పితరులు ప్రవక్తలు

42/75

40—బిలాము

బాషానును జయించిన తర్వాత ఇశ్రాయేలీయులు కనాను పై వెంటనే దాడికి సిద్ధబాటుకై యెర్ధానుకు తిరిగి వచ్చి యెరికో మైదానానికి ఎదురుగా మృత సముద్రంతో ఆ నది సంగమానికి ఎగువలో నది పక్క శిబిరం వేశారు. వారు మోయాబు సరిహద్దుల్లో ఉన్నారు. మోయాబీయులు సమీపంలో వున్న ఆక్రమణదారుల్ని చూసి భయంతో గుండెలు చేతబట్టుకొని ఉన్నారు. PPTel 433.1

ఇశ్రాయేలీయులు మోయాబీయుల్ని బాధ పెట్టలేదు. అయిన చుట్టపట్ల వున్న దేశాల్లో చోటుచేసుకొన్న ఘటనల్ని చూసి వారు భయాందోళనలతో నిండారు ఏ అమోరీయుల తమను వెనక్కు తరిమారో వారిని హెబ్రీయులు జయించి. మోయాబీయులున్నంచి అమోరీయులు తీసుకొన్న బలగాలు మేఘ స్తంభంలో వున్న మర్మపూరిత శక్తివల్ల సర్వనాశనమయ్యాయి. బ్రహ్మాండమైన వారి కోటలు హెబ్రీ యులు సాహసించటం లేదు. వారి పక్షంగా పనిచేస్తున్న మానవాతీత వ్యక్తి ముందు ఆయుధాలు, అస్త్రాలు నిరర్థకం. కాని ఫరో తరహాగా దైవ కార్యాన్ని వ్యతిరేకించటానికి ఇంద్రజాల శక్తుల్ని ఉపయోగించటానికి సమాయత్తమయ్యారు. ఇశ్రాయేలీయుల మీదికి శాపం తేవాలని చూశారు. PPTel 433.2

జాతిపరంగాను, మతపరంగాను మోయాబీయకులికి మిద్యానీయులకి దగ్గర సంబంధాలున్నాయి. మోయాబు రాజైన బాలాకు ప్రజల భయాందోళనల్ని రెచ్చగొట్టి ఇశ్రాయేలీయులికి వ్యతిరేకంగా తన కుతంత్రాలకు ప్రజల సహకారాన్ని పొందటానికి ఈ వర్తమానం పంపాడు, “ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మనచుట్టు ఉన్న యావత్తును ఇప్పుడు నాకివేయును”. బిలము మోసపోతేమియ వాస్తవ్యుడు. అతడికి అతీంద్రియ శక్తులున్నట్లు ప్రతీతి. ఖ్యాతి మోయాబు దేశం వరకు వ్యాపించింది. తమకు సహాయం చేసేందుకు బిలాముని పిలవాలని వారు నిశ్చయించారు. ఆ ప్రకారంగానే ఇశ్రాయేలీయులికి హాని కలిగేటట్లు వారిని శపించటానికి వారి పై మంత్రశక్తుల్ని ఉపయోగించటానికి ఏర్పాట్లు చేయటానికి “మోయాబు పెద్దలును, విద్యాను పెద్దలును” నియుక్తులయ్యారు. PPTel 433.3

కొండలమీద నుంచి మోసపోతేమియ ఎడారుల గుండా ఆ దూతలు తమ దీర్ఘ ప్రయాణాన్ని వెంటనే ప్రారంభించారు. బిలామును కనుగొని రాజు వర్తమానాన్ని అందించారు. “చిత్తగించుము: ఒక జనము ఐగుప్తు నుండి వచ్చెను: ఇదిగో వారు భూతలమును కప్పి నా యెదుట దిగియున్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము: వారు నాకంటె బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో, అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడు ననియు నీవు శపించువాడు శపింపబడుననియు నేనెరుగుదును.” PPTel 433.4

బిలాము ఒకప్పుడు మంచివాడే. దేవుని ప్రవక్త కూడా. కాని అతడు భ్రష్టుడై దురాశకు లోనయ్యాడు. అయిన తాను సర్వోన్నతుని సేవకుణ్ణని చెప్పుకొనే వాడు. ఇశ్రాయేలీయుల నిమత్తం దేవుడు చేస్తున్న కార్యాలు అతడికి తెలియనివి కావు. దూతలు తాము వచ్చిన పని తెలియజేసినప్పుడు బాలాకు ఇవ్వచూపిన పారితోషికాన్ని తక్షణమే తిరస్కరించి దూతల్ని పంపివేయటం తన విహిత కర్తవ్యమని అతడికి బాగా తెలుసు. కాని అతడు శోధనతో దోబూచులాడటానికి సాహసించాడు. ప్రభువును సంప్రదించేంతవరకు ఏమీ చెప్పలేనని కనుక తాము ఆ రాత్రికి తన వద్ద ఉండాల్సిందని వారికి విజ్ఞప్తి చేశాడు. తన శాపం ఇశ్రాయేలీయులికి హాని కలిగించదని నిలిచినంత కాలం భూలోకంలోనే గాని, పాతాళంలోనేగాని ఉన్న ఏ శక్తి వారిని జయించలేదని అతడికి తెలుసు. “నీవు దీవించువాడు దీవించబడును ననియు శపించువాడు శపించబడుననియు నేనెరుగుదును” అని ఆ దూతలన్న మాటలు అతడి అతిశయాన్ని పెంచాయి. విలువైన బహుమానాలు, భవిష్యత్తులో జరగనున్న సన్మానాలు అతడి పేరాశకు పదును పెట్టాయి. బహు మానాల్ని అత్రంగా అందుకొన్నాడు. అనంతరం బాలాకు కోర్కెల నెరవేర్పుకు పాటుపడ్డాడు. PPTel 434.1

రాత్రి వేళ దేవుని దూత బిలామునకు ఈ వర్తమానం అందించాడు, “నీవు వారితో వెళ్లకూడదు. ఆ ప్రజలను శపించకూడదు. వారు ఆశీర్వదింపబడినవారు”. PPTel 434.2

ఆ ఉదయం అతడు బాలాకు దూతల్ని అయిష్టంగా పంపివేశాడు. కాని ప్రభువు ఏం చెప్పాడో వారికి తెలియపర్చలేదు. ధన సంపాదనకు, లోక ప్రతిష్ఠకు తాను కన్న కలలు కరిగిపోయినందుకు ఉగ్రుడై చిరచిర్లాడూ వారితో ఇలా అన్నాడు, “మీరు మీ స్వదేశమునకు వెళ్లుడి. మీతో కూడ వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడు.” PPTel 434.3

