యుగయుగాల ఆకాంక్ష

29/88

28—లేవీ మత్తయి

పాలస్తీనాలో ఉన్న రోమా అధికారులందరిలోను సుంకరుల పట్ల ఉన్నంత ద్వేషభావం మరెవరి పట్లా లేదు. ఒక విదేశాధికారం సుంకాలు విధించడమన్నది యూదులికి నిత్యం ఆగ్రహవేశాలు పుట్టిస్తోన్న అంశం. తమ స్వాతంత్ర్యం పోయిందని వారికి అది జ్ఞాపకం చేస్తోంది. సుంకరులు కేవలం రోమా ప్రభుత్వ హింసకు సాధనాలు మాత్రమే కాదు. వారు సొంతంగా బలవంతపు వసూళ్లకు పాల్పడేవారు. ప్రజల సొమ్మును దోచుకుని ఆస్తిపరులయ్యేవారు. రోమా ప్రభుత్వమిచ్చే ఈ హోదాని స్వీకరించే యూదుడు తన జాతి గౌరవాన్ని అమ్ముకున్నవాడిగా పరిగణన పొందేవాడు. ప్రజలు అతణ్ని మతభ్రష్టుడుగా పరిగణించి సమాజ వ్యతిరేకశక్తిగా జమకట్టేవారు. DATel 285.1

ఈ తరగతికి చెందినవాడే లేవీ మత్తయి. గెన్నేసంతు వద్ద నలుగురు శిష్యుల్ని పిలిచిన తర్వాత క్రీస్తు ఇతణ్ని తన సేవకు పిలిచాడు. మత్తయిపై అతడి వృత్తిని బట్టి పరిసయ్యులు తమ తీర్పును వెలువరించారు. కాని యేసు ఈ మనిషిలో సత్యానికి స్పందించే మనసును చూశాడు. మత్తయి రక్షకుని బోధను విన్నాడు. దేవుని ఆత్మ అతడికి తన పాపస్థితిని గూర్చిన వాస్తవికతను బయలుపర్చినప్పుడు క్రీస్తు సహాయాన్ని కోరాలని ఆశించారు. కాని అతడు రబ్బీలు అవలంబించిన వేర్పాటు విధానానికి అలవాటు పడ్డవాడు. ఈ గొప్ప బోధకుడు తనను గుర్తిస్తాడన్న తలంపు అతడికి తట్టలేదు. DATel 285.2

తన సుంకపు గల్లా వద్ద కూర్చుని మత్తయి వస్తోన్న యేసును చూశాడు. “నన్ను వెంబడించుము” అంటూ తన్ను ఉద్దేశించి ఆయన అన్నమాటలు విన్న ఆ సుంకరి విస్మయం చెందాడు. DATel 285.3

మత్తయి “లేచి ఆయనను వెంబడించెను.” వెనకాడడం గాని ప్రశ్నించడం గాని లాభసాటి వ్యాపారానికి ప్రతిగా పేదరికాన్ని శ్రమల్ని ఎంపిక చేసుకోడం గురించిన తలంపు గాని లేదు. యేసుతో ఉండడం, ఆయన మాటలు వినడం, ఆయన పరిచర్యలో ఆయనతో కలిసి పనిచెయ్యడం ఇదే పదివేలు. DATel 286.1

ఇంతకు ముందు పిలువు పొందిన శిష్యుల ధోరణీ ఇదే. పేతురుని అతని సహచరుల్ని తన్ను వెంబడించాల్సిందని యేసు పిలిచినప్పుడు వారు తమ పడవల్ని వలల్ని విడిచి పెట్టి ఆయన్ని వెంబడించారు. ఈ శిష్యుల్లో కొందిరికి మిత్రులున్నారు. వారు వీరిమీద ఆధారపడి నివసిస్తోన్నారు. అయినా రక్షకుని ఆహ్వానం వచ్చినప్పుడు వారు వెనకాడలేదు. నేనెలా జీవించాలి? నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి. అని ప్రశ్నించలేదు. వారు ఆ పిలువుకు విధేయులయ్యారు. అనంతరం “సంచియు జాలేయు చెప్పులును లేకుండ నేను మిమ్మును పంపినప్పుడు, నాకు ఏమైనను తక్కువాయెనా?” అని యేసు అడిగినప్పుడు, “ఏమియు తక్కువ కాలేదు.” అని వారు జవాబు చెప్పారు. లూకా 22:35. DATel 286.2

