యుగయుగాల ఆకాంక్ష

19/88

18—“ఆయన హెచ్చవలసియున్నది”

కొంత కాలం జాతిపై స్నానికుడైన యోహాను ప్రభావం రాజులు, యాజకులు, ప్రధానుల ప్రభావం కన్నా ప్రబలంగా ఉంది. యోహాను తానే మెస్సీయాగా ప్రకటించుకుని రోముకి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీసి ఉంటే, యాజకులు ప్రజలు అతని జెండాకింద నిలిచేవారు. జగత్ విజేతల్ని ఆకట్టుకునే ప్రతీ ఆశను సాతాను స్నానికుడు యోహాను ముందు పెట్టాడు. తన శక్తిని గురించి తన ముందున్న నిదర్శనంతో చక్కని పారితోషికాన్ని తోసిపుచ్చాడు. తనపై కేంద్రీకృతమైన గమనాన్ని అతడు ఇంకొకరి పైకి తిప్పాడు. DATel 175.1

ఇప్పుడు ప్రజాకర్షణ పొంగు రక్షకుని మీదికి మళ్ళడం అతడు చూశాడు. రోజుకు రోజు తన చుట్టూ మూగే ప్రజాసముహాలు పల్చబడడం అతడు గమనించాడు. యేసు యెరుషలేము నుంచి యోర్దాను ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన బోధను వినడానికి ప్రజలు ఆయన చుట్టూ మూగారు. ఆయన శిష్యుల సంఖ్య అనుదినం పెరిగింది. అనేకులు బాప్తిస్మం పొందడానికి వచ్చారు. స్వయాన క్రీస్తు బాప్తిస్మమివ్వకపోయినా ఆకార్యాన్ని తన శిష్యులు నిర్వహించడాన్ని ఆయన సమ్మతించాడు. ఈ రీతిగా తనకు మార్గం సరాళం చేసినవాడైన స్నానికుడు యోహాను సేవపై ఆయన తన ఆమోద ముద్ర వేశాడు. అయితే యేసు ప్రాబల్యం పెరగడాన్ని చూసి యోహాను శిష్యులు అసూయపడ్డారు. ఆయన సేవను విమర్శించడానికి సిద్ధమయ్యారు. దానికి త్వరలోనే సమయం సందర్భం కలిసొచ్చాయి. బాప్తిస్మం పాపాన్ని తుడిచివేస్తుందా అన్న అంశంపై యూదులికి యోహాను శిష్యులికి మధ్య వివాదం వచ్చింది. యేసు బాప్తిస్మం యోహాను బాప్తిస్మం కన్నా వ్యత్యాసమయ్యిందని వారి వాదన. కాసేపటిలో వారు బాప్తిస్మం సమయంలో ఉపయోగించాల్సిన సరియైన మాటల గురించి, చివరగా బాప్తిస్మమిచ్చే హక్కు యేసుకు ఉన్నదా అన్న విషయం గురించి క్రీస్తు శిష్యులతో ఘర్షణ పడ్డారు. DATel 175.2

యోహాను శిష్యులు వచ్చి అతనికి ఈ ఫిర్యాదు చేశారు, “బోధకుడా, యెవడు యోర్దానుకు అవతల నీతో కూడ ఉండెనో ఆయన బాప్తిస్మమిచ్చుచున్నాడు. అందరాయన యొద్దకు వచ్చుచున్నారు.” ఈ మాటల ద్వారా సాతాను అతనికి శోధన సృష్టించాడు. యోహాను సేవ దాదాపు సమాసం కావచ్చినప్పటికీ, అతడు క్రీస్తు పరిచర్యకు ఇంకా అడ్డంకులు కలిగించడం సాధ్యమే. యోహాను అతడితో ఏకీభవించి తనను మించి వ్యవహరించడం గురించి బాధనుగాని ఆశాభంగాన్నిగాని వ్యక్తంచేసి ఉంటే అతడు అసమ్మతి విత్తనాలు విత్తే వాడు. అసూయను ఈర్ష్యను ప్రొత్సహించేవాడు. తద్వారా సువార్త ప్రగతిని అడ్డుకునేవాడు. DATel 176.1

