అపొస్తలుల కార్యాలు

21/59

20—సిలువకు అగ్రస్థానం

అంతియొకయలో కొంతకాలం సువార్త పరిచర్య అనంతరం ఇంకొక మిషనరీ ప్రయాణంపై వెళ్తామని పౌలు తన సాటి సువార్తికుడికి ప్రతిపాదించాడు. “ఏయే పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారేలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను.” AATel 142.1

లోగడ తన సువార్త పరిచర్య ద్వారా క్రీస్తు వర్తమానాన్ని అంగీకరించిన వారి పట్ల పౌలు బర్నబాలిద్దరూ ప్రేమాదరాలు కలిగి వారిని మరోసారి చూడాలని ఆశించారు. వారిపై ఈ శ్రద్ధాసక్తులు ఎల్లప్పుడు ఉండేవి. సువార్త పరిచర్య చేస్తూ దూర ప్రదేశాల్లో ఉన్నప్పుడు సయితం వీరిని మనసులో ఉంచుకొని నమ్మకంగా ఉండాల్సిందని “దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొన” వలసిందని వారికి విజ్ఞప్తి చేయటం పౌలు కొనసాగించాడు. (2 కొరింథి 7:1). స్వావలంబన, క్రైస్తవ పెరుగుదల సాధించటానికి, దృఢమైన విశ్వాసాన్ని ఉద్రేకాన్ని పొందటానికి, దేవునికి దేవుని రాజ్య వ్యాప్తికి సంపూర్ణంగా అంకితమవ్వటానికి వారికి సహాయమం దించేందుకు సర్వదా కృషిచేశాడు. AATel 142.2

పౌలుతో వెళ్ళటానికి బర్నబా సిద్ధంగా ఉన్నా, సువార్త పరిచర్యకు తన్ను తాను అంకితం చేసుకోవాలని ఆశిస్తున్న మార్కుని తమతో తీసుకు వెళ్ళాలని అభిలషించాడు. దీన్ని పౌలు వ్యతిరేకించాడు. తమ మొదటి మిషనెరీ ప్రయాణంలో గొప్ప అవసరం ఉన్న తరుణంలో తమను విడిచి పెట్టినవాణ్ని ‘వెంట బెట్టుకొని పోవుట యుక్తముకాదని” పౌలు తలంచాడు. ఇంటివద్ద లభించే సుఖాలు వసతులు సేవాస్థలంలో లేకపోటంతో పనిని విడిచి పెట్టి వెళ్ళిపోటంలో మార్కు ప్రదర్శించిన బలహీనతను పౌలు ఉపేక్షించటానికి ఇష్టపడలేదు. అంత తక్కువ శారీరక శక్తిగల వ్యక్తి ఓర్పు, ఆత్మ నిరసన, సాహసం, భక్తి, విశ్వాసం, త్యాగశీలత, అవసరమైతే ప్రాణత్యాగం అవసరమయ్యే సేవకు తగడని పౌలు వాదన. వారి మధ్య లేచిన వివాదం ముదిరి పాకాన పడటంతో పౌలు బర్నబాలు వేరయ్యారు. తానన్నమాటలకు కట్టుబడి బర్నబా మార్కుని తన వెంట తీసుకొని వెళ్ళాడు. “బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు సీలను ఏర్పరచుకొని, సహోదరులచేత ప్రభువు కృపకు అప్పగింపబడినవాడై” బయలుదేరాడు. AATel 142.3

సిరియ కిలికియలగుండా ప్రయాణిస్తూ ఆ పట్టణాల్లోని సంఘాల్ని బలపర్చి పౌలు సీలలు చివరికి లుకదొనియలోని దెర్బే లుస్త్రలు చేరుకొన్నారు. క్రితం పౌలును రాళ్ళతో కొట్టింది లుస్త్రలోనే. అయినా తనకు అపాయం తెచ్చి పెట్టిన స్థలానికే పౌలు మళ్ళీ వెళ్ళటం గమనార్హం. తన సేవలద్వారా సువార్తను అంగీకరించిన విశ్వాసుల శ్రమల పరీక్షకు ఎలా నిలబడున్నారో చూడాలని పౌలు ఆత్భుతగా ఉన్నాడు. అతడు నిరాశ చెందలేదు. ఎందుకంటే తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ లుస్త్ర విశ్వాసులు తమ విశ్వాసంలో దృఢంగా నిలిచి ఉన్నారు. AATel 143.1