ధనికుడు మత్తయికి పేదరికంలో ఉన్న అంద్రేయకు పేతురుకు వచ్చిన పరీక్ష ఒక్కటే. వీరిలో ప్రతీ ఒక్కరు చేసిన సమర్పణ ఒకలాంటిదే. వలలు చేపలతో నిండి జయం రావడంతో పాత జీవిత ఉద్వేగాలు బలంగా ఉన్న సమయంలో సముద్రంలో ఉన్న శిషుల్ని తమ సర్వస్వం సువార్త సేవ నిమిత్తం విడిచిపెట్టాల్సిందిగా యేసు కోరాడు. అలాగే లోక సంబంధమైన మేలు పైనా? లేక క్రీస్తుతో సహవాసం పైనా? దేనిపై తన ఆసక్తి అన్న అంశం మీద ప్రతీ ఆత్మకు పరీక్ష వస్తుంది. DATel 286.3

నియమం ఎల్లప్పుడూ ఖచ్చితమైంది. ఒక వ్యక్తి తన పూర్ణ హృదయం పని మీద పెట్టి క్రీస్తును గూర్చిన జ్ఞానం నిమిత్తం సమస్తం నష్టంగా ఎంచితేనే తప్ప అతడు దేవుని సేవలో విజయం సాధించడం దుర్లభం. అలాంటి మినహాయింపులు చేసే వ్యక్తి క్రీస్తుకు శిష్యుడు కాలేడు. ఆయనతో జత పనివాడు అంతకంటే కాలేడు. మనుషులు ఈ మహా రక్షణను అభినందించినప్పుడు క్రీస్తు జీవితంలో కనిపించిన త్యాగం వారి జీవితాల్లోను కనిపిస్తుంది. ఆయన నడిపించే మార్గంలో వారు ఆనందంగా సాగుతారు. DATel 286.4

మత్తయిని తన శిష్యుల్లో ఒకడిగా క్రీస్తు పిలవడం ఆగ్రహాన్ని పుట్టించింది. ఒక మత ప్రబోధకుడు తన సహచరుడిగా ఒక సుంకరిని ఎంపిక చేసుకోవడం మత, సాంఘిక, జాతీయ ఆచార వ్యవహారాలకు విరుద్ధం. ప్రజల దురభిమానాన్ని రెచ్చగొట్టడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని యేసుకు వ్యతిరేకంగా మళ్లించాలన్నది పరిసయ్యుల ఆశాభావం. DATel 287.1

సుంకరుల హృదయాల్లో గొప్ప ఆసక్తి రగుల్కొంది. వారి హృదయాలు ఈ దివ్యబోధకుని తట్టు తిరిగాయి. నూతనంగా క్రీస్తుకు శిష్యుడైన ఆనందంలో మత్తయి తన పూర్వ సహచరుల్ని యేసు వద్దకు తీసుకురావాలని అభిలషించాడు. కనుక తన ఇంటివద్ద అతడు ఓ విందు ఏర్పాటు చేశాడు. దానికి తన బంధువుల్ని స్నేహితుల్ని ఆహ్వానించాడు. సుంకరుల్ని మాత్రమే కాక సమాజానికి ఇరుగు పొరుగులకు హితులు కాని అనేక మందిని కూడా మత్తయి ఆహ్వానించాడు. DATel 287.2

ఆ విందు వినోదం యేసు గౌరవార్థం ఏర్పాటు చేశాడు మత్తయి. యేసు ఆహ్వానాన్ని అంగీకరించాడు. అది పరిసయ్యులికి అభ్యంతరకరంగా ఉంటుందని ప్రజల దృష్టిలో తన గౌరవాన్ని భంగపర్చుతుందని ఆయనకు తెలుసు. అయితే విధాన సంబంధిత సమస్యలు ఆయన ఉద్యమాల్ని ప్రభావితం చెయ్యలేవు. వెలపలి ప్రత్యేకతలకు విశిష్టతలకు ఆయన విలువనివ్వలేదు. జీవ జలం కోసం దప్పిగొన్న ఆత్మ మాత్రమే ఆయన హృదయాన్ని ఆకట్టుకుంది. DATel 287.3

