పితరులు ప్రవక్తలు

43/75

41—యోర్దాను వద్ద భ్రష్టత

ఆనందోత్సాహాలతో దేవుని పై ద్విగుణీకృత విశ్వాసంతో ఇశ్రాయేలు సేనలు బాషానుకు తిరిగి వచ్చాయి. అప్పటికే వారు విలువైన భూభాగాన్ని స్వాధీనం చేసుకొన్నారు. వెంటనే కనానును జయించగలమన్న విశ్వాసంతో ఉన్నారు. కనానుకి వారికి మధ్య యోర్డాను నది మాత్రమే ఉంది. నది అవతల పక్క సారవంతమైన భూములు, వాటిలో పచ్చని పైరులు వాటికి సమృద్ధిగా నీరు అందిస్తూ ప్రవహించే సెలయేళ్లు, ఆ సెలయేళ్ల పక్క నీడనిస్తూ గుబురుగా పెరిగే ఖర్జూరపు చెట్టూ ఉన్నాయి. ఆ పొలాల పశ్చిమ పొలిమేరలో యెరికో పట్టణ గోపురాలు, రాజభవనాలు ఉన్నాయి. ఖర్జూరపు తోటల మధ్య చక్కగా అమరి ఉండటం వల్ల ఆ పట్టణానికి “ఖర్జూర వృక్షములు గల పట్టణము” అన్న పేరు వచ్చింది. PPTel 449.1

యోర్దాను తూర్పు పక్క నదికి వారు ప్రయాణం చేయాల్సి ఉన్న విస్తారమైన మైదాన ప్రాంతానికీ మధ్య కొన్ని మైళ్ల వెడల్పు కలిగి నదీ తీరం పొడవున చాలాదూరం విస్తరించి ఒక మైదానం ఉన్నది. నీడలో ఉన్న ఈ లోయలోని వాతావరణం ఉష్ణమండల వాతావరనం. ఇది తుమ్మ చెట్ల పెరుగుదలకు అనుకూల వాతావరణం. అందుకే దీనికి “షిత్తీము లోయ” అనే పేరు కలిగింది. ఇశ్రాయేలీయుల ఇక్కడ శిబిరం వేశారు. నది పక్క తుమ్మవనంలో వారికి చక్కని విశ్రాంతి స్థలం లభించింది. PPTel 449.2

అయితే సాయుధ బలగాల కన్నా, అరణ్యంలోని క్రూర మృగాల కన్నా ప్రానాంతకమైన కీడును హృదయంరంజకమైన ఈ పరిసరాల నడుమ వారు ఎదుర్కోవాల్సి ఉన్నారు. స్వాభావిక వనరులు సమృద్ధిగా ఉన్న ఆ దేశాన్ని ఆ దేశ ప్రజలు అపవిత్రపర్చారు. ఆ ప్రజల ప్రధాన దేవత బయలు. బయలు దేవత బహిరంగ పూజలో మిక్కిలి దుర్మార్గమైన అనైతికమైన దృశ్యాలు నిత్యము దర్శనమిచ్చాయి. విగ్రహారాధనకు, విచ్చలవిడి ప్రవర్తనకు పేరుపడ్డ స్థలాలు అన్నిపక్కలా ఉన్నాయి. ఆ స్థలాల పేర్లు ఆ ప్రజల దుష్టత్వానికి, దుర్నీతికి అద్దం పట్టాయి. PPTel 449.3

ఈ పరిసరాలు ఇశ్రాయేలీయుల పై దుష్ప్రభావాన్ని ప్రసరించాయి. ఆ ప్రభావ ఫలితంగా వారి మనసులు చెడు తలంపులతో నిండాయి. ఆ ప్రజల విలాస జీవితం, సోమరితనం వాటి దుష్పలితాల్ని కనపర్చాయి. తమకు తెలియకుండానే ఇశ్రాయేలీ యులు దేవునికి దూరమై శోధనకు సులభంగా లొంగిపోయే స్థితికి వచ్చారు. PPTel 449.4

వారు యోర్దాను నది పక్కన శిబిరం వేసిన కాలంలో మోషే కనాను ఆక్రమణకు సన్నద్ధమౌతున్నాడు. ఆ అధినాయకుడు ఆ పనిలో తల మునకలై ఉన్నాడు. ఉత్కంఠతోను, ఉహాగానాలతోను నిండిన ఆ సమయం వారికి పరీక్ష సమయం.ఎన్నో వారాలు గడవకముందే వారు నీతి నిజాయితీల నుంచి భక్తి విశ్వసనీయతల నుంచి పూర్తిగా తొలగిపోయిన దుష్ట చరిత్రను సృష్టించుకొన్నారు. PPTel 450.1

