యుగయుగాల ఆకాంక్ష

64/88

63—“నీ రాజు... వచ్చుచున్నాడు”

“సీయోను నివాసులారా, బహూగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతి పరుడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు.” జెకర్యా 9:9. DATel 633.1

క్రీస్తు జననానికి అయిదు వందల సంవత్సరాలు ముందు ఆయన రాజుగా ఇశ్రాయేలుకు వస్తాడని జెకర్యా ప్రవక్త ప్రవచించాడు. ఈ ప్రవచనాలు ఇప్పుడు నెరవేరాల్సి ఉన్నాయి. ఎంతో కాలంగా రాచమర్యాదల్ని గౌరవాన్ని నిరాకరిస్తూ వచ్చిన ఆయన దావీదు సింహాసనానికి వాగ్రత్త వారసుడుగా ఇప్పుడు యెరుషలేముకి వస్తున్నాడు. DATel 633.2

వారంలో మొదటి రోజున క్రీస్తు విజయుడుగా యెరుషలేములో ప్రవేశించాడు. ఆయన్ని చూడడానికి బేతనియలో గుమిగూడిన జనులు చాలామంది పస్కాను ఆచరించించడానికి ప్రయాణం చేస్తూ మార్గంలో ఉన్నారు. వీరు యేసు వెంట వస్తున్న జన సమూహంతో కలిసి వస్తున్నారు. ప్రకృతి ఉల్లసిస్తున్నట్లు కనిపించింది. చెట్ల ఆకులు పచ్చగా రమ్యంగా ఉన్నాయి. వాటి పుష్పాలు మధుర సువాసనల్ని వెదజల్లుతున్నాయి. ప్రజల్లో నవజీవం నూతనోత్సాహం వెల్లివిరిశాయి. నూతన రాజ్యాన్ని గూర్చిన ఆశలు మళ్ళీ చిగురించాయి. DATel 633.3

యెరూషలేము వెళ్లాలన్న ఉద్దేశంతో ఒక గాడిదను దానిపిల్లను తీసుకురావడానికి యేసు ఇద్దరు శిష్యుల్ని పంపాడు. తన జననం సమయంలో రక్షకుడు పరుల ఆతిథ్యం మీద ఆధారపడ్డాడు. శిశువుగా ఆయన పరుండి ఉన్న పశువుల తొట్టె ఎరువు తెచ్చింది. వెయ్యి కొండల మీది పశువులు ఆయనవే అయినా, యెరుషలేములో రాజుగా ప్రవేశించడానికి ఎక్కి వెళ్ళడానికి గాడిద కోసం ఇంకొకరి దయవిద ఆధారపడ్డాడు. ఈ సందర్భంగా చిన్న చిన్న వివరాల పై శిష్యులకి చ్చిన ఆదేశాల్లో ఆయన దేవత్వం మళ్లీ వెల్లడయ్యింది. ఆయన ముందే చెప్పిన ప్రకారం “అవి ప్రభువునకు కావలసియున్నవి అన్న మాటను యజమాని అంగీకరించాడు. తన వినియోగం కోసం ఎవ్వరూ ఎక్కని గాడిదపిల్లను యేసు ఎంపిక చేసుకున్నాడు. శిష్యులు ఉత్సాహంతో తమ వస్త్రాల్ని గాడిద మీద పరిచి తమ ప్రభువుని దానిమీద కూర్చోబెట్టారు. ఇప్పటివరకు యేసు కాలినడకనే ప్రయాణం చేశాడు. ఇప్పుడు ఆయన వాహన ప్రయాణాన్ని కోరడం శిష్యులికి మొదట ఆశ్చర్యం కలిగింది. ఆయన రాజధానిలో ప్రవేశించడానకి, తన్నుతాను రాజుగా ప్రకటించుకోడాని రాజుగా తన అధికారాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడన్న ఆశాభావం వారిలో బలపడింది. ఆ పని మీద ఉన్నప్పుడు తమ ఆశాభావాన్ని యేసు మిత్రులతో పంచుకున్నారు. ఉత్సాహం ఉద్వేగం వెల్లివిరిశాయి. ప్రజల్లో ఆశలు అంబరాన్నంటుతున్నాయి. DATel 633.4