సుంకరుల విందులో యేసు గౌరవనీయ అతిధిగా కూర్చున్నాడు. తన సానుభూతి వల్ల సాంఘిక దయాళుత్వం వల్ల తాను మానవత్వాన్ని గౌరవిస్తోన్నట్లు కనపర్చాడు. మనుషులు ఆయన ఉంచిన నమ్మకానికి యోగ్యులుగా నివసించడానికి ఆశించారు. దప్పిగొన్నవారి హృదయాలికి ఆయన మాటలు జీవశక్తి గల దీవెనగా వినిపించాయి. నూతన భావోద్రేకాలు మేల్కొన్నాయి. సమాజం వెలివేసిన ఈ వర్గ ప్రజలు నూతన జీవావకాశం పొందడానికి మార్గం ఏర్పడింది. DATel 287.4

ఇలాంటి సమావేశాల్లో రక్షకుని బోధను అంగీకరించినవారు చాలామంది. కాని ఆయన్ని తన ఆరోహణం తర్వాతే స్వీకరించారు. పరిశుద్ధాత్మ కుమ్మరింపుజరిగి ఒక్కరోజున మారుమనసుపొందిన మూడువేల మందిలో అనేకులు సత్యం గురించి మొట్టమొదటిసారి విన్నవారే. వారు ఈ సుంకరి విందులో పాల్గొన్నారు. వీరిలో కొందరు సువార్త దూతలయ్యారు. విందులో యేసు ఆదర్శం మత్తయికి జీవితమంతా ఓ పాఠంగా నిలిచింది. ద్వేషానికి తృణీకారానికి గురి అయిన సుంకరి అంకిత భావంతో సేవ చేసిన సువార్తికుడయ్యాడు. తన పరిచర్యలో అతడు తన ప్రభువు అడుగుజాడల్లో నమ్మకంగా నడిచాడు. DATel 287.5

మత్తయి విందులో యేసు పాల్గొన్నట్లు రబ్బీలు తెలుసుకున్నప్పుడు దాన్ని అవకాశంగా తీసుకుని ఆయనపై నేరం మోపడానికి ప్రయత్నించారు. అయితే ఆ పని శిష్యుల ద్వారా చెయ్యడానికి పూనుకున్నారు. శిష్యుల దురభిమానాన్ని రెచ్చగొట్టడం ద్వారా వారిని తమ ప్రభువు నుంచి విడదీయడానికి ప్రయత్నించారు. శిష్యుల వద్ద క్రీస్తుని నిందించడం క్రీస్తు వద్ద శిష్యుల్ని నిందించడం వారు ఎంపిక చేసుకున్న విధానం. ఇలా తమ బాణాలు గాయపర్చాల్సిన చోట గుచ్చుకోవాలన్నది వారి ఎత్తుగడ. పరలోకంలోని సంఘర్షణ నాటి నుంచి సాతాను కార్యాచరణ విధానం ఇదే. అసమ్మతి వేర్పాటు సృష్టించే వారందరూ ఈ స్వభావం నడుపుదల కిందే పనిచేస్తారు. DATel 288.1

“మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు భోజనము చేయుచున్నాడు?” అని ప్రశ్నించారు రబ్బీలు. DATel 288.2

ఆ ఆరోపణకు శిష్యులు సమాధానం చెప్పే వరకు ఆగక యేసే వారికి ఇలా బదులిచ్చాడు. “రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు గదా. అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడి.” పరిసయ్యులు ఆధ్యాత్మికంగా ఆరోగ్యం గల వారమని సుంకరులు అన్యజనులు రోగగ్రస్తమైన ఆత్మలతో మరణించే వారని పరిగణించారు. అందుచేత తన సహాయం అవసరమైన తరగతి ప్రజల వద్దకు వెళ్లడం వైద్యుడుగా తన కర్తవ్యం కాదా? DATel 288.3

పరిసయ్యులు తమ గురించి ఎంతో గొప్పగా తలంచినప్పటికీ తాము తృణీకరించే వారికన్నా వారు ఎంతో ఆధ్వానస్థితిలో ఉన్నారు. సుంకరులు పరిసయ్యులంత దురభిమానులు అహంకారులు కారు. కనుక సత్యం విషయంలో ఎక్కువ సుముఖంగా ఉన్నారు. రబ్బీలనుద్దేశించి యేసు ఇలా అన్నాడు, “కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడి.” దేవుని వాక్యాన్ని విశదీకరించే వారమని చెప్పుకొంటున్న తాము దాని స్ఫూర్తి విషయంలో అజ్ఞానులని వారికి ఈ విధంగా చూపించాడు. DATel 288.4

