పితరులు ప్రవక్తలు

21/75

19—కనానుకు తిరిగి రాక

యోర్దానుదాటి “యాకోబు కనాను దేశంలోవున్న షెకెము పట్టణానికి సమాధా నంగా వచ్చాడు” (ఆది 33:18, ఆర్.వి) శాంతి సమాధానాలతో తన దేశానికి తిరిగి తీసుకురావలసిందిగా బేతేలువద్ద యాకోబు చేసిన ప్రార్థన ఈ విధంగా నెరవేరింది. కొంతకాలం అతడు షెకెము లోకలో నివసించాడు. వంద సంవత్సరాలు పైచిలుకు క్రితం వాగ్దత్త భూమిలో అబ్రాహాము మొట్టమొదటి శిబిరాన్ని ఏర్పాటు చేసి మొట్టమొదటి బలిపీఠం నిర్మించింది ఇక్కడే. ఇక్కడ యాకోబు “గుడారములు వేసిన పొలముయొక్క భాగమును, షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద నూరు వరహలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానిక ఎల్ ఎలో హేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను” (19,20 వచనాలు) -- “ఇశ్రాయేలు దేవుడే దేవుడు”అని దాని అర్ధం. అబ్రాహాము మాదిరిగా యాకోబు తన గుడారం పక్క యెహోవాకు బలిపీఠం కట్టి ఉదయం సాయంకాలాల్లో బలి అర్పణలకు తన కుటుంబ సభ్యుల్ని ఆహ్వనించేవాడు. పదిహేడు శతాబ్దాల అనంతరం యాకోబు కుమారుడు లోక రక్షకుడు అయిన క్రీస్తు వచ్చి మధ్యాహ్నపు ఎండకు ఏ బావి పక్క విశ్రమిస్తూ ఆశ్చర్యంతో వింటున్న శ్రోతలతో “నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గ” (యోహోవా 4:14)ను గురించి చెప్పాడో దాన్ని యాకోబే ఇక్కడ తవ్వాడు. PPTel 193.1

షెకెములో యాకోబు అతడి కుమారుల విడిది దౌర్జన్యంతోను, రక్తపాతంలోను ముగిసింది. ఆ కుటుంబంలోని ఒక్కగాని ఒక కుమార్తె అప్రదిష్టకు విభేదానికి కారణం అయ్యంది. ఇద్దరు సహోదరులు హత్యానేరానికి పాల్పడ్డారు. ఒక్క ఆకతాయి యువకుడి దుండగానికి ప్రతీకారంగా ఆ పట్టణమంతా విధ్వంసాలు, హత్యలతో ఆతలాకుతల మయ్యింది. అంతటి భయంకర పరిణామలకు నాంది పలికిన క్రియ యాకోబు కుమార్తె “ఆ దేశపు కుమార్తెలను” చూడటానికి వెళ్లి భక్తిహీనుతో స్నేహసంబంధాలు పెట్టుకోవటం. దేవుడంటే భయం లేనివారతో వినోదాలకు, విందులకు ఎగబడే వ్యక్తి సాతాను ప్రదేశంలోకి వెళ్లి అతడి శోదనలకు స్వాగతం పలికేవాడవు అవుతాడు. PPTel 193.2

షిమ్యోను, లేవీల క్రూర విశ్వాస ఘాతుక చర్య అకారణంగా జరిగింది కాదు. అయినా షెకెము ప్రజల విషయంలో వారు ఘోర పాపం చేశారు. తమ ఉద్దేశాలు యాకోబుకి తెలియకుండా అతి గోప్యంగా ఉంచారు. వారి ప్రతీకార వార్త యాకోబు గుండెల్లో కంపరం పుట్టించింది. తన కుమారుల వంచనను దౌర్జన్యాన్ని గూర్చి తెలుసుకొని ఇలా అన్నాడు. “మీరు నన్ను బాధ పెట్టి యీ దేశ నివాసులైన కనానీయులలోను, పెరిట్జయులలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే. వారు నా మీదికి గుంపులుగా వచ్చి నన్ను చం పెదరు. నేనును నా యింటి వారును నాశనమగుదుము”. దాదాపు ఏభై సంవత్సారాలు గడిచాక ఐగుప్తులో మరణ శయ్యపై పడి ఉన్న స్థితిలో కుమారుల ఆ దుశ్చర్యను ప్రస్తావిస్తూ యాకోబు ఇలా అన్నప్పుడు ఆ ఘటనను గూర్చి అతడు ఎంత కుమిలిపోయాడో దాన్ని ఎంత తీవ్రంగా అసహ్యించుకున్నాడో బోధపడుంది. “షిమ్మోను. లేవీ అనువారు సహోదరులు. వారికి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు.... వారి కోపము వేండ్రమైనది. వారి ఉగ్రత కఠినమైనది. అది శపించబడును”. ఆదికాండము 49:5-7 PPTel 193.3

