యుగయుగాల ఆకాంక్ష

48/88

47—సువార్త పరిచర్య

ఆ రాత్రంతా కొండమీద గడిచింది. సూర్యుడు ఉదయించగానే యేసు ఆయన శిష్యులు కొండ దిగి మైదానంలోకి వచ్చారు. ఆలోచనల్లో మునిగి పోయిన శిష్యులు భయభయంగా నిశ్శబ్దంగా ఉన్నారు. పేతురు సయితం మాటామంతీ లేకుండా ఉన్నాడు. పరలోక కాంతి నిలిచిన ఆ పరిశుద్ధ స్థలంలో దైవ కుమారుడు తన మహిమను ప్రదర్శించిన ఆ స్థలంలో ఇంకా కొంత సేపు సంతోషంగా ఉండేవారే, కాని ప్రజలికి చేయాల్సిన సేవ ఉంది. ప్రజలు యేసుకోసం అన్నిచోట్ల అప్పటికే అన్వేషిస్తోన్నారు. DATel 471.1

కొండ మొదట పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడారు. వెనక ఉండిపోయిన శిష్యులు ఆ జనాన్ని పోగు చేశారు. యేసు ఎక్కడకు వెళ్లాడో ఆ శిష్యులికి తెలుసు. ఆ ప్రజల్ని సమీపిస్తున్నప్పుడు తాము ఏమి చూశామో అన్నదానిపై నిశ్శబ్దంగా ఉండాల్సిందని యేసు ఆ ముగ్గురు శిష్యుల్ని కోరుతూ ఇలా అన్నాడు, “మనుష్యకుమారుడు మృతులలో నుండి లేచువరకు ఈ దర్శనము మీరు ఎవరితోను చెప్పకుడి. ” ఈ శిష్యులికి కలిగిన ప్రత్యక్షతను వీరు మనసుల్లో ధ్యానించుకోవాలే తప్ప ప్రకటించకూడదు. దాన్ని ప్రజలికి చెప్పడం అపహాస్యాన్నికి దారి తీయవచ్చు. క్రీస్తు మరణించి లేచే వరకూ ఆ తొమ్మిది మంది అపొస్తలులికి సైతం ఆ దృశ్యం అవగాహన కాలేదు. ప్రభువు ఎంపిక చేసిన ఆ ముగ్గురు శిష్యులు సయితం అవగాహన విషయంలో ఎంత మందమతులో ! ఆ దృశ్యం విషయంలో క్రీస్తు చెప్పిందంతా విన్నప్పటికీ మరణించడమంటే అర్ధమేంటని వారు తమలో తాము తర్జనబర్జన చేసుకుంటున్నారే గాని ఆయన నుంచి ఏ వివరణ కోరలేదు. భవిష్యత్తు గురించి ఆయనన్న మాటలు వారిని దుఃఖంతో నింపాయి. జరగకూడదని తాము కోరుకుంటున్న ఆ విషయంపై వారు మరింత వివరణను కోరలేదు. DATel 471.2

మైదానంలో ఉన్న ప్రజలు యేసుని చూసినప్పుడు సంతోషించారు. ఆయన్ని పలకరించడానికి పరుగులు తీశారు. అయినా వారు గొప్ప సంక్షోభంలో ఉన్నట్లు ఆయన పసిగట్టాడు. శిష్యులు కలత చెందినట్లు కనిపించారు. అప్పుడే ఓ సంఘటన జరిగింది. అది వారికి ఆశాభంగం అవమానం కలిగించింది. DATel 472.1

