అపొస్తలుల కార్యాలు

12/59

11—సమరయలో సువార్త

స్తెఫను మరణం దరిమిల యెరూషలేములోని విశ్వాసులు తీవ్ర హింసకు గురిఅయ్యారు. “అందరు యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి.” “సౌలయితే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొనిపోయి చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయుచుండెను.” క్రూరమైన ఈ కార్వాచరణలో తన ఉద్రేకాన్ని గూర్చి అనంతరం మాట్లాడూ సౌలు ఇలా అన్నాడు: “నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని; యెరూషలేములో నేనాలాగు చేసితిని... పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి తిని.... అనేక పర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంత పెట్ట చూచితిని.” “వారిని చంపినప్పుడు సమ్మతించితిని” స్వయాన సౌలన్న మాటలను బట్టి మరణానికి గురైనది సైఫను ఒక్కడే కాడని బోధపడున్నది. అ.కా. 26:9-11. AATel 74.1

ప్రమాదభరితమైన ఈ సమయంలో నికొదేము ధైర్యంగా ముందుకు వచ్చి సిలువను పొందిన రక్షకుని పై తన విశ్వాసాన్ని ప్రకటించాడు. నికొదేము సెన్ హెడ్రైన్ సభ్యుడు. ఇతరులతోపాటు యేసు బోధలకు ఆకర్షితుడయ్యాడు. క్రీస్తు చేస్తున్న అద్భుతకార్యాలు చూసినప్పుడు ఆయన మెస్సీయా అన్నగట్టినమ్మకం అతనిలో చోటు చేసుకొన్నది. గలిలయ బోధకుడిపట్ల తనకున్న సానుభూతిని బాహాటంగా వ్యక్తం చేయడానికి అహంభావం అడ్డువచ్చింది. అందుచేత క్రీస్తుతో రాత్రివేళ రహస్యంగా సమావేశం అవ్వడానికి నిర్ణయించుకొన్నాడు. ఈ సమావేశంలో క్రీస్తు అతనికి రక్షణ ప్రణాళికను గూర్చి లోకంలో ఆయన కర్తవ్యాన్ని గూర్చి వివరించాడు. అయినా నికొదేము వెనకాడాడు. అతను సత్యాన్ని తన మనసులో దాచుకొన్నాడు. అది మూడేళ్ళు ఫలాలు ఫలించకుండా మిగిలిపోయింది. క్రీస్తును బహిరంగంగా స్వీకరించకపోయినా ఆయనను మట్టు పెట్టడానికి ప్రధాన యాజకులు పన్నుతున్న కుతంత్రాల్ని సెన్ హెడ్రైన్ సభలో నికొదేము అడ్డుకొంటూ వచ్చాడు. చివరికి క్రీస్తు సిలువ మీద వేళాడినప్పుడు, రాత్రిపూట ఒలీవల కొండమీద ఆయనతో సమావేశమై నప్పుడు క్రీస్తు తనతో అన్నమాటలు నికొదేము గుర్తుచేసుకొన్నాడు: “అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతివాడును వశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్త బడవలెను.” (యోహాను 3:14) నికొదేము క్రీస్తులో లోక రక్షకుణ్ణి చూశాడు. AATel 74.2

యేసు సమాధి ఖర్చును అరిమతయియను యోసేపుతో కలిసి నికొదేము భరించాడు. క్రీస్తు అనుచరులు శిష్యులు తమ్ముతాము కనపర్చుకోడానికి భయపడగా నికొదేమూ యోసేపూ ధైర్యంగా ముందుకు వచ్చి వారికి అండగా నిలిచారు. ఆ చీకటి ఘడియలో ధనమూ ప్రతిష్ఠాగల వీరి సహాయం ఎంతగానో అగత్యమయ్యింది. పేదలైన శిష్యులకు అసాధ్యమైన కార్యాన్ని మరణించిన తమ ప్రభువుకి ఈ ఇద్దరూ చేయగలిగారు. వారి భాగ్యమూ పలుకుబడీ ప్రధాన యాజకులు అధికారుల ముష్కరత్వం నుంచి శిష్యుల్ని కాపాడాయి. AATel 75.1

