యుగయుగాల ఆకాంక్ష

82/88

81—“ఆయన లేచియున్నాడు”

ఆదివారం రాత్రి నెమ్మదిగా గడిచింది. తెల్లవారకముందటి మిక్కిలి చీకటి గడియ వచ్చింది. ఇరుకైన తన సమాధిలో క్రీస్తు బందీగానే ఉన్నాడు. గుమ్మాన్ని మూసిన బ్రహ్మాండమైన రాతిబండ అలాగే ఉంది. రోమా ప్రభుత్వ ముద్ర భద్రంగా ఉంది. రోమా సైనికులు కాపలా కాస్తూనే ఉన్నారు. అదృశ్యులైన పరిశీలకులూ అక్కడున్నారు. దుష్టదూతల సైన్యాలు ఆ స్థలం చుట్టూ సమావేశమయ్యాయి. సాధ్యమైతే సాతాను అతడి దుష్టదూత సైన్యం సహాయంతో దేవుని కుమారుణ్ని సమాధిలోనే నిరంతరం బంధించి ఉంచేవాడే. అయితే ఆ సమాధిని పరలోక సైన్యం చుట్టుముట్టింది. జీవనాధుడు యేసుకి స్వాగతం పలకడానికి వేచి ఉంది. DATel 882.1

“ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను.” దేవుని సర్వాంగ కవచం ధరించి ఈ దూత పరలోకం నుంచి బయలుదేరాడు. దేవుని మహిమ కిరణాలు అతడికి ముందుండి ప్రకాశించాయి. అతడి మార్గాన్ని వెలుగుతో నింపాయి. “ఆ దూత స్వరూపము మెరుపువలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణకి చచ్చినవారివలె నుండిరి” DATel 882.2

యాజకులారా, అధికారులారా, ఇప్పుడు నా కావలి వారి శక్తి ఏపాటిది? మానవ శక్తికి ఎన్నడూ వెన్నుచూపని వీర సైనికులు ఖడ్గం వేటు ఈటే పోటు లేకుండానే ఇప్పుడు బందీల్లా ఉన్నారు. వారు చూస్తున్న ముఖం మావన శూరుడి ముఖం కాదు. అది ప్రభువు సైన్యంలోని మిక్కిలి బలాఢ్యుడి ముఖం. సాతాను ఏ స్థానం నుంచి పడిపోయాడో దాన్ని అలంకరించిన దూత ఇతడు. బేల్లెహేము కొండల పైనుంచి క్రీస్తు జననాన్ని ప్రకటించిన దూత ఇతడే. అతడి రాకకు భూమి కంపించింది. చీకటి శక్తులు పారిపోయాయి. అతడు ఆ బ్రహ్మాండమైన రాయిని దొర్లించగా పరలోకం భూమికి దిగివచ్చినట్లు కనిపించింది. దూత ఆ రాయి చిన్న గులకరాయిని తీసినట్లు తీసివేయడం సైనికులు చూశారు. అతడు దైవకుమారుడా బయటి కిరా, నీ తండ్రి నిన్ను పిలుస్తున్నాడు అనడం వారు విన్నారు. యేసు సమాధిలో నుంచి బయటికి రావడం చూశారు. బద్దలైన సమాధి నుంచి ఆయన “పునరుత్థానమును జీవమును నేనే” అనడం విన్నారు. మహిమతోను ఔన్నత్యంతోను ఆయన సమాధి నుంచి బయటికి వచ్చినప్పుడు దూతల సమూహం ఆ విమోచకుని ముందు వంగి నమస్కరించి ఆయన్ని స్తుతిగానంతో స్వాగతించింది. DATel 882.3

క్రీస్తు మరణించిన గడియలో భూమి కంపించింది. ఆయన తాను పెట్టిన ప్రాణాన్ని మళ్లీ తీసుకున్నప్పుడు భూమి మళ్లీ కంపించింది. మరణాన్ని సమాధిని జయించిన ఆయన భూకంపం మెరుపులు ఉరుముల నడుమ సమాధినుంచి విజయుడుగా నడిచి వచ్చాడు. ఆయన మళ్లీ భూమికి వచ్చినప్పుడు “భూమిని మాత్రమే కాక ఆకాశమునుకూడ కంపింప” చేస్తాడు. “భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది. పాకవలె ఇటుఅటు ఊగుచున్నది. ” “కాగితపు చుట్టవలె ఆకాశవైశాల్యములు చుట్టబడును.” “పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయయమైపోవును. భూమియు దానిమీదనున్న కృత్యమును కాలిపోవును.” “అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును.” హెబ్రీ 12:26; యెష 24:20; 34:4; 2 పేతు 3:10; యోవే 3:16. DATel 883.1

