యుగయుగాల ఆకాంక్ష

3/88

2—ఎన్నికైన ప్రజలు

యూదు ప్రజలు రక్షకుడి రాక కోసం వెయ్యి సంవత్సరాలకు పైచిలుకు కాలం ఎదురుచూశారు. ఈ సంఘటన పైనే వారు ఆశలు పెట్టుకున్నారు. పాటల్లో ప్రవచనంలో ఆలయ ఆచారాల్లో కుటుంబ ప్రార్థనల్లో ఆయన నామాన్ని కొనియాడారు. అయినా, ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎరగని స్థితిలో ఉన్నారు. పరలోకానికి మిక్కిలి ప్రీతిపాత్రుడైన ప్రభువు వారికి “ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలె” ఉన్నాడు. ఆయనకు “సురూపమైనను సొగ సైనను” లేదు. “ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు.” యెషయా 53:2; యోహాను 1:11. DATel 11.1

అయినా దేవుడు ఇశ్రాయేలును ఎన్నుకున్నాడు. మనుషుల నడతను, పరిరక్షించాలని వారికి ఆయన పిలుపునిచ్చాడు. వారు లోకానికి రక్షణ బావులుగా ఉండాలని దేవుడు కోరాడు. తాను సంచారం చేసిన దేశంలో అబ్రహాము ఎలా మసిలాడో, ఐగుప్తులో యేసేపు ఎలా ఉన్నాడో, బబులోనులో దానియేలు ఎలా ఉన్నాడో అలానే హెబ్రీ ప్రజలు నానా జాతుల మధ్య ఉండాలని దేవుడు కోరాడు. వారు ప్రజలకు దేవుణ్ని బయలుపర్చాల్సి ఉన్నారు. DATel 11.2

అబ్రహామును పిలిచినప్పుడు ప్రభువు ఈ మాటలన్నాడు, “నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. ... భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడుదురు.” ఆది 12:2, 3. ప్రవక్తలు కూడా ఈ విషయాన్ని బోధించారు. ఇశ్రాయేలీయుల సంఖ్య యుద్ధం వలన బానిసత్వం వలన క్షీణించినప్పటికీ వారికి ఈ వాగ్దానం నిలచి ఉంది. “యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచువలెను, మనుష్యుల ప్రయత్నము లేకుండను నరుల యోచన లేకుండను గడ్డిమీద పడు వర్షమువలె ఆయా జనుల మధ్యనుందురు. ” మీకా 5:7. యెరుషలేములోని దేవాలయం గురించి యెషయా ద్వారా ప్రభువిలా ప్రకటించాడు, “నా మందిరం సర్వజనులకూ ప్రార్ధన మందిరమని పిలువబడుంది.” యెషయా 56:7, ఆర్.వి. DATel 11.3

కాగా ఇశ్రాయేలు ప్రజలు లోక ప్రతిష్ఠ కోసం వెంపర్లాడారు. కనానులో ప్రవేశించింది లగాయతు వారు దైవాజ్ఞల్ని అనుసరించటం మాని అన్యజనుల ఆచారాల్ని అవలంబించారు. తన ప్రవక్తల ముఖంగా దేవుడు పంపిన హెచ్చరికలు నిరర్ధకమయ్యాయి. అన్యజనుల చేతుల్లో శ్రమల ద్వారా కలిగిన శిక్ష కూడా వారిని దారికి తేలేకపోయింది. ప్రతి దిద్దుబాటు వెనుక తీవ్ర భ్రష్టత చోటుచేసుకున్నది. DATel 12.1

ఇశ్రాయేలు ప్రజలు దేవునికి నమ్మకంగా ఉండి ఉంటే వా ? గౌరవ ప్రతిష్ఠలు కలిగే రీతిగా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకునేవాడు. వారు ఆయనకు విధేయులై నడుచుకొని ఉంటే “తాను సృజించిన సమస్త జనులకంటె కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు” వారిని హెచ్చించేవాడు. మోషే ఇలా అన్నాడు, “భూప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు” “ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని ఆచరించవలెను. వాటిని గూర విను జనులు నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవివేకములు గల జనమని చెప్పుకొందురు.” ద్వితి 26:19; 28:10;4:6. కాని వారి అపనమ్మకం వల్ల దేవుని సంకల్పం నెరవేర్పు నిత్యమూ కష్టాల ద్వారా అవమానం ద్వారా మాత్రమే సాధ్యపడింది. DATel 12.2

