పితరులు ప్రవక్తలు

53/75

51—పేదసాదలపై దేవుని శ్రద్ధ

ప్రజల ఆధ్యాత్మిక సమావేశాల నిర్వహణకు పేదసాదల ఆహారాది వసతి కల్పనకు ఆదాయమంటితోను రెండో దశమ భాగం చెల్లింపు అవసరమయ్యింది. మొదటి దశమ భాగం చెల్లింపును గూర్చి ప్రభువిలా సెలవిచ్చాడు, “లేవీయులు చేయు సేవకు.. ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని” సంఖ్యాకాండము 18:21. కాని రెండో దశమ భాగం గురించి ఆయన ఇలా ఆజ్ఞాపించాడు, “నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడనేర్చు కొనునట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని, నీ ద్రాక్షారసములో గాని నీ నూనెలో గానిపదియవ వంతును, నీ పశువులలో గాని గొట్టె మేకలలో గాని తొలిచూలు వాటిని తినవలెను” ద్వితి 14:23, 29, 16:11-14. వారు ఈ దశమ భాగాన్ని లేదా ద్రవ్యరూపంలో దాని విలువను రేండేళ్ళపాటు గుడారం స్థాపితమైన స్థలానికి తేవాల్సి ఉంది. దేవునికి కృతజ్ఞతార్పణను చెల్లించి యాజకుడికి నిర్దేశించిన భాగాన్ని అతడికి ఇచ్చిన తర్వాత మిగిలిన భాగాన్ని అర్పణ ఇచ్చేవారు మత సంబంధమైన విందుకు ఉపయోగించాలి. ఈ విందులో లేవీయులు, పరదేశులు, తండ్రి లేని వారు, విధవరాళ్ళు పాలు పొందాల్సి ఉన్నారు. ఈ రకంగా సాంవత్సరిక పండుగల్లో కృతజ్ఞతా ర్పణకు విందు భోజనాలకు వసతులు ఏర్పాట్లు చేసేవారు. ప్రజలు లేవీయులతోను యాజకులతోను సహవాసం చేసి ఉపదేశం పొందటానికి దైవ సేవ చేయటానికి స్ఫూర్తిని పొందేవారు. PPTel 529.1

పోతే ప్రతీ మూడు ఏడు లేవీయుల్ని బీదవారిని ఆదరించటానికి ఈ రెండో దశమ భాగాన్ని మోషే చెప్పిన ప్రకారం ఉపయోగించటం జరిగేది. “వారు నీ గ్రామములలో తిని తృప్తి” పొందాలి. ద్వితి 26:12. ఈ దశమ భాగాన్ని ధర్మకార్యాలికి అతిథి సత్కారాలకు ఉపయోగపడే నిధిగా ఉంచాలి. PPTel 529.2

ఇది గాక బీదలకు ఇంకా అదనపు ఏర్పాట్లు ఉండేవి. దేవుని హక్కయిన దశమ భాగ నిబంధన తర్వాత పేదలపట్ల ఔదర్యం, కనికరం, అతిథ్యం ప్రదర్శించాలన్న నిబంధన మోషే ఇచ్చిన నిబంధనల్నిటిలో ప్రత్యేకంగా నిలుస్తుంది. తన ప్రజల్ని బహుగా ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేసినా వారి మధ్య అసలు పేదరికమే ఉండకూడదన్నది దేవుని సంకల్పం కాదు. దేశంలో పేదలు ఉండక పోవటం ఎన్నడూ జరుగకూడదని ప్రభువన్నాడు. తమ సానుభూతి, దయ, కనికరం ఔదార్యాల్ని పొందాల్సిన ప్రజలు దైవ ప్రజల నడుమ ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఇప్పటి లాగే అప్పుడు కూడా దురదృష్టానికి, వ్యాధికి, ఆస్తి నష్టానికి గురి అయిన వారుండేవారు. అయినా ప్రజలు దేవుని ఉపదేశాల్ని అనుసరిస్తూ నివసించినంత కాలం వారి మధ్య బిచ్చగాళ్ళు లేరు. తిండికి బాధపడ్డ వాళ్ళు లేరు. దైవ నిబంధన భూమి పంటలో కొంతభాగం బీదలకు నిర్దేశించింది. ఒక వ్యక్తి ఆకలిగొన్నప్పుడు తన పొరుగున ఉన్న వ్యక్తి పొలంలోకో, పళ్ళతోటలోకో, ద్రాక్షతోటలోకో వెళ్ళి పళ్ళు, కాయలు గింజలు తిని స్వేచ్చగా ఆకలి తీర్చుకోవచ్చు. సబ్బాతునాడు ఒక పొలం దాటుతూ శిష్యులు వెన్నులు నలుపుకు తినటం ఈ అనుమతిని బట్టే జరిగింది. PPTel 529.3

