క్రైస్తవ పరిచర్య

178/278

అధ్యాయం 16
సంఘవిస్తరణ ఉద్యమం

దైవ ప్రణాళిక

తన ప్రజలు వలసలు ఏర్పర్చుకోటం లేక పెద్ద సమాజాలుగా ఏర్పడటం దేవుని సంకల్పం కాదు. లోకంలో క్రీస్తు శిష్యులు ఆయన ప్రతినిధులు. వారు దేశమంతా చెదిరి పట్టణాల్లో, నగరాల్లో గ్రామాల్లో లోకపు చీకటిలో దీపాలుగా ఉండాలని దేవుని సంకల్పం. టెస్టిమొనీస్, సం.8, పు.244. ChSTel 208.1

వలసలు ఏర్పర్చుకోటం లేక తక్కువ బలం లేదా ప్రభావం ఉన్న స్థలాలు విడిచి పెట్టి అనేకమంది ప్రభావం ఒకే స్థలంలో కేంద్రీకృతం చెయ్యటమన్న ప్రణాళిక, వెలుగును దేవుడు ఉద్దేశించిన స్థలంలో ఉంచకుండా ఇతర స్థలాలకి తొలగించేదవుతుంది. టెస్టిమొనీస్, సం.2, పు.633. ChSTel 208.2

క్రీస్తు సంఘం ప్రభువు ఉద్దేశాన్ని నెరవేర్చుతుంటే, చీకటిలో ఉన్న వారందరిమీద, మరణ ప్రాంతంలోను మరణ ఛాయలోను ఉన్న వారి మీద, వెలుగు ప్రకాశిస్తుంది. ఒకే చోట చేరి, కలిసి ఉండి, బాధ్యతను, సిలువ వెయ్యటాన్ని తప్పించుకునే బదులు సంఘ సభ్యులు అన్ని ప్రాంతాలకు చెదిరి, క్రీస్తు వెలుగును ప్రకాశింపజేస్తూ, ఆత్మల రక్షణ నిమిత్తం ఆయన చేసినట్లు పని చేస్తారు. “ఈ రాజ్యసువార్త” లోకమంతటికీ వేగంగా ప్రకటితమౌతుంది. తాట్స్ ఫమ్ మౌంట్ ఆఫ్ బ్లెస్సింగ్, పులు. 42, 43. ChSTel 208.3

సోదరులారా, సోదరీలారా, ఎందుకు సంఘాల చుట్టూ తిరుగుతారు? తప్పిపోయిన గొర్రె ఉపమానం అధ్యనం చెయ్యండి. పాపపు అరణ్యంలో తప్పిపోయిన గొర్రెను వెదకే నిజమైన కాపరిగా వెళ్లండి. నశిస్తున్న వారిని రక్షించండి. రివ్యూ అండ్ హెరాల్డ్, డిసె. 12, 1893. ChSTel 208.4

మన సంఘాల సభ్యులు తాము ఇంకా ప్రారంభిచని సేవను చేయాల్సి ఉన్నారు. కేవలం లౌకికమైన లాభం కోసం ఎవరూ నూతన స్థలానికి వలస వెళ్లకూడదు. కాని ఉపాధికి ఎక్కడ అవకాశం లభిస్తుందో సత్యంలో పటిష్టంగా ఉన్న కుటుంబాలు అక్కడ ఓ స్థలంలో ఒకటి రెండు కుటుంబాలు, మిషనరీలుగా పనిచెయ్యటానికి వెళ్లాలి. ఆత్మల పట్ల ప్రేమ, భారం కలిగివారు పని చెయ్యాలి. వారిని సత్యంలోకి ఎలా తీసుకురావాలో వారు అధ్యయనం చెయ్యాలి. వారు మన ప్రచురణల్ని పంచవచ్చు. వారి గృహాల్లో సువార్త సమావేశాలు జరపవచ్చు, ఇరుగు పొరుగువారితో పరిచయం ఏర్పర్చుకుని, వారిని ఈ సమావేశాలకి ఆహ్వానించువచ్చు. ఈ విధంగా వారు తమ వెలుగును మంచి పనుల్లో ప్రకాశింపజేయ్యవచ్చు. టెస్టిమొనీస్, సం 8, పు. 245. ChSTel 209.1

