యుగయుగాల ఆకాంక్ష

67/88

66—వివాదం

క్రీస్తు మందలింపుల్ని యాజకులు అధికారులు విన్నారు. ఆయన ఆరోపణల్ని కాదనలేకపోయారు. కాని ఆయనపై ఉచ్చు బిగించాలని కృతనిశ్చయులై ఉన్నారు. ఈ ఉద్దేశంతో వారు ఆయన వద్దకు గూఢచారుల్ని పంపారు. వారు “అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పుపట్టవలెనని, తొము నీతిమంతులనిపించుకొను వేగులవారు. ” వారు వృద్ధులైన, యేసుని తరచుగా కలిసిన పరిసయ్యుల్ని కాదు గాని ఉత్సాహం ఉద్రేకం కలిగిన, క్రీస్తుకి తెలిసిన వారు కారని తాము భావించిన యువకుల్ని పంపించారు. వీరి వెంట కొందరు హేరోదీయులు వెళ్ళారు. వారు క్రీస్తు మాటలు విని ఆయన తీర్పుల్లో ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాల్సి ఉన్నారు. పరిసయ్యులికి హేరోదీయులికి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గున మండేది. అయితే వారిప్పుడు క్రీస్తుకి వ్యతిరేకంగా జట్టుకట్టి ఒకటయ్యారు. DATel 670.1

రోమియులు బలవంతంగా వసూలు చేసే పన్ను విషయమై పరిసయ్యులు విసిగిపోయారు. పన్ను చెల్లింపు దైవధర్మశాస్త్రానికి విరుద్ధమని వారి నమ్మకం. యేసును ఉచ్చులో బిగించడానికి ఇప్పుడు తమకో తరుణం వచ్చినట్లు వారు భావించారు. గూఢచారులు ఆయన వద్దకు వచ్చి, తమ విధిని తెలుసుకోగోరుతున్నట్లు నిజాయితీ పరుల్లా నటిస్తూ ఇలా ప్రశ్నించారు, “బోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచును ఉన్నావు; నీవెవనియందును మోమోటములేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని యెరుగుదుము. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా?” DATel 670.2

“నీవు.. సత్యము గానే దేవుని మార్గమును బోధించుచున్నావని యెరుగుదుము” అన్న మాటలు యధార్ధంగా పలికిన మాటలే అయితే మంచిదే. వారు సత్యాన్నే చెప్పారు. కాని అవి మోసగించడానికి పలికిన మాటలు. అయినా వారి సాక్ష్యం యధార్ధ సాక్ష్యం. క్రీస్తు సత్యాన్ని చెప్పి సత్యాన్నే బోధిస్తోన్నాడని పరిసయ్యులికి తెలుసు. తమ సొంత సాక్ష్యాన్ని బట్టే వారికి తీర్పు జరుగుతుంది. DATel 671.1

క్రీస్తుకి ప్రశ్నవేసిన యువకులు తమ ఉద్దేశాన్ని దాచగలిగామని భావించారు. కాని తెరచిన పుస్తకంలా క్రీసు వారి హృదయాల్ని చదివాడు. వారి వేషధారణను మోగించి చూశాడు. “నన్నెందుకు శోధించుచున్నారు?” అన్నాడు యేసు. ఈ విధంగా వారు అడగని గుర్తు వారికిచ్చాడు. DATel 671.2

తాను వారి మనసులోని ఉద్దేశాల్ని చదివానని వారికి చూపించాడు. “ఒక దేనారము నాకు చూపుడి” అని ఆయన అన్నప్పుడు వారు మరింత కంగారుపడ్డారు. వారు ఒక దేనారం తెచ్చి ఆయనకు చూపించారు. “దీని మీద రూపమును పై వ్రాతయు ఎవనివి?” ప్రశ్నించాడు యేసు. “క్రైసరువి” బదులు పలికారు వారు. ఆ నాణెం మీది రాతను వేలితో చూపిస్తూ యేసు ఇలా అన్నాడు, “కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడి.” DATel 671.3

