ప్రవక్తలు - రాజులు
ప్రవక్తలు — రాజులు
తొలిపలుకు
ప్రవక్తలు-రాజులు గ్రంథం పరిశుద్ధ చరిత్రను వివరించే విశిష్టమైన అయిదు గ్రంథ పరంపరలో రెండోది. అయితే ఈ పరంపరలోని గ్రంథాల్లో దీన్ని చిట్టచివరగా రచించటం జరిగింది. ఇ.జి. వైట్ రచించిన అనేక గొప్ప గ్రంథాల్లో చివరి గ్రంథం కూడా ఇదే. శ్రీమతి వైట్ అమెరికాలోను, ఇతర దేశాల్లోను తన ప్రసంగాలు, రచనల్లో చరిత్ర సంఘటనల ప్రాముఖ్యాన్ని నిత్యం ప్రజల ముందు ఉంచేది. మానవ వ్యవహారాల్లోని నీతి దుర్మార్గాల్లోని అదృశ్యమైన ప్రభావాన్ని అనగా దేవుని హస్తం నడుపుదలనీ, ఆత్మల విరోధి అయిన సాతాను హస్తం నడుపుదలనీ వివరించేది. PKTel .0
దైవ సంగతుల్లో విశేష జ్ఞానంగల ఈ రచయిత అడ్డు తెరను తొలగించి చరిత్ర వేదాంతాన్ని విశదం చేస్తున్నది. ఆ వెలుగులో గతంలోని సంఘటనలు గొప్ప ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటున్నాయి. ఈ వేదాంతాన్ని ఆమె ఈ మాటల్లో వివరిస్తున్నది. PKTel .0
“ఈ రాజ్యాలు వ్యక్తుల బలం తమను అజేయులుగా తీర్చి దిద్దేటట్లు కనిపించే అవకాశాల్లోగాని సదుపాయాల్లోగాని లేదు. అది వారు చెప్పుకుంటున్న గొప్పతనం లోనూ లేదు. వారిని గొప్ప వ్యక్తుల్ని శక్తిమంతుల్ని చేసేది దేవుని శక్తి, ఆయన సంకల్పం మాత్రమే. ఆయన సంకల్పంపట్ల తమ వైఖరినిబట్టి వారు తమ భవిష్యత్తును నిర్ణయించుకుంటారు. PKTel .0
“మానవుడి సాధనలు, మానవుడి యుద్ద విజయాలు, మానవుడు లోకంలో సాధించిన ఘనత ఇవే మానవ చరిత్రాంశాలు. మానవుణ్ని పరలోకం ఎలా పరిగణిస్తుందన్నది దైవచరిత్ర.” PKTel .0
నిజమైన ఆరాధనకు కేంద్రమైన యెహోవా ఆలయంతో శోభిల్లుతూ, ఐక్యరాజ్యంగా ఉన్న ఇశ్రాయేలు పై సొలొమోను సుప్రసిద్ద పరిపాలనతో ప్రవక్తలు, రాజులు గ్రంథం ప్రారంభమౌతున్నది. దేవుడు ఎన్నుకున్న ప్రజలు దేవునికి నమ్మకంగా నిలవటం, తమ చుట్టుపట్ల ఉన్న ప్రజల దేవుళ్లను పూజించటం మధ్య ఎంపిక చేసుకోటంలో చోటుచేసుకున్న మార్పును వివరణను ఈ గ్రంథం సమర్పిస్తుంది. లోక చరిత్రలో ముఖ్యమైన కాలంలో మానవ హృదయాలకోసం క్రీస్తుకి సాతానుకి మధ్య సాగుతున్న పోరాటానికి నిదర్శనాన్ని ఈ గ్రంథం స్పష్టంగా చూపిస్తుంది. PKTel .0
ఈ గ్రంథం ఆశాజనకమైన ప్రవర్తన అధ్యయనాలతో నిండి ఉంది - గొప్ప జ్ఞాని అయినా ఎవరి జ్ఞానం అతిక్రమానికి పాల్పడకుండా ఆపలేకపోయిందో ఆ సొలొమోను; స్వార్థపరుడు జిత్తులమారి అయిన యరొబాము, అతడి పరిపాలన దుష్పలితాలు; భయమెరుగని ఏలీయా; సమాధానం స్వస్తతల ప్రవక్త ఎలీషా, పిరికివాడు దుర్మార్గుడు అయిన ఆహాబు; నమ్మకస్తుడు సహృదయుడు అయిన హిజ్కియా; దేవునికి ప్రియుడైన దానియేలు; సంతాప ప్రవక్త యిర్మీయా; పునరుద్ధరణ ప్రవక్తలైన హగ్గయి, జెకర్యా, మలాకీలు; రానున్న రాజు, దేవుని గొర్రెపిల్ల, ఎవరిలో ఛాయారూపక బలులు నెరవేర్పు పొందాయో ఆ అద్వితీయ దైవకుమారుడైన యేసు.. మహిమలో వీరందరికన్నా అగ్రస్థానాన్ని ఆక్రమిస్తున్నాడు. PKTel .0
ఈ పరంపరలో మొదటి గ్రంథమైన పితరులు-ప్రవక్తలు సృష్టి మొదలు దావీదు పరిపాలన వరకూ జరిగిన ప్రపంచ చరిత్రను వివరిస్తున్నది. ఇందులో మూడో గ్రంథమైన యుగయుగాల ఆకాంక్ష క్రీస్తు జీవితాన్ని పరిచర్యను వివరిస్తున్నది. ప్రవక్తలు-రాజులు గ్రంథం ఈ రెండింటి మధ్య సరిగా అమరుతున్నది. అపొస్తలుల కార్యాలు అన్న నాలుగో గ్రంథం తొలినాళ్ల క్రైస్తవ సంఘ చరిత్రను విశదీకరిస్తుంది. ఈ గ్రంథ పరంపరలో చివరి గ్రంథం అయిన “మహా సంఘర్షణ” సంఘర్షణ ఉదంతాన్ని మన దినాలవరకు చెప్పుకుంటూ వచ్చి ఆ తర్వాత ప్రవచన ధోరణిలో నూతన భూమి సృష్టివరకు జరగనున్న చరిత్రను చెబుతున్నది. PKTel .0
ప్రవక్తలు-రాజులు గ్రంథం మంచి ఆదరణ పొందటంతో అనేక ముద్రణలు పొందుతూ వచ్చింది. ఇప్పుడు దీన్ని కొత్త అచ్చులో ప్రజల అధ్యయానికి ఆకర్షణీయంగా తయారు చెయ్యటం జరిగింది. కాని విషయంలోగాని, పుటల సంఖ్యలోగాని ఎలాంటి మార్పులు లేవు. ప్రత్యేకంగా ఈ గ్రంథానికి ఉద్దేశించి తొలుత రూపొందించిన చిత్రాల్ని ఈ నూతన ముద్రణలో చేర్చలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. PKTel .0
దేవుని పైన లోక రక్షకుడైన ఆయన కుమారునిపైన విశ్వాసాన్ని పెంచే పాఠాలు, పాత నిబంధన కాలంలోని భక్తులు భక్తురాండ్ర జీవితాల్లో దేవుని నడుపుదలను వివరించే కధనాలు ఈ గ్రంథాన్ని పఠించే వారందరి మతానుభవాన్ని పరిపుష్టంచేసి వారి మనసుల్ని ఆధ్మాత్మిక వికాసంతో నింపుతాయన్నది ప్రచురణకర్తల ఆశాభావం. PKTel .0
ఎలెన్ జి. వైట్ ప్రచురణల
బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్