అపొస్తలుల కార్యాలు

25/59

24—కొరింధు

క్రైస్తవ యుగంలోని తొలి శతాబ్దంలో గ్రీసులోనే గాక ప్రపంచంలోనే కొరింథు ప్రధాన నగరాల్లో ఒకటి. ప్రతీ దేశం నుంచి వచ్చిన ప్రయాణికులతో కలిసి గ్రీకులు, యూదులు, రోమీయులతో వ్యాపారం కోసం వినోదాల కోసం కొరింథు నగరవీధులు కిటకిటలాడేవి. గొప్ప వాణిజ్య కేంద్రమైన ఆనగరం రోమా సామ్రాజ్యం అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేది. దేవునికి ఆయన సత్యానికీ ఆలయాలు, కేంద్రాలు స్థాపించటానికి అది ప్రాముఖ్యమైన నగరం. AATel 172.1

కొరింథులో స్థిరపడ్డ యూదుల్లో అకుల, ప్రిస్కిల్ల ఉన్నారు. వీరు అనంతరం క్రీస్తుకు నమ్మకంగా సేవచేసిన విశ్వాసులయ్యారు. వీరి వర్తనను పరిశీలించిన పౌలు “వారి యొద్దకు వెళ్లెను.” ప్రయాణికులకు కూడలి అయిన ఈ స్థలంలో తన సేవ ఆరంభదశలో తన సేవకు ఎన్నో ప్రతిబంధకాలు పౌలుకి అన్నిచోట్లా ఎదురయ్యా యి. ఆ నగరం విగ్రహారాధకులతో దాదాపు పూర్తిగా నిండింది. వారు మిక్కిలి అభిమానించి ఆరాధించే దేవత వీనస్. వీనస్ ఆరాధనకు సంబంధించిన దురాచారాలు ఎన్నో ఉన్నాయి. అన్యుల్లో సయితం కొరింధు ప్రజలు వేర్పాటుగా కనిపించేవారు. అందుకు కారణం వారి తీవ్ర వ్యభిచార ప్రవృత్తి వారి ఆలోచనలు క్షణిక సుఖభోగాలు నినాదాల్ని గూర్చే ఉండేవి. AATel 172.2

కొరింథులో సువార్త ప్రకటించటంలో పౌలు ఏథెన్సులో చేసిన సేవానిధానాన్ని మార్చుకున్నాడు. ఏథెన్సులో పరిచర్య చేసినప్పుడు తన శ్రోతల ప్రవర్తనను బట్టి అతడు తన సరళిని మలుచుకోటానికి ప్రయత్నించాడు. తర్కాన్ని తర్కంతో, శాస్త్రాన్ని శాస్త్రంతో, వేదాంతాన్ని వేదాంతంతో ఎదుర్కొటానికి ప్రయత్నించాడు. ఇలా ఖర్చయిన సమయం గురించి ఆలోచించి ఏథెన్సులో తన బోధ నిష్పల మయ్యిందన్న విషయం గుర్తించటంతో కొరింథులో తన అసక్తిశూన్య ప్రజల గమనాన్ని ఆకర్షించడానికి వేరే కార్యాచరణ ప్రణాళికను అనుసరించాలని తీర్మానించు కొన్నాడు. ” సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని” కొరింథీయుల మధ్య ” ఎరుగకుందునని నిశ్చయించు” కొని దీర్ఘవాదనలు చర్చల్ని పౌలు నివారించాడు. “జ్ఞాన యుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్దాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే” వారికి బోధించాడు. కొరింథీ 2 : 2,5. AATel 172.3

కొరింథులో ఉన్న గ్రీకులముందు పౌలు ఉంచబోతున్న క్రీస్తు దిగువ స్థాయి యూదు సంతతివాడు. దుర్మార్గతకు సామెతగా నిలిచిన పట్టణంలో పెరిగాడు. సొంత ప్రజలే ఆయన్ను నిరాకరించి నేరస్తుడిలా సిలువవేశారు. యూదులు మానవజాతి ఉద్దరణ అవసరమని విశ్వసించారు. అయితే వాస్తవికమైన ఉద్దరణ గౌరవం వేదాంతం శాస్త్రాల అధ్యయనం వలన మాత్రమే లభ్యమౌతుందని గట్టిగా నమ్మారు. పేరుప్రతిష్ఠలులే ఈ అనామక యూదుడి శక్తి పై విశ్వాసం ద్వారా వ్యక్తి ఔన్యత్యాన్ని ఉదాత్తతను సాధించగలడని నమ్మటానికి పౌలువారిని నడిపించ గలడా? AATel 173.1