ప్రారంభంలో ఇశ్రాయేలీయులకి వారి పొరుగున వున్న ఆన్యజనులకు మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొంతకాలం గతించాక మిద్యాను స్త్రీలు శిబిరంలోకి రావటం మొదలు పెట్టారు. వారి రాక ఎవరికీ ఆందోళన కలిగించ లేదు. ఆ స్త్రీలు గుట్టుమట్టుగా వ్యవహిరించటంతో ఆ విషయం మోషే దృష్టికి రాలేదు. హెబ్రీయులతో చనువుగా మెలగటంలో ఈ స్త్రీల ఉద్దేశం దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేటట్లు ఇశ్రాయేలీయులను తప్పుదారి పట్టించి, అన్యాచారల పట్ల వారికి ఆసక్తి పుట్టించి, వారిని విగ్రహారాధనకు నడిపించటమే. ఇశ్రాయేలు ప్రజల నాయకులు సైతం తమను అనుమానించకుండేందు నిమిత్తం వారు ఈ దురుద్దేశాల్ని స్నేహం ముసుగుకింద దాచి ఉంచారు. PPTel 450.2

బిలాము సలహామేరకు మోయాబీయుల రాజు తమ దేవుళ్ళకు గౌరవార్థం ఒక బ్రహ్మాండమైన ఉత్సవం ఏర్పాటు చేశాడు. దానికి ఇశ్రాయేలీయులు హాజరు కావటానికి బిలాము వారిని ప్రలోభపెట్టటానికి రహస్యంగా ఏర్పాట్లు జరిగాయి. వారు బిలామును దేవుని ప్రవక్తగా పరిగణించటంతో ఆ కార్యాన్ని సాధించటం అతడికి కష్టం కాలేదు. ఆ ఉత్సవాల్ని తిలకించటానికి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. నిషిద్ధ ప్రదేశంలో అడుగులు వేశారు. సాతాను ఉచ్చులో పడ్డారు. సంగీతానికి, నాట్యానికి అన్యులు ధరంచే అందమైన దుస్తులకి ఆకర్షితులై వారు యెహోవాపట్ల భక్తి విశ్వాసాల్ని వదులుకున్నారు. వారు అన్యులతో కలిసి తిని తాగటంలో మునిగిపోయారు. మద్యం వారి మనసుల్ని మసకబార్చి ఆత్మ నిగ్రహాన్ని నాశనం చేసింది. ఆవేశం రాజ్యమేలింది. మనస్సాక్షిని అపవిత్ర పర్చుతూ కామాంధులై వారు అశీల్లంగా ప్రవర్తించారు. విగ్రహాలకు మొక్కారు. అన్య బలిపీఠాల పై బలులర్పించి నీచమైన కర్మకాండలలో పాల్గొన్నారు. PPTel 450.3

ప్రాణాంతకమైన వ్యాధిలా కొద్దికాలంలోనే ఆ విషం ఇశ్రాయేలీయుల శిబిరమంతా పాకింది. యుద్ధంలో శత్రువుల్ని మట్టికరిపించగలిగిన వారు అన్య స్త్రీల మాయలకు మోసాలకు పడిపోయారు. ప్రజలు కామాంధులయ్యారు. ఈ పాపానికి ఒడికట్టుకొన్న వారిలో ప్రథములు అధికారులు, నాయకులు ఎంతో మంది ప్రజలు అపరాధులయ్యారు. భ్రష్టత దేశ వ్యాప్తమయ్యింది. “ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనెను”. జరిగిన కీడును మోషే గుర్తించేసరికి శత్రువుల పన్నాగాలు ఎంతగా విజయవంతమయ్యాయంటే ఇశ్రాయేలీయులు పయోరు కొండ వద్ద జరిగే వ్యభిచార పూర్వక పూజలో పాలుపొందటమే గాక ఇశ్రాయేలీయుల శిబిరంలో ఆ అన్యాచారాల్ని ఆచరింటం మొదలు పెట్టారు. వృద్ధ నాయకుడు ఆగ్రహంతో వణికాడు. దేవుని కోపం రగుల్కొన్నది. PPTel 451.1

