అపొస్తలుల కార్యాలు

38/59

37—యెరూషలేముకు పాలు చివరి ప్రయాణం

పస్కాకి ముందు యెరూషలేము చేరాలని పౌలు బహుగా ఆశించాడు. ఆ పండుగకు ప్రపంచం అన్ని ప్రాంతాలనుంచి వచ్చినవారిని కలుసుకోటానికి అవకాశం లభిస్తుందని భావించాడు. అవిశ్వాసులైన తన సహపౌరుల్లో గూడుకట్టుకున్న ద్వేషాన్ని, ఏదో విధంగా తీసివేయటంలో సహాయపడాలన్నది అతని వాంఛ. ఆ రకంగా వారు ప్రశస్తమైన సువార్త వికాశాన్ని అంగీకరించాలన్నది అతని ఆకాంక్ష. యెరూషలేము సంఘంతో సమావేశమై యూదయలోని బీదసంఘాలకు క్రైస్తవులైన అన్యజనుల సంఘాలు పంపిన ఆర్థిక సహాయం గురించి వారికి నివేదించాలని కూడా ఆకాంక్షించాడు. ఈ సందర్శనద్వారా యూదు విశ్వాసులకు అన్యజన విశ్వాసులకు మధ్య పటిష్టమైన ఐక్యతను పుట్టించాలని ఆశించాడు. AATel 276.1

కొరింథులో తన సేవను ముగించి పాలస్తీనా తీరాన ఉన్న ఒక రేవుకి నేరుగా ప్రయాణం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగాయి. పౌలు ఓడలో అడుగు పెట్టటానికి సిద్ధంగా ఉన్న తరుణంలో తన ప్రాణాల్ని తియ్యటానికి యూదులు పన్నిన కుట్ర బయలుపడింది. ఈ విశ్వాస విరోధులు పౌలు సేవను నిర్వీర్యం చెయ్యటానికి గతంలో చేసిన ప్రయత్నాలు వ్యర్థమయ్యాయి. AATel 276.2

సువార్త సాధిస్తున్న విజయాలు యూదుల్లో కొత్తగా ఆగ్రహావేశాలు పుట్టించాయి. కొత్త సిద్ధాంతం విస్తరిస్తున్నట్లు, దాని మూలంగా యూదులు ఆచార ధర్మశాస్త్ర విధుల్నుంచి విడుదల పొందుతున్నట్లు, అన్యజనులు అబ్రహాము సంతానమైన యూదులతో సమాన ఆధిక్యతలు హక్కులు పొందుతున్నట్లు ప్రతీ ప్రాంతాన్నుంచీ వార్తా కథనాలు వస్తున్నాయి. తన ఉత్తరాల ద్వారా పౌలు ఎంతో సమర్థంగా అందించిన వాదనల్నే కొరింథులోని తన బోధల్లోనూ వెలిబుచ్చాడు. “గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు” (కొలస్స 3:11) అన్న అతని పదునైన మాటల్ని ప్రత్యర్థులు జంకు కొంకు లేని దేవదూషణగా చిత్రించి అతని గొంతును శాశ్వతంగా నొక్కి వెయ్యటానికి కృతనిశ్చయులయ్యారు. AATel 276.3

కుట్రను గూర్చిన హెచ్చరిక విన్న తర్వాత పౌలు మాసిదోనియ మీదుగా చుట్టు మార్గాన వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. పస్కా సమయానికి యెరూషలేము చేరుకోవాలన్న తన ప్రణాళికను పౌలు పక్కన పెట్టాల్సి వచ్చింది. కాని పెంతెకొస్తుకి అక్కడ ఉండగలనన్న ఆశాభావంతో ఉన్నాడు. AATel 277.1

“బెరయ పట్టణస్థుడునైన సోపత్రును. థెస్సలొనీకయులలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయియును, తిమోతియును, ఆసియ దేశస్థులైన తుకికు, తోఫిమును” పౌలు లూకాలతో వెళ్ళారు. క్రైస్తవులైన అన్యుల సంఘాలనుంచి పోగుచేసిన ద్రవ్యం పౌలు వద్ద ఉంది. ఆ ద్రవ్యాన్ని యూదయలో దైవ సేవకు బాధ్యత వహిస్తున్న సహోదరులకు అందజెయ్యాలన్నది పౌలు సంకల్పం. అందుచేత, ద్రవ్య సహాయాన్నిచ్చిన వివిధ సంఘాల ప్రతినిధులు తనతోపాటు యెరూషలేముకు రావాల్సిందిగా పౌలు కోరి అందుకు ఏర్పాట్లుచేశాడు. AATel 277.2