రాచప్రవేశం సందర్భంగా క్రీస్తు యూదు సంప్రదాయాన్ని అనుసరిస్తోన్నాడు. ఆయన ఎక్కివెళ్ళిన జంతువు ఇశ్రాయేలు రాజులు ఎక్కిన జంతువులు మెస్సీయా ఈ విధంగా తన రాజ్యానికి రావలసి ఉన్నాడని ప్రవచనం చెబుతున్నది. ఆయన గాడిద పిల్లమీద కూర్చున్న వెంటనే గొప్ప విజయధ్వని వినిపించింది. జనసమూహం ఆయన్ని మెస్సీయ్యాగాను తమ రాజుగాను ప్రకటించింది. క్రితంలో ఎన్నడూ తాను అంగీకరించని నివాళుల్ని యేసు ఇప్పుడు అనుమతించాడు. ఆయన్ని సింహనం మిద చూడడం ద్వారా తమ నిరీక్షణలు నిజం కానున్నాయనడానికి శిష్యులు ఈ పరిణామాన్ని నిదర్శనంగా తీసుకున్నారు. తమ స్వాతంత్ర్య ఘడియ సమిపించిందని జనులు విశ్వసించారు. రోమా సేవల్ని యెరుషలేము నుంచి తరిమివేసి ఇశ్రాయేలు మళ్లీ స్వతంత్రరాజ్యం అయ్యినట్లు ప్రజలు ఊహించుకున్నారు. అందరు ఆనందోత్సాహాలతో నిండి ఉన్నారు. ఆయనకు నివాళులర్పించడంలో ప్రజలు ఒకరితో ఒకరు పోటీపడ్డారు. బాహ్య ఆడంబరం ఆర్భాటం ప్రదర్శించలేకపోయారు. కాని ఆయన్ని ఉత్సాహభరితమైన మనసులతో ఆరాధించారు. విలువైన కానుకలు ఇవ్వలేకపోయారు గాని ఆయన మార్గంలో తమ వస్త్రాలు పరిచారు. ఆయన మార్గంలో ఒలీవ కొమ్మలు గొంజికొమ్మలు వెదజల్లారు. విజయవంతుడైన రాజు వెంటవస్తున్న ఊరేగింపును రాజధ్వజాలతో నడిపించలేకపోయారు. కాని విజయాన్ని సూచించే ప్రకృతి చిహ్నమైన ఈత మట్టల్ని కొట్టి హోసన్నా నినాదాలు చేస్తూ వాటిని పైకెత్తి ఊపారు. ప్రజా సమూహం ముందుకి సాగుతుండగా యేసువస్తున్నాడన్న వార్తవిని నిత్యం వస్తూ అందులో చేరుతున్న జనులతో ఊరేగింపు పెద్దదయ్యింది. చూపరులు ఈయన ఎవరు? ఈ సందడంతా ఎందుకోసం? అని ప్రశ్నిస్తూ నిత్యం ఆ సమూహంలో కలిసిపోతున్నారు. వారందరూ యేసుని గురించి విన్నారు. ఆయన యెరూషలేముకి వెళ్లాడని కనిపెట్టారు. కాని ఇంతకు ముందు తనను సింహాసనం పై పెట్టడానికి జరిగిన ప్రయత్నాల్ని ఆయన సమర్ధించలేదని వారికి తెలుసు. ఆ వ్యక్తి ఈయనేనని తెలుసుకుని వారు విస్మయం చెందారు. తన రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదని ప్రకటించిన ఈయనలో ఈ మార్పుకు కారణమేంటని తికమకపడున్నారు. DATel 634.1

వారి ప్రశ్నలు విజయ నినాదంతో ఆగిపోయాయి. జన సమూహం దాన్ని మళ్లీ మళ్లీ నినదించింది. దూరంలో ఉన్న ప్రజలు దాన్ని అందుకుని చుట్టూ ఉన్న కొండలు లోయలు ప్రతిధ్వనించేటట్లు నినదించారు. ఇప్పుడు ఊరేగింపులో యెరుషలేము నుంచి వచ్చిన జన సముహాలు చేరాయి. పస్కాకు వచ్చిన జన సమూహాల నుంచి యేసుకు స్వాగతం పలకడానికి వేలాదిమంది ముందుకు వచ్చారు. ఈత మట్టలు ఊపుతూ పరిశుద్ధ పాటలు పాడూ ఆయన్ని స్వాగతించారు. దేవాలయంలోని యాజకులు సాయంత్రం సేవకు బూర ఊదారు. కాని దానికి స్పందించేవారు లేరు. అధికారులు ఒకరితో ఒకరు “ఇదిగో లోకము ఆయన వెంటపోయినది.” అని చెప్పుకున్నారు. DATel 635.1

