యుగయుగాల ఆకాంక్ష

43/88

42—సంప్రదాయం

పస్కాపండుగలో యేసుని కలవడానికి ఎదురుచూస్తూ శాస్త్రులు పరిసయ్యులు ఆయన్ని పడవేయడానికి పన్నాగం పన్నారు. ఇది గ్రహించి యేసు ఆ సమావేశానికి వెళ్లలేదు. “ఆ సమయమున.... శాస్త్రులును పరిసయ్యులును యేసు నొద్దకు” వాచ్చారు. ఆయన వారి వద్దకు వెళ్లలేదు గనుక వారే ఆయన వద్దకు వచ్చారు. గలిలయ ప్రజలు యేసుని మెస్సీయాగా అంగీకరించేటట్లు ఆ ప్రాంతంలో అధిష్టానం కుప్పకూలేటట్లు కొంతకాలంగా సూచనలు కనిపిస్తోన్నాయి. క్రీస్తు సేవ విస్తరణను, శిష్యులికి రబ్బీలకి మధ్య మరెక్కువ ప్రత్యక్షంగా చోటుచేసుకోగల సంఘర్శణల్ని సూచించే ఈ పన్నెండు మంది పరిచర్య యెరూషలేము నాయకుల్లో నూతనంగా అసూయ పుట్టించింది. క్రీస్తు సేవ తొలినాళ్ళలో వారు కపెర్నహోముకు పంపిన, యేసుపై సబ్బాతు ఉల్లంఘన ఆరోపణ మోపడానికి ప్రయత్నించిన గూఢచారులు గందరగోళంలో పడ్డారు. రబ్బీలు మాత్రం తాము తల పెట్టిన కార్యాన్ని సాధించడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. ఆయన కదలికల్ని కనిపెట్టి ఆ పై ఆయన మీద ఏదో నింద మోపడానికి మరో బృందాన్ని పంపించారు. DATel 432.1

క్రితంలోలాగే, దేవుని ధర్మశాస్త్రాన్ని భారంగా తయారుచేస్తోన్న సంప్రదాయ సూత్రాల్ని ఆయన ఉల్లంఘించడం వారి ఆరోపణకు హేతువు. ఈ సూత్రాల్ని ధర్మశాస్త్రాన్ని కాపాడ్డానికి రూపొందించినట్లు చెప్పినా అవి ధర్మశాస్త్రం కన్నా ఎక్కువ పవిత్రమైనవిగా పరిగణన పొందాయి. సీనాయి నుంచి దేవుడు ప్రకటించిన ఆజ్ఞలతో అవి భేదించినప్పుడు ఈ రబ్బీల సూత్రాలకే ప్రాధాన్యం ఇవ్వడం జరిగేది. DATel 432.2

అతి నిష్ఠగా అమలు పర్చే ఆచారాల్లో శుద్దీకరణ ఆచారం ఒకటి. భోజనానికి ముందు ఆచరించాల్సిన కర్మల్ని నిర్లక్ష్యం చెయ్యడం మహాపాపం. దానికి శిక్ష ఈ లోకంలోను పరలోకంలోను ఉంటుంది. అయితే అతిక్రమదారుణ్ని నాశనం చెయ్యడం గొప్ప సుగుణం. DATel 433.1

శుద్ధి ప్రక్రియకు అనేక నియమ నిబంధనలుండేవి. వాటన్నిటినీ నేర్చుకోడానికి ఓ జీవితకాలం చాలదు. రబ్బీల నియమాల్ని ఆచరించడానికి పూనుకున్న వారి బతుకు అపవిత్రత, అంతులేని స్నానాలు, శుద్ధీకరణలతో కూడిన ఓ సుదీర్ఘమైన పోరాటం. దేవుడు కోరిన ఆచారాల విషయంలో చిన్నచిన్న భేదాలలో ప్రజలు తలమునకలై ఉండగా వారి దృష్టి దేవుని ధర్మశాస్త్ర సూత్రాల నుంచి మళ్లించబడింది. DATel 433.2