చేలలోని పరిగెపళ్ళ చెట్ల పైన, ద్రాక్షతోటలోను మిగిలి ఉన్న పళ్ళు పేదల సొత్తు మోషే ఇలా అన్నాడు, “నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మరచిపోయిన యెడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకూడదు... నీ ఒలీవ పండ్లను ఏరునప్పుడు నీ వెనకనున్నపరిగెను ఏరుకొనకూడదు... నీ ద్రాక్ష పండ్లను కోసికొన్నప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు. అది పరదేశు లకును తండ్రి లేని వారికిని విధవ రాండ్రకును ఉండవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై యుంటివని జ్ఞాపకము చేసికొనుము” ద్వితి 24:19-22, లేవీ 19:9, 10. PPTel 530.1

ప్రతి ఏడో ఏటా బీదల కోసం ప్రత్యేక ఏర్పాటు ఉండేది. పంట అయిపోటంతో విశ్రాంతి సంవత్సరం అరంభయమ్యేది. ఫల సంగ్రహణ తర్వాత విత్తనాలు జల్లే కాలంలో ప్రజలు విత్తనాలు జల్ల కూడదు. గ్రీష్మకాలంలో ద్రాక్ష తీగలు కత్తిరించకూడదు. పంటకోసం గాని ద్రాక్ష పళ్ళకోసం గాని కనిపెట్టకూడదు. దానంతట అదే చేలో పండే పంటను తాజాగా ఉన్నప్పుడు తినవచ్చు. కాని అందులో ఏ కొంచెం కూడా ఇళ్ళలో దాచుకోకూడదు. ఈ సంవత్సరం పంటను పరదేశులికి, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు, పొలాల్లోని మూగ జీవులకు ఆహారంగా విడిచి పెట్టాలి. నిర్గమ 23:10, 11, లేవీ 25:5. PPTel 530.2

సామాన్యంగా ప్రజలకు సరిపోయేటంతగానే పండితే పంటలు పండించ కూడని ఆ సంవత్సరం ప్రజలు ఏం తినిబతకాలి? దీనికి దేవుని వాగ్దానం సమృద్ధిగా ఏర్పాట్లు చేసింది.. ఆయన ఇలా అన్నాడు, “నేను ఆరవ యేట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను, అది మూడేండ్ల పంటను మీకు కలుగజేయును. మీరు ఎనిమిదవ సంవత్సరమున విత్తనములు విత్తి తొమ్మిదవ సంవత్సరము వరకు పాతదానిని తినెదరు” లేవీ 25:21, 22. PPTel 530.3

విశ్రాంతి సంవత్సరాన్ని ఆచరించటం అటు భూమికి, ఇటు జలకూ ప్రయోజనం కలిగేది. ఒక ఏడాదిపాటు భూమిని దున్నకుండ ఉంచటం వల్ల అది తర్వాత మరింత సమృద్ధిగా పండేది. ప్రజలు పొలాల్లో పరిశ్రమించాల్సిన పని ఉండేది కాదు. ఆ సమయంలో వారు చేయటానికి రకరకాల పనులుండటంతో అందరికీ బోలెడు విరామం లభించేది. తర్వాతి ఏళ్ళు చేయాల్సిన శ్రమకు అవసరమైన శారీరక శక్తిని అది వారిలో నింపేది. దైవ ధ్యానానికి ప్రార్థనకు, వాక్య బోధనల్ని విధుల్ని అవగాహన చేసుకోటానికి, తమ కుటుంబికులికి ఉపదేశం ఇవ్వటానికి ఎక్కువ అవకాశం కలిగించేది. PPTel 531.1

