పితరులు ప్రవక్తలు

20/75

18—పోరాటం జరిగిన రాత్రి

దైవాదేశసారంగా యాకోబు పద్దనరాము విడిచి వెళ్లినప్పటికీ ఇరవై యేళ్ల క్రితం తాను విడిచివచ్చిన మార్గాన్ని తిరిగి వెళ్తున్నప్పుడు అనేక అనుమానాలు తనలో లేచాయి. తడిని మోసపూచ్చి తాను చేసిన పాపం నిత్యం తన కళ్లముందే ఉంది. తన సుదీర్ఘ ప్రవాసం ఆ పాప పర్యవసానమేనని అతడికి తెలుసు. ఈ విషయాలగురించి రాత్రింబగళ్లు ఆలోచించాడు. వీటి విషయమై మనస్సాక్షి గిద్దింపులతో ప్రయాణం దుఖపూర్తి మయ్యింది. తన జన్మభూమి పొలిమేరల్లోని కొండలు దూరంలో కనిపించేసరికి ఆ పితురుడి హృదయం చలించింది. గతమంతా స్పష్టంగా తనముందుకి వచ్చింది. తన పాపంతో పాటు తన పట్లదేవుడు చూపించిన దయ ఆయన తనకు చేసిన సహాయం ఆయన నడుపుదల యాకోబుకి గుర్తొచ్చాయి. PPTel 185.1

ప్రయాణం అంతం కావచ్చేసరికి ఏశావుని గూర్చిన ఆలోచన ఎన్నో భయందోళనలు రేపింది. యాకోబు ఇల్లు విడిచి పారిపోయిన అనంతరం తండ్రి ఆస్తి అంతటికీ తానే ఏకైక హక్కుదారుణ్ణని ఏశావు భావించాడు. యాకోబు తిరిగి వస్తున్నాడన్న వార్త అతడు తన ఆస్తిని సొంతం చేసుకోవటానికి వస్తున్నాడన్న భయం అతడికి పుట్టించవచ్చు. అనుకుంటే ఏశావు ఇప్పుడు యాకోబును ఎక్కువ హని చేయగల శక్తి కలిగి పగ తీర్చుకొనే ఉద్దేశంతోనే కాక తాను ఇంతకాలం తనదిగా భావిస్తున్న ఆస్తిని దక్కించు కోటానికి కూడా దౌర్జన్యానికి దిగవచ్చు. PPTel 185.2

తన శ్రద్ధ సంరక్షణల విషయం దేవుడు యాకోబుకి మళ్లీ మరొక దర్శనం ఇచ్చాడు. యాకోబు గిలాదు పర్వతం నుండి దక్షిణ దిశగా ప్రయాణం చేస్తుండగా ప్రయాణిస్తున్న బృందాన్ని సంరక్షించేందుకన్నట్లు వారికి వెనుక పరలోక దూత అవరించి ఉన్నట్లు కనిపించింది. చాలాకాలం క్రితం బేతేలు వద్ద తనకు కలిగిన దర్శనాన్ని యాకోబు జ్ఞాపకం చేసుకున్నాడు. కనానునుంచి పారిపోతున్నప్పుడు తనకు నిరీక్షణను ధైర్యాన్ని తెచ్చిన పరలోక దూతలు తన తిరుగు ప్రయాణంలో తనకు కాపుదలగా ఉంటారన టానికి కనిపించిన ఈ నిదర్శనంఅతడి హృదయాన్ని తేలికపర్చింది. “ఇది దేవుని సేన” అని చెప్పి ఆ చోటికి “మహనయీమను పేరు పెట్టెను””రెండు సేనలు”అని దీని అర్థం. PPTel 185.3