పరిసయ్యులు కొంత కాలం మౌనంగా ఉన్నారు. కాని వారిలోని శత్రుత్వం పండుతూనే ఉంది. అనంతరం వారు బాప్తిస్మమిచ్చే యోహాను శిష్యుల్ని వెదకి వారిని రక్షకునికి వ్యతిరేకంగా కూడగట్టుకోడానికి ప్రయత్నించారు. ఈ పరిసయ్యులు స్నానికుడి పరిచర్యను అంగీకరించలేదు. అతడి మిత జీవనాన్ని అతడి సాధారణ అలవాట్లను, అతడి వస్త్రాల్ని ఎగతాళిగా ప్రస్తావించి అతడిపై మతఛాందసుడిగా ముద్రవేశారు. దేవుని ఆత్మ ఈ అపహాసకుల హృదయాల్లో పనిచేసి వారిలో పాప స్పృహ కలిగించాడు. అయితే వారు దేవుని హిత వాక్యాల్ని నిరాకరించారు. యోహాన్ని దయ్యం పట్టిన వాడని ప్రకటించారు. DATel 289.1

ఇప్పుడు యేసు ప్రజలతో కలిసి ఉంటూ వారితో కలిసి భోజన పానాలు చేస్తుంటే ఆయన్ని తిండిబోతు అని తాగుబోతు అని విమర్శించారు. ఈ ఆరోపణ చేసిన వారే అపరాధులు. సాతాను దేవుని మీద అపోహలు కల్పించి తన దారుణాల్ని ఆయనకు ఆపాదించాడు. అలాగే ఈ దుష్టులు ప్రభువు సేవకుల్ని తప్పుడు మనుషులుగా చిత్రికరించారు. DATel 289.2

చీకటిలో ఉన్న వారికి పరలోకపు వెలుగును చూపించడానికే యేసు సుంకరులతోను పాపులతోను భోజనం చేస్తున్నాడని పరిసయ్యులు నమ్మలేదు. ఆ పరమ బోధకుడు పలికే ప్రతీ మాట జీవం గల విత్తనమని అది మొక్కయి దేవుని మహిమార్ధం ఫలాలు ఫలిస్తుందని వారు గ్రహించలేదు. వెలుగును స్వీకరించకూడదని వారు నిశ్చయించుకున్నారు. స్నానికుడైన యోహాను పరిచర్యను వ్యతిరేకించినా అతని శిష్యులతో స్నేహం చెయ్యడానికి సిద్ధమయ్యారు. క్రీస్తుకు వ్యతిరేకంగా పని చెయ్యడంతో వీరు సహకరిస్తారన్నదే వారి ఆశాభావం. యేసు సనాతన సంప్రదాయాల్ని కాలరాస్తున్నాడని వారు ఆరోపించారు. నిషా గర్విష్టుడు భక్తి పరుడు అయిన యోహానుకీ, సుంకరులు పాపులతో తినితాగే యేసుకు మధ్య ఎంతో వ్యత్యాసముందని విమర్శించారు. DATel 289.3

ఈ సమయంలో యోహాను శిష్యులు దుఃఖంలో ఉన్నారు. అది యోహాను వర్తమానంతో వారు యేసు వద్దకు వెళ్లకముందు. తమ ప్రియ బోధకుడు చెరసాలలో ఉన్నాడు. ఆ కాలమంతా వారు అతని కోసం దుః ఖించారు. యోహాన్ని విడిపించడానికి యేసు ఎలాంటి ప్రయత్నమూ చెయ్యడం లేదు. దానికి తోడు ఆయన యోహాను బోధనకు ఏమంత గుర్తింపునిచ్చినట్లు కనిపించలేదు. యోహానుని దేవుడు పంపిఉంటే యేసు ఆయన శిష్యులు అంత వ్యత్యాసమైన మార్గాన్ని ఎందుకు అవలంబిస్తున్నారు? DATel 290.1

