అపొస్తలుల కార్యాలు

31/59

30—ఉన్నత ప్రమాణ సాధనకు పిలుపు

ఆత్మ నిగ్రహం, మితానుభవం, క్రీస్తు సేవలో చల్లారని ఉత్సాహం వీటి ప్రాముఖ్యాన్ని కొరింథీయ విశ్వాసుల్లో నాటింపజెయ్యాలన్న లక్ష్యంతో, క్రైస్తవ జీవిత సమరాన్ని నిర్దిష్ట కాలంలో కొరింథుకు దగ్గరల్లో జరిగే పందాలతో పౌలు సరిపోల్చుతున్నాడు. గ్రీకులు రోమియులు ప్రధానంగా ఆడే ఆటల్లో అతి పురాతనమైందీ మిక్కలి ప్రతిష్టాత్మకమైందీ ఏదంటే పరుగు పందెం అని చెప్పాలి. రాజులు, సామంతులు రాజకీయ నాయకులు వాటిని చూసేవారు. అంతస్తు, భాగ్యం గల యువకులు నీటిల్లో పాలు పొందేవారు. కాని బహుమానం గెల్చుకోటానికి అవసరమైన కృషిని చేసేవారు కాదు. క్రమ శిక్షణను పాటించేవారు కాదు. AATel 218.1

ఈ పందాల్ని పకడ్బందీ నిబంధనల ప్రకారం జరిపించేవారు. వాటి విషయంలో సవాలు చేసే అధికారం ఎవరికీ లేదు. ఆ బహుమానానికి పోటీదార్లుగా తమ పేరు నమోదు చేసుకోదలచేవారు పోటీకి ముందు కఠినమైన శిక్షణ పొందాల్సిఉంది. హానికరమైన ఆహార పానాలుగాని లేక మానసిక శారీరక శక్తిని దెబ్బతీసే ఏ పదార్థాలుగాని వారు ఉపయోగించటం నిషిద్ధం. బలానికి వేగానికి సంబంధించిన ఈ పోటీలకు బలమైన కండరాలు సాగే కండరాలు అవసరం. నరాలు అదుపులో ఉండాలి. ప్రతీ కదలిక నిర్దిష్టంగా ఉండాలి. ప్రతీ అడుగు వేగంగా దృఢంగా పడాలి. శారీరక శక్తులు అత్యున్నత స్థాయినందుకోవాలి. AATel 218.2

వేచి ఉండే ప్రేక్షకుల ముందుకి పోటీదార్లు వచ్చినప్పుడు వారి పేర్లు ప్రకటించటం వారికి పోటి నిబంధనలు ప్రకటించటం జరిగింది. అప్పుడు వారందరూ బయలుదేరారు. తమపై ప్రేక్షకులు చూపించే ఆదరణ గెలువు సాధించాలన్న పట్టుదలను వారిలో పుట్టించింది. న్యాయనిర్ణేతలు లక్ష్యం దగ్గర్లో కూర్చున్నారు. వారు ఆదినుంచి అంతం వరకు పరిశీలించి విజేతకు బహుమానం ఇచ్చేందుకు కూర్చున్నారు. ఎవరైనా అక్రమంగా గురిని చేరితే న్యాయనిర్ణేతలు అతడికి బహుమతి ఇవ్వలేదు. AATel 218.3

ఈ పోటీల్లో గొప్ప ప్రమాదాలు కూడా దాగి ఉన్నాయి. కొందరైతే తాము పొందిన శారీరక ఒత్తిడి నుంచి కోలుకోలేకపోయారు. పందెం సాగుతున్నప్పుడు కొందరు పడిపోటం, కొందరికి నోటినుంచి ముక్కుల్లో నుంచి రక్తం కారటం జరిగింది. కొన్నిసార్లు ఓ పోటీదారుడు బహుమానాన్ని అందుకొనే తరుణంలో మరణించి నేలకొరగటమూ జరిగింది. అయితే, విజేత పొందే గౌరవం దృష్ట్యా జీవితాంతం ఉండే గాయాలు ఇంకా చెప్పాలంటే మరణం కూడా గొప్ప నష్టంగా కనిపించలేదు. AATel 219.1