ప్రస్తుత కాలంలో నివసిస్తున్న వేవేల ప్రజల మనసుల్లో కల్వరి సిలువ అనగా పవిత్ర స్మృతులెన్నో మెదులాడ్డాయి. క్రీస్తు సిలువ దృశ్యాలతో పరిశుద్ధ భావాలు ముడిపడి ఉంటాయి. అయితే పౌలు నివసించిన దినాల్లో సిలువను విరోధభావంతో భయభ్రాంతులతో పరిగణించేవారు. సిలువ మీద మరణించిన ఒక వ్యక్తిని ప్రజలు రక్షకుడిగా ఘనపర్చటం నవ్వులపాలవ్వటం, వ్యతిరేకతకు గురికావటం సహజమే. AATel 173.2

కొరింథుకు చెందిన యూదులు, గ్రీకులు తన బోధల్ని ఎలా పరిగణిస్తారో అన్నది పౌలుకి బాగా తెలుసు. “మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించు చున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెట్టితనముగాను ఉన్నాడు” (1కొరింథీ 1:23,24) అని పౌలు అంగీకరించాడు. తాను బోధించనున్న వర్తమానం వల్ల కోపోద్రిక్తులు కానున్న వారు పౌలు యూదు శ్రోతల్లో ఎక్కువ మందే ఉన్నారు. గ్రీకు ప్రజల ఊహ ప్రకారం అతని మాటలు బుద్ధిహీనంగా ఉండనున్నాయి. జాతి ఉద్దరణతో లేదా మానవాళి రక్షణతో సిలువకు ఏదైనా సంబంధముందని చూపించటానికి ప్రయత్నిస్తున్నందుకు పౌలును వెర్రివాడిగా పరిగణించనున్నారు. AATel 173.3

కాగా పౌలుకి సిలువ ఎంతో ఆసక్తికరమైన అంశం. సిలువ పొందిన నజరేయుడి అనుచరుల్ని హింసిస్తున్న తరుణంలో దేవుడు తనను బంధించినప్పటినుంచీ సిలువను మహిమపర్చటం అతడెన్నడూ మానలేదు. క్రీస్తు మరణంలో ప్రదర్శితమైన రీతిగా ఆ సమయంలో దేవుని అనంతమైన ప్రేమను పౌలు చూశాడు. అతని జీవితంలో అద్భుతమైన మార్పు చోటుచేసుకొంది. అతని ప్రణాళికలు ఉద్దేశాలు దేవుని చిత్తానికి అనుగుణంగా మారిపోయాయి. ఆ ఘడియనుంచి అతడు క్రీస్తులో నూతన వ్యక్తి అయ్యాడు. తన కుమారుణ్ని త్యాగం చెయ్యటంలో దేవుడు కనపర్చిన ప్రేమను చూసి పాపి పరిశుద్ధాత్మ ప్రభావానికి లొంగినప్పుడు హృదయంలో మార్పుకలుగుతుందని ఇకనుంచి క్రీస్తే పాపికి సర్వస్వం అవుతాడని పౌలు అనుభవ పూర్వకంగా తెలుసుకొన్నాడు. AATel 173.4