యోహాను శిష్యులికి యేసు పరిచర్యను గూర్చి స్పష్టమైన అవగాహన లేదు. పరిసయ్యుల ఆరోపణలలో కొంత వాస్తవం ఉండవచ్చునని భావించారు. రబ్బీలు శాసించిన నిబంధనల్లో చాలా వాటిని ఆచరించి ధర్మశాస్త్ర క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్పు పొందుతామని కూడా వారు నమ్మారు. యూదులు ఉపవాసాన్ని నీతి క్రియగా విధించారు. వారిలో నిష్టగలవారు వారంలో రెండు దినాలు ఉపవాసం ఆచరించారు. “యోహాను శిష్యులును పరిసయ్యుల శిష్యులును ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమి?” అని యేసుని ప్రశ్నించినప్పుడు యేసు వారికి మృదువుగా జవాబు చెప్పాడు. ఉపవాసం గురించి వారి తప్పుడు అభిప్రాయాల్ని సరిదిద్దడానికి ప్రయత్నించలేదు. కాని తన పరిచర్యను గురించి వారికి సరి అయిన అవగాహనను మాత్రమే ఇచ్చాడు. ఈ పనిని చెయ్యడంలో తన్ను గూర్చిన సాక్ష్యంలో యోహాను ఏ ఛాయా రూపకాన్ని ఉపయోగించాడో దాన్నే యేసు ఉపయోగించాడు. యోహాను ఇలా అన్నాడు, “పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు; అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినెడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును.” యోహాను 3:29. ఆ ఉదాహరణలోని మాటల్ని ఉపయోగించి, “పెండ్లి కుమారుడు తమతో కూడ ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదగునా?” అని యేసు అన్నాడు. DATel 290.2

పరలోక రాకుమారుడు తన ప్రజల మధ్య ఉన్నాడు. తన అత్యుత్తమ వరం దేవుడు ఈ లోకానికిచ్చాడు. పేదలకు ఆనందం ఎందుకంటే వారిని తన రాజ్యానికి వారసులుగా చెయ్యడానికి ఆయన వచ్చాడు. ధనవంతులకు ఆనందం ఎందుకంటే నిత్య ఐశ్వర్యం ఎలా సంపాదించాలో వారికి ఆయన బోధిస్తాడు. జ్ఞానం లేని వారికి ఆనందం అయన వారికి రక్షణ జ్ఞానాన్నిస్తాడు. జ్ఞానులకు ఆనందం అంతుచిక్కని మర్మాల్ని ఆయన వారికీ బహిర్గతం చేస్తాడు. లోకారంభం నుంచి మరుగైఉన్న సత్యాలు మానవులకు వెల్లడి చెయ్యడం రక్షకుని పరిచర్య పరమోద్దేశం. DATel 291.1

రక్షకుణ్ని వీక్షించడం స్నానికుడైన యోహనుకి ఎంతో ఆనందాన్నిచ్చింది. పరలోక సర్వాధినేతతో కలిసి నడవడం మాట్లాడడం శిష్యులకు కలిగినంత గొప్ప అధిక్యత! ఇది వారు దుఃఖించడానికి ఉపవాసముండడానికి సమయం కాదు. ఆయన మహిమను స్వీకరించడానికి గాను, వారు తమ హృదయాల్ని తెరవవలసిన సమయం. చీకటిలోను మరణఛాయలోను మగ్గుతోన్న ప్రజలకు ఆ వెలుగును ప్రకాశింపజేయాల్సిన సమయం. DATel 291.2

యేసు మాటలు చిత్రించింది ఉజ్వలమైన పటం. కాని దాని కడ్డంగా ఉంది ఓ నల్లని నీడ. దాన్ని ఆయన కన్ను మాత్రమే చూడగలిగింది. “పెండ్లి కుమారుడు వారి యొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును; ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు.” అన్నాడు. శిష్యులు తమ ప్రభువు అప్పగింతకు సిలువ వేతకు గురికావడం చూసినప్పుడు వారు దుఃఖించడం ఉపవాసముండడం జరుగుతుంది. మేడపై గదిలో వారితో ఆయన చివరగా మాట్లాడినప్పుడు ఇలా అన్నాడు, “కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకనితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” యోహాను 16:19, 20. DATel 291.3

ఆయన సమాధిలో నుంచి బయటికి వచ్చినప్పుడు వారి దుఃఖం సంతోషంగా మారుతుంది. తన ఆరోహణానంతరం ఆయన వ్యక్తిగతంగా వారి మధ్య ఉండడు. కాని ఆదరణ కర్త ద్వారా ఆయన వారితో ఉంటాడు. అందుచేత వారు దుఃఖించవలసిన పనిలేదు. సాతాను కోరింది ఇదే. తాము మోసపోయి నిరాశ చెందామన్న అభిప్రాయాన్ని వారు ప్రపంచానికివ్వాలని అతడి కోరిక. అయితే వారు విశ్వాసమూలంగా పరలోకమందున్న గుడారాన్ని చూడాల్సి ఉన్నారు. ఆ గుడారంలో యేసు వారికోసం పరిచర్య చేస్తోన్నాడు. ఆయన ప్రతినిధి అయిన పరిశుద్దాత్మకు తమ హృదయాల్ని తెరచి ఆయన సన్నిధి కాంతిలో సంతోషించాల్సి ఉన్నారు. అయినా, ఈ లోక నాయకులతోను చీకటి రాజ్య నేతలతోను సంఘర్షణ వచ్చినప్పుడు, వ్యక్తిగతంగా క్రీస్తు వారితో లేనప్పుడు, ఆదరణ కర్తను గ్రహించడంలో విఫలమైనప్పుడు, వారికి శోధనదినాలు శ్రమదినాలు వస్తాయి. అప్పుడు వారు ఉపవాసముండడం సమంజసం. DATel 291.4

