యుగయుగాల ఆకాంక్ష

83/88

82—“ఎందుకు ఏడ్చుచున్నావు?”

క్రీస్తు సిలువ వద్ద ఉన్న స్త్రీలు సబ్బాతు గడవడానికి వేచి ఉన్నారు. ఆదివారం పెందలకడనే వారు సమాధివద్దకు వెళ్తున్నారు. ఆయన దేహానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలు తీసుకువెళ్తున్నారు. ఆయన సమాధి నుంచి లేస్తాడన్న అభిప్రాయం వారికి లేదు. వారు నమ్ముకున్న ప్రభువు మరణించాడు. వారి హృదయాలు చీకటితో నిండాయి. వారు నడిచి వెళ్తున్నప్పుడు క్రీస్తు చేసిన కృపా కార్యాల్ని గురించి ఆయన పలికిన ఓదార్పు మాటల గురించి చెప్పకున్నారు. కాని “మిమ్మును మరల చూచెదను” (యోహా. 16:22) అని ఆయనన్న మాటల్ని గుర్తుంచుకోలేదు. DATel 890.1

అప్పుడు సయితం ఏం జరుగుతున్నదో తెలియని వారు “సమాధి ద్వారము నుండి మనకొరకు ఆ రాయి యెవరు పొర్లించునని చెప్పుకొనుచు” తోటను సమీపించారు. తాము ఆ రాయిని పొల్లించలేమని ఎరిగినా వెళ్తునే ఉన్నారు. హఠాత్తుగా ఆకాశం వెలుగుతో నిండింది. అది ఉదయిస్తున్న సూర్యుడి కాంతికాదు. భూమి కంపించింది. ఆ బ్రహ్మాండమైన రాయి పొర్లించి ఉంది. సమాధి ఖాళీగా ఉంది. DATel 890.2

సమాధివద్దకు వచ్చిన స్త్రీలు ఒకే చోటునుంచి రాలేదు. మగ్దలేనే మరియ అందరికన్నా ముందు వచ్చింది. రాయి పొర్లించి ఉండడం చూసి శిష్యులితో చెప్పడానికి హడావుడిగా వెళ్లింది. అంతలో తక్కిన స్త్రీలు వచ్చారు. సమాధిపై వెలుగు(ప్రకాశిస్తోంది. కాని యేసు సమాధిలో లేడు. ఇంకా అక్కడే మసలుతుండగా ఆకస్మాత్తుగా తాము ఆస్థలంలో ఒంటరిగా లేమన్న గుర్తింపు కలిగింది. తెల్లని వస్త్రాలు ధరించిన ఒక యువకుడు సమాధి పక్క కూర్చుని ఉన్నాడు. అతడు ఆ రాయిని దొర్లించిన దేవదూత. యేసు మిత్రులైన వీరికి భయం కలిగించకూడదని అతడు మానవ రూపం ధరించాడు. అయినా ఆయన చుట్టూ పరలోక మహిమ ప్రకాశిస్తోంది. ఆ స్త్రీలు భయపడున్నారు. పారిపోడానికి వెనక్కు తిరిగారు. దేవదూత అన్న ఈ మాటలతో వారు నిలిచిపోయారు, “మీరు భయపడకుడి, సిలువవేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు, రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్లి ఆయన మృతులలో నుంచి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి” అన్నాడు. వారు మళ్లీ సమాధిలోకి చూశారు. మళ్లీ వారు ఆ అద్భుతవార్త విన్నారు. మానవ రూపంలో ఉన్న మరో దూత అక్కడున్నాడు. అతడు ఇలా అన్నాడు, “సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి యున్నాడు. ఆయన ఇంక గలిలయలో ఉండినప్పుడు -మనుష్యకుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, నిలువవేయబడి, మూడవ దినమున లేవవలసియున్నాదని ఆయన నాతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడి.” DATel 890.3

ఆయన లేచాడు! ఆయన లేచాడు! ఆ స్త్రీలు ఈ మాటలు పదేపదే పలుకుతున్నారు. పూయడానికి ఇప్పుడు సుంగంధద్రవ్యాలు అవసరంలేదు. రక్షకుడు జీవించి ఉన్నాడు. మరణించిలేడు. తన మరణాన్ని గూర్చి మాట్లాడినప్పుడు తిరిగి లేస్తానని ఆయన చెప్పినట్లు వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఇది లోకానికి ఎంత మంచి రోజు! “భయముతోను మహానందముతోను సమాధినుండి త్వరగా వెళ్లి ‘ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప” ఆస్త్రీలు సమాధి వద్దనుంచి త్వరత్వరగా వెళ్లారు. DATel 891.1