తన ఇహలోక జీవితంలో మున్నెన్నడూ ఇలాంటి ప్రదర్శనను ఆయన అనుమతించలేదు. డాని పర్యవసానాన్ని ఆయన స్పష్టంగా చూశాడు. దాని ఫలితం సిలువ. కాని తన్నుతాను విమోచకుడిగా బాహాటంగా ఇలా సమర్పించుకోడం ఆయన సంకల్పం. నశించిన ప్రపంచానికి తన పరిచర్యలో మిక్కిలి ప్రాముఖ్యమైన తన త్యాగానికి ప్రజల దృష్టి మళ్ళించాలన్నది ఆయన కోరిక. పస్కా పండుగకు ప్రజలు యెరుషలేములో సమావేశమౌతుండగా బలిపశువుకు ఎవరు నిజస్వరూపమో ఆయనే స్వచ్ఛందంగా తన్నుతాను నైవేద్యంగా అర్పించుకున్నాడు. లోకపాపాల నిమిత్తం ఆయన మరణాన్ని ధ్యానానికి అధ్యయనానికి ప్రధానాంశం చేయడం ఆయన సంఘం నిర్వహించాల్సిన భాద్యత. దానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని పరిశోధించి అనుమానానికి తావులేకుండా నిర్ధారించుకోవాలి. ప్రజల దృష్టి ఆయన మీద కేంద్రీకరించడం ఇప్పుడు ఆవసరం. ఆయన మహత్తర త్యాగానికి ముందు చోటుచేసుకున్న ఘటనలు ఎటువంటివంటే అవి ఆ త్యాగం పైకి మన దృష్టికి ఆకర్షిస్తోన్నాయి. ఆయన యెరుషలేము ప్రవేశం సందర్భంగా అలాంటి ప్రదర్శన తర్వాత, చివరి ఘట్టానికి ఆయన వడివడిగా సాగడంపై అందరి కళ్లూ నిలుస్తాయి. DATel 635.2

ఈ విజయ ప్రవేశం సందర్భంగా జరిగిన సంభవాల గురించే ప్రతి నాలుక మాట్లాడి యేసును ప్రతీవారి మనసులోకి తేవడం జరుగుతుంది. ఆయన సిలువ అనంతరం అనేకులు ఆయన విచారణ మరణం సందర్భంగా ఈ ఘటనల్ని గుర్తుచేసుకుంటారు. ప్రవచనాల్ని అధ్యయనం చెయ్యడానికి ఉద్రేకం పొందుతారు. యేసే మెస్సీయా అన్న నమ్మకం వారికి కలుగుతుంది. అన్ని దేశాల్లోను అనేకులు విశ్వసించి క్రీస్తు అనుచరులవుతారు. వారి సంఖ్య పెరుగుతుంది. DATel 636.1

తన ఇహలోక జీవితంలోని ఈ విజయ సన్నివేశం ఒక్కదానిలోనే రక్షకుడు పరలోక దూతలతోను దేవుని బూరతోను వచ్చి కనిపించే వాడే. కాని అట్టి ప్రవర్తన ఆయన కర్తవ్యానికి, పరిచర్యకు, ఆయన జీవితాన్ని నడిపించిన నియమానికి విరుద్ధం. తాను అంగీకరించిన సామాన్య, దీన జీవితానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. లోకం జీవించడానికి తన ప్రాణాన్ని అర్పించేవరకు మానవ జీవిత భారాన్ని ఆయన మోయాల్సి ఉన్నాడు. DATel 636.2

ఈ ఉత్సాహభరిత దృశ్యం తమ ప్రభువు పొందనున్న శ్రమలు మరణానికి నాంది అని శిష్యులు గ్రహించి ఉంటే, తన జీవితంలో సమున్నత దినంగా వారికి కనిపించిన ఈ దినం నల్లని మేఘాలు కమ్మిన చీకటి దినంగా పరిణమించేది కాదు. తన మరణాన్ని గురించి ఆయన పదేపదే చెప్పినప్పటికీ ప్రస్తుత ఆనందమయ విజయంలో ఆయన చెప్పిన దుఃఖకరమైన మాటల్ని శిష్యులు మర్చిపోయి దావీదు సింహాసనంపై ఆయన ప్రగతిశీల రాజ్యపాలనకు ఎదురుచూస్తోన్నారు. DATel 636.3

ఊరేగింపు సమూహంలో ప్రజలు ఎడతెగకుండా వచ్చి చేర్తున్నారు. ఏదో కొద్ది మంది మినహా వచ్చిన వారందరూ ఆ ఘడియ తాలూకు ఆవేశాన్ని పొంది హోసన్నా నినాదాన్ని పెద్దది చెయ్యడానికి తోడ్పడి అది కొండల్లో నుంచి లోయల్లో నుంచి ప్రతిధ్వనించడానికి సహకరించారు. “దావీదు కుమారునికి జయము. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములో జయము” అన్న కేకలు నిత్యం వినిపించాయి. DATel 637.1