క్రీస్తు తమ ప్రశ్నకు అటో ఇటో నేరుగా సమాధానం చెబుతాడని గూఢచారులు భావించారు. కైసరుకి కప్పం చెల్లించడం న్యాయం కాదని ఆయన చెప్పితే ఆయన్ని గురించి రోమా అధికారులికి ఫిర్యాదు చేసి తిరుగుబాటు లేపుతున్నాడన్న ఆరోపణపై బంధించాలన్నది వారి ఎత్తుగడ. ఒక వేళ కప్పం చెల్లించడం న్యాయమని ఆయన చెబితే ఆయన దేవుని ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రజలకు చెప్పి వారిని రెచ్చగొట్టడం మరో ఎత్తుగడ. ఇప్పుడు వారు గందరగోళంలో పడ్డారు. పరాజయం పాలయ్యారు. వారి ఎత్తుగడలు చిత్తయ్యాయి. వారి ప్రశ్నకు ఆయన సత్వర పరిష్కారం సూచించడంతో వారు చెప్పడానికి ఇక ఏమి మిగల్లేదు. DATel 671.4

క్రీస్తు ఇచ్చిన జవాబు తప్పించుకోడానికి చేసిన ప్రయత్నం కాదు. అది ఆ ప్రశ్నకు నిష్కపటమైన జవాబు. కైసరు బొమ్మ, పేరు ముద్రించి ఉన్న రోమానాణాన్ని చేతిలో పట్టుకుని, తాము రోమా అధికారం పరిరక్షణ కింద నివసిస్తున్నారు గనుక ఆ అధికారం కోరే మద్దతును అది మరింత ఉన్నత విధితో సంఘర్షణ పడనంతకాలం వారు ఇవ్వాలని ఆయన ప్రకటించాడు. దేశ చట్టాలకు విధేయులై శాంతియుతంగా నివస్తూనే వారు దేవునికి తాము మొట్టమొదటగా నమ్మకంగా నిలువాలి. “దేవునివి దేవునికి... చెల్లించుడి” అని రక్షకుడన్న మాటల్లో కుట్రలు పన్నుతున్న యూదులికి తీవ్ర గద్దింపు ఉంది. దేవుని విధుల్ని నమ్మకంగా నెరవేర్చి ఉంటే వారు చెదరిపోయి పరాయి దేశాల్లో పరాయి పాలన కింద నివసించేవారు కారు. యెరుషలేము పై రోమియుల జెండా రెపరెపలాడేది కాదు. ఏ రోమా సైనికుడూ దాని గుమ్మాల ముందు నిలబడేవాడు కాడు. దాని చుట్టూ ఉన్న ప్రహరీ లోపల ఏ రోమాపరిపాలకుడు పరిపాలన చేసేవాడు కాడు. ప్రభువును విసర్జించి భ్రష్ట జాతి అయినందుకు యూు జాతి ఆ కాలంలో శిక్షననుభవిస్తోంది. DATel 671.5

పరిసయ్యులు క్రీస్తు జవాబు విన్నప్పుడు, “ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి” వారి వేషధారణను అహంకారాన్ని ఆయన మందలించాడు. ఇది చెయ్యడంలో ఆయన ఒక గొప్ప నియమాన్ని ప్రకటించాడు. పౌర ప్రభుత్వాల పట్ల మానవుడి విధి హద్దుల్ని, దేవుని పట్ల అతడి విధిని ఈ నియమం నిర్వచిస్తోంది. అనేకమంది మనసుల్ని క్షోభపెట్టే ప్రశ్నకు పరిష్కారం దొరికింది. అప్పటి నుంచి సరియైన నియమాన్ని ఆచరించారు. చాలామంది అసంతృప్తితో వెళ్ళిపోయినప్పటికీ ఆ ప్రశ్న పరిష్కారానికి నియమం రూపొందింది. వారు క్రీస్తు దూరదృష్టికి జ్ఞానానికి నివ్వెరపోయారు. DATel 672.1