బాల్య దశలోవున్న సంఘాన్ని నాశనం చేయడానికి యూదులు ప్రయత్నం చేస్తున్న తరుణంలో నికొదేము ముందుకు వచ్చి ఆ ప్రయత్నాల్ని ప్రతిఘటించాడు. వెనకాడడం సందేహించడం మాని శిష్యులు ప్రబోధిస్తున్న విశ్వాసానికి మద్దతు పలికి యెరూషలేములో వున్న సంఘాన్ని ప్రటిష్ఠపర్చడానికి సువార్త సేవావ్యాప్తికి అతను తన భాగ్యాన్ని ఉపయోగించాడు. క్రితం తనపట్ల గౌరవాదరాలు చూపించిన వారు ఇప్పుడతన్ని ద్వేషించడం హింసించడం మొదలు పెట్టారు. ఈ లోక విషయాల సంబంధంగా అతను నిరు పేద అయ్యాడు. అయినా నికొదేము తన విశ్వాసం విషయంలో స్థిరంగా నిలబడ్డాడు. AATel 75.2

యెరూషలేములోని సంఘానికి వచ్చిన హింస సువార్త సేవ పురోగమించడానికి తోడ్పడింది. వాక్యపరిచర్య అక్కడ గొప్ప విజయాలు సాధించింది. ప్రపంచం నలుమూలలకు వెళ్లి సువార్త ప్రకటించలవలసిందంటూ రక్షకుడిచ్చిన ఆదేశాన్ని పక్కనపెట్టి శిష్యులు అక్కడే, ఎక్కువకాలం ఉండిపోయే ప్రమాదం ఏర్పడింది. చురుకైన పటిష్టమైన పరిచర్యవలన దుష్టిని ప్రతిఘటించడానికి శక్తి వస్తుందన్న విషయాన్ని విస్మరించి యెరూషలేములోని సంఘాన్ని ప్రత్యర్థుల దాడినుంచి కాపాడడం ప్రధానమని వారు భావించనారంభించారు. ‘సువార్తను వినని వారికి సువార్త అందించేందుకు కొత్త విశ్వాసుల్ని తర్పీదుచేసి ఉపయోగించేబదులు తాము ఇదివరకే పూర్తిచేసిన పని విషయం తృప్తి పొందాలన్నట్లు వ్యవహరించే ప్రమాదంలో వారున్నారు. తన అనుచరులు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయి అక్కడ సువార్తను ప్రకటించాలన్న ఉద్దేశంతో వారికి హింసరావడానికి దేవుడు అనుమతించాడు. యెరుషలేమును విడిచి పెట్టి వెళ్లిపోయినవారు “సువార్త వాక్యమును ప్రకటించుచు సంచరించిరి.” “కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు.... బోధించుడి” (మత్తయి 28:19,20) అన్న ఆదేశం రక్షకుడు ఎవరికి ఇచ్చాడో వారిలో అనేకులు సాదాసీదాగా జీవించే సామాన్యులున్నారు. వారు ప్రభువుని ప్రేమిస్తూ ఆయన స్వార్థరహిత సేవ ఆదర్శాన్ని ఆచరించడానికి తీర్మానించుకొన్న ప్రజలు. AATel 75.3

ఈ సామాన్యులకు భూలోక సేవలో రక్షకునితో వున్న శిష్యులకు ప్రశస్తమైన విశ్వాసాన్ని ప్రభువు అప్పగించాడు. క్రీస్తు ద్వారా రక్షణ కలదన్న శుభవార్తను వారు అందించాల్సివున్నారు. హింసవల్ల చెల్లాచెదురైనప్పుడు వారు మిషనెరీ సేవా స్ఫూర్తితో నిండి ఆయా ప్రాంతాలకు వెళ్లారు. తమ కర్తవ్య బాధ్యతల్ని గుర్తించారు. ఆకలి దప్పికలతో నశిస్తున్న ప్రజలకు తమ వద్ద జీవాహారం ఉన్నదని వారికి తెలుసు. ఆ ఆహారం అవసరమైన వారందరికి అందించడానికి క్రీస్తు ప్రేమవారిని బలవంతం చేసింది. ప్రభువు వారి ద్వారా పనిచేశాడు. వారు వెళ్ళిన స్థలాలన్నిటిలోను రోగుల్ని బాగుచేశారు. బీదలకు సువార్త ప్రకటించారు. AATel 76.1

