యుగయుగాల ఆకాంక్ష

47/88

46—ఆయన రూపాంతరం పొందాడు

యేసు పేతురు, యాకోబు, యోహాను అనే ముగ్గురు శిష్యులతో పొలాల గుండా మిట్టపల్లాల దారిన ఓ వంటరి కొండ పక్కకు వెళ్తున్నప్పుడు సాయంత్రం పడుతోంది. రక్షకుడు ఆయన శిష్యులు ఆ దినమంతా ప్రయాణం చేస్తూ బోధిస్తూ ఉన్నారు. కొండ ఎక్కడం వారికి మరింత ఆయాసం పుట్టించింది. అనేకమంది బాధితుల భారాల్ని క్రీస్తు తేలిక చేశాడు. బలహీనమైన వారి దేహాల్లో జీవితానందాన్ని నింపుతోన్నాడు. మనుషులు ఆయన చుట్టూ ముగారు. శిష్యులితో కలిసి కొండ ఎక్కుతూ ఆయన అలసిపోయాడు. DATel 465.1

అస్తమిస్తోన్న సూర్యుడి కాంతి కొండ శిఖరంపై ఇంకా మిగిలి ఉంది. వారు వెళ్తున్న మార్గం ఎర్రని ఆ సాయంసంధ్య కాంతితో ప్రకాశిస్తోంది. కాసేపటిలో ఆ వెలుగు కొండపై నుంచి లోయలోనుంచి మాయమయ్యింది. సూర్యుడు పశ్చిమాన కుంకి పోయాడు. ఆ ఒంటరి ప్రయాణికుల్ని రాత్రి చీకటి కప్పివేసింది. దుఃఖపూరితమైన దట్టమైన మేఘాలు కమ్ముతున్న వారి జీవితాలతో పరిసరాల చీకటి కుమ్మక్కయినట్లు కనిపించింది. DATel 465.2

ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? అని ప్రశ్నించిడానికి శిష్యులు సాహసించలేదు. తరచు రాత్రంతా ఆయన ప్రార్ధనలో గడుపుతుండేవాడు. కొండల్ని లోయల్ని చేసిన ఆయన వాటి లోని ప్రశాంతతను అభినందించి ఆనందించేవాడు. యేసు ఎక్కడికి నడిపిస్తుంటే శిష్యులు అక్కడికి వెళ్తున్నారు. అయినా ప్రభువు అలసిపోయిన తమను తాను కూడా అలసిపోయి ఉన్నప్పుడు ఆయాసకరమై ఈ కొండను ఎందుకు ఎక్కిస్తున్నాడు? అని తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు. DATel 465.3

అప్పుడు ఇక ముందుకి వెళ్లనక్కర లేదని క్రీస్తు చెప్పాడు. వారి వద్ద నుంచి కొంచెం పక్కకు తప్పుకుని ఆ వ్యసనాక్రాంతుడు కన్నీళ్లు కార్చుతూ తన మనవుల్ని విన్నవించుకుంటూ ప్రార్ధన చేస్తున్నాడు. మానవుల పక్షంగా ఆ పరీక్షకు నిలబడడానికి బలం కోసం ఆయన ప్రార్ధిస్తోన్నాడు. సర్వశక్తి పై ఆయనకు తాజాగా పట్టు అవసరం. అప్పుడే ఆయన భవిష్యత్తును గురించి తలంచగలుగుతాడు. శిష్యుల విషయంలో తన హృదయ వాంఛను వ్యక్తం చేస్తోన్నాడు. తల వంచి ఉన్న ఆయన మీద మంచు దట్టంగా పడింది. కాని ఆయన దాన్ని లెక్కచెయ్యలేదు. బాగా చీకటి పడింది. కాని ఆ అంధకారాన్ని ఆయన లెక్కచెయ్యలేదు. గంటలు గడిచిపోతోన్నాయి. ప్రారంభంలో శిష్యులు కూడా భక్తితో ప్రార్ధన చేశారు. కొంత సేపటికి అలసిఉన్నవారు. ఆ ఆసక్తిని కొనసాగించాలని ప్రయత్నిస్తూనే నిద్రలో మునిగిపోయారు. యేసు తన శ్రమల్ని గురించి వారికి చెప్పాడు. వారు ప్రార్ధనలో తనతో ఏకమవ్యాలన్న ఉద్యేశంతో తనతోపాటు వారిని తీసుకువెళ్లాడు. ఇప్పుడు కూడా ఆయన వారి కోసం ప్రార్ధన చేస్తోన్నాడు. రక్షకుడు తన శిష్యుల వ్యాకులతను చూశాడు. తమ విశ్వాసం వ్యర్ధం కాలేదని భరోసా ఇవ్వడం ద్వారా వారి హృదయవేదనని తగ్గించాలని రక్షకుడు ఆకాక్షించాడు. ఆయన అందించాలని ఆశిస్తోన్న ప్రకటనని ఈ పన్నెండు మంది సహా అందరూ స్వీకరించలేదు. గెత్సెమనేలో తన దుఃఖవేదనను వీక్షించనున్న ఆ ముగ్గురు శిష్యుల్నే కొండ మీద తనతో పాటు ఉండడానికి ఎంపిక చేసుకున్నాడు. జగదుత్పత్తికి ముందు తండ్రితో తాను పంచుకున్న మహిమను వారికి ప్రదర్శించాల్సిందని తన రాజ్యం మానవనేత్రాలికి చూపించాల్సిందని అది వీక్షించడానికి తన శిష్యులికి శక్తిని ప్రసాదించాల్సిందని ఇప్పుడు ఆయన ప్రార్ధించాడు. తనకు కలుగనున్న భయంకర హింస సమయంలో తన శిష్యులికి ఆదరణనిచ్చే తన దేవత్వాన్ని వారికి ప్రదర్శించి తాను దైవకుమారుణ్నని తన అవమానకరమైన మరణం రక్షణ ప్రణాళికలో భాగమని వారికి చూపించాల్సిందని తండ్రితో ఆయన విజ్ఞాపన చేస్తోన్నాడు. DATel 466.1

