స్వస్థత పరిచర్య

135/173

36—ఊహ జ్ఞానంలోని ప్రమాదం

జ్ఞానాన్వేషణలోని.. విజ్ఞాన శాస్త్ర పరిశీలననలోని - కీడుల్లో ఒకటి మానవ హేతువాదాన్ని దాని విలువను మంచి దాని సరియైన క్షేత్రాన్ని మించి ఘనపర్చే మనస్తత్వం. తమ అసంపూర్ణ శాస్త్ర జ్ఞానాన్ని బట్టి సృష్టికర్త ఆయన పనుల పై తీర్పు వెలిబుచ్చటానికి అనేకమంది ప్రయత్నిస్తున్నారు. దేవుని స్వభావాన్ని, గుణ లక్షణాల్ని, విశేషాధికారాల్ని నిర్ధారించి అనంతుడైన ఆయన గురించి ఊహా జనిత సిద్ధాంతాలు ప్రతిపాదించటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రకం అధ్యయనాల్లో నిమగ్నమయ్యేవారు నిషిద్ధ స్థలములో అడుగులు వేస్తున్నారు. వారి పరిశోధన విలువైన ఫలితాలు సాధించదు. దాని కొనసాగింపు వారి ఆత్మకు ప్రమాదం తెస్తుంది. MHTel 370.1

దేవుడు నిషేధించిన జ్ఞానానికి ఆకాంక్ష మన మొదటి తల్లితండ్రుల్ని పాపంలోకి నడిపించింది. ఈ జ్ఞానాన్ని సంపాదించటానికి ప్రయత్నించటంలో తాము కలిగి ఉండాల్సినదంతా వారు పోగొట్టుకున్నారు. ఆదాము అవ్వలు దేవుడు నిషేధించిన ఆ చెట్టును ముట్టకుండా ఉంటే పాపశాపం లేని తమకు నిత్యానందాన్ని తెచ్చి ఉండే జ్ఞానాన్ని దేవుడు వారికి ఇచ్చేవాడు. శోధకుడి మాట వినడం ద్వారా వారు సంపాదించినది పాప జ్ఞానం దాని ఫలితాలు, వారి అవిధేయత వల్ల మానవాళి దేవుని నుండి ఎడబాటు కలిగింది. భూలోకం పరలోకం నుండి విడిపోయింది. MHTel 370.2

ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఉంది. మన మొదటి తల్లితండ్రుల్ని నడిపించిన క్షేత్రంలోకే సాతాను నేడు మనుషులను ఆకర్షిస్తున్నాడు. అతడు కట్టు కథలతో లోకాన్ని నింపుతున్నాడు.తన ఆధీనంలో ఉన్న ప్రతీ సాధనం ద్వారా దేవుని గురించి దురాలోచన చెయ్యటానికి మనుషుల్ని శోధిస్తున్నాడు. రక్షణ నిచ్చే దేవుని గూర్చిన జ్ఞానాన్ని వారు పొందకుండా చెయ్యటానికి ఈ రకంగా ప్రయత్నిస్తున్నాడు. MHTel 370.3