అయినా తన క్షేమం కోసం తానేదో చేయ్యాలని యాకోబు భావించాడు. కనుక అన్నతో సయోధ్య కురుచ్చుకోటానికి అతడివద్దకు శుభాకాంక్షలతో దూతల్ని పంపించాడు. ఏశావును సంబోధించటంలో దూతలు ఉపయోగించాల్సిన మాటల్ని ఉపదేశించాడు. పెద్దవాడు చిన్నవాడికి సేవ చేస్తాడని ఆ సోదరుల జననానికి ముందే ప్రవచన వాక్యం తెలిపింది. దీని జ్ఞాపకం దురద్దేశానికి కారణం కాకుండేందుకు ఆ దూతలు తాము యాకోబు “నా ప్రభువైన ఏశావు” వద్దకు పంపిన సేవకులమని ఏశావు ముందుకు వెళ్లినప్పుడు వారు తమ యజమానిని “నీ సేవకుడైన యాకోబు”గా వ్యవహరించాలని వారిని ఆదేశించాడు. తాను ఏమీ గతిలేని సంచారిగా తన తండ్రి ఆస్తిని ఆశించి తిరిగి వస్తున్న వాణ్ణన్న భయాన్ని తొలగించటానికి యాకోబు తన వర్తమానంలో ఇలా వ్యక్తం చేశాడు. “నాకు పశువులు, గాడిదలు మందలు, దాసదాసీ జనమును కలరు; నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువుకిది తెలియజేయ పంపితిని”. PPTel 185.4

ఏశావు నాలుగు వందలమంది మనషులతో వస్తునానడన్న వార్తతో సేవకులు తిరిగి వచ్చి తాను పంపిన స్నేహ పూర్వక వర్తమానానికి ఏశావు జవాబు పంపలేదని తెలిపారు. అతడు కక్ష తీర్చుకోటానికి వస్తునట్లు కనిపించింది. శిబిరంలో భయాందోళనలు రాజ్యమేలాయి. “యాకోబు మిక్కిలి భయపడి” ఆందోళన చెందాడు. వెనక్కు వెళ్లలేడు. ముందుకి సాగలేడు. అయుధాలుగానీ, రక్షణగాని లేని యాకోబు బృందం పోరాటానికి సిద్ధంగా లేదు. అందుచేత తన మనుషుల్ని రెండు గుంపులుగా విభజించాడు. ఒక గుంపుపై దాడి జరిగితే రెండో గుంపు తప్పించుకోవచ్చన్నది యాకోబు ఉద్దేశం. తన విస్తారమైన మందల్లోనుంచి కొన్నింటిని ఒక స్నేహపూరిత వర్తమానంతో అన్నకు బహుమతిగా పంపాడు తన అన్నకు చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తంగాను, తాను భయపడున్న అపాయం నుంచి తప్పించుకోనేందుకుగాను తాను చేయగలిగినదంతా చేసి అప్పుడు తీన మనస్సుతోను పశ్చాత్తాప హృదయంతోను తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యోగ్దాను దాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని, నా సహోదరుడైన ఏశావు చేతినుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను.” PPTel 186.1

ఇప్పుడు వారు యబ్బోకు నది దగ్గరకు వచ్చారు. చీకటి పడ్తున్నప్పుడు యాకోబు తన కుటుంబాన్ని రేవు దాటించి తాను మాత్రం నిలిచిపోయాడు. ఆ రాత్రి ప్రార్థనలో గడపాలని ఏకాంతంగా దేవునితో ఉండాలని ఆశించాడు. దేవుడు ఏశావు మనసును కరిగించవచ్చు. అతడు తన ఆశలన్నీ దేవుని మీదే నిలిపాడు. PPTel 186.2