సిగ్గుతో తల వంచుకోవలసిన పరిస్థితి వచ్చిందని యాకోబు బాధపడ్డాడు. తన కుమారుల ప్రవర్తనలో క్రూరత్వం అబద్దం బహిర్గతమయ్యాయి. తన శిబిరంలో అబద్ద దేవుళ్లున్నారు. తన గృహంలో సయితం విగ్రహారాధనకు కొంత స్థానం లభించింది. దేవుడు తమతో తగురీతిగా వ్యవహరించి ఉంటే తమపై చుట్టుపట్ల ఉన్న రాజ్యాలు కక్ష సాధించాటానికి విడిచి పెట్టడా? PPTel 194.1

యాకోబు ఈ విధంగా హృదయ వేదనతో కుంగిపోతుండగా దక్షిణాన ఉన్న బేతేలుకి ప్రయాణం చేయమని ప్రభువు ఆదేశించాడు. ఈ స్థలాన్ని గూర్చిన ఆలోచన రాగానే దేవదూతల దర్శనం, కృపను గూర్చిన దైవ వాగ్దానం ఇవేగాక యెహోవాయే తన దేవుడై ఉంటాడని తాను చేసిన ప్రమాణం కూడా గుర్తొచ్చాయి. ఈ పవిత్ర స్థలానికి వెళ్లకముందు తాను విగ్రహారాధన అపవిత్రత నుంచి శుద్ధి పొందాలని నిశ్చయించుకొన్నాడు. కాబట్టి శిబిరంలో వున్న వారిందరిని ఇలా ఆదేశించాడు. “మీయొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధి పరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి మనము లేచి బేతేలునకు వెళ్లుదము. నా శ్రమ దినమున నాకుత్తరమిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడైయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టుదము.” PPTel 194.2

ప్రాణం కాపాడుకోటానికి తండ్రి గుడారం విడిచి పెట్టి పారిపోతూ ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు మొట్టమొదటిసారి బేతేలుని సందర్శించటం, అక్కడ రాత్రి దర్శనంలో తనకు దేవుడు కనిపించటం యాకోబు ఉద్వేగ భరితంగా వర్ణించాడు. దేవుడు తనతో కరుణాకటాక్షాలు, ప్రేమనురాగాలతో ఎలా వ్యవహరించాడో వివరించేటప్పుడు కళ్లు చెమ్మగిల్లాయి. అతడి బిడ్డల హృదయాలు కూడా కృతజ్ఞతతో నిండి సున్నితమయ్యా యి. బేతేలు చేరినప్పుడు వారంతా దైవారాధనలో తనతో కలసి పాలుపొందేందుకు వారిని సిద్ధం చేయటానికి యాకోబు శక్తిమంతమైన ఈ మార్గాన్ని అనుసరించాడు. “వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను యాకోబుకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచి పెట్టెను”. PPTel 194.3

దేవుడు ఆ ప్రాంతపు ప్రజలకు భయం పుట్టించాడు. అందుచేత షెకుము ఊచకోతకు ప్రతీకారం తీర్చుకోడానికి వారు ప్రయత్నించలేదు. ప్రయాణం చేస్తున్న యాకోబు పరివారం ఎలాంటి అత్యాచారాలు లేకుండా బేతేలు చేరుకొన్నారు. ఇక్కడ మళ్లీ ప్రభువు యాకోబుకి కనపడి తన నిబంధన వాగ్దానాన్ని నవీకరించాడు. “ఆయన తనతో మాటలాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము” నిలిపాడు. PPTel 195.1

అరామ్నహరాయిమునుంచి తన యజమానురాలు రిబ్కాతో కనానుకు వచ్చిన దాదీ, ఇస్సాకు కుంటుంబంలో దీర్ఘకాలం గౌరవప్రదమైన సభ్యురాలుగా నివసించిన వ్యక్తి అయిన దెబోరా బేతేలు వద్ద మరణించగా యాకోబు కుటుంబం దుఖంలో మునిగింది. వృద్దురాలైన ఆమె ఉనికి యాకోబుకి తన చిన్ననాటి కాలాన్ని మరీ ముఖ్యంగా తనను అమితంగా ప్రేమించిన తన తల్లిని తలపించేది. తీవ్ర దు:ఖంతోను, వేదనతోను వారు దెబోరాను ఏ సింధూర వృక్షం కింద సమాధి చేశారో దానికి “ఏడ్పు చెట్టు” అన్న పేరు వచ్చింది. జీవితమంతా నమ్మకంగా సేవలందించిన ఆమె జ్ఞాపకం, అలాంటి ఆప్తురాలు పోవటం గురించి ఆ కుటుంబం దు:ఖంలో మునగటం లేఖనంలో దాఖలు కావటానికి అర్హమైందిగా పరిగణన పొందిన సంగతి గమనార్హం. PPTel 195.2