మానవులందరికీ ఉండే బలహీనతలే యోహానుకీ స్వాభావికంగా ఉన్నాయి. కాని అతణ్ని తాకిన దైవప్రేమ అతణ్ని మార్చివేసింది. అతడు స్వార్ధం దురాశవల్ల కలుషితం కాని వాతావరణంలో నివసించాడు. అందుచేత అసూయకు అతీతంగా నివసించాడు. తన శిష్యులతో ఏకీభవించి వారి అసంతృప్తిని పంచుకోలేదు. కాని తాను మెస్సీయా జీవిత కర్తవ్యాన్ని ఎంత స్పష్టంగా అవగతం చేసుకున్నాడో, తాను ఎవరికోసం మార్గం సిద్ధం చేశాడో ఆ ప్రభువును స్వాగతించడం తనకెంత ఆనందమో వివరించాడు. DATel 176.2

అతడిలా అన్నాడు, “తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని యెవడును ఏమియు పొందనేరడు. నేను క్రీస్తును కాననియు, ఆయనకంటే ముందుగా పంపబడినవాడనే అనియు చెప్పినట్టు వారే నాకు సాక్షులు. పెండ్లికుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అయితే నిలువబడి పెండ్లికుమారుని స్వరము వినెడి స్నేహితుడు ఆ పెండ్లికుమారుని స్వరమువిని మిక్కిలి సంతోషించును.” పెండ్లికి మార్గం సుగమం చేసేందుకు ఇరుపక్షాలకూ మిత్రుడిగా యోహాను తన్ను తాను వర్ణించుకుంటున్నాడు. పెండ్లికుమారుడు పెండ్లి కుమార్తెను స్వీకరించడంతో మిత్రుడి కర్తవ్యం ముగిసింది. ఎవరి వివాహం తాను ఏర్పాటుచేశాడో వారితో కలిసి అతడు సంతోషించాడు. అలాగే ప్రజల్ని యేసు చెంతకు నడిపించడానికి యోహాను పిలుపు పొందాడు. రక్షకుని పరిచర్య విజయాన్ని చూసి యోహాను సంతోషించాల్సి ఉన్నాడు. యోహానిలా అన్నాడు. “ఈ సంతోషము పరిపూర్ణమై యున్నది. ఆయన హెచ్చవలసియున్నది. నేను తగ్గవలసియున్నది.” DATel 176.3

విశ్వాసంతో రక్షకుని వీక్షిస్తూ యోహాను ఆత్మ త్యాగంతో ఉన్నత శిఖరాన్ని చేరాడు. ప్రజల్ని తనవద్దకు ఆకర్షించడానికి ప్రయత్నించలేదు. వారి ఆలోచనల్ని ఉన్నతస్థాయికి లేపి దేవుని గొర్రెపిల్లపై వారి ధ్యానాన్ని నిలపడానికి కృషిసల్పాడు. తాను మాత్రం అరణ్యంలో ఓ స్వరంలా ఉండిపోయాడు. ఇప్పుడు అందరి కళ్ళూ జీవపువెలుగుపై నిలిచేందుకు తాను నిశ్శబ్దంగా అజ్ఞాతంగా మిగిలిపోవడంలో ఆనందించాడు. DATel 177.1

దైవ రాయబారులుగా పిలుపుపొందిన వారు స్వీయ గౌరవ ప్రతిష్ఠల కోసం పాకులాడరు. క్రీస్తుపట్ల ప్రేమ స్వార్ధాన్ని మింగివేస్తుంది. ప్రశస్త సువార్త పరిచర్యకు కళంకం తెచ్చే పోటీ తత్వం ఉండదు. స్నానికుడు యోహానుమల్లే “ఇదిగో లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొట్టె పిల్ల” అంటూ ప్రకటించడం తమ పరిచర్య అని వారు గుర్తిస్తారు. (యోహాను 1:29). వారు యేసుని పైకెత్తుతారు. ఆయనతో పాటు మానవజాతిని ఘనపర్చుతారు. “మహా ఘనుడును మహోన్నతడును పరిశుద్దుడును నిత్య నివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతుమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయముగల వారిప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగల వారియొద్దను దీనమనస్సుగల వారియొద్దను నివసించుచున్నాను.” యెషయా 57:15. DATel 177.2