వారిని చెరపట్టి బబులోనికి తీసుకువెళ్లి అక్కడ నుంచి ఆయా అన్యదేశాలకు చెదరగొట్టారు. తమ కష్టాలు శ్రమల్లో వారు దైవ నిబంధన మేరకు నమ్మకంగా నివసిస్తామని మళ్లీ ప్రమాణం చేశారు. వారు వీణెలు పక్కన పెట్టి, శిధిలమై ఉన్న పరిశుద్ధాలయం నిమిత్తం దుఃఖిస్తుండగా వారి ద్వారా సత్యం ప్రకాశించింది. దేవుని గూర్చిన జ్ఞానం జాతులకు విస్తరించింది. దేవుడు స్థాపించిన బలి అర్పణ వ్యవస్థను అన్యులు వక్రీకరించి తమ పంథాలో అనుసరించారు! యధార్ద హృదయులు అనేకమంది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఉద్దేశాన్ని హెబ్రీయుల నుంచి నేర్చుకుని రక్షకుని గూర్చిన వాగ్దానాన్ని విశ్వాసమూలంగా గ్రహించారు. DATel 12.3

చెరలో ఉన్న అనేకులు హింసననుభవించారు. సబ్బాతును తోసిపుచ్చి అన్యుల మతాచారాల్ని ఆచరించటానికి సమ్మతించని వారెందరో తమ ప్రాణాలు కోల్పోయారు. విగ్రహారాధకులు పేట్రేగిపోయి సత్యాన్ని కాలరాయడానికి పూనుకోగా ప్రభువు తన సేవకుల్ని రాజులు ప్రధానులకు ముఖాముఖి తీసుకువచ్చాడు. వారు, వారి జనులు సత్యాన్ని అందుకోటానికి మార్గం ఇలా తెరుచుకుంది. కొన్నిసార్లు మహారాజులు హెబ్రీ బానిసలు ఆరాధించిన సర్వోన్నత దేవుని ఔన్నత్యాన్ని వెల్లడించారు. DATel 13.1

బబులోను చెరకాలం ముగిసేసరికి ఇశ్రాయేలీయుల విగ్రహారాధన వ్యాధి నయమయ్యింది. ఆ తర్వాతి శతాబ్దాల్లో వారు అన్యజనుల వలన హింసకు గురి అవుతూ వచ్చి చివరికి తాము దేవుని ధర్మశాస్త్రాన్ని ఆచరించటంపైనే తమ క్షేమాభివృద్ధి ఆధారపడి ఉంటుందని గుర్తించారు. కాగా అనేకమంది విషయంలో విధేయతకు ప్రేరణ ప్రేమ కాదు. వారి ఉద్దేశం స్వార్ధపూరితం. దేశంలో గొప్ప పేరుకోసం వారు దేవునికి సేవ చేసినట్లు పైకి కనిపించారు. వారు లోకానికి వెలుగుగాలేరు: కాని విగ్రహారాధన శోధన నుంచి తప్పించుకోటానికి లోకానికి దూరంగా ఉన్నారు. మోషే ద్వారా ఇచ్చిన ఉపదేశంలో లోకంతో వారి సహవాసంపై దేవుడు ఆంక్షలు విధించాడు. కాని ఈ బోధనను వారు వక్రీకరించి దానికి తప్పుడు భాష్యం చెప్పారు. అది వారిని అన్యుల ఆచారాలను అనుసరించకుండా కాపాడేందుకు ఉద్దేశించబడింది. కాని వారు ఇశ్రాయేలుకు ఇతర జాతుల ప్రజలకు మధ్య అడ్డుగోడలు నిర్మించటానికి అది హేతువయ్యింది. యూదులు యెరుషలేమును తమ పరలోకంగా పరిగణించారు. ఇంకా చెప్పాలంటే దేవుడు అన్యజనులపట్ల కృపకనికరాలు ఎక్కడ చూపించేస్తాడోనని వారు భయపడ్డారు. DATel 13.2