ఆయన ప్రార్ధనను తండ్రి విన్నాడు. ఆ రాతి నేలపై ఆయన వినయంగా మోకరించి ఉండగా హఠాత్తుగా ఆకాశం తెరుచుకొంది. దేవుని పట్టణం బంగారు ద్వారాలు తెరుచుకున్నాయి. పరిశుద్ధ ప్రకాశం ఆ కొండ పైకి దిగి వచ్చి రక్షకుణ్ని కప్పింది. మానవత్వం లోనుంచి దేవత్వం ప్రకాశిస్తూ పై నుంచి వస్తోన్న మహిమతో కలిసింది. మోకాళ్లమీద నుంచి పైకి లేచి క్రీస్తు దివ్వఠీవితో నిలబడ్డాడు. హృదయవేదన మాయమయ్యింది. ఇప్పుడు ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రాలు “వెలుగువలె తెల్లని వాయెను.” DATel 467.1

నిద్రలేచిన శిష్యులు కొండను వెలుగుతో నింపిన మహీమాప్రవాహాన్ని తిలకించారు. ప్రచండమైన కాంతితో ప్రకాశిస్తోన్న తమ ప్రభువును భయంతో అమితాశ్చర్యంతో వీక్షించారు. ఆశ్చర్యకరమైన వెలుగును తట్టుకో గలిగినప్పుడు క్రీస్తు ఒంటిరిగా లేనట్లు గమనించారు. ఇద్దరు పరలోక వాసులు ఆయనతో మాట్లాడున్నట్లు చుశారు. వారు, సీనాయి పై దేవునితో మాట్లాడిన మోషే మరణం చవిచూడకుండా జీవించే ఆధిక్యత పొందిన, ఆదాము సంతతిలో ఇంకొకడైన ఏలీయా. DATel 467.2

పదిహేను శతాబ్దాలు ముందు పిల్లె పై నుంచి మోషే వాగ్దత్త భూమిని తిలకించాడు. కాని మెరీబా వద్ద తన పాపం కారణంగా అందులో ప్రవేశించడానికి లేకపోయింది. ఇశ్రాయేలు ప్రజల్ని తమ పితరుల స్వాస్యంలోకి నడిపించే ఆనందం కూడా మోషేకి దక్కలేదు. “నేను అద్దరికి వెళ్లి యోర్దాను అవతలనున్న యీ మంచి దేశమును మంచి మన్నెమును ఆ లెబానోనును చూచునట్లు దయ చేయుము.” (ద్వితీ 3:25) అంటూ మోషే చేసిన వేడుకోలును దేవుడు తిరస్కరించాడు. నలభై సంవత్సరాలుగా ఆ అరణ్య సంచారాన్ని వెలుగుతో నింపిన నిరీక్షణ సాకారం కావడానికి లేదు అతనకి. కఠిన శ్రమతోను భారభరితమైన శ్రద్ధాసక్తులతో కూడిన ఆలనపాలనతోను గడిచిన ఆ సంవత్సరాల గురి అరణ్యంలో సమాధే. అయితే “మనము అడుగువాటన్నిటి కంటెను, ఊహించువాటన్నిటి కంటెను అత్యధికముగా చేయశక్తి గల” (ఎఫెసీ 3:20) దేవుడు ఈ మేరకు తన సేవకుని ప్రార్ధనకు జవాబిచ్చాడు. మోషే మరణం అధికారం కిందకు వచ్చాడు. అయితే అతడు సమాధిలో ఉండిపోలేదు. క్రీస్తు అతణ్ని లేపాడు. మోషే చేసిన పాపంవల్ల మోషే దేహం తనదని సాతాను వాదించాడు కాని క్రీస్తు రక్షకుడు అతణ్ని సమాధిలోనుంచి లేపి బయటికి తీసుకువచ్చాడు. యూదా 9. DATel 467.3

