యుగయుగాల ఆకాంక్ష

45/88

44—యథార్ధ చిహ్నం

“ఆయన మరల తూరుపాంతములు విడిచి, సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను.” మార్కు 7:31. DATel 445.1

దెకపొలి ప్రాంతంలోనే దయ్యం పట్టిన గదరేనీయుల్ని యేసు బాగుచేశాడు. పందుల మంద నాశనానికి ఆందోళన చెంది తమను విడిచి వెళ్లిపొమ్మని యేసుని కోరింది ఇక్కడ ప్రజలే. కాగా ఆయన విడిచి వెళ్లిన సేవకుల బోధను వారు విన్నారు. కనుక యేసుని చూడాలన్న కోరిక వారిలో పుట్టింది. ఆయన మళ్లీ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన చుట్టూ ప్రజలు మూగారు. ఆయన వద్దకు సరిగా మాట్లాడలేని ఓ చెవిటివాణ్ని ప్రజలు తీసుకువచ్చారు.. యేసు తన అలవాటు ప్రకారం కేవలం మాటతోనే అతణ్ని స్వస్తపర్చలేదు. జనసమూహం నుంచి అతణ్ని పక్కకు తీసుకు వెళ్లి తన వేళ్లు అతడి చెవులో పెట్టి అతడి నాలుకను ముట్టుకున్నాడు. ఆకాశంకేసి చూస్తూ సత్యాన్ని విననొల్లని చెవులు రక్షకుణ్ని గుర్తించడానికి నిరాకరించే నాలుకల్ని గూర్చిన తలంపువచ్చి ఆయన నిట్టూర్చాడు. “తెరవబడుము” అని ఆయన అనగా అతడి నాలుక సరళమై అతడు మాటలాడగలిగాడు. ఎవరికీ ఆ విషయం చెప్పవద్దన్న ఆయన ఆదేశాన్ని లెక్కచెయ్యకుండా అతడు తాను పొందిన స్వస్తతను గూర్చి ప్రచురించడం మొదలు పెట్టాడు. DATel 445.2

యేసు ఓ పర్వతం మీదికి వెళ్లగా జనులు అక్కడ గుమిగూడారు. వ్యాధిగ్రస్తుల్ని కుంటివారిని తీసుకువచ్చి ఆయన పాదాల వద్ద ఉంచారు. వారందరినీ ఆయన స్వస్తపర్చాడు. అన్యులైన ఆ జనులందరూ ఇశ్రాయేలు దేవుణ్ని మహిమపర్చారు. మూడుదినాలు ఏకధాటిగా వారు రక్షకునితో ఉన్నారు. రాత్రి ఆరుబయట నిద్రపోయారు. పగటివేళ క్రీస్తు మాటలు వినడానికి ఆయన అద్భుతకార్యాలు వీక్షించడానికి ఆశగా ఆయన చుట్టూ మూగారు. మూడు రోజులయ్యాక వారు తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. వారిని ఆకలితో పంపివెయ్యడం యేసుకి ససేమిరా ఇష్టం లేదు. శిష్యుల్ని వారికి భోజనం పెట్టాల్సిందిగా ఆదేశించాడు. శిష్యులు మళ్లీ తమ అవిశ్వాన్ని కనపర్చుకున్నారు. క్రీస్తు దీవించిన మీదట వారి వద్ద ఉన్న కొద్ది ఆహారం పెద్ద జనసమూహం సమృద్ధిగా భుజించడం బేత్సయిదాలో చూశారు. అయినా ప్రజల ఆకలి తీర్చడానికి తమ వద్ద ఉన్నదాన్ని ఆయన వృద్ధి చేయగలడని విశ్వసించి తమకున్నదంతా తేలేదు. అదీగాక బేత్సయిదాలో ఆయన ఆహారం పెట్టింది యూదులికి. ఇక్కడున్న వారు అన్యజనులు అన్యవిశ్వాసులు. శిష్యుల హృదయాల్లో యూదీయ దురభిమానం ఇంకా బలంగా ఉంది. అందునుబట్టి యేసుకి వారిలా సమాధానం చెప్పారు, “ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్యప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చును?” అయితే ఆయన మాటకు విధేయులై వారు తమ వద్ద ఉన్నది తెచ్చారు. అది ఏడు రొట్టెలు, రెండు చేపలు. జనసమూహానికి ఆహారం పెట్టారు. ఏడు గంపలు రొట్టెముక్కలు మిగిలిపోయాయి. స్త్రీలు పిల్లలు గాక నాలుగు వేలమంది భోంచేసి తృప్తి చెందారు. యేసు వారిని ఆనందోత్సాహలతో తమ గృహాలికి పంపించాడు. DATel 445.3