విజేత గురిని చేరినప్పుడు ప్రేక్షక సమూహాల ఉత్సాహధ్వనితో చెవులు గింగురుమన్నాయి. చుట్టూ ఉన్న పర్వతాలు పర్వత శిఖరాలు ప్రతిధ్వనించాయి. ప్రేక్షకుల సమక్షంలో న్యాయనిర్ణేతలు విజేతకు విజయ చిహ్నాల్ని బహూకరించారు. అవి అతడు తన కుడిచేతిలో పట్టుకొని తీసుకు వెళ్లేందుకు చేసిన ఎవర్ గ్రీన్ కొమ్మల కిరీటం, ఓ అంజూరపుమట్ట. దేశమంతటా అతణ్ని శ్లాఘిస్తూ పాటలుపాడారు. అతడి తల్లిదండ్రులకు కూడా సన్మానం జరిగింది. గొప్ప ఆటగాణ్ని కన్నందుకు అతడు నివసించిన పట్టణం సయితం ప్రసిద్ధికెక్కింది. AATel 219.2

క్రైస్తవుడి పోరాటానికి ఈ పందాన్ని సంకేతంగా వ్యవహరించటంలో పందెంలో పోటీదార్ల విజయానికి సిద్ధబాటు అవసరమని నొక్కి చెప్పటం పౌలు ఉద్దేశం. ఆ సిద్దబాటు ఏంటంటే, ప్రాధమిక క్రమశిక్షణ, మితాహారం, ఆశనిగ్రహం. ‘పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును” అని పౌలన్నాడు. పందెంలో పరుగెత్తేవారు తమ దేహాన్ని బలహీనపర్చే ప్రతీ అభ్యాసాన్ని దూరంగా ఉంచి కఠిన క్రమశిక్షణ వలన తమ కండరాలు బలపడటానికి, శ్రమకు తట్టుకోటానికి వాటిని తర్చీతు చేస్తారు. పరీక్ష దినం వచ్చినప్పుడు వారు తమ శక్తుల్ని సంపూర్తిగా ఉపయోగించగలుగుతారు. తన నిత్యజీవాసకులికి హాని కలిగే అవకాశమున్నప్పుడు క్రైస్తవుడు తన ఆహారవాంఛల్ని శరీరేచ్ఛల్ని హేతుబద్ధత నియంత్రణ కిందికి, దైవచిత్తం అదుపుకిందికి తేవటం మరెంత ముఖ్యం! అతడు వినోదాలు, విలాసాలు లేక సుఖభోగాల మీదికి తన గమనాన్ని పోనియ్యకూడదు. తన అలవాట్లను ఆవేశాల్ని ఖచ్చితమైన నియంత్రణకు లోను చెయ్యాలి. దైవవాక్యం పునాదిగాగల బోధనలతోను, దేవుని ఆత్మ మార్గదర్శకత్వం ద్వారాను పరిపుష్టమైన ఆలోచన ఈ నియంత్రణ అనే కళ్లేన్ని పట్టుకోవాలి. AATel 219.3

ఇది చేసిన తర్వాత విజయం సాధించటానికి క్రైస్తవుడు తన శక్తి మేరకు కృషి చెయ్యాలి. కొరింథీయుల పందాల్లో పోటీదార్లు తమవేగాన్ని కాపాడుకోటానికి బాధతో కూడిన కృషి చేశారు. అలాగే క్రైస్తవుడు కూడా తన గురి దగ్గరవుతున్న కొద్దీ ఆరంభంలో కన్నా అంతంలో ఎక్కువ ఉద్రేకంతో ఎక్కువ పట్టుదలతో ముందుకి సాగుతాడు. AATel 219.4

కొరింథీయుల పరుగుపందాల్లో విజేత పొందిన వాడిపోయే పూతీగెల కిరీటానికీ, క్రైస్తవ పందాన్ని విజయవంతంగా పరుగెత్తిన భక్తుడికి లభించనున్న అనంత మహిమా కిరీటానికి మధ్యఉన్న వ్యత్యాసాన్ని పౌలు వివరిస్తున్నాడు. “వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము” అంటున్నాడు. క్షయమైన బహుమానం పొందటానికి గ్రీసు దేశపు పరుగుపందెగాళ్లు పడని శ్రమలేదు. పాటించని క్రమశిక్షణ లేదు. మనం ఇంతకన్నా ఎంతో విలువైన నిత్యజీవకిరీటం కోసం పాటుపడున్నాం. దాని కోసం మనం ఎంత జాగ్రత్తగా కృషి చేయాలి! మన త్యాగం, మన ఆత్మ నిరసన ఎంత హృదయపూర్వకంగా ఉండాలి! AATel 219.5