బిలాము శకునాలన్నీ ఇశ్రాయేలీయులికి చేయలేకపోయిన కీడు వారి దురాచారాలు, అనాచారాల ద్వారా జరిగింది. అవి వారిని దేవుని నుంచి వేరు చేశాయి. శరవేగంగా వచ్చిన తీర్పుల మూలంగా ప్రజలు తమ పాపం తీవ్రతను గుర్తించారు. శిబిరంలో భయంకరమైన తెగులు పుట్టి వేలాదిమందిని బలిగొన్నది. ఈ భ్రష్టతలో నాయకులైన వారిని న్యాయాధిపతులు చంపాలని దేవుడు ఆజ్ఞా పించాడు. ఈ ఆదేశం వెంటనే అమలయ్యింది. అపరాధులు హతమయ్యారు. నాయకులతో దేవుడు కఠినంగా వ్యవహిరించటాన్ని బట్టి పాపమంటే దేవునికి ఎంత ద్వేషమో అట్టి వారి పట్ల ఆయనకు ఎంత ఆగ్రహమో ఇశ్రాయేలీయులందరూ చూసి తెలుసుకొనేందుకు హతుల శవాల్ని వేలాడదీశారు. PPTel 451.2

అది న్యాయమైన శిక్ష అని అందరూ భావించారు. ప్రజలు గబగబ గుడారంలోకి వెళ్లి కన్నీటితో తమ పాపాన్ని ఒప్పుకొన్నారు. గుడారం ద్వారం వద్ద దేవుని ముందు ప్రజలు విలపిస్తూ ఉండగా, తెగులు ఇంకా జనాల్ని చంపుతూ ఉండగా, న్యాయాధిపతులు దోషుల్ని సంహరిస్తూ ఉండగా ఇశ్రాయేలీయుల ప్రధానుల్లో ఒకడైన జిఘే ఒక మిద్యాను వేశ్యను శిబిరంలోకి తన గుడారంలోకి ధైర్యంగా తీసుకు వచ్చాడు. ఇంత ధైర్యంగా మంకుగా పాపం చేయటం ఎన్నడూ జరుగలేదు. మద్యం మత్తులో మునిగి తనది “సొదొమ పాపము” అని ప్రకటిస్తూ జిమీ ఆ నీచ క్రియ గురించి అతిశయించాడు. దేవుని ఉగ్రతను దిక్కరించటానికీ, న్యాయాధిపతుల్ని వెక్కింరించటానికి అన్నట్లు ఈ ఇశ్రాయేలు ప్రధాని తన నికృష్ణ పాపాన్ని సమాజం కళ్లముందే జరిగించినందుకు తన ప్రజల్ని నాశనం చేయక వారిని కాపాడంటూ ప్రభువును వేడుకొంటూ యాజకులు, నాయకులు “మంటపమునకును, బలిపీఠమునకును” మధ్య సాష్టాంగపడి విలపించాడు. ప్రధాన యాజకుడు ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు సర్వసమాజం మధ్యలో నుంచి లేచి ఈ టెను చేతపట్టుకొని “పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్లి” వారిద్దరినీ పొడిచి చంపాడు. అంతట ఆ తెగులు ఆగిపోయింది. దేవుని శిక్షను అమలు పర్చిన యాజకుడు ఇశ్రాయేలీయుల మన్నన పొందాడు. అతడికీ అతడి సంతతివారికీ యాజకత్వం నిత్యమూ ఉంటుందని ధ్రువీకృతమయ్యింది. PPTel 451.3

ఫీనెహాసు ” ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపమును మళ్లించెను” అన్నది దేవుని వర్తమానం. “కాబట్టి అతనితో ఇట్లనుము - అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను”. PPTel 452.1

షిలీములో వారు చేసిన పాప పర్యవసానంగా వచ్చిన శిక్షలు ఆ విస్తార ప్రజాసమూహంలో మిగిలి వున్నవారిని నాశనం చేశాయి. దాదాపు నలభై ఏళ్ల వెనుక ఈ ప్రజా సమూహం విషయంలో దేవుని తీర్పు ఇది, “వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురు”. యోర్దాను నది పక్క మైదానంలో ఇశ్రాయేలీయులు శిబిరం వేసిన కాలంలో దేవుని ఆదేశం మేరకు నిర్వహించిన జనాభా లెక్కల్లో “మో షే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు... యెపున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువాయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు” సంఖ్యా 26:64, 65. PPTel 452.2