బేతేలునుంచి హెబ్రోనూ రెండు రోజుల ప్రయాణం మాత్రమే అక్కడికి ప్రయాణంలో ఉన్నప్పుడే రాహేలు మరణంవల్ల యాకోబు దు:ఖంలో మునిగాడు. ఆమో కోసమే యాకోబు ఏడేళ్ల కొలువు రెండుసార్లు చేశాడు. ఆమె పై అతడికున్న ప్రేమ వల్ల అది భారమనిపించలేదు. చాలాకాలమైన తర్వాత ఐగుప్తు దేశంలో మరణానికి దగ్గరలో ఉన్నప్పుడు తనను దర్శించటానికి యోసేపురాగా ఆ వృద్దపిత తన గత జీవితాన్ని నెమరువేసుకుంటూ ఈ మాటలన్నప్పుడు అతడికి రా హేలంటే ఎంత ప్రేమెవ్యక్తమయ్యింది, “పద్దనరామునుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంక కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశములో నాయెదుట మృతిపొందెను. అక్కడ బేల్లె హేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతి పెట్టితిని” ఆదికాండము 48:7. కష్టాలు, బాధలతో నిండిన తన సుదీర్ఘమైన కుటుంబ చరిత్రలో రాహేలు మరణం గురించి మాత్రమే జ్ఞాపకం చేసుకొన్నాడు. PPTel 195.3

రాహేలు మరణించకముందు రెండో కొడుకుని కన్నది. ఆ బిడ్డ పేరు బెనోని అని తన చివరి శ్వాసతో అన్నది. దానికి “నా దు:ఖ పుత్రుడు” లేదా “నా బలము” అని అర్థం. తాను మరణించిన చోటనే రాహేలును సమాధిచేశారు. ఆమె జ్ఞాపకార్థం తన సమాధి పై ఒక స్తంభం నిర్మించారు. PPTel 196.1

యాకోబు కుటుంబానికి మాయని మచ్చతెచ్చిన మరోనేరం ఎఫ్రాతా మార్గంలో జరిగింది. జ్యేష్ఠ పుత్రుడు రూబేను తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోవటానికి అది హేతువయ్యింది. PPTel 196.2

చివరికి “అబ్రహామును ఇస్సాకును పరదేశులైయుండిన మ లో కిర్యతర్బాకు తన తండ్రియైన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను;” యాకోబు ప్రయాణ గమ్యం అదే. తన తండ్రి చివరి సంవత్సరాల్లో యాకోబు ఇక్కడే ఉండి తండ్రికి సేవచేశాడు. బలహీనుడు, చూపులేనివాడు అయిన ఇస్సాకుకు తన దు:ఖ భరితమైన ఒంటరి జీవితంలో దీర్ఘకాలం ప్రవాసంలో ఉన్న కుమారుడి సేవలు ఎంతో ఆదరణనిచ్చాయి. PPTel 196.3

యాకోబు ఏశావులు తండ్రి మరణ శయ్య పక్కన కలుసుకొన్నారు. తమ్ముడిపై కక్ష తీర్చుకోడానికి ఈ ఘటనకోసం ఒకప్పుడు అన్న ఎదురు చూశాడు. అయితే అతడి భావాల్లో మార్పు కలిగింది. జ్యేష్ఠత్వంలోని ఆధ్యాత్మిక దీవెనలతో తృప్తి చెందిన యాకోబు ఏశావు ఎక్కువగా ఆశించిన తండ్రి ఆస్తిని అన్నకే విడిచి పెట్టాడు. వారి మధ్య అసూయగాని, ద్వేషంగాని ఇకలేవు. అయినా వారు విడిపోయారు. ఏశావు శేయీరు పర్వతానికి తిరిగి వెళ్లిపోయాడు. యాకోబు కోరుకున్న ఉన్నతాశీర్వాదంతో పాటు లోకసంబంధమైన సంపదకూడా దేవుడు ఇచ్చాడు. ఈ అన్నదమ్ములు “విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసించలేకపోయింది. వారి పశువులు విశేషమైనందున వారు పరదేశులై యుండిన భూమి వారిని భరింపలేకపోయెను”. యాకోబు విషయంలో దేవుని సంకల్పానుసారంగానే ఈ ఏర్పాటు చోటు చేసుకొన్నది. మత విశ్వాసపరంగా ఈ అన్నదమ్ములు విరుద్ధభావాలు గలవారు గనుక వారు వేర్వేరుగా నివసించటమే మంచిదయ్యింది. PPTel 196.4

