అపొస్తలుల కార్యాలు

20/59

19—యూదులు, అన్యులు

పౌలు బర్నబాలు సిరియాలోని ఆంతియొకయ - ఇక్కడనుంచే తమ కర్తవ్య నిర్వహణకై వారు బయల్దేరి వెళ్ళారు - చేరిన తర్వాత “దేవుడు తమకు తోడై యుండి చేసిన కార్యములన్నియు, అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు” (అ.కా. 14:27) వివరించటానికి విశ్వాసులందరిని సమావేశపర్చారు. అంతియొకయలోని సంఘం పెద్దది. అదింకా పెరుగుతున్న సంఘం. అది మిషనెరీ కార్యకలాపాలకు కేంద్రం. క్రైస్తవ విశ్వాసి సమూహాల ముఖ్యకేంద్రాల్లో అంతియొకయ ఒకటి. యూదులికి అన్యులికి చెందిన అనేక తరగతుల ప్రజలు ఆ సంఘంలో సభ్యులు. AATel 133.1

అంతియొకయలో ఉన్న బోధకులు విశ్వాసులతో కలిపి అపొస్తలులు అనేక ఆత్మల్ని క్రీస్తు విశ్వాసంలోకి నడిపించటానికి కృషి చేస్తున్న తరుణంలో పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు” విశ్వాసులైన అన్యులికి దిగ్ర్భాంతి కలిగించిన ఓ వివాదస్పద సమస్యను ప్రవేశపెట్టారు. రక్షణ పొందటానికి ఒక వ్యక్తి సున్నతి పొందటం, ఆచార ధర్మశాస్త్రాన్ని ఆచరించటం అవసరమని ఈ యూదుమత బోధకులు గొప్ప అధికారంతో ప్రబోధిస్తున్నారు. AATel 133.2

ఈ తప్పుడు సిద్ధాంతాన్ని పౌలు బర్నబాలు ఖండించి దాన్ని అమ్యలకు వర్తింపజెయ్యటాన్ని వ్యతిరేకించారు. పైగా అంతియొకయలోని అనేకమంది యూదు విశ్వాసులు ఇటీవల యూదానుంచి వచ్చిన సహోదరుల వాదనను సమర్థించారు. దేవుడు మార్గాలు తెరిచినంత వేగంగా ముందుకి వెళ్ళటానికి యూదు విశ్వాసులు సాధారణంగా ఇష్టపడలేదు. అన్య ప్రజల మధ్య అపోస్తులుల సువార్త సేవా ఫలితాలు ఆధారంగా, సంఖ్యాపరంగా యూదు విశ్వాసులకన్నా అన్య విశ్వాసులే ఎక్కువని తేలింది. సంఘ సహవాసానికి ధర్మశాస్త్ర ఆంక్షలు ఆచారాలు షరతులుగా విధించకపోతే తమను ఒక ప్రజగా ప్రత్యేకంగా ఉంచిన యూదు జాతీయ విలక్షణాలు, సువార్తను స్వీకరించే వారిలోనుంచి చివరికి పూర్తిగా మాయమై పోతాయన్నది యూదుల భయం. AATel 133.3

తమ ఆరాధన వ్యవస్థ దేవుడు నియమించిందని యూదులు ఎల్లప్పుడూ అతిశయించేవారు. ఒకప్పుడు హెబ్రీయుల ఆరాధన పద్ధతిని దేవుడు విస్పష్టంగా నిర్దేశించాడు గనుక దాని తాలూకు ఏ అంశాల్లోనూ ఆయన ఎలాంటి మార్పులూ అంగీకరించడని క్రీస్తును విశ్వసించిన యూదుల్లో పలువురు భావించారు. యూదు చట్టాలు ఆచారాల్ని క్రైస్తవ మత విధివిధానాల్లో చేర్చాలని వారు పట్టుపట్టారు. బలి అర్పణలన్నీ దైవకుమారుడు యేసు మరణానికి ఛాయ మాత్రమేనని అందులోని ఛాయ నిజస్వరూపమైన క్రీస్తులో నెరవేరిన తర్వాత మోషే ఇచ్చిన విధివిధానాలు ఆచారాలు నిరర్థక మౌతాయని గ్రహించటంలో వారు’ మందమతులయ్యారు. AATel 134.1