మిద్యానీయుల ఆకర్షణలకు లొంగినందుకు ఇశ్రాయేలీయుల మీదికి దేవుడు శిక్షలు పంపించాడు. వారి శోధకులు కూడా దేవుని ఆగ్రహానికి, ఆయన తీర్పుకి గురి అయ్యారు. ఇశ్రాయేలీయుల ప్రయాణంలో బలహీనులు అలసినవారు కొంచెం వెనుకబడి ఉండగా రెఫీదీములో వారి పై దాడిచేసిన అమాలేకీయుల్ని చాలాకాలం వరకు దేవుడు శిక్షించలేదు. అయితే వారిని పాపంలోకి నడిపించిన మిద్యానీయుల్ని ఎక్కువ ప్రమాదకరమైన శత్రవులుగా పరిగణించి వారికి దేవుడు తన తీర్పులు చవి చూపించాడు. “మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతి హింస చేయుడి, తరువాత నీవు నీ స్వజనులయొద్దకు చేర్చబడుదువు” (సంఖ్యా. 31:1,2) అని దేవుడు మోషేతో చెప్పాడు. ఈ ఆదేశం వెంటనే అమలయ్యింది. ప్రతీ గోత్రం నుంచి వెయ్యిమందిని ఎంపిక చేసి ఫీనెహాసు నాయకత్వం కింద మిద్యానుకి పంపించాడు. “యెహోవా మోషేకు ఆజ్ఞాపించినటుల వారు మిద్యానీయులతో యుద్ధము చేసి ... చంపబడిన యితరులు గాక మిద్యాను రాజులను అనగా మిద్యాను అయిదుగురు రాజులను బెయారు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి” 7,8 వచనాలు. దాడి జరుపుతున్న ఇశ్రాయేలీయుల సైన్యం మిద్యాను స్త్రీలను చెరపట్టింది. ఇశ్రాయేలు శత్రువుల్లో వారు తీవ్రమైన అపరాధులు మిక్కిలి ప్రమాదకరమైనవారు గనుక మోషే ఆదేశానుసారం వారిని హతమార్చింది. PPTel 452.3

దైవ ప్రజలకు కీడు తలపెట్టిన వారి అంతం అలాంటిది. కీర్తన రచయిత ఇలా అంటున్నాడు, “తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడిన వలలో వారి కాలు చిక్కుబడియున్నది”. “యెహోవా తన ప్రజలను యెడబాయువాడుకాడు. తన స్వాస్థ్యమును విడచువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును”. “దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద” పడేటప్పుడు “ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును”. కీర్తనలు 94:14, 15, 21, 23. PPTel 453.1

బిలాము హెబ్రీయుల్ని శపించాలని వచ్చినప్పుడు తన శకునాల్నీ, మహిమల్నీ ఉపయోగించినా వారిని శపించలేకపోయాడు. కారణమేమిటంటే యెహోవా “యాకోబులో ఏ దోషము కనుగొనలేదు” “ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు”. సంఖ్యా 23:21,23. కాని శోధనకు లొంగటం ద్వారా వారు దైవ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినప్పుడు వారికున్న కాపుదల తొలగిపోయింది. దైవ ప్రజలు దేవుని ఆజ్ఞలననుసరించి నివసించనపుపడు “యాకోబులో మంత్రము లేదు. ఇశ్రాయేలులో శకునము లేదు”. కనుక వారిని మోసగించి పాపంలోకి నడిపించ టానికి సాతాను తన శక్తియుక్తులన్నిటినీ ఉపయోగించాడు. దైవ ధర్మశాస్త్రాన్ని భద్రంగా కాపాడున్నట్లు చెప్పుకొనేవారే దాన్ని అతిక్రమిస్తే వారు దేవుని నుంచి వేరైపోతారు. వారు తమ శత్రువుల ఎదుట నిలబడలేరు. యుద్ధ ఆయుధాల వల్ల గాని, మిద్యానీయుల శకునాలవల్లగాని ఓటమిలేని ఇశ్రాయేలీయులు ఆదేశ వేశ్యలచేతిలో ఓడిపోయారు. సాతాను సేవకు అంకితమైన స్త్రీకి ఆత్మల్ని వశపర్చుకొని నాశనం చేయటానికి అంత శక్తి వున్నది. “అది గాయపరిచి పడద్రోసినవారు అనేకులు. అది చంపినవారు లెక్కలేనంతమంది”. సామెతలు 7:26. ఈ విధంగా షేతు బిడ్డలు సన్మార్గాన్ని విడిచి పెట్టారు. ఆ పరిశుద్ద సంతతివారు దుష్టులయ్యారు. ఈ రీతిగానే యోసేపు శోధనకు గురి అయ్యాడు. ఇశ్రాయేలీయులకు భద్రతగా నిలవాల్సిన సంసోను ఈ రంకంగానే తన శక్తిని పోగొట్టుకొన్నాడు. ఫిలిప్తీయులకు బందీ అయ్యాడు. దావీదు తూలిపడింది ఇక్కడే. అమిత జ్ఞాని అయిన రాజు, దేవునికి ప్రియుడు అని ముమ్మారు పిలువబడ్డ రాజు అయిన సొలోమోను మోహానికి బానిస అయి మోసపూరితమైన ఈ శక్తికే తన విశ్వసనీయతనూ ప్రభు భక్తినీ బలి ఇచ్చాడు. PPTel 453.2

“ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను” 2 కొరింథీ 10:11,12. మానవ మనుషుల్లో ఎలాంటి అంశాల పై పావులు కదపాలో సాతానుకి బాగా తెలుసు. వేల సంవత్సరాలుగా అధ్యయనం చేస్తూ వచ్చిన కారణంగా ప్రతీ వ్యక్తి ప్రవర్తనలోనూ ఉన్న లోటు పాట్లేంటో అతడికి తెలుసు. బయలు పెయోరుల తాను విజయవంతంగా ఉపయోగించిన శోధనల్నే ఉపయోగిస్తూ ప్రతీతరంలోనూ ఇశ్రాయేలులో ప్రధానుల్ని అతడు పడగొడూ వస్తున్నాడు. శరీరేచ్చలనే కొరకు రాళ్లపై పడి తునా తునాకలైన ప్రవర్తన శకలాలు యుగాల పొడవునా చెల్లాచెదురై ఉన్నాయి. లోకాంతం సమీపించే కొద్ది, దైవ ప్రజలు పరమ కనాను పొలిమేరలు చేరుకొనే తరుణంలో ఆ సుందరమైన దేశంలో దైవ ప్రజల ప్రవేశాన్ని అడ్డుకోటానికి క్రితంలో లాగే సాతాను శాయశక్తుల కృషి చేస్తాడు. అతడు ప్రతీ ఆత్మకు ఉచ్చులు పన్నుతాడు. అప్రమత్తంగా ఉండాల్సిన వారు అజ్ఞానులు సంస్కృతిలేని వారేకాదు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారినీ, పరిశుద్ధ హోదాల్లో వున్న వారినీ పడగొట్టటానికి అతడు తన శోధనల్ని సంధిస్తాడు. వారు తమ ఆత్మల్ని మలిన పర్చుకోటానికి వారిని నడిపించగలిగితే వారి ద్వారా అతడు అనేకమందిని నాశనం చేయగలుగుతాడు. మూడువేల సంవత్సరా క్రితం ఏ సాధనాల్ని ఉపయోగించాడో వాటినే ఇప్పుడూ ఉపయోగించుకొంటున్నాడు. లౌకిక స్నేహాలు, అందం, ఆకర్షణలు, విలాసాలు, వినోదాలు, వేడుకలు, విందులు లేదా మధు పాత్ర- వీటి ద్వారా ఏడో ఆజ్ఞ అతిక్రమానికి శోధిస్తాడు. PPTel 454.1

ముందు ఇశ్రాయేలీయుల్ని వ్యభిచారంలోకి దింపే ఆ తర్వాత వారిని విగ్రహారాధనలోకి సాతాను నడిపించాడు. దైవ స్వరూపాన్ని అగౌవపర్చి ఆయన ఆలయాన్ని అపవిత్రం చేసేవారు తమ దుష్ట హృదయాల కోర్కెలు తీర్చుకోటానికి గాను దేవుణ్ని కించపర్చటానికి సందేహించరు. కామ క్రియ మనుసును బలహీన పర్చి ఆత్మను నీచస్థితికి దిగజార్చుతుంది. తుచ్ఛ శారీరక వాంఛలు తీర్చుకోటం వల్ల నైతిక, మానసిక శక్తులు మందగిల్లుతాయి. ఆ ఆవేశానికి బానిస అయిన వ్యక్తి దేవుని ధర్మశాస్త్ర ఆచరణ విధిని గుర్తించటం, ప్రాయశ్చిత్తాన్ని అభినందించటం లేదా ఆత్మ విలువను గ్రహించటం అసాధ్యం. మంచితనం, పవిత్రత, సత్యం దేవుని పట్ల భక్తిభావం, పరిశుద్ధ అంశాలపట్ల ఆసక్తి - మనుషుల్ని దేవునితో అనుసంధానపర్చే ఈ పరిశుద్ద మమతానురాగాలు, సమున్నత కోర్కెలు కామం మంటల్లో మాడి మసైపోతాయి. ఆత్మ నల్లగా మారిన వ్యర్థ పదార్థమౌతుంది. అది దురాత్మలకు నివాస స్థలం, “అపవిత్రమును, అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు” అవుతుంది! దేవుని స్వరూపంలో సృష్టి అయిన మనుషులు, జంతువుల స్థాయికి దిగజారిపోతారు. PPTel 454.2