పౌలు ఇక్కడ తిమోతీని కలుసుకొన్నాడు. పౌలు మొదటి సారి లుస్త్రను సందర్శించినప్పుడు అనుభవించిన శ్రమల్ని తిమోతి చూశాడు. తన మనసు పై పడ్డముద్ర కాలం గడిచే కొద్దీ గాఢమై చివరికి తన జీవితాన్ని సువార్త పరిచర్యకు అంకితం చేయాలన్న కృతనిశ్చయానికి వచ్చాడు. అతడి హృదయం పౌలు హృదయంతో ఏకమయ్యింది. మార్గం ఏర్పడినప్పుడు ఆ అపొస్తలుడి పరిచర్యలో పాలుపంచుకోవాలని ఆకాంక్షించాడు. AATel 143.2

పౌలు సహచరుడు సీల సువార్త పరిచర్యలో దిట్ట. ప్రవచన వరమున్న భక్తుడు. చేయాల్సి ఉన్న సేవ విస్తారంగా ఉండటంతో ఎక్కువమంది పనివారిని తర్ఫీదు చేయాల్సిన అవసరం ఏర్పడింది. సువార్త సేవకుడి పనిని పవిత్ర సేవగా గుర్తించి అభినందించే వ్యక్తిని ఆ సేవలో శ్రమలు హింసకలుగవచ్చునన్న విషయమై ఆందోళన చెందనివ్యక్తిని, నేర్చుకోటానికి సుముఖంగా ఉన్న వ్యక్తిని పౌలు తిమోతిలో చూశాడు. అయినా తిమోతి జీవితం గురించి ప్రవర్తన గురించి ముందు పూర్తిగా తెలుసుకొని తృప్తి చెందేవరకు, ఆ యువకుణ్ణి సువార్త సేవకు శిక్షణ నిమిత్తం అంగీకరించటానికి పౌలు సాహసించలేదు. AATel 143.3

తిమోతి తండ్రి గ్రీకు దేశస్థుడు. తల్లి యూదురాలు. చిన్ననాటి నుంచి అతడికి లేఖనాలతో పరిచయముంది. తిమోతి గృహ జీవితం భక్తితో కూడిన జీవితం. తన తల్లికి అమ్మమ్మకు పరిశుద్ధ లేఖనాల పై ఉన్న విశ్వాసం, దేవుని చిత్తాన్ని నెరవేర్చటంలో గొప్ప ఆశీర్వాదముందని నిత్యం అతడికి గుర్తుచేసింది. దైవ భక్తిగల ఈ సీలిద్దరూ దైవ వాక్యానుసారంగా తిమోతిని నడిపించారు. వారు నేర్పిన పాఠాల ఆధ్యాత్మిక శక్తి అతడి మాటల్ని నిర్మలంగా చేసింది. తన చుట్టూ ఉన్న దుష్ప్రభావాలనుంచి అతణ్ని కాపాడి పరిశుద్ధంగా జీవింపజేసింది. ఈ విధంగా బాధ్యతలు నిర్వహించ టానికి అతణ్ని సన్నద్ధం చెయ్యటంలో అతడి గృహోపదేశకులు దేవునితో సహకరించారు. AATel 143.4

తిమోతి నమ్మకంగా, స్థిరంగా నిజాయితీగా ఉన్నట్లు పౌలు చూశాడు. తన సువార్త సేవలోను తన ప్రయాణాల్లోను స్నేహితుడుగా ఉండటానికి పౌలు తిమోతిని ఎంచుకొన్నాడు. తిమోతికి బాల్యంలో విద్య నేర్పిన తల్లి అమ్మమ్మ తమ కుమారుడు విద్యార్థి గొప్ప అపొస్తలుడితో సన్నిహితుడై సేవ చేయటంలో మంచి ప్రతిఫలం పొందారు. తిమోతిని దేవుడు బోధకుడుగా ఎంపిక చేసుకొన్నప్పుడు నూనూగు మీసాల యువకుడు. అయితే బాల్యంలో అతడు పొందిన విద్య అతడి నియమాల్ని రూపుదిద్దినందువల్ల అతడు పౌలు పక్క సహాయకుడుగా నిలువటానికి సమర్థుడయ్యాడు. వయసులో చిన్నవాడైనప్పటికీ తిమోతి తన బాధ్యతల్ని క్రైస్తవ సాత్వికంతో నిర్వహించాడు. AATel 144.1