అనంతరం శిష్యులతో కలిసి నావ ఎక్కి గెన్నేసంతు మైదానం దక్షిణ కొననున్న మగదాను సరస్సు దాటాడు. తూరు సీదోనుల సరిహద్దులో సురో ఫెనికయ స్త్రీ కనపర్చిన విశ్వాసం వల్ల ఆయన అలసట తీరింది. అన్యజనులైన దెకపొలి ప్రజలు ఆయన్ని సంతోషంగా స్వాగతించారు. ఎక్కడ ఆయన శక్తి విశిష్టంగా ప్రదర్శితమయ్యిందో, ఎక్కడ ఆయన కృపాకార్యాలు ఎక్కువ సంఖ్యలో చోటుచేసుకున్నాయో, ఎక్కడ ఆయన ఎక్కువగా బోధించాడో ఎక్కడ ఆయనకి ద్వేషంతో నిండిన అవిశ్వాసం ఎదురయ్యిందో ఆ గలిలయకు ఇప్పుడు ఆయన మరోసారి వచ్చాడు. DATel 446.1

పరిసయ్యుల ప్రతినిధి బృందంలో యాజక పార్టీ అయిన సదూకయ్యుల ప్రతినిధులు, నాస్తికులు, దేశంలోని సంపన్నులు చేరారు. ఆ రెండు వర్గాల మధ్య పచ్చిగడ్డి వేస్తే మండిపోయేది. తమ ప్రాబల్యాన్ని అధికారాన్ని కాపాడుకోడానికి సద్దూకయ్యులు రాజ్యపాలన చేస్తోన్న అధికారుల అభిమానాన్ని పొందడానికి ప్రయత్నించారు. ఇకపోతే పరిసయ్యులు రోమియులికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని ప్రోదిచేశారు. రోమా అధికారాన్ని కూలదోసి స్వతంత్రత సంపాదించే సమయం కోసం ఆశగా కనిపెట్టొన్నారు. ఇప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులు క్రీస్తుకు వ్యతిరేకంగా చేతులు కలిపారు. సారూప్యం సారూప్యాన్ని వెదకుతుంది. దుర్మార్గత ఎక్కడున్నా మంచిని నాశనం చెయ్యడానికి దుష్టితో చెయ్యి కలుపుతుంది. DATel 446.2

ఇప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులు క్రీస్తు వద్దకు వచ్చి ఆకాశం నుంచి ఓ గుర్తుని చూపించమని అడిగారు. యెహోషువా దినాల్లో ఇశ్రాయేలు కనానీయులో బేత్ హోరోను వద్ద యుద్దానికి వెళ్లినప్పుడు యుద్ధంలో విజయం వచ్చేవరకు కదలకుండా ఉండమని నాయకుడు సూర్యుణ్ని ఆజ్ఞాపించగా సూర్యుడు ఆకాశంలో నిలిచిపోయాడు. వారి చరిత్రలో అలాంటి అద్భుతాలెన్నో ప్రదర్శితమయ్యాయి. అలాంటి అద్భుతం ఒకటి చేయమని యేసుని కోరారు. అయితే యూదులికి కావలసింది ఈ సూచనలు కావు. బాహ్యమైన నిదర్శనం ఏదీ వారికి సహాయపడదు. వారి అవసరం మానసిక ఉత్తేజం కాదు; ఆధ్యాత్మిక నవీకరణ, DATel 447.1

“మీరు ఆకాశవైఖరి వివేచింప నెరుగుదురు” - ఆకాశాన్ని పరిశీలించి వారు వాతావరణ పరిస్థితుల్ని ముందుగా వివరించగలిగారు. - “గాని యీ కాలసూచనలను వివేచింపలేరు” అన్నాడు యేసు. పాపస్సృహ కలిగించే పరిశుద్ధాత్మ శక్తి తో క్రీస్తు చెప్పిన మాటలే వారి రక్షణ కోసం దేవుడనుగ్రహించిన సూచన. క్రీస్తు కర్తవ్యాన్ని ధ్రువపర్చడానికి ప్రత్యక్షంగా ఆకాశం నుంచి ప్రదర్శితమయ్యాయి. గొల్లలకి దేవదూతల పాట, జ్ఞానుల్ని నడిపించిన నక్షత్రం, ఆయన బాప్తిస్మమప్పుడు ఆకాశం నుంచి వచ్చిన పావురం, స్వరం - ఇవన్నీ ఆయన్ని గూర్చిన సాక్ష్యాలే? DATel 447.2

“ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి - ఈ తరమవారు ఎందుకు సూచకక్రియ నడుగుచున్నారు?” “అయితే యోనాను గూర్చిన సూచకక్రియయే గాని మరి ఏ సూచకక్రియయైనను వారి కనుగ్రహించబడదు.” యోనా మూడు పగలు, మూడు రాత్రులు తిమింగలం కడుపులో ఉన్నరీతిగా క్రీస్తు కూడా అంతే కాలం “భూగర్భములో” ఉండాల్సి ఉంది. యోనా బోధ నీనెవె పట్టణస్తులికి ఒక గుర్తుగా ఉన్నట్లే క్రీస్తు బోధ ఆయన తరం ప్రజలికి ఒక గుర్తు. ఈ వర్తమానాల స్వీకరణ విషయంలో ఎంత భేదం ఉంది! అన్యులైన ఆపట్టణ జనులు దేవుడు పంపిన హెచ్చరిక విని భయంతో వణికారు. రాజులు, గొప్ప వంశస్తులు దీనమనస్కులయ్యారు. గొప్పవారు కొద్దివారు కలిసి దేవునికి మొర పెట్టుకున్నారు. ఆయన వారిపై కనికరం చూపించాడు. “నీనెవె వారు ఈ తరము వారితో నిలువబడి వారి మిద నేరస్థాపన చేతురు.” “ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.” అన్నాడు క్రీస్తు. మత్త 12:40,41. DATel 447.3

క్రీస్తు చేసిన ప్రతీ అద్భుతం ఆయన దేవత్వాన్ని సూచించే గుర్తు. మెస్సీయా చేస్తాడని ముందే ప్రవచితమైన పరిచర్యను క్రీస్తు నిర్వహించాడు. అయితే పరిసయ్యులికి ఈ కృపాకార్యాలు నేరాలయ్యాయి. సాటి మానవులు బాధపడుంటే యూదునాయకులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉండేవారు. అనేక సందర్భాల్లో వారి స్వార్థ క్రియల్ని వారివల్ల జరిగిన హింసను క్రీస్తు నివారించాడు. ఈ రకంగా ఆయన అద్భుతకార్యాలు వారి దృష్టికి అవమానకరంగా కనిపించేవి. DATel 448.1

యూదులు రక్షకుని సేవను తిరస్కరించడానికి ఏది నడిపించిందో అదే ఆయన దేవత్వానికి అత్యున్నత నిదర్శనం. మానవశ్రేయాన్ని లక్షించి చేసినవే ఆయన సూచక క్రియలన్న దానిలోనే ఉన్నది వాటి అత్యున్నత ప్రధాన్యం. ఆయన దేవుని వద్ద నుంచి వచ్చాడనడానికి ఉత్తమ నిదర్శనం ఆయన జీవితం దేవుని ప్రవర్తనను వెల్లడిచేయడం. ఆయన దేవుని పనులు చేసి దేవుని మాటలు మాట్లాడాడు. అలాంటి జీవితమే అద్భుతాలన్నిటి లోను గొప్ప అద్భుతం. DATel 448.2

