అపొస్తలుల కార్యాలు

30/59

29—హెచ్చరిక సందేశం, విజ్ఞాపన

తాను ఎఫెసులో ఉన్నకాలం ద్వితీయార్థంలో పౌలు కొరింథీయ సంఘానికి మొదటి పత్రికను రాశాడు. ఎందుకంటే కొరింథులోని సంఘం పట్ల పౌలు చూపిన గాఢమైన ఆసక్తిని ఏ ఇతర సంఘం పట్ల చూపలేదు, లేదా ఆ విశ్వాసుల విషయంలో చేసిన నిర్విరామ కృషి ఏ ఇతర సంఘం విషయంలోను చెయ్యలేదు. వారి మధ్య ఒకటిన్నర సంవత్సరాలు పనిచేశాడు. సిలువ మరణం పొంది తిరిగి లేచిన రక్షకుడే రక్షణ మారమని బోధించాడు. మార్పు కలిగించే శక్తిగల ఆయన కృప పై పూర్తిగా ఆధారపడి నివసించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేశాడు. క్రైస్తవ మతం స్వీకరించినవారిని సంఘ సహవాసంలోకి అంగీకరించక ముందు క్రైస్తవ విశ్వాసి ఆధిక్యతలు బాధ్యతల గురించి ప్రత్యేక ఉపదేశం ఇవ్వటంలో శ్రద్ధ వహించేవాడు. తమ బాప్తిస్మం సంబంధంగా చేసిన ప్రమాణాలకు నిబద్దులై నమ్మకంగా నివసించటానికి వారికి సాయపడటానికి చిత్తశుద్ధితో కృషి చేసేవాడు. AATel 211.1

తనను వంచించి వశపర్చుకోటానికి నిత్యం ప్రయత్నించే దుష్ట శక్తులతో ప్రతీ ఆత్మ సల్పాల్సిన పోరాటం ఎలాంటిదో పౌలుకి బాగా తెలుసు. కనుక విశ్వాసంలో ఎక్కువ అనుభవం లేనివారిని బలోపేతుల్ని చేసి దృఢపర్చటానికి అతడు అవిశ్రాంతంగా కృషి చేశాడు. తమ్ముని తాము సంపూర్తిగా దేవునికి సమర్పించు కోవలసిందిగా వారికి విజ్ఞప్తి చేశాడు. ఎందుకంటే, ఒక ఆత్మ ఈ సమర్పణను చేసుకోకపోతే అది పాపాన్ని విసర్జించదు. అభిరుచులు వాంఛలు ప్రాబల్యం సాధిస్తాయి. శోధనలు మనస్సాక్షిని గలిబిలి పర్చుతాయి. AATel 211.2

సమర్పణం సంపూర్తిగా ఉండాలి. ప్రభువుకి తన్నుతాను పూర్తిగా సమర్పించుకొనే ప్రతీ బలహీనమైన, బాధపడున్న ఆత్మను విజయసాధలతో దేవుడు ప్రత్యక్షంగా అనుబంధపర్చుతాడు. ఆవ్యక్తికి దేవుడు సమీపంగా ఉంటాడు. శ్రమలు కలిగి సహాయం అవసరమైనప్పుడు దేవదూతల మద్దతు సహాయం అతడికి ఉంటాయి. AATel 211.3

కొరింథు సంఘసభ్యుల చుట్టూ విగ్రహారాధన, అనేక ఆకర్షణలతో నిండిన శరీరక్రియలు ఆనందాలు ఉన్నాయి. పౌలు తమ మధ్య ఉన్నప్పుడు వీటి ప్రభావం వారిమీద పడలేదు. పౌలు దృఢవిశ్వాసం. అతడి ప్రార్థనలు, ఉపదేశం, అన్నిటికన్నా ముఖ్యంగా ఆతడి భక్తి జీవితం వారు పాపభోగాలు అనుభవించటం కంటే క్రీస్తు నిమిత్తం తమ్ముని తాము ఉపేక్షించుకోటానికి వారికి స్ఫూర్తినిచ్చింది. AATel 212.1