తన హృదయ పరివర్తన సమయంలో పౌలు నజరేయుడైన యేసును సజీవ దేవుని కుమారుడిగాను, మనిషిని మార్చి రక్షించే శక్తిగల రక్షకుడిగాను. సాటి మనుషులు పరిగణించేందుకు వారికి సహాయ మందించాలని ఉత్సాహపడ్డాడు. సిలువ పొందిన యేసుని ప్రేనును శక్తిని విశదీకరించే కృషికి తన సర్వశక్తిని ధారపోయటానికి ఆనాటి నుంచి పూనుకొన్నాడు. సానుభూతితో నిండిన అతని హృదయం అన్ని తరగతుల ప్రజల్ని అంగీకరించింది. “గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్తులు కానివారికిని, జ్ఞానులకును, మూఢులకును నేను ఋణస్థుడను” అంటున్నాడు. రోమా 1:14. తన భక్తుల రూపంలో మహిమప్రభువైన యేసును నిర్దాక్షిణ్యంగా హింసించిన పౌలుకు ఆయన పట్ల ఉన్న ప్రేమే అతని నడవడిని నియంత్రించిన సూత్రం, అతణ్ని చలింపజేసిన శక్తి. తన విధి నిర్వహణలో ఎన్నడైనా తన ఉత్సాహం చల్లారినప్పుడు, సిలువ వంక, దాని పై ప్రదర్శితమైన అపూర్వ ప్రేమ వంక ఒక్క చూపు, అతడు తన మనసు అనే నడుంబిగించుకొని ఆత్మత్యాగ మార్గంలో ముందుకు సాగటానికి తోడ్పడేది. AATel 174.1

మోషే రచనల్ని ప్రవక్తల వాక్యాల్ని ఆధారంగా చేసుకొని బోధిస్తూ తన శ్రోతల్ని మెస్సీయా రాక వరకూ తీసుకువస్తూ, కొరింథు సమాజ మందిరంలో అపొస్తలుడు పౌలు ప్రసంగించటం వీక్షించండి. మానవాళి ప్రధాన యాజకుడిగా అనగా తన ప్రాణత్యాగం ద్వారా ఒక్కసారే పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించి, అనంతరం పరలోక గుడారంలో తన పరిచర్యను చేపట్టాల్సి ఉన్నవాడిగా రక్షకుని పనిని అతడు వివరించటం వినండి. తాము ఎవరి రాక కోసం ఆశగా కనిపెట్టుతున్నారో ఆమె స్సీయా వచ్చాడని, ఆయన మరణం సమస్త బలి అర్పణల తాలూకు నిజ స్వరూపమని పరలోక గుడారంలో ఆయన చేస్తున్న పరిచర్య గొప్ప ఉద్దేశాన్ని సూచిస్తున్నదని, అది ఛాయారూపకమైన వెనుకటి యూదీయ యాజక పరిచర్యను విశదం చేస్తున్నదని పౌలు తన శ్రోతలకు వివరించాడు. AATel 174.2

“పౌలు వాక్యము బోధించుట యందు ఆతురతగలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను.” ప్రవచనాల ప్రకారం యూదుల నిరీక్షణ ప్రకారం మెస్సీయా అబ్రహాము దావీదుల సంతతి నుంచి రానున్నాడని పాతనిబంధన లేఖనాలనుంచి చూపించాడు. ఆ తర్వాత అబ్రహాము నుంచి రాజకీర్తన కారుడు అయిన దావీదు ద్వారా యేసు రావటాన్ని స్పష్టీకరించాడు. మెస్సీయా ప్రవర్తనను గురించి, పరిచర్యను గురించి లోక ప్రజలు ఆయనను తృణీకరించి ఆయన పట్ల క్రూరంగా వ్యవహరించటాన్ని గురించి ప్రవక్తలిచ్చిన సాక్ష్యాన్ని చదివి వినిపించాడు. నజరేయుడైన యేసు జీవితమే ఈ ప్రవచనాలన్నిటినీ నెరవేర్చిందని నిరూపించాడు. AATel 174.3

తమ జాతి ఉనికికీ ఔన్నత్యానికీ మెస్సీయా రాకను ప్రతీకగా కని పెడ్తున్న ఆ ప్రజలకు రక్షణ ఇవ్వటానికి క్రీస్తు వచ్చాడని పౌలు ప్రప్రథమంగా సూచించాడు. అయితే తమకు జీవాన్ని ఇవ్వగల ఆ ప్రభువును ఆ ప్రజలు విసర్జించి నిత్యమరణానికి నడిపే ఒక నాయకుణ్ని ఎన్నుకొన్నారని చెప్పాడు. రానున్న నిత్యనాశనం మంచి యూదుజాతిని రక్షించగలిగేది మారుమనసు ఒక్కటేనని పౌలు తన శ్రోతలకు విశదం చేయటానికి ప్రయత్నించాడు. తమకు పూర్తి లేఖనావగాహన ఉన్నదని ప్రగల్బాలు పలుకుతూ అతిశయిస్తున్న తాము నిజానికి అజ్ఞానుల మన్న గుర్తింపును వారికి కలిగించాడు. వారి శరీరాశలు, పదవీ వ్యా మోహం, పేరు ప్రతిష్ఠలకు పాకులాట, డంబం, స్వార్ధశల్ని మందలించాడు. AATel 174.4