మరియకు ఆ వార్త తెలియలేదు. ఆమె పేతురు యోహానుల వద్దకు ఈ వర్తమానంతో వెళ్లింది, “ప్రభువును సమాధిలోనుండి యెత్తికొనిపోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగము.” శిష్యులు త్వరత్వరగా సమాధి వద్దకు వెళ్లారు. నారబట్టలు తలరుమాలు పడి ఉండడం చూశారు గాని ప్రభువు అక్కడలేడు. ఆయన లేచాడనడానికి ఇది సయితం సాక్ష్యమే. సమాధి బట్టలు అటూఇటూ పడేసిలేవు. అవి జాగ్రత్తగా మడత పెట్టి ప్రతీదీ ఒక స్థలంలో పెట్టి ఉన్నాయి. యోహాను “చూచి నమ్మెను.” క్రీస్తు మృతుల్లోనుంచి లేవవలసి ఉందన్న లేఖనం అతడికింకా అర్థం కాలేదు. కాని రక్షకుడు తన పునరుత్థానాన్ని గురించి చెప్పడం ఇప్పుడు గుర్తుకొచ్చింది. DATel 891.2

సమాధి బట్టల్ని అంతచక్కగా మడిచి పెట్టింది క్రీస్తే. ఆ మహాదూత సమాధి వద్దకు దిగివచ్చినప్పుడు అతనితో ఇంకోదూత వచ్చాడు. ఆ దూత అతనితో కొందరు దూతలు ప్రభువు దేహాన్ని కావలి కాస్తోన్నారు. పరలోకం నుంచి వచ్చిన దూత రాయిని పొర్లించగా తక్కిన దూత సమాధిలోకి వెళ్లి యేసు దేహానికి చుట్టిన బట్టలు విప్పాడు. కాని వాటిలో ప్రతీ ఒక్కదాన్ని మడత పెట్టి దాని దాని స్థలంలో పెట్టింది రక్షకుడే. నక్షత్రాన్ని పరమాణువుని ఒకే రీతిగా నడిపించే ఆ ప్రభువు దృష్టిలో ప్రాముక్యం లేనిదంటూ ఏదీలేదు. ఆయన పని అంతటిలోను క్రమం పరిపూర్ణత కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. DATel 892.1

మరియ యోహాను పేతురులతో సమాధి వద్దకు వెళ్లింది. వారు తిరిగి యెరూషలేముకు వెళ్లినప్పుడు ఆమె అక్కడే ఉండిపోయింది. ఆమె ఆ ఖాళీ సమాధి వంక చూస్తున్నప్పుడు దుఃఖం పొంగుకుంటూ వస్తోంది. సమాధిలోకి చూసినప్పుడు ఆ ఇద్దరు దూతలూ కనిపించారు. క్రీస్తును పెట్టిన స్థలంలో ఒక దూత తలవద్ద ఒక దూత కాళ్లవద్ద ఉండడం చూసింది. “అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు?” అని వారు అడిగారు. “నా ప్రభువును ఎవరో యెత్తికొనిపోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు” అని ఆమె సమాధానమిచ్చింది. DATel 892.2

అప్పుడు ఆమె దేవదూతల వద్దనుంచి కూడా తప్పుకుని తన ప్రభువు దేహం ఏమయ్యిందో తెలుపగల వారికోసం చూస్తుండగా మరోస్వరం ఆమెను సంబోధించింది. “అమ్మా, యెందుకు ఏడ్చుచున్నావు? ఎవనిని వెదుకుచున్నావు?” అంది ఆస్వరం. నీళ్లు నిండడం వల్ల మసకగా ఉన్న కళ్లతో మరియ ఒక పురుష రూపాన్ని చూసింది. అతడు తోటమాలి అని భావించి ఆయనతో ఇలా అన్నది, “అయ్యా, నీవు ఆయనను మోసికొనిపోయిన యెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదును” ఈ భాగ్యవంతుడి సమాధి యేసుకి అతి గౌరవప్రదమైన సమాధి స్థలమని భావిస్తే ఆమె సొంతంగా ఆయనకు సమాధి స్థలం ఏర్పాటు చెయ్యడానికి సంసిద్ధం అన్నట్లు స్పందించింది. క్రీస్తు స్వరం వల్ల ఖాళీ అయిన సమాధి ఉంది - లాజరు ఉన్న సమాధి. అక్కడ తన ప్రభువుకి సమాధి స్థలం దొరకదా? ప్రశస్తమైన, సిలువవేయబడిన ఆయన దేహాన్ని భద్రంగా చూసుకోడంలో తన దుఃఖానికి కొంత ఊరట కలుగుతుందని భావించింది. DATel 892.3

