యుగయుగాల ఆకాంక్ష

62/88

61—జక్కయ్య

యెరుషలేముకు వెళ్తూ యేసు “యెరికో పట్టణములో ప్రవేశించి దానిగుండా పోవుచుండెను.” యోర్దాను నుంచి కొన్ని మైళ్ళ దూరంలో మైదానంగా విస్తరించి ఉన్న లోయ పశ్చిమ అంచున సుందరమైన పచ్చని ఉష్ణమండల వృక్షజాలం నడుమ ఆ పట్టణముంది. ఖర్జూర చెట్లు, నిత్యం నీటి సరఫరా గల చక్కని ఉద్యానవనాలతో, సున్నపు రాతి కొండల నడుమ అస్తమించే సూర్యుడికాంతిలో, యెరుషలేముకి ఆమైదాన పట్టణానికి మధ్య ఉన్న రాతి బండల నడుమ ప్రవాహాలతో మరకతంలా ప్రకాశిస్తోంది ఆ పట్టణం . DATel 612.1

పండుగకు వెళ్లే యాత్రిక బృందాలు యెరికో గుండా వెళ్ళాలి. వారి రాక ఎప్పుడూ పండుగ కాలమే. కాని ఇప్పుడు ప్రజల్లో విశేషాసక్తి చోటు చేసుకుంది. లాజరుని లేపిన గలిలయ బోధకుడు ఆ బృందంలో ఉన్నాడని ప్రజలికి తెలిసింది. యాజకుల కుట్రల గురించి పుకార్లు వినిపిస్తోన్నప్పటికీ ఆయనకు నివాళులర్పించడానికి ప్రజలు ఉత్సాహంతో ఉన్నారు. DATel 612.2

పూర్వం యాజకులకు ప్రత్యేకంగా ఏర్పాటైన పట్టణాలలో యెరికో ఒకటి. ఈ కాలంలో అనేకమంది యాజకులు అక్కడ నివసించేవారు. ఆ పట్టణ జనాభా కూడా చాలా వ్యత్యాసమైనది. అది గొప్ప యాత్రిక కేంద్రం. రోమా అధికారులు సైనికులు, ఆయా ప్రాంతాలకు చెందిన ఇతరులు అక్కడున్నారు. సుంకం వసూలు కారణంగా అది అనేకమంది సుంకరులికి ఉనికి పట్టయ్యింది. “సుంకపుగుత్త దారుడు” జక్కయ్య యూదుడు. ఆ రాజ్య ప్రజలు అతణ్ని ద్వేషించారు. అతడి హోదా, అతడి ధనం అతడి వృత్తిని బట్టి కలిగినవే. ఆ వృత్తిని ప్రజలు ద్వేషించారు. అది అన్యాయానికి అక్రమానికి మారుపేరని ప్రజలు నమ్మారు. అయినా భాగ్యవంతుడైన ఈ సుంకపు అధికారి పైకి కనిపించినంత కఠినమైన హృదయం గల వ్యక్తికాడు. లౌకికత, గర్వం ఆకారం కింద దైవ ప్రభావానికి ప్రతిస్పందించే హృదయం ఉంది. జక్కయ్య క్రీస్తుని గురించి విన్నాడు. నిషిద్ధ తరగతులవారి పట్ల ఆయన దయ మర్యాదలతో మెలగుతున్నాడన్న వార్త అంతటా తెలిసింది. మెరుగైన జీవితం జీవించాలన్న కోరక ఈ సుంకపు అధికారిలో పుట్టింది. యెరికో నుంచి కొన్ని మైళ్ళ దూరంలో బాప్తిస్మమిచ్చే యోహాను యోర్దాను ప్రాంతంలో బోధిస్తోన్నాడు. పశ్చాత్తాపపడడంటూ ప్రజలికి అతడు చేసిన విజ్ఞాపను జక్కయ్య విన్నాడు. “నాకు నిర్ణయించిన దానికంటే ఎక్కువ తీసికొనవద్దు” (లూకా 3:13) అని సుంకరులకు వచ్చిన ఉపదేశం - లక్ష్యపెట్టనట్లు పైకి కనిపించినా - అతడి మనసును ఆకట్టుకుంది. అతడికి లేఖనాలు తెలుసు. తాను చేస్తున్నపనీ తప్పు అని గుర్తించాడు. మహోపాధ్యాయుడు యేసు చెప్పిన మాటలుగా నివేదించిన మాటలు విన్నప్పుడు, దేవుని దృష్టిలో తాను పాపినని భావించాడు. క్రీస్తును గురించి తాను విన్న విషయాలు అతడి హృదయంలో నిరీక్షణను రగిలించాయి. పశ్చాత్తాపం, జీవితంలో దిద్దుబాటు తనకు కూడా సాధ్యమే. ఈ నూతన బోధకుని మిక్కిలి విశ్వసనీయ శిష్యుల్లో ఒకడు సుంకరికాడా? తాను నమ్మిన విషయాల్ని అనుసరించడానికి జక్కయ్య వెంటనే పూనుకున్నాడు. తాను అన్యాయంగా తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వడానికి పూనుకున్నాడు. DATel 612.3