బిలాము “దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను”. 2 పేతురు 2:1. దురాశను దేవుడు విగ్రహారాధనగా పేర్కొంటున్నాడు. దురాశ అనే పాపం బిలాముని కపట భక్తుణ్ణి చేసింది. ఈ ఒక్క లోపం ఆధారంగా అతణ్ని సాతాను పూర్తిగా ఆదుపు చేశాడు. ఇదే అతడి నాశనానికి కారణం, మనుషుల్ని దేవుని సేవనుంచి పక్కదారి పట్టించటానికి లౌకిక లాభాల్ని, లోక ప్రతిష్ఠను సాతాను ప్రతినిత్యం వారి ముందుంచుతాడు. తాము వృద్ధిలోకి రాకపోవటానికి కారణం అతిగా పనిచేసే తమ మనస్సాక్షేనని వారికి నూరిపోస్తాడు. అనేకులు ఈరకంగా నిజాయితీ మార్గంనుంచి తప్పుకొంటారు. ఒక తప్పటడుగు రెండోదాన్ని సులభ తరం చేస్తుంది. అవి దురాభిమాన పాపానికి దారితీస్తాయి. దురాశ అధికార కాంక్ష నియంత్రణకు అంకితమైనప్పుడు మిక్కలి భయంకర కార్యాలు సంభవిస్తాయి. ఏదో లోక సంబంధమైన లబ్దికోసం కొంతకాలం నిజాయితీకి నీళ్ళిదల వచ్చునని తమ ధ్యేయాన్ని సాధించిన తర్వాత తమకు ఇష్టం వచ్చినప్పుడు తమ పంథాను మార్చుకోవచ్చునని హెచ్చులు చేప్పేవారు అనేకులున్నారు. అలాంటివారు సాతాను ఉచ్చుల్లోకి వెళ్తున్నారు. ఆ ఉరుల్లోనుంచి బయటపడటం సాధ్యం కాదు. PPTel 434.4

బాలాకు పంపిన దూత తిరిగివచ్చి ప్రవక్త తమతో రావటానికి నిరాకరించా డన్నారేగాని దేవుడు అతణ్ని వెళ్లవద్దన్నాడని చెప్పలేదు. బిలాము తిరస్కారం మరింత విలువైన పారితోషకం నిమిత్తమేనని భావించి బాలాకు మరెక్కువమంది దూతల్ని మరెక్కువ ప్రతిష్ఠ, పలుకుబడి ఉన్న ప్రధానుల్ని పంపాడు. తనకు ఇంకా ఎక్కువ సత్కారం జరుపుతానన్న వాగ్దానంతోను తాను ఏమి కోరితే దాన్ని అక్కడికక్కడే మంజూరు చేసే అధికారంతోను వారిని పంపాడు. బాలాకు ఈ వర్తమానాన్ని ప్రవక్తకు పంపాడు, “నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమియు అడ్డము చెప్పకుము. PPTel 435.1

నేను నీకు బహు ఘనత కలుగజేసెదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసెదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుము”. బిలాముకి ఇది రెండో పరీక్ష. రాయబారుల విజ్ఞప్తికి సమాధానంగా గొప్ప మనస్సాక్షి, నిజాయితీ ఉన్నట్లు నటిస్తూ దైవ చిత్రానికి విరుద్ధంగా నడుచుకోటానికి ఎంత బంగారమైనా, ఎంత వెండైనా తనను ప్రలోభపెట్ట జాలవని గట్టిగా చెప్పాడు. కాగా రాజు కోర్కె చెల్లింపు తన కిష్టమే అన్నాడు. దేవుని చిత్తం ఏంటో తనకు ఖచ్చితంగా తెలిసి ఉన్నప్పటికీ దేవుని చిత్తమేంటో తాను ఇంకా తెలుసుకొంటూ నంటూ తాము అక్కడే ఉండాల్సిందిగా వారిని కోరాడు, ఒప్పించటానికి దేవుడు మానవుడో అన్నట్లు. PPTel 435.2

రాత్రి వేళలో దేవుడు బిలాముకి కనిపించి ఇలా అన్నాడు, “ఆ మనుష్యులు నిన్ను పిలువవచ్చిన యెడల నీవు లేచి వారితో వెళ్లుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలెనని అతనికి చెప్పెను”. బిలాము ఈ మేరకు తన ఇష్టప్రకారం ప్రవర్తించటానికి దేవుడు సమ్మతించాడు. ఎందుచేతనంటే అతడు అలా వ్యవహరించటానికి తీర్మానించుకొన్నాడు. దేవుని చిత్తాన్ని అనుసరించటానికి ప్రయత్నించక తన చిత్తానుసారంగానే ప్రవర్తించటానికి ప్రయత్నించి ఆ తర్వాత దేవుని సమ్మతిని పొందటానికి చూశాడు. PPTel 435.3

ఇలాంటి పంథానే అనుసరించేవారు ఈనాడు అనేకమంది ఉన్నారు. అది తమ కోర్కెలకు అనుగుణంగా ఉండి ఉంటే తమ విధి ఏంటో అవగతం చేసుకోటం వారికి కష్టమవ్వదు. ఆ విషయాన్ని బైబిలు స్పష్టం చేస్తున్నది. లేదా పరిస్థితులు, యుక్తాయుక్త జ్ఞానం దాన్ని సుబోధకం చేస్తాయి. కాని ఈ నిదర్శనాలు తమ ఆశలకు, ఆశయాలకు విరుద్ధంగా ఉన్నందువల్ల వాటిని తరచు పక్కన పెట్టి తమ విదులేమిటో తెలుసుకోటానికి వారు ప్రత్యక్షంగా దేవుని వద్దకే వెళ్లాలని భావిస్తారు. గొప్ప మనసాక్షి ప్రేరణ ఉన్నట్లు కనిపిస్తూ వెలుగుకోసం దీర్ఘంగా ప్రార్థిస్తారు. అయితే దేవున్ని ఆటపట్టించటం సాధ్యం కాదు. తమ ఇష్టానుసారంగా వ్యవహరించటానికి అట్టివారిని దేవుడు తరచు అనుమతించి దాని పర్యవసానాన్ని అనుభవింపనిస్తాడు. “నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిది... కాబట్టి వారు తమ స్వకీయాలోచనలను బట్టి నడుచుకొనునుట్లు వారి హృదయ కాఠిన్యమునకు వారినప్పగించితిని”. కీర్తనలు 81:11, 12. ఒక వ్యక్తి తన కర్తవ్యమేంటో స్పష్టంగా గ్రహించినప్పుడు దాని నిర్వహణ బాధ్యత నుంచి విడిపించుకోటానికి దేవుని వేడుకోకూడదు. ఆ కర్తవ్యాన్ని నెరవేర్చటానికి వినయ మనసుతో విధేయ చిత్తంతో శక్తికోసం, జ్ఞానం కోసం దేవున్ని వేడుకోవాలి. PPTel 436.1