అయితే పాలు వెళ్లిపోయిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. విరోధి విత్తిన గురుగులు గోధుమల నడుమ మొలిచాయి. కొద్దికాలంలోనే వాటి పంట అవి పండాయి. ఇది కొరింథీయ సంఘానికి తీవ్ర శ్రమకాలం. వారిని ఉత్సాహపర్చి దేవునికి దగ్గరగా జీవించటానికి అపొస్తలుడు వారి మధ్యలేడు. వారు క్రమేపి అజాగ్రత్తగా నిరుత్సాహంగా తయారై స్వాభావిక అభిరుచులకు కోర్కెలకు లొంగిపోయారు. పవిత్ర ఉన్నతాశయాల్ని ప్రబోధించి నీతి జీవితాన్ని తరచు ప్రోత్సహించిన అపొస్తలుడు వారి మధ్యలేడు. క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించిన తరుణంలో తమ చెడ్డ అలవాట్లు అభ్యాసాల్ని విడిచి పెట్టిన వారిలో అనేకమంది తమ అన్యమత పాప జీవితాన్ని తిరిగి ప్రారంభించారు. AATel 212.2

దుర్వర్తనులతో “సాంగత్యము చేయకూడదు” అంటూ సంఘానికి హితవు పలుకుతూ పౌలు క్లుప్తంగా రాశాడు. కాని పలువురు విశ్వాసులు అపొస్తలుడి హితవాక్యాల్ని పెడ అర్థాలు తీసి ఆ ఉపదేశాన్ని తాము పాటించనవసరం లేదని వెల్లడించారు. AATel 212.3

సంఘం పౌలుకు ఒక ఉత్తరం రాసింది. ఆయా అంశాలపై పౌలు సలహాలు కోరింది గాని తమ మధ్య ప్రబలున్న ఘోర పాపాల విషయమై ఒక్కమాట కూడా రాయలేదు. ఈ ఉత్తరం సంఘ వాస్తవిక పరిస్థితిని దాచి పెట్టిందని, తన మాటల్ని వాక్యాల్ని ఉటంకించి తమ అభిప్రాయాల్ని దుష్కృతాల్ని సమర్థించుకోటమే ఆ ఉత్తరం రచయితల పరమోద్దేశమని పరిశుద్ధాత్మ ప్రేరణవల్ల పౌలు గ్రహించాడు. AATel 212.4

దాదావు ఇదే సమయంలో కొరింథు సంఘానికి చెందిన కోయ కుటుంబ సభ్యులు ఎఫెసురావటం జరిగింది. కొరింథు సంఘ పరిస్థితుల గురించి పౌలు వారిని అడిగాడు. సంఘం విభేదాలతో చీలిపోయిందని వారు చెప్పారు. అపొల్లో సందర్శన సమయంలో తలెత్తిన విభేదాల కంటే ఇప్పటి విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. అబద్ధ బోధకులు బయలుదేరి పౌలు బోధనల్ని తృణీకరించేటట్లు సంఘస్తుల్ని తప్పుతోవ పట్టిస్తున్నారు. సువార్త సిద్ధాంతాల్ని వక్రీకరిస్తున్నారు. ఒకప్పుడు క్రైస్తవ జీవితంలో నిష్టగా ఉన్నవారి మధ్య అహంకారం, విగ్రహారాధన, కామేచ్ఛలు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చాయి. AATel 212.5

ఈ విషయాలు విన్న తర్వాత తాను భయపడినట్లే కొరింథులో జరుగుతున్నట్లు పౌలు గుర్తించాడు. అయితే, అక్కడ తన సేవ విఫలమయ్యిందని దీన్నిబట్టి పౌలు తలంచలేదు. “మనోవేదనతో” “ఎంతో కన్నీరు విడుచుచు” మార్గనిర్దేశం కోసం దేవున్ని వేడుకొన్నాడు. అదే సరైన మార్గంగా కనిపించి ఉంటే ఆఘమేఘాల మీద కొరింథు వెళ్లేవాడే. కాని తమ ప్రస్తుత పరిస్థితిలో ఆ విశ్వాసులకు తన పరిచర్యవల్ల ఏమి ప్రయోజనం చేకూరదని అవగతం చేసుకొన్నాడు. కనుక పౌలు తీతును పంపించాడు. ఆూదట వారి దుర్వర్తన విషయమైన తన వ్యక్తిగత మనోభావాల్ని పక్కన పెట్టి, దేవునిపై ప్రగాఢ నమ్మకం నిలిపి కొరింథు సంఘానికి ఉత్తరం రాశాడు. తన ఉత్తరాలన్నీటిలోను ఈ ఉత్తరం మిక్కిలి ఆధ్యాత్మికమైన, మిక్కిలి జ్ఞానయుక్తమైన, మిక్కిలి శక్తిమంతమైన ఉత్తరం. AATel 212.6