అది పర్వత ప్రదేశంలోని ఒక మారుమూల. క్రూర మృగాలకు, దొంగలకు, హంతకులకు అనువైన చోటు. ఒంటరివాడు రక్షణ లేనివాడు అయిన యాకోబు తీవ్ర వేదనతో నేలమీదికి వంగాడు, అది అర్థరాత్రి సమయం . తన జీవితానికి ఆనందాన్ని, విలువను ఇస్తున్న ఆప్తులు కొంచెం దూరంలో ఉన్నారు. వారిని అపాయం, మరణం చుట్టుముట్టాయి. తాను చేసిన పాపమే అమాయకులైన తన బిడ్డలమీదకు ఆ ప్రమాదాన్ని తెచ్చి పెట్టిందన్న తలంపు మిక్కిలి కటువైన తలంపు. దేవుని ముందు కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. హఠాత్తుగా బలమైన హస్తం అతడిమీద పడింది. తన ప్రాణం తియ్యటానికి శత్రువు ప్రయత్నిస్తున్నాడను కొన్నాడు. అతడి పట్టునుంచి విడిపంచుకోటానికి ప్రయత్నించాడు. ఆధిక్యం కోసం వారు ఈ చీకటిలో పెనుగులాడారు. ఒక్క మాట కూడా ఎవరూ పలుకలేదు. కాని యాకోబు తన శక్తినంతా ఉపయోగించాడు. ఒక్క నిమిషంకూడా ఆగలేదు. ఇలా తన్ను తాను రక్షించుకోటానికి పోరాడుండగా తాను చేసిన అపరాధం గుర్తుకు వచ్చింది. అతణ్ని దేవునికి దూరంగా ఉంచటానికి అతడి పాపాలు తన ముందుకి వచ్చాయి. అయితే ఆ భయంకర దుస్థితిలో దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దైవ కృపకోసం పూర్ణ హృదయంతో విజ్ఞాపన చేశాడు. దాదాపు తెల్లవారేదాకా పోరాటం సాగింది. అప్పుడు ఆ వ్యక్తి యాకోబు తొడపై తన వేలును పెట్టాడు. వెంటనే యాకోబు అవిటి వాడయ్యాడు. తన ప్రత్యర్ధి వైనం యాకోబుకి ఇప్పుడు అర్థమయింది. ఒక పరలోక ప్రతినిధితో తాను పోరాటం జరిపినట్లు అతడు గ్రహించాడు. PPTel 187.1

అందుకే దాదాపు తన మానవాతీత ప్రయత్నం కూడా విజయవంత కాలేదు. “నిబంధన దూత” అయిన క్రీస్తు తన్నుతాను యాకోబుకు బయలుపర్చుకొన్నారు. పితరుడు యాకోబు ఇప్పుడు వికలాంగుడయ్యాడు. ఎంతో బాధననుభవిస్తున్నాడు కూడా. అయినా తన పట్టు విడవటం లేదు. పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో ఆ పరలోక దూతను పట్టుకొన్నాడు. దీవించమని “అతడు కన్నీరు విడిచి బతిమాలెను” (హో షేయ 12:4). తన పాపానికి క్షమాపణ లభించిందన్న నిశ్చయత అతడికి కావాలి. అతడి మనసును ఈ గురినుంచి మళ్లించటానికి శరీరక బాధ నిరర్థకమయ్యింది. అతడి తీర్మానం చివరిదాకా ధృఢంగా ఉంది. అతడి విశ్వాసం మరింత బలో పేతమయ్యింది. అతణ్నుంచి విడిపించుకోటానికి పరలోక దూత ప్రయత్నించాడు. “తెల్లవారు చున్నది గనుక నన్ను పోనిమ్ము” అని ఆయన అనగా యాకోబు “నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్య “ను అన్నాడు. ఇది డంబంతోను, అహంకారంతోను నిండిని నమ్మకమై ఉంటే యాకోబు అక్కడికక్కడే నాశనమయ్యేవాడు. కాని అతడి నిశ్చయత తాను అయోగ్యుణ్ణని ఒప్పుకొని నిబంధనను నెరవేర్చే దేవుడు విశ్వసనీయుడని నమ్మే వ్యక్తి విశ్వాసం వంటిది. PPTel 187.2

యాకోబు “దూతతో పోరాడి జయమొందెను” హోషేయ 12:4. దీనత్వం, పశ్చాత్తాపం, ఆత్మ సమర్పణ ద్వారా ఆ పాప మానవుడు పరలోక ప్రభువుతో పోరాడి విజయు డయ్యాడు. వణుకుతున్న హస్తంతో అతడు దేవుని వాగ్దానాన్ని అందిపుచ్చుకున్నాడు. ఆ పాపి మనవిని అనంత ప్రేమగల హృదయం కాదనలేక పోయింది. PPTel 188.1

జ్యేష్ఠత్వ సంపాదనలో యాకోబును మోసానికి నడిపించిన పొరపాటు ఇప్పుడు అతడి ముందుంది. అతడు దేవుని వాగ్దానాన్ని విశ్వసించలేదు. దేవుడు తాననుకొన్న సమయంలో తాననుకొన్నవిధంగా నెరవేర్చనున్న కార్యాన్ని తన సొంత కృషిద్వారా నెరవేర్చటానికి యాకోబు ప్రయత్నించాడు. అతణ్ణి క్షమించాననటానికి నిరద్శనంగా దేవుడు అతడి పాపాన్ని గుర్తు చేసే పేరును మార్చి అతడి విజయాన్ని జ్ఞప్తికి తెచ్చే పేరు యాకోబుకి పెట్టాడు. “నీవు దేవునితోను, మనష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలేగానీ యాకోబు అనబడదు” అని దూత పలికాడు. PPTel 188.2