ఏడుగురు పరిచారకుల్లో ఒకడైన ఫిలిప్పు యెరూషలేము నుంచి చెదిరిపోయిన వారిలో ఒకడు. “సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పుచేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్దకేకలు వేసి వారిని వదలిపోయెను. పక్షవాతము గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను.” AATel 76.2

యాకోబు బావివద్ద తాను మాట్లాడిన సమరయ స్త్రీకి క్రీస్తు ఇచ్చిన సందేశం ఫలాలు ఫలించింది. ఆయన వర్తమానం వినృతర్వాత ఆస్త్రీ ఆ పట్టణంలోని మనుషుల వద్దకు వెళ్ళి ఇలా అన్నది: “మీరు వచ్చి నేను చేసిన వన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి; ఈయన క్రీస్తుకాడా?” వారు ఆమెతో వెళ్లి క్రీస్తు చెప్పిన మాటలు విని ఆయనను విశ్వసించారు. ఆయన మాటలు ఇంకా వినాలన్న ఆశతో తమతో ఉండాల్సిందిగా ఆయనను బతిమాలారు. వారితో ఆయన రెండు రోజులు ఉన్నాడు. అనేకులు “ఈయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నాము.” అన్నారు. యోహాను 4:29,41. AATel 76.3

శిష్యుల్ని యెరూషలేములో నుంచి తరిమివేసినప్పుడు కొందరికి సమరయలో సురక్షితమైన ఆశ్రయం లభించింది. ఈ సువార్తిక దూతల్ని సమరయ ప్రజలు స్వాగతించారు. యూదు విశ్వాసులు ఒకప్పుడు తమ బద్ద విరోధులైన సమరయుల్లో నుంచి గొప్ప ఆత్మల పంటను పోగుచేశారు. AATel 76.4

సమరయలో ఫిలిప్పు పరిచర్య గొప్ప విజయాలు సాధించింది. ఆ ఉత్సాహంతో అతను సహాయం అర్ధిస్తూ యెరూషలేముకి వర్తమానం పంపాడు. క్రీస్తు పలికిన ఈ మాటల భావాన్ని అపొస్తలులు ఇప్పుడు గ్రహించారు. ” మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైయుందురు.” అ.కా. 1:8. AATel 76.5

“అప్పుడు ఐతియోపీయుల రాణియైన కందాకే క్రింద మంత్రియై ఆమె యొక్క ధనాగారమంతటి మిద నున్న ఐతియోపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చియుండెను. అతడు తిరిగి వెళ్లుచు, తన రథము మీద కూర్చుండి ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండెను.” ఈ ఐతి యోపీయుడు సజ్జనుడు, పలుకుబడి గలవాడు. మారు మనసు పొందితే తాను పొందిన వెలుగును ఇతరులకు అందిస్తాడని, సువార్తకు అనుకూలంగా బలమైన ప్రభావాన్ని ప్రసరిస్తాడని దేవుడు ఉద్దేశించాడు. సత్యాన్ని అన్వేషిస్తున్న ఇతని పక్క దేవదూతలున్నారు. ఇతను రక్షకునికి ఆకర్షితుడవుతున్నాడు. వెలుగైన క్రీస్తు వద్దకు తనను నడిపించగల ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ పరిచర్య ద్వారా ప్రభువు అతనికి పరిచయం చేశాడు. AATel 77.1

ఐతియోపీయుని వద్దకు వెళ్ళి తాను చదువుతున్న ప్రవచనాన్ని అతనికి విశదం చేయాల్సిందిగా ఫిలిప్పు ఆదేశం పొందాడు. “నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుము” అన్నాడు ఆత్మ. ఆ నపుంసకుణ్ణి సమీపించి ఫిలిప్పు “నీవు చదువునది గ్రహించుచున్నావా? అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహించగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను.” ఐతియోపీయుడు చదువుతున్నది, క్రీస్తును గూర్చి యెషయా ప్రవచించిన “బొచ్చు కత్తిరించువాని యెదుట గొట్టె పిల్ల ఏలాగు మౌనముగా ఉండునో ఆలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర) దొరకకపోయెను. ఆయన సంతాపమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది.” AATel 77.2