ఇప్పటికే అతడు తన మార్గాల్ని సరిచేసుకోడానికి చర్య చేపట్టడం ప్రారంభించాడు. ఆ సమయంలో యేసు ఆ పట్టణంలో ప్రవేశిస్తోననట్లు పట్టణమంతా తెలిసింది. ఆయన్ని చూడాలని జక్కయ్య బహుగా ఆశించాడు. పాప పర్యవసానాలు ఎంత తీవ్రమైనవో, పాపమార్గంలో సాగుతున్న వ్యక్తి దాని నుంచి తిరిగివచ్చే మార్గం ఎంత కష్టమయ్యిందో అతడు గ్రహించ నారంభించాడు. తన దోషాల్ని దిద్దుకునే ప్రయత్నంలో అపార్ధానికి, అనుమానానికి, అవిశ్వాసానికి గురికావడాన్ని భరించడం కష్టమయ్యింది. ఎవరి మాటలు తన హృదయంలో నిరీక్షణను రగిలించాయో ఆయన్ని చూడాలని ఈ ప్రధాన సుంకరి ఆకాంక్షించాడు. DATel 613.1

వీధులు ప్రజలతో కిటకిటలాడున్నాయి. జక్కయ్య పొట్టివాడవ్వడంతో జనం మధ్య నిలబడి చూస్తుంటే ఏమి కనబడడంలేదు. అతడికి ఎవరూ చోటు పెట్టడం లేదు. కనుక జనాలకన్నా కాస్త ముందుకు పరుగెత్తి దారి పక్క ఒక పెద్ద అత్తి చెట్టు ఉంటే అది ఎక్కి ఒక కొమ్మ మీద కూర్చుని దాని కిందకు వస్తున్న జన సమూహాన్ని పరిశీలిస్తోన్నాడు. జన సమూహం ఆ చెట్టుకిందకి వచ్చి ముందుకి సాగిపోతుంది. జక్కయ్య తాను చూడాలని ఆశిస్తోన్న ప్రభువు ఎవరా అని దీక్షగా చూస్తోన్నాడు. DATel 614.1

యాజకులు రబ్బీల కేకల నడుమ జన సమూహాల స్వాగత నినాదాల నడుమ ఆ ప్రధాన సుంకరి మనసులోని కోరిక యేసు హృదయంతో మాట్లాడింది. అర్ధంతరంగా, ఆ అత్తిచెట్టుకింద జన సమూహం ఆగింది. ఆయన ముందు నడుస్తోన్న గుంపు వెనుక వస్తోన్న గుంపు రెండూ ఆగిపోయాయి. ఒకాయన పైకి చూశాడు. ఆయన చూపు అతడి ఆత్మను చదివినట్లు కనిపించింది. తన కళ్ళను చెవులను నమ్మలేకపోతున్న పైనున్న ఆ వ్యక్తి, “జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీయింట నుండవలసియున్నది.” అన్న మాటలు విన్నాడు. DATel 614.2

జన సమూహం అతడికి దారిచ్చింది. జక్కయ్య కలలో నడుస్తున్నట్లు ముందు నడుస్తున్న వారిని తన ఇంటి దిశగా నడిపించాడు. కాగా రబ్బీలు కొరకొర చూస్తూ, ధిక్కారంతో “ఈయన పాపియైన మనుష్యుని యొద్ద బసచేయవెళ్ళెను” అని గొణుగుకున్నారు. DATel 614.3