మోయాబీయులు భ్రష్ట ప్రజలు, విగ్రహారాధకులు. అయినా తమకున్న వెలుగునుబట్టి దేవుని దృష్టిలో వారి అపరాధం బిలాము పాపమంత నికృష్టమైంది కాదు. తాను దేవుని ప్రవక్తనని చెప్పుకొంటున్నందున తాను చెప్పాల్సిందంతా దేవుడు చెప్పమని ఆదేశించింది చెప్పటమే. అందుచేత అతడు తన ఇష్టాను సారంగా మాట్లాడకూడదు. దేవుడిచ్చిన వర్తమానాన్ని మాత్రమే అందించాలి. “నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలెను” అన్నది దైవాదేశం. PPTel 436.2

రాజు పంపిన దూతలు తనను పిలవటానికి ఉదయం వస్తే వారితో వెళ్లేందుకు బిలాముకి అనుమతి లభించింది. అయితే అతడి ఆలస్యానికి ఆగ్రహించి మరోసారి తిరస్కరిస్తాడని బావించి ఇక అతడితో సంప్రదించకుండా ఆ దూతలు తిరుగు ముఖం పట్టారు. బాలాకు మనవిని మన్నించటానికి ఇప్పుడిక సాకులేమీ లేవు. కాని పారితోషికాన్ని చేజిక్కించుకోటానికి బిలాము కృతనిశ్చయంతో ఉన్నాడు. కనుక బిలాము తన గాడిదను తీసుకొని ప్రయాణమాయ్యడు. దేవుని అనుమతి ఇప్పుడు సైతం రద్దు కావచ్చునని భయపడ్డావు. ఆతృతగా ముందుకు సాగాడు. ఏ కారణం వల్లనైనా ఆ పారితోషికాన్ని పోగొట్టుకొంటానేమో అని భయపడ్డాడు. PPTel 436.3

అయితే “యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో” నిల్చాడు. గాడిద దేవదూతను చూసింది గాని అతడు బిలాముకు కనిపించలేదు. గాడిద దారి విడిచి పొలాల్లోకి వెళ్లింది. ఆ జంతువుని గట్టిగా కొట్టి దాన్ని మళ్లీ దారిలోకి తీసుకువచ్చాడు. గోడల మధ్య ఒక ఇరుకు మార్గంలో దూత మళ్లీ కనిపించాడు. విసిగిస్తున్న ఆ ఆకారాన్ని తప్పించుకొనే ప్రయత్నంలో గాడిద తన యజమానుడి కాలిని గోడకు నొక్కి గాయపర్చింది. దేవుడు పోషిస్తున్న పాత్రను బిలాము చూడలేకపోయాడు. తన మార్గానికి అడ్డుకట్ట వేస్తున్నది దేవుడేనని తెలుసుకోలేదు. ఉగ్రరూపం ధరించి గాడిదను నిర్ణయగా బాదుతూ దాన్ని బలవంతంగా ముందుకు నడిపాడు. PPTel 437.1

మళ్లీ “కుడికైనను, ఎడమకైనన తిరుగుటకు దారిలేని యిరుకు చోటను” దేవుని దూత ముందు మాదిరిగానే భయం కొలిపే భంగిమతో నిలబడ్డాడు. పాపం ఆ గాడిద భయంతో వణుకుతూ పూర్తిగా ఆగిపోయి కూలబడిపోయింది. ఇప్పుడు ఆ జంతువుకి దేవుడు నోరిచ్చాడు. “నోరులేని గార్దభము మానవ స్వరముతో మాటలాడి” అతడి “వెట్టితనమును అడ్డగించెను” 2 పేతురు 2:16. “నీవు నన్ను ముమ్మూరు కొట్టితివి: నేను నిన్నేమి చేసితిని?” అని అది ప్రశ్నించింది. PPTel 437.2

తన ప్రయాణంలో ఇలా అంతరాయం ఏర్పడటానికి మండిపడుతూ మనిషికి సమాధానం ఇచ్చే రీతిగా ఆ గాడిదకు ఇలా బదులు చెప్పాడు బిలాము -- “నీవు నా మీద తిరగబడితివి: నా చేతిలో ఖడ్గమున్న యెడల నిన్ను చంపి యుందును” గొప్ప జనాంగాన్ని నిర్వీర్యం చేసే ఉద్దేశ్యంతో వారిని శపించేందుకు పయనమై వెళ్తున్న ఈ ఇంద్ర జాలికుడు తాను ఎక్కివెళ్తున్న గాడిదను కూడా చంపే శక్తిలేని అసమర్థుడు! PPTel 437.3

బిలాము కళ్లు ఇప్పుడు తెరుచుకొన్నాయి. కత్తిదూసి తనను చంపటానికి నిలిచివున్న దేవదూతను చూశాడు. “తలవంచి సాష్టాంగ నమస్కారము” చేశాడు. దేవుని దూత అతడితో ఇలా అన్నాడు, “ఈ ముమ్మూరు నీ గాడిదను నీవేల కొట్టితివి? ఇదిగో నా యెదట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. ఆ గాడిద నన్ను చూసి యీ ముమ్మారు నా యెదుట నుండి తొలిగెను. అది నా యెదుట నుండి తొలగని యెడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించియుందును”. PPTel 437.4

తాను ఏ మూగప్రాణిపట్ల అతిక్రూరంగా ప్రవర్తించాడో ఆ గాడిదను బట్టే బిలాము ప్రాణం దక్కించుకొన్నాడు. దేవుని ప్రవక్తనని ప్రకటించుకొన్న వ్యక్తి, తన కళ్లు తెరచుకొన్నాయని చెప్పుకొన్న వ్యక్తి, “సర్వశక్తుని దర్శనము” పొందిన వ్యక్తి దురాశవల్ల అంధుడై తన గాడిదకు కనిపించిని దేవదూతను చూడలేకపోయాడు. ” ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను” 2 కొరింథీ 4:4. ఇలా గుడ్డివారు ఎందరో! దైవ ధర్మ శాస్త్రాన్ని అతిక్రమించి వారు నిషిద్ధ మార్గాల్లో సంచరిస్తూ ఉంటారు. అందుచేత దేవుడు ఆయన దూతలు తమకు విరోధంగా ఉన్నారన్న సంగతి గుర్తించరు. తమను నాశనం నుంచి తప్పించటానికి ప్రయత్నించేవారి పై బిలాము మాదిరిగా వారు తమ అగ్రహావేశాల్ని ప్రదర్శిస్తారు. PPTel 438.1