క్రీస్తు ఆయన శిష్యులు ఈ సాంప్రదాయక శుద్ధి క్రియను ఆచరించలేదు. గూఢచారులు దీనిపై తమ ఆరోపణను చేశారు. వారు నేరుగా క్రీస్తుపై దాడి చెయ్యలేదు. తన శిష్యుల్ని విమర్శిస్తూ ఆయనవద్దకు వచ్చారు. జనసమూహం ముందు వారు ఆయన్ని ఇలా ప్రశ్నించారు. “నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారు?” DATel 433.3

సత్య వర్తమానం ఆత్మను బలీయంగా ఆకట్టుకొన్నప్పుడల్లా ఏదో చిన్న అంశంపై వివాదం సృష్టించడానికి సాతాను తన ప్రతినిధుల్ని పురికొల్పుతాడు. ఇలా అసలు విషయం నుంచి దృష్టిని మళ్లిస్తాడు. ఓ మంచి పని ప్రారంభమైనపుడల్లా లాంఛనాలపై చిన్న చిన్న సాంకేతికాలపై వివాదాలు రేపడానికి, మనసుల్ని వాస్తవాల నుంచి పక్కదారి పట్టించడానికి తప్పుపట్టేవారు సిద్ధంగా ఉంటారు. తన ప్రజల పక్షంగా దేవుడు ప్రత్యేక రీతిగా పనిచెయ్యడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించినప్పుడు వారు వివాదానికి దిగకూడదు. అది ఆత్మల్ని నాశనం చేస్తుంది. మనల్ని ఆకట్టుకోవాల్సిన అంశాలు ఇవి: నేను దేవుని కుమారుని రక్షకుడని నమ్ముతున్నానా? నా జీవితం దేవుని ధర్మశాస్త్రానుగుణంగా ఉందా? “కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు.” “మనమాయన ఆజ్ఞలను గైకొనినయెడల దీని వలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసికొందుము.” యోహా 3:36; 1యోహా2:3. DATel 433.4

తన్నుతానుగాని తన శిష్యుల్నిగాని సమర్ధించడానికి యేసు ప్రయత్నించలేదు. తనపై మోపిన ఆరోపణల్ని ప్రస్తావించలేదు. కాని మానవకల్పిత ఆచారాలకు చెవికోసుకునే ఈ వ్యక్తుల్ని ప్రోత్సహించిన స్వభావం ఎలాంటిదో ఎండగట్టాడు. వారు పదేపదే ఏంచేశారన్న దానికి ఓ సాదృశ్యం ఇచ్చాడు. “మీరు మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు; తల్లితండ్రులను ఘనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే - ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి - నావలన నీకేమి ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన యెడల అతడు తండ్రినైనను తల్లినైనను ఘనపర్చనక్కర లేదని చెప్పుచున్నారు.” అయిదో ఆజ్ఞ ప్రాముఖ్యమైంది కాదని దాన్ని తీసివేశారు. కాని పెద్దల పారంపర్యాచారాన్ని పకడ్బందిగా అమలుపర్చారు. తమ ఆస్తిని దేవాలయానికి సమర్పించడం తల్లిదండ్రుల్ని పోషించాలన్న నియమంకన్నా పవిత్రమైన నియమమని, ఎంతటి అవసరం ఉన్నా దానిలో ఏ కొంచెం కూడా తండ్రికిగాని తల్లికిగాని ఇవ్వడం అపవిత్రకార్యమని ప్రజలకు బోధించారు. తల్లిదండ్రులపట్ల ప్రేమలేని బిడ్డ తన ఆస్తి విషయంలో “కర్బన్” అన్నమాట పలికి దాన్ని దేవునికి సమర్పించేవాడు. అయితే అతడు తను జీవించినంత కాలం అనుభవించేవాడు. ఆ వ్యక్తి మరణించినప్పుడు అది దేవాలయ సేవలకు వినియుక్తమయ్యేది. ఈ రకంగా జీవించి ఉన్నప్పుడు మరణించిన తర్వాత తన తల్లిదండ్రుల్ని అగౌరవపర్చడానికి దోచుకోడానికీ అతడు స్వేచ్చ కలిగి ఉండేవాడు. ఈ మొత్తం వ్యవహారం దేవుని పట్ల దొంగభక్తి ముసుగు కింద సాగేది. DATel 434.1