జక్కయ్య ఆనందపరవశుడయ్యాడు. అయోగ్యుడైన తన పట్ల క్రీస్తు తన్ను తాను తగ్గించుకుని చూపించిన ప్రేమకు విస్మయం చెందాడు. అవాక్కయ్యాడు. ఇప్పుడు తాను కొత్తగా కనుగొన్న ప్రభువు పట్ల ప్రేమ వలన భక్తి వలన పెదవి విప్పాడు. తన ఒప్పుకోలుని పశ్చాత్తాపాన్ని బహిరంగంగా ప్రకటించాడు. DATel 614.4

జనసమూహం సమక్షంలో, “జక్కయ్య నిలువబడి - ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను, నే నెవనియొద్దనైనను అన్యాయముగా నేదైనను తీసికొనిన యెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను.” DATel 614.5

అందుకు యేసు- “ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది.” DATel 615.1

ధనికుడు యువకుడు అయిన అధికారి యేసును విసర్జించి వెళ్లిపోయినప్పుడు తమ ప్రభువు “ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము” అన్నమాటలికి శిష్యులు విస్మయం చెందారు. “అట్లయితే ఎవడు రక్షణ పొందగలడు?” అని వారు ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. “మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు” అని క్రీస్తు అన్నమాటల్లోని నిజాన్ని ఇప్పుడు వారు కళ్లారా చూశారు. మార్కు 10:24, 26, లూకా 18:27. దేవుని కృప ద్వారా ఒక ధనికుడు దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించగలడో వారు చూశారు. DATel 615.2

యేసు ముఖాన్ని చూడకముందే జక్కయ్య నిజంగా మారుమనసు పొందిన వ్యక్తిని సూచించే పనిని ప్రారంభించాడు. మానవుడి నిందారోపణ జరగకముందే అతడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అతడు పరిశుద్ధాత్మ ప్రేరణకు విధేయుడయ్యాడు. పూర్వం ఇశ్రాయేలీయు లి కోసం ఇప్పుడు మన కోసం లిఖితమై ఉన్న బోధనల్ని ఆచరించడం మొదలు పెట్టాడు. చాలా కాలం క్రితం ప్రభువిలా అన్నాడు, “నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీయొద్దకు వచ్చిన యెడల నీవు వానికి సహాయము చేయవలెను. అతడు నీ వలన బ్రతుకవలెను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డినైనను తీసికొనకూడదు. నీ సహోదరుడు నీవలన బ్రతుకవలెను. నీరూకలు వానికి వడ్డికియ్యకూడదు. నీ ఆహారమును వానికి లాభమున కియ్యకూడదు.” “మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను.” లేవీ 25: 35-37, 17. మేఘస్తంభంలో ఉన్నప్పుడు క్రీస్తు పలికినమాటలివి. క్రీస్తు ప్రేమకు జక్కయ్య ప్రప్రధమ ప్రతిస్పందన, బీదలు బాధితులపట్ల కనికరం ప్రదర్శించడం. DATel 615.3

సుంకరుల మధ్య ఒక కూటమి ఉండేది. వారు ప్రజల్ని బాధించి తమ మోసపూరిత కార్యకలాపాల్లో పరస్పరం సమర్ధించుకోడానికి దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. తమ అక్రమ వసూళ్లకి వారు దేశవ్యాప్తమైన ఒక ఆచారాన్ని అనుసరించారు. వారిని ద్వేషించే యాజకులు రబ్బీలు సయితం తమ పరిశుద్ధహోదా ముసుగుకింద అక్రమ సంపాదనకు పాల్పడున్నారు. కాగా జక్కయ్య తన్ను తాను పరిశుద్దాత్మ ప్రభావానికి అప్పగించుకున్న వెంటనే ప్రతీ దురాచారాన్ని విసర్జించాడు. DATel 615.4

దిద్దుబాటు కలిగించని పశ్చాత్తాపం నిజమయ్యింది కాదు. ఒప్పుకోని, క్షమాపణ పొందని పాపాన్ని కప్పిపుచ్చే వస్త్రంకాదు క్రీస్తు నీతి. అది ప్రవర్తనను మార్చివేసి, నడవడిని నియంత్రించే సూత్రం. దేవుని కొరకు సమగ్రతే పరిశుద్ధత. అది అంతర్గతంగా ఉండే పారలౌకిక నియమాలికి హృదయాన్ని పూర్తిగా అంకితం చేసుకుని జీవించే జీవితం. DATel 616.1