యేసు మరణమప్పుడు మధ్యాహ్నమే భూమి చీకటి కమ్మడం సైనికులంతా చూశారు. అయితే ఆయన పునరుత్థానమప్పుడు దేవదూతల వెలుగుతో నిండిన రాత్రిని వారు చూశారు. పరలోక వాసులు నీవు సాతానునీ చీకటి శక్తుల్ని జయించావు; నీవు మరణాన్ని విజయంలో మింగివేశావు అంటూ విజయోత్సహంతో పాడిన పాటలు విన్నారు. DATel 883.2

క్రీస్తు సమాధిలో నుంచి మహిమతో బయటికి వచ్చాడు. రోమా సైనికుడులు దాన్ని చూశారు. ఇటీవలే తాము ఎగతాళి చేసి అపహసించిన ఆయన ముఖంపై వారి దృష్టి కేంద్రీకృతమయ్యింది. తీర్పు గదిలో తాము చూసిన ఖైదీని, ఎవరికి తాము ముళ్ల కిరీటం అల్లి ధరింపజేశారో ఆయన్ని, మహిమతో నిండిన ఆయనలో ఆ సైనికులు చూశారు. కొరడా దెబ్బలతో రక్తం కారుకుంటూ పిలాతు ముందు హేరోదు ముందు ఎలాంటి ప్రతిఘటనా లేకుండా నిలబడి ఉన్న వ్యక్తి ఈయనే. ఈయన్నే సిలువకు మేకులతో కొట్టారు. యాజకులు అధికారులు ఆత్మతృప్తితో నిండి తలలు ఊపుతూ “వీడు ఇతరులను రక్షించెను; తన్నుతాను రక్షించకొనలేడు” (మత్త 27:42) అని ఎగతాళి చేసింది ఈయన్నే. యేసేపు కొత్తగా తొలపించుకున్న సమాధిలో పెట్టింది ఈయన్నే. పరలోకం నుంచి వచ్చిన ఆ దేశం బందీని విడిపించింది. ఆయన సమాధిమిద పేర్చిన పర్వతాల మీద పర్వతాలు ఆయన్ని బయటికి రానివ్వకుండా ఆపలేకపోయాయి. DATel 884.1

దేవదూతల్ని మహిమతో నిండిన రక్షకుణ్ని చూసినప్పుడు రోమా సైనికులు స్పృహ తప్పి చచ్చినవారిలా తయారయ్యారు. ఆ పరలోక వాసులు తమ దృష్టికి మరుగయినప్పుడు వారు పైకిలేచి పరుగెత్తుకుంటూ తోటగుమ్మం వద్దకు వెళ్లారు. తాగిన వారిలా తూలుతూ పట్టణంలో కనిపించిన వారికి ఆ ఆద్భుతమైన వార్తను చెప్పారు. వారు పిలాతు వద్దకు వెళ్తున్నారు. అయితే వారి నివేదిక యూదు అధికారులికి చేరగా, ప్రధాన యాజకులు అధికారులు ఆ సైనికుల్ని మొట్టమొదట తమ వద్దకు తీసుకు రావలసిందిగా ఆదేశాలిచ్చారు. ఆ సైనికుల వాలకం చాల వింతగా ఉంది. వారు భయంతో వణుకుతున్నారు. ముఖాలు వాడి పోయి ఉన్నాయి. క్రీస్తు పునరుత్థానుడయ్యాడని వారికి చెప్పారు. తాము చూసింది చూపినట్టు ఆ సైనికులు వారికి చెప్పారు. సత్యం తప్ప మరేదీ చెప్పడానికి ఆలోచించుకోడానికి వారికి సమయం లేదు. సిలువ వెయ్యబడింది దేవుని కుమారుడే; ఆయన్నే పరలోక ప్రభువుగాను, మహిమరాజుగాను దూత ప్రకటించడం మేము విన్నాము అని వారికి చెప్పారు. DATel 884.2