నిత్య జీవం కోసం క్రైస్తవుడు పరుగెత్తాల్సిన పందెం ఏకైక లక్ష్యాన్ని హెబ్రీయులకి రాసిన పత్రికలో పౌలు సూచిస్తున్నాడు: “మనము కూడ ప్రతి భారమును, సుళువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి పెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.” హెబ్రీ 12:1,2. నిత్య జీవన పందెంలో క్రైస్తవుడు విజయం సాధించాలంటే అసూయ, ద్వేషం, దురాలోచన, దుర్భాషలు, దురాశ అనే బరువుల్ని పక్కన పెట్టాలి. పాపానికి దారితీసి, క్రీస్తుకి అగౌరవం తెచ్చే ప్రతీ అలవాటును ప్రతీ పాపాన్ని విడిచి పెట్టాలి . . . అది ఎంతటి త్యాగమైనా సరే నిత్యమైన నీతి సూత్రాల్ని ఉల్లంఘించే ఏ వ్యక్తికీ దేవుని ఆశీర్వాదాలుండవు. విడిచి పెట్టలేని ఒక్క పాపం వ్యక్తి ప్రవర్తనను దిగజార్చి పలువుర్ని తప్పుదారి పట్టిస్తుంది. AATel 220.1

యేసు రక్షకుడిలా అన్నాడు, “నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరచిన యెడల దానిని నరికి వేయుము; నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుటకంటె అంగహీనుడవై (నిత్య) జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన యెడల దానిని నరికి వేయుము; రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుటకంటె కుంటి వాడవై (నిత్య) జీవములో ప్రవేశించుటమేలు”. మార్కు 9:43-45. దేహాన్ని మరణం నుంచి కాపాడేందుకు అవసరమైతే కాలునుగాని చెయ్యినిగాని లేదా కన్నునుగాని తీసివేయాల్సి ఉండగా ఆత్మకు చావును తెచ్చే పాపాన్ని తీసివేసుకోటానికి క్రైస్తవుడు ఇంకెంత ఆతృతగా ఉండాలి! AATel 220.2

పూర్వం ఈ పందాల్లో పోటీ చేసేవాళ్లు ఆత్మ నిరసన తీవ్ర క్రమశిక్షణ పాటించిన తర్వాత కూడా విజయాన్ని గూర్చిన భరోసా వారికుండేది కాదు. ‘పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా?” అని ప్రశ్నించాడు పౌలు. పందెంలో పరుగెత్తేవారు చిత్తశుద్ధితో ఎంత ఆతృతగా పరుగెత్తినా బహుమానం మాత్రం ఒక్క వ్యక్తికే దక్కుతుంది. అందరూ ఆశిస్తున్న ఆ హారం ఒక్క హస్తం మాత్రమే పట్టుకోగలు గుతుంది. బహుమానం పొందటానికి కొందరు తమ శక్తిమేరకు కృషి చేసి ఉండవచ్చు. అయితే దాన్ని అందుకోటానికి చెయ్యి చాపినప్పుడు తమకన్నా కాస్తముందన్న వ్యక్తి హస్తం దాన్ని దక్కించుకోవచ్చు. AATel 220.3

