులు అపొస్తలుడు పౌలుతో గొంతుకలిపి “ఇట్టి సంగతులకు చాలినవాడెవడు?” అని ఆశ్చర్యపోవచ్చు. AATel 230.3

తన మొదటి ఉత్తరం రాయటంలో పౌలు ఆత్మఖండన చేసుకొన్నాడని నిందించిన వారున్నారు. అపొస్తలుడిప్పుడు దీన్ని గురించి ప్రస్తావిస్తూ తన ఉద్దేశాల్ని తామూ ఆవిధంగానే పరిగణిస్తున్నారా అని ఆ సంఘ సభ్యుల్ని ప్రశ్నిస్తున్నాడు. “మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీయొద్దకైనను మీయొద్ద నుండియైనను సిఫారసు పత్రికలు మాకు అవసరమా?” అని ప్రశ్నించాడు. కొత్త స్థలానికి వలస వెళ్తున్న విశ్వాసులు క్రితంలో తాము సభ్యులుగా ఉన్న సంఘం నుంచి సిఫార్సులేఖలు తీసుకు వెళ్లటం జరిగేది. అయితే నాయకత్వ బాధ్యతలుగల సువార్త సేవకులికి, ఈ సంఘాల స్థాపకులుకి అలాంటి సిఫార్సులు అవసరం లేకపోయేది. విగ్రహారాధన నుంచి సువార్త విశ్వాసాన్ని స్వీకరించిన కొరింథీయ విశ్వాసులే తనకు కావాల్సిన సిఫార్సు అని పౌలు పత్రికలో అన్నాడు. వారు సత్యాన్ని స్వీకరించటం, వారి జీవితాల్లో మార్పు చోటుచేసుకోటం -ఇది పౌలు సేవ విశ్వతనీయత కు క్రీస్తు సేవకుడిగా హితవు చెప్పటానికి మందలించటానకి, ఉపదేశించటానికి తనకున్న అధికారానికి ప్రబల నిదర్శనం. AATel 231.1

పౌలు కొరింథు సహొదరుల్ని తన సాక్షులుగా పరిగణించాడు. “రాతి పలకల మీదగాని సిరాతోగాని వ్రాయబడక, మెత్తని హృదయములు అను పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయైయున్నారని వారు తేట పరచబడుచున్నారు” అని పౌలన్నాడు. AATel 231.2

పాపులు మారుమనసు పొంది సత్యంద్వారా పరిశుద్దులవ్వటం ఒకసువార్త సేవకుణ్ని ఆపరిచర్యకు దేవుడు పిలిచాడనటానికి ప్రబల నిదర్శనం. అతడి అపొస్తలత్వ నిదర్శన మారిన వ్యక్తుల హృదయాలపై ముద్రితమై ఉంది. వారి నూతన జీవితాలే దానికి సాక్ష్యం. క్రీస్తువారి అంతరంగంలో రూపుదిద్దుకొని మహిమా నిరీక్షణగా నిలుస్తాడు. సువార్త పరిచర్యకు సంబంధించిన ఈ ముద్రలు సువార్త సేవకుణ్ని బలోపేతం చేస్తాయి. AATel 231.3

నాడు పౌలు పరిచర్యను గూర్చి కొరింథు సంఘం ఇచ్చిన సాక్ష్యాన్నే ఈనాడు సువార్త సేవకుడు పొందాల్సి ఉన్నాడు. కాగా ఈ యుగంలో బోధకులు కోకొల్లలుగా ఉన్నా సమర్థులు, నీతిమంతులు అయిన బోధకులు క్రీస్తు ప్రేమవంటి ప్రేమగల బోధకుల కొరత ఎంతగానో ఉంది. క్రీస్తు మతాన్ని ఆచరిస్తున్నట్లు చెప్పుకొనే అనేకుల మనసుల్లో అహంకారం, ఆత్మవిశ్వాసం, లోకాశలు, తప్పులు పట్టటం, కక్ష, అసూయ రాజ్యమేలున్నాయి. వారి జీవితాలు తరచు రక్షకుని జీవితానికి భిన్నంగా ఉండి, ఎవరి పరిచర్య ద్వారా వారు క్రైస్తవాన్ని స్వీకరించారో ఆబోధకు సేవలకు, సాక్షులుగా నిలుస్తారు. AATel 231.4