విశ్రాంతి సంవత్సరంలో హెబ్రీయులు తమ బానిసలికి స్వేచ్ఛ ఇవ్వాల్సి ఉండేది. బానిసల్ని పట్టి చేతుల్తో పంపంటానికి లేదు. ప్రభువిచ్చిన ఆదేశం ఇది “అయితే వారిని విడిపించి నీ యొద్ద నుంచి పంపివేయునప్పుడు నీవు వట్టి చేతులతో వాని పంపివేయకూడ... దనీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్ష తోటలోను కొంత అవశ్యముగా వానికియ్యవలెను. నీ దేవుడైన యెహోవానిన్ను ఆశీర్వదించి నీ కనుగ్రహించిన దానిలో కొంత వానికియ్యవలనెను” ద్వితి 15:13,14. PPTel 531.2

పనివాడి కూలి సక్రమంగా చెల్లించాల్సి ఉండేది: ” నీ సహోదరులలో నేమి నీ దేశమందలి నీ గ్రామములో నున్న పరదేశులలోనేమి దీన దరిద్రుడైన కూలి వానిని బాధింపకూడదు. ఏనాటి కూలి అనాడియ్యవలెను. సూర్యుడు అస్తమింపక మునుపు వానికియ్యవలెను. వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని యుండును” ద్వితి 24:14, 15. తన యాజమాని వద్ద నుంచి పారిపోయిన బానిసతో వ్యవహరించటానికి ప్రత్యేక ఆదేశాలుండేవి. “తన యజమానుని యొద్ద నుండి తప్పించుకొని నీ యెద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగించకూడదు. అతడు తన యిష్ట ప్రకారము నీ గ్రామములలో ఒకదాని యందు తాను ఏర్పారచుకొనిన చోట మీతో కలిసిమీ మధ్య నివసించవలెను, నీవు వాని బాధింపకూడదు”. ద్వితి 23:15, 16. PPTel 531.3

ఈ ఏడో సంవత్సరం బీదలకు రుణవిముక్తి సంవత్సరం. మంచి స్థితిలో లేని తమ సోదరుల్ని వడ్డీ లేకుండా అప్పిచ్చి ఆదుకోవటం తమ ధర్మమని హెబ్రీయులికి ఆదేశం ఉండేది. బీదవారి వద్ద వడ్డీ వసూలు చేయటం నిషిద్ధం. “పరవాసియైను అతిథియైనను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన యెడల నీవు వానికి సహాయము చేయవలెను. అతడు నీ వలన బ్రతుకువలెను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డనైనను తీసికొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతుకవలెను. నీ రూకలు వానికి వడ్డీకియ్యకూడదు, నీ ఆహారమును వానికి లాభమునకియ్యకూడదు” లేవీ 25:35-37. విడుదల సంవత్సరం వరకు రునం చెల్లింపు నిలిచి ఉంటే అసలు కూడా వసూలు చెయ్యకూడదు. దీన్ని బట్టి సహోదరులకు ఆర్థిక సహాయం నిలిపివేయకూడదని ప్రజల్ని హెచ్చరించటం జరిగేది. “నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన యెడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండ నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. విడుదల సంవత్సరమైన యేడవ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టకయుండు నట్లు జాగ్రత్తపడుము. బీదవాడైన నీ సహోదరుని యెడల కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యక పోయిన యెడల వాడొక వేళ నిన్ను గూర్చి యెహోవాకు మొట్ట పెట్టును అది నీకు పాపమగును.” “బీదలు దేశములో ఉండక మానరు. అందుచేత నేను - నీ దేశములోనున నీ సహోదరులను దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెని నీ కాజ్ఞాపించుచున్నాను”. “చెయ్యిచాచి, వాని అక్కర చొప్పున ఆ యక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను” ద్వితి. 15:7-9, 11,8. PPTel 531.4

ఉదారత తమను పేదరికానికి దిగజార్చుతుందేమోనని ఎవరూ దిగులు చెందనవసరం లేదు. దైవాజ్ఞల ఆచరణ అభివృద్ధికి బాటలు పరుస్తుంది. దేవుడిలా అన్నాడు, “నీవు అనేక జనములకు అప్పిచ్చెదవుగాని అప్పుచేయవు, అనేక జనములను ఏలుదువుగాని వారు నిన్ను ఏలరు” ద్వితి 15:6. PPTel 532.1