బబులోను నుంచి తిరిగివచ్చాక మతపరమైన ఉపదేశానికి ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. దేశమంతా సమాజ మందిరాలు నిర్మితమయ్యాయి. ఈ మందిరాల్లో యాజకులు లేఖకులు ధర్మశాస్తోపదేశం చేశారు. పాఠశాలలు స్థాపించి కళలు, శాస్త్రాలు నీతి సూత్రాలు బోధించారు. కాకపోతే ఈ సంస్థలు అవినీతి నిలయాలుగా మారాయి. చెర సాగిన కాలంలో అనేకులలో అన్యమత భావాలు, ఆచారాలు ప్రబలమయ్యాయి. ఇవి వారి మత జీవితంలోకి ప్రవేశించాయి. అనేక విషయాల్లో ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధకుల ఆచారాలు పూజాపునస్కారాలకు అలవాటుపడ్డారు. DATel 14.1

దేవునికి దూరంగా వెళ్లిపోయిన యూదు ప్రజలు బలిఅర్పణల్ని గూర్చిన బోధనల్ని సేవను చాలా మట్టుకు విస్మరించారు. ఆ సేవను స్థాపించింది క్రీస్తే. ఆ సేవలోని ప్రతీభాగం ఆయనకు చిహ్నమే. అది శక్తిమంతమైన సుందరమైన ఆధ్యాత్మిక సేవ. అయితే యూదులు తమ ఆచారాలు కర్మకాండలు అనుసరించటంలో తమ ఆధ్యాత్మికతను కోల్పోయి వాటినే పట్టుకుని వేళాడారు. వారు బలుల్ని ఆచారాల్ని నమ్ముకున్నారేగాని అవి ఎవర్ని సూచిస్తున్నాయో ఆ ప్రభువుని నమ్ముకోలేదు. తాము పోగొట్టుకున్న దాని స్థానాన్ని భర్తీ చెయ్యటానికి యాజకులు రబ్బీలు తమ సొంత విధుల్ని ప్రవేశపెట్టారు. అది ఎంత కఠినంగా అమలైతే అంత తక్కువగా దైవప్రేమ ప్రదర్శితమయ్యింది. తమ హృదయాలు అహంభావంతో, బూటకంతో నిండి ఉండగా వారు తాము ఆచరిస్తున్న ఆచారాల సంఖ్యనుబట్టి తమ పరిశుద్ధతను కొలుచుకుంటున్నారు. DATel 14.2

సూక్ష్మమైన ఆయాసకరమైన సూచనలు ఎన్నిఉన్నా ధర్మశాస్త్రాన్ని ఆచరించటం అసాధ్యమైన పని. దేవుని సేవించాలన్న ఆశతో రబ్బీలు నిర్దేశించిన సూత్రాల్ని ఆచరించటానికి ప్రయత్నించినవారు. ఎంతో శ్రమపడి కృషిచేశారు. తమ అంతరాత్మ మోపే నిందల్నుంచి వారికి విశ్రాంతి లభించలేదు. ప్రజల్ని ఈ రకంగా నిరుత్సాహపర్చటానికి సాతాను శ్రమించాడు. దేవుని ప్రవర్తనను గూర్చి వారి ఉన్నతాభిప్రాయాన్ని మార్చటానికి, ఇశ్రాయేలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతియ్యటానికి సాతాను శ్రమించాడు. పరలోకంలో దేవునికి ఎదురుతిరిగినపుడు తాను దేవునిపై మోపిన నిందను అనగా దేవుని ఆజ్ఞలు న్యాయవిరుద్ధమైనవి, ఆచరణ సాధ్యమైనవి కావు అన్న నిందను ధ్రువీకరించాలని ఆశించాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ధర్మశాస్త్రాన్ని ఆచరించలేకపోయారని వాదించాడు. DATel 14.3