తమ నివాస స్థలాన్ని మార్చుకోగోరుతున్న సహోదరులు, దేవుని మహిమను దృష్టిలో ఉంచుకుని, ఇతరులుకి మేలు చెయ్యటం, క్రీస్తు ఎవరి కోసం తన ప్రశస్త ప్రాణాన్ని అర్పించకుండా అట్టిపెట్టుకోలేదో ఆ ఆత్మలకు మేలు చేసి రక్షించటం తమ వ్యక్తిగత బాధ్యత అని గుర్తించేవారు తక్కువ వెలుగున్న లేక అసలే వెలుగులేని పట్టణాలు, పల్లెల్లో ఎక్కడ తమ సే వద్వారా అనుభవం ద్వారా వాస్తవమైన సేవ చేస్తూ ఆశీర్వాదకరంగా ఉండగలరో అక్కడ నివసించాలి. దేవునికి సాక్షులు దేశమంతా చెదిరి ఉండేందుకు, వెలుగు ఎక్కడకు వెళ్లలేదో అక్కడికి సత్యపు వెలుగు చొచ్చుకుపోయేందుకు, ఏ పట్టణాలు పల్లెల్లో సత్యం ఇంకా ప్రవేశించలేదో అక్కడ సత్యపతాకం ఎగురవేసేందుకు మిషనరీలు అవసరం. టెస్టిమొనీస్, సం. 2, పు. 115. ChSTel 209.2

పరులకు చేసే సేవ ఆత్మ త్యాగం పట్ల ఉత్సాహాన్ని మేల్కొలిపి, ప్రవర్తనను విశాలం పటిష్టం చేసినంతగా ఇంకేదీ చెయ్యలేదు. క్రైస్తవులమని చెప్పుకునే అనేకమంది సంఘ సంబంధాన్ని ఆశించటంలో తమను గురించి మాత్రమే ఆలోచిస్తారు. సంఘ సహవాసాన్ని పాదిరి పరామర్శల్ని సేవల్ని వారు ఆకాంక్షిస్తారు. వారు ప్రగతి చెందుతున్న పెద్ద సంఘాల్లో సభ్యులవుతారు. కాని ఇతరులికి ఏ మేలూ చెయ్యరు. ఈ రకంగా వారు గొప్ప దీవెనలు పోగొట్టుకుంటున్నారు. అనేకులు సుఖాల్ని ప్రోత్సహించే స్నేహాల్ని త్యాగం చెయ్యటం ద్వారా గొప్ప ఉపకారం పొందుతారు. క్రైస్తవ సేవలో తమ శక్తి సామర్థ్యాలు ఎక్కడ అవసరమౌతాయో అక్కడకు వారు వెళ్లాలి. వారు బాద్యత వహించటం నేర్చుకోవచ్చు. ది మినిస్ట్రీస్ ఆఫ్ హీలింగ్, పు.121. ChSTel 209.3

అమెరికాలో సత్య పతాకం ఎగరని స్థలాలు, సత్యం ప్రకటించబడటం జరగని స్థలాలు వేలున్నాయి. పంటకూర్చటానికి పొలంలో దిగగలవారు, ఇప్పుడు మతపరంగా సోమరులై ఉన్న కొందరి ఫలితంగా పరలోకానికి కుంటుకుంటూ నడుస్తూ, తాము క్రైస్తవులమా? అన్న సందేహాన్ని వ్యక్తం చేసేవారు వేలమంది ఉన్నారు. క్రీస్తుతో సమైక్యత వారి ప్రధానావసరం. అప్పుడు “మీరు దేవుని జతపనివారు” అని చెప్పవచ్చు. నేను అనేకులతో ఇలా చెప్పాలనుకుంటున్నాను, “ఎవరో మిమ్మల్ని ద్రాక్షాతోట వద్దకు మోసుకువెళ్లి పనిలో పెట్టాలని, లేదా, పనిలో ఏ అసౌకర్యం లేకుండేందుకు ద్రాక్షాతోటనే మీ వద్దకు తేవాలని మీరు వేచి ఉన్నారు. మీ నిరీక్షణ విఫలమౌతుంది. కన్నులు పైకెత్తి చూస్తే ఏ పక్క చూసిన పండి కోతకు సిద్దంగా ఉన్న పొలం మీకు కనిపిస్తుంది. దగ్గరలోను దూరంలోను మీకు పని కనిపిస్తుంది. అయితే తీర్పులో ఎంతమంది గురించి క్రీస్తు “భళానమ్మకమైన మంచి దాసులు” అంటాడు? అంతం సమీపించటం, దేవుని గురించిన ఆయన పంపిన యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం తమకున్నదని చెప్పుకునేవారు కలిసి, వలసలు ఏర్పర్చుకుని, సమావేశాలకి హాజరవుతూ, తమ ఆత్మలకు మేలుచెయ్యటానికి, సంఘాన్ని బలపర్చటానికి తోడప్పడే బోధ జరగకపోతే అసంతృప్తి చెందుతూ ఉండేవారు, కాని ఎలాంటి సేవా చెయ్యని వారిని చూసి దూతలు ఏమనుకుంటారు? అని నేను తలస్తున్నాను.... సత్యం ప్రకటించబడని స్థలాలకు లేక సత్యం వెలుగు ఎక్కడ మినుకు మినుకుమంటున్నదో అక్కడకు తమ నివాసం మార్చుకోటం ద్వారా లౌకికమైన ఆర్థికాదాయం ఏమంత ఉండే అవకాశం లేకపోతే, వారిని రక్షించటానికి యేసు చేసిన పనినే వారూ చెయ్యరా? జెనరల్ కాన్ఫరెన్స్ బులిటన్, 1993, పు. 131. ChSTel 210.1