అలాంటి విజయోత్సవ ఊరేగింపును ప్రపంచం మునుపెప్పుడు చూడలేదు. ప్రఖ్యాతి గాంచిన లోక రాజుల ఊరేగింపు వంటిది కాదది. రాజు పరాక్రమానికి విజయానికి ట్రోఫీలుగా విలపిస్తున్న బానిసల గుంపు ఆ ఊరేగింపు దృశ్యంతో భాగంకాదు. కాని రక్షకుని ప్రేమ కనికరాల పరిచర్యకు మానవ ట్రోఫీలు ఆయన చుట్టూ ఉన్నారు. సాతాను శక్తినుంచి ఆయన విడిపించిన బందీలున్నారు. తమ విడుదలకు వారు ఆయన్ని స్తోత్రిస్తున్నారు. ఆయన చూపు ప్రసాదించిన గుడ్డివారు ఊరేగింపులో ముందు నడుస్తున్నారు. ఆయన బాగుపరచిన మూగవారు బిగ్గరగా హోసన్నా నినాదాలు చేస్తున్నారు. ఆయన స్వస్తపర్చిన వికలాంగులు ఆనందంతో గంతులు వేస్తూ గొంజికొమ్మలు విరిచి వాటిని చేతుల్లో పట్టుకుని ఊపడంలో ముందున్నారు. విధవరాండ్రు దిక్కులేని వారు ప్రభువు తమకు చేసిన కారుణ్య సేవలకు ఆయన్ని ఘనపర్చి కొనియాడుతున్నారు. ఆయన శుద్ధి పరిచిన కుష్ఠురోగులు పరిశుభ్రమైన తమ వస్త్రాలను ఆయన మార్గంలో పరిచి మహిమరాజు అంటూ కేకలు వేసి ఆయన్ని స్వాగతించారు. ఆయన ఎవర్ని మరణ నిద్రనుంచి లేపాడో వారూ ఉన్నారు ఆ ప్రజావాహినిలో. ఎవరి శరీరం సమాధిలో కుళ్లడం మొదలయ్యిందో, కాని ఇప్పుడు ఎవరు బలం యౌవనం కలిగి ఉన్నారో ఆ లాజరు రక్షకుడు ఎక్కిన గాడిదను నడిపిస్తోన్నాడు. DATel 637.2

అనేకమంది పరిసయ్యులు ఆ దృశ్యాన్ని చూశారు. అసూయతో దుర్మార్గంతో నిండి వారు ప్రజాభిప్రాయం క్రీస్తుకి వ్యతిరేకంగా మార్చడానికి ప్రయత్నించారు. కాని వారి విజ్ఞప్తులు, బెదరింపులు ప్రజల ఉత్సాహాన్ని అధికం చేశాయేగాని వారనుకున్నది జరగలేదు. ప్రజలు తమ సంఖ్యాబలంతో యేసుని రాజుగా ప్రకటిస్తారని వారు భయపడ్డారు. చివరి ప్రయత్నంగా, వారు ప్రజా సమూహం మధ్య నుంచి దూసుకువెళ్ళి యేసుని మందలిస్తూ ఇలా అన్నారు, “బోధకుడా, నీ శిష్యులను గద్దింపుము. ” అల్లరితో కూడిన అలాంటి ప్రదర్శనలు న్యాయసమ్మతం కావని అధికార్లు వాటిని అనుమతించరని హెచ్చరించారు. కాని “వీరు ఊరకుండిన యెడల ఈ రాళ్లు కేకలు వేయును” అని యేసు ఇచ్చిన సమాధానం వారి నోళ్లు ముయ్యించింది. ఆ విజయ సన్నివేశం దేవుడు సంకల్పించింది. ఇది ప్రవక్త ముందే చెప్పిన ప్రవచనం. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడంలో మానవుడు విఫలుడైవుంటే ఆయన రాళ్లకి మాట ఇచ్చేవాడు. అవి ఆయన కుమారుణ్ని శ్లాఘిస్తూ స్వాగతించేవి. మౌనం వహించిన పరిసయ్యులు వెనుకంజవెయ్యగా వేలాది స్వరాలు జెకర్యా రాసిన ఈ మాటల్ని పలికారు, “సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరుషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిమంతుడును రక్షణగలవాడును దీనుడునునై, గాడిదను గాడిదపిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు.” DATel 637.3

ఊరేగింపు జనం కొండ శిఖరానికి ఎక్కి పట్టణంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో యేసు ఆగాడు. జనమంతా ఆయనతోపాటు ఆగారు. మహిమతో ప్రకాశిస్తోన్న యెరుషలేము పట్టణం వారి ముందుంది. వాలున్న సూర్యుడి కిరణాల కాంతిలో ఆ పట్టణం కళకళలాడుతోంది. అందరి కళ్లూ దేవాలయంపై నిలిచాయి. అన్నిటికన్నా ఎత్తుగా ఉన్న ఆ మందిరం వైభవోపేతంగా నిలిచి ప్రజల దృష్టిని ఏకైక సజీవ దేవుని తట్టు తిప్పుతున్నట్లు కనిపిస్తోంది. అది యూదు జాతి ప్రభావానికి అతిశయానికి కారణంగా ఎంతోకాలం నుంచి ఉంది. దాని వైభవం గురించి రోమీయులు కూడా అతిశయించేవారు. రోమియులు నియమించిన ఒక రాజు దాన్ని తిరిగి కట్టి అలంకరించడంలో యూదులతో కలిసి పనిచేశాడు. రోమా చక్రవర్తి తన బహుమతులతో దాన్ని భాగ్యవంతం చేశాడు. దాని శక్తి, గొప్పతనం, ప్రాభవం దాన్ని ప్రపంచంలోని అద్భుతాల్లో ఒకటిగా రూపొందించాయి. DATel 638.1