స్వార్దంపోయి ఖాళీ అయిన ప్రవక్త ఆత్మ దేవుని వెలుగుతో నిండింది. రక్షకుని గూర్చి అతడు సాక్ష్యం ఇచ్చినప్పుడు అతని మాటలు నీకొదేముతో క్రీస్తు సమావేశమైనప్పుడు క్రీస్తు పలికిన మాటలకు దాదాపు దీటుగా ఉన్నాయి. యోహాను ఇలా అన్నాడు, “పై నుండి వచ్చువాడు అందరికీ పై నున్నవాడు; భూమి నుండి వచ్చువాడు భూసంబంధియై భూసంబంధమైన సంగతులను గూర్చి మాటలాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికి పైగా” ఉంటాడు. “దేవుడు తాను పంపినవానికి కొలత లేకుండా ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును.” “నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే నేను చేయగోరుదునుగాని నా యిష్టప్రకారము చేయగోరను” (యోహాను 5:30) అని క్రీస్తు చెప్పగలిగాడు. ఆయన ఇలా ప్రకటించడం జరిగింది, “నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీదేవుడు నీ తోడివారికంటె నిన్ను హెచ్చించుచున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. “హెబ్రీ 1:9. తండ్రి ఆయనకు “కొలత లేకుండ ఆత్మను అనుగ్రహించును.” DATel 177.3

క్రీస్తు అనుచరుల విషయంలో ఇదే జరుగుతుంది. మనం స్వార్ధాన్ని ఖాళీ చెయ్యడాన్ని బట్టే పరలోకం నుంచి వచ్చే వెలుగును పొందగలగడం జరుగుతుంది. మన ప్రతీ ఆలోచనను క్రీస్తుకు లొంగేటట్లు చేస్తేనే తప్ప మనం దేవుని ప్రవర్తనను గ్రహించలేం లేదా క్రీస్తును విశ్వాసమూలంగా అంగీకరించలేం. ఇది చేసే వారందరికి దేవుని ఆత్మ కొలతలేకుండా అనుగ్రహించబడుంది. “దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మరియు ఆయనయందు నారును సంపూర్ణులైయున్నారు.” కొలాస్స 2:9, 10. DATel 178.1

మనుషులందరూ క్రీస్తు వద్దకే వస్తున్నారని యోహాను శిష్యులు యోహానుకి చెప్పారు. అయితే యోహాను స్వచ్ఛమైన మనసుతో ఇలా అన్నాడు, “ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు.” ఆయనను రక్షకుడుగా అంగీకరించే వారు బహు కొద్దిమంది. కాని “ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్రవేసియున్నాడు.” యోహాను 3:33. “కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు.” పాపశుద్ధి కలిగించింది. క్రీస్తు బాప్తిస్మమా లేక యోహాను బాప్తిస్మమా అన్న మీమాంస అవసరంలేదు. ఆత్మకు జీవాన్నిచ్చేది క్రీస్తుకృప మాత్రమే. క్రీస్తు లేకుండా బాప్తిస్మంగాని ఇతరత్రా ఏ పరిచర్యగాని అర్ధంలేని ఆచారం. “కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు.” DATel 178.2

క్రీస్తు పరిచర్య సాధిస్తోన్న విజయాన్ని గూర్చి యెరుషలేములోని అధికారులకు నివేదిక అందింది. ఆ వార్త విని యోహాను సంతోషించువాడు. ప్రజలు యూదు సమాజ మందిరాలకు వెళ్లకుండా అరణ్యంలోకి తండోపతండాలుగా వెళ్లడం చూసి యాజకులు రబ్బీలు యోహానువాద అసూయపడ్డారు. ఇశ్రాయేలులోని నాయకులు యోహానుతో గొంతు కలిపి “ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసియున్నది.” అనడానికి సిద్ధంగా లేరు. పైగా ప్రజల్ని తమకు దూరం చేస్తున్న పరిచర్యను అంతం చెయ్యాలన్న దృఢసంకల్పంతో సంఘటితమయ్యారు. DATel 178.3