వారు కొండ మొదట వేచి ఉన్న సమయంలో ఓ తండ్రి మూగ దురాత్మ పీడితుడైన తన కుమారుణ్ని బాగు చెయ్యమంటూ శిష్యుల వద్దకు తీసుకువచ్చాడు. గలిలయ అంతట సువార్త ప్రకటించడానికి యేసు తన శిష్యుల్ని పంపినప్పుడు దయ్యాల్ని వెళ్లగొట్టడానికి వారికి అధికారం దఖలు పర్చాడు. వారు విశ్వాసంతో ముందుకు సాగుతున్నప్పుడు దురాత్మలు వారి ఆజ్ఞకు విధేయులయ్యాయి. ఇప్పుడు యేసు నామాన అతణ్ని విడిచి పొమ్మని ఆ దురాత్మను శిష్యులు ఆజ్ఞాపించగా అది మరింత శక్తి ప్రదర్శనతో వారిని ఎగతాళి చేసింది. తమ వైఫల్యానికి కారణం తెలియలేదు. తాము తమకు తమ ప్రభువుకి చెడ్డ పేరు తెస్తున్నట్లు బాధపడ్డారు. ఆ సమూహంలో శాస్త్రులు కొందరున్నారు. వారు అవకాశాన్ని దొరకబుచ్చుకుని శిష్యుల్ని సిగ్గుపర్చడానికి ప్రయత్నించారు. వారు శిష్యుల చుట్టూ మూగి వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ తాము తమ ప్రభువు వంచకులని నిరూపించడానికి ప్రయత్నించారు. శిష్యులుగాని క్రీస్తుగాని ఈ దురాత్మను వెళ్లగొట్టలేకపోయారంటు రబ్బీలు ఎద్దేవా చెయ్యడం మొదలు పెట్టారు. ప్రజలు శాస్త్రులికి మద్దతు పలకడంతో ఆ సమూహంలో ద్వేషం అవహేళన చెలరేగాయి. DATel 472.2

అయితే అర్ధాంతరంగా ఆ నిందారోపణలు ఆగిపోయాయి. యేసు అ ముగ్గురు శిష్యులు వస్తోన్నారు. ఏహ్యభావంతో ప్రజలు ఆయన్ని కలవడానికి ముందుకు వెళ్లారు. రాత్రంతా వారిపై ఉన్న పరలోక మహిమ ప్రభావం రక్షకుడు ఆయన ముగ్గురు శిష్యుల ముఖాల పై ఉంది. అది చూసే వారిని భయంతో నింపింది. శాస్త్రులు భయంతో ఓ అడుగు వెనక్కి వేస్తుండగా ప్రజలు యేసుకి స్వాగతం పలికారు. DATel 472.3

కాసేపటి క్రితం మొండిగా ధ్వనించిన స్వరాలు మూగబోయాయి. ఆ జనసమూహం నిశ్శబ్దమయ్యింది. బాధితుడైన ఆ తండ్రి ఇప్పుడు జనుల మధ్య నుంచి దారి చేసుకుంటూ యేసు వద్దకు వచ్చి ఆయన పాదాలపై పడి తన సమస్యను తనకు కలుగుతూ వచ్చిన ఆశాభంగాన్ని ప్రభువులికి విన్నవించుకున్నాడు. DATel 473.1

“బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసికొని వచ్చితిని. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ నానిని పడద్రోయును... దానిని పోగొట్టుడని నీ శిష్యులను అడిగితిని, అది వారి చేత కాలేదు” అన్నాడు. యేసు తన చుట్టూ విస్మయంతో నిండిన ఉన్న జన సమూహాన్ని చూశాడు. అందులో తప్పులెన్నే శాస్త్రులున్నారు. గందరగోళంగా శిష్యులున్నారు. యేసు వారి హృదయాల్లోని అవిశ్వాసాన్ని చూశాడు. దుః ఖంతో ఇలా అన్నాడు, “విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము నాతో నుందును? ఎంతవరకు మిమ్మును సహింతును?” అప్పుడు యేసు “వానిని నా యొద్దకు తీసికొని రండి” అన్నాడు. DATel 473.2

ఆ బాలుణ్ని తీసుకువచ్చారు. రక్షకుని చూపు అతడి మిద పడ్డప్పుడు దురాత్మ అతణ్ని నేలమీద పడేయగా అతడు తీవ్రమైన బాధతో మెలికెలు తిరిగాడు. నేలమీద దొర్లుతూ, నురుగుకక్కుతూ భయంకరంగా కేకలు వేశాడు. DATel 473.3