సూర్యుడు ఆకాశానికి లేత బంగరురంగు పలుముతూ పడమరకు పయనిస్తుండగా ఆ వెలుగుపడిన ఆలయం తెల్లని పాలరాతిగోడలు, బంగారం పొదిగిన స్తంభాలు ధగధగ మెరిశాయి. క్రీస్తు ఆయన అనుచరులు నిలిచి ఉన్న కొండ శిఖరం నుంచి చూస్తుంటే ఆలయం బంగారు గోపురాలు గల బ్రహ్మాండమైన మంచుకట్టడంలా ఉంది. దేవాలయ ద్వారం వద్ద బంగారం వెండితో చేసిన ద్రాక్షతీగె ఉంది. దానికి పచ్చని ఆకులు వాటి నడుమ ద్రాక్ష గుత్తులు ఉన్నాయి. వాటిని గొప్ప నైపుణ్యం గల చిత్రకారులు చిత్రించారు. ఈ చిత్రం ఇశ్రాయేలుని వృద్ధి చెందుతున్న ద్రాక్షవల్లిగా సూచిస్తోంది. బంగారం, వెండి ఆకుపచ్చల్ని అరుదైన అభిరుచితోను పనితనంతోను మిళితం చెయ్యడం జరిగింది. ఆ ద్రాక్ష తీగ ప్రకాశిస్తోన్న తెల్లని స్తంభాలకు చుట్టుకోగా దాని కాడలు వాటి బంగారపు అలంకరణల్ని పట్టుకుని ఉండగా దాని మిద అస్తమిస్తోన్న సూర్యకిరణాలు పడడంతో అది పరలోకం నుంచి పుణుకి పుచ్చుకున్న మహిమతో ప్రజ్వలిస్తోన్నట్లు కనిపించింది. DATel 638.2

యేసు ఆ దృశ్యాన్ని వీక్షిస్తున్నాడు. ఆ విస్తార జన సందోహం అర్ధంతరంగా కనిపించిన ఆ మనోహర దృశ్యాన్ని చూసి తమ కేకలు ఆపివేశారు. అందరి దృష్టి రక్షకుని మిద నిలిచింది. తాము పొందుతున్న పారవశ్యం ఆయన ముఖం పై కనిపిస్తుందని చూశారు. సంతోషానికి బదులు దుఃఖ ఛాయలు ఆయన ముఖంపై కనిపించాయి. ఆయన కళ్లలో నీళ్లు చిప్పిల్లడం, పగిలిన హృదయం లోతుల్నుంచి వెల్లుబుకుతున్న బాధ వణకుతున్న ఆయన పెదవుల పై కదలడం - ఈ దృశ్యం వారిని దిగ్ర్భాంతపర్చింది, నిరాశపర్చింది. దేవదూతలు చూడడానికి ఇది ఎలాంటి దృశ్యం! వారి ప్రియతమ సేనాధిపతి బాధతో కన్నీళ్లు కార్చడం! విజయ నినాదాలు చేస్తూ, మట్టలు ఊపుతూ ఆయన ఎక్కడ నుంచి పరిపాలిస్తాడని వారు నిరీక్షిస్తున్నారో ఆ మహిమాన్విత పట్టణానికి, ఆయన వెంటవస్తున్న ఉత్సాహపూరిత జనసమూహానికి ఇది ఎలాంటి దృశ్యం! యేసు లాజరు సమాధివద్ద ఏడ్డాడు. అది మానవ దుస్థితి నిమిత్తం సానుభూతితో దేవుడు పొందే సంతాపం లాంటి సంతాపం. కాని ఈ ఆకస్మిక దుఃఖం గొప్ప విజయ గీతంలో సంతాప స్వరం లాంటిది. అందరూ ఆయనకు నివాళులర్పిస్తున్న ఉత్సాహానందాల దృశ్యం మధ్య ఇశ్రాయేలు రాజు కన్నీళ్ళు కార్చుతున్నాడు. అవి నిశ్శబ్దంగా కారే ఆనందభాష్పాలు కావు. అవి తీవ్ర బాధవలన కలిగిన, ఆగని కన్నీళ్ళు. జన సమూహంలో హఠాత్తుగా వ్యాకులత చోటుచేసుకుంది. వారి ఉద్రేకం చల్లబడిపోయింది. అనేకులు తమకు తెలియని దుఃఖంతో సానుభూతి చూపుతూ దుఃఖించారు. DATel 639.1