బిలామును అదుపు చేసింది ఎలాంటి స్వభావమో అన్నదాన్ని తన గాడిదపట్ల అతడు ప్రవర్తించిన తీరు వెల్లడి చేస్తున్నది. “నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే” సామెతలు 12:10 జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించటం లేదా వాటి ఆలనపాలన చూడకపోవటం పాపమని గుర్తించేవారు బహుకొద్దిమంది. మానవుణ్ణి సృజించిన దేవుడే తక్కువ స్థాయి జీవుల్ని సృజించాడు. “ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి”. కీర్తనలు 145:9 మానవుడికి సేవ చేయటానికి జంతువులు సృష్టి అయ్యాయి. అలాగని వాటిని బాధ పెట్టడానికి, వాటిపట్ల క్రూరంగా ప్రవర్తించటానికి, వాటితో నిర్దయగా పని చేయించటానికి అతడికి హక్కులేదు. PPTel 438.2

మానవుడి పాపంవల్లనే “సృష్టియావత్తు ... ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది”రోమా 8: 22 అందువల్ల మానవ జాతికే గక మూగప్రాణి ప్రపంచానికి కూడా బాధ, మరణాలు సంప్రాప్తమయ్యాయి. అందుకే తన అతిక్రమం కారణంగా దైవ సృష్టిమీదికి మానవుడు తెచ్చిన బాధ వేదనల భారాన్ని అధికం చేయటంకాన్న తేలిక చేయటం అతడి నైతిక ధర్మం. తన ఆధీనంలో వున్న మూగజీవుల్ని నిర్దయగా చూసే వ్యక్తి పిరికివాడు, క్రూరుడు అనాలి. మనుషులీకేగాని, జంతువులకే గాని బాధ కలిగించే మనస్తత్వం సాతాను సంబంధమైనది. మూగ ప్రాణులు తమపట్ల జరిగే క్రూరత్వాన్ని వెల్లడి చేయలేవు గనుక తమ క్రూరత్వం ఎన్నటికీ బయలు పడదన్న సంగతి అనేకులు గుర్తించరు. కాని ఈ వ్యక్తుల కళ్లు బిలాము కళ్లవలె తెరచుకొన్నట్లయితే పరలోక న్యాయ స్థానంలో సాక్ష్యమించ్చేందుకు సాక్షిగా నిలబడి ఉన్న దేవదూతను వారు చూస్తారు. ఇక్కడి దాఖలాలు పరలోకానికి వెళ్తాయి. దేవుడు సృజించిన ప్రాణులపట్ల క్రూరంగా ప్రవర్తించిన వారికి శిక్షపడే దినం వస్తున్నది. PPTel 438.3

దేవదూతను చూసినప్పుడు బిలాము భయకంపితుడై ఇలా అన్నాడు, “నేను పాపము చేసితిని. నీవు నాకు ఎదురుగా త్రోవను నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి యీ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్లెదను”. అతడు తన ప్రయాణం కొనసాగించేందుకు ప్రభువు అంగీకరించాడు. కాని అతడి మాటలు తన నియం త్రణకు లోనై ఉండాలని చెప్పాడు. హెబ్రీ ప్రజలు తన కాపుదల కింద ఉన్నారన టానికి మోయోబీయులికి నిదర్శనమివ్వాలన్నది దేవుని ఉద్దేశం. తన అనుమతి లేకుండా తన ప్రజల్ని శపించటానికి కూడా బిలాము శక్తి లేని వాడని దేవుడు నిరూపించాడు. PPTel 439.1

బిలాము వస్తున్నట్లు సమాచారం అందిన మోయాబు రాజు అతణ్ణి స్వాగతించేందుకు మందిమార్బలంతో తన రాజ్య పొలమేరలకు వెళ్లాడు. తన కోసం గొప్ప పారితోషికాలు సిద్ధం చేసి ఎదురు చూస్తుండగా తాను జాప్యం చేయటానికి రాజు విస్మయం వ్యక్తం చేయగా బిలాము ఇలా బదులు పలికాడు, “ఇదిగో నీ యొద్దకు వచ్చితిని: అయిన నేమి? ఏదైనను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదను”. ఈ ఆంక్ష బిలాముకి సుతరాము ఇష్టం లేదు. తనను దేవుని శక్తి నియంత్రిస్తున్నందుకు తన ఉద్దేశాలు నెరవేరవని బిలాము ఆందోళన చెందాడు. PPTel 439.2

తన రాజ్యాధికారుల్ని వెంటబెట్టుకొని రాజు గొప్ప ఆడంబరంతో బిలామును “బయట యొక ఉన్నత స్థలము” మీదకు తీసుకువెళ్లాడు అక్కడ నుండి అతడు హెబ్రీ జన సమూహాన్ని చూచేందుకోసం. ఆ ఉన్నత స్థలంలో నిలబడి ప్రవక్త దేవుని ప్రజల శిబిరం పై దృష్టి సారిస్తున్నాడు చూడండి. తమ పక్కనే ఏం జరుగుతుందో ఇశ్రాయేలీయులకి ఏమీ తెలియదు. దైవ ప్రజలు ఎంత అవివేకులు! ప్రతీ యుగంలోనూ దైవ ప్రజలు ఆయన ప్రేమను, కరుణను అవగాహన చేసుకోటంలో ఎంత మందమతులు! తమ తరుపున ఎల్లప్పుడూ ప్రదర్శితమవుతున్న దేవుని మహాశక్తిని వారు అవగతం చేసుకోగలిగితే ఆయన ప్రేమను బట్టి వారి హృదయాలు కృతజ్ఞతతో నిండవా? ఆయన శక్తి ఔన్నత్యాన్ని బట్టి వారి హృదయాల్లో భక్తి భావం వెల్లువెత్తదా? PPTel 439.3

హెబ్రీయుల బలి అర్పణల గురించి బిలాముకి కొంత అవగాహన ఉన్నది. వారి అర్పణలకన్నా విలువైన అర్పణలు అర్పించి దేవుని దీవెనలు పొందవచ్చునని తన దుష్కార్యాల్ని సాధించవచ్చునని భావించాడు. ఈ రకంగా విగ్రహారాధన మోయాబీయుల అభిప్రాయాలు అతడి మనసు పై అదుపు సాధిస్తున్నాయి. అతడి జ్ఞానం బుద్ధిహీనతగా మారింది. అతడి ఆథ్యాత్మిక దృష్టి మసకబారింది సాతానుకి లోబడటం ద్వారా గుడ్డివాడయ్యాడు. PPTel 440.1