జీవానికి ప్రభువైన యేసు చీకటి శక్తుల రాజు సాతాను మళ్లీ రణరంగంలో కలుసుకున్నారు. -“చెరలోనున్న వారికి విడుదలను... నలిగిన వారిని విడిపించుటకును” అన్న కర్తవ్య నిర్వహణకు క్రీస్తు, తన బాధితుణ్ని తన స్వాధీనంలో ఉంచుకోడానికి సాతాను. చోటుచేసుకోనున్న విడుదలని చూపరులు అవగాహన చేసుకునేందుకు గాను యేసు కాసేపు ఆ దురాత్మను తన శక్తిని ప్రదర్శించుకోనిచ్చాడు. DATel 473.4

ప్రజలు ఏంజరుగుతుందో అని తీవ్ర ఉత్కంఠతో కనిపెట్టొన్నారు. ఆ కుర్రాడి తండ్రి భయాందోళనలతో చూస్తూ ఉన్నాడు. ” ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనది?” అని యేసు అడిగాడు. అప్పుడు అతని తండ్రి చాలా కాలంగా అతడు పడుతున్న బాధను వివరించి ఇక దాన్ని భరించలేనట్లు వ్యక్తం చేస్తూ ఇలా అన్నాడు, ” ఏమైనను నీవలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయవలెను.” “నీవలన నైతే!” ఇప్పుడు సయితం తండ్రి క్రీస్తుశక్తిని ప్రశ్నిస్తోన్నాడు. DATel 473.5

“నీవలన నైతే, నమ్ము వానికి సమస్తమును సాధ్యమే” అని యేసు సమాధానం ఇచ్చాడు. క్రీస్తుకు సంబంధించినంత వరకు శక్తికి లోటులేదు. కుమారుడి స్వస్తత తండ్రి విశ్వాసం మీద ఆధారపడి ఉంది. కన్నీళ్లు కార్చుతూ తన బలహీనతను గుర్తెరిగి ఆ తండ్రి “నమ్ముచున్నాను నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుము.” అంటూ క్రీస్తుని వేడుకున్నాడు. DATel 474.1

యేసు బాధితుడైన ఆ కుర్రాడి వంక చూసి ఇలా అన్నాడు, “మూగయైన చెవిటి దయ్యమా వానిని వదిలిపొమ్ము ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నాను.” పెద్దకేక వినిపించింది. బాధాకరమైన సంఘర్షణ సంభవించింది. విడిచివెళ్లిపోయేటప్పుడు ఆ దయ్యం తన బాధితుణ్ని చీల్చివేస్తుందా అనిపించింది. అనంతరం ఆ కుర్రాడు. కదలికలేకుండా ప్రాణం లేనివాడిలా పడి ఉన్నాడు. “వాడు చనిపోయెను” అని ప్రజలన్నారు. అయితే అతణ్ని చెయ్యిపట్టుకుని పైకి లేపి సంపూర్ణ ఆరోగ్యంతో తన తండ్రికి అప్పగించాడు. తండ్రి కుమారుడు ఇద్దరూ తమ విమోచకుణ్ని కొనియాడారు. ప్రజలు “దేవుని మహాత్మ్యము చూచి ఆశ్చర్యపడిరి.” పరాజయం పాలైన శాస్త్రులు కారాలు మిరియాలు నూరుతూ వెళ్లిపోయారు. DATel 474.2