యేసు కన్నీళ్లు రానున్న తన శ్రమల గురించి కాదు. ఆయన ముందు గెత్సేమనే ఉంది. అక్కడ ఆయన్ని భయంకరమైన చీకటి కమ్మనుంది. శతబ్దాలుగా బలి అర్పణలకు బలిపశువులు ఏ గుమ్మంగుండా తోలుకొని వస్తున్నారో ఆ గొర్రెల గుమ్మం కూడా ఆయనకు కనిపిస్తోంది. ఈ గుమ్మాన్ని త్వరలో తన కోసం తెరవనున్నారు. లోక పాపాల నిమిత్తం ఎవరి బలిని ఈ అర్పణలు సూచిస్తున్నాయో వాటి తాలూకు అసలు తానే, దగ్గరలోనే కల్వరి ఉంది. అదే తనకు రానున్న శ్రమలు వేదనకు వేదిక. అయినా రక్షకుడు కన్నీళ్లు కార్చుతూ ఆత్మక్షోభననుభవిస్తోంది తన క్రూరమరణాన్ని గుర్తుచేస్తోన్న వీటిని చూసికాదు. ఆయన దుఃఖం తనను గురించి కాదు. తన సొంత శ్రమలు హృదయవేదన ఉదాత్తుడు, ఆత్మత్యాగశీలి అయిన ఆ మహాత్ముడికి భయం పుట్టించలేదు. యెరూషలేము దృశ్యం యేసు హృదయాన్ని చీల్చింది. అది దేవుని కుమారుణ్ని విసర్జించి ఆయన ప్రేమను తృణీకరించిన యెరూషలేము, తన మహత్తరమైన సూచక క్రియల్ని సయితం నమ్మని యెరుషలేము, తన ప్రాణాన్ని బలిగొనడానికి సిద్ధంగా ఉన్న యెరూషలేము, తన విమోచకణ్ని విసర్జించిన అపరాధంలో దాని గతి ఏంటో ఆయన చూశాడు. తన గాయాలు మాన్పగల రక్షకుడైన తనను అది స్వీకరించి ఉంటే దాని స్థితి ఎలాగుండునో కూడా ఆయన చూశాడు. ఆయన దాన్ని రక్షించడానికి వచ్చాడు. దాన్ని ఎలా విడిచిపెట్టగలడు? DATel 640.1

ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రాపకం గల ప్రజలు. వారి దేవాలయాన్ని ఆయన తన నివాస స్థలం చేసుకున్నాడు. అది “రమ్యమైన యెత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది.” కీర్త 48:2. తండ్రి తన ఒకే ఒక బిడ్డను ఎలా మోస్తాడో అలాగే క్రీస్తు వెయ్యిసంవత్సరాలికి పైచిలుకు దాన్ని కాపాడూ ప్రేమిస్తూ వచ్చిన చరిత్ర దానికి ఉంది. ఆ ఆలయంలో ప్రవక్తలు తమ గంభీర హెచ్చరికల్ని ఉచ్చరించారు. అక్కడ ఆరాధకుల ప్రార్ధనలు ధూపంతో కలిసి దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు నిప్పులతో మండుతున్న ధూపారుల్ని ఊపేవారు. క్రీస్తు రక్తాన్ని సూచిస్తూ అక్కడ జంతువుల రక్తం ప్రవహించింది. అక్కడ కృపాసనం మీద యెహోవా మహిమ ప్రదర్శితమయ్యింది. అక్కడ యాజకులు పరిచర్య చేశారు. గుర్తులు ఆచారాల అడంబరం యుగాలు తరబడి సాగింది. అయితే ఇప్పుడు దీనంతటికి అంతం రానుంది. DATel 640.2

యేసు చెయ్యి పైకెత్తి - తరచు వ్యాధి గ్రస్తుల్ని బాధపడున్న వారిని దీవించిన చెయ్యి - నాశనం కానున్న ఆపట్టణంకేసి దాన్ని ఊపుతూ, దుః ఖంతో గొంతు పెగలక మధ్య మధ్య ఆగుతూ ఇలా అన్నాడు: “నీవును ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులను తెలిసికొనిన యెడల నీకెంతోమేలు” అని రక్షకుడు ఆగి, దేవుడిస్తున్న సహాయాన్ని అనగా తనకు వరంగా వచ్చిన యేసుని యెరూషలేము అంగీకరించి ఉంటే దాని పరిస్థితి ఎలా ఉండునో చెప్పకుండా విడిచి పెట్టాడు. తాను తెలుసుకోవలసిందాన్ని యెరుషలేము తెలుసుకుని, దేవుడు తనకు పంపిన వెలుగును అనుసరించి ఉంటే అది వృద్ధిచెంది ప్రపంచ రాజ్యాలన్నిటికి రాణి అయి దేవుడిచ్చిన శక్తితో వర్ధిల్లేది. సాయుధులైన సైనికులు దాని గుమ్మాల వద్ద నిలిచి ఉండేవారు కాదు. రోమా ప్రభుత్వపు జెండాలు దాని గోడల మీద రెపరెపలాడేవికావు. యెరుషలేము రక్షకుణ్ని అంగీకరించి ఉంటే దానికి ఉండే ఉజ్వల భావి దైవకుమారుని కళ్లముందు కదిలింది. ఆ పట్టణం తన రుగ్మతను తన ద్వారా బాగుపర్చుకోగలిగేదని చూశాడు. తన దాస్యాన్ని వదిలించుకుని లోకంలో మిక్కిలి శక్తిమంతమైన మహానగరంగా తన్ను తాను స్థాపించుకోగలిగేదని చూశాడు. దాని గోడలపై నుంచి శాంతి పావురాలు అన్ని జాతులకు ఎగిరివెళ్ళేవి. అది లోకానికి మహిమ విరజిమ్మే వజ్రకిరీటంగా ఉండేది. DATel 641.1