పరిసయ్యులు ఖంగుతిని మౌనం దాల్చిన వెంటనే సద్దూకయ్యులు యుక్తిగల తమ ప్రశ్నలతో ముందుకు వచ్చారు. ఈ రెండు పక్షాలూ ఒకదాని కొకటి విరోధంగా నిలిచి ఉండేవి. పరిసయ్యులు నిష్ఠగల సంప్రదాయ వాదులు. బాహ్యాచారాల్ని చాలా ఖచ్చితంగా ఆచరించేవారు. ప్రక్షాళన, ఉపవాసం ఆచరించడంలో, దీర్ఘ ప్రార్ధనలు, ఆడంబర దాన ధర్మాలు చేయడంలో అమిత శ్రద్ధ ప్రదర్శించేవారు. అయితే మానవుల ఆజ్ఞల్ని సిద్దాంతాలుగా బోధించడం ద్వారా వారు దేవుని ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం . చేశారని క్రీస్తు ప్రకటించాడు. ఒక తరగతిగా మతదురభిమానులు, వేషధారులు అయినా నిజమైన భక్తిగలవారు, క్రీస్తుని స్వీకరించి ఆయన శిష్యులైన వారు వారిలో కొందరున్నారు. ఇక పోతే సద్దూకయ్యులు పరిసయ్యుల సంప్రదాయాల్ని నిరాకరించారు. లేఖనాల్లో ఎక్కువ భాగాన్ని నమ్ముతున్నట్లు, వాటిని తమ క్రియలకు ప్రమాణంగా అనుసరిస్తున్నట్లు వారు చెప్పుకునేవారు. వాస్తవానికి వారు సంశయవాదులు, భౌతికవాదులు. DATel 672.2

సర్దూకయ్యులు దేవదూతల ఉనికిని, మృతుల పునరుత్థానాన్ని, భావి జీవిత సిద్ధాంతాన్ని, మంచి జీవితానికి ప్రతిఫలాన్ని, చెడ్డ జీవితానికి శిక్షను నమ్మలేదు. ఈ విషయాలన్నిటిలో వారు పరిసయ్యులతో భేదించారు. ఈ రెండు పక్షాల మధ్య పునరుత్థానం ఒక వివాదాంశం. పరిసయ్యులు పునరుత్థానాన్ని గట్టిగా నమ్మారు. అయితే ఈ చర్చల్లో భావి స్థితిని గురించిన వారి అభిప్రాయాలు గలిబిలి అయ్యాయి. మరణం అంతుచిక్కని మర్మం అయ్యింది. సద్దూకయ్యుల వాదనలను ఎదుర్కోడానికి వారి అశక్తత నిత్యం ఉద్రిక్త వాతావరణం సృష్టించేది. ఈ రెండు వర్గాల మధ్య చర్యలు ఆవేశకావేషాలకు ఉద్రిక్తతలకు దారి తీసేవి. వారి మధ్య దూరం మరింత పెరిగేది. DATel 673.1

సంఖ్యాపరంగా సదూకయ్యుల కంటే వారి ప్రత్యేర్ధులదే పై చెయ్యి. ప్రజలపై వీరి పట్టుకూడా అంత బలంగా లేదు. అయితే వీరిలో చాలా మంది ధనికులు. డబ్బు మూలంగా వచ్చే పలుకుబడి కూడా వీరికుంది. వారిలో చాలామంది యాజకులుగా సేవచేసేవారు. సాధారణంగా ప్రధాన యాజకుడు వీరిలోనుంచే ఎంపికయ్యేవాడు. సంశయవాద అభిప్రాయాలికి ప్రాధాన్యం ఉండకూడదు అన్న షరతు పై ఈ ఎంపిక జరిగేది. పరిసయ్యుల సంఖ్యాబలం ప్రజాకర్షణ కారణంగా యాజక హోదాలో ఉన్న సద్దూకయ్యులు పరిసయ్యుల సిద్ధాంతాల్ని బాహ్యంగా అంగీకరించడం అవసరమయ్యేది. అయినా వారు అలాంటి హోదాకు అర్హులన్న విషయం వారి పలుకుబడి వారి పొరపాట్లను కప్పిపుచ్చింది. DATel 673.2