దేవునిగూర్చి ఏశావు యాకోబులు ఒకేరకంగా ఉపదేశం పొందారు. ఇద్దరూ ఆజ్ఞల ప్రకారం నడుచుకోటానికి స్వేచ్ఛ కలిగి ఉన్నారు. ఇద్దరూ దేవుని ప్రసన్నతను పొందటానికి సమానావకాశం కలిగి ఉన్నారు. అయినా అది చేయటానికి వారిద్దరూ ఎంపిక చేసుకోలేదు. అన్నదమ్ములిద్దరూ వేర్వేరు మార్గాల్లో నడవటానికి ఎంపిక చేసుకొన్నారు. వారి మార్గాలు ఇంకా ఎక్కువగా భేదించటం తథ్యం. PPTel 196.5

ఏశావును రక్షణ పరిధికి అవతల ఉంచటానికి దేవుడు నిరంకుశంగా ఎంపిక చేయలేదు. ఆయన కృపావరాలు క్రీస్తు ద్వారా అందరికీ ఉచితంగా లభ్యమౌతాయి. ఎవరైనా నశించటం జరుగుతుంటే అది ఆ వ్యక్తి ఎంపికద్వారానే జరుగుతుంది. ప్రతీవారు నిత్య జీవానికి ఎంపిక కావటానికి దేవుడు తన వాక్యంలో షరతులు విధించాడు -- క్రీస్తుపై విశ్వాసం ద్వారా ఆయన ఆజ్ఞలకు విధేయులు కావటం. తన ధర్మశాస్త్రానికి అనుగుణంగా దేవుడు ఒక ప్రవర్తనను ఎంపిక చేశాడు. ఆయన నిర్దేశించిన ప్రమాణాన్ని చేరేవారికి ఆయన మహిమ రాజ్యంలోకి ప్రవేశం దొరకుతుంది. స్వయాన క్రీస్తే ఇలా అన్నాడు, “కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు, కుమారునికి విధేయడు కానివాడు జీవము చూడడుగాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచియుండును”. యోహాను 3:36. “ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును” మత్తయి 7:21. ప్రకటన గ్రంథంలో ఆయన ఇలా అంటున్నాడు : “జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు”. ప్రకటన 22:14. మానవుడి అంతిమ రక్షణకు సంబంధించినంతవరకు దేవుని వాక్యం వివరిస్తున్న ఎంపిక ఇదొక్కటే. PPTel 197.1

తన రక్షణను భయంతోను, వణకుతోను కొనసాగించుకొనే ప్రతీ ఆత్మ ఎన్నిక అవుతుంది. సర్వాంగ కవచం ధరించి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడే వ్యక్తి ఎంపిక అవుతాడు. మెళకువగా ఉండి ప్రార్థించే వ్యక్తి, లేఖనాలు పరిశోధించే వ్యక్తి, శోధననుంచి పారిపోయే వ్యక్తి ఎంపిక అవుతాడు. ఎడతెగకుండా విశ్వాసం కలిగిఉండే వ్యక్తి, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతీ మాటను ఆచరించే వ్యక్తి ఎంపిక అవుతాడు. రక్షణ అందరికీ ఉచితంగా ఏర్పాటయ్యింది. షరతులు నెరవేర్చేవారు మాత్రమే విమోచన ఫలాన్ని అనుభవిస్తారు. PPTel 197.2