ముందు జాగ్రత్త చర్యగా సున్నతి పొందమని పౌలు తిమోతికి తెలివైన సలహా ఇచ్చాడు. అది దేవుడు కోరుతున్నది కాదు. కాని అది తిమోతి పరిచర్యకు బహుశా యూదుల మనసుల్లో ఉండే అభ్యంతరాన్ని తొలగించటానికి. తన సేవ సందర్భంగా పౌలు అనేక ప్రాంతాల్లో ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి ప్రయాణం చేయాల్సి ఉన్నాడు. తరచు యూదుల సమాజ మందిరాల్లోను ఇతరత్రా సమావేశాల్లోను ప్రసంగించటానికి అతనికి అవకాశం వస్తుంది. సాటి సువార్తికుల్లో ఒక వ్యక్తి సున్నతి పొందలేదని తెలిస్తే యూదుల విద్వేషం మూఢభక్తి కారణంగా తన పరిచర్యకు అంతరాయం కలుగవచ్చు. పౌలుకి అన్ని చోట్ల తీవ్ర వ్యతిరేకత, భీకర హింస ఎదురయ్యాయి. యూదులకు అన్యజనులకు సువార్తను బోధించాలన్నది పౌలు ఆకాంక్ష. అందుచేత వ్యతిరేకించటానికి సాధ్యమైనంత మేరకు సాకులు లేకుండా చేయటానికి పౌలు ప్రయత్నించాడు. అయినప్పటికీ యూదుల ద్వేషాన్ని తొలగించటానికి ఇంత చేసినా, సున్నతి ఆచరించటంలోనూ ఆచరించకపోవటం లోనూ ఏమీ లేదని, క్రీస్తు సువార్తలోనే అంతా ఉందని పౌలు నమ్మాడు, బోధించాడు. AATel 144.2

విశ్వాసాన్నిబట్టి తన “నిజమైన కుమారుడైన” (1 తిమోతి 1:2) తిమోతిని పౌలు ప్రేమించాడు. ఘనత వహించిన ఈ అపొస్తలుడు తన ఈ యువ శిష్యుణ్ని పిలిచి లేఖన చరిత్రపై తరచు ప్రశ్నించేవాడు. వారిరువురు ఒక స్థలంనుంచి ఇంకొక స్థలానికి ప్రయాణం చేసేటప్పుడు దైవ సేవను జయప్రదంగా ఎలా చేయాలో నేర్పించేవాడు. సువార్త సేవకుడి పరిచర్య పవిత్రమైంది గంభీరమైంది అన్న తిమోతి పూర్వాభిప్రాయాన్ని తిమోతితో తమ అనుబంధ కాలమంతటిలోనూ పౌలు సీలలు పటిష్ఠపర్చటానికి ప్రయత్నించారు. AATel 144.3

తన సువార్త పరిచర్యలో తిమోతి ఎప్పుడూ పౌలు సలహాల్ని ఉపదేశాన్ని కోరేవాడు. తిమోతి ఉద్వేగంతో పనులు చెయ్యలేదు. ప్రతీ సందర్భంలోనూ ఇది ప్రభువు మార్గమా? అని తన్నుతాను ప్రశ్నించుకొని వ్యవహరించేవాడు. దైవ సముఖం నివాసానికి ఆలయంగా రూపుదిద్దేందుకు తిమోతిని పరిశుద్ధాత్మ యోగ్యమైన వాడిగా కనుగొన్నాడు. బైబిలు బోధించే పాఠాలు దినవారీ జీవితంలో భాగమైనప్పుడు అవి ప్రవర్తనను బలంగా ప్రభావితం చేస్తాయి. ఈ పాఠాల్సి తిమోతి నేర్చుకొని ఆచరణలో పెట్టాడు. అతడికి ప్రత్యేక ప్రతిభపాటవాలేమీ లేవు. కాని అతడి పని చాలా విలువైంది. కారణమేమిటంటే దేవుడిచ్చిన సమర్థతల్ని అతడు దైవ కార్యసాధనలో ఉపయోగించాడు. తన క్రియాశీలక భక్తి ఇతర విశ్వాసులనుంచి అతణ్ని ప్రత్యేకించి అతనికి పలుకుబడినిచ్చింది. AATel 144.4

