యుగయుగాల ఆకాంక్ష

37/88

36—స్పృశించిన విశ్వాసం

గదరేనీయుల దేశంనుంచి పశ్చిమ తీరానికి వస్తున్నప్పుడు తనను కలవడానికి ఓ జనసమూహం ఎదురు చూస్తున్నట్లు యేసు గ్రహించాడు. వారు ఆయన్ని ఉత్సాహాంగా స్వాగతించారు. బోధిస్తూ స్వస్తపర్చుతూ ఆయన కొంత సేపు సముద్రం పక్క ఉన్నాడు. అనంతరం లేవీ మత్తయి ఇంటి వద్ద విందులో సుంకరుల్ని కలవడానికి వెళ్లాడు. సమాజమందిరపు అధికారి యాయీరు ఆయన్ని కలిశాడు. DATel 372.1

ఆ యూదు పెద్ద గొప్ప దుఃఖంతో యేసు వద్దకు వచ్చాడు. ఆయన పాదాల మీదపడి ఇలా మనవి చేశాడు, “నా చిన్న కుమార్తె చావనైయున్నది అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెను.” DATel 372.2

యేసు వెంటనే ఆ అధికారితో అతడి ఇంటికి బయలుదేరాడు. శిష్యులు ఆయన కారుణ్య కార్యాలు ఎన్నో చూసినప్పటికీ అహంకారి అయిన ఈ రబ్బీ మనవిని యేసు మన్నించడం వారికి ఆశ్యర్యం కలిగించింది. అయినా వారు ప్రభువు వెంట వెళ్లారు. ప్రజలు వారిని వెంబడించారు. వారు ఆతురతతో తీవ్ర ఉత్కంఠతో ఉన్నారు. DATel 372.3

అధికారి గృహం ఎక్కువ దూరంలో లేదు. అయితే అన్ని పక్కల నుంచి ప్రజలు తోసుకుంటూ నడవడంవల్ల యేసు ఆయన అనుచరులు నెమ్మదిగా నడుస్తోన్నారు. ఆందోళనతో ఉన్న తండ్రిలో అసహనం పెరుగుతోంది. అయితే యేసు ప్రజల పై జాలిగొని బాధలో ఉన్న వ్యక్తిని బాగు చెయ్యడానికో దుఃఖంలో ఉన్న వ్యక్తిని ఓదార్చడానికో అప్పుడప్పుడు ఆగుతోన్నాడు. DATel 372.4

వారింకా మార్గంలో ఉండగానే ఓ దూత జనుల్ని తోసుకుంటూ వచ్చి యాయీరుకి తన కుమార్తె మరణించిందన్న వార్తను అందించాడు. ప్రభువుని ఇంకా శ్రమ పెట్టడం వ్వర్ధమన్నాడు. ఆ మాట యేసు చెవిని పడింది. “భయపడకుము నమ్మిక మాత్రముంచుము” అన్నాడు యేసు. DATel 373.1

యాయీరు యేసుకు దగ్గరగా వచ్చి ఆయనతో కలిసి యిరువురూ తన యింటికి గబగబా వెళ్లారు. కిరాయికి ఏడ్చేవాళ్లు, పూలు వేసేవాళ్లు అప్పటికే అక్కడున్నారు. వారు బిగ్గరగా ఏడుస్తూ పెద్ద గోల చేస్తోన్నారు. ప్రజలు గుమిగూడడంతో పర్యవసానంగా బయలుదేరిన రొద యేసుకి నచ్చలేదు. వారిని నిశ్శబ్దంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఇలా అన్నాడు, “సరేల గొల్లుచేసి యేడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు.” ఆ పరదేశి మాటలికి వారు ఆగ్రహించారు. బిడ్డ మరణించడం వాళ్లు కళ్లారా చుశారు. ఆయన వంక చూసి ఎగతాళిగా నవ్వారు. అందరూ అక్కడ నుంచి నిష్క్రమించాల్సిందిగా ఆదేశించి ఆ బాలిక తల్లిని తండ్రిని పేతురు యాకోబు యోహాను అనే తన ముగ్గురు శిష్యుల్ని తనతో లోనికి తీసుకువెళ్లాడు. వారు మరణించిన బాలిక ఉన్న గదిలోకి వెళ్లారు. DATel 373.2

యేసు మంచం పక్కకు వెళ్లి ఆమె చేతిని తన చేతిలో పట్టుకుని ఆమె ఇంట్లో ఉపయోగించే భాషలో “చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను” అని నెమ్మదిగా అన్నాడు. DATel 373.3