ఏశావు నిబంధన దీవెనల్ని తృణీకరించాడు. ఆధ్యాత్మిక హితానికన్నా లౌకిక హితానికి ఎక్కువ విలువనిచ్చాడు. తాను ఆశించిన దాన్ని పొందాడు. అతడు దైవ ప్రజల నుంచి వేరైపోవటం తాను ఇష్టపూర్వకంగా ఎన్నుకొన్నదే. యాకోబు విశ్వాసం వారసత్వాన్ని ఎంపిక చేసుకొన్నాడు. యుక్తి, మోసం, అబద్దం ద్వారా దాన్ని సంపాదించటానికి ప్రయత్నించాడు. కాని అతడి పాపం దానికదే దిద్దుబాటు కావటానికి దేవుడు అనుమతించాడు. అయినా తన అనంతర జీవితంలోని చేదు అనుభవాలన్నిటిలోను యాకోబు తాను ఎన్నుకొన్న మార్గం నుంచి తొలగటంగాని తాను ఎన్నుకొన్నదాన్ని విడిచి పెట్టడంగాని చేయలేదు. ఆ దీవెనను పొందటానికి మానవ ప్రజ్ఞను కపటాన్ని ఉపయోగించటంలో దేవునితో పోరాడున్నానని అతడు తెలుసుకున్నాడు. యబ్బోకు నది పక్క ఆ రాత్రి జరిగిన పోరాటం నుంచి యాకోబు వ్యత్యాసమైన వ్యక్తిగా తిరగివచ్చాడు. ఆత్మవిశ్వాసం నిర్మూలమయ్యింది. వెనుకటి మోసం, జిత్తులు ఇకలేవు. కుట్ర, వంచన బదులు నిరాడంబరత నిజాయితీ అతనిలో చోటు చేసుకొన్నాయి. సర్వశక్తిగల దేవుని మీద ఆధారపడటం నేర్చుకొన్నాడు. శ్రమలు, బాధలమధ్య దీన మనసుతో తన్నుతాను దేవుని చిత్తానికి అప్పగించుకొన్నాడు. అబ్రహాము ఇస్సాకుల విశ్వాసం యాకోబులో ప్రజ్వలించేవరకూ అతడి ప్రవర్తన దోషాల కాలుష్యపు కొలిమి మంటల్లో కాలి స్వచ్ఛమైన బంగారంలా శుద్ధి అయ్యింది. PPTel 197.3

యాకోబు పాపం దాని ఫలితంగా చోటుచేసుకొన్న సంఘటన దుష్ప్రభావం ఎంతో చెడుగుకి కారణమయ్యింది. అది యాకోబు కుమారుల ప్రవర్తనలో చేదు ఫలాలు ఫలించింది. ఈ కుమరులు యౌవన దశకు చేరినప్పుడు తీవ్రమైన తప్పిదాల్లో పడ్డారు. బహుభార్యావ్యవస్థ దుష్పలితాలు యాకోబు కుటుంబంలో ప్రదర్శితమయ్యాయి. ఈ భయంకర పాపం, ప్రేమను నిర్మూలించింది. దాని ప్రభావం మిక్కిలి పవిత్ర బాంధవ్యాల్ని బలహీనపర్చింది. ఎక్కువమంది తల్లులుండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. పిల్లలు ఒకరితో ఒకరు కలహించటం, అదుపాజ్ఞల్ని ద్వేషించటం జరిగింది. తండ్రి జీవితం ఆందోళనతో దు:ఖంతో గడిచింది. PPTel 198.1

అయితే ఎంతో వ్యత్యాసమైన నడవడిగల కుమారుడు యాకోబు కుటుంబంలో ఒకడున్నాడు ని రాహేలు కుమారుడు యోసేపు. అతడు చాలా అందగాడు. అతడి బాహ్యసౌందర్యం అంతర్గత హృదయ సౌందర్యానికి ప్రతిబింబంగా కనిపించింది. పవిత్రమైన, చురుకైన, ఉత్సాహవంతుడైన ఆ యువకుడు నైతిక బలాన్ని, నిజాయితీని ప్రదర్శించాడు. తండ్రి ఉపదేశాన్ని చెవిని పెట్టాడు. దేవునికి విధేయుడై జీవించాడు. అనంతరం ఐగుప్తులో తనకు విశిష్టతను ప్రాభవాన్ని తెచ్చిన గుణగణాలూ సాత్వికం, నైతిక నిజాయితీ, సత్యసంధత, ఇపుపడే అతడి దినదిన జీవితంలో చోటుచేసుకున్నాయి. తల్లి మరణించటంతో అతడు తండ్రికి మరింత దగ్గరయ్యాడు. తన వృద్ధాప్యంలో పుట్టిన ఆ కొడుకుపై తండ్రికి ఎనలేని ప్రేమ. అతడు యోసేపును “తన కుమారులందరికంటే ఎక్కువగా.... ప్రేమిం”చాడు. PPTel 198.2

ఈ ప్రేమ కూడా శ్రమలకు దు:ఖానికి హేతువుకానున్నది. యోసేపు పై తన ప్రేమను యాకోబు అధికంగా ప్రదర్శించాడు. ఇది తన తక్కిన కుమారులలో ఈర్ష్య పుట్టించింది. అన్నల దుష్ప్రవర్తనను చూపినప్పుడు యోసేపు ఆందోళన చెందేవాడు. అలా ప్రవర్తించవద్దని వారితో చెప్పటానికి ప్రయత్నించేవాడు. కాని అది వారు మరింతగా యోసేపును ద్వేషించటానికి కారణమయ్యింది. వారు దేవునికి వ్యతిరేకంగా పాపంచేయటం చూడలేక తండ్రి మాటను గౌరవించి వారు మంచి మార్గాన పడతారన్న నమ్మకంతో ఆ విషయాన్ని తండ్రి ముందు పెట్టాడు. PPTel 199.1