ఆత్మల రక్షణార్థం పనిచేసేవారు దేవునిగూర్చి లోతైన, సంపూర్ణమైన, స్పష్టమైన జ్ఞానం సంపాదించాలి. సామాన్య కృషినల్ల వచ్చే జ్ఞానం కాదు. ప్రభువు కార్యసాధన కృషిలో వారు తమ యావచ్చక్తిని ఉపయోగించాలి. వారు పొందిన పిలుపు ఉన్నతమైంది పరిశుద్ధమైంది. వారు ఆత్మల్ని రక్షించాలంటే సమస్త శక్తికీ సకల దీవెనలకీ నిలయమైన దేవుని ఆశ్రయించి దినదినం ఆయన అనుగ్రహించే కృపను పొందాలి. “ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను, నీతితోను భక్తితోను బ్రదుకవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్కియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మన కొరకు అర్పించుకొనెను.” తీతుకు 2:11-14. AATel 145.1

పౌలు అతడి మిత్రులు కొత్త ప్రాంతాలకు వెళ్ళకపూర్యం పిసిదియ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న సంఘాల్ని సందర్శించారు. “వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు, యెరూషలేములోనున్న అపొస్తలులును పెద్దలును నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసమునందు స్థిరపడి, అనుదినము లెక్కకు విస్తరించుచుండెను”. AATel 145.2

తన పరిచర్య ఫలితంగా క్రైస్తవాన్ని స్వీకరించిన వారి విషయంలో పౌలు తనకు బాధ్యత ఉన్నదని భావించాడు. ప్రధానంగా, వారు నమ్మకంగా జీవించాలని ఆకాంక్షించాడు. ‘నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయకారణము కలుగును” అన్నాడు. ఫిలిఫ్సీ 2:16. తన పరిచర్య ఫలితాల్ని గురించి భయంతో వణికాడు. తన కర్తవ్య సాధనలో తాను అపజయం పొందితే ఆత్మల రక్షణ కార్యంలో సంఘం తనకు సహకరించకపోతే తన సొంత రక్షణనే కోల్పోవచ్చునని ఆందోళన చెందాడు. విశ్వాసులు జీవవాక్యాన్ని గ్రహించి అనుసరించటానికి కేవలం బోధించటమే చాలదని అతడికి తెలుసు. క్రీస్తు సేవలో వారు పురోగమించటానికి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రం కొంత ఇచ్చట కొంత అచ్చట వారికి నేర్పించాలని అతడికి తెలుసు. AATel 145.3

ఒకరు దేవుడు తనకిచ్చిన సమర్థతల్ని ఉపయోగించటానికి నిరాకరిస్తే అవి క్షీణించి నశిస్తాయన్నది సర్వ సామాన్య సూత్రం. సత్యాన్ని జీవించకపోతే, ఇంకొకరికి దాన్ని నేర్పించకపోతే జీవం ఇచ్చేదాని శక్తి, స్వస్తత కూర్చేదాని శక్తి నశిస్తుంది. అందుకే క్రీస్తులో ప్రతీ మనిషినీ సంపూర్ణవ్యక్తిగా సమర్పించటంలో విఫలమౌతానేమో నన్న భయాన్ని పౌలు వ్యక్తం చేస్తున్నాడు. తన వైఫల్యమేదైనా సంఘానికి దేవుని మూస బదులు మానవుడి మూసను ఇస్తుందేమోనన్న ఆలోచన పౌలుకి కలిగినప్పుడు స్వీయరక్షణను గూర్చిన ఆశాభావం మసకబారింది. తన జ్ఞానం, తన వాగ్దాటి, తన సూచక క్రియలు, మూడో ఆకాశానికి వెళ్ళినప్పుడు తాను చూసిన నిత్యజీవన దృశ్యాలు - ఇవన్నీ వ్యర్థమే. తన పనిలో అపనమ్మకం మూలాన తాను ఎవరిరక్షణ కోసం పాటుపడ్డాడో వారు దైవ కృపను పొందలేక పోటం జరిగితే! క్రీస్తును అంగీకరించిన ప్రజలు “మూర్ఖుమైన వక్రజనుల మధ్య నిరపరాధులుసు నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు.... జీవవాక్యము చేతపట్టుకొని లోకములో జ్యోతులవలె” (ఫిలిప్పీ 2:15, 16) ఉండటానికి తమను యోగ్యుల్ని చేసే జీవిత మార్గాన్ని అనుసరించాల్సిందిగా నోటి మాటలతోను ఉత్తరాలద్వారాను పౌలు వారికి విజ్ఞప్తి చేశాడు. AATel 146.1