“ఏమైనను నీవలన నైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయుము.” ఆ ప్రార్ధనని పాపభారంతో కుంగిపోతోన్న ఎన్ని ఆత్మలు ప్రతిధ్వనించాయి.! అందరికీ ఆ కరుణామూర్తి సమాధానం “నీవలన నైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే” అన్నది. మనల్ని పరలోకానికి అనుసంధానపర్చి చీకటి శక్తుల్ని ఎదుర్కోడానికి మనకు శక్తి నిచ్చేది విశ్వాసమే. ప్రతీ పాపేచ్ఛను అణచివేసి ప్రతిశోధనను ప్రతిఘటించడానికి క్రీస్తు ద్వారా మార్గాల్ని దేవుడు సమకూర్చుతున్నాడు. కాగా తమకు విశ్వాసం కొరవడ్తోందని అందుచేత తాము క్రీస్తుని చేరలేకపోతున్నామని అనేకులు భావిస్తోన్నారు ఈ ఆత్మలు తమ నిస్సహాయ, అయోగ్యస్థితిలో దయానిధి అయిన తమ రక్షకుణ్ని ఆశ్రయింతురుగాక! నాపై వారు ఆధారపడకండి. క్రీస్తు పై ఆధారపడండి. మానవుల మధ్య నివసించినప్పుడు రోగుల్ని బాగు పర్చినవాడు, దయ్యాల్ని వెళ్లగొట్టిన వాడు అయిన ఆ ప్రభువు నేడు మహాశక్తిగల విమోచకుడు. దేవుని వాక్యం ద్వారా విశ్వాసం కలుగుతుంది. అప్పుడు “నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుము” అని ఆయన వాగ్దాన సాఫల్యాన్ని సొంతం చేసుకోండి. ఇది చేసినప్పుడు మీరు నశించిపోరు. అది ఎన్నడూ జరగదు. DATel 474.3

అతి స్వల్ప కాలవవ్యధిలోనే ప్రత్యేకత గల ఈ శిష్యులు విస్తారమైన మహిమను విస్తారమైన పరాభవాన్ని చూశారు. మానవత్వం దేవుని స్వరూపంలోకి రూపాంతరం చెందడం, సాతాను రూపంలోకి దిగజారడం చూశారు. ఆయన పరలోక దూతలతో ఏ కొండపై మాట్లాడాడో ఏ కొండపై ప్రకాశిస్తున్న మహిమలో నుంచి ఓ స్వరం ఆయన్ని దేవుని కుమారుడుగా క్రటించిందో ఏ మానవ శక్తి బాగుపరచలేని దయ్యం పీడుతుడు, పళ్లు కొరుకుతూ వికృత రూపంతో ఉన్నవాడు అయిన బాలుణ్ని కలవడానికి ఆ కొండమీద నుంచే దిగి రావడం వారు చూశారు. కొద్దిసేపటికి ఆశ్చర్యం విస్మయంతో నిండిన శిష్యుల ముందు, మహిమతో ప్రకాశిస్తూ నిలిచిన మహాశక్తిగల విమోచకుడే సాతాను బాధితుడై మట్టిలో దొర్లుతున్న బాలుణ్ని మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యవంతుడుగా లేపి తన తండ్రికి అప్పగించడానికి వంగాడు. DATel 475.1

రక్షణ కార్యంలో ఇదొక సాదృశ్యపాఠం - తండ్రి మహిమతో నిండిన దేవుడు నశించిన వారిని రక్షించడానికి వంగడం. అది శిష్యుల కర్తవ్యాన్ని సూచిస్తోంది. ఆ కొండ శిఖరాన ఆ ఆత్మీయ వికాసంలో శిష్యులు క్రీస్తుతో ఉండడం తమ జీవితాన్ని ఆయనతో ఒంటరిగా గడపడానికి కాదు. కింద మైదానంలో వారు నిర్వహించాల్సిన పని ఉంది. వాక్యం ద్వారాను ప్రార్ధన ద్వారాను సాతాను చెర నుంచి వారు విడిపించాల్సి ఉన్న ఆత్మలు వేచి ఉన్నాయి. DATel 475.2