సద్దుకయ్యులు క్రీస్తు బోధనల్ని నిరాకరించారు. క్రీస్తుని ఒక ఆత్మ నడిపిస్తోందని, ఆ ఆత్మ తన్నుతాను ఈ విధంగా ప్రదర్శించుకుంటుందని తాము నమ్మమని వారు చెప్పేవారు. దేవున్ని గురించి, భావి జీవితం గురించి ఆయన బోధనలు వారి సిద్ధాంతాల్ని ఖండించాయి. మానవుడికన్నా అధికుడు దేవుడు మాత్రమే అని వారు నమ్మారు. కాని దివ్య దృష్టి కలిగి అందరిని అన్నిటిని అధిగమించి పాలించే శక్తి మానవుడి స్వతంత్ర నైతిక ప్రతిపత్తిని తీసివేసి అతణ్ని బానిసగా మార్చుతుందని వాదించారు. మానవుణ్ని సృజించిన తర్వాత ఏ ఉన్నత శక్తి ప్రభావం కింద ఉంచకుండా దేవుడు అతణ్ని స్వతంత్రుడిగా ఉంచాడన్నది వారి నమ్మకం. మానవుడు తన సొంత జీవితాన్ని అదుపు చేసుకోడానికి ప్రపంచ సంభవాల్ని సంఘటనల్ని తీర్చిదిద్దుకోడానికి సర్వస్వతంత్రుడని, తన భవిష్యత్తు అతడి చేతుల్లోనే ఉందని వారు విశ్వసించారు. దేవుని ఆత్మ మానవ ప్రయత్నాలతో సహకరించి పనిచేస్తాడని గాని లేక స్వభావసిద్ధ మార్గల్లో పనిచేస్తాడని గాని వారు అంగీకరించలేదు. అయినా తన స్వాభావిక శక్తుల వినియోగం ద్వారా మానవుడు ఉన్నత స్థాయిని జ్ఞానాన్ని సంపాదించవచ్చునని వారు నమ్మారు. కఠిన, కఠోర కృషి వలన మానవుడి జీవితం పవిత్రమవ్వడం సాధ్యమని వారు విశ్వసించారు. DATel 673.3

దేవుణ్ని గూర్చిన వారి అభిప్రాయాలు వారి ప్రవర్తనను రూపుదిద్దాయి. వారి అభిప్రాయం ప్రకారం దేవునికి మానవుడి పట్ల ఎలాంటి ఆసక్తి లేదన్నట్లే వారు ఒకరి పట్ల ఒకరు మర్యాదగా వ్యవహరించేవారు కాదు. వారిలో ఐక్యత లేదు. మానవ క్రియలపై పరిశుద్దాత్మ శక్తి లోపించింది. అనేకమంది యూదులమల్లే అబ్రహాము సంతానంగా తమ జన్మహక్కును గురించి ధర్మశాస్త్ర విధుల ఆచరణను గురించి ప్రగల్భాలు పలికేవారు. అయితే ధర్మశాస్త్రం తాలుకు వాస్తవ స్ఫూర్తి, అబ్రహాము విశ్వాసం, ఔదార్యం వారిలో నేతి బీరకాయలోని నెయ్యి చందమే. వారి స్వాభావిక దయదాక్షిణ్యాలు సానుభూతి పరిధి బహు సంకుచితం. మనుషులందరూ జీవిత సుఖసౌఖ్యాలు సంపాదించుకోగలరన్నది వారి నమ్మకం. అందుచేత ఇతరుల లేమి, ఇతరుల బాధలు వారిలో దయ సానుభూతి పుట్టించేవి కావు. వారు తమకోసమే బతికారు. DATel 674.1

తన మాటలు క్రియల ద్వారా క్రీస్తు తనకున్న దివ్యశక్తి మానవాతీత ఫలితాల్నిస్తోందని, ప్రస్తుత జీవితాన్ని మించి భవిష్యత్తు జీవితం ఉందని, దేవుడు మానవాళికి తండ్రి అని, ఆయన నిత్యం వారి ఆసక్తుల్ని ప్రయోజనాల్నీ పరిశీలిస్తూ ఉంటాడని సాక్ష్యమిచ్చాడు. ఆయన ఉదారత, దయాళుత్వంతో పనిచేసే దైవశక్తిని ప్రదర్శించాడు. అది సదూకయ్యుల స్వార్థపూరిత వేర్పాటువాదాన్ని గద్దించింది. మానవుడి లౌకికమైన మేలు నిమిత్తం, నిత్యజీవపరమైన క్షేమంకోసం దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా హృదయంలో పనిచేస్తాడు. పరిశుద్దాత్మ ద్వారా మాత్రమే సంభవించగల ప్రవర్తన మార్పుకు మానవ శక్తిని నమ్ముకోడంలోని పొరపాటును ఆయన ఎత్తి చూపించాడు. DATel 674.2

