యుగయుగాల ఆకాంక్ష

30/88

29—సబ్బాతు

సృష్టి సమయంలో సబ్బాతును పరిశుద్ధపర్చడం జరిగింది. “ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్యనులు చేసినప్పుడు”(యోబు 38:7) మనుషుడి కోసం ఏర్పాటైన సబ్బాతు ప్రారంభమయ్యింది. ప్రపంచలో శాంతి రాజ్యమేలింది. ఎందుకంటే భూలోకం పరలోకంతో సామరస్యంతో నివసించింది. “దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాల మంచిదిగ నుండెను.” పనిపూర్తి చేసుకున్న సంతోషంతో ఆయన విశ్రమించాడు. ఆది 1:31. DATel 297.1

సబ్బాతు నాడు విశ్రమించాడు గనుక “దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధ పరచెను” - పరిశుద్ధ ఆచరణ కోసం ప్రత్యేకించాడు. సబ్బాతును ఆదాముకి విశ్రాంతి దినంగా ఇచ్చాడు. అది సృష్టి కార్యానికి స్మృతి చిహ్నం. ఈ విధంగా ఇది దేవుని శక్తికి ఆయన ప్రేమకు చిహ్నం. లేఖనం ఇలా అంటోంది, “ఆయన తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించియున్నాడు” ” జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన” ” ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమను” తేటతెల్లమౌతున్నాయి. ఆది 2:3; కీర్త111:4; రోమా 1:20. DATel 297.2

సర్వాన్ని సృజించినవాడు దైవకుమారుడే. “ఆది యందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను.... సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగినదేదియు ఆయన లేకుండ కలుగలేదు.” యోహాను 1:1-3. సబ్బాతు సృష్టికి స్మారక చిహ్నం గనుక అది క్రీస్తు ప్రేమకు ఆయన శక్తికి ప్రతీక. DATel 297.3

సబ్బాతు మన తలంపుల్ని ప్రకృతిపై నిలుపుతుంది. మనల్ని సృష్టికర్తతో కలుపుతుంది. పిట్టల కిలకిల రావంలో చెట్ల సవ్వడిలో సాగర సంగీతంలో ఏదెనులో ఆదాముతో చల్లపొద్దున మాట్లాడిన ప్రభువు స్వరాన్ని మనం ఇంకా వినవచ్చు. ప్రకృతిలో ఆయన శక్తిని వీక్షించినప్పుడు మనకు ఆదరణ కలుగుతుంది. ఎందుకంటే సమస్తాన్ని సృజించిన ఆ దివ్యవాక్కే ఆత్మకు జీవాన్నిస్తుంది. “అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడించుటకు మా హృదయములలో ప్రకాశించెను.” 2 కొరి. 4:6. DATel 298.1

ఈ ఆలోచనే ఈ కీర్తనకు స్ఫూర్తి నిచ్చింది :
“యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను
సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి
నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు
ఎంతదొడ్డవి! నీ ఆలోచనలు అతి గంభీరములు.”
DATel 298.2

కీర్త 92:4, 5.

యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ ఇలా అంటోన్నాడు “కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటిచేయగలరు?... మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరును మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటను బట్టి మీరు దాని గ్రహింపలేదా? ఆయన భూమండలము మీద ఆసీనుడై యున్నాడు. దాని నివాసులు మిడతలవలె కనడబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను.... నీవు ఇతనితో సమానుడవని వారు నన్నెవనికి సాటి చేయుదురు? అని పరిశుద్దుడు అడుగుచున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడిడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహాములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడేగదా! తన అధిక శక్తి చేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు. యాకోబూ- నా మార్గము యోహోవాకు మరుగైయున్నది నా న్యాయము నాదేవుని దృష్టికి కనబడలేదు అని నీవేల అనుచున్నావు? ఇశ్రాయేలూ నీవేల ఈలాగును సృజించిన యెహోవాను నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు.... సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తి హీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే! భయపడకుము నేను నీ దేవుడనైయున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరుతును. నీకు సహయము చేయువాడను నేనే. నీతియను నాడక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందను.” ” భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.” ప్రకృతిలో లిఖితమై ఉన్న వర్తమానం ఇదే. దీన్ని జ్ఞాపకం చేసేందుకు సబ్బాతు నియమితమయ్యింది. తన విశ్రాంతి దినాల్ని పరిశుద్ధంగా ఆచరించాల్సిందిగా ప్రభువు ఇశ్రాయేలుని ఆదేశించినప్పుడు ఇలా అన్నాడు: “నేను మీ దేవుడనైన యెహోవానని వారు తెలిసికొనునట్లు ఆ విశ్రాంతి దినములు నాకును నాకును మధ్యను సూచనగా ఉండును.” యెష 40:18-29; 41:10;45:22; యెహె 20:20. DATel 298.3

సీనాయి పర్వతం మీద నుంచి దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో సబ్బాతు ఓ భాగం. కాని అది విశ్రాంతి దినంగా ప్రథమంగా ప్రకటితమయ్యింది అప్పుడు కాదు. ఇశ్రాయేలు ప్రజలు సీనాయికి రావడానికి ముందే దాన్ని గురించిన జ్ఞానం వారికుంది. సీనాయికి వచ్చే మార్గంలో ఇశ్రాయేలీయులు సబ్బాతును ఆచరించారు. కొందరు దాన్ని అపవిత్రం చేసినప్పుడు ప్రభువు వారిని ఇలా మందలించాడు, “మీరు ఎన్నాళ్లవరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు?” నిర్గమ 16:28. DATel 299.1

సబ్బాతు ఇశ్రాయేలుకు మాత్రమే కాదు లోకమంతటికీ. మానవుడు ఏదెనులో దాన్ని ఆచరించాడు. పది ఆజ్ఞల ధర్మశాస్త్రంలోని ఇతర ఆజ్ఞల్లా అది అనంతంగా కొనసాగే విధి. నాల్గో ఆజ్ఞ ఓ భాగంగా ఉన్న ధర్మశాస్త్రం గురించి మాట్లాడూ క్రీస్తు ఇలా అన్నాడు, “ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పిపోదు.” ఆకాశం భూమి ఉన్నంతకాలం సృష్టి కర్త శక్తికి గుర్తుగా సబ్బాతు కొనసాగుతుంది. భూమి మీద ఏదెను మళ్లీ కుసుమించినప్పుడు దేవుని పరిశుద్ద విశ్రాంతి దినాన్ని అందరూ ఆచరిస్తారు. “ప్రతి విశ్రాంతి దినమునను” మహిమతోనిండిన నూతన భూనివాసులు “నా సన్నిధిని మ్రొక్కుటకై వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.” మత్తయి5:18; యెషయా 66:23. DATel 299.2

తమ చుట్టూ ఉన్న జాతుల్నుంచి యూదులకు ప్రత్యేకత నిచ్చి వారిని వేరు చేసే దైవదత్త వ్యవస్థ సబ్బాతు ఒక్కటే. సబ్బాతాచరణ వారిని తన ఆరాధకులుగా నిర్దేశించాలన్నది దేవుని సంకల్పం. విగ్రహారాధనతో వారికెలాంటి సంబంధం లేదనడానికి వారికి యధార్ధ దేవునితోనే సంబంధం ఉందనడానికి సబ్బాతు ఒక గుర్తు. అయితే సబ్బాతును పరిశుద్ధంగా ఆచరించడానికి మనుషులూ పరిశుద్ధులవ్వాలి. వారు విశ్వాసం ద్వారా క్రీస్తు నీతిలో పాలివారవ్వాలి. “విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము.” అన్న ఆజ్ఞ ఇశ్రాయేలు కిచ్చినప్పుడు “మీరు నాకు ప్రతిష్టింపబడినవారు” అని కూడా అన్నాడు. నిర్గ 20:8; 22:31. ఈ రీతిగా మాత్రమే సబ్బాతు ఇశ్రాయేలుని దైవారాధకులుగా ప్రత్యేకించగలిగింది. DATel 300.1