క్రీస్తు అనుచరుడుగా మారకపూర్వం “ధర్మశాస్త్రమువలని నీతి విషయము అనింద్యుడనైయుంటిని” (ఫిలిప్పి 3:6) అని పౌలు తన్ను గూర్చి తాను అనుకొన్నాడు. అయితే తనకు హృదయపరివర్తన కలిగినప్పటినుంచి యూదులు అన్యులు సహా సర్వమానవజాతి విమోచకుడుగా రక్షకుడైన యేసు పరిచర్యను గూర్చి పౌలుకి స్పష్టమైన అభిప్రాయం ఏర్పడింది. సజీవ విశ్వాసానికి మృత ఆచారానికి మధ్య ఉన్న తేడాను గ్రహించాడు. ఇశ్రాయేలీయులికి దేవుడిచ్చిన విధి విధానాలు ఆచారాలు సువార్త వెలుగులోనూ ప్రాముఖ్యాన్ని సంతరించుకొన్నాయి. సువార్త కాలంలో నివసించేవారు వాటిని ఆచరించాల్సిన అవసరం లేదు. మార్చటానికి వీలులేని దేవుని పది ఆజ్ఞల ధర్మశాసనాన్ని అక్షరార్థ పరంగాను స్ఫూర్తిపరంగాను పౌలింకా ఆచరించాడు. AATel 134.2

అంతియొక సంఘంలో సున్నతి సమస్య పరిగణన వివాదాలకు విభేదాలకు దారితీసింది. ఆ అంశంపై చర్చకొనసాగింపు సంఘ విభజనకు దారి తీస్తుందని భయపడి పౌలు బర్నబాల్ని మరికొందరు బాధ్యతాయుత సంఘ సభ్యుల్ని ఆ విషయాన్ని అపొస్తలులు పెద్దల ముందు పెట్టటానికి యెరూషలేముకు పంపించారు. సమీపిస్తున్న పండుగలకు హాజరవ్వటానికి వివిధ సంఘాల నుంచి వచ్చిన ప్రతినిధుల్ని వారు అక్కడ కలుసుకోవలసి ఉన్నారు. సర్వ సభ్యసభలో ఈ సమస్యకు తుది పరిష్కారం లభించే వరకు దీనిపై వివాడమంతా ఆగిపోవాల్సి ఉంది. దేశంలోని సంఘాలన్నీ ఆ సభనుంచి వెలువడనున్న తీర్మానాన్ని శిరసావహించాల్సి ఉంది. AATel 134.3

అపొస్తలులు దైవ సేవలో తమకు కలుగుతున్న అనుభవాలతో, అన్యులు క్రైస్తవానికి మారటాన్ని గూర్చిన సంగతులతో యెరూషలేము మార్గంలోని పట్టణాల్లోని సభ్యుల్ని ఉత్సాహపర్చుతూ ప్రయాణించారు. AATel 134.4

అంతియొకయనుంచి వచ్చిన ప్రతినిధులు ఆయా సంఘాలనుంచి వచ్చిన సహోదరుల్ని యెరూషలేములో కలుసుకొన్నారు. అపొస్తలులు అన్యుల మధ్య తాము చేసిన పరిచర్యలో తమకు కలిగిన విజయాలగురించి వారికి వివరించారు. అనంతరం క్రైస్తవాన్ని స్వీకరించిన కొందరు పరిసయ్యులు అంతియొకయకు వెళ్ళటం, గురించి రక్షణపొందటానికి అన్యులు సున్నతి పొందాలని మోషే ధర్మశాస్త్రాన్ని ఆచరించాలని బోధించటం గురించి వారికి చెప్పారు. AATel 134.5

ఆ సమస్యను యెరూషలేము సభలో వాడిగా వేడిగా చర్చించటం జరిగింది. జాగ్రత్తగా అధ్యయనం చేయటానికి సున్నతి సమస్యతో ముడిపడి ఉన్న అనేక ఇతర సమస్యలున్నాయి. అందులో ఒకటి విగ్రహార్పిత వస్తువుల పట్ల ఎలాంటి వైఖరి అవలంబించాలన్నది. క్రీస్తును విశ్వసించిన అన్యుల్లో అనేకమంది విగ్రహాలకు బలులు, అర్పణలు అర్పించే ప్రజలు, మూఢనమ్మకాలుగల అజ్ఞాన ప్రజల నడుమ నివసిస్తున్నారు. అన్యమత పూజలు జరిపే పూజారులు తమ వద్దకు ప్రజలు తెచ్చే అర్పణలతో విస్తారమైన వ్యాపారం సాగించేవారు. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన అన్యులు విగ్రహార్సిత వస్తువుల వినియోగానికి, కొంత మేరకు విగ్రహారాధనకు సంబంధించిన ఆచారాలకు నాంది పలుకుతారేమోనని యూదులు భయపడ్డారు. AATel 135.1