మర్యని తిలో లాగే అమర్త్యస్థితిలోనూ శరీరం కణాలతో నిర్మాణమైనట్లయితే, పునరుత్థానమైనప్పుడు అది రక్తమాంసాలు కలిగి ఉండి, లోకంలో ముగిసిన జీవితాన్ని నిత్యజీవంలో కొనసాగించాలని, అలాగైనప్పుడు లోకంలో ఉన్నప్పటి సంబంధ బాంధవ్యాలు కొనసాగడం, భార్యాభర్తలు తిరిగి ఏకమవ్వడం, వివాహాలు ఫలభరితమవ్వడం - ఇవన్నీ మరణానికి ముందు లాగే సాగి, ఈ జీవితంలోని బలహీనతలు, ఉద్రేకాలు ఉద్వేగాలు నిత్యజీవంలో అంతం లేకుండా కొనసాగుతాయని సదూకయ్యులు హేతువాదం చేశారు. DATel 675.1

వారి ప్రశ్నలకు సమాధానంగా యేసు భవిషత్ జీవితాన్ని మరుగుపర్చే తెరను తొలగించాడు. ఆయన ఇలా అన్నాడు, “వారు మృతులలో నుండి లేచునప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె ఉందురు.” సద్దూకయ్యులు నమ్ముతున్నది తప్పు అని ఆయన సూచించాడు. “మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని యెరుగకపోవుట వలననే పొరబడుచున్నారు.” అన్నాడు యేసు. పరిసయ్యుల్ని అన్నట్లు వారిని వేషధారులనలేదు. వారు నమ్ముతున్నది తప్పు అన్నాడు. DATel 675.2

మనుషులందరి కన్నా తామే లేఖనాల్ని అతి నిష్కర్షగా అనుసరిస్తోన్నామని సదూకయ్యులు గొప్పలు చెప్పుకున్నారు. అయితే వారు లేఖనాల్ని సరిగా అర్ధం చేసుకోలేదని యేసు చెప్పాడు. ఆ జ్ఞానం పరిశుద్ధాత్మ విశదీకరణ వలన హృదయంలో చోటుచేసుకోవాలి. లేఖనాల గురించి దేవుని శక్తిని గురించి వారి అజ్ఞానమే తమ విశ్వాసం విషయంలోను మానసిక అంధకారం విషయంలోను గందరగోళానికి కారణమని ఆయన వెల్లడించాడు. దేవుని మర్మాన్ని పరిమితమైన తమ హేతువాద పరిధిలోకి దేవుని మర్మాల్ని తేవడానికి వారు ప్రయత్నిస్తోన్నారు. తమ అవగాహనను విశాలపర్చి పటిష్ఠం చేసే పరిశుద్ధ సత్యాలికి తమ మనసులు తెరచి ఉంచాల్సిందిగా క్రీస్తు వారికి పిలుపునిచ్చాడు. పరిమిత జ్ఞానం గల తమ మనసులు గ్రహించలేకపోతున్న కారణంగా వేల ప్రజలు నాస్తికులవుతున్నారు. దైవ విధి విధానాల్లోని అద్భుత శక్తి ప్రదర్శనను వారు విశదీకరించలేరు గనుక ఆ శక్తి నిదర్శనాల్ని తోసిపుచ్చుతారు. వాటిని ప్రకృతి సాధనాలతో ముడిపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఆ సాధనాల అవగాహన వారికి మరింత స్వల్పంగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న మర్మాల్ని గ్రహించే ఏకైక మార్గం వాటన్నిటిలోను దేవుని సముఖాన్ని శక్తిని గుర్తించడమే. దేవుణ్ని విశ్వసృష్టికర్తగా, అన్నిటిని ఆజ్ఞాపించి నిర్వహించే కర్తగా మనుషులు గుర్తించడం అవసరం. ఆయన ప్రవర్తనను గురించి, ఆయన సాధనాల మర్మాల గురిచి మనుషులికి విశాల దృక్పధం అవసరం. DATel 675.3