సమర్థ సువార్త సేవకుడని దేవునివల్ల మెప్పుపొందటంకన్నా ఒక వ్యక్తికి గొప్ప గౌరవం ఇంకొకటి ఉండదు. అయితే ప్రభువు ఎవరికైతే గొప్ప శక్తిని విజయాన్ని ఇస్తాడో ఆబోధకులు ప్రగల్భాలు పలుకరు. వారు పౌలుతో గళం కలిసి ఇలా అంటారు, “మా వలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదుగాని ఆత్మకే పరిచారకులమగుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు”. AATel 231.5

నిజాయితీ గల పరిచారకుడు ప్రభువుకార్యాన్ని నిర్వహిస్తాడు. తన సేవ ప్రాముఖ్యమైందని భావిస్తాడు. సంఘంతోను లోకంతోను క్రీస్తు ఎలాంటి బాంధవ్యాన్ని కలిగి ఉన్నాడో అలాంటి బాంధవ్యాన్ని తనూ కలిగి ఉండాలని గుర్తిస్తాడు. జయించేవారి ప్రతిఫలాన్ని పాపులు పొందే నిమిత్తం పాపుల్ని ఉదాత్తమైన ఉన్నతమైన జీవితానికి నడిపించేందుకు విసుగు విరామం లేకుండా పాటుపడ్డాడు. అతడి పెదవులు బలిపీఠం నుంచి తీసిన నిప్పును తాకుతాయి. అప్పుడతడు పాపికి ఏకైక ఆశాజ్యోతిగా యేసును ఉన్నతపర్చుతాడు. అతడి మాటలు వినేవారు అతడు ఎడతెగని ప్రార్థనలో దేవునికి చేరువగా ఉన్నాడని తెలుసుకొంటారు. అతడి మీద పరిశుద్ధాత్మ ఉంటాడు. అతడి ఆత్మ పరలోక అగ్నిని స్పృశిస్తుంది. అందుకు అతడు ఆధ్యాత్మిక సంగతుల్ని ఆధ్యాత్మిక సంగతులతో పోల్చగలుగుతాడు. సాతాను కోటల్ని కూలదొయ్యటానికి అతడు శక్తి పొందుతాడు. దైవప్రేమను గూర్చిన అతడి కథనం హృదయాల్ని కరిగిస్తుంది. “రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను?” అని అనేకులు అడుగుతారు. AATel 232.1

““కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్వమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అవమానకరమైన రహస్యకార్యము లను విసర్జించియున్నాము. మా సువార్త మరుగుచేయబడిన యెడల నశించుచున్న వారి విషయములోనే మరుగుచేయబడియున్నది. దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగుజేసెను. ఆంధకారములో వెలుగు ప్రకాశించెనుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మాహృదయములలో ప్రకాశించును. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదుగాని, క్రీస్తుయేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము సపరిచారకులమనియు ప్రకటించుచున్నాము”. AATel 232.2

క్రీస్తు సేవకుడిగా తనకు అనుగ్రహించబడ్డ పవిత్ర విశ్వాసనిధి విషయంలో దేవుడు చూపించిన కృపను దయాళుత్వాన్ని అపొస్తలుడు ఇలా అభివృద్ధిపర్చాడు. అతణ్ని అతడి సహచర పరిచారకుల్ని తమ కష్టాలు, బాధలు, అపాయకర పరిస్థితుల్లో విస్తారమైన దైవకృప బలపర్చింది. వారు తమ నమ్మకాన్ని బోధనల్ని శ్రోతల ఇష్టాయిష్టాల కనుగుణంగా రూపొందించలేదు. లేక తను బోధనల్ని ఆకర్షణీయం హర్షణీయం చేసేందుకుగాను రక్షణకు అవసరమైన సత్యాల్ని బోధించకుండా నిలిపివేయలేదు. సత్యాన్ని, స్పష్టంగాను సులభ గ్రాహ్యంగాను అందిస్తూ శ్రోతల గ్రహింపు కోసం మారుమనసు కోసం ప్రార్థించారు. అంతేకాదు, తాము బోధిస్తున్న సత్యాలు ప్రజల అంతరాత్మల్లో నివిచిపోయేటట్లు తమ బోధనల ప్రకారం నివసించటానికి ఆబోదకులు ప్రయత్నించారు. AATel 232.3