అన్యులు గొంతునులిమి చంపిన జంతువుల మాంసం తినటానికి అలవాటు పడ్డవారు. కాగా జంతువుల్ని ఆహారం నిమిత్తం చంపేటప్పుడు వాటి రక్తాన్ని కార్చివేసిన తర్వాతనే వాటి మాంసాన్ని తినాలన్నది యూదులకు దేవుడిచ్చిన ఆదేశం. రక్తం తీసివేయని మాంసం ఆరోగ్యవంతంకాదు. యూదుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకే దేవుడు వారికి ఉపదేశాలిచ్చాడు. రక్తం తినటం యూదులు పాపంగా పరిగణించారు. రక్తం ప్రాణమని రక్తం చిందించటం పాపఫలితమని యూదులు విశ్వసించారు. AATel 135.2

అన్యులు అలాక్కాకుండా బలిపశువు రక్తాన్ని పట్టి ఉంచి ఆహారం తయారీలో దాన్ని ఉపయోగించి తినేవారు. తాము అవలంబిస్తున్న ఆచారాల్ని దేవుని ప్రత్యేకాదేశం మేరకు మార్చుకోటానికి యూదులు సుముఖంగా లేరు. కాబట్టి అప్పుడున్న పరిస్థితుల్నిబట్టి యూదులు అన్యులు సహబంతి భోజనం చెయ్యటానికి ప్రయత్నించటం యూదులికి ఊహాతీతంగా ఉంది. AATel 135.3

అన్యులు ముఖ్యంగా గ్రీకులు విచ్చలవిడి ప్రవర్తన గల ప్రజలు. కనుక హృదయ పరివర్తనలేని కొందరు దురభ్యాసాల్ని విడిచి పెట్టకుండా విశ్వాసులమని చెప్పుకొనే ప్రమాదముంది. అన్యులు నేరంగా సయితం పరిగణించని నీతిబాహ్యతను యూదుక్రైస్తవులు సహించరు. అందుచేత తమ నిజాయితీని భక్తిని నిరూపించుకొనేందుకు అన్యులు సున్నతిని ఆచరించి ఆచార ధర్మశాస్త్రాన్ని పాటించటం సమంజసమని యూదులు అభిప్రాయపడ్డారు. హృదయంలో మార్పు లేకుండా క్రీస్తును విశ్వసిస్తున్నట్లు చెప్పుకొని సంఘంలో ప్రవేశించి అనైతికత, విచ్చలవిడి ప్రవర్తనవల్ల ఆనక సంఘానికి చెడ్డ పేరు తెచ్చే వారిని అది బయట ఉంచుతుందని వారు విశ్వసించారు. AATel 135.4

ప్రధాన సమస్య పరిష్కారంలో ఎదురయ్యే పలు అంశాలు సభకు పెద్ద సమస్యగా పరిణమించబోతున్నాయి. నిజానికి ఈ సమస్యను పరిశుద్ధాత్మ పరిష్కరించే ఉంచాడు. ఈ పరిష్కారం మీదే క్రైస్తవ సంఘం ప్రగతి, అస్తికత ఆధారపడి ఉన్నాయి. AATel 135.5

“బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను - సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నానోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడేర్పరచుకొనెనని మీకు తెలియును”. వివాదాస్పదమైన ఈ అంశాన్ని పరిశుద్దాత్మే పరిష్కరించాడని చెప్పుతూ సున్నతి పొందని అన్యజనుల పైకి సున్నతి పొందిన యూదుల పైకి పరిశుద్ధాత్మ సమాన శక్తితో దిగివచ్చాడని పేతురు వాదించాడు. తనకు వచ్చిన దర్శనాన్ని, అందులో తనకు చతుష్పాద జంతువులతో నిండిన దుప్పటిని దేవుడు పంపి వాటిని చంపుకు తినమని ఆదేశించటాన్ని వారికి వివరించాడు పేతురు. నిషిద్ధమైన దాన్ని అపవిత్రమైన దాన్ని తానెన్నడూ తినలేదని చెప్పి దాన్ని నిరాకరించినప్పుడు, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దు” అన్న సమాధానం వచ్చింది. అ.కా. 10:15. AATel 136.1