యూదులు దేవుని మార్గం నుంచి తొలగిపోయి విశ్వాసం ద్వారా క్రీస్తు నీతిని సొంతం చేసుకోడంలో విఫలులయ్యారు. కనుక వారి విషయంలో సబ్బాతు దాని ప్రాధాన్యాన్ని కోల్పోయింది. సాతాను తన్ను తాను హెచ్చించుకుని మనుషుల్ని క్రీస్తు నుంచి తన వద్దకు ఆకర్శించడానికి పూనుకున్నాడు. ఎందుకంటే సబ్బాతు క్రీస్తు శక్తికి చిహ్నం. దేవుని విశ్రాంతి దినం చుట్టూ భారమైన నిబంధనల కంచె వేసి యూదు నేతలు సాతాను చిత్తాన్ని నెరవేర్చారు. క్రీస్తు దినాల్లో వీరు సబ్బాతును ఎంతగా వక్రీకరించారంటే దాని ఆచరణ ప్రియమైన పరలోక జనకుని ప్రవర్తనను ప్రతిబింబించే బదులు స్వార్ధపరులు నియంతలు అయిన మనుషుల ప్రవర్తనను ప్రతిబింబించింది. మానవులు ఆచరించడానికి సాధ్యం కాని నియమనిబంధనల్ని దేవుడిస్తున్నట్లు రబ్బీలు ఆయన్ని చిత్రించారు. ప్రజలు దేవుణ్ని నియంతగా చూసి ఆయన కోరినట్లుగా సబ్బాతు ఆచరించడం చేశారు. ఈ అపోహల్ని సరిదిద్దడమే క్రీస్తు చేస్తున్న పని. రబ్బీలు ఆయన్ని నీడలా వెంబడించినప్పటికీ ఆయన వారి నిబంధనల్ని ఆచరిస్తున్నట్లు కనిపించలేదు. దేవుని ధర్మశాస్త్రానుసారంగా సబ్బాతును ఆచరిస్తూ ముక్కుసూటిగా పోయాడు. DATel 300.2

ఓ సబ్బాతునాడు సమాజమందిరంలో ఆరాధన అనంతరం రక్షకుడు ఆయన శిష్యులు తిరిగి వస్తూ ఓ పంటపొలం గుండా నడిచివస్తున్న తరుణంలో శిష్యులు కొన్ని వెన్నులు తెంపుకుని నలుపుకుని తినడం మొదలు పెట్టారు. ఆ క్రియ మరి ఏ రోజైనా విమర్శకు అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే ఓ పంటపొలం పండ్లతోట లేక ద్రాక్షాతోట దాటి వెళ్తున్న వ్యక్తి తాను కోరింది స్వేచ్చగా కోసుకుని తినవచ్చు. ద్వితీ 23:24, 25 చూడండి. కాని అది సబ్బాతు దినం చేయడం నిషిద్ధం. వెన్నుల్ని కోయడాన్ని కోత కోయడంతోను గింజల్ని నలపడాన్ని నూర్పిడితోను సమానంగా పరిగణించేవారు. కాబట్టి రబ్బీల దృష్టిలో ఇక్కడ రెండు అపరాధాలు జరిగాయి. DATel 301.1

ఆ గూఢచారులు వెంటనే యేసుకి “ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారు.” అంటూ ఫిర్యాదు చేశారు. DATel 301.2