మృతుల పునరుత్థానం లేకనపోతే తాము నమ్ముతున్నట్లు చెప్పుకునే లేఖనాలు వ్యర్థం అని క్రీస్తు తన శ్రోతలకు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు, “మృతుల పునరుత్థానమును గూర్చి - నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనైయున్నానని దేవుడు నాతో చెప్పిన మాట మీరు చదువలేదా? ఆయన సజీవులకే గాని మృతులకు దేవుడు కాడు” దేవుడు లేని వాటిని ఉన్న వాటిగా పరిగణించడు. ఆయన ఆదినుంచి అంతాన్ని చూస్తాడు. తన సేవ ఫలితాన్ని ఇప్పుడు సిద్ధిపొందిన దానిలా చూస్తాడు. ఆదాము లగాయతు మరణించిన తన చివరి భక్తుడి వరకూ ప్రశస్తమైన తన మృతులు దైవ కుమారుని స్వరం వింటారు. విని సమాధుల్లో నుంచి అమర్త్యులుగా లేస్తారు. దేవుడు వారికి దేవుడై ఉంటాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. DATel 676.1

దేవునికీ పునరుత్థానులైన తన భక్తులికీ మధ్య అతి సన్నిహితమైన అనుబంధం ఉంటుంది. తన సంకల్పంలో ఉద్దేశించిన ఈ స్థితిని ఇప్పుడు కొనసాగుతున్నట్లుగా ఆయన చూస్తున్నాడు. ఆయనకు మృతులు జీవిస్తున్నవారే. DATel 676.2

క్రీస్తు చెప్పిన మాటలతో సదూకయ్యులు మౌనం దాల్చారు. ఆయనకు జవాబు చెప్పలేకపోయారు. తనపై నేరం మోపడానికి ఎలాంటి అవకాశం ఇచ్చేమాట ఒకటి కూడా ఆయన పలకలేదు. ఆయన విరోధులికి ఒనగూడిన మేలు ఏమి లేదు ప్రజల ఛీత్కారం తప్ప. DATel 676.3

అయినా పరిసయ్యులు ఆయన మాటల్ని తప్పుపట్టి వాటిని ఆయనకు వ్యతిరేకంగా వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నాల్ని మానుకోలేదు. పది ఆజ్ఞల్లో ఏది ముఖ్యమైనది? అని ఆయన్ని ప్రశ్నించడానికి వారు గొప్ప పాండిత్యం సంపాదించిన ఒక శాస్త్రుణ్ని ఆయన వద్దకు పంపారు. DATel 677.1

సృష్టికర్త పట్ల మనుషుడి విధిని సూచిస్తున్న మొదటి నాలుగు ఆజ్ఞలు సాటి మనుషుడి పట్ల అతడి విధిని సూచిస్తున్న తక్కిన ఆరు ఆజ్ఞల కన్నా ప్రాముఖ్యమైనవని పరిసయ్యులు పరిగణించేవారు. ఫలితంగా వారిలో నిజమైన, ఆచరణాత్మకమైన భక్తిలోపించింది. ప్రజలకి తమ గొప్ప లోటును చూపించి, చెట్టు ఎలాంటిదో దాని ఫలాలే చెబుతాయని సూత్రీకరిస్తూ, స్మయలు అవసరమని ఆయన బోధించాడు. ఈ కారణంగా ఆయన మొదటి నాలుగు ఆజ్ఞల కన్నా చివరి ఆరు ఆజ్ఞల్ని హెచ్చిస్తాడని వారు ఆయన్ని తప్పుపట్టారు. DATel 677.2

ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు వద్దకు వెళ్ళి సూటిగా ఈ ప్రశ్న వేశాడు, “ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది?” యేసిచ్చిన సమాధానం సూటిగా శక్తిమంతంగా ఉంది. “ప్రధానమైనది ఏదనగా - ఓ ఇశ్రాయేలూ, వినుము, మనదేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ.” రెండోది దీనివంటిదే, అది దీనినుంచి వస్తున్నదే అన్నాడాయన. “నీవు నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ, వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదు.” “ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమైయున్నవి.” DATel 677.3