నిజాయితీగల ప్రతీ బోధకుడు తాను పరిచర్యచేసే విశ్వాసుల ఆధ్యాత్మిక పెరుగుదలకు బాధ్యత తీసుకొంటాడు. ఆత్మల రక్షణ కృషిలో వారు దేవునితో జతపనివారు కావాలని ఆకాంక్షిస్తాడు. తనకు దేవుడిచ్చిన ఆ బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించటం పైనే సంఘ శ్రేయోభివృద్ధి చాలా వరకు ఆధారపడి ఉంటుందని గుర్తిస్తాడు. సంఘంలోకి వచ్చే ప్రతీ విశ్వాసి రక్షణ ప్రణాళిక అమలుకు మరోసాధనమని గుర్తుంచుకొని క్రీస్తు విశ్వాసంలోకి ప్రజల్ని నడిపించటానికి చిత్తశుద్ధితో అవిశ్రాంతంగా పాటుపడటానికి ప్రోత్సహిస్తాడు. AATel 146.2

పిసిదియలోను దాని పరిసర ప్రాంతంలోను ఉన్న సంఘాల్ని దర్శించిన దరిమిల పౌలు సీలలు తిమోతితో కలిసి “పుగియ గలతీయ” ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ గొప్ప శక్తితో రక్షణ శుభవార్తను ప్రకటించారు. గలతీయులు విగ్రహారాధకులు. కాని అపొస్తలులు, వారి సహచరులు సువార్తను బోధించగా పాపంనుంచి తమకు విముక్తి లభిస్తుందన్న వర్తమానం విని ఉత్సహించారు. క్రీస్తు ప్రాయశ్చిత్తార్థ బలియందు విశ్వాసం ద్వారా నీతిమంతులని తీర్పు పొందటమన్న సిద్ధాంతాన్ని పౌలు అతని సహచరులు వారికి బోధించారు. పతనమైన మానవజాతి నిస్సహాయ స్థితిని చూసి, దైవ ధర్మశాస్త్రానికి విధేయుడై నివసించి మానవుడి అవిధేయతకు ప్రాయశ్చిత్తం చెల్లించి మానవాళిని రక్షించటానికి వచ్చిన రక్షకుడుగా క్రీస్తును వారికి చూపించారు. దేవుడెలాంటివాడో ముందెన్నడూ ఎరుగనివారు సిలువ వెలుగులో తండ్రి అయిన దేవుని ప్రేమ ఔన్నత్యాన్ని అవగతం చేసుకొన్నారు. AATel 146.3

“మన తండ్రియైన దేవుని” గూర్చి “మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి. విమోచింపవలెనని మన పాపములనిమిత్తము తన్ను తాను అప్పగించు” కొన్న “మన ప్రభువైన యేసుక్రీస్తు”ను గూర్చిన మౌలిక సత్యాల్ని ఈ విధంగా గలతీయులు నేర్చుకొన్నారు. “విశ్వాసముతో వినుటవలన” వారు దేవుని ఆత్మను పొంది” విశ్వాసము వలన దేవుని కుమారులు” అయ్యారు. గలతీ 1:3, 4; 3:2,26. AATel 147.1

అనంతరం గలతీయుల్ని ఉద్దేశించి “మీరును నావంటివారు కావలెను” అన్నాడు పౌలు. వారి మధ్య పౌలు జీవించిన జీవితం అలాంటిది. గలతీ 1:12. బలిపీఠంనుంచి తీసిన నిప్పును పెదవులకు తగిలించినమీదట పాపికిగల ఏకైక నిరీక్షణగా యేసును వారిముందుంచటానికి, భౌతిక బలహీనతల్ని అధిగమించటానికి శక్తిపొందాడు. తన మాటలు విన్నవారు అతడు క్రీస్తుతో ఉన్నవాడని గ్రహించారు. పైనుంచి శక్తిని పొందిన అతడు ఆధ్యాత్మిక విషయాల్ని ఆధ్యాత్మిక విషయాల్లో పోల్చటానికి సాతాను కోటల్ని కూల్చటానికి సమర్థుడయ్యాడు. క్రీస్తు బలిదానం ద్వారా వెల్లడైన దైవ ప్రేమను అతడు వివరించగా ప్రజల హృదయాలు చలించిపోయాయి. రక్షణ పొందటానికి నేనేమి చెయ్యాలి? అంటూ అనేకమంది ప్రశ్నించటం మొదలు పెట్టారు. AATel 147.2