సంఘం లేవనెత్తిన వివిధ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలతో సామాన్య సూత్రాల్ని ఇచ్చాడు. వారు ఆ సూత్రాల్ని పాటిస్తే వారి ఆధ్యాత్మిక స్థితి మెరుగవుతుంది. వారు ఆధ్యాతికంగా అపాయంలో ఉన్నారు. ఈ సంకట పరిస్థితిలో వారిని ఆదుకోక పోవటమన్న తలంపే దుర్భరం. వారి ముందున్న అపొయన్ని గుర్తించి హెచ్చరించి వారు చేస్తున్న పాపాలికి వారిని మందలించాడు. వారికి మళ్లీ క్రీస్తును ఆవిష్కరించి తమ తొలిదినాల భక్తిని వారిలో నూతనంగా రగిలించాడు. AATel 213.1

కొరింథీయ విశ్వాసుల పట్ల పౌలు మమతానురాగాలు ఆ సంఘాన్ని అతడు సున్నితంగా సంబోధించటంలోనే వ్యక్తమౌతుంది. విగ్రహారాధననుంచి వారు దేవుని తట్టు తిరగటంలోను దేవుని సేవ చేయటంలోను వారి అనుభవం గురించి ప్రస్తావించాడు. వారు పొందిన పరిశుద్దాత్మ గురించి ప్రస్తావించాడు. క్రీస్తు పరిశుద్ధతను సాధించేంతవరకు క్రైస్తవ జీవనంలో నిత్యమూ ప్రగతి చెందటం తమ ఆధిక్యత అని వారికి వ్యక్తం చేశాడు. అతడు ఇలా రాశాడు, “క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపడియుండినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు. మన ప్రభువైన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతము వరకు అయన మిమ్మును స్థిరపరచును”. AATel 213.2

కొరింథు సంఘంలో లేచిన వివాదాల గురించి పౌలు విస్పష్టంగా మాట్లాడాడు. కలహాలకు దూరంగా ఉండాల్సిదంటూ హితపు పలికాడు. పౌలిలా అన్నాడు, “సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక యేక మనస్సుతోడను ఏక తాత్పర్యముతోడను మీరు సన్నదులైయుండ వలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను”. AATel 213.3

సంఘంలో విభేదాలున్నట్లు తానెవరి ద్వారా విన్నదీ వెల్లడించటానికి అపొస్తలుడు సందేహించలేదు. “మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయె యింటివారి వలన నాకు తెలియవచ్చెను”. AATel 214.1

పౌలు దైవావేశంతో నిండిన అపొస్తలుడు. తాను ఇతరులకు బోధించిన సత్యాలు అతడు “దేవదర్శనము వలన” పొందాడు. అయినా అన్ని సందర్భాల్లోనూ తన ప్రజల పరిస్థితిని దేవుడు అతడికి ప్రత్యక్షంగా బయలుపర్చలేదు. ఈ సందర్భంలో, కొరింథు సంఘ క్షేమాభివృద్ధిపై ఆసక్తిగలవారూ, సంఘంలోకి ప్రవేశిస్తున్న దుర్మార్గాన్ని చూసినవారూ ఆ విషయాన్ని అపొస్తలుడి దృష్టికి తెచ్చారు. క్రితం తాను పొందిన ప్రత్యక్షతల ఆధారంగా ఈ పరిణామాల స్వరూప స్వభావాల్ని అవగాహన చేసుకోగలిగాడు. ఆ నిర్దిష్ట సమయానికి దేవుడు నూతన ప్రత్యక్షత నివ్వకపోయి నప్పటికీ, యధార్థ చిత్తంతో సత్యాన్వేషణ చేస్తున్నవారు ఆ వర్తమానాన్ని క్రీస్తు మనసు వ్యక్తీకరణగా స్వీకరించారు. సంఘాల్లో ఉత్పన్నమయ్యే సమస్యలు అపొయాల్ని ప్రభువు అతడికి చూపించాడు. ఈ దుష్పరిణామాలు చోటుచేసుకోగా అపొస్తలుడు వాటి ప్రాధాన్యాన్ని గుర్తించాడు. సంఘాన్ని కాపాడటానికి సన్నద్ధమయ్యాడు. ఆత్మల విషయంలో అతడు దేవునికి జవాబుదారిగా వ్యవహరించాల్సి ఉన్నాడు. సంఘంలోని అరాచకం విభేదాల్ని గూర్చిన భోగట్టాను అతడు పట్టించుకోటం సమంజసం కాదా? ముమ్మాటికీ సమంజసమే. అతడు రాసిన ఇతర పత్రికలకుమల్లేనే తాను పంపిన ఈ గద్దింపు లేఖ కూడా దేవుని ఆత్మావేశం వల్ల రాసిందే. AATel 214.2