కఠిన వైఖరివల్ల వారి కోపాన్ని రేపకుండా యాకోబు జాగ్రత్తగా వ్యవహరించాడు. తమ విషయమై తనకున్న తీవ్ర ఆందోళనను తన బిడ్డలకు వ్యక్తం చేసిన తన తెల్ల తలను గౌరవించి తనకు తలవంపులు తెచ్చే పనులు చేయవద్దని మరీ ముఖ్యంగా దైవోపదేశాన్ని తృణీకరించడం ద్వారా ఆయనను అగౌరవపర్చవద్దని వారిని బతిమాలాడు. తమ దుర్మార్గత బయట్టబయలైనందుకు సిగ్గుతో పశ్చాత్తాపం పొందినట్లు కనిపించారు. కాని తమ వర్తన బాహాటం కావటం వల్ల తమలో ఉన్న క్రోధాన్ని సూచించే యథార్థ మనోభావాల్ని వారు దాచి పెట్టారు. PPTel 199.2

సాధారణంగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు ధరించే విలువైన అంగీని యాకోబు అవివేకంగా యోసేపుకి బహూకరించటం అతడి విషయంలో తండ్రి పక్షపాత వైఖరికి మరో నిదర్శనం అయ్యింది. తనకన్నా పెద్దవాళ్లని కాదని జ్యేష్ఠత్వాన్ని రాహేలు కొడుక్కే తండ్రి ఇవ్వవచ్చునన్న అనుమానాన్ని కూడా ఇది పుట్టించింది. పులిమీద పుట్రలా, ఒకనాడు ఆ కుర్రాడు తనకు వచ్చిన కలను అన్నలకు చెప్పినప్పుడు వారి ద్వేషం మరింత పెరిగింది. ఆ బాలుడు ఇలా అన్నాడు, “అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెను”. PPTel 199.3

“నీవు నిశ్చయముగా మమ్మునే లెదవా? మామీద నీవు అధికారివగుదువా?” అంటూ వారు కోపంతో ప్రశ్నించాలి. PPTel 199.4

కొద్దికాలంలోనే యోసేపుకి ఇంకో కలవచ్చింది. అది కూడా అలాంటిదే. దాన్ని కూడా అతడు అన్నలకు చెప్పాడు. “సూర్యచంద్రులును పదకొండు నక్షత్రములును నాకు సాష్టాంగపడెను”. మొదటి కలకు మల్లేనే దీనికీ భావం చెప్పారు అన్నలు. అక్కడే ఉండి వింటున్న తండ్రి కుర్రాణ్ణిలా మందలించాడు : “నీవు కనిన ఈ కల యేమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులును నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా?” కఠినంగా మాట్లాడున్నట్లు పైకి కనిపించినా ప్రభువు యోసేపుకు భవిష్యత్తును తెలియజేస్తున్నాడని యాకోబు నమ్మాడు. PPTel 199.5

ఆ బాలుడు అన్నలముందు నిలబడి ఉండగా సుందరమైన అతడి ముఖం పరిశు ద్దాత్మ ప్రభావంతో ప్రకాశించింది. అది చూసి వారు ఆశ్చర్యపడకుండా ఉండలేక పోయారు. అయితే వారు తమ దుర్మార్గతను విడిచి పెట్టడానికి సుముఖంగా లేరు. తమ పాపాల్ని ఖండించే పవిత్రతను వారు ద్వేషించారు. కయీను క్రియల్ని పురికొల్పిన స్వభావమే వారి హృదయాల్లో రగులుకొంటున్నది. PPTel 200.1

తమ మందలకు మేతకోసం ఆ సహోదరులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కదుల్తుండాల్సి వచ్చింది. ఇంటికి రాకుండా తరచూ నెలలకు నెలలే బయట ఉండే వారు. లోగడ ప్రస్తావించిన పరిస్థితుల అనంతరం తమ తండ్రి షెకెములో కొన్న స్థలానికి వెళ్లారు. కొంతకాలం గతించింది. కాని వారి వద్దనుంచి సమాచారమేమీ రానందున షెకెము ప్రజలతో క్రితంలో వారు క్రూరంగా ప్రవర్తించిన కారణంగా వారి క్షేమ వార్త తేవటానికి అతడు యోసేపును పంపాడు. యోసేపు విషయంలో తన కుమారుల వాస్తవిక ఉద్దేశాల్ని యాకోబు గ్రహించి ఉంటే యోసేపును వారివద్దకు ఒంటరిగా పంపేవాడుకాదు. తమ అభిప్రాయాల్ని వారు అతిగోప్యంగా ఉంచారు. PPTel 200.2