యాజకుల ముఖాలు చచ్చివారి దుఖాల్లా మాడిపోయాయి. కయప మాట్లాడడానికి ప్రయత్నించాడు. పెదాలైతే కదలుతున్నాయి గాని మాటలు మాత్రం రావడం లేదు. సైనికులు సమావేశమందిరం నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమౌతున్నప్పుడు కయప చివరికి మాట్లాడగలిగాడు. ఆగండి అని వారిని వారించి మీరు చూసినవి ఎవరికీ చెప్పకండి అన్నాడు. DATel 884.3

అప్పుడతడు వారికి ఒక అబద్దపు నివేదిక సిద్ధంచేసి ఇచ్చాడు. “మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తికొనిపోయిరని మీరు చెప్పుడి.” అని యాజకులు చెప్పారు. యాజకులు ఇక్కడ తమ్ముని తాము వంచించుకుంటోన్నారు. తాము నిద్రిస్తుండగా శిష్యులు ఆయన దేహన్ని ఎత్తుకుపోయారని సైనికులు ఎలా చెప్పగలరు? వారు నిద్రపోతే అది వారికెలా తెలుస్తుంది? క్రీస్తు దేహాన్ని శిష్యులు అపహరించి ఉంటే వారిని శిక్షించడానికి యాజకులు ముందంజ వేసేవారు కదా? లేదా కావలి వారు సమాధి వద్ద నిద్రపోయి ఉంటే వారిని నిందిస్తూ వారు పిలాతుకు ఫిర్యాదు చెయ్యడానికి ముందుండే వారు కదా? DATel 885.1

విధి నిర్వహణలో నిద్రపోతున్నామన్న ఆరోపణను తమ మీదికి తెచ్చుకోడమన్న ఆలోచన ఆ సైనికులికి కంపరం పుట్టించింది. ఇది మరణార్హమైన నేరం. వారు తప్పుడు సాక్ష్యం పలికి, ప్రజల్ని మోసం చేసి, తమ ప్రాణాలికి ముప్పు తెచ్చుకుంటారా? వారు నిద్రపోకుండా కావలి కాయలేదా? డబ్బుకోసం వారు అబద్దసాక్ష్యం చెబితే వారు తీర్పును ఎలా ఎదుర్కోగలుగుతారు? DATel 885.2

తాము భయపడుతున్న సాక్ష్యాన్ని వారు పలకకుండా ఉంటే వారికి హాని కలుగకుండా తాము చూస్తామని అలాంటి వార్త ప్రచారం కావడం తమకు మల్లే పిలాతుకి కూడా ఇష్టం లేదని యాజకులు సైనికులతో చెప్పారు. రోమా సైనికులు డబ్బుకోసం యూదులికి తమ నిజాయితీని అమ్ముకున్నారు. వారు గొప్ప సత్యవర్తమాన భారంతో యాజకుల ముందుకి వెళ్లారు. తిరిగి డబ్బు సంచులు మోసుకుంటూ ఇళ్లకు వెళ్లారు. యాజకులు తయారు చేసిన అబద్ధపు నివేదిక చెప్పుకుంటూ తిరిగారు. DATel 885.3

ఇంతలో క్రీస్తు పునరుత్థాన వార్త పిలాతుకు చేరింది. పిలాతు క్రీస్తుని సిలువ వేయడానికి అప్పగించినప్పటికీ అతడికి దానిపై ఏమంత ఆసక్తి లేదు. అతడు రక్షకుణ్ని అయిష్టంగా నేరస్తుడిగా తీర్మానించి శిక్ష విధించినప్పటికీ ఆయన విషయంలో ఇప్పటి వరకు నిజమైన మనస్సాక్షి గద్దింపు అతడికి కలుగలేదు. భయంతో అతడు ఇంట్లోనే ఉండిపోయి ఎవర్నీ కలవడానికి ఇష్టపడలేదు. కాని యాజకులు ఆయన్ని కలుసుకుని తాము కల్పించిన కధను అతడికి చెప్పి కావలి కాసిన భటులు విధి నిర్వహణలో చూపిన నిర్లక్ష్యాన్ని ఉపేక్షించాల్సిందని కోరారు. అందుకు సమ్మతించక ముందు అతడు స్వయంగా కావలి వారని ప్రశ్నించాడు. వారు తమ క్షేమానికి భయపడి ఏమి బయట పెట్టలేదు. పిలాతు వారినడిగి జరిగినదంతా తెలుసుకున్నాడు. ఆ విషయాన్ని అతడు ఇక ఎక్కువ పట్టించుకోలేదు కాని అప్పటి నుంచి అతడికి మనశ్శాంతి కరవయ్యింది. DATel 885.4