తనలో అద్భుత రీతిగా చోటుచేసుకొన్న మారుమనసు గురించి, నజరేయుడైన యేసులో సంపూర్తిగా నెరవేర్పుపొందిన పాత నిబంధన లేఖనాల పై తన విశ్వాసాన్ని గురించి వివరిస్తూ పౌలు తన సొంత కథను గొప్ప ఉద్రేకంతో చెప్పాడు. గంభీరంగా యధంగా పలికిన మాటలు సిలువ మరణం పొంది తిరిగి లేచిన రక్షకుని పట్ల అతని ప్రగాఢ ప్రేమను పౌలు శ్రోతలు గ్రహించగలిగారు. అతని మనసు క్రీస్తు మీదనే కేంద్రీకృతమై ఉన్నదని, తన జీవితం ప్రభువుతో ముడిపడి ఉన్నదని వారు గ్రహించారు. క్రైస్తవ మతమంటే సుతరాము కిట్టనివారు తప్ప ఆమాటలకు చలించనివారు లేరు. AATel 175.1

అయితే ఆ అపొస్తలుడు అంత స్పష్టంగా చూపించిన నిదర్శనాన్ని విస్తరించి కొరింథు యూదులు పౌలు చేసిన విజ్ఞప్తుల్ని ఖాతరు చెయ్యలేదు. క్రీస్తును నిరాకరింటానికి వారిని ఏ స్వభావం ప్రొత్సహించిందో ఆ స్వభానమే ఆయన సేవకుడైన పౌలు పట్లా వారు ప్రదల్నించారు. అన్యజనులకు సువార్త ప్రకటించేందుకు గాను దేవుడు తనను ప్రత్యేకంగా కాపాడి ఉండకపోతే వారు పౌలును హతమార్చేవారే. AATel 175.2

“వారు ఎదురాడి దూషించినప్పుడు, అతడు తన వస్త్రములు దులుపుకొని - మి నాశనమునకు మిరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని: యిక మీదట అన్యజమనుల మధ్యకు పోవుదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తిగల తీతియు యూస్తు అను ఒకని యింటికి వచ్చెను. అతని యిల్లు సమాజమందిరమును ఆనుకొని యుండెను”. AATel 175.3

పౌలుకి సాయం చెయ్యటానికి సీల తిమోతిలు “మాసిదోనియ నుండి” వచ్చారు. వారందరు అన్యజనుల కోసం కలిసి పనిచేశారు. పౌలు అతని అనుచర్లు క్రీస్తును పడిపోయిన మానవాళి రక్షకుడిగా యూదులకూ అన్యజనులకూ బోధించారు. కష్టభరితమైన అసంబద్ధమైన వాదనను పక్కన పెట్టి విశ్వాధినేత అయిన సృష్టినాధుని గుణలక్షణాల పై వారి గమనాన్ని నిలిపారు. దేవుని ప్రేమతోను ఆయన కుమారుని ప్రేమతోను వారి హృదయాలు ప్రకాశించాయి. మానవుడి పక్షంగా జరిగిన హద్దులులేని త్యాగాన్ని వీక్షించాల్సిందిగా అన్యజనులకు వారు విజ్ఞప్తి చేశారు. అన్య మతాచారమనే చీకటిలో పడి దీర్ఘకాలంగా దారి కావక ఉన్న అవ్యజనులు కల్వరి సిలువ నుంచి ప్రవహిస్తున్న కాంతి కిరణాలు చూడగలిగితే వారు రక్షకునికి ఆకర్షితులవుతారని వీరికి తెలుసు. “నేను భూమి మీద నుండి పైకెత్తబడిన యెడల అందరిని నా యొద్దకు ఆకర్షించుకొందుమ” అని రక్షకుడు చెప్పాడు. యోహాను 12:32. AATel 175.4