తమ హృదయాలు అసూయతో పగతో పోట్లాటలతో నిండి ఉండగా ఆచారాలు లాంఛనాలు నిష్ఠగా ఆచరించడం ద్వారా పరిసయ్యులు తమ్మును తాము ఘనపర్చుకోడానికి వెంపర్లాడారు. లేఖనం ఇలా అంటోంది, “మీరు కలహపడుచు నినాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. నా కంఠధ్వని వినబడునట్లుగా మారిప్పుడు ఉపవాసముండరు. అట్టి ఉపవాసము నాకనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధ పరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్టకట్టుకొని బూడిద పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా?” యెష 58:4, 5. DATel 292.1

నిజమైన ఉపవాసం కేవలం ఒక ఆచారం కాదు. దేవుడు ఏర్పర్చుకున్న ఉపవాసం ఎలాంటిదో లేఖనం వివరిస్తోంది - “దుర్మార్గులు కట్టిన కట్టును విప్పుటయు కాడిమానుమోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు;” “ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపర”చుట. యెషయా 58:6, 10. క్రీస్తు పరిచర్య స్వరూప స్వభావాలు ఇక్కడ మనకు వెల్లడవుతున్నాయి. లోకాన్ని రక్షించేందుకు ఆయన యావజ్జీవితాన్ని త్యాగం చేశాడు. అరణ్యంలో ఉపవాసమున్నప్పుడు గాని లేదా మత్తయి ఇచ్చిన విందులో సుంకరులతో భోజనం చేసినప్పుడు గాని నశించిన వారిని రక్షించడానికి ఆయన తన జీవితాన్ని త్యాగం చేస్తోన్నాడు. యధార్ధమైన భక్తి పనిలేకుండా ప్రజాపించటంలో గాని శారీరకంగా హింసించుకోడంలో గాని ప్రదర్శితం కాదు. కాని దేవునికి మానవుడికి ఇష్టపూర్వకంగా సేవ చెయ్యడానికి ఒకడు తన్ను తాను సమర్పించుకోడమే నిజమైన భక్తి. DATel 292.2

యోహాను శిష్యులతో తన సంభాషణను కొనసాగిస్తూ యేసు ఓ ఉపమానాన్ని చెప్పాడు, “ఎవడును పాతబట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన యెడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరిఎక్కువగును.” యోహాను వర్తమానం సంప్రదాయంతోను మూఢనమ్మకంతోను కలగాపులగం కాకూడదు. పరిసయ్యుల టక్కరి భక్తిని యధార్ధ భక్తితో మిళితం చెయ్యడానికి యోహాను ప్రయత్నించడం వారిరువురి మధ్య ఉన్న దూరాన్ని మరింత పెంచుతుంది. DATel 293.1