ఈ రోజుల్లో సత్యాన్ని ప్రకటించేటప్పుడు అనేక మంది యూదుల్లా ఓ సూచన చూపించమని కోరారు. మాకో సూచకక్రియ చేసి చూపించమంటారు. పరిసయ్యుల కోరిక మేరకు క్రీస్తు సూచకక్రియ చెయ్యలేదు. అరణ్యంలో సాతాను బుజ్జగింపులకు లొంగి అద్భుతాలు చెయ్యలేదు. మనల్ని మనం నిరూపించుకోడానికి లేక అవిశ్వాస, అహంభావ, పూరిత కోరికల్ని తృప్తి పరచడానికి ఆయన మనకు శక్తి నివ్వడు. అయితే సువార్త దైవ సంబంధమైనదనడానికి నిదర్శనం లేకపోలేదు. మనం పాప దాస్యం నుంచి విముక్తి పొందగలగడం ఓ సూచక క్రియకాదా? మానవ హృదయానికి సాతానుతో వైరం స్వాభావికంగా రాదు. దేవుని కృపే దాన్ని మన మనసులో నాటుతుంది. మొండి చిత్తం అదుపులో ఉన్న ఓ వ్యక్తికి స్వేచ్ఛలభించి అతడు దేవుని పరలోక సాధనాల ఆకర్షణకు తన్నుతాను పూర్తిగా అప్పగించుకున్నప్పుడు ఓ సూచకక్రియ జరిగిందన్నమాట. అలాగే గొప్ప వంచనకు గురి అయిన వ్యక్తి నైతిక సత్యాన్ని అవగాహన చేసుకున్నప్పుడు కూడా. ఓ ఆత్మ మారుమనసుపొంది, దేవున్ని ప్రేమించి ఆయన ఆజ్ఞల్ని కాపాడడం నేర్చుకున్నప్పుడు, దేవుడు చేసిన ఈ వాగ్దానం నెరవేరుతుంది, “నూతన హృదయము మికి చ్చెదను. నూతన స్వభావము నాకు కలుగజేసెదను.” యెహె 36:26. మానవ హృదయాల్లో మార్పు, మానవ ప్రవర్తనల పరివర్తన ఒక సూచకక్రియే. అది నిత్యజీవం పొందే ఆత్మల్ని రక్షించడానికి పనిచేసే రక్షకుణ్ని బయలుపర్చుతుంది. క్రీస్తులో నిలకడగా జీవించడం ఓ గొప్ప సూచక క్రియ. దైవవాక్యాన్ని ప్రకటించడంలో ఇప్పుడూ ఎల్లప్పుడూ ప్రదర్శించాల్సిన గుర్తు పరిశుద్ధాత్మ సముఖం. దైవ వాక్యాన్ని వినేవారికి దాన్ని పునరుత్పాదక శక్తిగా పరిశుద్దాత్మ రూపొందిస్తాడు. తన కుమారుని దైవకార్యం గురించి లోకంముందు దేవుడిచ్చే సాక్ష్యం ఇది. DATel 448.3

గుర్తు ఇమ్మని యేసును కోరినవారు తమ అవిశ్వాసంలో ఎంత కరడుగట్టారంటే ఆయన ప్రవర్తనలో దేవుని పోలికను చూడలేదు. ఆయన పరిచర్య లేఖనాల నెరవేర్పుగా జరుగుతోందని గుర్తించడానికి ఇష్టపడలేదు. ధనికుడు లాజరు ఉపమానంలో పరిసయ్యులతో యేసు ఇలా అన్నాడు, “మోషేయు ప్రవక్తలును (చెప్పినమాటలు) వారు వినని యెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరు.” లూకా 16:31. ఆకాశంలోనే గాని భూమిమిదేగాని ఏ గుర్తు ఇచ్చినా అది వారికి ఉపకరించదు. DATel 449.1

యేసు “ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి” ఆ వితండవాదుల గుంపునుంచి తొలగి శిష్యులతో కలిసి మళ్లీ నావ ఎక్కాడు. దుఃఖిస్తూ నిశ్శబ్దంగా మళ్లీ ఆ సరస్సును దాటారు. కాని తాము విడిచివచ్చిన స్థలానికి మళ్లీ వెళ్లకుండా బేత్సయిదా దిశగా అయిదు వేలమందికి ఆహారం పెట్టిన స్థలానికి సమీపంగా వెళ్లారు. అద్దరికి చేరాక యేసు “పరిసయ్యులు, సదూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రతతపడుడని చెప్పెను.” మోషే దినాలనుంచి యూదులు పస్కా పండుగ కాలంలో పులిసిన పిండిని తమ గృహాల్లో ఉంచుకునే వారు కాదు. ఇది పాపానికి ఒక చిహ్నంగా పరిగణించేవారు. అయినా శిష్యులు క్రీస్తు మాటల్ని అవగతం చేసుకోలేదు. మగదాన నుంచి వారు ఆకస్మికంగా వెళ్లిపోడంలో రొట్టెను తీసుకువెళ్లడం మర్చిపోయారు. వారి వద్ద ఒక్క రొట్టె మాత్రమే ఉంది. ఈ పరిస్థితిని మనసులో ఉంచుకుని పరిసయ్యుల నుంచి గాని సదూకయ్యుల నుంచి గాని రొట్టె కొనుగోలు చెయ్యకూడదని క్రీస్తు తమను హెచ్చరిస్తోన్నట్లు వారు భావించారు. వారిలో విశ్వాసం, ఆధ్యాత్మిక దృష్టి లోపించినందువల్ల తరచు ఆయన మాటల్ని అపార్ధం చేసుకోడం జరిగేది. కొన్ని చేపలు యవల రొట్టెలతో వేలమందికి ఆహారం పెట్టిన తాను ఆ గంభీర హెచ్చరికలో కేవలం భౌతికాహారాన్ని ఉద్దేశించాడని తలంచినందుకు ఇప్పుడు యేసు వారిని మందలించాడు. పరిసయ్యులు సద్దూకయ్యుల ఆలోచనాధోరణి తన శిష్యుల్ని అవిశ్వాసంతో పులియబెట్టి క్రీస్తు చేస్తోన్న పనుల్ని గురించి వారు చులకనగా భావించేటట్లు చేసే ప్రమాదముంది. DATel 449.2