పస్కాను ఆచరించటానికి పౌలు ఫిలిప్పీలో ఆగాడు. తనతో లూకా ఒక్కడే ఉన్నాడు. తక్కినవారు త్రోయకు వెళ్ళి అక్కడ పౌలు లూకాలకోసం వేచి ఉన్నారు. పౌలు కృషిద్వారా క్రైస్తవులైన వారిలో ఫిలిప్పీయులు ఎంతో ప్రేమగలవారు, యధార్థ హృదయులు. పండుగ జరిగిన ఆ ఎనిమిది దినాలు ఆ ప్రజల సహవాసంలో పౌలు ప్రశాంతతను ఆనందాన్ని అనుభవించాడు. AATel 277.3

ఫిలిప్పీనుంచి ఓడ ప్రయాణం చేసి అయిదు దినాలతర్వాత పౌలు లూకాలు త్రోయ చేరుకున్నారు. అక్కడ విశ్వాసులతో ఏడు రోజులు గడిపారు. AATel 277.4

అక్కడున్న కాలంలోని చివరి సాయంత్రం సహోదరులు “రొట్టె విరుచుటకు” కూడుకున్నారు. తమ ప్రియతమ బోధకుడు వెళ్ళిపోతున్నాడన్న విషయం ప్రజలు మామూలు కన్నా పెద్ద సంఖ్యలో సమావేశమవ్వటానికి కారణమయ్యింది. వారు మూడో అంతస్తుపై “మేడగదిలో” సమావేశమయ్యారు. వారిపట్ల తన ప్రగాఢ ప్రేమవల్ల అపొస్తలుడు ఉద్రేకంగా అర్థరాత్రివరకు ప్రసంగించాడు. AATel 277.5

తెరిచి ఉన్న ఒక కిటికిలో ఐతుకు అనే యువకుడు కూర్చున్నాడు. అదే స్థితిలో నిద్రపోయి జారి కిందపడ్డాడు. వెంటనే పెద్ద గగ్గోలు గందరగోళం ప్రారంభమయ్యింది. పడ్డ యువకుడు మరణించాడు. అతణ్ని లేవదీసి పైకి తీసుకు వెళ్ళారు. ఏడుస్తూ అనేకమంది అతడి చుట్టూ చేరారు. భయభ్రాంతులైన ప్రజల వద్దకు వెళ్ళి పౌలు ఆ యువకుణ్ని కౌగిలించి అతణ్ని బతికించమని ప్రార్థించాడు. ఆ ప్రార్థనను దేవుడు ఆలకించి ఆ యువకుణ్ని లేపాడు. ఏడ్పు శోకం మధ్య అపొస్తలుడు ఇలా పలకటం వినిపించింది, “మీరు తొందర పడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నది.” ఉత్సాహానందాలతో విశ్వాసులు మళ్ళీ మేడ పై గదిలో సమావేశమయ్యారు. ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలుపొందారు. అంతట పౌలు “తెల్లవారు వరకు విస్తారముగా” సంభాషించాడు. AATel 277.6

పౌలు అతని సహచరులు ప్రయాణం చేయాల్సిన ఓడ బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. సహోదరులు త్వరత్వరగా ఓడలో ప్రవేశించారు. త్రోయకు అస్సుకు మధ్యనున్న దగ్గర మార్గాన నేల పై ప్రయాణం చేసి తన సహచరుల్ని అస్సు పట్టణంలో కలుసుకోటానికి నిశ్చయించుకున్నాడు. ధ్యానంలోను ప్రార్థనలోను సమయం గడపటానికి ఈ వ్యవధి అతనికి దోహదపడింది. తన యెరూషలేము సందర్శనకు సంబంధించిన సమస్యలు, ప్రమాదాలు, తన విషయంలోను తన సేవ విషయంలోను యెరూషలేము సంఘం వైఖరి, ఇతర ప్రాంతాల్లోని సంఘాల పరిస్థితి, సువార్తపట్ల వాటి ఆసక్తి - వీటినిగూర్చి పౌలు కలవరం చెందుతున్నాడు. ఈ ప్రత్యేక సమయాన్ని ఆసరాగా తీసుకొని శక్తి కోసం నడుపుదలకోసం దేవునికి ప్రార్థించాడు. AATel 278.1