కొరింథులోని సువార్త కార్యకర్తలు తాము ఎవరికోసం కృషి చేస్తున్నారో ఆ ఆత్మలు ఎదుర్కోనున్న తీవ్ర ప్రమాదాల్ని గుర్తించారు. తమపై ఉన్న బాధ్యత స్పృహతోనే సత్యాన్ని యేసులో ఉన్న రీతిగానే వారికి బోధించారు. వారందించిన వర్తమానం స్వచ్ఛంగా, స్పష్టంగా నిశ్చితంగా ఉన్నది - ఆయన రక్షణార్థమైన రక్షణనిచ్చే రక్షకుడు లేదా మరణార్థమైన మరణాన్నిచ్చే రక్షకుడు. తమ మాటల్లోనే కాదు తమ రోజువారీ జీవనంలోనూ వారు సువార్తను కనపర్చారు. వారికి దూతలు సహక రించారు. దేవుని కృప ఆయన శక్తి వల్ల పలువురు మారుమనసు పొందారు. “ఆ సమాజమందిరపు అధికారియైన క్రిస్సు తన యింటివారందరితో కూడి ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి.” AATel 176.1

యూదులు అపొస్తలుల్ని ఎప్పుడూ ద్వేషిస్తూనే వచ్చారు. ఇప్పుడు అది ఇంకా ఎక్కువయ్యింది. క్రిస్కు మతమార్పిడి బాప్తిస్మం అగ్నిమీద ఆజ్యం పోసినట్టయ్యింది. ప్రత్యర్థుల్ని ఒప్పించకపోగా అది వారి విద్వేషాన్ని మరింత బలపర్చింది. పౌలు వాదాన్ని తిప్పికొట్టే సత్తా వారికి లేదు. అట్టి నిదర్శనం లేకపోటంతో మోసానికి దాడికి పూనుకొన్నారు. సువార్తను యేసు నామాన్ని దూషించారు. ఆ కోపోద్రేకంలో వారాడని దుర్భాషలేదు, ఒడిగట్టని నైచ్యం లేదు. క్రీస్తు అద్భుతాలు చెయ్యలేదని బొంకలేక పోయారు. కాని వాటిని సాతాను శక్తితో ఆయన చేశాడని ప్రకటించారు. పౌలు చేసిన అద్భుతకార్యాలన్నీ ఈ శక్తి ద్వారానే జరిగాయని ఖరాఖండిగా చెప్పారు. AATel 176.2

కొరింథులో పౌలుకి అంతంత మాత్రం జయం కలిగినా ఆ దుర్మార్గ పట్టణంలో తాను చూసిన, విన్న దుర్మార్గత అతణ్ని నిరుత్సాహపర్చింది. అన్యుల మధ్య తాను చూసిన భ్రష్టత, అవినీతి, యూదుల నుంచి తనకు ఎదురైన ధిక్కారం పరాభవం, అతని హృదయాన్ని గాయపర్చాయి. అక్కడున్న మనుషులతో దేవుని సంఘ నిర్మాణానికి పూనుకోటం తెలివైన పనికాదని భావించాడు. AATel 176.3

మంచి ఫలితాలు లభించే వేరే పట్టణానికి వెళ్లటానికి తీర్మానించుకొని తన విధిని అవగాహన చేసుకోటానికి సమాయత్తమవుతున్న తరుణంలో ప్రభువు దర్శనంలో కనిపించి పౌలుతో ఇలా అన్నాడు, “నీవు భయపడక మాటలాడుము; మౌనముగా నుండకుము నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ఈ పట్టణములో నీకు బహు జనమున్నది.” ఇది తాను కొరింథులోనే ఉండాలంటూ వచ్చిన ఆదేశమని తాను విత్తిన విత్తనాన్ని ప్రభువు వృద్ధిపర్చుతాడంటూ వచ్చిన హామీ అని పోలు గ్రహించాడు. బలం పొంది ధైర్యం తెచ్చుకొని ఉత్సాహంతో సహనంతో తన పరిచర్యను కొనసాగించాడు. AATel 176.4