బేతెస్టా వద్ద సబ్బాతును అతిక్రమించినట్లు ఆరోపణల్ని ఎదుర్కోనప్పుడు తాను దేవుని కుమారుణ్ని అన్న విషయాన్ని తాను పరలోకమందున్న తండ్రికి అనుగుణంగా పని చేస్తున్నానన్న విషయాన్ని నొక్కి చెప్పి యేసు తన్ను తాను సమర్ధించుకున్నాడు. ఇప్పుడు వారు శిష్యులపై దాడి చేస్తున్నారు కాబట్టి ఆ విమర్శకులికి పాతనిబంధన నుంచి ఉదాహరణల్ని వల్లిస్తూ దేవుని సేవ చేస్తున్న వారు సబ్బాతు దినాన చేసిన కార్యాల్ని వివరించాడు. DATel 301.3

యూదు బోధకులు తమ లేఖన జ్ఞానం విషయంలో అతిశయించేవారు. అయితే రక్షకుడు ఇచ్చిన జవాబులో తమ అజ్ఞానం గురించిన మందలింపు వినిపిస్తోంది. ఆయన ఇలా అన్నాడు, “తానును తనతో కూడ ఉన్నవారును ఆకలిగొనినప్పుడు దావీదు ఏమి చేసెనో అదియైనను మీరు చదువలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులు మరి ఎవరును తినకూడని సముఖపు రొట్టె తనతో కూడా ఉన్నవారికిని ఇచ్చెను గదా?” “విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు.” “మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులైయున్నారని మీరు ధర్మశాస్త్రమందు చదువలేదా? “మనుష్యకుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువైన యున్నాడు.” లూకా 6:3,4; మార్కు 2:27,28; మత్తయి 12:5, 6. DATel 301.4

ఓ పవిత్రకార్యం నిమిత్తం ప్రత్యేకించిన రొట్టెల్ని దావీదు తన ఆకలిని తన సహచరుల ఆకలిని తీర్చడానికి వినియోగించుకోడం న్యాయమైతే శిష్యులు పరిశుద్ధ సబ్బాతు ఘడియల్లో వెన్నులు తుంపుకుని తమ ఆకలిని తీర్చుకోడం తప్పుకాదు. దేవాలయంలోని యాజకులు ఇతర దినాలకన్నా సబ్బాతు రోజునే ఎక్కువ పనిచేసేవారు. లౌకిక వ్యాపారపరంగా అదే శ్రమ పాపమౌతుంది. అయితే యాజకులు చేసే పని దేవుని సేవార్ధం జరిగే పని. క్రీస్తు విమోచన శక్తిని సూచించే ఆచార విధుల్ని వారు నిర్వర్తిస్తోన్నారు. వారి శ్రమ సబ్బాతు ఉద్దేశానికి అనుగుణమైన సేవ కాగా ఇప్పుడు క్రీస్తే వచ్చాడు. క్రీస్తు సేవను చేయ్యడంలో శిష్యులు దేవుని సేవను నిర్వహిస్తోన్నారు. ఈ కార్యసాధనకు అగత్యమైన పనిని సబ్బాతు దినాన్న చేయడం తప్పు కాదు. DATel 302.1

అన్నిటికన్నా ప్రధానమైంది దేవుని సేవేనని తన శిష్యులికీ తన శత్రువులికీ క్రీస్తు బోధించాడు. మానవుల్ని రక్షించడమే ఈ లోకంలో దేవుని సేవా లక్ష్యం. కాబట్టి ఈ కార్యసిద్ధి నిమిత్తం సబ్బాతు రోజన చేయడం అవసరమైన పని సబ్బాతు నిబంధనకు అనుకూలమేగాని ప్రతికూలంకాదు. తానే “విశ్రాంతి దినమునకు ప్రభువు” నన్న ప్రకటనతో యేసు తన వాదనను ముగించాడు. అంటే అన్ని ప్రశ్నలకూ సమస్త చట్టానికి ఆయన మిన్న అన్నమాట. ఏ చట్టం శిష్యులు ఉల్లంఘించినట్లు యూదులు ఆరోపిస్తోన్నారో దాని ప్రకారమే శిష్యులు నిర్దోషులని ఆ దివ్య న్యాయాధిపతి ప్రకటించాడు. DATel 302.2