“ప్రవక్తను గూర్చి యీలాగు చెప్పుచున్నాడు? తన్నుగూర్చియా, వేరొకని గూర్చియా?” అని నపుంసకుడు అడిగాడు. అప్పుడు ఫిలిప్పు అతనికి రక్షణను గూర్చిన సత్యాన్ని వివరించాడు. అదే లేఖనంతో ప్రారంభించి ఫిలిప్పు అతనికి “యేసును గూర్చిన సువార్త ప్రకటించెను.” AATel 77.3

లేఖనాల వివరణతో అతని హృదయం ఆనందోత్సాహాలతో నిండింది. శిష్యుడు ఆ వివరణను ముగించేసరికి సత్వాన్ని అంగీకరించడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. తన ఉన్నత హోదాను సాకుగా తీసుకొని అతను సువార్తను తిరస్కరించలేదు. “వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటుకి వచ్చినప్పుడు నపుసంకుడు - ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చెను. AATel 77.4

“వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరియెన్నడును చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరయ వచ్చువరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచువచ్చెను.” AATel 78.1

ఫిలిప్పు వంటి మిషనెరీలు అనగా దేవుని స్వరాన్ని విని ఆయన పంపే స్థలాలకు వెళ్ళేవారు బోధించాల్సిన ప్రజావర్గానికి ఈ ఐతియోపీయుడు ప్రతీక. చాలామంది లేఖనాల్ని చదువుతున్నారు గాని వాటిని గ్రహించలేకపోతున్నారు. లోకంలో ఎందరో స్త్రీలు పురుషులు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. ప్రార్థనలు, కన్నీళ్ళు, ప్రశ్నలు, వెలుగుకోసం, కృపకోసం, పరిశుద్దాత్మకోసం మనుష్యుల మనసుల్లో నుంచి పైకిలేస్తూ ఉన్నాయి. అనేకమంది దేవుని రాజ్యం తలుపు వద్దే వేచియున్నారు. వారిని లోపలికి ఆహ్వానించాల్సివున్నది. AATel 78.2

వెలుగుకోసం వెదుకుతూ, సువార్తను అందుకోడానికి సిద్ధంగావున్న వ్యక్తి వద్దకు దేవదూత ఫిలిప్పును నడిపించాడు. తమ నాలుకల్ని పరిశుద్ధపర్చి తమ హృదయాల్ని శుద్ధిచేయడానికి పరిశుద్దాత్మకు అనుమతినిచ్చే సువార్త సేవకుల పాదాలు జారకుండా దేవదూతలు కాపాడారు. ఫిలిప్పు వద్దకు వెళ్లిన దేవదూతే ఐతియోపీయునికి ఫిలిప్పు చేసిన కార్యాన్ని చేయగలిగేవాడే, కాని అది దేవుడు పనిచేసే పద్ధతి కాదు. మనుషులు తోటి మనుషులకోసం పనిచేయడమే దైవ సంకల్పం. AATel 78.3

ప్రథమ శిష్యులకు ఇవ్వబడ్డ విశ్వాసాన్ని ప్రతీ యుగంలోని విశ్వాసులు పంచుకొన్నారు. సువార్తను అందుకొన్న ప్రతీ వ్యక్తి లోకానికి అందించడానికి పవిత్ర సత్యాన్ని అందుకొన్నాడు. నమ్మకమైన దైవ ప్రజలు చురుకైన సువార్త సేవకులు. దేవుని నామాన్ని ఘనపర్చడానికి వారు తమ వనరుల్ని ధారపోస్తారు. ఆయన సేవాభివృద్ధికి తమకున్న వరాల్ని ఉపయోగిస్తారు. AATel 78.4