వారు తన శిష్యులకు యోహాను శిష్యులకు మధ్య విభజన సృష్టిస్తారని యేసు గ్రహించాడు. పెనుతుపాను వస్తుందని అది లోకంలో నివసించిన అత్యున్నత ప్రవక్తల్లో ఒకణ్ని కబళిస్తుందని ఆయనకు తెలుసు. అపార్ధానికి చోటు పెట్టకూడదని భావిస్తూ క్రీస్తు చడీచప్పుడు లేకుండా తన పరిచర్యను ఆపి గలిలయ ప్రాంతానికి వెళ్లిపోయాడు. మనం కూడా ఇలాగే సత్యంపట్ల నమ్మకంగా ఉంటూ విభేదాలకు అపార్ధాలు అపోహాలకు దారితీసే సమస్తానికి దూరంగా ఉండాలి. ఎందుచేతనంటే ఇవి ఎప్పుడైతే తలెత్తుతాయో వాటి పర్యవసానంగా ఆత్మలు నాశనమౌతాయి. ఎప్పుడైనా అనైక్యత ప్రమాదానికి దారితీసే పరిస్థితులు ఏర్పడ్డప్పుడు యేసు, స్నానికుడు యోహాను స్థాపించిన ఆదర్శాన్ని మనం అనుసరించాలి. DATel 179.1

యోహాను సంస్కర్తగా నాయకత్వం వహించడానికి పిలుపు పొందాడు. ఈ కారణం చేతనే తన శిష్యులు అతని విజయం అతని శ్రమమీద ఆధారపడి ఉంటుందని భావించి తమ దృష్టిని తన మీదనే నిలిపారు. అతడు ఒక సాధనమేనని ఆ సాధనం ద్వారా దేవుడు పనిచేశాడని వారు గుర్తించలేదు. అయినా క్రైస్తవ సంఘానికి పునాది వెయ్యడానికి యోహాను కృషి సరిపోలేదు. తన కర్తవ్యాన్ని నెరవేర్చిన అనంతరం అతడు మరో కార్యం నిర్వహించాల్సి ఉన్నాడు. అది అతని సాక్ష్యం సాధించలేని కార్యం. అతని శిష్యులు దీన్ని గ్రహించలేకపోయారు. యోహాను పనిని చేపట్టడానికి క్రీస్తు రావడం చూసినప్పుడు వారు అసూయపడ్డారు. అసంతృప్తి చెందారు. DATel 179.2

ఈ ప్రమాదాలు ఇప్పుడూ ఉన్నాయి. ఓ కార్యాన్ని నిర్వహించడానికి దేవుడు మానవుణ్ని పిలుస్తాడు. అతడు తన శక్తి మేరకు ఆకార్యాన్ని నిర్వహించినప్పుడు, దాన్ని ఇంకా వృద్ధి చెయ్యడానికి ప్రభువు ఇతరుల్ని తీసుకువస్తాడు. కాని యోహాను శిష్యుల్లా తమ కృషి విజయం ప్రారంభ సేవకుల పనిమీద ఆధారపడి ఉంటుందని అనేకులు భావిస్తారు. వారి దృష్టి దేవునిమీద గాక మనుషులమీద కేంద్రీకృతమై ఉంటుంది. అసూయపుడుతుంది. దేవుని వాక్యం కళంకితమౌతుంది. ఇలా అయోగ్యంగా గౌరవాభిమానాలు పొందిన వ్యక్తి ఆత్మధైర్యంతో ఉప్పొంగుతాడు. తాను దేవునిపై ఆధారపడాలని గుర్తించడు. మార్గ నిర్దేశం కోసం మానవుల పై ఆధారపడాలని ప్రజలకు బోధించడం జరుగుతుంటుంది. మనుషులు ఈ రకంగా తప్పుడు మార్గంలో పడి దేవునికి దూరమౌతుంటారు. DATel 179.3

దేవుని పనిమీద మానవుడి ముద్రగాని చిరునామాగాని ఉండకూడదు. ప్రభువు అప్పుడప్పుడు వివిధ ప్రతినిధుల్ని లేపుతాడు. వారి ద్వారా ఆయనకార్యం ఎంతో చక్కగా సిద్ధి పొందుతుంది. స్వార్థాన్ని త్యజించి సాత్వికులవుతూ “ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసియున్నది” అని యోహానుతో గళం కలిపేవారు ధన్యులు. DATel 180.1