తన ప్రత్యర్థుల్ని మందలించడంతోనే యేసు ఆ అంశాన్ని విడిచి పెట్టలేదు. తమ గుడ్డితనంలో వారు సబ్బాతు ఉద్దేశాన్ని అపార్ధం చేసుకున్నారని విమర్శించాడు. ఆయన ఇలా అన్నాడు, “కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అనువాక్యభాగము మీకు తెలిసియుంటే నిర్దోషులను దోషులని తీర్పు చెప్పకపోదురు.” మత్త 12:7. చిత్తశుద్ధి గల దైవభక్తిని సూచించే సత్యసంధత ప్రేమానురాగాల లోటును వారి ఆచారాలు కర్మకాండ భర్తీ చెయ్యలేవని వారిని హెచ్చరించాడు. DATel 302.3

కేవలం బలులర్పించడం నిరర్ధకమని క్రీస్తు పునరుద్ఘాటించాడు. అవి లక్ష్య సాధనకు మార్గమేగాని అవే లక్ష్యం కాదు. వాటి లక్ష్యం మనుషుల్ని రక్షకుని వద్దకు నడిపించడం. ప్రేమతో కూడిన సేవను మాత్రమే దేవుడు గుర్తిస్తాడు. ఇది లోపించిన ఆచారతతంగం ఆయనకు హేయం. సబ్బాతు విషయంలో ఇదే వాస్తవం. దేవునితో మనుషులకు సహృదయత సామరస్యం నెలకొల్పేందుకే సబ్బాతు ఏర్పాటయ్యింది. అయితే మనసు ఆయాసకరమైన ఆచారాలు కర్మకాండలో మునిగి ఉన్నప్పుడు సబ్బాతు లక్ష్యం మరుగున పడింది. దాని బాహ్యాచరణ హాస్యాస్పదమయ్యింది. DATel 302.4

ఇంకో సబ్బాతు దినాన యేసు ఓ సమాజమందిరంలోకి వెళ్తున్నప్పుడు ఓ ఊచ చెయ్యి గలవాణ్ని చూశాడు. యేసు ఏంచేస్తాడా అని పరిసయ్యులు ఆత్రంగా కనిపెట్టొన్నారు. సబ్బాతు రోజన స్వస్తపర్చితే తన్నువారు నేరస్తుడిగా పరిగణిస్తారని యేసు ఎరుగును. అయినా సబ్బాతుకు అడ్డుగోడలుగా నిలిచిన సాంప్రదాయక నిషేదాల్ని కూలదొయ్యడానికి ఆయన వెనుదీయలేదు. లేచి నిలబడమని ఆ ఊచ చెయ్యిగలవాణ్ని యేసు ఆదేశిస్తూ ఇలా అన్నాడు. “ప్రాణ రక్షణ ధర్మమా? ప్రాణహత్య ధర్మమా?” అవకాశమున్నప్పుడు ఒక వ్యక్తి మేలు చేయగలిగి ఉండి కూడా చేయ్యకపోడం చెడు చెయ్యడంతో సమానం అన్న నీతి సూత్రాన్ని యూదులు పాటించేవారు. ప్రాణం కాపాడకపోవడం నిర్లక్ష్యం చెయ్యడం నరహత్యతో సమానమని నమ్మేవారు. క్రీస్తు ఇలా రబ్బీల కంటిని వాళ్ల వేలుతోనే పొడిచాడు. “ఆయన వారి హృదయకాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూచి నీచెయ్యి చాపుమని ఆ మనుష్యునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను.” మార్కు 3:4,5; DATel 303.1

“విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా?” అని ప్రశించినప్పుడు యేసు ఈ సమాధానం ఇచ్చాడు, “నాలో ఏ మనుష్యునికైనను నొక గొట్టెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన యెడల దాని పట్టుకొని పైకి తీయరా? గొట్టె కంటె మనుష్యుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే!” మత్త 12:10-12. DATel 303.2

ఆ గూఢచారులు జనసమూహం సమక్షంలో క్రీస్తుకి జవాబు చెప్పడానికి భయపడ్డారు. కష్టాల్లో చిక్కుకుంటామన్న గుబులు పట్టుకొంది. తమ సంప్రదాయాల్ని అతిక్రమించే కన్నా బాధపడున్న వాణ్ని వారు అలాగే ఉంచుతారు. కాని ఓ జంతువుని మాత్రం బయటికి తీస్తారు. ఎందుకంటే దాన్ని నిర్లక్ష్యం చేస్తే దాని సొంత దారుడికి నష్టంకలుగుతుంది. ఇలా దేవుని స్వరూపంలో సృష్టి అయిన మానవుడి కంటే ఓ జంతువుకు ఎక్కువ విలువుంది. తప్పుడు మతం ఎలా పనిచేస్తుందో దానికి ఇదో ఉదాహరణ. మానవుడు దేవునికన్నా తన్నుతాను హెచ్చించుకోవాలన్న ఆకాంక్ష వల్ల ఈ తప్పుడు మతాలు ఆరంభమవుతాయి. అయితే అవి మానవుణ్ని నోరులేని జంతువు కన్నా తక్కువ స్థాయికి దిగజార్చుతాయి. దేవుని సార్వభౌమాధికారానికి ఎదురు తిరిగే ప్రతీ మతం సృష్టిలో మనుషుడికున్నట్టి, క్రీస్తులో మనుషుడికి పునరుద్ధరించబడనున్నట్టి, మహిమను అపహరిస్తుంది. మానవావసరాలు కష్టాలు బాధలు హక్కుల విషయంలో ఉదాసీన వైఖరి ప్రదర్శించాలని ప్రతీ తప్పుడు మతం తన విశ్వాసులకి ఉద్బోధిస్తుంది. తన రక్తం చిందించి క్రీస్తు కొన్న మనవాళికి సువార్త ఎంతో విలువనిస్తోంది. అవసరాల్లోను బాధలు దుఃఖంలోను ఉన్న మనుషుల పట్ల సానుభూతి ప్రదర్శించాలని సువార్త బోధిస్తోంది. ప్రభువంటున్న మాటలు వినండి, ” ఓఫీరు దేశపు సువర్ణముకంటె నరులను అరుదుగా ఉండజేసెదను.” యెషయా 13:12. DATel 303.3

విశ్రాంతి దినాన మేలు చేయడం న్యాయమా? కీడు చెయ్యడం న్యాయమా? ప్రాణ రక్షణ ధర్మమా? ప్రాణ హత్య ధర్మమా? అని యేసు పరిసయ్యుల్ని నిగ్గదీసినప్పుడు వారి దుష్ట సంకల్పాల్ని బట్టబయలు చేశాడు. వారు ఆయన్ని ద్వేషించి చంపాలని చూస్తున్నారు. అయితే ఆయన అనేకుల ప్రాణాల్ని రక్షిస్తూ వేల ప్రజలకు సంతోషానందాలు పంచుతున్నాడు. వారు యోచిస్తున్నట్లు సబ్బాతు నాడు చంపడం మేలా? లేక ఆయన చేస్తున్నట్లు వ్యాధిగ్రస్తుల్ని స్వస్తపర్చడం మేలా? దేవుని పరిశుద్ధ దినాన హృదయంలో హత్యా యోచనలు చేయడం మంచిదా? లేక కృపాకార్యాల ద్వారా వెల్లడయ్యే ప్రేమను కలిగి ఉండడం మంచిదా? DATel 304.1