పది ఆజ్ఞల్లోని మొదటి నాలుగు ఆజ్ఞల్ని ఒక్క ఆజ్ఞగా “నీ పూర్ణ హృదయముతో... నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను” అని సంక్షిప్త పర్చాడు. ఈ రెండూ ప్రేమ సూత్రాన్ని వ్యక్తీకరించే ఆజ్ఞలు. మొదటి దాన్ని ఆచరించి రెండో దాన్ని ఉల్లంఘించజాలం. హృదయ సింహాసనంపై దేవునికి సరియైన స్థానం ఉన్నప్పుడు మన పొరుగు వానికి సరైన స్థానం లభిస్తుంది. మన పొరుగువాణ్ని నిష్పక్షపాతంగా ప్రేమించడం మనకు సాధ్యమౌతుంది. DATel 677.4

ఆజ్ఞలన్నిటిని దేవుని పట్ల మానవుడిపట్ల ప్రేమగా సంక్షిప్తంగా వర్ణించడం జరిగింది. కనుక ఇందులో ఏ ఒక్కసూత్రాన్ని మారినా మొత్తం అంతటినీ మారినట్లవుతుంది. దైవ ధర్మశాస్త్రం కొన్ని ముఖ్యమైన, కొన్ని ముఖ్యంకాని ఎవరూ అంతగా పట్టించుకోనవసరంలేని అనేక వేర్వేరు సూత్రాల సమాహారం కాదని క్రీస్తు ఈ రకంగా నేర్పించాడు. మొదటి నాలుగింటిని చివరి ఆరింటిని ఒక మొత్తంగా సూచించి, తన ఆజ్ఞలన్నిటిని ఆచరించడం ద్వారా ఆయన పట్ల మన ప్రేమ వెల్లడికావాలని ప్రభువు ఉపదేశించాడు. DATel 678.1

క్రీస్తుని ప్రశ్నించిన శాస్త్రి ధర్మశాస్త్రం బాగా అధ్యయనం చేసినవాడు. అతడు యేసు మాటలకు విభ్రాంతి చెందాడు. లేఖనాల్లో ఆయనకు అంత జ్ఞానమున్నదని అతడు ఊహించలేదు. పరిశుద్ధ ఆజ్ఞల సూత్రాల పై అతడి దృక్పథం విశాలమయ్యింది. క్రీస్తు ధర్మశాస్త్రం పై సరియైన భాష్యం చెప్పాడని సమావేశమై ఉన్న యాజకులు అధికారుల ముందు ఒప్పుకుంటూ అతడు ఇలా అన్నాడు, “బోధకుడా, బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే పూర్ణహృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణబలముతోను, ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలే తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటెను బలులకంటెను అధికము.” DATel 678.2

జ్ఞానయుక్తమైన క్రీస్తు సమాధానం ఆ శాస్త్రిని ఆకట్టుకుంది. అతడిలో నమ్మకం పుట్టించింది. యూదుమతం అంతరంగంలో భక్తికి గాక బాహ్యాచారులకు ప్రాధాన్యం ఇచ్చే మతమని అతడికి తెలుసు. కేవలం ఆచారబద్ధమైన అర్పణలు, విశ్వాసం లేకుండా పాపప్రాయశ్చిత్తానికి రక్తం చిందించడం నిరర్థకమని అతడు కొంతమేరకు గ్రహించాడు. దేవునిపట్ల ప్రేమ విధేయత, సాటి మానవుడిపట్ల స్వార్థరహిత పరిగణన ఈ ఆచారాలన్నిటికన్నా ఎక్కువ విలువ గలవిగా అతడికి కనిపించాయి. క్రీస్తు వాదన సరిఅయినదని అంగీకరించడానికి అతడి సంసిద్ధత, ప్రజలముందు ఖచ్చితము సత్వరము అయిన అతడి స్పందన ద్వారా యాజకులు అధికారులు ప్రదర్శించిన స్వభావం కన్నా వ్యతాసమైన స్వభావాన్ని అతడు ప్రదర్శించాడు. యాజకులు అధికారుల ఆగ్రహాన్ని అధికారుల బెదరింపుల్ని లెక్కచెయ్యకుండా తన మనసులోని అభిప్రాయాన్ని వెలిబుచ్చడానికి సాహసించిన నిజాయితీ పరుడైన ఈ శాస్త్రి పట్ల యేసుకి కనికరం పుట్టింది. “అతడు వివేకముగా నుత్తరనిచ్చెనని యేసు గ్రహించి - నీవు దేవుని రాజ్యముకు దూరముగా లేవని అతనితో చెప్పెను.” DATel 678.3