క్రీస్తుని సమాధిలో పెట్టినప్పుడు సాతాను విజయం సాధించాడు. యేసు తిరిగి జీవాన్ని చేపట్టలేడని నిరీక్షించడానికి ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రభువు దేహన్ని స్వాదీనపర్చుకుని, తన కావలి వారిని సమాధి చుట్టూ మోహరించి ఆయన్ని సమాధిలో తన ఖైదీగా ఉంచాలని పకడ్బందీ ఏర్పాట్లు చేశాడు. పరలోక దూత రాకను చూసి తన దూతలు కాళ్లకు బుద్ది చెప్పినప్పుడు వారిమీద మండిపడ్డాడు. క్రీస్తు విజయుడై సమాధి నుంచి బయటికి రావడం చూసినప్పుడు తన రాజ్యం అంతమొందుతుందని చివరికి తన అంతం ఖాయమని సాతాను గుర్తించాడు. DATel 886.1

క్రీస్తుని చంపడంలో యాజకులు సాతాను చేతుల్లో సాధనాలయ్యారు. వారు ఉచ్చులో ఇరుక్కుని అందులోనుంచి బయటపడే మార్గం లేక యేసుతో తమ పోరాటన్ని కొనసాగించారు. ఆయన పునరుత్థానాన్ని గురించి విన్నప్పుడు వారు ప్రజల ఆగ్రహానికి భయపడ్డారు. తమ ప్రాణాలికి ముప్పు ఏర్పడుందని భయపడ్డారు. ఆయన లేవలేదని నిరూపించి తద్వారా ఆయన మోసగాడని ప్రచారం చేస్తేనే వారికి గతులుంటాయి. వారు సైనికుల్ని డబ్బుతో కొన్నారు. పిలాతుని నోరు ముయ్యించారు. ఇక తమ అబద్ద సమాచారాన్ని విచ్చలవిడిగా ప్రచారం చేశారు. కాని వారు నోరు ముయ్యించలేని సాక్ష్యులు కొందరున్నారు. క్రీస్తు లేచాడని సైనికులు చెప్పడం అనేకులు విన్నారు. క్రీస్తుతో పాటు లేచిన కొందరు అనేకమందికి కనిపించి క్రీస్తు లేచాడని సాక్ష్యం ఇచ్చారు. మరణం నుంచి లేచిన వీరిని చూసి వీరి మాటలు విన్నవారిని గురించి యాజకులికి నివేదికలు వచ్చాయి. యాజకులు అధికారులు నిత్యం భయపడూ నివసించారు. వీధుల్లో నడిచేటప్పుడో, తమ సొంత ఇళ్లల్లో తిరిగేటప్పుడో క్రీస్తుని ముఖాముఖి కలుస్తామేమోనన్నది వారి భయం. తమకు భద్రత లేదని వారు భావించారు. తలుపులికి గడియలు బార్లు వేసుకుని దైవకుమారుణ్ని ఆపడం సాధ్యం కాదు. “వాని రక్తం మామిదను మా పిల్లలమిదను ఉండును గాక” (మత్త 27:25) అంటూ తీర్పు గదిలో తాము కేకలు వేసిన దృశ్యం రాత్రింబగళ్లు వారి కళ్లముందు కదులుతోంది. ఆ దృశ్యం జ్ఞాపకం వారి మనసుల్లో నుంచి ఎప్పటికీ పోదు. ఎప్పటికీ వారికి ప్రశాంతమైన నిద్రరాదు. DATel 886.2

క్రీస్తు సమాధి వద్ద ఆ మహాదూత నీ తండ్రి నిన్ను పిలుస్తున్నాడు అని కేక వేసినప్పుడు రక్షకుడు తనలో ఉన్న జీవాన్ని బట్టి సమాధిలో నుంచి లేచివచ్చాడు. ఆయన చెప్పిన ఈ మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. “నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను.” యాజకులు అధికారులతో ఆయన పలికిన ఈ ప్రవచనం - “ఈ దేవాయలమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదును” అన్న ప్రవచనం ఇప్పుడు నెరవేరింది. యెహా 10:17, 18; 2:19. DATel 887.1