బిలాము ఆదేశం మేరక ఏడు బలిపీఠాలు నిర్మించారు. ప్రతీ బలిపీఠం మీద ఒక్కోబలినర్పించాడు. ఆ మీదట దేవుడు ప్రత్యక్ష పర్చేదాన్ని తెలియపర్చుతా నంటూ బాలాకుకి వాగ్దానం చేసి దేవునితో సమావేశమవ్వటానికి ఒక “ఉన్నత స్తలము”కి వెళ్లాడు. PPTel 440.2

తన అధికారులు ప్రధానులతో మోయాబు రాజు బలి పక్క నిలబడ్డాడు. జన సమూహాలు ప్రవక్త తిరిగి రాకకై ఎదురుచూస్తూ వారి చుట్టూ గుమికూడారు. చివరికి ప్రవక్త వచ్చాడు. ప్రవక్త ఏం చెబుతాడో అని ఉత్కంఠతో ప్రజలు కని పెడ్తున్నారు. అతడు పలికే మాటలు ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు ప్రదర్శించే శక్తిని గూర్చిన మాటలు. ఆ పరాయి అధికారాన్ని నిత్యం నిర్వీర్యం చేసే మాటల. బిలాలు ఇలా అన్నాడు. PPTel 440.3

“ఆరామునుండి బాలాకు
తుర్పూ పర్వతమునుండి మోయాబు రాజు నన్ను
రప్పించి
-- రమ్ము: నా నిమిత్తము యాకోబును శపింపుము
రమ్ము: ఇశ్రాయేలును భయ పెట్టవలెను
అనెను.
ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే
ఏమని భయ పెట్టగలను? దేవుడు భయ పెట్టలేదే
మెట్టల శిబిరము నుండి అతని చూచుచున్నాను కొండల నుండి అతని కనుగొనుచున్నాను
ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును
జనములలో లెక్కింపబడరు
యాకోబు రేణువులు ఎవరు లెక్కింపగలరు?
ఇశ్రాయేలు నాల్గవ పాలును ఎవరు లెక్క పెట్టగలరు?
నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించునుగాక.”
PPTel 440.4

ఇశ్రాయేలీయుల్ని శపించే ఉద్దేశంతో తాను వచ్చినట్లు బిలాము ఒప్పుకొన్నాడు. కాని అతడు పలికిన మాటలు వారి మనసులోని భావాలకు విరుద్ధంగా ఉన్నాయి. తన మనసంతా శాపాలతో నిండగా అతడు విధిగా ఆశీర్వాదాలు ఉచ్ఛరించాల్సి వచ్చింది. PPTel 441.1

బిలాము ఇశ్రాయేలీయుల శిబిరాన్ని పారజూసినప్పుడ వారు అన్ని విధాల ప్రగతి చెందుతున్నట్లు చూసి విస్మయం చెందాడు. సంస్కారం లేని క్రమ పద్ధతిలేని జనాంగంగా అటూ ఇటూ తిరగే బృందాలుగా వచ్చి దేశాన్ని ఆక్రమించే ప్రజలుగా చుట్టుపట్ల ఉండే ప్రజలకు చీడపీడలగాను గొప్ప ముప్పుగాను వారిని బాలాకు చిత్రించటం జరిగింది. అయితే వారిని చూస్తుంటే వారలాంటి వారు కారనిపించింది. విశాలమైన వారి శిబిరాన్ని, అది క్రమపద్ధతిలో సంపూర్ణంగా ఏర్పాటు కావటాన్ని, ఎక్కడ చూసినా క్రమశిక్షణ దర్శన మివ్వటాన్ని అతడు చూశాడు. వారిని దేవుడు ఆదరంగా చూడటాన్ని దైవ ప్రజలుగా వారి విలక్షణ ప్రవర్తనను అతడు గమనించాడు. వారు ఇతర జాతుల ప్రజల స్థాయిలో నిలవాల్సినవారు కాదు. అందరికన్నా ఉత్న తమైన స్థాయి వారిది.”ఆజనము ఒంటిగా నివసించును. జనములలో లెక్కింప బడరు” బిలాము ఈ మాటలన్నప్పుడు ఇశ్రాయేలీయులకి స్థిర నివాసమంటూ లేదు. వారి విలక్షణమైన ప్రవర్తన, వారి కట్టుబాట్లు, ఆచారాలు అతడికి తెలియవు. కాని తదనంతరం ఇశ్రాయేలీయుల చరిత్రలో అది ఎంత విచిత్రంగా నెరవేరింది! వారు బానిసలుగా ఉన్న కాలమంతటిలోను, లోకంలో ఆయా ప్రాంతాలకు చెదిరిపోయి ఆయా ప్రజల మధ్య నివసించిన యుగాలన్నిటిలోను వారు ప్రత్యేకమైన, విలక్షణమైన జనాంగానే నివసించారు. అలాగే దేవుని ప్రజలు నిజమైన ఇశ్రాయేలు ప్రజలు - లోకంలో ఆయా జాతుల నడుమ చెదిరి నివసిస్తున్నప్పటికీ లోకంలో వారు యాత్రికులు మాత్రమే. వారి పౌరసత్వం పరలోకంలో ఉంది. PPTel 441.2

హెబ్రీయుల చరిత్ర మాత్రమే కాదు. కాలం చివరిదాకా వారి పెరుగుల అభ్యదయం బిలాముకి ప్రదర్శితమయ్యాయి. తనను ప్రేమించి తన పై భక్తిశ్రద్ధలు గల వారి పట్ల సర్వోన్నతుని ప్రత్యేక ప్రసన్నతను, ఆధారాన్ని అతడు చూశాడు. అంధకారమయమైన మరణలోయలో వారు ప్రవేశించే తరుణంలో ఆయన వారికి చేయూత నివ్వటం చూశాడు. మహిమ, గౌరవం, అమర్త్యత ధరించి వారు సమాధుల్లో నుంచి లేవటం చూశాడు. నూతన భూమిపై వాడబారని మహిమలో విమోచన పొందినవారు ఉత్సహించటం చూశాడు. ఆ దృశ్యాన్ని వీక్షిస్తూ ఇలా విస్మయం చెందాడు, “యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు నాల్గవ పాలును ఎవరు లెక్క పెట్టగలరు?” ప్రతీ శిరం పై మహిమ కిరీటాల్ని చూసినప్పుడు ప్రతీవారి ముఖం పై తాండవిస్తున్న ఆనందాన్ని తిలకిస్తునప్పుడు, ఆనంతమైన ఆ ఆనందమయ జీవితాన్ని ఆశిస్తూ, “నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించునుగాక” అని ప్రార్థించాడు. PPTel 442.1