ఆ శాస్త్రి దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నాడు. ఎందుకంటే నైవేద్యాలు బలులకన్నా నీతికార్యాలు దేవునికి అంగీకృతమని అతడు గుర్తించాడు. కాని అతడు క్రీస్తు దివ్య ప్రవర్తనను గుర్తించి ఆయన యందు విశ్వాసం ద్వారా నీతిక్రియలు చెయ్యడానికి శక్తి పొందాల్సి ఉన్నాడు. సజీవ విశ్వాసం ద్వారా క్రీస్తుతో అనుసంధానం కలిగి ఉంటే తప్ప ఆచారబద్ధమైన సేవ నిరూపయోగం. రక్షకునితో దాని సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని దాన్ని అవగాహన చేసుకుంటే తప్ప నీతి ధర్మశాస్త్రం సయితం దాని ఉద్దేశాన్ని నెరవేర్చడంలో విఫలమవుతుంది. తన తండ్రి ధర్మశాస్త్రం కేవలం అధికారపూర్వక ఆజ్ఞలకన్నా లోతైన భావాన్ని కలిగి ఉందని క్రీస్తు పదేపదే చూపించాడు. సువార్తలో ఏ సూత్రం ఉన్నదో అదే సూత్రం ధర్మశాస్త్రంలో ఉంది. ధర్మశాస్త్రం మానవుడి విధిని సూచించి అతడి అపరాధాన్ని చూపిస్తుంది. అతడు క్షమాపణ కోసం ధర్మశాస్త్ర విధిని నిర్వహించడం కోసం శక్తి కోసం క్రీస్తు వద్దకు వెళ్లాలి. DATel 679.1

శాస్త్రి వేసిన ప్రశ్నకు క్రీస్తు సమాధానం చెబుతున్న తరుణంలో పరిసయ్యులు ఆయన చుట్టూ మూగారు. వారి తట్టు తిరిగి ఆయన వారికో ప్రశ్న వేశాడు, “క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడు?” మెస్సీయాను గూర్చి వారి నమ్మకాన్ని పరీక్షించడానికే ఆయన ఈ ప్రశ్నవేశాడు. తనను వారు కేవలం మనుషుడిగా పరిగణిస్తున్నారో లేక దేవుని కుమారునిగా పరిగణిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నాడు. “దావీదు కుమారుడు” అంటూ అనేక స్వరాలు బదులు పలికాయి. ప్రవచనం మెస్సీయా కిచ్చిన నామం ఇది. క్రీస్తు తన అద్భుత కార్యాల ద్వారా తన దేవత్వాన్ని ప్రదర్శించినప్పుడు, రోగుల్ని స్వస్తపర్చినప్పుడు, మృతుల్ని లేపినప్పుడు ప్రజలు “ఈయన దావీదు కుమారుడు కాడా?” అని తమలో తాము అనుకున్నారు. సురో ఫెనికయి స్త్రీ, గుడ్డి బర్తిమయి, ఇంకా అనేకులు సహాయంకోసం “ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము” అని ఆయన్ని అర్థించారు. (మత్త. 15:22). యెరూషలేములోకి ఆయన ప్రవేశిస్తున్నప్పుడు, “దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక” (మత్తయి 21:9) అంటూ ప్రజలు సంతోషంతో కేకలు వేశారు. ఆ దినాన చిన్నపిల్లలు ఈ మాటల్నే దేవాలయంలో ప్రతిధ్వనించారు. అయితే యేసును దావీదు కుమారుడని పిలిచిన వారందరూ ఆయన దేవత్వాన్ని గుర్తించలేదు. దావీదు కుమారుడు దేవుని కుమారుడు కూడా అని వారు గ్రహించలేదు. DATel 679.2

క్రీస్తు దావీదు కుమారుడన్న దానికి సమాధానంగా యేసు ఇలా అన్నాడు, “నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు నీవు నాకుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పేను అని దావీదు ఆయనను ప్రభువని చెప్పిన యెడల, ఆయన ఏలాగు అతనికి కుమారుడగునని వారినడుగగా ఎవరును మారుమాట చెప్పలేకపోయెను మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు.” DATel 680.1