యూదులు మెస్సీయా రాకను అభిలషిస్తున్నప్పటికీ ఆయన కర్తవ్యాన్ని గురించి వారికి అవగాహనలేదు. వారు కోరుకుంటున్నది పాపం నుంచి విముక్తి కాదు, రోమా పాలన నుంచి విడుదల. తమ హింసకుల అధికారాన్ని అంతం చేసి ఇశ్రాయేలును ప్రపంచరాజ్యం చెయ్యగల విజేతగా వచ్చే మెస్సీయా కోసం వారు ఎదురుచూశారు. ఈ విధంగా యూదులు రక్షకుణ్ని విసర్జించటానికి మార్గం సుగమమయ్యింది. DATel 15.1

క్రీస్తు జననం సమయంలో ఇశ్రాయేలు జాతి పరరాజుల పాలన కింద శ్రమలనుభవిస్తూ అంతః కలహాలతో అతలాకుతలమయ్యింది. ఒక రకమైన ప్రత్యేక ప్రభుత్వాన్ని నడుపుకోటానికి యూదుల్ని అనుమతించటం జరిగింది. కాని వారు రోమా ప్రభుత్వం కింద ఉన్నారన్న విషయం లేదా అధికారానికి లొంగి ఉండాలన్న దానిపై రాజీలేదన్న విషయం బహిరంగ రహస్యం. ప్రధాన యాజకుణ్ని నియమించే హక్కు తొలగించే హక్కు తమకున్నదని రోమా ప్రభువులు చెప్పేవారు. ఆ హోదాను మోసం, లంచం, హత్యవల్ల సైతం సంపాదించటం తరచూ జరిగేది. ఇలా ప్రధాన యాజకత్వం అవినీతిమయమయ్యింది. అయినా యాజకులు చాలా అధికారం చెలాయించేవారు. దీన్ని వారు స్వార్థ ప్రయోజనాలకు ధనార్జనకు వినియోగించుకునేవారు. ప్రజలు వారి అహంకారానికి బలి అయ్యేవారు. పులిమీద పుట్రలా రోమా ప్రభుత్వం విధించే పన్నులు భరించలేని భారమయ్యేవి. ఈ దుర్భర పరిస్థితులు తీవ్ర అసంతృప్తికి దారి తీశాయి. తిరుగుబాట్లు అల్లర్లు తరచూ చోటుచేసుకునేవి. పేరాశ, దౌర్జన్యం, అవిశ్వాసం, ఆధ్యాత్మిక నిరాసక్తత జాతి గుండెల్నే నమలి మింగుతున్నాయి. DATel 15.2

రోమీయుల పట్ల ద్వేషం, జాతీయ, ఆధ్యాత్మిక, అహంభావం, యూదుల్ని తమ ఆరాధన ఆచారాల్ని నిష్టగా అవలంబించేటట్లు చేసింది. మతాచారాల్ని నిష్టగా అనుసరించటం ద్వారా పరిశుద్ధులన్న పేరు సంపాదించాలని యాజకులు శాయశక్తుల కృషి చేశారు. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ హింసకు గురిఅవుతున్న ప్రజలు, అధికార దాహంతో రెచ్చిపోతున్న పరిపాలకులు తమ శత్రువుల్ని జయించి ఇశ్రాయేలు రాజ్యాన్ని పునరుద్ధరించగల వ్యక్తి కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు. వీరు ప్రవచనాల్ని అధ్యయనం చేశారు గాని వీరిలో ఆధ్యాత్మిక దృష్టి లోపించింది. ఈ రీతిగా వీరు క్రీస్తు మొదటి రాకను సూచించిన లేఖనాల్ని విస్మరించి ఆయన రెండోరాక మహిమను గూర్చిన లేఖనాలకు తప్పుడు భాష్యం చెప్పారు. గర్వం వారికి దృష్టి మాంద్యం కలిగించింది. తమ స్వార్ధాసక్తులు దృష్టిలో ఉంచుకుని వారు ప్రవచనానికి అర్ధం చెప్పారు. DATel 15.3