సంఘమునకు ఉపదేశములు

26/329

కుటుంబ సభికులలో నొక్కొక్కరికి ఒక స్థానము

స్త్రీలు పురుషుల వలె సత్యమును వీలైన చోట్ల వెదజల్లిన యెడల సమయమునకు అది మొలకెత్తి వృద్ధి పొందును. ఇట్టి క్లిష్ట సమయములయందు వారు తమ భాగమును నిర్వహించినచో వారి ద్వారా ప్రభువు గొప్ప పనిచేయును. కర్తవ్యమును గుర్తించినవారై దైవాత్మ ప్రభావము క్రింద వారు తమ కార్యసాధనకు పూనుకొన్నచో ఈ సమయమునకు కావలసిన సామర్థ్యము వారు పొందెదరు. ఆత్మార్పణ చేయ సంసిద్ధముగా నున్న యీ నారీ రత్నములపై యేసు తన ముఖ ప్రకాశమును ప్రతిఫలింపజేయును. మగవారిని మించు శక్తి వారికను గ్రహించబడును. పరకుటుంబములలో మగవారు వెళ్ళి చేయజాలని పనిని మగువలు చేయగలరు. స్త్రీలు పురుషులు ప్రవేశింపలేని పరిస్థితలులోనికి వెళ్ళి సత్యమునందించవచ్చును. పురుషులకు అలవిగాని హృదయములను మహిళలు సమీపించగలరు. వారి పని అత్యవసరము. యుక్తాయుక్త జ్ఞానసాత్వికములు కల స్త్రీలు ప్రజలకు తమ గృహములయందు సత్యమును విశదపర్చుటలో మంచిపని చేయగలరు. ఈ విధముగా విశదము చేయబడిన దైవ వాక్యము పులిసిన పిండివలె వ్యాపించును. దీని భావములద్వారా కుటుంబములకు కుటుంబములే సత్యము సంగీకరించును. 13 CChTel 88.1

కొద్దో గొప్పో అందరును చేయగలరు. ఈ బాధ్యతను తప్పించుకొనుటకు కొందరు “నా సమయము, నా ద్రవ్యము నా బిడ్డలను సాకుకొనుటకు, గృహకృత్యములను చేసికొనుటకు సరిపోవును” అనెదరు. తల్లిదండ్రులారా,ప్రభువు సేవ చేయుటయందు మీ సామర్థ్యములను వృద్ధిపరచుటలో మీ బిడ్డలు మీకు తోడ్పడవలెను. ప్రభుని కుటుంబమందు పిల్లలు చిన్న సభికులు. తమ్మును తాము దేవునికి సమర్పించుకొనునట్లు వారిని మీరు నడిపించవలెను. సృజించినందునను విమోచించినందునను వారు దేవునివారే. వారి శారీరక, మానసిక శక్తులన్నియు దేవునివే యని బోధించుడి. అనేక విధములగు నిస్వార్థ సేవలో సాయ ముచేయుటకు వారిని తర్బీతు చేయుడి. మీ బిడ్డలను ఆటంకబండలుగా ఉండనీయకుడి. మీతో మీ బిడ్డలు ఆధ్యాత్మిక, శారీరక భారములను పంచుకొనవలెను. ఇతరులకు సహాయము చేయుట ద్వారా వారు తమ ఆనందమును ప్రయోజనమును పెంపుచేసి కొనెదరు. 14 CChTel 88.2

క్రీస్తు కొరకు మన పని గృహమందలి కుటుంబముతో ప్రారంభించవలెను. యువజన విద్య గతముకన్న వ్యత్యాసమగు పద్దతిని సాగవలెను. వారి శ్రేయస్సు కొరకు క్రితముకన్న ఇప్పుడు ఎక్కువ కృషి చేయవలెను. దీనికన్న ప్రాముఖ్యమైన సేవారంగము మరియొకటిలేదు. మారు మనస్సు పొందని వారి కొరకు పనిచేయవలెనని ఉపదేశము ద్వారాను క్రియల ద్వారాను తల్లిదండ్రులు తమ బిడ్డలకు నేర్పించవలెను. బాధయందున్నవారికిని, వృద్ధులకును సానుభూతి చూపుచు విచార గ్రస్తుల యొక్కయు బీదల యొక్కయు బాధలను తొలగింప ప్రయత్నించుటకు పిల్లలు శిక్షణ పొందవలెను. సువార్త కార్యకలాపములలో వారు ఆసక్తులై యుండుటకు తర్ఫీదు చేయవలెను. దేవునితో జతపనివారగు నిమిత్తము వారు తమ బాల్యము నుండియు క్రీస్తు సేవాభ్యుదయము కొరకును, ప్రజా శ్రేయస్సు కొరకును ఆత్మోపేక్ష, ఆత్మార్పణము చేయవలెనని పదే పదే ఉపదేశించవలెను. 15 CChTel 89.1