పేతురు ఈ మాటల్లోని స్పష్టమైన అర్థాన్ని వివరించాడు. ఆ శతాధిపతి వద్దకు వెళ్ళి క్రీస్తుని గూర్చిన విశ్వాసాన్ని అతనికి బోధించమంటూ దాదాపు వెంటనే వచ్చిన ఆదేశంలోనే ఉంది. ఆ వివరణ. దేవుడు పక్షపాతికాడని ఆయన తనకు విధేయులయ్యేవారిని అంగీకరించి గుర్తిస్తాడని ఈ వర్తమానం సూచిస్తుంది. కొర్నేలీ గృహంలో సమావేశమైనవారికి సత్యవాక్యం బోధిస్తున్న తరుణంలో యూదులు అన్యులు అన్న తేడాలేకుండా శ్రోతల మీదికి పరిశుద్దాత్మరావటం చూసినప్పుడు తనకు కలిగిన దిగ్ర్భాంతిని గురించి పేతురు వారికి చెప్పాడు. సున్నతి పొందిన యూదుల ముఖాలపై ప్రకాశించిన మహిమే సున్నతి పొందని అన్యజనుల ముఖాల పైనా ప్రకాశించింది. ఒకర్ని ఇంకొకరికన్నా తక్కువ వానిగా పరిగణించ కూడదని పేతురుకి ఇది దేవుడిచ్చిన హెచ్చరిక. ఎందుకంటే క్రీస్తు రక్తం సకల అపవిత్రతను శుద్ధి చెయ్యటానికి శక్తిగలది. AATel 136.2

కొర్నేలీ, అతని మిత్రులు క్రైస్తవాన్ని స్వీకరించటం గురించి, వారితో తన సహవాసాన్ని గురించి క్రితంలో ఒకసారి పేతురు తన సోదర అపొస్తలులతో వాదించటం జరిగింది. అన్యజనుల మీదికి పరిశుద్ధాత్మ రావటం గురించి వారికి చెబుతూ పేతురు అప్పుడిలా అన్నాడు, “కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి యుండగా దేవుని అడ్డగించుటకు నేనేపాటివాడను?” అ.కా. 11:17. ఇప్పుడూ అదే ధోరణిలో ఇలా అన్నాడు. “మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి, వారిని గూర్చి సాక్ష్యమిచ్చెను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనపర్చలేదు. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు?” పది ఆజ్ఞల ఆచరణను వ్యతిరేకించే కొందరంటున్నట్లు ఈ కాడి పది ఆజ్ఞల ధర్మశాస్త్రాచరణకాదు. ఇక్కడ పేతురు ప్రస్తావిస్తున్నది క్రీస్తు సిలువ మరణంతో రద్దయిన ఆచార ధర్మశాస్త్రం. AATel 136.3

పేతురు ప్రసంగం సభవారు పౌలు బర్నబాల కథనాన్ని సావధానంగా వినటానికి మార్గం సుగమం చేసింది. అన్యజనుల మధ్య తమ పరిచర్య అనుభవాల్ని వారు సభకు వివరించారు. “అంతట ఆ సమూహమంతయు బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను”. AATel 137.1

యాకోబు కూడా తన సాక్ష్యాన్ని నిర్ణయాత్మకంగా ఇచ్చాడు. యూదులకిచ్చిన ఆశీర్వాదాలు విశేషావకాశాలు అన్యులకు కూడా సమానంగా ఇవ్వటం దేవుని పరమోద్దేశమని నొక్కి పలికాడు. AATel 137.2

అన్య విశ్వాసుల పై ఆచార ధర్మశాస్త్ర విధింపు మంచిది కాదని పరిశుద్ధాత్మ భావించాడు. ఆ విషయమై అపొస్తలుల ఉద్దేశం కూడా పరిశుద్దాత్మకు అనుగుణంగా ఉంది. యెరూషలేము సభకు యాకోబు అధ్యక్షత వహించాడు. అతడి చివరి తీర్మానం ఇది. “కాబట్టి అన్యజనులలోనుండి దేవునివైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్ట” కూడదు. AATel 137.3