తానుగాఢంగా వాంఛించిన దీవెనను యాకోబు పొందాడు. వంచన పాపానికి క్షమాబిక్ష పొందాడు. జీవితంలో తనకు ఎదురైన క్లిష్ట పరిస్థితి తొలగిపోయింది. సందేహం, ఆందోళన. శోకం తన జీవితాన్ని దుర్భరం చేశాయి. అయితే ఇప్పుడు అంతా మారిపోయింది. దేవునితో ఏర్పడ్డ సమాధానం ఎంతో మధురంగా ఉంది. అన్నను కలవటానికి యాకోబు ఇక ఎంతమాత్రం భయపడలేదు. తన పాపాన్ని క్షమించిన దేవుడు తన దీనత్నాన్ని పశ్చాత్తాపాన్ని ఏశావు అంగీకరించేటట్లు అతడి హృదయాన్ని మార్చగలడు. PPTel 188.3

దూతతో యాకోబు పోరాడున్న సమయంలో ఇంకో పరలోక దూత ఏశావు వద్దకు వెళ్లటానికి నియుక్తుడయ్యాడు. తండ్రి గృహాన్ని వదిలి ఇరవై ఏళ్లుగా పరదేశవాసం చేస్తున్న తమ్ముణ్ణి దర్శనంలో ఏశావు చూశాడు. తల్లి మరణవార్త విన్నప్పుడు అతడు పొందిన దు:ఖాన్ని వేదనను చూశాడు. అతడి చూట్టూ దేవుని దూతలు ఉండటం చూశాడు. ఈ దర్శనాన్ని ఏశావు తన సైనికులకు చెప్పి తన తండ్రి దేవుడు యాకోబుతో ఉన్నాడు గనుక అతడికి ఎవరూ ఎలాంటి హాని తలపెట్టకూడదని ఆదేశించారు. PPTel 188.4

ఇరుపక్షాల మనుషులూ చివరికి ముఖాముఖీ కలుసుకొన్నారు. యాకోబు దండును నడిపిస్తున్న భార్యలు, పిల్లలు, కాపరులు, దాసదాసీలు వారి వెనుక గొర్రెల మందలు, పశువుల మందల్ని నడిపిస్తున యాకోబూ అడవివీరుడు ఏశావు కలుసుకొన్నారు. చేతిలోని కాపరి కర్రమీద ఆని నడుస్తూ ఆ సైనికుల గుంపును కలుసుకోటానికి యాకోబు ముందుకు వెళ్లాడు. కొద్దికాలం క్రితమే చోటు చేసుకున్న పోరాటం ఫలితంగా కుంటుతూ బాధతో ఆడుగడుక్కీ ఆగుతూ యాకోబు నడుస్తున్నాడు. కాని అతడి ముఖం పై శాంతి, ఆనందాలు తాండవించాయి. PPTel 188.5

బాధననుభవిస్తూ కుంటుతూ వస్తున్న యాకోబును ఏశావు “ఎదర్కొన పరుగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడమీదపడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరు కన్నీరు విడిచిరి”. ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు కఠినులైన ఏశావు సైనికులు సైతం కన్నీళ్లు కార్చారు. తనకు కలిగిన దర్శనాన్ని అతడు తమకు వివరించినప్పటికీ తమ అధినాయకుడిలో కలిగిన మార్పుకు కారణాన్ని వారు అవగతం చేసుకోలేకపోయారు. పితరుడు యాకోబు అవిటి తనాన్ని కళ్లారా చేసినప్పటికీ అతడి బలహీనతే అతడి బలమని ఆ సైనికులు తెలుసుకోలేక పోయారు. PPTel 189.1