అయితే సుపరిచితమైన తన సొంత స్వరంతో “మరియా” అని పిలిచాడు. ఆయన వేరెవరూ కాదని తన ప్రభువేనని ఆమె గుర్తించి పక్కకు తిరిగేసరికి క్రీస్తు సజీవంగా నిలిచి ఉండడం చూసింది. పట్టరాని సంతోషంలో ఆయన్ని సిలువవేశారన్న సంగతి మర్చిపోయింది. ఆయన పాదాలు కౌగలించుకోడానికన్నట్లు ముందుకెళ్లి “రబ్బానీ” అని పిలిచింది. అయితే క్రీస్తు తన చెయ్యి ఎత్తి నన్ను ఆపవద్దు అని చెప్పి, “నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్లి నా తండ్రియు నా దేవుడును నా దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుము” అన్నాడు. ఈ ఆనందకర వార్తతో మరియ శిష్యుల వద్దకు వెళ్లింది. DATel 893.1

ప్రజల నిమిత్తం తాను చేసిన త్యాగాన్ని తండ్రి అంగీకరించాడన్న నిశ్చయత పొందేవరకు యేసు ప్రజల నివాళులు అందుకోడానికి సమ్మతించలేదు. ఆయన పరలోకానికి వెళ్లి, మానవుల పాపాలకి ప్రాయశ్చిత్తంగా తాను చేసిన బలిదానం సమృద్ధమైందని, తన రక్తంద్వారా అందరూ నిత్యజీవం పొందగలరని ఆయన స్వయంగా దేవుని నోటి నుంచే విన్నాడు. పశ్చాత్తప్తులైన, విధేయులైన మనుషుల్ని తాను అంగీకరిస్తానని, కుమారుని ప్రేమించినట్లే వారిని ప్రేమిస్తానని క్రీస్తుతో తాను చేసుకున్న ఒప్పందాన్ని తండ్రి ధ్రువపర్చాడు. క్రీస్తు తన పనిని పూర్తి చేసి “బంగారుకంటె మనుష్యులును ఓఫీరు దేశపు సువర్ణముకంటె నరులును అరుదుగా ఉండజేసెదను” అన్న వాగ్దానాన్ని (యెష 13:12) క్రీస్తు నెరవేర్చాల్సి ఉన్నాడు. పరలోకమందును భూలోకమందును సమస్త అధికారం జీవనాధుడు క్రీస్తుకి ఇవ్వబడింది ఆయన తిరిగి లోకంలో ఉన్న తన శిష్యుల వద్దకు వచ్చాడు. తన శక్తిని మహిమను తన శిష్యులికి ఉపదేశించడానికి వచ్చాడు. DATel 893.2

తన సంఘానికి వరాలందకుంటూ క్రీస్తు తండ్రి సముఖంలో ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఖాళీ సమాధిని గూర్చి తలపోసుకుని దుఃఖిస్తూ విలపిస్తూ ఉన్నారు. పరలోకానికి ఆనందోత్సాహాల సమయమైన ఆదినం శిష్యులకి సందిగ్ధత, గందరగోళంతో నిండిన దినంగా పరిణమించింది. ఆ స్త్రీలు ఇచ్చిన సాక్ష్యాన్ని నమ్మకపోవడం వారి విశ్వాసం ఎంత చల్లబడిపోయిందో చెప్పకనే చెబుతుంది. యేసు పునరుత్థాన వార్త తాము కనిపెట్టిన దానికన్న వేరుగా ఉండడంతో వారు దాన్ని నమ్మలేకపోయారు. అది నమ్మలేనంత మంచివార్త అని వారు అనుకున్నారు. సదూకయ్యుల సిద్ధాంతాల్ని, శాస్త్రీయ సూత్రాల్ని వారు ఎంతగా విన్నారంటే పునరుత్థానాన్ని గూర్చిన మంచి విషయాలు వారి మనసులో అస్పష్టంగా ఉన్నాయి. మృతుల్లోనుంచి లేవడం అంటే ఏంటో వారికి తెలియదు. ఆ గొప్ప అంశం వారి అవగాహానకు మించి ఉంది. DATel 893.3