దీనితో చర్చ ముగిసింది. పేతురు సంఘానికి శిరస్సు అన్న రోమను కథోలిక్కు సంఘ సిద్ధాంతం తప్పుడు సిద్ధాంతమని ఈ సందర్భం వ్యక్తం చేస్తున్నది. పోపుల్లాగ పేతురు వారసులమని చెప్పుకొనే వారందరికీ లేఖన పునాది లేదు. సర్వోన్నతుడైన దేవుని ప్రతినిధిగా పేతురు తన సోదర అపొస్తలుల్ని అధిగమించి అందలమెక్కటానికి పేతురు జీవితంలోని ఏ విశేషమూ సమర్థించటంలేదు. పేతురు వారసులుగా ప్రాచుర్యం పొందేవారు పేతురు ఆదర్శం మేరకు జీవిస్తే వారు తమ సహోదరులతో సమానంగా ఉండటంతో సంతృప్తి చెంది నివసిస్తారు. AATel 137.4

ఈ సందర్భంలో సభ తీర్మానాన్ని ప్రకటించటానికి యాకోబు ఎంపికయ్యాడు. ఆచార ధర్మశాస్త్రం ముఖ్యంగా సున్నతి సంస్కారం అన్యజనుల పై విధించకూడదన్నది లేదా వారికి సిఫార్సు చేయకూడదన్నది యాకోబు తీర్మానం. దేవుని తట్టు తిరగటంలో అన్యజనులు తమ జీవితాల్లో గొప్ప మార్పు చేసుకొన్నారని కనుక తికమక పెట్టే చిన్న చితక సమస్యలతో వారిని కష్టపెట్టి తద్వారా క్రీస్తును వెంబడించటంలో వారిని నిరుత్సాహపర్చటం మంచిదికాదని సహోదరులకు సూచించటానికి యాకోబు ప్రయత్నించాడు. AATel 137.5

క్రైస్తవులైన అన్యులు క్రైస్తవ మత విరుద్ధ ఆచారాల్ని విడిచి పెట్టాల్సి ఉన్నారు. అందుచేత విగ్రహాలకు అర్పించిన వాటికి, జారత్వానికి, గొంతు నులిమి చంపిన జంతు మాంసం నుంచి, రక్తాన్ని ఆహారంగా ఉపయోగించటాన్నుంచి అన్యప్రజల్ని దూరంగా ఉంచేందుకు ఉత్తరాల ద్వారా అన్యవిశ్వాసుల్ని ఉపదేశించటానికి అపొస్తలులు పెద్దలు అంగీకరించారు. ఆజ్ఞలు ఆచరించి పరిశుద్ధ జీవితాలు జీవించాల్సిందిగా అన్య విశ్వాసులకు విజ్ఞప్తి చేయాల్సి ఉన్నారు. సున్నతి తప్పనిసరి అని ప్రకటించిన మనుషులు ఆ కార్యాన్ని జరుపటానికి అపొస్తలులు అనుమతిం చరన్న హామీ కూడా వారికి ఇవ్వాల్సి ఉన్నారు. AATel 138.1

ప్రభువు కోసం తమ ప్రాణాలు పణంగా పెట్టిన వ్యక్తులుగా పౌలు బర్నబాల్ని వారికి సిఫార్సు చేశారు. సభ తీర్మానాన్ని నోటిమాటద్వారా అన్యజనులికి ప్రకటించటానికి ఈ ఇద్దరు అపొస్తలులతో యూదాను స్త్రీలను పంపారు. “విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జించవలెను. ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యేభారమును మీమీద మోపకూడదని పరిశుద్దాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు”. ఆ వివాదమంతటికి తెరదించనున్న పత్రికతోను వర్తమానంతోను అంతియొకయకు నలుగురు దైవ సేవకుల్ని ఆ సభ పంపించింది. ఎందుకంటే భూమి పై ఉన్న అత్యున్నత అధికారపు స్వరం అదే. AATel 138.2