యబ్బోకు నది పక్క ఆ బాధాకరమైన రాత్రి తనకు నాశనం తప్ప ఏమీ లేనట్లు కనిపించిన తరుణంలో మానవుడి సహాయం ఎంత వ్యర్థమైందో మానవుడి శక్తిని నమ్ముకోటం ఎంత అవివేకమో యాకోబు నేర్చుకొన్నాడు.తాను ఎవరికి విరోధంగా ఘోరపాపంచేశాడో ఆ దేవుని వద్దనుంచి మాత్రమే తనకు సహాయం రావాలని అతడు గ్రహించాడు. నిస్సహాయుడు అయోగ్యుడు అయిన యాకోబు పశ్చాత్తాపపడే పాపికి దేవుడు వాగ్దానం చేసిన కృపకోసం విజ్ఞాపన చేశాడు.దేవుడు తననుక్షమించి అంగీక రిస్తాడని ఆ వాగ్దానం అతడికి హామీ ఇచ్చింది.భూమ్యాకాశాలైనా గతిస్తాయి గాని ఆయన మాట నెరవేరక మానదు. ఆ భయంకర పోరాటంలో అతణ్ని బలపర్చింది అదే. PPTel 189.2

పోరాటం జరిగిన ఆ రాత్రి యాకోబుకు కలిగిన బాధాకరమైన అనుభవం క్రీస్తు రాకకు ముందు దైవ ప్రజలు అనుభవించాల్సి ఉన్న మహ శ్రమను సూచిస్తుంది. పరిశుద్ధ దర్శనంలో ఈ కాలం వరకూ చూస్తూ యిర్మీయా ప్రవక్త ఇలా అన్నాడు. “సమాధానములేని కాలమున భీతిచేతను దిగులుచేతను జనులు కేక వేయగా వినుచున్నాము...... వారి ముఖములు తెల్లవారుటయు నాకు కనబడుతున్నదేమి? అయ్యోయెంత భయంకరమైన దినము! అట్టి దినము మరియొకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. అయినను వారు దానిలోపడ కుండా రక్షింపబడుదురు”. యిర్మీయా 30:5-7. PPTel 189.3

మానవుడి తరపున ఉత్తరవాదిగా క్రీస్తూ తన పరిచర్యను పూర్తిచేసిన తర్వాత ఈ శ్రమకాలం ఆరంభమౌతుంది. అప్పటికి ప్రతీ వ్యక్తికేసూ తీర్మానమై ఉంటుంది. పాపాన్ని శుద్ధి చేయటానికి ప్రాయశ్చిత్త రక్తం ఉండదు. దేవుని సమక్షంలో మానవుడి ఉత్త రవాది హోదాను యేసు విడిచి పెట్టినప్పుడు ఈ గంభీర ప్రకటన వెలువడుంది. “అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రమైనవాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే యుడనిమ్ము” ప్రకటన 22:11. అప్పుడు నియంత్రణ శక్తి లోకంలోనుంచి ఉపసంచారించబడుంది.ఆగ్రహంతో ఉన్న అన్న తనను చంపుతాడని యాకోబు ఎలా భయం గుప్పిట్లో నివసించాడో అలాగే తమను నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్న ప్రజలవల్ల భయంతో దైవ ప్రజలు నివసిస్తారు. ఏశావు చేతినుంచి తప్పించుకోటానికి యాకోబు రాత్రంతా పోరాడిన తీరుగానే తమ చుట్టూ ఉన్న శత్రువుల చేతినుంచి తప్పించుకోటానికి నీతిమంతులు రాత్రింబగళ్లు దేవునికి మొర పెట్టు కొంటారు. PPTel 190.1

