ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

118/475

విభాగం VIII—తిండియావ నియంత్రణ

ఆత్మనిగ్రహ వైఫల్యం మొదటి పాపం

(1864) Sp. Gifts IV, 120 CDTel 143.1

229. ఏదెనులో ఆదామవ్వలు ఉత్తమ స్వభావులు. పరిపూర్ణ అంగసౌష్టవం సౌందర్యం గలవారు. పాపరహితులు. ఆరోగ్య విషయంలో పరిపూర్ణులు. వారికీ నేటి మానవజాతికీ ఎంత భేదం! అందం పోయింది. సంపూర్ణ ఆరోగ్యమన్నది లేదు. ఎక్కడ చూసినా వ్యాధి, అంగవైకల్యం, మనోదౌర్బల్యం దర్శనమిస్తాయి. ఈ క్షీణతకు హేతువు తెలుసుకోగోరాను. వెనకటి ఏదెను పైకి నా దృష్టి మరల్చబడింది. తాము చావకుండేందుకు ఏ ఒక్క చెట్టు పండ్లు తినకూడదు ముట్టకూడదు అని దేవుడు నిషేధించాడో ఆ పండ్లు తినటానికి సర్పం అవ్వను మోసగించింది. CDTel 143.2

ఆనందాన్నిచ్చే సమస్తం అవ్వకున్నది. తన చుట్టూ అన్ని రకాల పండ్లు ఉన్నాయి. అయినా తోటలో తాను స్వేచ్ఛగా ఇష్టారాజ్యంగా తినగల పండ్లు అన్ని ఉన్నా దేవుడు నిషేధించిన చెట్టు పండు ఆమెకు ఎక్కువ వాంఛనీయమయ్యింది. ఆమెది నిగ్రహం లేని వాంఛ. ఆమె తిన్నది. ఆమె ప్రోద్బలంతో ఆమె భర్తకూడా తిన్నాడు. వారిద్దరి మీదకి శాపం వచ్చింది. వారి పాపం మూలంగా భూమి కూడా శాపానికి గురి అయ్యింది. ఆ ఘోర పతనం నాటినుంచి నిగ్రహం లేని ఆశ అన్ని రూపాల్లోను ఉనికి లోకి వచ్చింది. తిండి యావ తెలివిని అదుపుచేస్తున్నది. మానవ కుటుంబం అవిధేయ మార్గాన్ని అనుసరిస్తున్నది. మానవులు అవ్వలా సాతాను వలన మోసపోయి, పర్యవసానాలు తాము భయపడ్డంత తీవ్రంగా ఉండవని భావించుకుంటూ దైవ నిషేధాన్ని బేఖాతరు చేస్తున్నారు. మనుషులు ఆరోగ్య చట్టాల్ని అతిక్రమిస్తూ ప్రతీ విషయంలోను మితిమీరుతున్నారు. వ్యాధి క్రమ క్రమంగా పెరుగుతున్నది. కార్యం కారణం రెండూ కొనసాగుతున్నాయి. CDTel 143.3