క్రైస్తవ పందెంలో ఇలా జరగదు. షరతుల్ని పాటించేవారిలో ఒక్కరు కూడా పందెం చివరలో ఆశాభంగం చెందరు. చిత్తశుద్ధి కలిగి ఓర్పుతో పరుగెత్తే వారిలో ఒక్కరు కూడా అపజయం పొందరు. ఈ పందెం వేగంగా పరుగెతే వారికి కాదు. ఈ పోరాటంలోని విజయం బలవంతులికి కాదు. భక్తుల్లో మిక్కిలి బలహీనుడూ మిక్కిలి బలవంతుడూ మహిమాన్వితమైన నిత్యజీవ కిరీటాన్ని ధరించవచ్చు. దైవ కృప శక్తి ద్వారా క్రీస్తు చిత్తానికి అనుగుణంగా నివసించే వారందరూ ఈ బహుమానాన్ని గెల్చుకోవచ్చు. దైవ వాక్యంలోని సూత్రాల్ని అనుదిన జీవనంలో ఆచరించటం ఏమంత ముఖ్యం కాదని, అది స్వల్ప విషయం అని అనే కులు భావించటం జరుగుతుంది. అయితే ఏ చిన్న విషయాన్ని తీసి పారెయ్యటానికి లేదు. మేలుకిగాని కీడుకిగాని అది ముఖ్యమే. జీవిత విజయాల్ని వైఫల్యాల్ని నిర్ధారించే త్రాసులో ప్రతీ క్రియా దాని దాని బరువును చూపిస్తుంది. విజేతల కృషి ఎంత శక్తితో చిత్తశుద్ధితో జరిగిందో ఆ నిష్పత్తిలోనే వారి బహుమానం ఉంటుంది. AATel 221.1

బహుమానాన్ని పొందాలన్న ఆశతో పందెంలో శ్రమించి పరుగెడున్న వ్యక్తితో అపొస్తలుడు తన్నుతాను పోల్చుకుంటున్నాడు. “కాబట్టి నేను గురిచూడనివానివలే పరుగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భషుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లో పరుచుకొనుచున్నాను” అంటున్నాడు. క్రైస్తవ పందెంలో తాను అనిశ్చింతంగా అనాలోచితంగా పరుగెత్త కూడదని పౌలు తన్నుతాను కఠిన శిక్షణకు అప్పగించుకొన్నాడు. “నా శరీరమును నలగగొట్ట” టమన్న మాటల అక్షరపరమైన అర్థం కోరికలు, ఉద్వేగాలు, ఉద్రేకాల్ని కఠిన క్రమ శిక్షణతో వెనక్కి తిరగగొట్టటం. AATel 221.2

ఇతరులకు సువార్త బోధించిన తానే భ్రష్టుడనవుతానేమోనని పౌలు భయపడ్డారు. తాను విశ్వసించి బోధించిన సూత్రాల్ని తానే తన జీవితంలో ఆచరించకపోతే తాను ఇతరుల నిమిత్తం చేస్తున్న సేవ నిరర్థకమని అతడు గుర్తించాడు. తన సంభాషణ, తన పలుకుబడి, సొంత సుఖసంతోషాల్ని తృణీకరించటం కేవలం చెప్పుకోటానికే కాదు. దేవునితో తన అనుదిన జీవితంలో అవి అంతర్భాగం అయ్యాయి. తనముందు నిత్యమూ ఒక లక్ష్యం ఉంచుకొన్నాడు. దాన్ని చేరటానికి చిత్తశుద్ధితో కృషి చేశాడు. “విశ్వాసమును బట్టి దేవుడనుగ్రహించు నీతి గలవాడై” నివసించటమన్నదే ఆ లక్ష్యం. ఫిలిప్పీ 3:9. AATel 221.3