ఆకాశంలో ఒక గుర్తుకు వారు చేసిని మనవిని ప్రభువు మన్నించి ఉండాల్సిందని శిష్యులు భావించారు. ఆ పని చెయ్యడానికి ఆయన మిక్కిలి సమర్దుడని అలాంటి గుర్తు తన శత్రువుల నోళ్లు ముయ్యించేదని వారు భావించారు. ఈ విమర్శల వెనుక కపట నాటకాన్ని వారు గ్రహించలేకపోయారు. DATel 450.1

పిండిముద్దలో ఉంచిన పులిసినపిండి లోలోపల పని చేస్తుంది. ఆ ముద్దను అది తనకు మల్లే మార్చుతుంది. అలాగే హృదయంలో కాపట్యానికి చోటు పెడితే అది ప్రవర్తనలోకి జీవితంలోకి చాపకింద నీరులా వ్యాపిస్తుంది. పరిసయ్యుల వేషధారణకు “కొర్బాను” ఆచారం చక్కటి ఉదాహరణ. దీని ప్రకారం దేవాలయానికి ధారాళ విరాళాల నటన వెనుక తల్లిదండ్రులపట్ల బిడ్డలు చూపే అనాదరణను దాచడం జరిగేది. ఈ ఆచారాల్ని క్రీస్తు ఖండించాడు. శాస్త్రులు పరిసయ్యులు మోసపూరిత సూత్రాల్ని ఒడుపుగా ప్రవేశ పెడున్నాడు. తమ సిద్ధాంతాల వల్ల జరిగే హానిని దాచి పెట్టి తమ శ్రోతల మనసుల్లో వాటిని నాటింపజెయ్యడానికి తమకు వచ్చిన ప్రతీ తరుణాన్ని ఉపయోగించుకున్నారు. ఒకసారి అంగీకరించిన ఈ తప్పుడు సూత్రాలు పిండి ముద్దలో పులిసిన పిండిలా పనిచేసి ప్రవర్తనను మార్చివేశాయి. మోసపూరితమైన ఈ బోధ కారణంగానే ప్రజలు క్రీస్తు మాటల్ని అంగీకరించడం కష్టమయ్యింది. దైవధర్మశాస్త్రం పై బాహాటంగా దాడిచెయ్యరు. కాని ధర్మశాస్త్ర సూత్రాల్ని దెబ్బతీసే ఊహా జనిత సిద్ధాంతాల్ని ప్రతిపాదిస్తారు. దాని శక్తిని నాశనం చేసే విధంగా ధర్మశాస్త్రానికి భాష్యం చెబుతారు. DATel 450.2