ఈ అంశంపై తీర్పు వెలిబుచ్చిన సభకు అపొస్తలులు యూదు అన్యజన సంఘాల సంస్థాపకులైన మతగురువులు ఆయా స్థలాలనుంచి ఎంపికైన ప్రతినిధులు సభ్యులు. యెరూషలేమునుంచి పెద్దలు అంతియొకయనుంచి ప్రతినిధులు హాజరయ్యారు. పలుకుబడి ఉన్న సంఘాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. సుబుద్ధి తీర్మానాల ప్రకారం, దేవుని చిత్తానుసారంగా స్థాపితమైన సంఘ ప్రతిష్ఠకు అనుగుణంగా సభ కార్యక్రమం సాగింది. సభలో సాగిన చర్చల ఫలితంగా దేవుడే అన్య జనుల పై పరిశుద్ధాత్మను కుమ్మరించటంద్వారా తమ సమస్యకు పరిష్కారం సమకూర్చాడని సభలోని వారంతా గుర్తించారు. పరిశుద్ధాత్మ చూపించిన మార్గాన్ని అనుసరించటం ఇక తమ వంతని వారందరూ గుర్తించారు. AATel 138.3

ఆ సమస్యపై ఓటు వేయటంలో క్రైస్తవ సమాజమంతా పాలు పొందలేదు. “అపొస్తలులు పెద్దలు” పలుకుబడి కుశలబుద్ధిగల వ్యక్తులు ఆ తీర్మానాన్ని రూపొందించి జారీ చేయగా దాన్ని సాధారణంగా క్రైస్తవ సంఘాలు అంగీకరించాయి. ఆ తీర్మానం పట్ల అందరూ సుముఖంగా లేరు. అత్యాశ ఆత్మవిశ్వాసంతో నిండిన ఒక వర్గం ప్రజలు ఆ తీర్మానాన్ని వ్యతిరేకించారు. వారు తమ పనిచేయటం మొదలు పెట్టారు. గొణగటం తప్పు పట్టటం సువార్త బోధించటానికి దేవుడు నియమించిన వారిని పడగొట్టటానికి కొత్త ప్రణాళికలు ప్రతిపాదించటానికి పూనుకోటం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. తొలుత నుంచీ సంఘం ఇలాంటి ఆటంకాలనే ఎదుర్కొంటూ వచ్చింది. ఆటంకాలు లోకాంతం వరకూ ఎదురౌతూనే ఉంటాయి. AATel 138.4

యెరూషలేము యూదుల మహానగరం. పక్షపాత ధోరణి, ద్వేషభావం ఈ నగరంలో ఎక్కువ. దేవాలయం కనిపించేంత దూరంలో నివసించే యూదు క్రైస్తవులు ఒక జాతిగా యూదులకున్న ప్రత్యేక ఆధిక్యతల్ని గురించి ఆలోచించేవారు. యూదుమత సంప్రదాయాలు ఆచారాలనుంచి క్రైస్తవ సంఘం తొలగిపోటం చూసినప్పుడు, ప్రత్యేక పరిశుద్ధత సంతరించుకొన్న యూదు ఆచారాలు సంప్రదాయాలు నూతన విశ్వాసం వెలుగులో మరుగున పడిపోతాయని గ్రహించి నప్పుడు అనేక మందికి పౌలు మీద కోపం వచ్చింది. ఈ మార్చంతటికి కారణం పౌలే కదా! యెరూషలేము సభ తీర్మానాన్ని శిష్యులు సైతం జీర్ణించుకోలేకపోయారు. కొంతమంది ఆచార ధర్మశాస్త్రం విషయంలో ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. యూదు చట్టంలోని విధివిధానాల సందర్భంగా పౌలు సూత్రాలు బలహీనంగా ఉన్నందున వారు పౌలుని విమర్శించారు. AATel 139.1

సాధారణ సభ చేసిన విశాల దీర్ఘ ప్రయోజనకరమైన తీర్మానాలు విశ్వాసులైన అన్యజనుల్లో నమ్మకం పుట్టించాయి. దేవుని సేవ వృద్ధిచెందింది. అంతియొకయ సంఘంలో యూదా సీలల ఉనికి ఎంతో దీవెనకరం. యెరూషలేము సభకు అపొస్తలుల్తోపాటు వారు ప్రత్యేక దూతలుగా హాజరయ్యారు. “యూదయు సీలయుకూడ ప్రవక్తలైయుండినందున పెక్కుమాటలతో సహోదరుల నాదరించి స్థిరపరచిరి”. ఈ దైవ భక్తులు అంతియొకయలో కొంతకాలం ఉన్నారు. “పౌలును బర్నబాయు అంతియొకయలో నిలిచి యింక అనేకులతో కూడ ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి”. AATel 139.2