తన పరిచర్య ఫలాల్ని నాశనం చెయ్యటానికి ప్రయత్నిస్తున్న అబద్ధ బోధకుల గురించి పౌలు ప్రస్తావించలేదు. సంఘంలో నెలకొన్న చీకటి, కలహాల కారణంగా అట్టి ప్రస్తావన ద్వారా వారి కోసం రేపకూడదని తెలివిగా వ్యవహరించాడు. అలా చేయటం వల్ల కొందరు సత్వం నుంచి పూర్తిగా తొలగిపోతారేమోనని భయపడ్డాడు. “నేర్పరియైన శిల్పకారునివలె” తాను వేసిన పునాదిపై ఇతరులు నిర్మించిన కట్టడంగా తన పరిచర్య గురించి పౌలు ప్రస్తావించాడు. అలా చెప్పటం ద్వారా అతడు అతిశయం ప్రదర్శించుకోలేదు. అతడన్న మాటలివి, “మేము దేవుని జత పనివారమైయున్నాము”. అతడు తన సొంత జ్ఞానం గురించి చెప్పుకోలేదు. దేవునికి నచ్చే విధంగా సత్యాన్ని అందించటానికి తనకు శక్తి నిచ్చింది దేవుడేనని గుర్తించాడు. మహోపాధ్యాయుడైన క్రీస్తుతో చెయ్యి కలిపినప్పుడు అతడు దైవజ్ఞానంతో నిండిన బోధలు బోధించటానికి శక్తిని పొందాడు ఈ బోధలు అన్ని కాలాల్లోను అన్ని స్థలాల్లోను అన్ని పరిస్థితుల్లోను అన్ని తరగతుల ప్రజల అవసరాన్ని తీర్చాయి. AATel 214.3

కొరింథీయ విశ్వాసుల్లో చోటుచేసుకొన్న అతి నికృష్ట పాపాల్లో ఒకటి అన్యమత సంబంధమైన నీతి బాహ్య ఆచారాల్లో అనేకమైన వాటిని తిరిగి ఆచరించటం. ఒక పూర్వ విశ్వాసి అనైతిక వర్తనలో ఎంతగా దిగజారిపోయాడంటే అన్యప్రపంచపు కొద్దిపాటి నీతి ప్రమాణాన్ని కూడా అతడు ఉల్లంఘించాడు. ” ఆదుర్మార్గుని మిలోనుండి వెలివేయుడి” అంటూ పౌలు ఆ సంఘానికి విజ్ఞప్తి చేశాడు. ‘పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై పులుపిండిని తీసిపారవేయుడి” అని ఉద్భోదించాడు. AATel 214.4

సంఘంలో తలెత్తిన ఇంకొక తీవ్రమైన చెడుగు ఒకరిపై ఒకరు ఫిర్యాదుచేస్తూ న్యాయస్థానాలకి వెళ్లటం. విశ్వాసుల మధ్య లేచే సమస్యల పరిష్కారానికి సమర్థ వ్యవస్థ ఏర్పాటయ్యింది. అట్టి సమస్యల పరిష్కారానికి స్వయాన క్రీస్తే ఉపదేశం ఇచ్చాడు. ప్రభువిలా సూచించాడు, “నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసిన యెడల నీవుపోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీమాట వినిన యెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు విననియెడల, ఇద్దరు ముగ్గురు సాక్షులనోట ప్రతిమాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతనియొద్దకు పొమ్ము, అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘము మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను, సుంకరిగాను ఎంచుకొనుము”, మత్తయి 18: 15-18. AATel 215.1