దేవుడిచ్చిన వెలుగును అంగీకరించే స్వభావం బిలాముకు ఉండి ఉంటే తానన్న మాటల్ని ఇప్పుడు నిజం చేసేవాడు. మోయాబుతో తన సంబంధాల్ని తెంచుకొనేవాడు. దేవుని కృపను గుర్తించి ఊహాగానాల్లో ఉండే బదులు పశ్చాత్తాపంతో ఆయన వద్దకు తిరిగి వచ్చేవాడు. కాని బిలాము అనీతి గడించే జీతాన్ని ఆశించాడు. దాన్ని చేజిక్కించుకోటానికి కృతనిశ్చయంతో ఉన్నాడు. PPTel 442.2

ఇశ్రాయేలీయుల మీద పిడుగులాంటి శాపం పడ్తుందని బాలాకు కని పెట్టాడు. ప్రవక్త పలికిన మాటలు విని దిగ్డమ చెంది ఇలా అన్నాడు, “నీవు నాకు ఏమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని: అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివి”. PPTel 442.3

గుణవంతుడుగా కనిపించటానికి పరిస్థితుల్ని మల్చుకొంటూ దేవుని చిత్తానికి లోబడి ఆయన పలకమన్న మాటల్నే తాను పలికానని బిలాము చెప్పాడు. “యెహోవా నా నోట ఉంచినదానిని నేను శ్రద్ధగా పలక వద్దా?” అన్నాడు. PPTel 442.4

ఇప్పుడు సైతం బాలాకు తాను తల పెట్టిన కార్యాన్ని విరమించుకోలేదు. హెబ్రీయుల బృహత్తర శిబిరాన్ని చూసి బిత్తరపోయి తత్తరపడి వారిని శపించటానికి బిలాము భయపడి ఉంటాడని బాలాకు భావించాడు. శిబిరం కొంచెం మాత్రమే కనిపించే ఒక తావుకి ప్రవక్తను తీసుకువెళ్లాలని రాజు నిశ్చయించుకొన్నాడు, శిబిరాన్ని సమూహాల వారీగా శపించటానికి బిలాముని ప్రేరేపించగలిగితే స్వల్ప వ్యవధిలోనే శిబిరమంతటినీ నాశనం చేయవచ్చునని బాలాకు భావించాడు. పిన్గా శిఖరం నుంచి మరో ప్రయత్నం జరిగింది. ఏడు బలిపీఠాల్ని నిర్మించి క్రితం అర్పించిన అర్పనల్నే మళ్లీ అర్పించాడు. రాజు అతడి ప్రధానులు బలుల పక్కనే ఉండగా బిలాము దేవునితో సంప్రదించటానికి వెళ్లాడు. ప్రవక్తకు దేవుడు మళ్లీ వర్తమానాన్నిచ్చాడు. దాన్ని మార్చటానికి గాని, నిలపటానికి గాని అతడికి శక్తి లేదు. PPTel 442.5

బిలాము బాలాకు అతడి ప్రధానుల వద్దకు తిరిగి వచ్చినప్పుడు, “యెహోవా ఏమి చెప్పెను?” అని ప్రశ్నించాడు. అతడి జవాబు ముందు మాదిరిగానే వారి హృదయాల్లో భయం పుట్టించింది. PPTel 443.1

“దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు
పశ్చిత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాదు
ఆయన చెప్పి చేయకుండునా?
ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?
ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను
ఆయన దీవించెను: నేను దాని మార్చలేను
ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు
ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు
అతని దేవుడైన యెహోవా అతనికి తోడైయున్నాడు
రాజు యొక్క ధ్వని వారిలో ఉన్నది.”
PPTel 443.2

ఈ ప్రత్యక్షతలవల్ల భీతిచెంది బిలాము ఇలా అన్నాడు, “నిజముగా యాకోబులో మంత్రములేదు. ఇశ్రాయేలులో శకునము లేదు”. మోయాబీయుల కోరిక మేరకు ఈ ఇంద్రజాలికుడు తన మంత్రశక్తిని ఉపయోగించటానికి ప్రయత్నించాడు. అయితే ఈ సమయంలో ఇశ్రాయేలీయుల సందర్భంగా “దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు!” అని ప్రజలు అబ్బురపడాలి. వారు దేవుని సంరక్షణ కింద ఉన్నప్పుడు ఏ ప్రజలు గాని ఏదేశంగాని జయించలేరు - సాతాన వారికి ఎంత సహాయం అందించినా. తన ప్రజల దేవుడు చేసిన ఘనకార్యాల విషయం సర్వలోకం విస్మయం చెందాలి. పాపమార్గాన్ని అవలంబిచటానికి నిర్థారించుకొన్న ఒక వ్యక్తి శపించేబదులు స్వచ్ఛమైన ఉద్వేగ భరితమైన పద్య సాహిత్యంతో విలువైన వాగ్దానాలు పలికేందుకు దైవశక్తి అతణ్ని అదుపుచేయటం ఎంత ఆశ్చర్యకం! ఈ సమయలో ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చూపిన ఆదరం అన్ని యుగాల్లోనూ నమ్మకమైన విధేయులైన తన బిడ్డలను ఆయన సంరక్షిస్తాడన్న నిశ్చయతను కలిగి స్తుంది. దైవ ప్రజల్ని గురించి తప్పుడు ప్రచారం చేయటానికి, వారిని శ్రమ పెట్టడానికి, నాశనం చేయటానికి సాతాను దుష్టుల్ని ప్రోత్సహించినప్పుడు ఈ సంఘటన వారి జ్ఞప్తికి వస్తుంది. ఇది వారిని ధైర్యపరచి వారి విశ్వాసాన్ని బలో పేతం చేస్తుంది. PPTel 443.3

అధైర్యము చెందిన మోయాబు రాజు “నీవు ఏమాత్రమును వారిని శపించవద్దు. దీవింపను వద్దు” అన్నాడు. అతడి మనసులో ఇంకా ఏదో ఆశ మిణుకు మిణుకు మంటుంది. ఇంకోసారి ప్రయత్నించాలని నిశ్చయించుకొన్నాడు. ఇప్పుడు అతడు బిలామును పెయోరు పర్వతం మీదికి తీసుకువెళ్లాడు. అక్కడ తమ బయలు దేవత వ్యభిచారపూర్వక పూజనిమిత్తం ఒక ఆలయం నిర్మితమయ్యింది. క్రితంలోలాగే ఇప్పుడు కూడా అదే సంఖ్యలో బలిపీఠాలు కట్టి అదే సంఖ్యలో బలులు అర్పించారు. అయితే ముందుకు వెళ్ళగా ఇప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి బిలాము ఒంటరిగా వెళ్లలేదు. మంత్రశక్తులున్నట్లు నటించలేదు. కాని బలిపీఠాల పక్క నిలబడి ఇశ్రాయేలీయుల గుడారాల తట్టు చూశాడు. దేవుని ఆత్మ మళ్లీ అతడి మీదికి రాగా అతడు ఈ దైవ వర్తమానాన్ని పలికాడు. PPTel 444.1