యోసేపు ఉత్సాహంతో తండ్రివద్ద సెలవు తీసుకొని బయల్దేరాడు. తాము మళ్లీ కలుసుకోక ముందు ఏమి జరుగనున్నదో ఆ వృద్ధుడు గాని ఆ యువకుడుగాని కలలో కూడా ఊహించి ఉండరు. ఒంటరిగా దీర్ఘంగా ప్రయాణం చేసిన తర్వాత యోసేపు షెకెము చేరినప్పుడు అక్కడ తన అన్నలు వారి మందలు అతడికి కనిపించలేదు. అక్కడ విచారణ చేయగా వారు దాతానుకు వెళ్లినట్లు తెలిసింది. అప్పటికే అతడు ఏభై మైళ్లు ప్రయాణం చేశాడు. ఇప్పుడు ఇంకా పదిహేను మైళ్లు వెళ్లాల్సి ఉన్నాడు. అయినా అతడు తండ్రి ఆందోళనను తొలగించాలన్న కోరికతోను అన్నల్ని చూడాలన్న ఆశతోను ముందుకు సాగాడు. PPTel 200.3

తమదిశగా వస్తున్న యోసేపును అన్నలు చూశారు. తమను కలుసుకోవటానికి అతడు చేసిన దీర్ఘ ప్రయాణంగాని, అతడి ప్రయాణ బడలికగాని, అతడి ఆకలిగాని, తాము అతడికి చేయాల్సిన భోజన సదుపాయంగాని అన్నలు తమ్ముడిపట్ల చూపించాల్సిన ప్రేమగాని వారి ద్వేషపూరిత హృదయాల్ని కరిగించలేదు. తమ తండ్రి ప్రేమకు ప్రతీకగా ఉన్న అతడి అంగీని చూసినప్పుడు వారు గంగవెర్రులెత్తారు. “ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు” అని అరుస్తూ ఎగతాళి చేశారు. ఎంతోకాలంగా తమ హృదయాల్లో దాగివున్న ద్వేషం, ప్రతీకార వాంఛ ఇప్పుడు వారిని నడిపిస్తున్నాయి. “వీని చంపి యిక్కడనున్న ఒక గుంటలో పారవేసి, దుష్ట మృగము వీని తినివేసెనని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము” అన్నారు. PPTel 200.4

రూబేను అడ్డుకోకపోతే తామనుకొన్న పనిచేసి ఉండేవారు. తమ తమ్ముణ్ని హత్య చెయ్యటంలో తాను పాలుపొందననటంలో చం పేకన్నా అతణ్ని ఒక గోతిలో పడేయటం మంచిదని అతడు అందులోనే మరణిస్తాడని సలహా చెప్పాడు. అతణ్ని రహస్యంగా రక్షించి తండ్రివద్దకు పంపివెయ్యాలన్నది రూబెను ఉద్దేశం. ఇలా చేయటానికి అందర్నీ ఒప్పించిన దరిమిలా తన మనోభావాల్ని అదుపులో ఉంచుకోలేక తన అసలు ఉద్దే శాల్ని బయట పెట్టేస్తానేమో అన్న భయంతో రూబేను అక్కడ నుంచి వెళ్లిపోయాడు. PPTel 201.1

పొంచివున్న అపాయాన్ని ఎరుగకుండా తాను వెదకుతున్న తన అన్నలు కనిపించారన్న సంతోషంతో యోసేపు వారివద్దకు వచ్చాడు. అయితే అన్నలు అతణ్ని ఆప్యాయంగా పలకరించటంపోయి కోపంతోను, తీవ్ర ద్వేషంతోను చూడటంతో అతడు భయపడ్డాడు. అతణ్ని పట్టుకొని అతడు ధరించిన అంగీని తీసివేశారు. వారి ఎగతాళి, బెదిరింపులు వారి దురుద్దేశాన్ని బైట పెట్టాయి. అతడి విజ్ఞాపనల్ని ఎవరూ వినిపించుకోలేదు. అతడు శివమెత్తిన ఉన్మాదుల ఆధీనంలో ఉన్నాడు. ఒక లోతైన గుంటవద్దకు అతణ్ని ఈడ్చుకెళ్లి అందులో పడవేసి తప్పించుకోవటానికి ఎలాంటి అవకాశం లేకుండా చేసి ఆకలితో మరణించటానికి అతణ్ని అక్కడ విడిచి “వారు భోజనము చేయ కూర్చుండి”రి. PPTel 201.2