“ఆయన శిష్యులతోను పేతురుతోను, చెప్పుడి” అని దూతలన్నారు. క్రీస్తు మరణించినప్పటి నుంచి పేతురు దుఃఖంతో కుంగిపోయాడు. ప్రభువుని ఎరుగనని తాము బొంకడం రక్షకుడు తనవంక ప్రేమతోను హృదయవేదనతోను చూడడం పేతురు మర్చిపోలేకుండా ఉన్నాడు. ఆ దృశ్యం తన కళ్లముందే ఉంటున్నది. శిష్యులందరిలోను పేతురు ఎక్కువ బాధపడ్డాడు. తన పశ్చాత్తాపాన్ని ప్రభువు అంగీకరించాడని తన పాపాన్ని క్షమించాడని హామీఇస్తూ ప్రత్యేకించి అతణ్ని పేర్కొడం జరిగింది. DATel 894.1

“ఆయన మికంటె ముందుగా గలిలయలోనికి వెళ్లుచున్నాడనియు..... అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పుడి.” శిష్యులందరూ యేసుని విడిచిపెట్టారు. ఆయన్ని కలవడానికి వచ్చిన పిలుపు అందరికీ వర్తిస్తోంది. ఆయన వారిని విడిచిపెట్టలేదు. తాను రక్షకుణ్ని చూశానని మగ్దలేనే మరియ వారికి చెప్పినప్పుడు గలిలయ సమావేశానికి పిలుపును ఆమె పునరుచ్చరించింది. వారికి మూడోసారి వర్తమానం పంపడం జరిగింది. తండ్రి వద్దకు వెళ్లిన తర్వాత యేసు ఇతర స్త్రీలకు కనిపించాడు. యేసు “మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి, ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా యేసు -భయపడకుడి, మీరు వెళ్లి నా సహోదరులు గలిలయకు వెళ్లవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను.” DATel 894.2

తన పునరుత్థానం అనంతరం భూమిపై క్రీస్తు చేయాల్సిన మొట్టమొదటి పని తమ పట్ల తన ప్రేమానురాగాలు దయాకనికరాలు ఏ మాత్రం తగ్గలేదని తన శిష్యుల్లో నమ్మకం పుటించడం. తాను తమ ప్రియ రక్షకుణ్నని, సమాధి సంకెళ్లని విరగగొట్టానని, మరణానికి ఎంతమాత్రం బందీనికానని నిరూపించడం. తమ ప్రియతమ బోధకుడుగా తమతో ఉన్నప్పుడు కనపర్చిన ప్రేమా హృదయమే ఇప్పుడు కూడా తమపట్ల తనకు ఉన్నదని వెల్లడి చెయ్యడానికి ఆయన వారికి పదేపదే ప్రత్యక్షమయ్యాడు. వారితో తన అనుబంధాన్ని మరింత సన్నిహితం చేశాడు. నన్ను చూడడానికి గలిలయకు రావలసిందని నా సహోదరులకు చెప్పండి అన్నాడు. DATel 894.3

ఈ సమావేశం గురించి అంత కచ్చితంగా విన్నప్పుడు క్రీస్తు తన పునరుత్థానం గురించి ముందే చెప్పిన సంగతుల్ని శిష్యులు గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు సయితం వారు సంతోషించలేదు. వారి సందేహం ఆందోళన తొలగిపోలేదు. తాము ప్రభువుని చూశామని స్త్రీలు చెప్పినప్పటికీ శిష్యులు దాన్ని నమ్మలేదు. అది వారి పిచ్చి భ్రమగా కొట్టిపారేశారు. DATel 895.1