అతడింకా ఇలా అన్నాడు, “అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై యుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు.” పాపరహిత దేవదూతల ద్వారా దేవుడు తన సత్యాన్ని ప్రకటించగలిగేవాడు. కాని అది ఆయన ప్రణాళిక కాదు. తన సంకల్పాల నేరవేర్పుకు బలహీనతలతో నిండిన మానవుల్ని తన పనిముట్లుగా దేవుడు ఎంపిక చేసుకొంటాడు. ఆయన తన అమూల్య ఐశ్వర్యాన్ని మట్టి పాత్రల్లో ఉంచుతాడు. ఆయన దీవెనలు మనుషులద్వారా లోకానికి అందిస్తాడు. చీకటితో నిండిన లోకానికి వారి ద్వారా ప్రభువు మహిమ ప్రకాశించాల్సి ఉన్నది. ప్రేమభావంతో సేవచేస్తూ వారు అవసరాల్లో ఉన్న పాపుల్ని కలుసుకొని వారిని సిలువ చెంతకు నడిపించాల్సి ఉన్నారు. వారు తమ పరిచర్య అంతటిలోనూ మహిమను ఘనతను, సంస్తుతిని సర్వోన్నతుడైన ఆ ప్రభువుకే చెల్లించాలి. AATel 233.1

స్వానుభవాన్ని ప్రస్తావిస్తూ, క్రీస్తు సేవను ఎంపిక చేసుకోటంలో తాను ఏస్వార్థ ప్రయోజనాన్ని లక్షించలేదని పౌలు వ్యక్తం చేశాడు. ఎందుకంటే అతడి మార్గం శోధనలతో నిండి ఉంది. అతడిలా అంటున్నాడు, “ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారముకాము. అపాయములోనున్నను కేవలము ఉపాయములేని వారముకాము: తరుమబడుచున్నను దిక్కులేనివారముకాము; పడద్రోయబడినను నశించినవారముకాము. యేసు యొక్క జీవము మాశరీరమందు ప్రత్యక్షపరచ ‘బడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును దహించుకొనిపోవుచున్నాము.” AATel 233.2

క్రీస్తు సేవకులుగా తాను తన సహచర పరిచారకులు నిత్యం అపాయాలకు గురిఅయి ఉన్నామని పౌలు సంఘ సహోదరులకు గుర్తుచేశాడు. శ్రమలవల్ల వారి బలం క్షీణిస్తున్నది. “యేసు యొక్క జీవము కూడ మా మర్వశరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము”. అని రాశాడు. లేమివల్ల, కఠిన పరిశ్రమవల్ల శ్రమలనుభవిస్తూ ఈ సువార్త పరిచారకులు మరణానికి గురిఅయి నివసించారు. తమకు మరణం కలిగించే శ్రమ కొరింథీయులికి ఆధ్యాత్మిక జీవితాన్ని ఆధ్యాత్మికారోగ్యాన్ని ప్రసాదిస్తున్నది. సత్యాన్ని విశ్వసించటం ద్వారా కొరింథీయులు నిత్య జీవంలో పాలిభాగస్తులయ్యారు. ఇది మనసులో ఉంచుకొని క్రీస్తు అనుచరులు జాగ్రత్తగా మెలగాలి. నిర్లక్ష్యం, అవిశ్వాసం ద్వారా పనివారి కష్టాల్ని భారాన్ని అధికం చేయకుండటానికి జాగ్రత్త వారు వహించాలి. AATel 233.3