యెరూషలేము ఏమై ఉండగలిగేదో అన్న ఉజ్వల చిత్రం రక్షకుని దృష్టి నుంచి మాయమయి ఇప్పుడు రోమా కాడికింద దేవుని ఆగ్రహానికి ఆయన భయంకర తీర్పులకు ఆ పట్టణం ఎలా గురిఅయి ఉన్నదో గుర్తించాడు. తనే విలాపాన్ని మళ్లీ చేపట్టి ఇలా కొనసాగించాడు, “గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగుపడియున్నవి. (ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టుకట్టి ముట్టడి వేసి, అన్ని ప్రక్కలకు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి నీలో రాయిమీద రాయి నిలిచియుండనియ్యని దినములు వచ్చుచున్నవి.” DATel 641.2

యెరూషలేమును తన పిల్లలతో పాటు రక్షించాలని క్రీస్తు వచ్చాడు. అయితే పరిసయ్యుల అతిశయం, వేషధారణ, ద్వేషం, దుర్బుద్ధి ఆయన కార్యసాధనకు ప్రతిబంధకాలయ్యాయి. నాశనం దిశగా పరుగెత్తుతున్న ఆ పట్టణం మీదికి రానున్న భయంకర తీర్పు ఏంటో యేసుకు తెలుసు. యెరుషలేము ముట్టడికి గురికావడం, ఆ పట్టణ ప్రజలు ఆకలితో మరణించడం, తల్లులు తమ బిడ్డల మృతదేహాలపై పడి వాటిని భుజించడం, తల్లిదండ్రులు పిల్లలు చివరి అన్నం ముద్ద ఒకరి చేతుల్లోనుంచి ఒకరు లాగుకోడానికి ప్రయత్నించడం, ఆకలిబాధ స్వాభావిక ప్రేమను నాశనం చెయ్యడం ఆయన చూశాడు. రక్షణను విసర్జించడంలో ప్రదర్శితమైన యూదుల మొండితనం దాడి జరుపుతున్న సైన్యాలకు లొంగుబాటుకి నిరాకరించడానికి దారి తియ్యడం చూశాడు. తాను పొందవలసి ఉన్న సిలువను, కల్వరిపై అడవి చెట్లలా దగ్గరదగ్గరగా ఏర్పాటయిన సిలువల్ని చూశాడు. అభాగ్యులైన ఆ పట్టణ నివాసులు హింసాయంత్రాల మీద చిత్రహింస అనుభవించడం, సిలువ మరణాలు పొందడం, సుందరరాజ భవనాలు ధ్వంసం కావడం, దేవాలయం శిధిలాలుగా మిగలడం, దాని బ్రహాండమైన గోడల రాళ్లు ఒక దానిమీద ఒకటి నిలువకపోవడం, యెరూషలేము పట్టణం పంటపొలంలా దున్నబడి ఉండడం ఆయన చూశాడు. ఆ భయంకర దృశ్యం చూస్తూ రక్షకుడు హృదయ వేదనతో కన్నీరు కార్చడం జరిగి ఉంటుంది. DATel 641.3