విగ్రహారాధకులతో సాంగత్యం చేసి వారి ఉత్సవాలు వేడుకల్లో పాలు పొందటం ద్వారా హెబ్రీయులు దైవ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించటం దేవుని తీర్పుల్ని తమ మీదికి తెచ్చుకోటం జరిగింది. అలాగే ఇప్పుడు క్రీస్తు అనుచరులు భక్తిహీనులతో స్నేహం పెంచుకొని వారి వినోదాల్లో పాలు పొందేందుకు వీరిని నడిపించటంలోను పాప జీవితంలోకి ఆకర్షించటంలోను సాతాను విజయం సాధిస్తున్నాడు. “మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభువు సెలవిచ్చుచున్నాడు”. 2 కొరింథీ 6:17. పూర్వం ఇశ్రాయేలీయుల్ని కోరిన విధంగానే ఈనాడు తన ప్రజలు ఆచారాల్లోను, అలవాట్లలోను, సూత్రాల్లోను లోకస్థుల కన్నా వేరుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. వారు ఆయన వాక్య బోధనల్ని నమ్మకంగా అనుసరించినట్లయితే ఈ వేర్పాటు ఉంటుంది. అది తప్పనిసరి. హెబ్రీయులు అన్యప్రజలతో మమేకం కాకూడదన్న హెచ్చరిక ఎంత సూటిగాను, స్పష్టంగాను ఉన్నదో క్రైస్తవులు భక్తిహీనుల స్ఫూర్తిని ఆచారాల్ని అనుసరించకూడదన్న నిషేధం అంతే సూటిగాను, స్పష్టంగాను ఉన్నది. క్రీస్తు మనతో ఇలా అంటున్నాడు, “ఈ లోకమునైనను లోకమలో నున్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో నుండదు” 1 యోహాను 2:15. “ఈ లోక స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును” యాకోబు 4:4. ఉపకారం చేయటానికి అవకాశం వచ్చినప్పుడు తప్ప క్రీస్తు అనుచరులు పాపులకు దూరంగా ఉండాలి. మనల్ని దేవుని నుంచి వేరు చేసే పలుకుబడి గలవారి సహవాసాన్ని తోసిపుచ్చటంలో అంత బాహాటత్వం ప్రదర్శించలేం. “శోధనలోకి తేక” అని ప్రార్థించేటప్పుడు సాధ్యమైనంత వరకు మనం శోధనకు దూరంగా ఉండాలి. PPTel 455.1

ఇశ్రాయేలీయులు బహిర్గత సుఖ సౌఖ్యాలు, భద్రత కలిగి ఉన్నప్పుడే పాపంలో పడ్డారు. వారు దేవున్ని నిత్యమూ తమ ముందు ఉంచుకోలేదు. ప్రార్థనను నిర్లక్ష్యం చేసి ఆత్మ విశ్వాసాన్ని పెంచుకొన్నారు. సుఖానుభవం, స్వార్ధాశల సంతుష్టి ఆత్మ అనే కోట తలుపు తెరిచి భద్రత లేకుండా చేయటంతో నీచ భావాలకు ప్రవేశం లభించింది. లోపల వున్న విశ్వాస ఘాతకులు నియమాలు అనే కోటకు కూల్చి ఇశ్రాయేలీయుల్ని సాతానుకి అప్పగించారు. ఈ విధంగా సాతాను ఇంకా ఆత్మను నాశనం చెయ్యటానికి చూస్తున్నాడు. క్రైస్తవుడు బహిరంగ పాపం చేయక ముందు లోకానికి తెలియకుండా హృదయంలో సుదగ్డమైన సిద్ధబాటు ప్రక్రియ సాగుతుంది. పవిత్రత, పరిశుద్ధతల నుంచి, దుర్మార్గతకు, దుర్నీతికి, నేరానికి మనసు ఒక్క ఉదుటున దిగజారదు. దైవ స్వరూపంలో సృష్టి పొందిన మనుషులు, క్రూరులు లేదా సాతాను మనుషులు కావటానికి సమయం పడుతుంది. వీక్షించటం వల్ల మనలో మార్పు చోటు చేసుకొంటుంది. అపవిత్ర ఆలోచనల్లో మునిగితేలటం ద్వారా వ్యక్తి తాను ఒకప్పుడు ద్వేషించిన పాపాన్ని ప్రేమించటానికి తన మనసును మలుచుకోవచ్చు. PPTel 456.1