దుర్మార్గత పై తన పోరాటం తాను బతికినన్నాళ్లూ సాగాల్సిందేనని పౌలుకి తెలుసు. లోకసంబంధమైన ఆసక్తులు ఆధ్యాత్నికోత్సాహం పై జయం సాధించకుండేందుకుగాను తాను ఆచితూచి నడుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అతడు అన్నివేళల్లోను గుర్తించి మసులుకొన్నాడు. స్వాభావిక ప్రవృత్తులతో పోరాటాన్ని అతడు శాయశక్తుల కొనసాగించాడు. తాను చేరాల్సిన గురిని ప్రతి నిత్యం తన ముందుంచుకొన్నాడు. దైవ ధర్మశాస్త్రాన్ని సిద్ధ మనసుతో ఆచరిస్తూ ఈ గురిని చేరటానికి పాటుపడ్డాడు. తన మాటలు, తన కార్యాలు, తన ఉద్రేకాలు అన్నీ దైవాత్మ అదుపుకింద ఉన్నాయి. నిత్యజీవం పందెంలో గెలుపు సాధించాలి అన్న ఈ ఏకైక ఉద్దేశాన్ని కొరింథీయ విశ్వాసుల్లో చూడాలని పౌలు బహుగా ఆశించాడు. వారు క్రీస్తు ఆదర్శాన్ని చేరెందుకు పోరాటంతో కూడిన జీవితం వారి ముందు ఉందని దాని నుంచి విడుదల ఉండదని అతడికి తెలుసు. దినదినం భక్తిని నైతిక ఔన్నత్యాన్ని అన్వేషిస్తూ చట్టబద్ధంగా పోరాటం సాగించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేశాడు. ప్రతీ భారాన్ని విడిచి పెట్టి క్రీస్తులో సంపూర్ణత అన్న గురిని చేరటానికి ముందుకు సాగవలసిందిగా వారికి విజ్ఞప్తి చేశాడు. AATel 221.4

పూర్వం ఇశ్రాయేలీయుల అనుభవాల్ని పౌలు కొరింథీయుల దృష్టికి తెచ్చాడు. విధేయత ద్వారా వారు పొందిన ఆశీర్వాదాల్ని తమ అతిక్రమాల వల్ల వారి మీదికి వచ్చిన తీర్పుల్ని వారి ముందుంచాడు. హెబ్రీయుల్ని ఐగుప్తు దేశంలో నుంచి పగటివేళ మేమస్తంభం కావుదలకింద రాత్రివేళ అగ్నిస్తంభం వెలుగులోను దేవుడు ఎలా నడిపించాడో వారికి గుర్తుచేశాడు. ఇలా ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రాన్ని క్షేమంగా దాటగా వారి మాదిరిగా ఆ సముద్రం దాటటానికి ప్రయత్నించిన ఐగుప్తీయులందరూ మునిగి నశించారని, ఈ కార్యాల ద్వారా ఇశ్రాయేలీయులు తన సంఘమని దేవుడు గుర్తించాడని చెప్పాడు. “అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరు ఆత్మసంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆబండ క్రీస్తే”. హెబ్రీయుల ప్రయాణాలన్నిటిలోనూ వారి అధినాయకుడు క్రీస్తే. రక్షణ జలాలు అందరికీ ప్రవహించేందుకుగాను, మనుషుల అతిక్రమాల నిమిత్తం గాయపర్చబడనున్న క్రీస్తుకు కొట్టబడ్డ ఆ బండ ప్రతీక. AATel 222.1

హెబ్రీయుల పట్ల దేవుడు అనుగ్రహం చూపుతున్నప్పటికీ తమ వెనకు ఉన్న ఐగుప్తులోని విలాసాల్నే వారి ఆకాంక్షించారు. వారి పాపం తిరుగుబాటుల కారణంగా వారి మీదికి దేవుని తీర్పులు వచ్చాయి. ఇశ్రాయేలీయుల అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవలసిందిగా అపొస్తలుడు కొరింథీయుల్ని హెచ్చరించాడు. “వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి” అంటున్నాడు. సుఖభోగాల ఆకాంక్ష వారిపట్ల దేవునికి ఆగ్రహం కలిగించిన పాపాలకు ఎలా దారి తీసిందో పౌలు కొరింథీయులికి వివరించాడు. ఇశ్రాయేలు ప్రజలు తిని తాగటానికి కూర్చొని ఆడటానికి లేచిన తరుణంలో ఏ దైవభీతితో ధర్మశాస్త్రం వల్లించటాన్ని విన్నారో దాన్ని పక్కన బెట్టి దేవుణ్ని సూచించేందుకు బంగారు దూడను చేసి దానికి మొక్కారు. బయెల్పేయోరు పూజకు సంబంధించిన విందు అనంతరం హెబ్రీయుల్లో అనేకమంది వ్యభిచరించి పతనమయ్యారు. దేవుని కోపం రగులుకొంది. ప్రభువు ఆజ్ఞమేరకు ఒక్క దినంలో “ఇరువది నాలుగు వేలమంది” తెగులు వల్ల చనిపోయారు. AATel 222.2