గతంలోని క్రైస్తవుల నిస్వార్థ సేవ మనకు ఆదర్శంగాను స్ఫూర్తిదాయకంగాను ఉండాలి. దేవుని సంఘ సభ్యులు సృయల్లో అగ్రగణ్యులు కావాలి. వారు లోకాశలకు దూరంగా ఉంటూ మేలు చేస్తూ సంచరించిన తమ ప్రభువు అడుగుజాడల్లో నడవాలి. దయతోను సానుభూతితోను నిండిన హృదయాల్లో అవసరంలోవున్న వారికి సహాయం అందించాలి. రక్షకుని ప్రేమను గూర్చి పాపులకు తెలపాలి. ఆలాంటి సేవ ఎంతో శ్రమతో కూడిన పని. కాని దానికి గొప్ప ప్రతిఫలముంది. ఆ సేవను చిత్తశుద్ధితో చేసేవారు రక్షకుణ్ణి అనేకులు అంగీకరించడం చూస్తారు. ఎందుచేతనంటే సువార్త ప్రకటన గొప్ప ప్రభావాన్ని ప్రసరిస్తుంది. ఆ ప్రభావాన్ని ఎవరూ ఆపలేరు. AATel 78.5

సువార్తాదేశాన్ని నెరవేర్చే బాధ్యత అభిషేకం పొందిన బోధకుడు ఒక్కడిమిదే లేదు. క్రీస్తును రక్షకుడుగా’ స్వీకరించిన ప్రతీ వ్యక్తి తోటి మనుషుల రక్షణ కోసం పనిచేయాలి. “ఆత్మయు పెండ్లికుమార్తెయ) రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడను రమ్ము అని చెప్పవలెను.” ప్రకటన 22:17. ఈ ఆహ్వానాన్ని అందించే బాధ్యత సర్వసంఘానిది. ఈ ఆహ్వానాన్ని విన్న ప్రతీవ్యక్తి కొండల పైనుంచి లోయల్లోనుంచి “రమ్ము” అని ప్రతిధ్వని చేయాలి. AATel 79.1

ఆత్మల రక్షణ కార్యం కేవలం సేవమీదే ఆధారితమైవున్నదని భావించడం గొప్ప పొరపాటు. ఆత్మల రక్షణ భారాన్ని ద్రాక్షతోట యజమాని ఎవరిమీద మోపాడో ఆ సాదాసీదా విశ్వాసి ప్రభువు ఇంకా పెద్ద బాధ్యతలు ఎవరిమీద పెట్టాడో” ఆ నాయకుల ప్రోత్సాహాన్ని పొందాలి. రక్షకుని నామాన్ని విశ్వసించిన వారందరూ ఆయన ఇచ్చే సువార్త ప్రచారాదేశాన్ని అమలు పర్చాల్సివున్నారని దైవ సంఘ నాయకులు గుర్తించాలి. హస్త నిక్షేపం ద్వారా సువార్త సేవకు అంకితం కాని అనేకుల్ని దేవుడు తన ద్రాక్షతోటలోకి పంపుతాడు. AATel 79.2

రక్షణ వార్త విన్న వందలు వేలమంది ప్రజలు బజార్లలో ఇంకా ఆకతాయిగా తిరిగేవారే. వారిని ఏదో చురుకైన పనిలో ఉపయోగించవచ్చు. వీరినుద్దేశించి క్రీస్తు ఇలా అంటున్నాడు, “దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారు?” “మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్తుడి” అని ఆహ్వానించాడు. మత్తయి. 20:6,7. ఇంకా ఎక్కువమంది ఈ పిలుపును ఎందుకు అంగీకరించడం లేదెందుకు? తాము ప్రసంగికులు గనుక సువార్త సేవకు తాము పనికిరామన్న భావన దీనికి కారణమా? అంకిత భావం గల స్వచ్ఛంద సేవకులు చేయాల్సిన పరిచర్య ఎంతోవున్నదని వారు గుర్తించాలి. AATel 79.3

ప్రతీ వ్యక్తి తన శక్తి మేరకు ప్రభువుకి సేవచేసే నిమిత్తం సంఘంలో సేవాస్ఫూర్తి చోటుచేసుకొనేందుకు దేవుడు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నాడు. దేవుని సంఘ సభ్యులు అవసరం ఉన్న దేశాల్లో తమకు దేవుడు నియమించిన సువార్త ప్రచారాదేశాన్ని నెరవేర్చినప్పుడు కొద్దికాలంలోనే లోకానికి హెచ్చరిక అందుతుంది, రక్షకుడు శక్తితోను మహిమతోను రావడం జరగుతుంది. “ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటు తరువాత అంతము వచ్చును.” మత్తయి 24:14. AATel 79.4