నేరానికి నీచమైన దుష్టత్వానికి ప్రజామోదం ఆదరణ సంపాదించటానికి సాతాను ప్రతీ సాధనాన్ని ఉపయోగిస్తున్నాడు. ఒక నవలలో ఉన్న లేదా ఒక సినిమా హాల్లో ప్రదర్శితమౌతున్న నేర సన్నివేశాల్ని గూర్చిన ఆసక్తికరమైన ప్రకటనలు చదవకుండా మనం నగర వీధుల్లో నడవటం సాధ్యంకాదు. మనసుకు పాపంతో ఈ రీతిగా పరిచయం ఏర్పడుతుంది. నీచులు, దుష్టులు చేసే పనులు అనుసరించే మార్గాల్ని పత్రికలు ప్రజల ముందుంచుతాయి. ఉద్రేకాన్ని రెచ్చగొట్టే కథలు, వార్తా కథనాలు ప్రజల ముందుకు వస్తాయి. నేరాల్ని గురించి ప్రజలు వినటం, చదవటంవల్ల సున్నితమైన వారి మనుసులు కఠిన మవుతాయి. ఆ కథలు, కథనాల్ని ఆశతో వింటారు. చదువుతారు. PPTel 456.2

నేడు ప్రపంచలో క్రైస్తవులమని చెప్పేవారి మధ్య సహా- ఆదరణ పొందిన వినోదాల్లో చాలా వినోదాలు అన్యుల లక్ష్యాన్ని నెరవేర్చటానికి ఉద్దేశించినవే. ఆత్మల్ని నాశనం చేయటానికి వాటిలో కొన్నింటిని సాతాను వాడుకొంటున్నాడు. ఉద్రేకాల్ని రెచ్చగొట్టటానికి దుర్మార్గతను శ్లాఘించటానికి నాటక రంగాన్ని అనేక యుగాలుగా అతడు ఉపయోగించుకొంటున్నాడు. ఆకర్షణీయ ప్రదర్శన, ఉత్సాహబరిత సంగీతం, నృత్యంతో కూడి ఆ పెరాను (సంగీత నాట్యం) నియమాల్ని తుంగలో తొక్కటానికి, కామక్రీడకు తలుపులు తెరవటానికి సాతాను ఉపయోగిస్తున్నాడు. వినోదానికి ఏర్పాటయ్యే ప్రతి సమావేశంలోను అహంకారానికి ప్రోత్సాహం లభిస్తుంది. తిని తాగటం పెచ్చరిల్లుతుంది. దేవుని మర్చిపోవటానికి, నిత్యాశక్తులు విస్మరించటనికి మార్గం ఏర్పడుతుంది. సాతాను అక్కడే ఆత్మను గొలుసులతో చుట్టి బంధించటం జరుగుతుంది. PPTel 456.3

“నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము” అంటూ హితవు పలుకుతున్నాడు జ్ఞాని. సామెతలు 4:23 (ఎన్.ఐ.వి).” “మనుష్యుడి ప్రవర్తన అతడి హృదయాలోచనల్ని బట్టి ఉంటుంది”. సామెతలు 23:7. దైవ కృప హృదయాన్ని నవీనం చెయ్యాలి. లేకపోతే పవిత్రంగా జీవించటానికి ప్రయత్నించటం వ్యర్థం. క్రీస్తు కృపతో నిమిత్తం లేకుండా తనంతటతానే నీతివంతమైన ప్రవర్తన నిర్మించుకోవాలని చూసే వ్యక్తి ఇసుకపై ఇల్లు కట్టుకొంటున్నట్టే. భయంకర శోధన, తుఫానులు వచ్చినప్పుడు అది కుప్ప కూలుతుంది. దావీదు చేసిన ఈ ప్రార్థన అందరి ప్రార్ధన కావాలి, “దేవా, నాయందు శు హృదయమును కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము”. కీర్తనలు 51:10. ఈ దైవ వరంలో పాలివారమైన మనం “విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత” సంపూర్ణులుగా పెరగాల్సి ఉన్నాం . 1 పేతరు 1:15. PPTel 457.1