వారు అస్సులో బయలుదేరి ప్రయాణం కొనసాగించినప్పుడు ఎఫెసు పట్టణం పక్కగా వెళ్ళారు. అది పౌలు ఎంతోకాలం సువార్త పరిచర్యచేసిన పట్టణం. ఆ సంఘాన్ని దర్శించాలని పౌలు ఎంతో ఆశించాడు. ఎందుకంటే ఆ సంఘ సభ్యులకు తానివ్వాల్సిన ఉపదేశం హితవు ఎంతో ఉంది. కాని దీర్ఘాలోచన అనంతరం ముందుకు సాగటానికే నిశ్చయించుకున్నాడు. “సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూష లేములో ఉండవలెనని” భావించాడు. ఎఫెసుకు ముప్పయి మైళ్ళ దూరంలో ఉన్న మిలేతుకు వచ్చినప్పుడు, ఓడ ప్రయాణం ప్రారంభించకముందు తాను ఎఫెసు సంఘంతో మాట్లాడటం సాధ్యపడుందని పౌలు తెలుసుకున్నాడు. మిలేతుకు వెంటనే రావలసిందంటూ తమ ప్రయాణం మళ్ళీ ప్రారంభం కాకముందు తమతో సమావేశం అవ్వాలంటూ పెద్దలకు వర్తమానం పంపించాడు. AATel 278.2

పౌలు పిలుపు మేరకు సంఘ పెద్దలు వచ్చారు. వారికి హృదయాన్ని కదిలించే హితోపదేశాల్ని వీడ్కోలు వర్తమానాన్ని అందించాడు. “నేను ఆసియాలో కాలు పెట్టిన దినమునుండి, ఎల్లకాలము మీ మధ్య ఏలాగు నడుచుకొంటినో మీరే యెరుగుదురు. యూదుల కుట్రలవలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్ళు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియును. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు, దేవుని యెదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించవలెనని, యూదులకును గ్రీసు దేశస్థులకును ఏలాగు సాక్ష్యమిచ్చుచుంటినో యిదంతయు మీకు తెలియును.” AATel 278.3

పౌలు దైవ ధర్మశాస్త్రాన్ని ఎల్లప్పుడూ ఘనపర్చాడు. అతిక్రమ శిక్షనుంచి మానవుణ్ని రక్షించటానికి ధర్మశాస్త్రంలో శక్తి లేదని పౌలు వివరించాడు. అపరాధులు తమ పాపాల నిమిత్తం పశ్చాత్తాపపడి దేవుని ముందు వినయ మనసుతో నిలవాలి. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించటంవల్ల వారు దేవుని ఆగ్రహానికి గురి అయ్యారు. ఇంకా వారు తమకు పాపక్షమాపణ కూర్చే ఒకే సాధనమైన క్రీస్తు రక్తంపై విశ్వాసం కలిగి ఉండాలి. వారి నిమిత్తం బలిగా దైవ కుమారుడు మరణించి వారి మధ్యవర్తిగా తండ్రి ముందు నిలబడటానికి పరలోకానికి వెళ్ళాడు. వారు పశ్చాత్తాపం ద్వారాను విశ్వాసం ద్వారాను పాప శిక్షనుంచి విముక్తి పొందవచ్చు. ఇక నుంచి క్రీస్తు ద్వారా దైవ ధర్మశాస్త్రానికి విధేయులై నివసించటానికి వారు శక్తి పొందుతారు. AATel 278.4

పౌలింకా ఇలా అంటున్నాడు, “ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదుగాని బంధకములును శ్రమలును నా కొరకు కాచుకొనియున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియును. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియును.” AATel 279.1