“యాకోబూ, నీ గుడారములు ఇశ్రాయేలూ, నీ నివాస స్థలములు
ఎంతో రమ్యమైనవి వాగులవలె అవి వ్యాపించియున్నవి
నదీ తీరమందలి తోటలవలెను యెహోవా నాటిన ఆగరు చెట్లవలెను
నీళ్లయొద్దనున్న దేవదారు వృక్షములవలెను అవియున్నవి
అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును
అతని రాజు అగగుకంటె గొప్పవాడగును
అతని రాజ్యము అధికమైనదగును...
సింహము వలెను ఆడు సింహము వలెను
అతడు క్రుంగి పండుకొనెను అతని లేపు వాడెవడు?
నిన్ను దీవించువాడు దీవింపబడును
నిన్ను శపించువాడు శపించబడను.”
PPTel 444.2

ప్రకృతిలోని అతి సుందర అంశాల్ని పోలికగా తీసుకొని ఇశ్రాయేలు ప్రజల పురోభివృద్ధిని ప్రవక్త ఇక్కడ సూచిస్తున్నాడు. ప్రవక్త ఇశ్రాయేలీయుల్ని విస్తారమైన పంటలతో నిండిన సారవంతమైన లోయలతో సరిపోల్చుతున్నాడు. ఎన్నటకీ ఎండిపోని వాగులు తడిపే పచ్చని తోటలతో పోల్చుతున్నాడు. సువాసన విరజిమ్మే చందన వృక్షాలికీ, అగరు చెట్లకీ వారిని పోల్చుతున్నాడు. చివరగా ఉపయోగించిన అలంకారం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అలంకారాల్లో మిక్కిలి రమ్యమైంది సమంజసమయ్యింది కూడా. తూర్పు దేశాల ప్రజలు లెబానోను దేవదారును అభిమానిస్తారు. ఈ తగరతికి చెందిన చెట్లను లోకమంతటా ప్రజలు అభిమానిస్తారు. ఆర్కిటిక్ ప్రాంతాల నుంచి ఉష్ణమండలాల వరకూ ఈ చెట్లు వ్యాపించి ఉంటాయి. ఎండకూ చలికి తట్టుకొని పెరుగుతాయి. నదులపక్క ఏపుగా పెరుగుతాయి. ఎండిన ఎడారి బీడుల్లో ఎత్తుగా పెరుగుతాయి. పర్వత ప్రాంతాల్లోని రాళ్ల సందు ల్లోంచి లోతుగా వేళ్లు తన్ని తుఫానులో నిటారుగా నిలబడి ఉంటాయి. చలికాలంలోని చలికి ఆకులన్నీ రాలిపోయి చెట్లు బోడిగా ఉన్న సమయంలో ఈ చెట్ల ఆకులు తాజాగా ఉంటాయి. చెట్లన్నిటిలోను గట్టిదనం, ధృడత్వం, దీర్ఘపటుత్వం విషయాలలో లెబానోను దేవదారుది అగ్రస్థానం. ఎవరి “జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నదో(కొలస్స 3:3) ఆ ప్రజలకు ఇది చిహ్నంగా ఉన్నది. లేఖనం ఇలా అంటున్నది. “నీతిమంతులు .. లెబానోను మీది దేవదారు వృక్షము వలె... ఎదుగుదురు”. కీర్తనలు 9:1 దేవుని హస్తం దేవదారు వృక్షాన్ని అడవికి రాజుని చేసింది. “సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు. అష్ట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు” (యె హె 31:8). దేవుని వనంలోని ఏ వృక్షమూ దానంత గొప్పది కాదు. దేవదారు వృక్షాన్ని రాచరిక చిహ్నంగా పదేపదే ఉపయో గంచటం చూస్తున్నాం. నీతిమంతుల్ని సూచించటానికి లేఖనంలో దాన్ని ఉపయో గించటాన్ని బట్టి తన చిత్రాన్ని నెరవేర్చేవారని దేవుడెలా పరిగణిస్తాడో అన్నది వ్యక్తమౌతున్నది. PPTel 445.1

ఇశ్రాయేలు రాజు అగగుకంటే గొప్పవాడవుతాడని బిలాము ప్రవచించాడు. ఈ కాలంలో అమాలేకీయులు శక్తిమంతమైన జాతి. అగగు అన్నది అమాలేకీయుల రాచరికం పేరు. కాగా ఇశ్రాయేలీయులు దేవునికి నమ్మకంగా ఉంటే వారు తమ శత్రువలందరినీ అణచివేయగలుగుతారు. దేవుని కుమారుడే ఇశ్రాయేలీయుల రాజు. ఒక రోజున ఆయన సింహాసనం భూలోకంలో స్థాపితం అవుతుంది. ఆయన రాజ్యం లోక రాజ్యాలన్నిటికన్నా ఉన్నతంగా ఉంటుంది.. PPTel 445.2

ప్రవక్త మాటల్ని వింటున్న బాలాకు నిరాశ, నిస్పృహలకు లోనయ్యాడు. భయం, ఆగ్రహం అతణ్ని ముప్పిరిగొన్నాయి. ఇసుమంత ఉద్రేకాన్ని కూడా తనకు ఇవ్వలేకపోయినందుకు బాలాకు బిలాము పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతా తనకు ప్రతికూలంగా ఉన్నది. ప్రవక్తది మోసంతో కూడిన రాజీ వైఖరిగా పరిగణించి దాన్ని తిరస్కరించాడు. ధికార్కర స్వరంతో రాజిలా అన్నాడు, “కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్లుము. నేను నిన్ను మిక్కిలి ఘనపరచెదనని చెప్పితిని గాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచెను.” PPTel 446.1

జవాబేంటంటే, దేవుడిచ్చిన వర్తమానాన్ని మాత్రమే బిలాము ఉచ్ఛరిస్తాడన్న హెచ్చరిక రాజుకు ముందే వచ్చిందన్నది. తిరిగి వెళ్లిపోకముందే లోక రక్షకుణ్ని గురించి దేవుని శత్రువుల సర్వనాశనాన్ని గురించి బిలాము చక్కని ప్రవచనం పలికాడు. “ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండము, ఇశ్రాయేలులో నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరిని నాశనము చేయును”. PPTel 446.2