ఈ అపొస్తులుడి కృషి బహిరంగ ప్రసంగాలకే పరిమితం కాలేదు. అట్టి పరిచర్యకు అందుబాటులో లేనివారు పలువురున్నారు. అందుచేత గృహ సందర్శన కార్యక్రమాన్ని చేపట్టి కుటుంబాల వారిగా ప్రతీవారితో పరిచయం పెంచుకొన్నాడు. వ్యాధిగ్రస్తుల్ని దుఃఖంలో ఉన్నవారిని సందర్శించాడు. కష్టాల్లో ఉన్నవారిని ఓదార్చాడు. బాధితుల్ని ఆదుకున్నాడు. ఈ సేవలో తాను పలికిన మాటల్లో నేమి చేసిన సేవలోనేమి అతడు యేసు నామాన్ని ఘనపర్చాడు. “బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను” ఈ రీతిగా అతడు పరిచర్య చేశాడు 1 కొరింథీ 2:3. తన బోధ దైవముద్రతో గాక మానవ ముద్రతో సాగుతుందేమోనన్న భయం అతణ్ని వేధించేది. AATel 177.1

అనంతరం పౌలిలా అన్నాడు, “పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసియుండిన యెడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి యుందురు. ఇందును గూర్చి -దేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడియున్నది. మనకైతే దేవుడు వాటిని తన యాత్మవలన బయలుపరచి యున్నాడు. ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలో నున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును ? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకేగాని మరి ఎవనికిని తెలియవు. AATel 177.2

“దేవుని వలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. మనుష్యజ్ఞానము నేర్పు మాటలతోగాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.” 1 కొరింథీ 2:6-13, AATel 177.3

తనకున్న శక్తి తనలోనిది కాదని అది పరిశుద్ధాత్మ ఉనికి ద్వారా కలిగి తన హృదయాన్ని నింపి తన ప్రతీ ఆలోచనను క్రీస్తు అదుపులో ఉంచటం వల్ల రూపొందినదని పౌలు గుర్తించాడు. “యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష పర్చబడుటకై యేసు యొక్క మరణానుభవమును కూడ మా శరీరమందు ఎల్లప్పుడు వహించుకొని పోవుచున్నాము” అని తన్ను గూర్చి తాను పౌలు అన్నాడు. 2 కొరింతు 4:10. ఈ అపొస్తలుడి బోధకు క్రీస్తే కేంద్ర బిందువు. “ఇకను జీవించువాడను నేనుకాను ; క్రీస్తే నాయందు జీవించుచున్నాడు” అంటున్నాడు పౌలు. గలతీ 2:20. పౌలు తన్నుతాను మరుగుపర్చుకొని క్రీస్తుని బయలుపర్చి ఘనపర్చాడు. AATel 177.4

పౌలు మంచి వక్త. క్రైస్తవాన్ని స్వీకరించకముందు శ్రోతల్ని తన వాగ్దాటితో ఆకట్టుకోటానికి తరచు ప్రయత్నించేవాడు. కాని ఇప్పుడు అదంతా పక్కన పెట్టాడు. హృదయాన్ని రంజింపచేసి భావోద్వేగాలు రేపే కవితలు వల్లించి, ఊహా చిత్రణలు చిత్రించే బదులు పౌలు సరళ భాషను ఉపయోగించి ప్రాముఖ్యమైన సత్యాల్ని ప్రజలకు స్పష్టంగా బోధించటానికి ప్రయత్నించాడు. ఊహా చిత్రణలతో సత్యాల్ని బోధిస్తే సర్వసాధారణంగా సత్యాలు జీవిత సమరానికి అవసరమయ్యే శక్తినిచ్చే ఆహారాన్ని విశ్వాసికి సమకూర్చలేవు. జీవన సమరం ఏశ్వాసులకు క్రైస్తవ సూత్రాలపై ప్రయోగాత్మక ఉపదేశం అందించాలి. AATel 178.1

కొరింథులో పౌలు పడ్డ శ్రమ వృధాకాలేదు. అనేకమంది విగ్రహారాధనను వదిలి సజీవ దేవుణ్ని విశ్వసించారు. క్రీస్తు పతాకం కిండ పెద్ద సంఘం ఏర్పడింది. అన్యజనుల్లోని అతి నికృష్ట దుర్మారులు కొందరు మార్పుచెంది దేవుని కృపాబాహుళ్యానికి, పాపప్రక్షాళన కూర్చే యేసు రక్త ప్రభావానికి స్మృతి చిహ్నాలుగా నిలిచారు. AATel 178.2