ఈ సాక్ష్యం పౌలు ముందుగా అనుకొని ఇచ్చింది కాదు. కాని తాను మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ అతని మీదికి వచ్చి ఎఫెసు సహోదరులతో అదే తన చివరి సమావేశమన్న తన భయాల్ని ధ్రువపర్చాడు. AATel 279.2

“కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలియకుండ నేనేమియు దాచుకొనలేదు.” తమకు ఉపదేశం, హెచ్చరిక, దిద్దుబాటు కలిగే నిమిత్తం దేవుడు తనకిచ్చిన వర్తమానాన్ని బాధ కలిగిస్తుందన్న భయంవల్లగాని, స్నేహబంధాలు పేరు ప్రతిష్ఠలు పెంచుకోవాలన్న కోరికవల్లగాని పౌలు నిలుపుచెయ్యలేదు. దైవ సేవకులు వాక్యం బోధించటంలోను వాక్యప్రబోధల్ని అమలు పర్చటంలోను నిర్భయంగా వ్యవహరించాల్సిందిగా దేవుడు కోరుతున్నాడు. క్రీస్తు సువార్త పరిచారకుడు శ్రోతలకు బాధ కలిగించే సత్యాల్ని నిలుపుచేసి ఉల్లాసాన్నిచ్చే సత్యాల్నే బోధించకూడదు. ప్రవర్తన అభివృద్ధిని అతడు ఆతృతగా పరిశీలించాలి. తన సభ్యుల్లో ఎవరైన పాపం చేస్తూ ఉంటే ఆ వ్యక్తి పరిస్థితికి అనుగుణంగా దైవ వాక్యంనుంచి అతనికి ఉపదేశం ఇవ్వాలి. వారిని హెచ్చరించకుండా తమ ఆత్మవిశ్వాసంలోనే విడిచి పెట్టేస్తే వారి ఆత్మలకు అతడు జవాబుదారి అవుతాడు. తన ఉన్నతమైన కర్తవ్యాన్ని నెరవేర్చాలని కోరుకునే సువార్త పరిచారకుడు క్రైస్తవ విశ్వాసానికి సంబంధించి ప్రతీ అంశం పై విశ్వాసులికి ఉపదేశాన్ని వ్వాలి. ప్రభువు దినాన పరిపూర్ణులుగా నిలబడేందుకు వారు ఎలాంటివారై ఉండాలో, వారేమి చెయ్యాలో వారికి ఉపదేశించాలి. సత్యాన్ని నమ్మకంగా బోధించే సువార్త సేవకుడు మాత్రమే పౌలుతో కలిసి ఇలా చెప్పగలుగుతాడు, “మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషినికాను.” AATel 279.3

అపొస్తలుడు తన సహోదరులకు ఈ హితవు పలికాడు, “దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్దాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులునుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.” క్రీస్తు తన రక్తం పెట్టి కొన్నవారితో తాము వ్యవహరిస్తున్నామన్న విషయాన్ని సువార్త పరిచారకులు జ్ఞాపకముంచుకుంటే, వారు చేస్తున్న సేవ ప్రాముఖ్యాన్ని మరెక్కువగా గుర్తిస్తారు. వారు తమను గూర్చి తమ మందను గూర్చీ జాగ్రత్తగా ఉండాలి. వారి సొంత ఆదరమే వారి ఉపదేశానికి సాదృశ్యం కావాలి. జీవమార ఉపదేశకులుగా వారు సత్యాన్ని గూర్చి చెడ్డగా మాట్లాడటానికి ఎవరికీ అవకాశమివ్వకూడదు. క్రీస్తు రాయబారులుగా వారు ఆయన నామ ఘనతను కాపాడూ నివసించాలి. వారి దైవ భక్తి, వారి పవిత్ర జీవితం, వారి పరిశుద్ధ సంభాషణ - వీటినిబట్టి తమ ఉన్నతమైన పిలుపుకు వారు తమ యోగ్యతను నిరూపించుకోవాలి. AATel 280.1