పరిసయ్యుల వేషధారణ స్వార్థాశలు ఫలించిన ఫలం. తమ్మునుతాము ఘనపర్చుకోడమే వారి జీవితలక్ష్యం. వారు లేఖనాల్ని వక్రీకరించి తప్పుగా ఆచరించడానికి కారణం ఇదే! క్రీస్తు పరిచర్య ఉద్దేశాన్ని గ్రహించకుండా వారి మనోనేత్రాలికి గుడ్డితనం కలిగించింది ఇదే. మోసకరమైన ఈ చెడుగుకు క్రీస్తు శిష్యులు సయితం బతి అయ్యే ప్రమాదం ఉంది. క్రీస్తు అనుచరులుగా తమ్ముతాము వర్గీకరించుకున్నప్పటికీ ఆయన శిష్యులు కావడానికి తమకున్నదంతా త్యాగం చెయ్యనివారు పరిసయ్యుల భావజాలం ప్రభావానికి లోనయ్యారు. వారు విశ్వాసం అపనమ్మకం మధ్య తరచు కొట్టుమిట్టాడారు. క్రీస్తులో నిక్షిప్తమై ఉన్న జ్ఞాన నిధుల్ని వారు ఆకళించుకోలేదు. యేసు నిమిత్తం తమ సర్వస్వాన్ని విడిచి పెట్టినట్లు పైకి కనిపించినా ఆయన శిష్యులు సయితం తమకోసం ఏవో గొప్పవాటిని సాధించాలన్న ఆకాంక్షను గుండెల్లో దాచుకోడం మానలేదు. తమలో ఎవరు గొప్పవారు అన్న వివాదానికి ఊపిరిపోసింది ఈ స్వభావమే. క్రీస్తుకి తమకి మధ్య అడ్డుగ నిలిచి ఆయన ఆత్మత్యాగం విషయంలో ఏమంత సానుభూతి చూపకపోవడానికి, రక్షణ మర్మాన్ని గ్రహించడంలో మందకొడిగా ఉండడానికి హేతువు ఈ స్వభావమే. దాని పనిదాన్ని చెయ్యనిస్తే పులిసిన పిండి పాడై క్షీణిస్తుంది. అలాగే స్వార్ధ స్వభావాన్ని కొనసాగినిస్తే అది ఆత్మకు అపవిత్రతను నాశనాన్ని కలిగిస్తుంది. DATel 451.1

పూర్వంలోలాగే ఈ దినాల్లోనూ ప్రభువు అనుచరుల్లో ఈ మోసకరమైన పాపం ఎంత విస్తారంగా వ్యాపించింది! మనల్ని మనం ఘనపర్చుకోవాలన్న అంతర్గత ఆకాంక్ష వల్ల క్రీస్తుకి మన సేవ మన పరస్పర సంబంధ బాంధవ్యాలు ఎంత తరచుగా దెబ్బతింటున్నాయి! ఆత్మాభిమానం కోసం మనుషుల మెప్పు కోసం ఎంత తొందర పడుంటాం! స్వారప్రేమ, దేవుడు నియమించిన మార్గం కన్నా సులువైన మార్గాన్ని ఆశించడం - ఇవి దేవుని న్యాయ విధులకు బదులు మానవ సిద్ధాంతాల్ని సంప్రదాయాల్ని ఎంపిక చేసుకోడానికి దారి తీస్తాయి. తన సొంత శిష్యులికి క్రీస్తు ఈ హెచ్చరిక చేస్తున్నాడు, “పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి... జాగ్రత్తపడుడి.” DATel 451.2

క్రీస్తు మతమంటే మూర్తీభవించిన యధార్ధతే. దేవుని మహిమ పట్ల ఉత్సాహానికి పరిశుద్దాత్మే ప్రేరణ కలిగిస్తాడు. పరిశుద్దాత్మ క్రియాశీలంగా పని చెయ్యడం ద్వారానే ఈ ప్రేరణ పుడుతుంది. స్వార్ధాన్ని దొంగాటని దేవుని శక్తిమాత్రమే బహిష్కరించగలుగుతుంది. ఆయన పనికి ఈ మార్పే చిహ్నం. మనం స్వీకరించే విశ్వాసం స్వార్ధాన్ని నటనని నాశనం చేసినప్పుడు అదే సరి అయిన మార్గమని మనకు బోధపడుతుంది. “తండ్రీ నీ నామము మహిమ పరచుము.” (యోహా 12:28) అన్నదే క్రీస్తు జీవితధ్యేయం. మనం ఆయన్ని వెంబడిస్తున్నట్లయితే మన ధ్యేయమూ ఇదే అవుతుంది. “ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే” నడుచుకోవాలని ఆశిస్తూ, “మనమాయకన ఆజ్ఞలను గైకొనిన యెడల దీని వలనే ఆయనను ఎరిగియున్నామని తెలియజేసికొందుము” అని ఆయనన్నాడు. 1యోహ 2:6,3. DATel 452.1