అందులో కొందరికది ఇష్టం లేదు. కక్ష సాధించాలనుకొన్నవారి కది తృప్తినియ్యలేదు. కొద్ది సేపటికి ప్రయాణికుల గుంపు ఒకటి ఆ దారిని వెళ్లటం జరిగింది. సుగంధ ద్రవ్యాలు ఇతర సామాగ్రితో యోర్దాను అద్దరినుంచి ఐగుప్తుకు వెళ్తున్న ఇష్మాయేలీయుల వర్తక బృందం అది. యోసేపును ఆ గుంటలో మరణించటానికి విడిచి పెట్టే బదులు ఆ వర్తకులకు అమ్మటం మంచిదని యూదా ప్రతిపాదించాడు. అతడు తమ దారిలోనుంచి తొలగిపోతాడు, తాము అతడి రక్తం చిందించిన పాపం కట్టుకోవలసి ఉండదు, “వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధిగదా?” అన్నాడు. ఈ ప్రతిపాదనను అందరూ ఆమోదించారు. వెంటనే యోసేపును ఆ గుంటలోనుంచి పైకిలాగారు. PPTel 201.3

ఆ వ్యాపారస్తుల్ని చూడగానే యోసేపుకి అసలు విషయం అర్థమయ్యింది. బానిసకావటం మరణంకన్నా భయంకరమైన విషయం. భయంతో వణుకుతూ అన్నలు ఒకడి తర్వాత ఒకణ్ని బతిమాలాడడు తనను అమ్మవద్దని. లాభం లేకపోయింది. కొందరికి జాలి కలిగినా హేళనకు జడిసి ఎవరూ నోరు మెదపలేదు. అది శ్రుతిమించి రాగాన పడిన వ్యవహారమని అందరూ భావించారు. యోసేపును కాపాడ్రే ఆ విషయాన్ని అతడు తప్పక తండ్రికి చెబుతాడని తండ్రి తన ప్రియమైన కుమారుడిపట్ల తమ క్రూర ప్రవర్తనను సహించడని వారు భావించారు. అతడి మొర వినకుండా గుండె రాయి చేసుకొని వారు యోసేపును ఆ అన్యవ్యాపారులకు అప్పగించారు. ఆ వ్యాపారుల బృందం కదిలి వెళ్లిపోయింది. కొద్ది సేపటిలోనే కనుచూపు మేరలోనుంచి మాయమయ్యింది. PPTel 201.4

రూబేను ఆ గుంట దగ్గరకు వచ్చిచూశాడు. యోసేపు గుంటలోలేడు. ఆందోళనచెంది తన్ను తాను నిందించుకొంటూ తన బట్టలు చింపుకొన్నాడు. “చిన్నవాడు లేడే, అయ్యో నేనెక్కడికి పోదును” అంటూ తన సహెూదరులవద్దకు వెళ్లాడు. యోసేపుకి ఏమి జరిగిందో తెలుసుకొని అతణ్ని దక్కించుకోటం ఇప్పుడు అసాధ్యమని గుర్తించిన రూబేను తమ తప్పును కప్పిపుచ్చుకొనే ప్రయత్నంలో తక్కిన వారితో చెయ్యి కలిపాడు. ఒక మేక పిల్లను చంపి యోసేపు అంగీని దాని రక్తంలో ముంచి పొలాల్లో చూశామంటూ అది తమ తమ్ముడు యోసేపుదని భయపడున్నామంటూ దాన్ని తండ్రివద్దకు తీసుకువెళ్లారు. “ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గురుతుపట్టుము” అన్నారు. ఈ దృశ్యానికి వారు భయంతో ఎదురుచూశారు. కాని తాము చూడాల్సివచ్చిన తండ్రి హృదయ వేదనకు ఎడతెగని దు:ఖానికి వారు సిద్ధపడిలేరు. “ఈ అంగీ నీ కుమారునిదే; దుష్టమృగము దానిని తినివేసెను; యోసేపు నిశ్చయముగా చీల్చబడెను” అన్నారు. తండ్రిని ఓదార్చటానికి కుమారులు కుమార్తెలు వ్యర్థంగా ఎంతో ప్రయత్నించారు. అతడు “తన బట్ట చింపుకొని తన నడుమున గోనె బట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చెను”. దినాలు వారాలై కాలం గతించినా అతడి దు:ఖం ఆగలేదు. “నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్లెదను” అని హృదయ విదారకంగా రోదించాడు. తాము చేసిన భయంకర నేరానికి భయాందోళనలతో నిండి, నిందలకు, ఆరోపణలకు జడిసి, అన్నలు తాము చేసిన అపరాధాన్ని తమ మనసుల్లోనే దాచుకొన్నారు. అది వారికి కూడా ఎంతో ఘోరమైన నేరంగా కనిపించింది. PPTel 202.1