సమస్య మిద సమస్య వచ్చిపడున్నట్లు కనిపిస్తోంది. వారంలో ఆరో రోజు తమ ప్రభువు మరణించడం వారు చూశారు. మరుసటి వారం మొదటి రోజు తమ ప్రభువు దేహం తమకు దక్కలేదు. ప్రజల్ని మోసం చెయ్యడానికి తామే దాన్ని దొంగిలించినట్లు నిందకు గురి అయ్యారు. తమపైకి వస్తున్న నిందల్ని ప్రతి నిత్యం సరిచెయ్యడానికి తలప్రాణం తోకకు వస్తోంది. యాజకుల శత్రుత్వానికి ప్రజల ఆగ్రహానికి వారు భయపడ్తోన్నారు. ప్రతీ ఆపదలోను తమకు సహాయన్నందించిన యేసు సన్నిధిని వారు ఎంతగానో ఆశిస్తోన్నారు. DATel 895.2

“ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి యుంటిమి” అన్నమాటలు పదేపదే ఉచ్చరించుకున్నారు. ఒంటరివారై ఆత్మలో క్షోభపడూ ఈ మాటల్ని గుర్తు చేసుకున్నారు, “వారు పచ్చి మ్రానుకే యీలాగు చేసిన యెడల ఎండిన దానికేమి చేయుదురో.” లూకా 24:21, 23:31. మేడ గదిలో సమావేశమై తలుపులు మూసి గడియలు వేసి, తమ ప్రియతమ ప్రభువుకి పట్టినగతే తమకూ ఏ నిముషంలోనైనా పట్టవచ్చునని బితుకు బితుకుగా ఉన్నారు. DATel 895.3

ఈ సమయమంతా వారు రక్షకుడు తిరిగి లేచాడన్న వార్త తెలుసుకుని ఉత్సాహనందాలతో గడపవలసిన సమయం. తోటలో యేసుని పక్కన పెట్టుకునే మరియ ఏడుస్తోంది. నీళ్లతో నిండి మసక బారినకళ్లు ఆయన్ని గుర్తించలేకపోయాయి. శిష్యులు చేసిన పనినే ఎంతమంది చేస్తున్నారు! “ప్రభువును సమాధిలో నుండి యెత్తికొనిపోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగము” అన్న మరియ నిట్టూర్పును ఎంతమంది ప్రతిధ్వనిస్తోన్నారు! “అమ్మా యెందుకు ఏడ్చుచున్నావు? ఎవనిని వెదకుచున్నావు?” అన్న రక్షకుని మాటలు ఎందరితో అనవచ్చు? ఆయన వారి పక్కనే ఉన్నాడు. కాని కన్నీటితో గుడ్డివైన వారి కళ్లు ఆయన్ని గుర్తించలేవు. ఆయన వారితో మాట్లాడాడు. కాని వారు ఆయన్ని అవగాహన చేసుకోలేదు. DATel 895.4

వంచిన తల పైకెత్తితే ఎంత బాగుండును! ఆయన్ని చూడడానికి కన్నులు ఎత్తితే ఎంత బాగుండును! చెవులు ఆయన స్వరాన్ని వింటే ఎంత బాగుండును! “త్వరగా వెళ్లి, ఆయన మృతులలో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియ జేయుడి.” పెద్ద రాయితో మూసి రోమా ప్రభుత్వం ముద్రవేసిన యోసేపు సమాధి వంక చూడవద్దని చెప్పండి. క్రీస్తు అందులో లేడు. ఖాళీ సమాధివంక చూడవద్దు. క్రీస్తు జీవిస్తున్నాడు. ఆయన జీవిస్తున్నాడు మనం జీవిస్తున్నాం. కృతజ్ఞ హృదయాల నుంచి, పరిశుద్ధ అగ్నిముట్టుకున్న పెదవులనుంచి, క్రీస్తు లేచాడు అన్న ఆనంద గీతం వినిపించనియ్యండి! ఆయన మన పక్షంగా విజ్ఞాపన చెయ్యడానికి జీవిస్తున్నాడు. ఈ నిరీక్షణను గట్టిగా పట్టుకోండి. అది ఆత్మను నమ్మదగిన లంగరుగా స్థిరంగా ఉంచుతుంది. విశ్వసించండి. అప్పుడు మీరు దేవుని మహిమను చూస్తారు. DATel 896.1