“ఏడు విశ్రాంతి సంవత్సరములు” అనగా “ఏడేసి యేండ్లు గల సంవత్సరముల” తర్వాత విడుదల సంవత్సరం వచ్చేది. అదే యాభై ఏళ్ళ జూబిలి. “మీ స్వదేశమంతట శృంగనాదము చేయవలెను... మీరు ఆ సంవత్సరమును అనగా ఏబదియవ సంవత్సరమును పరిశుద్ధ పరచి మీ దేశ వాసులకందరికి విడుదల కలిగినదని చాటించవలెను. అది మీకు సునాదముగా నుండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడును తన కుటుంబమునకు తిరిగి రావలెను” లేవీ 25:9, 10.“ఏడవ నెల పదియవనాడు.. ప్రాయశ్చితార్తర దినమున” శృంగనాదం చేసేవారు. దేశమంతా యూదు ప్రజలు నివాసముండే ప్రాంతాల్లో ఆ శృంగానాదం వినిపించేది. విడుదల సంవత్సరాన్ని స్వాగతించాల్సిందిగా యాకోబు సంతతివారికి పిలుపునిచ్చేది. ఆ మహా ప్రాయశ్చిత్తార్థ దినాన ఇశ్రాయేలీయుల పాపాలకి ప్రాయశ్చిత్తం జరిగే వారికి తృప్తి కలిగింది. అందువల్ల ఆ సునాద కాలాన్ని ప్రజలు సంతోషానందాలతో స్వాగతించేవారు. PPTel 532.2

విశ్రాంతి సంవత్సరంలో లాగే సునాదకాంలోనూ విత్తనాలు నాటటం పంటలు కోయటం లేదు. భూ ఫలాలన్నీ బీదల సొత్తుగా పరిగణించటం జరిగేది. కొన్ని తరగతుల హెబ్రీ బానిసలు అనగా విశ్రాంతి సంవత్సరంలో స్వాతంత్ర్యం పొందని బానిసలంతా ఇప్పుడు స్వేచ్చ పొందేవారు. సునాద సంవత్సరం తాలూకు ప్రత్యేకతేమిటంటే భూములు వాటి మొదటి సొంతదారులు కుటుంబాలకు తిరిగి సక్రమించటం. దేవుని ప్రత్యేకాదేశం మేరకు మెట్ల ద్వారా భూమిని పంచటం జరిగింది. పంపిణీ జరిగిన తర్వాత ఎవరూ తమ భూమిని ఫిరాయించటానకి వీల్లేదు. పేదరికం ఒత్తిడి వల్ల తప్ప ఎవరూ తమ భూమిని విక్రయించటానికి లేదు. అనంతరం అతడు గాని అతడి బంధువు గాని ఆ భూమిని విడిపించుకోగోరితే కొనుగోలు చేసిన వ్యక్తి దాన్ని తిరిగి అమ్మటానికి నిరాకరించకూడదు. తిరిగి కొనుగోలు జరగకుండా ఉంటే సునాద సంవత్సరంలో అది దాని మొదటి సొంతదారుడికో అతడి వారసుడికో సంక్రమించేది. PPTel 533.1

ఇశ్రాయేలుతో ప్రభువిలా అన్నాడు, “భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు”. లేవీ 25:23. ఆది దేవునికి చెందిన భూమి అని కొంతకాలం మాత్రమే దాన్ని వారు తమ స్వాధీనంలో ఉంచుకోవచ్చునని, దానికి ఆయనే ఆదిమ సొంతదారుడు హక్కు దారుడు అని, బీదలకు దిక్కులేని వారికి తాము ప్రత్యేకంగా దయ చూపించాలని ఆయన కోరుతున్నాడని ప్రజలు గుర్తించాల్సి ఉంది. దేవుని ప్రపంచంలో భాగ్యవంతులకు ఎంత హక్కున్నదో బీదలకూ అంతే హక్కున్నదని అందరూ గుర్తించాలన్నది దేవుని ఉద్దేశం. PPTel 533.2