యాకోబు చేసిన పాపాన్నిబట్టి అతణ్ని నాశనంచేసే హక్కు తనకున్నదంటూ సాతాను దేవదూతల ముందు యాకోబును నిందించాడు. అతడిపై దాడికి సాతాను ఏశావును ఉసికొలిపి నడిపించాడు. రాత్రంతా యాకోబు పోరాడుండగా అతణ్ని నిరుత్సాహపర్చి దేవుని పై అతడి విశ్వాసాన్ని దెబ్బతియ్యటానికి ప్రయత్నించాడు. సంక్షోభంలో ఉన్న యాకోబు దూతను పట్టుకొని కన్నీళ్లుతో విజ్ఞాపన చేయగా అతడి విశ్వాసాన్ని పరీక్షించటానికి పరలోక దూతకూడా అతడి పాపాన్ని గుర్తుచేసి తప్పించుకొని వెళ్లిపోవటానికి ప్రయత్నించాడు. అయితే యాకోబు తన పట్టువిడువలేదు. దేవుడు దయాళుడని తెలుసుకొని ఆయన కటాక్షాన్ని అభ్యర్థించాడు. తన పాపం నిమిత్తం తాను పొందిన పశ్చాత్తాపాన్ని చూపించి తనకు విముక్తి కలిగించమని అర్థించాడు. తన జీవితాన్ని నెమరు వేసుకొనప్పుడు అతడు నిస్పృహకు గురి అయ్యాడు. అయినా దూతను గట్టిగా పట్టుకొని విజయం సాధించే వరకూ విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. PPTel 190.2

దుష్టశక్తులతో తమ పోరాటంలో దైవజనుల అనుభవం కూడా ఇలాగే ఉంటుంది. తమను విడిపించటానికి ఆయనకున్న శక్తి విషయంలో వారి ఓర్పును వారి నమ్మకాన్ని దేవుడు పరీక్షిస్తాడు. తమ పరిస్థితి నిరాశజనకమని, తమ పాపాలు ఎంతో ఘోరమైనందున వాటికి క్షమపణ ఉండదని వారిని భయ పెట్టటానికి సాతాను ప్రయత్నిస్తాడు. తాము చేసిన పాపాల గురించి వారికి బాగా తెలుసు. తమ జీవితాన్ని అవలోకన చేసుకొన్నప్పుడు వారికి నిరీక్షణ కనిపించదు. కాగా దేవుని మహ కృపను చిత్తశుద్ధితో కూడిన తమ సొంత పశ్చాత్తాపాన్ని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపం పొందిన “పాపులకు క్రీస్తు ద్వారా ఆయన చేసిన వాగ్దానాల్ని వారు విశ్వసిస్తారు. తమ ప్రార్థనలకు వెంటనే జవాబు రానందున వారి విశ్వాసం సన్నగిల్లదు. యాకోబు దూతను గట్టిగా పట్టుకొన్నట్లు వారు దేవున్ని పట్టుకొని “నీవు నన్ను ఆశార్వదించి తేనేగాని నిన్ను పోనియ్యను” అంటారు. PPTel 190.3

జ్యేష్ఠత్వాన్ని వంచనద్వారా సంపాదించినందుకు యాకోబు అంతకుమందు పశ్చాత్తాపపడి ఉండకపోతే దేవుడు అతడి ప్రార్థన వినపోవును. అతడి ప్రాణాన్ని కాపాడకపోవునుకూడా. శ్రమకాలంలో కూడా అదే జరుగుతుంది. భయంతోను, వేదనతోను, నలిగిపోతున్న సమయంలో దైవ ప్రజలకు ఒప్పుకొని పాపాలుండి అవి అప్పుడు తమ ముందుకి వస్తే వారు ఓడిపోతారు. నిరాశ వారి విశ్వాసాన్ని నాశనం చేస్తుంది. విడుదల కోసం ప్రార్థించటానికి వారికి నమ్మకముండదు. అయితే వారికి తమ అయోగ్యతను గూర్చిన స్పృహ ఉండగా గోప్యంగా ఉంచాల్సిన పాపాలు వారికుండవు. ప్రాయశ్చిత్తం చేసే క్రీస్తు రక్తం వారి పాపాల్ని తుడిచివేసి ఉండటంతో వాటిని వారి గుర్తుకు తెచ్చుకోలేరు. PPTel 191.1