బద్ద లైన యో సేషు సమాధి లోనుంచి విజయుడు క్రీస్తు “పునరుత్థానమును జీవమును నేనే” అని ప్రకటించాడు. ఈ మాటలు దేవుడు మాత్రమే అనగలడు. సృష్టి పొందిన వారందరూ దేవుని చిత్తాన్ని బట్టి శక్తిని బట్టి జీవిస్తారు. వారు దేవుని మీద ఆధారపడి ఆయన ఇచ్చే జీవాన్ని పొందుతారు. అత్యున్నత కెరూబు మొదలుకొని అత్యల్పప్రాణి వరకూ అందరూ జీవానికి మూలం అయిన ఆయన నుంచే జీవం పొందుతున్నారు. దేవునితో సమానమైనవాడు మాత్రమే నా ప్రాణాన్ని పెట్టడానికి దాన్ని మళ్లీ తీసుకొడానికి నాకు శక్తి ఉన్నదని చెప్పగలడు. దేవత్వం గల క్రీస్తుకి మరణం సంకెళ్లను బద్దలు కొట్టే శక్తి ఉంది. DATel 887.2

మరణించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మరణం నుంచి లేచాడు. అల్లాడించేపన ఛాయారూపానికి ఆయన నిజరూపం. అల్లాడించాల్సిన పన ప్రభువుకి సమర్పించాల్సిన రోజునే క్రీస్తు పునరుత్థానం సంభవించింది. ఈ . సంకేతాత్మక ఆచారం వెయ్యి సంవత్సరాలకు పైగా ఆచరణలో ఉంది. పంట పొలాల్లో పండిన వెన్నుల్ని పోగుచేసేవారు. ప్రజలు పస్కాను ఆచరించడానికి యెరుషలేము వెళ్ళినప్పుడు ఈ మొదటి పంట పనను కృతజ్ఞత కానుకగా దేవుని ముందు ఊపేవారు. ఈ పనని ప్రభువుకి సమర్పించే వరకు పంటను కోసి పనలు కూర్చడం జరిగేది కాదు. ప్రభువుకి ప్రతిష్ఠితమైన పన పంటను సూచించిందని అలాగే ప్రథమ ఫలమైన క్రీస్తు దేవుని రాజ్యంలోకి సమకూర్చాల్సి ఉన్న గొప్ప ఆధ్యాత్మికపరమైన పంటను సూచిస్తున్నాడు. ఆయన పునరుత్థానం మృతులైన నీతిమంతుల పునరుత్థానానికి చిహ్నం వాగ్దానం కూడా. “యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన యెడల, అదే ప్రకారము యేసు నందు నిద్రించువారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొనివచ్చును.” 1 థెస్స 4:14. DATel 887.3

క్రీస్తు లేస్తూ అనేకమంది బందీల్నీ తనతోపాటు సమాధి నుంచి బయటికి తెచ్చాడు. ఆయన మరణించినప్పుడు సంభవించిన భూకంపం వారి సమాధుల్ని బద్దలు కొట్టింది. ఆయన లేచినప్పుడు ఆయనతో పాటు వారూ లేచారు. వారు క్రీస్తుతో కలిసి పరిచర్య చేసినవారు. తమ ప్రాణాల్ని లెక్కచెయ్యకుండా సత్యాన్ని ప్రకటించిన వారు. తమను మృతుల్లో నుంచి లేపిన ఆ ప్రభువు గురించి ఇప్పుడు వారు సాక్ష్యమివ్వాల్సి ఉన్నారు. DATel 888.1