ఎఫెసు సంఘానికి ఎదురు కానున్న అపాయాలు పౌలుకి బహిర్గతం చేయటం జరిగింది. ‘నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియును. వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు” అన్నాడు. పౌలు సంఘం గురించి ఆందోళన చెందాడు. భవిష్యత్తులోకి చూస్తూ వెలుపలి శత్రువులనుంచి లోపలి శత్రువులనుంచి సంఘం ఎదుర్కోనున్న దాడుల్ని వీక్షించాడు. తమకు దేవుడు అప్పగించిన పరిశుద్ధ వాక్యనిధిని జాగ్రతగా కాపాడుకోవాల్సిందిగా వారిని ఆదేశించాడు. ఉదాహరణగా వారి నడుమ తాను చేసిన అవిశ్రాంత పరిచర్యను ప్రస్తావించాడు. “కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్ళు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగా ఉండుడి.” AATel 280.2

ఇంకా ఇలా అన్నాడు, “ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధ పరచబడినవారందరిలో స్వాస్థ్యమనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవని వెండినైనను, బంగారమునైనను, వస్త్రములనైనను నేను ఆశింపలేదు.” ఎఫెసీయుల్లో కొందరు ధనికులు. వారి వద్దనుంచి వ్యక్తిగతంగా లబ్ది పొందేందుకు పౌలు ప్రయత్నించలేదు. తన అవసరాల గురించి ప్రస్తావించటం తన వర్తమానంలో భాగం ఎన్నడూ కాలేదు. “నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియును.” క్రీస్తు సేవాభివృద్ధి దిశగా తన కఠిన శ్రమ, విస్తృత ప్రయాణాల నడుమ పౌలు తన అవసరాల నిమిత్తమేగాక తనతో పనిచేసే సహచరుల అవసరాలు తీర్చేందుకు యోగ్యులైన బీదలకు సహాయం అందించేందుకు పూను కునే వాడు. కష్టపడి పనిచేసి ఖర్చును జాగ్రత్తగా నిభాయించటంద్వారా వీటిని సాధించేవాడు. ఈ మాట లన్నప్పుడు అతడు తన సొంత ఆదర్శాన్ని ఉద్దేశిస్తుండవచ్చు, “మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు - పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలతో మీకు మాదిరి చూపితిని. AATel 280.3

“అతడీలాగు చెప్పి మోకాళ్లూని వారందరితో ప్రార్థిన చేసెను. అప్పుడు వారందరు చాల ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దు:ఖించుచు పౌలు మెడ మీదపడి అతనిని ముద్దు పెట్టుకొని, వారు ఓడవరకు అతనిని సాగనంపిరి.” AATel 281.1

ప్రయాణికులు మిలేతు నుంచి ” తిన్నగా వెళ్లి కోసుకును. మరునాడు రొదుకును, అక్కడనుండి పతరకును” వెళ్లారు. పతర చిన్నఆసియా నైరుతి తీరాన ఉంది. అక్కడ ” ఫేనీకేకు వెళ్లబోవుచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కారు. తూరులో సరకులు దించుతూ ఉండగా అక్కడ కొందరు విశ్వాసుల్ని వారు కనుగొన్నారు. అక్కడ వారితో ఏడు దినాలుండటానికి అనుమతి లభించింది. యెరూషలేములో పౌలును ఎదుర్కోనున్న అపాయాల్ని గురించి పరిశుద్దాత్మ ద్వారా ఈ విశ్వాసులికి హెచ్చరిక వచ్చింది. ” యెరూషలేములో కాలు పెట్టవద్దని” వారు పౌలును బతిమాలారు. తన సంకల్పాన్ని శ్రమలు, చెరసాలను గూర్చిన భయం మార్చటానికి అపొస్తలుడు ఒప్పుకోలేదు. AATel 281.2

తూరులో గడిపినవారం అంతంలో సహోదరులందరు పౌలుతో భార్యబిడ్డలుసహా ఓడవద్దకు వెళ్లారు. అతడు ఓడలోకి వెళ్లిపోక ముందు సముద్రం ఒడ్డున మోకాళ్లూని ప్రార్థిన చేశారు. వారు పౌలు కోసం పౌలు వారికోసం ప్రార్థించారు. AATel 281.3