దిక్కులేని వారి, దు:ఖాక్రాంతులైన వారి చీకటి బతుకుల్లో కొంత బాధను తగ్గించటానికి, ఆశాకిరణాన్ని ప్రసరింపజేయటానికి, కొంత వెలుగు విరజిమ్మటానికి కృపగల దేవుడు ఇలాంటివి ఏర్పాటు చేశాడు. PPTel 533.3

ఆస్తి మీద అధికారం మీద అమితమైన అనురక్తికి దేవుడు కళ్ళెం వేస్తాడు. ఒక తరగతి ప్రజలు ధనాన్ని కూడబెట్టుకుపోతూ ఉండటం మరో తరగతి వారు పేదరికంతో సతమతమవ్వటం వల్ల ఎన్నో అనర్థాలు చోటు చేసుకొంటాయి. నియంత్రణ లేకపోతే ధనికుల అధికారానికి అడ్డు ఆపు ఉండదు. దేవుని దృష్టిలో సమాన యోగ్యతగల పేదలు వారికన్నా తక్కువ వారిగా పరిగణన పొందుతారు. తక్కువ అన్న భావనతో కూడిన బాధ పేదవర్గాల్లో విద్వేషం రెచ్చగొడ్తుంది. నిరాశ నిస్పృహలు ఏర్పాడ్డాయి. ఇవి సమాజాన్ని నిరుత్సాహంతో నింపి రకరకాల నేరాలకు తలుపు తెరుస్తాయి. దేవుడిచ్చిన నిబంధనలు సాంఘిక సమానతను పెంపొందిం చేందుకు ఏర్పాటయ్యాయి. విశ్రాంతి సంవత్సరానికి సునాద సమయానికీ సంబంధించిన నిబధనలు సమాజంలోను రాజకీయ వ్యవస్థలోను మధ్యకాలంలో చోటుచేసుకొన్న భ్రష్టాచారాల్ని చాలా వరకు సరిదిద్దాయి. PPTel 533.4

ఈ నిబంధనలు ధనికులకు పేదలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఏర్పాటయ్యా యి. ప్రజల్లో దురాశకు, స్వీయ ఘనత పై ఆసక్తికి కళ్ళెం వేసి వారిలో పరోపకార స్పూర్తిని పెంచుతాయి. అన్ని వర్గాల ప్రజల మధ్య సుహృద్భావం నమ్మకం పెంపొందించటం ద్వారా అవి సమాజ క్రమాన్ని ప్రభుత్వ సుస్థిరతను ప్రోది చేస్తాయి. మనమంతా ఒకే మానవ జాతికి చెందినవారం. ఇతరుల శ్రేయస్సుకు మనం చేయగలిగింది చేస్తే అది మనకు మేలుగా పరిణమిస్తుంది. సమాజంలోని ఆయా తరగతుల ప్రజలు పరస్పరం ఆధారపడి నివసిస్తుంటారు. బీదలు ధనికుల పై ఆధారపడినంతగానే ధనికులూ బీదల పై ఆధారపడి నివసిస్తారు. దనికులైన తమ పొరుగు వారికి దేవుడిచ్చిన భాగ్యంలో తాము పాలు పంచుకోవాలని ఒక తరగతి ప్రజలు ఆశిస్తే ధనికులకు పేదల మేధాశక్తి కండబలం పెట్టుబడి అవసరమవుతుంది. PPTel 534.1

తన ఆదేశాలకు విధేయత షరతు పై ఇశ్రాయేలీయులికి దేవుడు గొప్ప దీవెనల్ని వాగ్దానం చేశాడు. ప్రభువిలా అంటున్నాడు, “మీ వర్షాకాలములో మీకు వర్షమి చ్చెదను. మీ భూమి పంటనిచ్చును మీ పొలముల చెట్లు ఫలించును. మీ ద్రాక్షాపండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భూజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగ జేసెదను. మీరు పండుకొనునప్పుడు ఎవడును మిమ్మును భయ పెట్టడు, ఆదేశములో దుష్ట మృగములు లేకుండా చేసెదను, మీ దేశములోనికి ఖడ్గమురాదు... నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడునై యుందును... మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన యెడల ... మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు పగవాడనవుదును, మీ శత్రువుల యెదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మును ఏలెదరు, మిమ్మును ఎవరును తరుమక పోయినను మీరు పారిపోయెదరు” లేవీ. 26:4-17 PPTel 534.2