క్రీస్తు బోధన నియమాలు పరిసయ్యుల ఆచారవ్యవహారాలతో ఏకీభవించలేదు. యోహాను బోధవల్ల ఏర్పడ్డ అంతరాన్ని క్రీస్తు మూసివేయలేదు. పాత కొత్తల మధ్య వేర్పాటును ఆయన మరింత స్పష్టం చేశాడు. “ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు పోసిన యెడల ద్రాక్షరసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులును చెడును” అంటూ యేసు ఈ విషయాన్ని మరింత సుబోధకం చేశాడు. కొత్త ద్రాక్షరసాన్ని ఉంచడానికి ఉపయుక్తమైన తోలు తిత్తుల్ని పాత్రలుగా వినియోగించేవారు. ఇవి కొంతకాలానికి ఎండిపోయి పెళుసుబారేవి. అప్పుడు అవి ద్రాక్షరసాన్ని ఉంచడానికి పనికి వచ్చేవి కావు. ఈ సుపరిచిత ఉదాహరణలో యేసు యూదు నాయకుల పరిస్థితిని వివరించాడు. యాజకులు, శాస్త్రులు, నేతలు ఆచారాలు సంప్రాదాయాల ఊబిలో కూరుకుపోయారు. ఎండిపోయిన చట్టపరమైన మతంతో తృప్తి చెంది ఉండగా వారు సజీవ పరలోక సత్యానికి సంగ్రహస్థానాలు కావడం అసాధ్యం. తమ సొంత నీతి సర్వ సమృద్ధమని, తమ మతానికి నూతనాంశాన్ని చేర్చుకోవాల్సిన అవసరం లేదని వారు భావించారు. మానవుల పట్ల దేవుని దయ అన్నది తమ ఇష్టాన్ననుసరించి వచ్చేది కాదని వారు గుర్తించలేదు. అది తమ సత్రియల వల్ల తమ అర్హతకు సంబంధించిన విషయమని వారి భావన. ప్రేమ మూలంగా పని చేస్తూ ఆత్మను పవిత్రపర్చే విశ్వాసం, ఆచార నియమాలు మానవ నిబంధనల సమాహారమైన పరిసయ్యుల మతం సంయుక్తం కావడానికి తావు లేదు. యేసు బోధనల్ని సంస్థాగత మతంతో ముడిపెట్టడానికి జరిగే ప్రయత్నాలు ఒంటి చేతి చప్పుళ్లే. దేవుని సత్యం, పులిసిన ద్రాక్షరసంలా, పరిసయ్యుల పాత, శిధిల సంప్రదాయ తిత్తుల్ని మిగిల్చివేస్తుంది. DATel 293.2

తాము జ్ఞానం గలవారం గనుక తమకు ఉపదేశం అవసరం లేదని, నీతిమంతులం గనుక తమకు రక్షణ అవసరం లేదని, గొప్ప గౌరవ మన్ననలున్న వారం గనుక తమకు క్రీస్తు నుంచి వచ్చే గౌరవం అవసరం లేదని పరిసయ్యులు విర్రవీగారు. రక్షకుడు వారిని విడిచిపెట్టి పరలోక వర్తమానాన్ని స్వీకరించడానికి ఆశిస్తోన్న ఇతర ప్రజలను కనుగోడానికి వెళ్లాడు. విద్యలేని జాలరుల్లో బజారులో ఉన్న సుంకరుల్లో సమరయ స్త్రీలో తన బోధను ఆనందంగా విన్న సామాన్యుల్లో. ఆయన తన నూతన ద్రాక్షారసానికి నూతన తిత్తుల్ని కనుగొన్నాడు. దేవుడు పంపిన వెలుగును సంతోషంగా అందిపుచ్చుకునే ఆత్మలే సువార్త సేవకు ఉపకరించే సాధనాలు. లోకానికి సత్యాన్ని గూర్చిన జ్ఞానాన్ని అందించడానికి వీరే దేవుని ప్రతినిధులు. క్రీస్తు ప్రజలు ఆయన కృప ద్వారా నూతన తిత్తులవ్వడానికి ఇష్టపడితే ఆయన వారిని నూతన ద్రాక్షారసంతో నింపుతాడు. DATel 294.1

కొత్త ద్రాక్షరసానికి ప్రతీక అయినప్పటికీ క్రీస్తు బోధన నూతన సిద్ధాంతం కాదు. అది ఆది నుంచి ప్రకటితమౌతూ వస్తోన్న సత్యం వెల్లడి. అయితే పరిసయ్యులకు దేవుని సత్యం తన ఆదిమ ప్రాధాన్యాన్ని సౌందర్యాన్ని కోల్పోయింది. క్రీస్తు బోధన వారికి ప్రతీ విషయంలోను కొత్తగా కనిపించింది. కనుక దాన్ని వారు గుర్తించలేదు అంగీకరించలేదు. DATel 294.2

సత్యంపట్ల ఆసక్తిని వాంఛను నాశనం చెయ్యడంలో తప్పుడు బోధకున్న శక్తిని గూర్చి యేసు ప్రస్తావించాడు. ఆయనిలా అన్నాడు, “పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడును లేడు; పాతదే మంచిదని చెప్పును.” పితరులు ప్రవక్తల ద్వారా దేవుడు లోకానికిచ్చిన సత్యమంతా క్రీస్తు మాటల్లో నూతన సౌందర్యంతో ప్రకాశించింది. కాని శాస్త్రులు పరిసయ్యులు విలువైన కొత్త ద్రాక్షరసాన్ని ఆకాంక్షించలేదు. పాత సంప్రదాయాల్ని ఆచారాల్ని కర్మకాండల్ని తీసివేసి తమ మనసుల్ని ఖాళీ చేసేంతవరకు క్రీస్తు బోధనలకు వారి హృదయంలోను మనసులోను స్థలం ఉండదు. వారు అర్ధం పర్ధం లేని ఆచారాల్ని గట్టిగా పట్టుకుని సత్యానికి దేవుని శక్తికి దూరంగా తొలగిపోయారు. DATel 294.3