దక్షిణ దిశగా ప్రయాణంచేసి వారు కైసరయకు వెళ్లి ” యేడుగురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద” ఉన్నారు. పౌలు ఇక్కడ ప్రశాంతత, సంతోషంతోనిండిన కొన్నిదినాలు గడిపాడు. అనంతరం ఎంతోకాలంగా తనకు కరవైన పరిపూర్ణ స్వేచ్ఛకు అవే చివరిదినాలు. పౌలు కైసరయలో ఉండగా “అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మాయొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసికొని, తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి, అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను” అని లూకా చెబుతున్నాడు. AATel 281.4

లూకా ఇంకా ఇలా అన్నాడు, “ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును - యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకొంటిమి.” కాని పౌలు తాను ఎన్నుకొన్న మార్గంనుంచి కొంచెం కూడా తొలగటానికి ఇష్టపడలేదు. అవసరమైతే క్రీస్తు వెంబడి చెరసాలకు ఆ మాటకొస్తే మరణానికి వెళ్ళటానికి కూడా సిద్ధమే అన్నాడు. “ఇదెందుకు? మీరు ఏడ్చి నాగుండె బద్దలు చేసెదరేల? ” నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమేగాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను.” అతని ఉద్దేశంలో మార్పు సంభవించక పోగా పౌలుకి బాధకలిగించామని గుర్తించి సహోదరులు ఇక ఆ ప్రస్తావన తేలేదు. “ప్రభువు చిత్తము జరుగునుగాక” అని ఊరుకున్నారు. AATel 282.1

కైసరయలో ఉన్న కాలానికి అంతం త్వరలోనే వచ్చింది. కొంతమంది సహోదరులతో కలిసి పౌలు అతని బృందం యెరూషలేముకి బయల్దేరారు. వారి హృదయాలు ముందున్న విపత్తునుగురించి ఆందోళనతో నిండి ఉన్నాయి. AATel 282.2

హృదయంలో అంత వేదనతో ముందెన్నడు పౌలు యెరూషలేమును సమీపించలేదు. తనకు మిత్రులెవరూ ఉండరని విరోధులు అనేకమంది ఉంటారని అతనికి తెలుసు. దైవకుమారుణ్ని విసర్జించి చంపిన పట్టణాన్ని అతడు సమీపిస్తున్నాడు. ఇప్పుడు ఆ పట్టణం పై దేవుని ఉగ్రత పడటానికి సిద్ధంగా ఉంది. క్రీస్తు అనుచరుల పట్ల సొంత విద్వేషాన్ని గుర్తుచేసుకున్నప్పుడు వంచనకు గురి అయిన సోదర ప్రజలపై కనికరం పుట్టింది పౌలుకి. అయినా తన మాట విని వారు బాగుపడతారన్న నమ్మకం అతనికి లేదు. ఒకప్పుడు తన మనసులో రగిలిన ఉక్రోషమే పౌలుకి వ్యతిరేకంగా దేశ ప్రజలందరిలోనూ ఇప్పుడు రగులుతున్నది. AATel 282.3

విశ్వాసంలో తన సహోదరుల సానుభూతి మీద మద్దతు మీద నమ్మకం పెట్టు కోలేకుండా ఉన్నాడు. తనను వెంటాడుతున్న అవిశ్వాసులైన యూదులు పౌలుగురించి అతని పరిచర్యగురించి, ఉత్తరాల ద్వారాను, వ్యక్తిగత కథనాల ద్వారాను యెరూషలేములో దుష్ప్రచారం సాగిస్తున్నారు. కొందరు అపొస్తలులు పెద్దలు కూడా ఈ దుష్ప్రచారాన్ని సత్యంగా అంగీకరించారు. ఆ ప్రచారాన్ని ఖండించటానికి ప్రయత్నించలేదు. పౌలుతో కలిసి అన్వయంతో పనిచెయ్యటానికి ఆసక్తి కనపర్చలేదు. AATel 282.4

ఆశాభంగాలు నిరాశ నిస్పృహలు ఎదురైనా అపొస్తలుడు అధైర్యం చెందలేదు. తన సొంత హృదయంతో మాట్లాడిన ఆ స్వరం తన సోదర ప్రజల హృదయాలతో మాట్లాడుతుందని, తన సహచర శిష్యులు ప్రేమించి సేవిస్తున్న ప్రభువు వారిని సువార్త సేవలలో తనతో ఏకం చేస్తాడని అతడు గట్టిగా నమ్మాడు. AATel 282.5