జీవితంలోని చిన్న చిన్న విషయాల్లో అపనమ్మకాన్ని దేవుడు విస్మరిస్తాడని నమ్మటానికి అనేకుల్ని సాతాను నడిపిస్తాడు. తాను దుర్మార్గతను ఏరూపంలోనూ సహించనని యాకోబుతో తాను వ్యవహరించిన తీరుబట్టి దేవుడు వ్యక్తం చేస్తున్నాడు తమ పాపాల్ని సమర్థించుకోటానికి లేదా కప్పిపుచ్చటానికి ప్రయత్నించి వాటిని ఒప్పుకోని క్షమాపణ పొందని పాపాలుగా పరలోక గ్రంథాల్లో ఉండనిచ్చే వారందరూ సాతానుకి దాసులవుతారు. వారు ఎంత ఉన్నత విశ్వాసులైతే , ఎంత గౌరవ ప్రదమైన హోదాలో ఉంటే దేవుని దృష్టిలో వారి చర్య అంత దారుణంగా ఉంటుంది. సాతాను విజయం అంత నిశ్చయమవుతుంది. మోసంవల్ల పాపంలో పడ్డప్పటికీ యాధార్థ పశ్చాత్తాపంతో దేవుని వద్దకు తిరిగి వచ్చేవారిని దేవుడు విసర్జించడనటానికి యాకోబు చరిత్ర నిదర్శనం. తన సొంత బలంతో పోరాటంలో ఏది పొందలేకపోయాడో దాన్ని ఆత్మ సమర్పణ ద్వారా విశ్వాసం ద్వారా యాకోబు పొందాడు. తాను ఆశిస్తున్న దీవెనలు దేవుని శక్తి దేవుని కృపద్వారా మాత్రమే లభ్యమవుతాయని దేవుడు ఈ రీతిగా తన సేవకుడికి బోధించాడు. చివరి దినాల్లో నివసించేవారి విషయంలోనూ ఇదే జరుగుతుంది. అపాయాలు చుట్టుముట్టి ఆత్మను నిస్పృలో ఆవరించినప్పుడు వారు ప్రాయశ్చిత్తపు ఆర్హతల మీద పూర్తిగా ఆధారపడాలి. సిలువను పొంది తిరిగి లేచిన రక్షకుని నీతిపై మనం ఆదారపడాలి. మనంతట మనం ఏమీ చేసుకోలేం. మన నిస్సహాయ అయోగ్య స్థితిలో విశ్వాసముంచాలి. ఇది చేసిన వారెవ్వరూ నశించరు. మన దోషాల జాబితా సర్వశక్తుని కళ్ళముందున్నది. రిజిష్టరు పూర్తి అయ్యింది. మన పాపాల్లో వేటినీ దేవుడు మార్చిపోలేదు. కాని పూర్వకాలంలో తన సేవకుల మొర ఆలకించిన ప్రభువు విశ్వాసయుతమైన ప్రార్థనను ఆలకించి మన ఆపరాధాల్ని క్షమిస్తాడు వాగ్దానం చేశాడు. ఆయన తన మాట నెరవేర్చుకొంటాడు. PPTel 191.2

తన పట్టుదలవల్ల ధృడ సంకల్పంవల్ల యాకోబు విజయం పొందాడు. ఎడ తెగకుండా ప్రార్థించటంలో ఉన్న శక్తికి యాకోబు ఆనుభవం నిదర్శనం. విజయం చేకూర్చే ప్రార్థనను మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడే. ఈ అచంచల విశ్వాస పాఠాన్ని నేర్చుకోవాల్సింది ఇప్పుడే. క్రీస్తు సంఘానికి గాని వ్యక్తిగత క్రైస్తవుడికిగాని కలిగే గొప్ప విజయాలు ప్రతిభాపాటవాలవల్లో విద్యవల్లో భాగ్యంవల్లో మనుషుల అభిమానంవల్లో సంభవించేవి కావు. అవి ప్రార్థన గదిలో బలమైన దైవ హస్తాన్ని పట్టుకొని నిజమైన హృదయ వేదనతో కూడిన విశ్వాసంతో దేవునితో విజ్ఞాపనలు చేసి సంపాదించే విజయాలు. PPTel 192.1

ప్రతీ పాపాన్ని విడిచి పెట్టి దేవుని దీవెన కోసం వెదకటానికి ఇష్టపడనివారందరూ దాన్ని పొందరు. కాని యాకోబులా దేవుని వాగ్దానాల్ని విశ్వసించి అతడిలా చిత్త శు ద్దితో ఎడతెగకుండా ప్రార్థించే వారందరూ అతడు జయించినట్లు జయించగలగుతారు. “దేవుడు తాను ఏర్పరచుకొనినవారు దివారాత్రులు తన్ను గూర్చి మొఱ్ఱ పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయనవారికి త్వరగా న్యాయము తీర్చును”. లూకా 18:7,8. PPTel 192.2