ఆ తొమ్మండుగురు శిష్యులు తమకు కలిగిన వైఫల్యం గురించి ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. యేసు మళ్లీ తమతో ఒంటరిగా ఉన్న తరుణంలో ఆయన్ని ఇలా ప్రశ్నించారు. “మేమెందుచేత దానిని వెళ్లగొట్టలేకపోతిమి?” “మీ అల్పవిశ్వాసము చేతనే; మీకు ఆవగింజత విశ్వాసముండిన యెడల ఆ ఈ కొండను చూచి - ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అన్నాడు. క్రీస్తు నుంచి మరెక్కువ సానుభూతి పొందడానికి వారి అవిశ్వాసం తమకు నియుక్తమైన పరిశుద్ధ పరిచర్యలో వారు చూపించిన అశ్రద్ధ ప్రతిబంధకాలయ్యా యి. చీకటి శక్తులతో సంఘర్షణలో వారికి పరాజయం కలిగించాయి. DATel 475.3

తన మరణం గురించి క్రీస్తు చెప్పిన మాటలు విచారాన్ని సంశయాన్ని కలిగించాయి. యేసుతో కొండ మీదకి వెళ్లడానికి ముగ్గురు శిష్యుల్ని ఎంపికచేసుకోడం తక్కిర తొమ్మండుగురిలో అసూయ పుట్టించింది. ప్రార్ధన ద్వారా తమ్మును తాము బలోపేతల్ని చేసుకునే బదులు, వారు తమ అభిప్రాయ భేదాల గురించి వ్యక్తిగత ఆశాభంగాలు వ్యధల గురించి ప్రస్తావించుకొంటున్నారు. నిరాశాజనకమైన ఈ పరిస్థితుల్లో వారు సాతానుతో ఈ సంఘర్శణను చేపట్టారు. DATel 476.1

అలాంటి పోరాటంలో విజయం సాధించడానికి వారు వేరే మనస్తత్వంతో ఆపనిని చేపట్టాలి. విశ్వాసంతోను దీనమనసుతోను ఎడతెగక ప్రార్ధించడం ద్వారా వారి విశ్వాసం బలం పొందడం అవసరం. వారు స్వార్గాన్ని పూర్తిగా తీసివేసుకుని దేవుని ఆత్మతోను శక్తితోను తమ్మును తాము నింపుకోవాలి. ఈ లోక పాలకులతోను చీకటి శక్తులతోను ఉన్నత స్థలాల్లో దురాత్మలతోను జరిగే పోరాటంలో మనుషులికి పరిశుద్ధాత్మ సహాయాన్ని సంపాదించగలిగేది చిత్త శుద్దితో విశ్వాసంతో దేవునికి మనం చేసే ప్రార్థనే. అది ఎలాంటి విశ్వాసమంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడి ఆయన సేవకు మినహాయింపులు లేకుండా విశ్వాసి తన్నుతాను అంకితం చేసుకునే విశ్వాసం. DATel 476.2

“మీకు ఆవగింజంత విశ్వాసం ముండిన యెడల ఈ కొండను చూచిఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును” అన్నాడు యేసు. ఆవగింజ చాలా చిన్నదైనా గొప్ప చెట్టుగా పెరిగే మర్మపూరితమైన జీవన సూత్రం దానిలో ఉంది. ఆవగింజను భూమిలో నాటినప్పుడు తన పోషణ కోసం దేవుడు ఏర్పాట్లు చేసిన ప్రతీ వనరును ఆ సూక్ష్మజీవి స్వీకరించి స్థిరంగా పెరుగుతుంది. ఇలాంటి విశ్వాసం మీకుంటే మీరు దేవుని వాక్యాన్ని ఆయన ఏర్పాటు చేసిన సాధనాల్ని సహాయం అందించే సంస్థలన్నిటిని బలంగా నమ్ముతారు. ఇలా నా విశ్వాసం వృద్ధి చెందుతుంది. అప్పుడు నాకు దేవుని శక్తి సహాయం లభిస్తుంది. ఈ మార్గానికి అడ్డంగా సాతాను కల్పించే ఆటంకాలు అనాది పర్వతాల్లా అధిగమించలేనివిగా కనిపించినా విశ్వాసం ఆజ్ఞమేరకు అవి మటుమాయమవుతాయి. “మీకు అసాధ్యమైనది ఏదియు నుండదు.” DATel 476.3