మోయాబు, ఎదోము, అమాలేకు, కెనీయ సంపూర్ణ నాశనాన్ని ప్రవచిస్తూ బిలాము తన ప్రవచాన్ని ముగించాడు. మోయాబు రాజుకు ఎలాంటి నిరీక్షణ మిగల్లేదు. ధన సంపాదన, పేరు ప్రతిష్ఠల్ని గూర్చిన అతడి ఆశలు అడియాస లయ్యాయి. రాజు ఆదరణ పోయింది. దేవుడూ అతణ్ణి హర్షించడు. ఇదీ బిలాము పరిస్థితి. ఈ స్థితిలో అతడు తిరిగి ఇంటి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన తర్వాత అతణ్ని అదుపు చేస్తునన దేవుని ఆత్మ అతణ్ని విడచి పెట్టాడు. దైవాత్మ నియంత్రణ కింద వున్న అతడి దురాశ బలపడింది. బాలాకు వాగ్దానం చేసిన పారితోషికాన్ని ఏదో విధంగా సంపాదించాలన్న ఆశపుట్టింది. అందుకు ఏం చెయ్యటానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు దేవునికి విధేయులై నివసిస్తున్నందుకే వారు పురోభివృద్ధి చెందుతున్నారని పాపంలో పడవేయటం ద్వారానే వారిని జయించటం సాధ్యపడుం దని బిలాముకు తెలుసు. ఇశ్రాయేలీయుల మీదికి శాపం రప్పించటానికి అవలంబించాల్సిన మార్గాన్ని మోయాబీయులికి సూచించటం ద్వారా బాలాకు ప్రాపకం సంపాదించాలని బిలాము సంకల్పించుకొన్నాడు. PPTel 446.3

బిలాము వెంటనే మోయాబు దేశానికి తిరిగివచ్చి తన పథకాల్ని రాజు ముందు పెట్టాడు. ఇశ్రాయేలీయులు దేవునికి నమ్మకంగా ఉన్నంతకాలం వారిని ఆయన కాపాడాడని మోయాబీయులే ఒప్పుకొన్నారు. బిలాము వేసిన పథకం ప్రకారం దేవుని ప్రజల్ని విగ్రహారాధనలోకి నడిపించటం ద్వారా ఆయన నుంచి వారిని విడదీయటం జరగాలి. వారిని బయలు అపారోతు దేవతల వ్యభిచార పూర్వక పూజకు నడిపించ గలిగితే సర్వశక్తి గల వారి దేవుడు వారికి శత్రువవుతాడు, తమ చుట్టూ వున్న యుద్దశూరులైన రాజుల ఖడ్గాలకు ఇశ్రాయేలీయులు ఎర అవుతారు అన్నది బిలాము తంత్రం. ఈ పథకాన్ని రాజు అంగీకరించాడు. దాని అమలుకు నాయకత్వం వహించటానికి బిలాము అక్కడే ఉండిపోయాడు. PPTel 446.4

బిలాము తన దుష్ట పథకం విజయవంతం కావటం చూశాడు. తన ప్రజల మీద దేవుని శాపం పడటం వేలాది మంది దేవుని తీర్పులకు గురి అయి కూలిపోటం చూశాడు. కాగా ఇశ్రాయేలీయుల్లోని పాపాన్ని శిక్షించిన దేవుని న్యాయశీలత శోధకుల్ని విడిచి పెట్టలేదు. మిద్యానీయులతో ఇశ్రాయేలీయులు చేసిన యుద్ధంలో బిలాము హతుడయ్యాడు. తన అంతం సమీపంలో ఉన్నదన్న గుర్తింపు కలిగి ఈ విధంగా పలికాడు, “నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించును గాక!” అయితే అతడు నీతిమంతుని జీవితం జీవించలేదు. అతడి అంతం దేవుని శత్రువుల అంతంలా సంభవించటానికి ఏర్పాటయ్యింది. PPTel 447.1

యూదా అంతం లాంటిదే బిలాము అంతంకూడా. వారి ప్రవర్తనలు కూడా చలామట్టుకు ఒకేలాంటివి. ఈ ఇద్దరూ దైవ సేవకూ ధనానికీ ముడి పెట్టాలని చూసి పరాజయం పొందారు. బిలాము నిబమైన దేవుని తెలుసుకొని ఆయన సేవ చేస్తున్నట్లు చెప్పుకొన్నాడు. యూదా యేసును మెస్సీయగా విశ్వసించి ఆయన శిష్యబృందంలో చేరాడు. అయితే బిలాము యెహోవా సేవను ధనార్జనకు లోక గౌరవ ప్రతిష్ఠల సంపాదనకు సాధనంగా ఉపయోగించటానికి ప్రయత్నించాడు. ఈ కార్యసాధనలో విఫలుడై కుప్పకూలి నాశనమయ్యాడు. యూదా క్రీస్తుతో తన సంబంధాన్ని బట్టి ధనం సంపాదించాలని చూసి నాశనమయ్యాడు. క్రీస్తుతో తన సంబంధాన్ని బట్టి ధనం సంపాదించాలనీ మెస్సీయ స్థాపించటానికి సిద్ధంగా ఉన్నట్లు తాను నమ్ముతున్న లౌకిక రాజ్యంలో పదోన్నతి పొందాలనీ యూదా గంపెడాశతో ఎదురు చూశాడు. తన ఈ ఆశలన్నీ కుప్పకూలటంతో అతడు భ్రష్టుడై నాశనమయ్యాడు. బిలాము యూదా ఇద్దరు గొప్ప వెలుగును పొందారు, విశేషావకాశాలు ఆధిక్యతల్ని అందుకొన్నారు. అయితే తాము ప్రేమించిన ఒక్క పాపం వారి ప్రవర్తనను విషపూరితం చేసి వారిని నాశనం చేసింది. PPTel 447.2

అ క్రైస్తవ లక్షణాలికి హృదయంలో చోటివ్వటం ప్రమాదకరం. హృదయంలో దాచుకొనే ఒక్క పాపం క్రమక్రమంగా ప్రవర్తనను మలినపర్చి దాని ఉదాత్త లక్షణాల్ని దురాశల నియంత్రణ కింద ఉంచుతుంది. మనస్సాక్షి నుంచి ఒక్క భద్రతా ఏర్పాటు తొలగింపు, ఒక్క చెడ్డ అలవాటు అనుసరణ, విధి నిర్వహనలో ఒకింత నిర్లక్ష్యం ఆత్మకున్న భద్రతా వ్యవస్థను నాశనం చేసి సాతాను ప్రవేశించటానికి మనల్ని తప్పుదారి పట్టించటానికి మార్గం సుగమం చేస్తుంది. దావీదులా శుద్ధ హృదయంతో దినదినం మన ప్రార్థనలను దేవునికి చేరవేయటంలోనే మనకు క్షేమమున్నది, “నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొనియున్నాను. నాకు కాలు జారలేదు”. కీర్తనలు 17:5. PPTel 447.3