మానవుడు దేవునికి కానుకలు అర్పణలు సమర్పించాల్సిన విధికి తన మాట ద్వారాగాని తన చర్యద్వారా గాని విఘాతం కలిగించరాదు. దశమ భాగాలు అర్పణలను గురించి ధర్మశాస్త్రంలోని సూచలన్నింటినీ ఇచ్చింది క్రీస్తే. భూమి మీద నివసించినప్పుడు దేవాలయ ఖజానాకు తనకున్నదంతా ఇచ్చిన పేద స్త్రీని ఆయన ప్రశంసించాడు. కాని యాజకులు రబ్బీలు దేవునిపట్ల పైకి కనపర్చుతోన్న ఉద్రేకం, సొంత బలాభివృద్ధి పట్ల తమ ఆశను కప్పిపుచ్చుకోడానికి ఆడే దొంగాట మాత్రమే. వారు ప్రజల్ని వంచించారు. ప్రజలు దేవుడు మోపని భారాల్ని మోస్తోన్నారు. కాడి మోత నుంచి క్రీస్తు శిష్యులు సయితం పూర్తిగా స్వతంత్రులు కారు. ఇప్పుడు రబ్బీల నిజస్వభావం బయటపెట్టడం ద్వారా దేవున్ని సేవించడానికి యధార్థంగా ఆశించే వారిని పారంపర్యాచార బానిసత్వం నుంచి విముక్తి చెయ్యడానికి యేసు ప్రయత్నించాడు. DATel 434.2

వంచకులైన గూఢచారుల్ని ఉద్దేశించి యేసు ఇలా అన్నాడు, “వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగానున్నది. మనుష్యులు కల్పించిన పద్దతులు దైవోపదేశములని బోధించుచువారు నన్ను వ్యర్ధముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే.” క్రీస్తు అన్న మాటలు మొత్తం పరిసయ్యుల వ్యవస్థపై నేరారోపణ చేశాయి. తమ నియమాల్ని దైవధర్మవిధులికి పైగా ఉంచడం ద్వారా రబ్బీలు దేవునికి పైగా తమ్ముని తాము నిలుపుకుంటున్నారని ఆయన అన్నాడు. DATel 435.1

యెరూషలేము నుంచి వచ్చిన అధికారులికి కోపం వచ్చింది. క్రీస్తుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన వాడని నిందించలేకపోయారు. ఎందుకంటే ఆయన వారి పారంపర్యాచారాల నుంచి ధర్మశాస్త్రాన్ని పరిరక్షించే వానిగా మాట్లాడాడు. ఆయన సమర్పించిన ధర్మశాస్త్ర నియమాలు మానవులు రూపొందించిన ఆ కొరగాని అల్పనియమాలతో ఎంతో భేదించి ఉన్నాయి. DATel 435.2

అపవిత్రత వెలపటి నుంచి కాక లోపటి నుంచి వస్తుందని యేసు జనసమూహానికి ఆ తర్వాత తన శిష్యులికి మరింత సంపూర్తిగా విశదం చేశాడు. పవిత్రత, అపవిత్రత అన్నవి ఆత్మకు సంబంధించినవి. మానవుణ్ని అపవిత్రుణ్ని చేసేది చెడుక్రియ, చెడ్డమాట, చెడుతలంపు, దైవధర్మశాస్త్ర ఉల్లంఘన - ఇవే గాని బాహ్యమైన మానవ కల్పిత ఆచారాల నిర్లక్ష్యం కాదు. DATel 435.3