తన పరిచర్య కాలంలో యేసు మరణించిన వారిని లేపాడు. నాయీను విధవరాలి కుమారుణ్ని, సమాజ మందిరపు అధికారి కుమార్తెని, లాజరుని ఆయన లేపాడు. కాని వీరికి అమర్యత ఇవ్వలేదు. వారిని మరణం నుంచి లేపినా వారు మళ్లీ మరణించాల్సిందే. కాని క్రీస్తుతో పాటు పునరుత్థానులైన వారు నిత్య జీవానికి లేపబడ్డారు. వారు ఆయనతో పాటు పరలోకానికి వెళ్లారు. మరణం మిద సమాధి మీద ఆయన పొందిన విజయానికి ట్రోఫీలుగా ఆయన వారిని తీసుకువెళ్లాడు. వీరు ఇక సాతాను బందీలు కారు; నేను వారిని విమోచించాను. నేనున్న స్థలంలో వారూ ఉండడానికి నా శక్తికి ప్రథమ ఫలంగా నేను వారిని సమాధి నుంచి లేపి తీసుకు వచ్చాను అని క్రీస్తు అన్నాడు. DATel 888.2

వీరు పట్టణంలోకి వెళ్లి అనేకులికి కనిపించి క్రీస్తు మృతుల్లోనుంచి లేచాడు ఆయనతో పాటు మమ్మల్ని లేపాడు అని ప్రకటించారు. ఇలా పునరుత్థాన పరిశుద్ధ సత్యం చిరస్థాయిగా నిలిచింది. పునరుత్థానులైన పరిశుద్ధులు ఈ మాటల్లోని సత్యానికి ప్రబల సాక్షులయ్యారు, “మృతులైన నీ వారు బ్రదుకుదురు. నా వారి శవములు సజీవములగును.” వారి పునరుత్థానం ఈ ప్రవచన నెరవేర్పుకు ఉదాహరణ, “మంటిలో పడియున్నవారలారా, మేలని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన DATel 888.3

మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.” యెష 26:19. DATel 889.1

విశ్వాసికి క్రీస్తు పునరుత్థానం, జీవం. పాపం వలన నశించిన జీవం రక్షకుని ద్వారా పునరుద్ధరణ పొందింది. ఎందుచేతనంటే ఆయనలో జీవముంది. తాను కోరిన వారికి ఆయన జీవమిస్తాడు. అమరత్వాన్ని ప్రదర్శించడానికి ఆయనకు హక్కు ఉంది. మానవుడుగా తాను అర్పించిన ప్రాణాన్ని ఆయన తిరిగి తీసుకుని దాన్ని మానవులకిస్తాడు. “గొటెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని” “నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై దానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును.” “నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును.” అన్నాడాయన. యోహా 10:10; 4:14; 6:54. DATel 889.2

విశ్వాసికి మరణం చిన్న విషయం. క్రీస్తు దాన్ని గురించి అతి స్వల్పకాల విషయంగా మాట్లాడున్నాడు. “ఒకడు నా మాట గైకొనిన యెడల వాడెన్నడును మరణము పొందడు” “వాడు ఎన్నడును మరణము రుచి చూడడు.” క్రైస్తవుడికి మరణం నిద్రవంటిది. జీవం క్రీస్తుతో కూడ దేవునియందు దాచబడి ఉంది. “మనకు జీవమైయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు.” యెహో 8:51, 52, కొలొ 3:6. DATel 889.3

“సమాప్తమైనది” అంటూ సిలువనుంచి వచ్చిన కేక మృతుల మధ్య వినిపించింది. సమాధుల గోడల్లో నుంచి దూసుకుంటూ వెళ్లి మృతుల్ని లేవమని ఆదేశించింది. యేసు స్వరం పరలోకం నుంచి వినిపించినప్పుడు అలా ఉంటుంది. ఆ స్వరం సమాధుల్లోకి చొరబడుంది, సమాధుల్ని తెరుస్తుంది. క్రీస్తునందు మరణించిన వారు లేస్తారు. రక్షకుని పునరుత్థాన సమయంలో కొన్ని సమాధులు తెరవబడ్డాయి. కాని ఆయన రెండో రాక సమయంలో మరణించిన నీతిమంతులు ఆయన స్వరాన్ని విని అమర్త్య సజీవులుగా లేస్తారు. క్రీస్తుని మృతుల్లోనుంచి లేపిన శక్తే ఆయన సంఘాన్ని లేపి అన్ని రాజ్యా లకన్నా, అన్ని శక్తులకన్నా, అన్ని నామాలకన్నా, ఈ లోకంలోనే గాక రానున్న నిత్యరాజ్యంలో కూడా, ఉన్నతంగా ఆయనతోపాటు దాన్ని కూడా మహిమపర్చుతుంది. DATel 889.4