పాపం మిద మరణం మిద క్రీస్తు సాధించిన విజయానికి రూపాంతర పర్వతం మీది మో షేయే సాక్ష్యం. నీతిమంతుల పునరుత్థానంలో సమాధుల్లోనుంచి బయటికి వచ్చే భక్తులికి మోషే ప్రతీక. మరణం చూడకుండా పరలోకానికి ఆరోహణమైన ఏలీయా యేసు రెండో రాక సమయంలో భూమి మీద సజీవులై ఉండి “ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే.... మార్పు పొందు” భక్తుల్ని సూచించాడు. అప్పుడు ” క్షయమైన యీ శరీరము అమర్యతను ధరించుకొనవలసినయున్నది మర్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించవలసియున్నది.”1కొరి. 15:51-53. యేసు పరలోక కాంతి వస్త్రం ధరించి “రక్షణ నిమిత్తము పాపము లేకుండ రెండవసారి ప్రత్యక్ష” మైనప్పుడు కనిపించేట్టు కనిపించాడు. ఎందుకంటే ఆయన తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా” వస్తాడు. హెబ్రీ 9:28; మార్కు 8:38. రక్షకుడు శిష్యులికి చేసిన వాగ్దానం ఇప్పుడు నెరవేరింది. ఆ కొండ మీద భావి మహిమారాజ్యం సూక్ష్మరూపంలో ప్రదర్శితమయ్యింది. DATel 468.1

ఆ దృశ్యం శిష్యులికి ఇంకా అర్ధం కాలేదు. ఓర్పుగల బోధకుడు, సాత్వికం, దీనత్వంగలవాడు, నిస్సహాయ పరదేశిగా ఇటు అటు సంచారం చేసినవాడు అయిన తమప్రభువు పరలోక ప్రముఖుల గౌరవాభిమానాల్ని పొందినందుకు వారు ఆనందించారు. మెస్సీయా పరిపాలనను ప్రకటించడానికి క్రీస్తు రాజ్యం భూమిపై స్థాపితం కానుందని ప్రకటించడానికి ఏలీయా వచ్చాడని వారు నమ్మారు. భయాన్ని ఆశాభంగాన్ని గూర్చిన జ్ఞాపకం పూర్తిగా తుడుపుపడింది. దేవుని మహిమ ప్రదర్శితమైన ఈ స్థలంలోనే ఉండిపోవాలని వారు ఆశించారు. “ప్రభువవా మన మిక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదము” అని పేతురన్నాడు. తమ ప్రభువుని పరిరక్షించడానికి రాజగా ఆయన అధికారాన్ని స్థాపించడానికి దేవుడు మోషేని ఏలీయాని పంపించాడని వారు విశ్వసించారు. DATel 468.2