పౌలు ఇంకా ఇలా అన్నాడు. “అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై, ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడ లేపి, నాతోకూడ తన యెదుట నిలువబెట్టునని యెరిగి, మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము.” తనకు వచ్చిన సత్యం వాస్తవమైనదని పౌలు పూర్తిగా విశ్వసించాడు. అందుచేత దైవవాక్యాన్ని వక్రీకరించటానికి గాని లేదా తన అంతర్గత నమ్మకాల్ని దాచి పెట్టటానికిగాని ఏశక్తి పౌలుని ప్రోత్సహించలేకపోయింది. లోకం అభిప్రాయాలికి కట్టుబడటం ద్వారా ధనం, గౌరవం లేక వినోదాలు కొనుగోలు చేసుకోటానికి పౌలు ప్రయత్నించలేదు. కొరింథీయులికి బోధించిన విశ్వాసం విషయమై హతసాక్షి మరణాపాయాన్ని నిత్యమూ ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ అతడిలో జంకు ఏకోశానా కనిపించలేదు. ఎందుకంటే మరణించి తిరిగి లేచిన ఆప్రభువు తనను మరణం నుంచి లేపి తండ్రికి సమర్పిస్తాడని అతడు విశ్వసించాడు. AATel 234.1

“కృప యెక్కువమంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతా స్తుతులు విస్తరింపజేయులాగున, సమస్తమైనవి మికొరకైయున్నవి” అన్నాడు. అపొస్తలులు స్వీయప్రాబల్యం కోసం సువార్తను ప్రబోధించలేదు. ఆత్మల్ని రక్షించాలన్న దీక్షతో వారి సేవలో నిమగ్నులయ్యారు. అపాయం శ్రమలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో తమ కృషిని కొనసాగించటానికి వారిని ముందుకు నడిపింది ఈ దీక్షే. AATel 234.2

“కావున మేము ఆధైర్యపడము; మా బాహ్యపురుషుడు కృషించుచున్నను ఆంతర్యపురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు” అంటున్నాడు పౌలు. శత్రువు శక్తిని పౌలు గ్రహించాడు. శారీరకంగా తన బలం క్షీణిస్తున్నప్పటికీ క్రీస్తు సువార్తను నమ్మకంగాను నిర్భయంగాను ప్రకటించాడు. ఈ సిలువ యోధుడు దేవుని సర్వాంగ కవచం ధరించి యుద్ధరంగంలో ముందుకుసాగాడు. సంతోషంతో నిండిన అతడి స్వరం యుద్ధంలో అతణ్ని విజయుడుగా ప్రకటించింది. నమ్మకంగా నిలిచేవారికి కలిగే బహుమానంపై దృష్టిసారించి, విజయ స్వరంతో తన విస్మయాన్ని ఇలా వ్యక్తంచేశాడు, “మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు”. AATel 234.3

అపొస్తలుడి విజ్ఞప్తి సభ్యుల హృదయాల్ని కదిలించేదిగా ఉంది, కొరింథీయ సహోదరులు రక్షకుని సాటిలేని ప్రేమను నూతనంగా పరిగణించటం మొదలు పెట్టారు. పౌలు ఇలా రాశాడు, “మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధనవంతుడైయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను”. ఆయన ఎంత ఉన్నత స్థితినుంచి దిగివచ్చాడో, ఎంత తీవ్ర అవమానానికి గురి అయ్యాడో మీరెరుగుదురు. ఆత్మ నిరసన, త్యాగం బాటలో పయనం మొదలు పెట్టిన ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసేవరకు పక్కకు తిరగలేదు. సింహాసనానికీ సిలువకూ మధ్య ఆయనకు విశ్రాంతి లేదు. AATel 235.1

తమ నిమిత్తం రక్షకుడు ఎంతగా తన్నుతాను తగ్గించుకొన్నాడో తన ఉత్తరం చదివేవారు గ్రహించేందుకుగాను పౌలు ప్రతీ అంశం తర్వాత కొంత వ్యవధి ఇచ్చాడు. దేవునితో సమానుడుగా ఉన్నప్పటి క్రీస్తును, దేవదూతల శ్రద్ధాంజలిని అందు కొంటున్న క్రీస్తును వారి ముందుంచుతూ, ఆయన మానవుడుగా దిగివచ్చిన అతిదీన స్థితివరకూ ఆయన ఉదంతాన్ని అపొస్తలుడు వివరించాడు. AATel 235.2