మనం చేయాల్సిన పని ఒకటుంది -- శోధనను ప్రతిఘటించటం. సాతాను కుతంత్రాలకు బలి కాకూడదనుకొనేవారు ఆత్మ ద్వారాల్ని భద్రంగా కాపాడుకోవాలి. చెడు ఆలోచల్ని ప్రతిపాదించే అంశాల్ని వారు చదవకూడదు. చూడకూడదు. వినకూడదు. ఆత్మల విరోధి అయిన సాతాను ప్రతిపాదించే ప్రతీ అంశం మీదికి పోవటానికి మనసును విడిచి పెట్టకూడదు. అపోస్తలుడైన పేతురు ఇలా అంటున్నాడు, “మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బర బుద్ధిగలవారై ... మీ పూర్వపు అజ్ఞానములో మీకుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలచినవాడు పరిశుద్దుడైయున్న ప్రకారము వీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధలై యుండుడి”. 1 పేతురు 1:13-15. పౌలు ఇలా అంటున్నాడు, ” ఏ యోగ్యతయైనను, మె ప్పైనను ఉండిన యెడల, ఏవి సత్యమైనచో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి”. ఫిలిప్పీ 4:8. దీనికి ప్రార్థన, ఎడతెగని మెళుకువ అవసరం. మనలో పరిశుద్ధాత్మ మన మనసును పరలోక అంశాలమీదికి ఆకర్షించి పరిశుద్ధ విషయాలపై నిలుపుతాడు. మనం దైవ వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయాలి. కీర్తన రచయిత ఇలా అంటున్నాడు. “యోవనులు దేనిచేత తమ నడతను శుద్ధి పరచుకొందురు?నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచు కొనుటచేతనే గదా?”“నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను” అంటున్నాడు కీర్తన రచయిత. కీర్తన 119:9, 11. PPTel 457.2

బేత్పయోరులో ఇశ్రాయేలీయుల పాపంవల్ల దేవుని తీర్పులు ఇశ్రాయేలు జాతి మీద పడ్డాయి. ఈనాడు అవే పాపాలు తక్షణ శిక్ష కలిగించకపోయినా వాటికి తప్పక శిక్ష కలుగుతుంది. “ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసిన యెడల దేవుడు వానిని పాడుచేయును” 1 కొరింధి 3:17. ఈ నేరాలకు ప్రకృతి భయంకరమైన శిక్షలు నిర్దేశించింది. ఈ శిక్షలు ప్రతీ అపరాధి ఇప్పుడో, కొంతకాలం తర్వాతో అనుభవించక తప్పదు. ఇతర పాపాలకన్నా ఈ పాపాలే మానవజాతి క్షీణతకు, లోకంలో ప్రబలుతున్న భయంకర వ్యాధులకు, అవి కలిగిస్తున్న దు:ఖ భారానికి ముఖ్య కారణం. మనుషులు తమ పాపాన్ని పక్కవాళ్లకు తెలియకుండా దాచి పెట్టవచ్చు. కాని దాని పర్యవసానాన్ని బాధ, వ్యాధి, మరణం రూపంలో అనుభవించి తీరారు. ఈ జీవితం తదనంతరం ఒక న్యాయ పీఠం ఏర్పాటు కానుననది. ఆ న్యాయస్థానం తీర్పులు, ప్రతిఫలాలు, నిత్య పర్యవసానాలు గలవి. “ఇట్టివాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు” కాని వారు సాతాను తోను, దుష్ట దూతలతోను “అగ్ని గుండములో” తమ స్థానాన్ని ఆక్రమిస్తారు. ఇది “రెండవ మరణము” గలతీ 5:21 ప్రకటన 20:14. PPTel 458.1

“జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటిమాటలు నూనెకంటే నను పైనవి దాని వలన కలుగు ఫలము ముసిణి పండంత చేదు. అది రెండంచులు గల కత్తియంత పదునుగలది”. సామెతలు 5:3,4. “నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము. దాని యింటి వాకిటి దగ్గరకు వెళ్లకుము., వెళ్లిన యెడల పరులకు నీ యౌవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్యుల యిల్లు చేరును. తుదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని?.. అని మూలుగుచుందువు” 8-11 వచనాలు. “దాని యిల్లు మృత్యువునొద్దకు దారి తీయును” “దాని యొద్దకు పోవువారిలో ఎవరును తిరిగిరారు”. “దాని ఇంటికి వెళ్లువారు పాతాళ కూపములో ఉన్నారు”. సామెతలు 2:18, 19, సామెతలు 9:18. PPTel 458.2