అన్య జనుల మధ్య తన పరిచర్య అంతటిలోను ఈ సువార్త ప్రబోధ పద్ధతే ఉపయోగించాడు. ప్రజలముందు ఎల్లప్పుడూ కల్వరి సిలువను ఉంచాడు. తన సువార్త పరిచర్య చివరి దశలో పౌలు ఇలా అన్నాడు, “అంధకారములోనుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమనుగూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. కనుక మేము మమ్మునుగూర్చి ప్రకటించుకొనుటలేదుగాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము”. 2 కొరింథీ 4:5,6. AATel 147.3

క్రైస్తవ మతం తొలి దినాల్లో, నశిస్తున్న లోకానికి రక్షణ వర్తమానాన్ని అందించిన భక్త ప్రబోధకులు సిలువ పొందిన క్రీస్తును గూర్చిన తమ కథనానికి విఘాతం కలుగకుండేందుకుగాను తమ్మును గూర్చి తాము గొప్పలు చెప్పుకొనేవారు కాదు. వారికి అధికారం మీదగాని పేరు ప్రతిష్ఠల మీదగాని వ్యామోహం లేదు. తమ్మును తొము రక్షకునిలో మరుగుపర్చుకొని రక్షణ ప్రణాళికకు ఆ ప్రణాళికకు, కర్త దాన్ని సిద్ధింపజేసేవాడు అయిన క్రీస్తు జీవితానికి వాడు ప్రాధాన్యాన్నిచ్చారు. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉండే క్రీస్తు వారి బోధల కేంద్రబిందువు. AATel 147.4

నేడు దైవ వాక్యాన్ని బోధిస్తున్నవారు క్రీస్తు సిలువకు అగ్రస్థానాన్ని, అత్యున్నత స్థానాన్ని ఇస్తే వారి సువార్త సేవ మరింత విజయవంతమౌతుంది. సిలువను ఒక్కసారి చిత్తశుద్ధితో వీక్షించటానికి పాపుల్ని నడిపించగలిగితే, సిలువపొందిన రక్షకుణ్ని వారు ఒక్కసారి చూడగలిగితే దేవుడు ఎంత ప్రేమగలవాడో వారికర్థమౌతుంది. పాపం ఎంత నీచమైందో గుర్తిస్తారు. AATel 147.5

దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని క్రీస్తు మరణం నిరూపిస్తున్నది. అదే మనకు రక్షణ వాగ్దానం. క్రైస్తవుడినుంచి సిలువను తీసివేయటం ఆకాశంలోనుంచి సూర్యుణ్ని తీసివేయటంలా ఉంటుంది. సిలువ మనల్ని దేవుని వద్దకు తీసుకువస్తుంది. దేవునితో మనల్ని సమాధానపర్చుతుంది. నిత్యమరణం నుంచి మానవాళిని రక్షించటానికి తన కుమారుడు పొందిన శ్రమలను పొంగిపొరలే తండ్రి ప్రేమతో యెహోవా చూస్తాడు. తన ప్రియ కుమారుణ్ని బట్టి మనల్ని స్వీకరిస్తాడు. AATel 148.1

సిలువలేకుండా మానవుడికి దేవునితో కలయిక సాధ్యపడదు. సిలువ మీదే మన నిరీక్షణ ఆనుకొని ఉంది. రక్షకుని ప్రేమ సిలువనుంచే ప్రకాశిస్తున్నది. తనను రక్షించటానికి మరణించిన రక్షకుణ్ని వీక్షించటానికి పాపి సిలువ పాదాలవద్ద నిలిచి కన్నులెత్తినప్పుడు అతడు ఆనందించవచ్చు. అతడికి పాపక్షమ కలిగింది. సిలువవద్ద విశ్వాసంతో మోకరించటం ద్వారా మానవుడు ఎన్నడూ చేరలేని అత్యున్నత స్థలాన్ని పాపి చేరాడు . AATel 148.2

పరలోకమందున్న తండ్రి మనల్ని అనంతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడని సిలువ ద్వారా మనం తెలుసుకొంటున్నాం. పౌలు తన భక్తి మర్యాదల్ని ఇలా వెలిబుచ్చాడు, “మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవునుగాక”. గలతీ 6:14. సిలువయందు అతిశయించటం, మనకోసం తన్నుతాను అర్పించుకొన్న ప్రభువుకి మనల్ని మనం పూర్తిగా అంకితం చేసుకోటం కూడా మన ఆధిక్యత. కల్వరినుంచి నదిలా ప్రవహించే వెలుగు మన ముఖాల పై ప్రకాశించటంతో చీకటిలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు ఈ వెలుగు చూపించటానికి మనం ముందంజ వేయవచ్చు. AATel 148.3