ఊచచేతి వ్యక్తిని స్వస్తపర్చడంలో యేసు యూదుల ఆచారాన్ని ఖండించి నాల్గో ఆజ్ఞను దేవుడిచ్చిన స్థానంలో నిలబెట్టాడు. “విశ్రాంతి దినమున మేలు చేయుటధర్మమే.” అని వెల్లడించాడు. యూదులు విధించిన అర్ధరహిత ఆంక్షల్ని తొలగించడం ద్వారా క్రీస్తు సబ్బాతును ఘనపర్చాడు. ఆయన్ని గురించి ఫిర్యాదులు చేస్తున్న వారు దేవుని పరిశుద్ధ దినాన్ని కించపర్చారు. DATel 304.2

క్రీస్తు ధర్మశాస్త్రాన్ని రద్దు పర్చాడని బోధించేవారు ఆయన సబ్బాతును మిరాడని శిష్యుల ఉల్లఘననుకూడా ఆయన సమర్ధించాడని బోధిస్తుంటారు. ఇలా వీరు కూడా యూదుల్లాగే ఈ విషయంలో వ్యవహరిస్తుంటారు. ఇందులో వారు క్రీస్తు ఇచ్చిన ఈ సాక్ష్యాన్ని ఖండిస్తోన్నారు, “నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి” ఉన్నాను. యోహాను 15:10. రక్షకుడు గాని ఆయన శిష్యులుగాని సబ్బాతును ఉల్లంఘించలేదు. తన జీవిత చరిత్రలో ఆయన సబ్బాతును మారినట్లును ఎక్కడా లేదు. తనను చంపడానికి తరుణం కోసం ఎదురు చూస్తోన్న సాక్షుల జాతి వంకచూస్తూ “నాయందు పాపామున్నదని మీలో ఎవడు స్థాపించును?” అని ఆయన తిరుగులేకుండా ప్రశ్నించగలిగాడు. యోహను 8:46. DATel 305.1

పితరులు ప్రవక్తలు పలికిన మాటల్ని రద్దుచెయ్యడానికి రక్షకుడు ఈ లోకానికి రాలేదు. ఎందుచేతనంటే ఈ ప్రతినిధుల ద్వారా మాట్లాడింది ఆయనే. దైవ వాక్యంలోని సత్యాలన్నీ ఆయన ఇచ్చినవే. అయితే సత్యమనే ఈ ఆణి ముత్యాల్ని తప్పుడు నేపథ్యంలో పెట్టడం జరిగింది. వాటి అమూల్యమైన వెలుగును అబద్దానికి మద్దతుగా వినియోగించారు. ఆసత్యాల్ని తమ తప్పుడు నేపథ్యంలో నుంచి తీసివేసి తిరిగి వాటిని సత్యం చట్రంలో పెట్టాలని దేవుడు ఆకాంక్షించాడు . ఈ కార్యాన్ని దైవ హస్తం మాత్రమే నిర్వహించగలదు. అబద్దంతో తన సంబంధవల్ల సత్యం అపవాది పనికి దోహదం చేస్తూ వచ్చింది. దేవునికి మహిమ కలిగేటట్లు మానవాళికి రక్షణ చేకూర్చేటట్లు సత్యాన్ని దాని స్థానంలో నిలపడానికి క్రీస్తు వచ్చాడు. DATel 305.2

“విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు” అన్నాడు యేసు. దేవుడు స్థాపించిన వ్యవస్థలు మానవాళి హితం కోసం స్థాపితమయ్యాయి. “సమస్తమైనవి ఈ కొరకై యున్నవి.” “పౌలైనను కేఫాయైనను లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవి యైనను, రాబోవునవియైనను సమస్తము మీవే. మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు;” 2 కొరి 4:13; 1 కొరి3:22, 23. సబ్బాతు ఓ భాగమై ఉన్న పది ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని దేవుడు తన ప్రజల శ్రేయాన్నికోరి ఇచ్చాడు. మోషే ఇలా అన్నాడు, “మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటివలె మనలను బ్రదికించునట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి యీ కట్టడలనన్నిటిని గైకొనవలెనని మన కాజ్ఞాపించెను. ” ద్వితీ 6:24. కీర్తన కారుడి ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఈ వర్తమానం ఇచ్చాడు, “సంతోషముతో యెహోవాయే దేవుడని తెలిసికొనుడి. ఆయన మనలను పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము. ఆయన మేపు గొట్టెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి.” కీర్త 100:2-4. “విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండ” ఆచరించే వారందరిని “నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొనివచ్చెదను. నా ప్రార్ధన మందిరములో వారిని ఆనందింపజేసేదను” అంటున్నాడు ప్రభువు. యెషయా 56:6, 7. DATel 305.3