అపొస్తలుడింకా ఇలాహితవు వలికాడు, “తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.” వారు హెచ్చులు పలుకుతూ ఆత్మవిశ్వాసం పెంచుకుంటే ఘోరపాపాల్లోపడి దేవుని ఆగ్రహానికి గురికావచ్చు. అయినా వారు నిరాశ నిస్పృహలకు లోనుకాకూడదని పౌలు కోర్తున్నాడు. వారికి ఈ భరోసా ఇస్తున్నాడు. “దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగి సంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతే కాదు, సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.” AATel 223.1

తమ మాటలు క్రియలు ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో తమ్మునుతాము ప్రశ్నించుకోవలసిందంటూ హెచ్చరిస్తూ, విగ్రహారాధనను ప్రోత్సహించేవిగా గాని, విశ్వాసం విషయంలో బలహీనంగా ఉన్నవారి నియమాల్సి భంగపర్చేవిగా గాని తమ మాటలు క్రియలు ఉండకూడదని సహోదరులకు పౌలు విజ్ఞప్తి చేశాడు. “కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. యూదులకైనను, గ్రీసు దేశస్థులకైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి.” AATel 223.2

కొరింథు సంఘానికి అపొస్తలుడిచ్చిన హెచ్చరిక అన్నికాలాలికీ వర్తిస్తుంది. మరీముఖ్యంగా అది మన దినాలకు వర్తిస్తుంది. విగ్రహారాధన అనటంలో కేవలం విగ్రహ పూజనేగాక స్వార్థ ప్రయోజనాల్ని, సుఖభోగ వాంఛను, భోజన ప్రీతిని, కామాన్ని కూడా పౌలు ఉద్దేశించాడు. క్రీస్తును విశ్వసిస్తున్నట్లు చెప్పుకోటం, తన సత్యజ్ఞానాన్ని డంబంగా చాటుకోటం మాత్రమే ఒక వ్యక్తిని క్రైస్తవుణ్ని చేయవు. కన్నును, చెవిని, రుచిని లేదా శరీరేచ్ఛను తృప్తిపర్చే మతం క్రీస్తు మతంకాదు. AATel 223.3

సంఘాన్ని మానవ శరీరానికి పోల్చటం ద్వారా క్రీస్తు సంఘంలోని సభ్యుల మధ్య చోటుచేసుకోవాల్సిన అన్యోన్యతను సామరస్యాన్ని పౌలు చక్కగా ఉదాహరించాడు. అతడిలా రాశాడు, “యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి. శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది - నేను చెయ్యికాను గనుక శరీరములోని దాననుకానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు -నేను కన్నుగాను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను. అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ? అవయవములు అనేకములైనను శరీరమొక్కటే. గనుక కన్ను చేతితో -నీవు నాకక్కర లేదని చెప్పజాలదు; తల, పాదములతో -మీరు నాకక్కరలేదని చెప్పజాలదు ... అయితే శరీరములో వివాదము లేక, అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు. కాగా అవయము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితో కూడ శ్రమపడును, ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితో కూడ సంతోషించును. అటువలె, మీరు క్రీస్తు యొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయములైయున్నారు”. AATel 223.4

ఆ మీదట, నాటినుంచి నేటివరకు అనే కుల కు ఉత్సాహోద్రేకాలు సమకూర్చుతూ వచ్చిన ఈ మాటల్లో పౌలు క్రీస్తు అనుచరులు ప్రదర్శించాల్సిన ప్రేమ ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పాడు: “మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను, ప్రేమలేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్ధుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను. ప్రేమలేని వాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.” AATel 224.1