వెంటనే జీవంలేని ఆ శరీరంలో చలనం కనిపించింది. నాడి కొట్టుకోడం మళ్లీ మొదలయ్యింది. పెదవులు చిరునవ్వుతో వికసించాయి. నిద్ర నుంచి లేచినట్లు కళ్ళు విశాలంగా తెరుచుకున్నాయి. ఆ బాలిక తన పక్కనున్న మనుషుల వంక ఆశ్చర్యంగా చూస్తోంది. ఆమె లేచి నిలబడింది. తల్లిదండ్రులు ఆమెను కౌగిలించుకుని ఆనందబాష్పాలు కార్చారు. DATel 373.4

అధికారి గృహానికి వెళ్లే మార్గంలో జనసమూహంలో ఓ పేదరాలిని యేసు కలుసుకున్నాడు. ఆమె ఓ పుష్కర కాలంగా దుర్భరమైన వ్యాధితో భాధపడ్తోంది. వైద్యుల పైన మందుల పైన ఆమె తనకున్నదంతా ఖర్చుపెట్టింది. తుదకు అది నయంకాని వ్యాధి అని తేలింది. అయితే క్రీస్తు వ్యాధిగ్రస్తుల్ని స్వస్తపర్చడాన్ని గురించి విన్నప్పుడు ఆమెలో నిరీక్షణ మొగ్గతొడింది. తాను ఆయన వద్దకు వెళ్లగలిగితే తనకు స్వస్తత కలుగుతుందని ఆమె దృఢంగా నమ్మింది. శక్తి లేకపోయినా బాధలో ఉన్నా ఆమె క్రీస్తు బోధచేస్తోన్న సముద్రం పక్కకు వచ్చి జనసమూహంలోనుంచి ఆయన దగ్గరకు రావడానికి ప్రయత్నించింది. కాని అది సాధ్యపడలేదు. మళ్లీ లేవీ మత్తయి ఇంటి వద్ద నుంచి ఆయన వెనక వెళ్లింది. ఈసారి కూడా ఆయన వద్దకు వెళ్లలేకపోయింది. నిరాశ చెందడం మొదలు పెట్టింది. ఇంతలో ప్రభువు ఆ ప్రజా సమూహం మధ్య నుంచి వెళ్తూ ఆమె ఉన్నచోటకు సమీపంగా రావడం జరిగింది. DATel 373.5

ఆమెకు ఆ బంగారు అవకాశం వచ్చింది. ఆమె ఆ మహావైద్యుని సముఖంలోనే ఉంది! కాని ఆ గందరగోళంలో ఆమె ఆయనతో మాట్లాడలేకపోయింది. ఆయనను సరిగా చూచుడానికి కూడా వీలుపడలేదు. స్వస్తత పొందడానికి తనకు వచ్చిన ఆ ఒకే అవకాశాన్ని జారవిడుస్తానేమో అన్న భయంతో “నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదునను కొని” ఆమె ప్రజల్ని తప్పించుకుంటూ ముందుకు వెళ్లింది. ఆయన వెళ్తుండగా చెయ్యి చాపి ఆయన వస్త్రపు అంచును ముట్టకోగలిగింది. ఆ నిముషమే తాను స్వస్తత పొందినట్లు ఆమెకు తెలిసింది. ఆ ఒక్క స్పర్శలోనే ఆమె జీవితంలోని విశ్వాసం కేంద్రీకృతమై ఉంది. తక్షణమే ఆమె బాధ బలహీనతపోయి సంపూర్ణ ఆరోగ్యం బలం వచ్చాయి. DATel 374.1

కృతజ్ఞతతో నిండిన హృదయంతో ఆ జనం నుంచి వెళ్లిపోవడానికి ఆమె ప్రయత్నించింది. అయితే హఠాత్తుగా యేసు ఆగాడు. ప్రజలు కూడా ఆయనతో ఆగారు. వెనక్కితిరిగి చుట్టూ చూస్తూ జనసమూహం రొదపై నుంచి వినిపించేటట్టుగా, ” నన్ను ముట్టినది ఎవరు?” అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా ప్రజలు ఆయన వంక ఆశ్చర్యంగా చూశారు. అన్ని పక్కల నుంచి ముందు వెనకల్నుంచి ప్రజలు తోసుకోడం నెట్టుకోడంతో ఏర్పడ్డ గందరగోళంలో ఆయన ఆ ప్రశ్న వెయ్యడం వింతగా తోచింది. DATel 374.2

మాట్లాడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే పేతురు, “ఏలినావాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మిద పడుచున్నారు” గదా అనగా యేసు “ఎవడోనన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయెనని నాకు తెలిసినది” అని బదులు పలికాడు. విశ్వాస స్పర్శను జనాలు అనాలోచితంగా ముట్టుకోడాన్ని యేసు గుర్తించగలడు. అలాంటి విశ్వాసాన్ని ప్రశంసించకుండా విడిచిపెట్టడం మంచిది కాదు. ఆ సామాన్య స్త్రీతో ఆయన ఓదార్పు మాటలు మాట్లాడితే అవి ఆమెకు ఆశీర్వాదాల ఊటగా అంత్యకాలం వరకూ ఆయన అనుచరులకు గొప్ప దీవెనగా ఉంటాయి. DATel 374.3