కొంతకాలం తర్వాత పేతురు అంతియొకయను సందర్శించినప్పుడు అన్యజన క్రైస్తవులపట్ల తాను వ్యవహరించిన తీరును బట్టి అనేకుల విశ్వాసాన్ని చూరగొన్నాడు. దేవుడిచ్చిన వెలుగు ప్రకారం కొంతకాలం వ్యవహరించాడు. అంతవరకు తన స్వాభావిక విద్వేషాన్ని అణచివేసి అన్యజన క్రైస్తవులతో కలిసి భోజనం చేశాడు. కాగా ఆచార ధర్మశాస్త్రం విషయంలో ఉద్రేకంగల యూదులు కొందరు యెరూషలేమునుంచి రాగా పేతురు అన్యమతంలోనుంచి క్రైస్తవ మతానికి మారిన విశ్వాసులపట్ల తన వైఖరిని మార్చుకొన్నాడు. అనేకమంది యూదులు “అతనితో కలిసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయెను”. నాయకులుగా ప్రజలు గౌరవించి ప్రేమించిన వ్యక్తుల్లో బయలు పడ్డ ఈ బలహీనత విశ్వాసులైన అన్య జనుల మనసుల్లో చెరగని ముద్రవేసుకొంది. సంఘం చీలిపోయే ప్రమాదం ఏర్పడింది. పేతురు ప్రదర్శించిన ద్వంద్వ ప్రమాణాల వల్ల జరిగిన కీడును గుర్తించిన పౌలు పేతురు తన అసలు మనోభావాల్సి మసిపూసి మారేడు చేసినందున అతణ్ని బహాటంగా మందలించాడు. సంఘం సమక్షంలో పేతురుని పౌలు ఇలా ప్రశ్నించాడు, “నీవు యూదుడవైయుండియు యూదులవలె కాక అన్య జనులవలెనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదులవలె ప్రవర్తింపవలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు?” గలతి 2:13, 14. AATel 139.3

తాను పొరపాటులో పడ్డసంగతి పేతురు వెంటనే గుర్తించాడు. జరిగిన తప్పును సరిదిద్దుకోటానికి తన శక్తిమేరకు వెంటనే ప్రయత్నించాడు. అతిశయించటానికి తనలో ఏమీ లేదని పేతురు గ్రహించేందుకోసం పేతురు ప్రవర్తనలోని ఈ బలహీనతను బయలు పర్చటానికి ఆదినుంచి అంతం ఎరిగిన దేవుడు ఉద్దేశించాడు. అత్యుత్తమ వ్యక్తులు సయితం తమంతట తాము చేసే తీర్మానాల్లో తప్పటడుగు వేస్తారు. మున్ముందు వంచితులైన కొందరు దేవునికి మాత్రమే చెందే కొన్ని ప్రత్యేకహక్కుల్ని పేతురికి, పేతురు వారసులమని చెప్పుకొనేవారికి ఉన్నట్లు చెప్పుతారని కూడా దేవుడు చూశాడు. పేతురు బలహీనతను గూర్చిన ఈ దాఖలా అతని దోష ప్రవృత్తికీ, ఇతర అపోస్తులులకన్నా అతడు అధికుడు కాడన్న విషయానికీ రుజువుగా నిలిచి ఉంటుంది. AATel 140.1

దేవుని సేవలో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు యధార్థవర్తవ విషయంలో విఫలురుకాకుండా నియమాలకి దృఢంగా నిలబడేందుకుగాను ధర్మసూత్రాల్ని విడిచి పెట్టటాన్ని గూర్చిన ఈ చరిత్ర ఒక గంభీర హెచ్చరికగా ఉంది. మానవ ప్రతివిధిపై ఎంత గొప్ప బాధ్యత ఉంటే, శాసించటానికి, నియంత్రించటానికి అతనికి ఎన్ని అవకాశాలుంటే, అతడు ప్రభువు మార్గాన్ని జాగ్రత్తగా అనుసరించి విశ్వాసుల సాధారణ సభ తీర్మానాలకు అనుగుణంగా పనిచేయకపోతే అతని వలన అంత ఎక్కువ హాని జరుగుతుంది. తన అపజయాల అనంతరం, తన షతనం పునరుద్ధరణల అనంతరం, తన దీర్ఘ పరిచర్యకాలం. క్రీస్తుతో తన వ్యక్తిగత పరిచయం, రక్షకుడు సత్యసూత్రాన్ని అవలంబిస్తాడన్న తన వ్యక్తిగత జ్ఞానం, తాను పొందిన ఉపదేశం అనంతరం, వాక్యాన్ని బోధించటంద్వారా తాను పొందిన వరాలు, జ్ఞానం, పలుకుబడి ఆనంతరం - పేతురు మారువేషం వేయటం, మనుషుడి భయంవల్ల లేదా పేరు ప్రతిష్ఠల కోసం సువార్త సూత్రాలకు నీళ్ళోదలటం విచిత్రంగా లేదూ? నిజాన్ని అనుసరించటంలో ఆతడు సందేహించటం వింతగా లేదూ? తన నిస్సహాయతను గుర్తించి తాను తన సొంత నావను నేరుగా సురక్షితంగా రేవులోకి నడిపించలేనన్న అవగాహనను దేవుడు ప్రతి వ్యక్తికి అనుగ్రహించునుగాక. AATel 140.2