యూదులు చెడిపోవడానికి దారి తీసింది ఇదే. మన దినాల్లో అనేకమంది నాశనానికి కారణం ఇదే కాబోతుంది. మత్తయి ఇచ్చిన విందులో యేసు మందలించిన పరిసయ్యులు చేసిన తప్పుల్నే వేల మంది చేస్తున్నారు. ప్రియమైన ఓ అభిప్రాయాన్ని మార్చుకునే బదులు లేదా ఓ అభిప్రాయ విగ్రహాన్ని తొలగించే బదులు, అనేకులు వెలుగుకి తండ్రి అయిన దేవుని వద్ద నుంచి వస్తున్న సత్యాన్ని నిరాకరిస్తారు. వారు తమను తామే నమ్ముకుని, సొంత జ్ఞానంపైనే ఆధారపడి ఉండడంతో తాము ఆధ్యాత్మికంగా బీదవారమని గుర్తించరు. ఏదోరకంగా రక్షణ పొంది తద్వారా తాము ఏదో ముఖ్యమైన సేవ చేయాలని పట్టుపడ్డారు. దేవుని సేవలోకి స్వార్ధాన్ని ఇరికించడానికి మార్గం కనిపించినప్పుడు వారు రక్షణనే నిరాకరిస్తారు. DATel 295.1

చట్టానుసారమైన మతం ఆత్మల్ని క్రీస్తు వద్దకు నడిపించలేదు. కారణమేమిటంటే అది ప్రేమలేని క్రైస్తవ మతమౌతుంది. స్వార్థ సమర్దన నుంచి బయలుదేరే ఉపవాసం లేదా ప్రార్థన దేవునికి హేయం. ఆరాధనకు సమావేశమైన గంభీర సభ, మతపరమైన ఆచారాలు కర్మలు, పైపై భక్తి వినయాలు, బ్రహ్మండమైన అర్పణలు - ఇవి చేసే వ్యక్తి భక్తిపరుడని, పరలోకానికి అర్హుడని చాటి చెప్పుతాయి. కాని ఇదంతా మోసం. మన పనులు కర్మకాండ మనకు రక్షణ నివ్వలేవు. DATel 295.2

క్రీస్తు దినాల్లో లాగే ఇప్పుడు కూడా. పరిసయ్యులు తమ ఆధ్యాత్మిక పేదరికాన్ని గ్రహించరు. వారికి ఈ వర్తమానం వస్తోంది, “నీవు దౌర్భాగ్యుడవును దిక్కులేనివాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునైయున్నావని యెరుగక - నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు . కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనాభివృద్ధి చేసికొనునట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రమును, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.” ప్రకటన 3:17, 18. విశ్వాసం, ప్రేమ ఈ రెండూ అగ్నిలో పుటం వేసిన బంగారం. అయితే అనేకుల విషయంలో ఈ బంగారం కళావిహీనమయ్యింది. ఈ విలువైన ఐశ్వర్యం నశించిపోయింది. క్రీస్తు నీతి వారికి ధరించని వస్త్రంగాను ఎవరూ ముట్టని జలధారగాను ఉంటుంది. వారినుద్దేశించి ప్రభువిలా అంటున్నాడు, “అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసియున్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారుమనసు పొందితేనే సరి; లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోటనుండి తీసివేతును.” ప్రకటన 2:4, 5. DATel 295.3

“విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.” కీర్తనలు 51:17. యేసుపై విశ్వాస ముంచకముందు మనుషుడు స్వార్ధాన్ని తన హృదయంలోనుంచి పూర్తిగా ఖాళీ చెయ్యాలి. మానవుడు స్వార్ధాన్ని పూర్తిగా విడనాడినప్పుడు ప్రభువు అతణ్ని నూతన వ్యక్తిని చేస్తాడు. కొత్త తిత్తులు కొత్త ద్రాక్షారసాన్ని ఉంచగలవు. విశ్వాసానికి కర్త, దాన్ని తుదముట్టించే ప్రభువును వీక్షించే వాడిలో క్రీస్తు ప్రవర్తన ప్రదర్శితమౌతుంది. DATel 296.1