ఆస్త్రీ వంక చూస్తూ తనను ముట్టుకున్నది ఎవరని యేసు గుచ్చిగుచ్చి అడిగాడు. దాచి పెట్టడం నిరర్ధకమని గ్రహించి ఆమె వణుకుతూ ముందుకి వచ్చి ఆయన పాదాలపై పడింది. కృతజ్ఞతతో నిండి కన్నీళ్లు కార్చుతూ గతంలో తాను అనుభవించిన బాధను ఇప్పుడు తనకు కలిగిన స్వస్తతను గూర్చి వివరించింది. “కుమారీ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. సమాధానము గలదానవై పొమ్ము” అని యేసు మృదువుగా పలికాడు. తన వస్త్రాన్ని కేవలం ముట్టుకోడంలో స్వస్తత ఉన్నదన్న మూఢనమ్మకానికి ఆయన తావివ్వలేదు. ఆయన్ని బాహ్యంగా ముట్టుకోడం ద్వారా కాదు గాని ఆయన దైవశక్తి మీద విశ్వాసం ద్వారా ఆమెకు స్వస్తత కలిగింది. DATel 375.1

క్రీస్తు దగ్గరే ఉండి ఆయన్ని ముట్టుకుంటున్న జనసమూహాం ఎలాంటి ప్రభావం పొందినట్లు గుర్తించలేదు కాని వ్యాధి బాధితురాలైన ఆ స్త్రీ చెయ్యి చాపి తనకు స్వస్తత కలుగుతుందని నమ్మి ఆయన్ని ముట్టినప్పుడు ఆమె స్వస్తత ప్రభావాన్ని పొందింది. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఇదే జరుగుతుంది. మతం గురించి యధాలాపంగా మాట్లాడడం ఆత్మకు ఆకలి లేకుండా సజీవ విశ్వాసం లేకుండా ప్రార్ధన చేయ్యడం వ్యర్ధం. క్రీస్తుని లోక రక్షకుడని గుర్తించే నామమాత్రపు విశ్వాసం ఆత్మకు స్వస్తత ప్రసాదించలేదు. రక్షణకు నడిపే విశ్వాసం సత్యానికి కేవలం మానసిక సమ్మతమే వ్యక్తం చేయ్యదు. విశ్వాస ప్రదర్శనకు ముందు సంపూర్ణ జ్ఞానం కోసం వేచి ఉండే వ్యక్తి దేవుని దీవెనను పొందలేడు. క్రీస్తుని గురించి నమ్మడం మాత్రమే చాలదు. మనం ఆయనపై విశ్వాసం ఉంచాలి. ఆయన్ని వైయక్తిక రక్షకుడుగా స్వీకరించే విశ్వాసమే మనకు ఆధ్యాత్మికంగా ప్రయోజనం చేకూర్యే విశ్వాసం. ఆ విశ్వాసమే ఆయన నీతిని మనకు ఆరోపిస్తుంది. అనేకుల విషయంలో విశ్వాసం ఒక అభిప్రాయం మాత్రమే. రక్షణ కూర్చే విశ్వాసం ఓ వ్యవహారం. అందులో క్రీస్తును స్వీకరించే వారు దేవునితో నిబంధన బాంధవ్యంలో ప్రవేశిస్తారు. జీవితమే నిజమైన విశ్వాసం. సజీవ విశ్వాసమంటే శక్తి, పెరుగుదల, మినహాయింపులులేని నమ్మకం. వీటి మూలంగానే ఆత్మ జయం సాధించే శక్తి అవుతుంది. DATel 375.2

ఆ స్త్రీని స్వసపర్చిన తర్వాత ఆమె తనకు కలిగిన మేలును గుర్తించాలని యేసు ఆకాంక్షించాడు. సువార్త ప్రసాదించే వరాలు రహస్యంగా సంపాదించేవి లేక రహస్యంగా అనుభవించేవి కాకూడదు. కాబట్టి ఆయన చేసే ఉపకారాల్ని మనం గుర్తించాల్సిందిగా ప్రభువు కోరుతున్నాడు. “నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు” యెషయా 43:12. DATel 376.1