గూఢచారుల అబద్ధ బోధ నిగ్గు తేలడంతో వారు ఆగ్రహంతో నిండడాన్ని శిష్యులు గుర్తించారు. కోపంతో నిండిన వారి ముఖాలు చుశారు. అసంతృప్తితో పగ ప్రతీకారంతో వారంటోన్న మాటలు విన్నారు. తెరచిన పుస్తకాన్ని చదివేటట్లు తాను హృదయాల్ని చదవగలనని ఆయన ఎంత తరచుగా నిదర్శనం ఇచ్చాడో మర్చిపోయి తన మాటల ప్రభావం గురించి వారు క్రీస్తుకి చెప్పారు. కోపంగా ఉన్న అధికారుల్ని శాంతపర్చుతాడన్న ఆశాభావంతో వారు యేసుతో ఇలా అన్నారు, “పరిసయ్యులు ఆ మాటలు విని అభ్యంతరపడిరని నీకు తెలియునా?” DATel 436.1

అందుకు ఆయన సమాధానం ఇది, “పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతిమొక్కయు పెల్లగింపబడును.” రబ్బీలు అమూల్యమైనవిగా భావిస్తోన్న ఆచారాలు పారంపర్యకర్మలు ఈ లోకసంబంధమైనవిగాని పరలోకం నుంచి వచ్చినవి కావు. ప్రజల పరంగా వారి అధికారం ఎంత ఉన్నతమైందైనా వారు దేవుని పరీక్షను తట్టుకోలేకపోయారు. దేవుని ఆజ్ఞలికి మారుగా మానవుడు ఏది రూపొందించినా “ఆయన ప్రతి క్రియను అది మంచిదేగాని చెడ్డదేగాని తీర్పులోనికి” తెచ్చేటప్పుడు అది నిరుపయోగంగా ఉంటుంది. ప్రసంగి 12: 14. DATel 436.2

మనుషులు కల్పించిన సూత్రాల్ని దేవుని ఆజ్ఞలకు మారుగా ఆచరించడం ఇంకా కొనసాగుతూనే ఉంది. పితరుల పారంపర్యాచారాల పునాదిపై ఆధారితమైన వ్వవస్థలు ఆచారాలు క్రైస్తవుల మధ్య కూడా కానవస్తోన్నాయి. కేవలం మానవాధికారం మీద ఆధారితమైన అలాంటి వ్యవస్థలు దేవుడిచ్చిన నియమాలికి ప్రత్యామ్నాయాలవుతున్నాయి. మనుషులు తమ పారంపర్యాచారాల్ని గట్టిగా పట్టుకుని ఉంటారు. తమ ఆచారాల్ని గౌరవిస్తారు. తమ పొరపాట్లను ఎత్తి చూపించేవారిని ద్వేషిస్తారు. క్రీస్తు నివసించిన రోజుల్లో ప్రదర్శితమైన శత్రుత్వాన్నే దేవుని అజ్ఞలమీద యేసును గూర్చిన విశ్వాసం మిద మన దృష్టిని కేంద్రీకరించాల్సిన ఈ దినాల్లో మనం చూస్తున్నాం. దేవుని శేషించిన ప్రజల గురించి ఇలా ఉంది, “అందుకు ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్రతీరమున నిలిచెను.” ప్రక 12:17. DATel 436.3

కాగా “పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతిమెక్కయు పెల్లగింపబడును.” సంఘ ఫాదర్లు అని పిలిచే వారి అధికారం బదులు మనం నిత్యుడైన తండ్రి, భూమ్యాకాశాల ప్రభువు మాట వినాల్సిందిగా దేవుడు ఆశిస్తోన్నాడు. తప్పులతో మిళితంకాని సత్యం ఇక్కడ మాత్రమే ఉంది. దావీదు ఇలా అన్నాడు, “నా బోధకులకంటె నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు.” కీర్త 119:99, 100. మానవాధికారాన్ని సంఘాచారాల్ని లేక పితరుల పారంపర్యాచారాల్ని అంగీకరించేవారందరు క్రీస్తు పలికిన ఈ మాటల్లోని హెచ్చరికను గుర్తించడం అవసరం: “మనుష్యులు కల్పించిన పద్దతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు.” DATel 437.1