తన దైవ పరిచర్యలో పౌలు తరచుగా ఒంటరిగా నిలబడ్డాడు. ప్రత్యేకించి దేవుడే అతడికి ఉపదేశమిచ్చాడు. అందుకే నియమాల విషయంలో అతడు ఎన్నడూ రాజీపడలేదు. కొన్నిసార్లు అది చాలా భారమనిపించింది. అయినా అతడు సత్యానికి ధృడంగా నిలబడ్డాడు. సంఘం ఎన్నడూ మానవ శక్తికి లోనుకాకూడదని పౌలు గుర్తించాడు. మానవ సంప్రదాయాలు సిద్ధాంతాలు ప్రకటిత సత్యం స్థానాన్ని పొందకూడదు. సంఘంలో వారి హోదా ఎంత ఉన్నతమైందైనా మానవ రాగ ద్వేషాలు ఇష్టాయిష్టాల వల్ల సువార్త ప్రగతికి అంతరాయం ఏర్పడకూడదు. AATel 140.3

దైవ సేవకే పౌలు పూర్తిగా అంకితమయ్యాడు. తన శక్తి సామర్థ్యాలన్నిటినీ ఆ సేవకే అంకితం చేశాడు. సువార్త సత్యాల్ని నేరుగా దేవుని వద్దనుంచే పొందాడు. తన సేవకాలమంతా పరలోకంతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అన్యజన క్రైస్తవుల మీద అనవసర భారం మోపటాన్ని గురించి దేవుడు అతనికి ఉపదేశం ఇచ్చాడు. అందుకే యూదుమత ప్రభావం గల క్రైస్తవులు సున్నతి సమస్యను అంతియొకయ సంఘంలోకి ప్రవేశ పెట్టినప్పుడు అలాంటి బోధన విషయంలో పరిశుద్ధాత్మ మనసును ఎరిగి పౌలు అచంచలంగా నిలబడటంవల్ల యూదుల ఆచార నిబంధనలనుంచి సంఘాలకు స్వేచ్ఛ లభించింది. AATel 141.1

పౌలు వ్యక్తిగతంగా దేవుని వద్దనుంచి ఉపదేశం పొందినా వ్యక్తిగత బాధ్యత గురించి అతడికి తప్పుడు అభిప్రాయాలు లేవు. దేవుని ప్రత్యక్ష మార్గదర్శకత్వం కోసం కని పెడ్తూ ఉన్న సంఘ సహవాసంలో ఉన్న విశ్వాసుల సభకు దఖలు పడ్డ అధికారాన్ని పౌలు గుర్తించాడు. తనకు సలహా అవసరమని గుర్తించాడు. ప్రాముఖ్యమైన అంశాలు పరిగణనకు వచ్చినప్పుడు ఆ విషయాన్ని సంఘం ముందు పెట్టి సహోదరులతో కలిసి సరైన తీర్మానాలు చేయటానికి ఆజ్ఞకోసం దేవుని ఆర్థించటానికి పౌలు సంతోషంగా ముందుకు వచ్చేవాడు. “ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. అలాగే పరిశుద్దుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్తగాని అల్లరికి కాదు” 1 కొరింథీ 14:32, 33. సంఘసభ్యులుగా ఉన్నవారందరూ ఒకరికొకరు “లోబడి యుండుడి” అని పేతురుతో కలిసి పౌలు బోధించాడు (1 పేతురు 5:5). AATel 141.2