తన వ్యాపార జీవితంలో క్రైస్తవుడు మన ప్రభువు వ్యాపార విషయాల్ని నిర్వహించే తీరును ప్రపంచానికి ప్రదర్శించాలి. ప్రతీలావాదేవీల్లోను దేవుడు తన గురువని ప్రదర్శించాలి. “యెహోవాకు ప్రతిష్ఠితము” అని దినవారి పుస్తకాల మీద, లెడ్జరు పుస్తకాల మీద, దస్తావేజు సద, రసీదుల మీద, ఎక్స్ చేంజ్ బిల్లులపై రాయాలి. క్రీస్తు అనుచరులమని చెప్పుకుంటూ నీతివంతంగా వ్యవహరించనివారు, పరిశుద్దుడు, న్యాయవంతుడు, దయామయుడు అయిన దేవుని ప్రవర్తనకు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. జక్కయ్యమల్లే మారుమనసు పొందిన ప్రతీవ్యక్తి తన జీవితంలో చోటుచేసుకున్న దురాచారాలను విడిచి పెట్టడం ద్వారా తన హృదయంలో క్రీస్తు ప్రవేశాన్ని సూచిస్తాడు. ఆ ప్రధాన సుంకరిమలై తిరిగి చెల్లించడం ద్వారా తన చిత్తశుద్ధికి నిదర్శనాన్నిస్తాడు. ప్రభువిలా అంటున్నాడు, “కుదువసొమ్మును మరల అప్పగించుచు, తాను దొంగిలిన వాటిని మరల ఇచ్చివేసి పాపము జరిగింపక యుండి, జీవాధారము గల కట్టడలను, అనుసరించిన యెడల.... అతడు చేసిన పాపములలో ఏవియు అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు.... నిశ్చయముగా అతడు బ్రదుకును.” యెహె 33:15, 16. DATel 616.2

అక్రమ వ్యాపార లావాదేవీల ద్వారా మనం ఎవరికన్నా హానికలిగిస్తే, వాణిజ్యంలో దొంగదెబ్బ కొడితే లేదా ఎవరినైనా మోసం చేస్తే అది చట్టపరిధిలో ఉన్నప్పటికీ, మనం మన తప్పిదాన్ని ఒప్పుకుని మన శక్తిమేరకు నష్టపరిహారం చెల్లించాలి. మనం తీసుకున్నది మాత్రమేగాక, అది మన వద్ద ఉన్నకాలంలో సరిగా వినియుక్తమై ఉన్నట్లయితే ఎంత మొత్తం అయ్యేదో అది చెల్లించడం న్యాయం. DATel 616.3

జక్కయ్యతో రక్షకుడిలా అన్నాడు, “నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది. ” జక్కయ్య ఒక్కడే కాదు అతడి ఇంటివారందరూ అతడితోపాటు దీవెనలు పొందారు. క్రీస్తు అతడి ఇంటికి వెళ్లాడు. అతడికి సత్యం బోధించడానికి. రబ్బీలు, ఆరాధకులు వారికి సమాజమందిరంలో ప్రవేశాన్నివ్వలేదు. అయితే ఇప్పుడు యెరికో అంతటి లోను మిక్కిలి ధన్య కుటుంబంగా తమ గృహంలోనే పరమగురువు యేసు చుట్టూ చేరి ఆయన పలికిన జీవపు మాటల్ని స్వయంగా విన్నాడు. DATel 617.1

క్రీస్తుని వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించినప్పుడే ఆత్మకు రక్షణ వస్తుంది. జక్కయ్య యేసుని అంగీకరించాడు - తన గృహంలోకి తాత్కాలిక అతిథిగానే కాదు కాని ఆత్మాలయంలో నివసించే ప్రభువుగారి కూడా. శాస్త్రులు పరిసయ్యులు అతణ్ని పాపి అని నిందించారు. అతడి అతిథిగా అతనితో వెళ్లినందుకు క్రీస్తు మీద సణుగుకున్నారు. కాని ప్రభువు అతణ్ని అబ్రహాము కుమారుడిగా గుర్తించాడు. “కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు.” గల 3:7. DATel 617.2