క్రీస్తు విశ్వసనీయుడు, విశ్వాసపాత్రుడు అన్న మన సాక్ష్యమే క్రీస్తుని లోకానికి ప్రత్యక్షపర్చడానికి దేవుడు ఎంచుకున్న సాధనం. గతంలో పరిశుద్ధుల ద్వారా తెలియజేసిన ఆయన కృపను మనం గుర్తించాలి. అయితే మిక్కిలి శక్తిమంతమైంది మన సొంత అనుభవాన్ని గూర్చిన సాక్ష్యం. మనం మనలో పనిచేసే దైవశక్తిని కనపర్చుతూ నివసించే దైవ సాక్షులం. ప్రతీ వ్యక్తి జీవితం ఇతరుల జీవితం కన్నా ప్రత్యేకమైంది. అతడి అనుభవం ఇతరుల అనుభవం కన్నా వ్యత్యాసమైంది. మన స్తుతి మనదైనరీతిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మహిమను కృపను శ్లాఘించే ఈ విలువైన గుర్తింపులు, క్రీస్తును పోలిన జీవితంతో కలిసి నిలిచినప్పుడు అప్రతిహత శక్తిని సంతరించుకుని ఆత్మల రక్షణార్ధం పని చేస్తాయి. DATel 376.2

స్వస్తత కోసం యేసు వద్దకు వచ్చిన పదిమంది కుష్ఠురోగుల్ని యాజకుడి వద్దకు వెళ్లి తమ్మును చూపించుకోవలసిందిగా యేసు ఆదేశించాడు. వారు వెళ్తున్నప్పుడు మార్గంలో స్వస్తత పొందారు. అందులో ఒక్కడు మాత్రమే ప్రభువుని మహిమ పర్చడానికి తిరిగివచ్చాడు. తక్కిన వాళ్లు తమ దారిన తాము వెళ్లిపోయారు. తమను స్వస్తపర్చిన ప్రభువుని మర్చిపోయారు. ఇంకా ఇలాగే వ్వవహరిస్తున్న వారు ఎంతమంది! మానవాళి హితం కోసం ప్రభువు ప్రతినిత్యం పాటుపడుంటాడు. ఆయన తన వరాలు పుష్కళంగా ఇస్తూ ఉంటాడు. వ్యాధి బాధితుల్ని బాగుచేసి లేపుతుంటాడు. తమకు కనిపించని ప్రమాదాల్నుంచి మనుషుల్ని తప్పిస్తుంటాడు. విపత్తుల్నుంచి మనుషుల్ని తప్పించడానికి దేవదూతల్ని ఏర్పాటు చేస్తాడు. “చీకటిలో సంచరించు తెగులు” నుంచి “మధ్యాహ్నమందు పాడుచేయు రోగము” నుంచి దూతలు వారిని కాపాడారు. (కీర్త 91:6). కాని వారి హృదయాలు మారవు. వారిని విమోచించేందుకు ఆయన పరలోక భాగ్యాన్నంతటినీ ధారపోశాడు. అయినా మానవులు ఆయన మహాప్రేమను గుర్తించడం లేదు. తమ కృతఘ్నత వల్ల వారు తమ హృదయాల్లో దైవకృపకు తావియ్యరు. ఎడారిలోని మొక్కలాగ మేలు ఎప్పుడు వస్తుందో వారు ఎరుగరు. వారి ఆత్మలు అరణ్యంలో ఎండిపోయిన స్థలాల్లో నివసిస్తాయి. DATel 376.3

దేవుడిచ్చే ప్రతీ వరాన్ని మనసులో తాజాగా ఉంచుకోడం మనకు మంచిది. ఎక్కువ కోరి మరెక్కువ పొందడానికి విశ్వాసం ఇలా పటిష్టమవుతుంది. ఇతరుల విశ్వాసం గురించి అనుభవం గురించిన కథనాల నుంచి కన్నా దేవుని వద్ద నుంచి పొందే కొద్దిపాటి దీవెనలోనే మనకు ఎక్కువ ప్రోత్సాహం లభిస్తుంది. దేవుని కృపకు ప్రతిస్పందించే ఆత్మ నీటి సదుపాయం గల తోటమల్లే ఉంటుంది. ఆ వ్యక్తి ఆరోగ్యం వేగంగా వృద్ధి చెందుతుంది. అతడి వెలుగు చీకటిని పారదోలుతుంది. అతడి మీద దేవుని మహిమ ప్రకాశిస్తుంది. అందుచేత ప్రభువు ప్రేమానురాగాల్ని ప్రభువు కృపల్ని జ్ఞాపకముంచుకుందాం. ఇశ్రాయేలు ప్రజల్లాగ సాక్ష స్తూపాలు నిర్మించి దేవుడు మనకు చేసిన ఉపకారాల ప్రశస్త చరిత్ర వాటిపై చెక్కుకుందాం. మన యాత్రలో ఆయన మనతో వ్యవహరించిన విధాన్ని సమీక్షించుకునేటప్పుడు కృతజ్ఞతతో ద్రవించే హృదయాల్లో “యోహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్ధన చేసెదను. యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. ఆయన ప్రజలందరి యెదుటనే చెల్లించెదను.” అని పలుకుదాం. DATel 377.1