దేవుడిచ్చే లౌకికమైన సంపదలో అందరికీ సమాన పాలు పంపులుండాలని గొప్ప ఉత్సాహంతో ప్రచారం చేసేవారు అనేకమంది. అయితే ఇది సృష్టికర్త ఉద్దే శం కానే కాదు. వివిధ పరిస్థితుల ద్వారా ప్రవర్తనను పరీక్షించి వృద్ధి పర్చటం దేవుని సంకల్పం. కాగా లోక సంబంధమైన సంపదలు గలవారు తమకు దేవుడిచ్చిన సంపదకు జవాబుదారులని దాన్ని బాధల్లోను అవసరాల్లోను ఉన్న మానవులను ఆదుకోటానికి ఉపయోగించేందుకు ఆయన తమకిచ్చాడని వారు గుర్తించాలన్నది ఆయన ఉద్దేశం. PPTel 535.1

పేదలు మన మధ్య నిత్యమూ ఉంటూనే ఉంటారని క్రీస్తు చెప్పాడు. బాధలకు గురి అయిన బతుకీడ్చే తన ప్రజలపట్ల ఎంతో ఆసక్తి కనపర్చాడు. లోకంలోని నిరు పేదలు అతి దీనులు అయిన తన ప్రజల పట్ల మన రక్షకునికి అమితమైన సానుభూమి. వారే తనకు ఈ లోకంలో రాయబారులని ప్రభువంటున్నాడు. శ్రమలకు పీడనకు గురి అయిన వారి పట్ల ఆయనకు గల ప్రేమను మన హృదయాల్లో రగిలింప జేయటానికి వారిని మన మధ్య ఆయన ఉంచుతున్నాడు. వారి పట్ల కనపర్చిన దయను ఔదార్యాన్ని క్రీస్తు తన పట్ల కనపర్చినట్లే పరిగనిస్తాడు. వారి పట్ల ప్రదర్శించిన కాఠిన్యాన్ని లేదా నిర్లక్ష్యాన్ని తన పట్ల ప్రదర్శించినట్లే ఆయన భావిస్తాడు. PPTel 535.2

పేదల ప్రయోజనం కోసం దేవుడు ఇచ్చిన నిబంధనల్ని ప్రజలు అనుసరిస్తూ ఉంటే ప్రపంచ పరిస్థితి నైతికంగా, ఆధ్యాత్మికంగా లౌకికంగా ఎంత వ్యత్యాసంగా ఉండేది! స్వార్థానికి స్వీయ ప్రాబల్యానికి ఇప్పటిలా ప్రాధాన్యం ఉండేది కాదు. కాని అందరూ పరుల ఆనందాన్ని శ్రేయాన్ని కోరి సహకరించేవారు. ప్రస్తుతం అనేక దేశాల్లో కొట్టొచ్చినట్లు కనిపించే దారిద్ర్యం మచ్చుకు కూడా కనిపించేది కాదు. PPTel 535.3

ఉన్నవారు లేని వారిని పీడించటం, లేని వారు ఉన్నవారికి ద్వేషించి శంకించటం వల్ల చోటు చేసుకొనే భయంకర దుష్ఫలితాల్ని నివారించేందుకు దేవుడిచ్చిన నిబంధనలు ఎంతో తోడ్పడ్డాయి. ఆ నిబంధనలు గొప్ప భాగ్యాన్ని సంపాదించటానికి, విశృంఖల భోగాల్ని అనుభవించటానికి ప్రతి బంధకాలుగా నిలిచినప్పటికీ వారు ఆ భాగ్యాన్ని సంపాదించటానికి అరకొర వేతనాలిచ్చి పీడించే వేలాది కార్మికుల ఆజ్ఞానాన్ని దుస్థితిని నివారిస్తాయి. నేడు అరాచకాన్ని రక్తపాతాన్ని సృష్టిస్తున్న సమస్యలకు ఆ నిబంధనలు శాంతియుత పరిష్కారాన్ని సాధిస్తాయి. PPTel 535.4