పరలోక ప్రభువు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని గ్రహించేందుకు వారివి నడిపించ గలిగితే వారు స్వార్థాన్ని విసర్జించటం జరుగుతుందని పౌలు విశ్వసించాడు. దైవకుమారుడైన క్రీస్తు తన మహిమను పక్కనబెట్టి, మానవస్వభావానికి తన్నుతాను స్వచ్ఛందంగా లోను చేసుకొని పడిపోయిన మానవుణ్ణి పైకి లేవదీసి అతడికి నిరీక్షణను, ఆనందాన్ని పరలోకాన్ని ఇవ్వనెంచి సేవకుడయ్యేంతగా “అనగా సిలువ మరణము పొందునంతగా” (ఫిలిప్పీ 2:8) ఆయన ఎలా విధేయుడయ్యాడో వ్యక్తీకరించాడు. AATel 235.3

సిలువ వెలుగులో దైవప్రవర్తనను అధ్యయనం చేసినప్పుడు ధర్మం, న్యాయం సమ్మిళితమైన కృప, కరుణ, క్షమాపణల్ని మనం చూడగలుగుతాం. మానవుణ్ని దేవునితో సమాధానపర్చటానికి చేతుల్లోను, కాళ్లలోను, పక్కలోను గాయాల మచ్చలు ధరించి సింహాసంమీద ఆసీనుడై ఉన్న ప్రభువుని మనం చూడగలుతాం. దుర్భేద్యమూ ప్రచండమూ ఆయిన వెలుగులో నివసిస్తున్నప్పటికీ తనకుమారుని త్యాగాన్ని బట్టి మనల్ని అంగీకరించే తండ్రిని మనం చూడగలుగుతాం. సిలువ నుంచి ప్రతిబింబించిన వెలుగులో, ఉరిమిన ప్రతీకార మేఘంలో దేవుని రాత కనిపించింది. ఓ పాపీ, ‘జీవించు! పశ్చాత్తప్తులై విశ్వసించే ఆత్మల్లారా, జీవించండి! నాకు క్రయధనం నేను చెల్లించాను అని ఆ రాత తెలియజేసింది. - AATel 235.4

క్రీస్తును గురించి ధ్యానిస్తూ ఎల్లలులేని ప్రేమ తీరం పై మనం నిలిచి ఉంటాం. ఈ ప్రేమను గూర్చి చెప్పాలని ప్రయత్నిస్తాంగాని మనకు భాష చాలదు. ఈ లోకంలో ఆయన జీవించిన జీవితాన్ని గూర్చి ఆలోచిస్తాం. ఆయన మనకోసం చేసిన త్యాగం గురించి, మన మధ్యవర్తిగా సర్వలోకంలో ఆయన చేస్తున్న పరిచర్య గురించి, తనను ప్రేమించే వారికోసం ఆయన నిర్మిస్తున్న నివాసాల గురించి ఆలోచిస్తాం. క్రీస్తు ప్రేమ ఎత్తు, లోతు ఎంత గొప్పవి అని మాత్రమే మనం ఆశ్చర్యపోతాం! “మనము దేవుని ప్రేమించితిమనికాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను.” “మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి (ప్రేమ ననుగ్రహించెనో చూడుడి”. యోహాను 4:10 , 3:1. AATel 235.5

ఈ ప్రేమ పరిశుద్ధ అగ్నివలే ప్రతీ యధార్థ శిష్యుడి హృదయ బలిపీఠం పైన మండుతుంది. దేవుని ప్రేమను భూమి మీదనే క్రీస్తు బయలుపర్చాడు. ఆయన ప్రజలు ఈ ప్రేమను భూమిమీదనే తమ నిష్కళంక జీవితాల ద్వారా వెల్లడిచేయాల్ని ఉన్నారు. పాపులు దేవుని గొర్రెపిల్లను వీక్షించేందుకు సిలువ వద్దకు వెళ్లటం జరుగుతుంది. AATel 236.1