సత్యాన్ని ఇతర దేశాల్లో ప్రకటించటానికే గాక మనకు సమీపంలో ఉన్న వారికి ప్రకటించటానికి కూడా మిషనెరీ సేవ గొప్ప అవసరాన్ని మనం చూస్తున్నాం. దగ్గరలో మన చుట్టూ ఉన్న నగరాలు పట్టణాల్లో ఆత్మల్ని రక్షించటానికి ఎలాంటి ప్రయత్నం జరగటం లేదు. నేటి సత్యం తెలిసిన కుటుంబాలు క్రీస్తు ధ్వజాన్ని నిలపటానికి, తమ మార్గంలో గాక దేవుని మార్గంలో, వినయంగా పనిచేస్తూ, సత్యం తెలియని వారికి వెలుగు తేవటానికి ఈ నగరాలు పట్టణాలు పల్లెల్లో ఎందుకు స్థిరపడకూడదు? ChSTel 210.2

సంఘానికి నిజంగా వర్తమాన పరమైన స్పూర్తి ఉన్నప్పుడు, క్రీస్తు ఏ ఆత్మల కోసం మరణించాడో వారిని రక్షించటానికి సభ్యులందరూ తమ శక్తులన్నిటినీ వినియోగిస్తూ పనిచేస్తారు. సత్యంతో కొత్త స్థలాల్లోకి వెళ్తారు. అభి షేకం పొందని కొందరు సంఘాల్ని సందర్శించటంలో, నశించటానికి సిద్ధంగా ఉన్న సంఘాల్ని బలపర్చటంలో దేవునితో కలిసి పనిచేసే జత పనివారవుతారు. దేవుడు తమకిచ్చిన వెలుగును ఇతరులుకి ప్రకాశింప జెయ్యటానికి నగరాలు, పట్టణాలు, రవాణా వసతులులేని మారుమూల స్థలాలకు వెళ్లి స్థిరపడే స్వచ్చంధ సువార్త సేవకులవుతారు. తాము కలిసే కొందరు ఏమంత ఆసక్తి ఉన్నవారిగా కనిపించరు. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే, క్రీస్తు సహవాసంలోకి వారు వస్తారా? సత్యానికి నీతికి కర్త అయిన ప్రభువు ఆకర్షణల్ని ప్రజలకు సమర్పించేందుకు వారు తమ పలుకులోను జీవితంలోను ఆయన స్వభావంలోను పాలివారవుతారా? అన్నదే. ChSTel 211.1

దేవుని సేవలో అనుభవమున్న సహోదరులు సత్యం ప్రకటితం కాని స్థలాల్లో ఓ హాలుగాని లేక సమావేశానికి అనుకూలమైన మరే స్థలాన్నిగాని అద్దెకు తీసుకుని, రావటానికి ఇష్టపడే వారందరినీ పోగుచెయ్యాలి. అప్పుడు ప్రజలకి సత్యం బోధించాలి. వారు పెద్ద ప్రసంగాలు చెయ్యనవసరంలేదు. వారు బైబిలుని తీసుకువెళ్ళి దేవున్ని తన వాక్యం నుంచి ప్రత్యక్షంగా మాట్లాడనివ్వాలి. హాజరైన వారు కొద్దిమందే అయితే ఆడంబరంగాని ఉద్రేకంగాని లేకుండా లేఖనం ఏమి చెబుతున్నదో వారికి చదివి వినిపించాలి. సామాన్య సువార్త సత్యాన్ని చదివి విశదీకరించండి. వారితో కలిసి పాటలు పాడి ప్రార్ధన చెయ్యండి. రివ్యూ అండ్ హెరాల్డ్, సెప్టె. 29, 1891. ChSTel 211.2