అయితే ముందు నిలువ తర్వాత కిరీటం. యేసుతో వారి సమావేశాంశం రాజుగా క్రీస్తు పట్టాభిషేకం కాదు, యెరూషలేములో ఆయన మరణం. మానవత్వ బలహీనతని వహిస్తూ దాని దుఃఖం పాపం భారాన్ని మోస్తూ మానవుల మధ్య యేసు ఒంటరిగా నడిచాడు. రానైయున్న శ్రమ తాలూకు చీకటి కమ్ముతున్నప్పుడు తనను ఎరుగని లోకంలో ఆయన మనసు కలత చెందింది. తాను ప్రేమించిన తన శిష్యులు సయితం తమ సందేహాలు, దుఃఖం, ఆశాభావాలు నిరీక్షణల్లో మునిగి తేల్తూ ఆయన పరిచర్యను గూర్చిన మర్మాన్ని అవగాహన చేసుకోలేదు. పరలోక ప్రేమ సహవాసం నడుమ ఆయన నివసించాడు. కాని తాను సృజించిన లోకంలో ఆయన ఒంటరిగా నివసించాడు. దేవుడు ఇప్పుడు తన ప్రతినిధుల్ని యేసు వద్దకు పంపాడు. దేవదూతల్ని కాదు. కాని శ్రమలు బాధలు అనుభవించిన మనుషుల్ని తన భూలోక జీవితంలో తన శ్రమలు దుఃఖంలో రక్షకునికి సానుభూతి కనపర్చే మనుషుల్ని. మోషే ఏలీయాలు యేసుతో కలిసి పనిచేసిన తోటి పనివారు. మానవ రక్షణాసక్తిని వారు ఆయనతో పంచుకున్నారు. మోషే ఇశ్రాయేలు కోసం ఈ విజాపన చేశాడు, “ఆయ్యో నీవు వారి పాపమును ఒక వేళ పరిహరించితివా, లేని యెడల నీవు వ్రాసిన నీ గ్రంధములో నుండి నా పేరు తుడిచివేయుము.” నిర్గమ 32:32. ఏలీయా ఏకాకితనాన్ని అనుభవించాడు. మూడున్నరసంవత్సరాల కరవు కాలంతో ఆ దేశం ద్వేషాన్ని దుఃఖభారాన్ని అతడు మోశాడు. కర్మెలు పై దేవుని నిమిత్తం అతడు ఒంటరిగా నిలబడ్డాడు. వేదనతో నిస్పృహతో ఒంటరిగా ఎడారిలోకి పారిపోయాడు. సింహాసనం చుట్టూ ఉన్న ప్రతీ దూతకన్నా ఎక్కువ పరిగణన పొంది ఎంపికైన ఈ వ్యక్తులు క్రీస్తుతో తన శ్రమల్ని గురించి మాట్లాడి ఆయన పట్ల దేవుని సానుభూతిని గూర్చిన భరోసా ఇవ్వడానికి పరలోకం నుంచి వచ్చారు. లోక నిరీక్షణ, ప్రతీవారి రక్షణ - ఇవి వారి చర్చాంశాలు. DATel 469.1

నిద్రమత్తులో పడిపోవడం మూలాన క్రీస్తుకీ ఆ పరలోక దూతలికి మధ్య జరిగిన చర్చ. ఎవరికీ వినిపించలేదు. మెలకువగా ఉండి ప్రార్ధన చేయనందున తమకివ్వాలని దేవుడు ఆశించిన దాన్ని అంటే క్రీస్తు శ్రమల్ని గూర్చిన జ్ఞానాన్ని దాని తర్వాత రానున్న మహిమను గూర్చిన జ్ఞానాన్ని వారు పొందలేకపోయారు. ఆయన ఆత్మ త్యాగాన్ని పంచుకోడం ద్వారా తమ సొంతం కాగలిగిన దీవెనను వారు పోగొట్టుకున్నారు. ఈ శిష్యులు విశ్వసించడంలో మండమతులు. తమను భాగ్యవంతుల్ని చెయ్యడానికి దేవుడు ఇవ్వడానికి ప్రయత్నించిన ఐశ్వర్యాన్ని వారు అభినందించలేదు. DATel 469.2

అయినా వారు గొప్ప వెలుగును పొందారు. క్రీస్తుని నిరాకరించడంలో యూదు జాతి చేసిన పాపం పరలోక మంతటికీ తెలుసు. విమోచకుని సేవను గురించి వారికి స్పష్టమైన అవగాహన కలిగించడం జరిగింది. మానవ అవగాహనకు మించిన విషయాల్ని వారు తమ కన్నులతో చూశారు. చెవులతో విన్నారు. “వారు ఆయన మహాత్మ్యమును కన్నులారా చూచినవారు” (2 పేతు 1:16) కనుక యేసు వాస్తవంగా మెస్సీయా అని ఆయన్ని గూర్చి పితరులు ప్రవక్తలు సాక్ష్యమిచ్చారని పరలోక విశ్వం ఆ విధంగానే ఆయన్ని గుర్తించిందని గ్రహించారు. DATel 470.1

కొండమీద దృశ్యాన్ని వారింకా చూస్తుండగానే “మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా - ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘమలో నుండి పుట్టెను.” అరణ్యంలో ఇశ్రాయేలు గోత్రాలికి ముందు వెళ్లిన మేఘం కంటే ప్రకాశవంతమైన మహిమతో నిండిన మేఘాన్ని చూసినప్పుడు గంభీర ప్రభావంతో మాట్లాడిన దేవుని స్వరం వినిపించి ఆ కొండను దద్దరిల్లజేసినప్పుడు శిష్యులు నేలపై బోర్లపడ్డారు. వారు ఆ విధంగానే నేలపై పడిఉండగా యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి వారి భయాల్ని పోగొట్టుతూ తన సుపరిచిత స్వరంతో ఇలా అన్నాడు, “లెండి భయపడకుడి.” ధైర్యం తెచ్చుకుని కన్నులెత్తి చూడగా ఆ పరలోక మహిమ మాయమయ్యింది. మోషే ఏలీయా, రూపాలు కూడా మాయమయ్యాయి. వారు ఆ కొండ మీద యేసుతో ఉన్నారు. DATel 470.2