స్పష్టమైన ఈ ఉపదేశాన్ని విస్మరించిన కొరింథీయ విశ్వాసులకు పౌలు కచ్చితమైన ఈ హితవును హెచ్చరికను రాశాడు, “మీలో ఒకనికి మరియొకని మిద వ్యాజ్యెమున్నప్పుడు వాడు పరిశుద్ధుల యెదుట గాక అనీతిమంతుల యెదుట వ్యాజ్యెమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరుగవలసియుండగా, మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుట నాకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యెరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగ తీర్పు తీర్చవచ్చును గదా? కాబట్టి యీ జీవన సంబంధమైన వ్యాజ్యెములు మీకు కలిగిన యెడల వాటిని తీర్చుట కు సంపుములో తృణీకరింపబడినవారిని కూర్చుండబెట్టుదురా? నాకు సిగ్గురావలెనని చెప్పుచున్నాను. ఏమి? తమ సహోదరుల మధ్య వ్యాజ్యెము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడును లేడా? అయితే సహోదరుడు సహోదరుని మిద వ్యాజ్యె మాడుచున్నాడు. ఒక నిమిద ఒకడు వాజ్యెమాడుట నాలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటె అన్యాయము సహించుట మేలుకాదా? . . . అయితే సరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే యీలాగు చేయుచున్నారు. అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా?” AATel 215.2

అవిశ్వాసాన్ని, వేర్పాటును, ద్వేషాన్ని దైవ ప్రజల మధ్య వ్యాప్తి చెయ్యటానికి సాతాను ఎల్లప్పుడూ కృషి చేస్తాడు. కారణం లేకపోయినా మన హక్కులకు భంగం కలుగుతున్నట్లు భావించటానికి మనల్ని సాతాను నడిపించటం తరచూ జరుగుతుంది. క్రీస్తును ఆయన సేవను ప్రేమించటం కంటే స్వార్థాశలే ఎక్కువ ప్రేమించేవారు స్వప్రయోజనాలకే ప్రాధాన్యాన్నిచ్చి వాటిని కాపాడుకోటానికి ఏ సాధనాన్నైనా ఉపయోగిస్తారు. పైకి మంచి క్రైస్తవులుగా కనిపించే వారిలో చాలామంది సయితం గర్వం ఆత్మాభిమానం అడ్డు రావటంతో తప్పుచేస్తున్న వ్యక్తుల వద్దకు రహస్యంగా వెళ్లి క్రీస్తుస్పూర్తితో వారితో మాట్లాడి వారితో కలిసి ఒకరికోసం ఒకరు ప్రార్థన చేసుకోటానికి అభ్యంతరపడ్తుంటారు. సహోదరుల వలన తమకేదైనా హాని కలిగినప్పుడు వారిలో కొందరు రక్షకుడిచ్చిన నియమాన్ని అనుసరించి వ్యవహరించేబదులు న్యాయస్థానాలకి వెళ్తారు. సంఘ సభ్యుల నడుమ ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి క్రైస్తవులు ప్రజా న్యాయస్థానాల్ని ఆశ్రయించకూడదు. వాటిని తమ మధ్యతామే పరిష్కరించుకోవాలి. లేదా క్రీస్తు ఉపదేశానుసారం వాటిని సంఘంలోనే పరిష్కరించుకోవాలి. తనకు అన్యాయం జరిగి ఉన్నప్పటికీ సాత్వికుడుగాను సామాన్యుడిగాను నివసించిన యేసు అనుచరుడు సంఘంలోని తన సహోదరుడి పాపాలు ప్రపంచానికి బహిర్గతం చేయటం కంటే తన “సొత్తులనపహరింపబడ” నిస్తాడు. AATel 216.1

సహోదరుల మధ్య వ్యాజ్వాలు క్రైస్తవ విశ్వాసాలకు నింద తెస్తాయి. క్రైస్తవులు ఒకర్నొకరు కోర్టుకి ఈడ్చుకోటం శత్రువుల ఎగతాళికి సంఘాన్ని బహిర్గతం చేసి సంఘంపై చీకటి శక్తులు జయం సాధించటానికి తోడ్పడటమౌతుంది. అట్టివారు క్రీస్తును తాజాగా గాయపర్చి సిగ్గుపరుస్తున్న వారవుతారు. సంఘాధికారాన్ని లెక్కచెయ్యకపోటం వల్ల సంఘానికి దాని అధికారాన్ని దఖలుపర్చిన దేవున్ని ద్వేషిస్తున్నట్లు వ్యక్తమౌతుంది. AATel 216.2