యెరుషలేము ఆయన బిడ్డలాంటిది. ప్రేమ గల తండ్రి ఆవిధేయుడైన కుమారుణ్ని గూర్చి దుఃఖించే రీతిగా యేసు తనకు ప్రియమైన ఆ పట్టణం గురించి దుఃఖించాడు. నేను నిన్ను ఎలా విడిచిపెట్టగలను? నువ్వు నాశనానికి సిద్ధమౌతుంటే ఎలా చూడగలను? నువ్వు నీ అపరాధ పాత్రను నింపుకుంటుంటే నేను అది చెయ్యనివ్వాలా? ఒక్క ఆత్మ విలువ చాలా గొప్పది. దానితో పోల్చితే లోకాలు కొరగానివవుతాయి. అయితే ఇక్కడ ఒక జాతికి జాతే నశించిపోనుంది. వేగంగా పడమరకు దిగిపోతున్న సూర్యుడు అస్తమిస్తే యెరుషలేముకి కృపకాలం అంతమౌతుంది. ఊరేగింపు జనం ఒలీవల కొండ మీద నిలిచి ఉంటుండగా యెరుషలేము మారుమనసు పొందడానికి సమయం మించిపోలేదు. న్యాయానికి, త్వరిత గతిని వస్తున్న తీర్పుకి అవకాశం ఉండేందుకు కృపాదూత, అప్పుడే తన రెక్కల్ని ముడుచుకుని బంగరు సింహాసనం నుంచి కిందకు దిగాడు. కాని ఆయన కృపను అవహేళన చేసి, ఆయన హెచ్చరికల్ని తృణీకరించి, ఆయన రక్తంతో తన చేతులు కడుగుకోబోతున్న యెరుషలేము కోసం గొప్ప ప్రేమగల క్రీస్తు మనసు ఇంకా విజ్ఞాపన చేస్తోంది. యెరుషలేము పశ్చాత్తాపం పొందడానికి సమ్మతిస్తే, సమయం ఇంకా మించిపోలేదు. అస్తమిస్తోన్న సూర్యుడి కిరణాలు ఆలయం మీద, గోపురం మీద, గుడి శిఖరం మీద ఇంకా ప్రకాశిస్తోండగా ఒక మంచి దేవదూత రక్షకుని ప్రేమను అంగీకరించడానికి దాన్ని నడిపించి దాని నాశనాన్ని తప్పించడా? అందమైన పట్టణం, ప్రవక్తల్ని రాళ్లతో కొట్టిన, దేవుని కుమారుణ్ని నిరాకరించిన, పశ్చాత్తాపం లేని తన హృదయం వల్ల దాస్య శృంఖలాలు తగిలించుకుంటున్న దుర్మార్గ పట్టణం - దాని కృపాదినం దాదాపు గతించిపోయింది! DATel 642.1

అయినా దేవుని ఆత్మ మళ్లీ యెరుషలేముతో విజ్ఞాపన చేశాడు. దినం గతించకముందు క్రీస్తుకి ఇంకో సాక్ష్యం వచ్చింది. గత ప్రవచనాల పిలుపుకు ప్రతిస్పందిస్తూ సాక్ష్యస్వరాన్ని వినిపించడం జరిగింది. యెరూషలేము ఆ పిలుపును వింటే తన గుమ్మాల్లో నుంచి ప్రవేశిస్తోన్న రక్షకుణ్ని అంగీకరిస్తే అది రక్షణ పొందడానికి ఇంకా అవకాశం ఉంది. DATel 643.1

యేసు గొప్పజన సమూహంతో యెరూషలేము పట్టణాన్ని సమిపిస్తున్నాడన్న సమాచారం అధికారులికి అందింది. వారు దేవుని కుమారుణ్ని స్వాగతించలేదు. భయంతో ఆయన్ని కలుసుకోడానికి వెళ్ళారు. జన సమూహాల్ని చెదరగొట్టాలన్న ఉద్దేశంతో వెళ్ళారు. ఊరేగింపు ఒలీవల కొండ దిగడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అధికారులు దాన్ని అడ్డగించారు. వారి సందడికి సంతోషానందానికి హేతువేంటని ప్రశ్నించారు. “ఈయన ఎవరు?” అని వారు అడుగగా, ఆత్మావేశం పొందిన శిష్యులు దీనికి సమాధానం చెప్పారు. క్రీస్తును గురించిన ప్రవచనాల్ని తడుము కోకుండా వల్లించారు. DATel 643.2

ఆదాము మీకు చెబుతాడు ఆయన సర్పంతల చితకకొట్టే స్త్రీ సంతానం అని. DATel 643.3

అబ్రహాము నడిగితే అతడు చెబుతాడు ఆయన “షాలేము రాజైన మెల్కీసెదెకు” అని. ఆది 14:18. DATel 643.4

యాకోబు మీకు చెబుతాడు ఆయన యూదా గోత్రపు షిలోహు అని. DATel 643.5

యెషయా మీకు చెబుతాడు ఆయన “ఇమ్మానుయేలు” ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి” అని. యెష 7:14; 9:6. DATel 643.6

యిర్మీయా మీకు చెబుతాడు ఆయన దావీదు చిగురు, “యెహోవా మనకు నీతి” అని. యిర్మీ 23:6. DATel 644.1

దానియేలు మీకు చెబుతాడు ఆయన మెస్సీయా అని DATel 644.2

హో షేయ మీకు చెబుతాడు ఆయన “సైన్యముల కధిపతియగు యెహోవా” అని. హోషే 12:5 DATel 644.3

బాప్తిస్మమిచ్చే యోహాను మీకు చెబుతాడు ఆయన “లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొట్టె పిల్ల” అని. యోహా 1:29. DATel 644.4

యెహోవా తన సింహాసనం నుంచి ఇలా ప్రకటించాడు, “ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు” మత్త 3:17. DATel 644.5

ఆయన శిష్యులమైన మేము ప్రకటిస్తున్నాము ఈయన యేసు, మెస్సీయా, సమాధాన కర్త, లోక రక్షకుడు అని. DATel 644.6

“నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్ధుడవు” (మార్కు 1:24) అంటూ చీకటి శక్తుల రాజు ఆయన గురించి ఒప్పుకున్నాడు. DATel 644.7