తాను క్రీస్తు అనుచరునంటూ ఎంతగా చెప్పుకొన్నా అతడి హృదయం క్రీస్తు పట్ల తోటి మానవులపట్ల ప్రేమతో నిండకపోతే అతడు క్రీస్తుకి యధార్ధ శిష్యుడు కాదు. అతడు గొప్ప విశ్వాసం ఉండి, అద్భుతకార్యాలు చేసే శక్తి గలవాడైనా ప్రేమ లేకపోతే అతడి విశ్వాసం నిరర్ధకం. అతడు ఉదారంగా దానం చేయవచ్చు. అయితే ప్రేమ కారణంగా గాక వేరే కారణాలతో బీదలకు భోజనవసతి ఏర్పాటుకై తన ఆస్తినంతటిని దానం చేస్తే ఆ క్రియ అతణ్ని దేవునికి ఇష్టుణ్ని చేయజాలదు. ఆ ఉత్సాహంలోను ఉద్రేకంలోను హతసాక్షి మరణాన్ని కూడా మరణించవచ్చు. అయినా ప్రేమలేకపోతే అతణ్ని మోసపోయిన ఔత్సాహిగా లేదా అత్యాశగల వంచకుడుగా దేవుడు పరిగణిస్తాడు. AATel 224.2

“ప్రేమ దీర్ఘ కాలము సహించును, దయచూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు.” తీవ్ర అవమానం నుంచి ఆనందం ఉప్పొంగుతుంది. సహనం, ప్రేమ, దైవచిత్తానుసార వర్తమానం పునాది మీద దృఢమైన ఉదాత్తమైన ప్రవర్తనలు నిర్మితమౌతాయి. AATel 224.3

ప్రేమ “అమర్యాదగా ప్రవర్తింపదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు. అపకారమును మనస్సులో ఉంచుకొనదు.” క్రీస్తు ప్రేమ వంటి ప్రేమ ఇతరుల ఉద్దేశాల్ని, కార్యాల్ని ఉదార మనసుతో అవగాహన చేసుకోటానికి తోడ్పడ్తుంది. వారి తప్పిదాన్ని అనవసరంగా బయట పెట్టదు. పరుల విషయంలో ప్రతికూల వార్తలు వినటానికి చెవి కోసుకోదు. ఇతరుల్ని గూర్చి మంచినే వినటానికి ప్రయత్నిస్తుంది. AATel 225.1

ప్రేమ “దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.” ఈ ప్రేమ “శాశ్వతకాలముండును.” దాని విలువ ఎన్నటికి తగ్గదు. ప్రేమ దైవ లక్షణం. ఈ ప్రశస్త నిధిని ఎవరు సొంతం చేసుకొంటారో వారు దేవుని పరిశుద్ధ పట్టణంలోకి దాన్ని తమతో తీసుకు వెళ్తారు. AATel 225.2

“కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే”. AATel 225.3

కొరింథు విశ్వాసుల్లో చోటుచేసుకొన్న నైతిక ప్రమాణ క్షీణత సమయంలో తమ విశ్వాసాన్ని ప్రాధమిక అంశాల్ని విడిచి పెట్టేసిన వారు కొందరున్నారు. కొందరైతే పునరుత్థాన సిద్ధాంతాన్ని నమ్మటం లేదనే వరకు వెళ్లారు. క్రీస్తు పునరుత్థానం గురించి ఉన్న తిరుగులేని సాక్ష్యం ఆధారంగా పౌలు ఈ తప్పుడు బోధను తిప్పికొట్టాడు. తన మరణం అనంతరం క్రీస్తు “లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను” ఆ తర్వాత “ఆయన కేఫాకును, తరువాత పండ్రెడుగురికిని కనబడెను. అటుపిమ్మట ఐదువందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు. కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును, అటు తరువాత అపొస్తలులకందరికిని కనబడెను. అందరికి కడపట ఆకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను” అని పౌలు ఉద్ఘాటించాడు. AATel 225.4

అపొస్తలుడు వారికి పునరుత్థాన సత్యాన్ని విశదం చేశాడు. అతడిలా అన్నాడు, “మృతుల పునరుత్థానములేని యెడల, క్రీస్తు కూడ లేపబడియుండలేదు. మరియు క్రీస్తు లేపబడియుండని యెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. ఈ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా? మృతులు లేపబడని యెడల దేవుడాయనను లేపవేదు గనుక మేము దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని యెడల క్రీస్తు కూడ లేపబడలేదు. క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్ధమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వీరును నశించిరి. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన యెడల మనుష్యులందరి కంటే దౌర్భాగ్యులమై యుందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడు.” AATel 225.5