క్రీస్తు సువార్తను ప్రచురించటంలో పౌలు సాధీస్తున్న విజయాలు అవిశ్వాసులైన యూదులు మరింత పట్టుదలతో పౌలును వ్యతిరేకించటానికి దారితీశాయి. వారు ఒక కూటమిగా ఏర్పడి “గల్లియోను ఆకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు అతని తీసికొని” వచ్చారు. క్రితంలోలాగే ఇప్పుడు కూడా అధికారులు తమకే మద్దతు పలుకుతారని వారు భావించారు. ఆగ్రహవేశాలతో గట్టిగా అరుస్తూ అపొస్తలుడి పై ఈ విధంగా ఫిర్యాదు చేశారు, “వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరిక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడు.” AATel 178.3

యూదు మతానికి రోమా ప్రభుత్వ రక్షణ ఉంది. తమ మత ధర్మాల్ని పౌలు అతిక్రమిస్తున్నాడన్న ఆరోపణ అతని మీద మోపగలిగితే, తీర్పు తీర్చటానికి శిక్ష విధించటానికి రోమా అధికారులు అతణ్ణి తమకే అప్పగించవచ్చని వారు భావించారు. పౌలుని అలా హతమార్చవచ్చనుకొన్నారు. అయితే గల్లియోను సత్యవంతుడు. అసూయ కుట్రలతో నిండి ఉన్న యూదుల చేతిలో పావుకావడానికి అతడు నిరాకరించాడు. తమ మత దురహంకారం స్వనీతితో విసిగిపోయిన గల్లియోను వారి ఆరోపణను పట్టించుకోలేదు. సమాధానం చెప్పుకోటానికి పౌలు సంసిద్ధమౌతున్నప్పుడు గల్లియోను తాను మాట్లాడనవసరం లేదని పౌలుకి చెప్పాడు. అప్పుడు ఆరోపణలు చేస్తున్న వారినుద్దేశించి అతడిలా అన్నాడు, ” యూదులారా, యిది యొక అన్యాయముగాని చెడ్డనేరముగాని యైన యెడల నేను నా మాట సహనముగా వినుట న్యాయమే. ఇది ఏదో యొక ఉపదేశమును, పేళ్లను, మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మిరే దాని చూచుకొనుడి. ఈలాటి సంగతులను గూర్చి విమర్శ చేయుటకు నాకు మనస్సు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠము ఎదుటనుండి తోలివేసెను.” AATel 178.4

గల్లియోను తీర్పుకోసం యూదులు గ్రీకులు ఇరువర్గాల వారు ఎదురు చూస్తున్నారు. అది ప్రజా ప్రయోజనానికి సంబంధించిన విషయం కాదని దాన్ని వెంటనే కొట్టివేయటం యూదులు వెనకడుగు వేయాలనటానికి సూచన. యూదులకు చాలా కోపం వచ్చింది. యూదులకు సహకరిస్తూ కేకలు వేస్తున్న ప్రజలకు న్యాయాధికారి తీర్పు కనువిప్పు కలిగించింది. ఐరోపాలో పౌలు చేసిన సేవ అంతటిలోను జనసమూహాలు పౌలు పక్కకు రావటం ఇదే ప్రథమం. న్యాయాధికారి అంతా చూస్తూ, పల్లెత్తు మాటకూడా అనకపోవటంతో, పౌలును నిందించటంలో కఠినంగా వ్యవహరించిన వారి పై ప్రజలు విరుచుకుపడ్డారు. “అప్పుడందరు సమాజ మందిరపు అధికారియైన సోసైనేసును పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చియు లక్ష్యపెట్టలేదు”. ఈ విధంగా క్రైస్తవమతం గొప్ప విజయం సాధించింది. AATel 179.1

“పౌలు ఇంకను బహు దినములక్కడ” ఉన్నాడు. ఈ అపొస్తలుడు ఈ సమయంలో కొరింథు విడిచి పెట్టాల్సివస్తే యేసు విశ్వాసాన్ని స్వీకరించినవారు తీవ్ర ప్రమాద పరిస్థితుల్ని ఎదుర్కొని ఉండేవారు. యూదులు తమ విజయాన్ని అదనుగా తీసుకొని ఆ ప్రాంతంలో క్రైస్తవ మతాన్ని నిర్నూలించి ఉండేవారు. AATel 179.2