తమను దుష్టి నుంచి కాపాడేందుకు క్రీస్తుకున్న శక్తిని కొరింథీయులికి చూపించటానికి పౌలు ఈ ఉత్తరంలో ప్రయత్నించాడు. వారు ఆ నిర్దిష్ట షరతుల్ని పాటించినట్లయితే సర్వశక్తిని బలంతో వారు దృఢంగా ఉండగలరని పౌలుకి తెలుసు. వారు పాప దాస్యబంధాల్ని తెంచుకొని ప్రభువు భయభక్తుల్లో సంపూర్ణ పరిశుద్ధతను పొందేందుకు దోహదపడే సాధనంగా తాము క్రైస్తవాన్నంగీకరించిన తరుణంలో తాము ఎవరికి తమ జీవితాల్ని అంకితం చేసుకొన్నారో ఆ ప్రభువు కోరుతున్నట్లు చేయాల్సిందిగా పౌలు వారికి విజ్ఞప్తి చేశాడు. “మీరు క్రీస్తుకు చెందినవారు” “మీరు మీ సొత్తుకారు. విలువ పెట్టె కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి” అన్నాడు. AATel 216.3

పవిత్రమైన పరిశుద్ధమైన జీవనం నుంచి అనైతిక అన్యమత ఆచారాలకు మళ్లటం వల్ల కలిగే దుష్పరిణామాల్ని అపొస్తలుడు వారికి వివరంగా తెలియజేశాడు. “మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరదు” అని వారిని హెచ్చరించాడు. తమ తుచ్ఛ కోర్కెల్ని నిగ్రహించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. “మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?” అని ప్రశ్నించాడు. AATel 216.4

పౌలు గొప్ప ప్రతిభపాటవాలున్న వ్యక్తి. అతడి జీవితం అరుదైన వివేకాన్ని బయలుపర్చింది. అది అతడికి చురుకైన గ్రహణ శక్తిని ఇతరుల్ని దగ్గర చేయగల దయాహృదయాన్ని ప్రసాదించింది. ఇతరుల్లో మంచి స్వభావం పుట్టించి ఉన్నత జీవితానికి పాటుపడటానికి వారికి స్ఫూర్తినిచ్చింది. కొరింథులోని విశ్వాసుల పట్ల అతడి హృదయం ప్రేమతో నిండింది. శోధనను ఎదుర్కోగల అంతర్గతమైన భక్తిని వారు కనపర్చటం చూడాలని అతడు ఆశించాడు. క్రైస్తవ యానంలో వారికి అడుగడుగున సాతాను సమాజమందిరం వ్యతిరేకత ఉంటుందని వారు దినదినం పోరాటం సల్పాల్సి ఉంటుందని అతడికి తెలుసు. విరోధి దొంగదెబ్బకు వారు అప్రమత్తులై ఉండాలి. వారు తమ పాత అలవాట్లను స్వాభావిక వాంఛలను దరికిరానియ్యకుండా ఉండి మెళుకువ కలిగి ప్రార్థించాలి. మెళుకువగా ఉండి ప్రార్థించటం ద్వారానే క్రైస్తవుడు ఆధ్యాత్మిక ఔన్యత్యాన్ని సాధించగలుగుతాడని పౌలుకు తెలుసు. ఇది వారి మనసులో నాటింపచెయ్యటానికి కృషి చేశాడు. హృదయాన్ని మార్చటానికి, దుష్క్రియలు చేయటానికి కలిగే శోధనల్ని ప్రతిఘటించటానికి, చాలినంత శక్తి క్రీస్తులో వారికి లభిస్తుందని అతడికి తెలుసు. దేవుని పై విశ్వాసం యుద్ధ కవచంగా, దేవుని వాక్యం యుద్ధాయుధంగా ఉండటంతో వారికి అంతర్గత శక్తి సరఫరా అవుతుంది. వారు శత్రువు దాడుల్ని తిప్పికొట్ట గలుగుతారు. AATel 217.1

కొరింథీయ విశ్వాసులికి మరింత లోతైన ఆధ్యాత్మికానుభవం అవసరమయ్యింది. ఆయన మహిమను వీక్షించటమంటే ఏంటో, ఒక ప్రవర్తన నుంచి ఇంకో ప్రవర్తనకు మారటమంటే ఏంటో వారికి సంపూర్తిగా తెలియలేదు. మహిమాన్వితమైన ఆ దినం ఉషఃకిరణాల్ని వారు చూశారు. వారి మనసంతా దేవుని సంపూర్ణతతో నిండాలని ఆ మిదట ఉదయం తప్పక వచ్చే రీతిగా ఎవరు ఉదయించనున్నారో ఆ ప్రభువుని వారు తెలుసుకొని మధ్యాహ్న సూర్యుడి వంటి సువార్త విశ్వాసాన్ని పొందేవరకు ఆయనను గూర్చి నేర్చుకొంటూ ఉండాలని పౌలు ఆకాంక్షించాడు. AATel 217.2