పునరుత్థాన ఉదయం చోటు చేసుకోనున్న విజయాల పై కొరింథీయ సహోదరుల మనసుల్ని పౌలు నిలిపాడు. మరణించిన భక్తులు ఆ మహోదయాన అప్పటినుంచి ఇక నిత్యం నివసించేందుకు పునరుత్థానులవుతారు. “ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించముగాని నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది; మర్వమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనునప్పుడు విజయమందు మరణము మ్రింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నేరవేరును. ఓ మరణమా నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? .... అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక.” AATel 226.1

చివరి వరకు నమ్మకంగా నిలిచేవారి విజయం బ్రహ్మాండంగా ఉంటుంది. కొరింథీయుల ముందున్న పరిస్థితుల్ని గుర్తించిన అపొస్తలుడు తమను స్వార్ధాసక్తులు శరీర్చేల స్థాయి నుంచి పైకి లేపే అంశాల్ని వారి ముందుంచి జీవితాన్ని నిత్య జీవ నిరీక్షణతో మహిమాన్వితం చెయ్యటానికి ప్రయత్నించాడు. క్రీస్తులో తమకున్న ఉన్నతమైన పిలుపుకు తాము నమ్మకంగా నివసించాల్సిందిగా వారికి ఉద్బోధించాడు. “నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని యెరిగి స్థిరులును, కదలని వారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులైయుండుడి” అని వారిని ప్రోత్సహించాడు. AATel 226.2

కొరింథీయుల సంఘంలో ప్రబలుతున్న తప్పుడు అభిప్రాయల్ని దుబారాల్ని సరిచేయటానికి అపొస్తలుడు ఈ రీతిగా ప్రయత్నించాడు. పౌలు నిర్వంద్వంగా మాట్లాడాడు. అయినా ఆ మాటల్లో వారిపట్ల తన ప్రేమ ఉట్టిపడింది. అతడి హెచ్చరికల్లోను మందలింపుల్లోను దేవుని సింహాసనం నుంచి వచ్చిన వెలుగు వారిపై ప్రకాశించింది. తమను అపవిత్రుల్ని చేస్తున్న రహస్య పాపాల్ని ఆ వెలుగు వారికి బయలుపర్చింది. దాన్ని వారెలా స్వీకరించనున్నారు? AATel 226.3

ఆ ఉత్తరం ప్రధానంగా ఎవరికి మేలుకలిగే నిమిత్తం రాయటం జరిగిందో వారి మనసులు గాయపర్చుతుందేమోనని ఉత్తరం పంపివేసిన తర్వాత పౌలు ఆందోళన చెందాడు. తనకూ వారికీ మధ్య మరింత అగాధం ఏర్పడ్తుందేమోనని భయపడ్డాడు. తాను రాసిన మాటల్ని ఉపసంహరించుకోవాలని కొన్నిసార్లు ఎంతగానో ఆశించాడు. సంఘాలు, సంస్థల విషయంలో తనకుమల్లే బాధ్యత వహించేవారు పౌలు మనోవేదనను, ఆత్మనిందను అర్థం చేసుకోగలుగుతారు. ప్రస్తుతకాలంలో సువార్త సేవా భారం మోస్తున్న దైవ సేవకులు పౌలు తన సేవలో ఎదుర్కొ న్న సంఘర్షణల్ని, చూపించిన శ్రద్ధను కొంతమేరకు గ్రహించగలుగుతారు. సంఘంలోని కక్షలు విభేదాలు పౌలు మనసును క్షోభింపజేశాయి. తాను ఎవరి నుంచి సానుభూతి మద్దత్తు ఆశించాడో వారు కృతఘ్నలై మోసగించి వెళ్లిపోటం అపార వేదనను కలిగించింది. దుర్మార్గతకు పాల్పడ్డ సంఘాలు ఎదుర్కొనే అపాయాన్ని గుర్తించి తీవ్రమందలింపు వర్తమానం పంపాల్సి వచ్చినందుకు సభ్యులపట్ల కఠినంగా వ్యవహరించానేమోనన్న భావన అతణ్ని వేధించింది. తన వర్తమానాన్ని సభ్యులు ఎలా స్వీకరించారన్న విషయమై వార్తకోసం భయంతోను ఆందోళనతోను కనిపెట్టాడు. AATel 226.4