“అందువలన మనుష్యకుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నాడు.” ఇవి ఉపదేశంతోను ఆదరణతోను నిండిన మాటలు. సబ్బాతు మానవుడి కోసం నియమితమయ్యింది గనుక అది ప్రభువు దినం. ఎందుకనగా “సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు.” యెహోను 1:3. సమస్తం ఆయనే చేశాడు గనుక సబ్బాతును ఆయనే చేశాడు. సృష్టి కార్యానికి చిహ్నంగా ఆయన సబ్బాతును ప్రత్యేకించాడు. ఆయన సృష్టికర్త అని పవిత్ర పర్చేవాడు అని సబ్బాతు సూచిస్తోంది. ఇహ పరలోకాల్లో సమస్తాన్ని సృజించిన ఆయన ఎవరు సమస్తాన్ని తన చేతిలో ఉంచుకుని అదుపు చేస్తున్నాడో ఆయన సంఘానికి శిరసు అని, ఆయన శక్తి మూలంగానే మనం దేవునితో సమాధానపడుతున్నామని సబ్బాతు ‘సూచిస్తోంది. ఇశ్రాయేలు గురించి ప్రస్తావిస్తూ ఆయన ఇలా అన్నాడు, “యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలిసికొనునట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని.” యెహె 20:12. మనల్ని పవిత్రపర్చడానికి క్రీస్తుకు శక్తి ఉన్నదని చెప్పడానికి సబ్బాతు ఒక చిహ్నం. కనుక క్రీస్తు ఎవరిని అయితే పవిత్రపర్చుతాడో వారందరికీ ఆయన సబ్బాతు నిచ్చాడు. పవిత్రపర్చే ఆయన శక్తికి సూచన అయిన సబ్బాతు క్రీస్తు ద్వారా దేవుని ఇశ్రాయేలులో భాగమయ్యే వారందరికీ చెందుతుంది. DATel 306.1

ప్రభువిలా అంటున్నాడు, “విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్టితమైన దినమని నీవు ఊరకుండిన యెడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని... ఆచరించిన యెడల... నీవు యెహోవా యందు ఆనందించెదవు.” యెషయా 58:13, 14. క్రీస్తు సృజనశక్తికి విమోచనశక్తికి చిహ్నంగా సబ్బాతును స్వీకరించేవారందరికీ అది ఆనందాన్నిస్తుంది. సబ్బాతులో క్రీస్తును వీక్షిస్తూ వారు ఆయనయందు ఆనందిస్తారు. ఆయన మహాశక్తికీ ఆయన ఇచ్చే విమోచనకీ నిదర్శనగా సృష్టిని సబ్బాతు వారికి చూపిస్తుంది. గతించిపోయిన ఏదెను శాంతిని స్పురణకుతెస్తూ క్రీస్తు ద్వారా తిరిగి లభించనున్న శాంతిని గురించి సబ్బాతు ప్రస్తావిస్తుంది. “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నాయొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.” (మత్త 11:28) అన్న ఆయన ఇస్తున్న ఆహ్వానాన్ని ప్రకృతిలోని ప్రతి వస్తువు మళ్లీ మళ్లీ అందిస్తుంది. DATel 307.1