యుగయుగాల ఆకాంక్ష

33/88

32—శతాధిపతి

యేసు ఎవరి కుమారుణ్ని స్వస్తపర్చాడో ఆ ప్రధానితో ఇలా అన్నాడు, “సూచక క్రియలను మహత్కారములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరు.” యోహాను 4:48. తాను మెస్సీయాని నిరూపించడానికి గుర్తులు చూపించమని తన సొంత జాతి ప్రజలే కోరడం ఆయనకు దుఃఖం కలిగించింది. వారి అవిశ్వాసానికి పదే పదే విస్మయం చెందాడు. కాగా తన వద్దకు వచ్చిన శతాధిపతి కనపర్చిన విశ్వాసానికి ఆయన ఎంతో ఆశ్చర్యపడ్డాడు. ఆ శతాధిపతి ఆయన శక్తిని ప్రశ్నించలేదు. ఆ మహత్కార్యం చెయ్యడానికి ఆయన్ని వ్యక్తిగతంగా రమ్మని కోరలేదు. “నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును” అన్నాడు. DATel 338.1

ఆ శతాధిపతి సేవకుడు పక్షవాతం బారినపడి మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. రోమీయుల సేవకులు బానిసలు. వారిని బజారులో కొనేవారు, అమ్మేవారు. వారు బానిసల్ని అతి కఠినంగా చూసేవారు. వారితో క్రూరంగా వ్యవహరించేవారు. అయితే ఈ శతాధిపతి తన సేవకుడితో అనుబంధం ఏర్పరచుకున్నాడు. అతడు స్వస్తపడాలని ఎంతగానో కోరుకున్నాడు. యేసు తన సేవకుణ్ని బాగుపర్చగలడని నమ్మాడు. అతడు రక్షకుణ్ని చూడలేదు. అతడు విన్న వార్తలు అతడిలో విశ్వాసం పుట్టించాయి. యూదులు ఛాందసులైనప్పటికి ఈ రోమీయుడు తన మతం కన్నా వారి మతమే గొప్పదని నమ్మాడు. విజేతల్ని ఓడిపోయిన వారినుంచి వేరు చేసే జాతీయ దురహంకారం, ద్వేషం, అనే అడ్డుగోడను అతడు అప్పటికే ధ్వంసం చేశాడు. దేవునిపట్ల ప్రగాఢ భక్తిని కనపర్చాడు. దైవరాధకులుగా యూదుల పట్ల కనికరం చూపించాడు. తాను విన్న నివేదికను బట్టి, క్రీస్తు బోధలో తన ఆత్మకు అగత్యమైనదాన్ని కనుగొన్నాడు. అతడిలో ఆధ్యాత్మిక పరమైనదంతా రక్షకుడి మాటలకు ప్రతిస్పందించింది. అయినా యేసు సముఖంలోకి రావడానికి అయోగ్యుణ్నని అతడు భావించాడు. కనుక తన సేవకుణ్ని స్వస్తపర్చడానికి మనవి చేయవలసిందిగా యూదు పెద్దలకి విజ్ఞప్తి చేశాడు. ఆ మహాబోధకుడితో వారికి పరిచయముందని, ఆయన్ని కలిసి ఎలా ప్రసన్నుణ్ని చెయ్యాలో వారికి తెలుసని భావించాడు. DATel 338.2

యేసు కపెర్నహోములో ప్రవేశించగానే పెద్దల బృందమొకటి ఆయన్ని కలిసి శతాధిపతి విన్నపాన్ని ఆయనకు తెలియజేశారు. “నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజమందిరము తానే కట్టించెను” అని చెప్పారు. DATel 339.1

యేసు వెంటనే ఆ అధికారి ఇంటికి బయల్దేరాడు. తన చుట్టూ ఉన్న జనసమ్మర్ధం వల్ల నడక చురుకుగా సాగలేదు. యేసు వస్తున్నాడన్నవార్త శతాధిపతికి ముందుగా అందడంతో అతడు ఆయనకు ఈ వర్తమానం పంపాడు, “ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు; నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను.” కాని రక్షకుడు నడిచివస్తూనే ఉన్నాడు. చివరికి శతాధిపతి ప్రభువుని కలిసి ఆ వర్తమానాన్ని ఈ మాటలతో పూర్తి చేశాడు, “మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపడును. నేను సహా అధికారమునకు లోబడినవాడను; నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు; నేనొకని పొమ్మంటె పోవును, ఒకని రమ్మంటె వచ్చును నా దాసుని చేయుమంటే ఇది చేయును.” రోమా అధికారానికి ప్రతినిధినైన నన్ను నా సైనికులు అత్యున్నతాధికారంగా గుర్తించే రీతిగా నీవు అనంతుడైన దేవుని అధికారానికి ప్రతినిధివి. సృష్టి పొందిన మనుషులు ప్రాణులు సమస్తం నీమాటకు విధేయులు కావలసిందే. వ్యాధిని పొమ్మని నీవు ఆజ్ఞాపించగలవు. అది నీ మాట వినాల్సిందే. నీవు నీ పరలోక దూతల్ని రమ్మని ఆదేశించగలవు. వారు స్వస్తత గుణాన్ని ఇవ్వగలరు. నీవు ఒక్కమాట చెప్పు, నా సేవకుడు బాగవుతాడు. DATel 339.2

“యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటవచ్చుచున్నవారిని చూచి - ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.” శతాధిపతితో ఆయన ఇలా అన్నాడు, “ఇక వెళ్లుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక... ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను.” DATel 339.3

శతాధిపతిని క్రీస్తుకి సిఫార్సు చేసిన యూదు పెద్దలు సువార్త స్ఫూర్తిని కలిగి ఉండడానికి తామెంత దూరంగా ఉన్నారో చూపించుకున్నారు. దేవుని కృపపై మనకున్న హక్కు మన గొప్ప అవసరమేనని వారు గుర్తించలేదు. “మన జనులకు” చేసిన మేలును బట్టి స్వనీతితో నిండిన వారు శతాధిపతిని ఆయనకు. సిఫార్సు చేశారు. శతాధిపతి అయితే “నేను పాత్రుడను కాను” అన్నాడు. అతడి హృదయాన్ని క్రీస్తు కృప స్పృశించింది. అతడు తన అనర్హతను గుర్తించాడు. అయినా సహాయం కోరడానికి భయపడలేదు. అతడు తనలోని మంచిని నమ్ముకోలేదు. తన అవసరమే అతడి వాదన. అతడి విశ్వాసం క్రీస్తు వాస్తవ ప్రవర్తనను గ్రహించి ఆయన్ని నమ్ముకుంది. ఆయన్ని కేవలం అద్భుతాలు చేసేవానిగా విశ్వసించలేదు. మానవాళి నేస్తంగాను రక్షకుడుగాను విశ్వసించాడు. DATel 340.1

ప్రతీపాపి క్రీస్తు వద్దకు ఈ విధంగా రావచ్చు. “మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే... మనలను రక్షించెను.” తీతుకు 3:5. నారు పాపి అని, కనుక మీకు దేవుని దీవెనలుండవని సాతాను చెప్పినప్పుడు పాపుల్ని రక్షించడానికే యేసు లోకంలోకి వచ్చాడని సమాధానం చెప్పండి. మనల్ని గురించి మనం దేవునికి సిఫార్సు చేసుకోడానికి మనకు ఏ అర్హతా లేదు. ఇప్పుడు ఇంకెప్పుడు మనం చేయాల్సిన విజ్ఞాపన ఏంటంటే ఆయన విమోచన శక్తి అవసరమయ్యే మన నిస్సహాయ పరిస్థితిని గూర్చి, స్వశక్తిని త్యజించి కల్వరి సిలువ పై ఆధారపడి, DATel 340.2

“ఇవ్వగ లేదు నా వద్ద ఏమి
నీ సిల్వనే హత్తుకొంటాను స్వామి” అని మనం అనవచ్చు.
DATel 340.3

మెస్సీయా సేవను గురించి యూదులు తమ చిన్న నాటినుంచి ఉపదేశం పొందారు. పితరులు ప్రవక్తల ఆవేశపూరిత వాక్కులు, బలిఅర్పణ పరిచర్య ద్వారా వచ్చిన ఛాయారూపక బోధలు వారికున్నాయి. కాని వారు ఆ వెలుగును తోసిపుచ్చారు. కనుక ఇప్పుడు యేసులో వారికి ఆశించదగిందేదీ కనిపించలేదు. అయితే, అన్యజనుల మతంలో పుట్టి, రోమా సామ్రాజ్యంలోని విగ్రహారాధనలో విద్యనభ్యసించి, సైనికుడుగా శిక్షణ పొంది విద్యను బట్టి పరిసరాల్ని బట్టి ఆధ్యాత్మిక జీవితానికి దూరమైనట్లు కనిపించిన యూదుల మత దురభిమానం వల్ల, మరింత దూరమైన ఇతడు, అబ్రహాము బిడ్డలు ఏ సత్యాన్ని చూడలేకపోయారో ఆ సత్యాన్ని చూడగలిగాడు. తమ మెస్సీయానని చెబుతున్న యేసును యూదులు స్వీకరిస్తారో లేదోనని అతడు వేచి చూడలేదు. “లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించు” (యోహా 1:9) వెలుగు అతడిపై ప్రకాశించగా అతడు - దూరం నుంచి అయినప్పటికీ - దేవుని కుమారుని మహిమను గ్రహించగలిగాడు. DATel 340.4

యేసుకి ఇది అన్యజనుల మధ్య సువార్త సాధించనున్న విజయానికి బజానా వంటిది. తన రాజ్యంలోకి ఆత్మల్ని పోగు చెయ్యడానికి ఆయన సంతోషంతో ఎదురుచూశాడు. తన కృపను తోసిపుచ్చిన యూదులికి దాని ఫలితాల్ని తీవ్ర సంతాపంతో వివరించాడు; “అనేకులు తూర్పు నుండియు పడమట నుండియు వచ్చి అబ్రహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్యసంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరకుటయు నుండును.” అయ్యో, మరణాంతకమైన అదే ఆశాభంగం కోసం ఎంతమంది సన్నద్ధమవుతోన్నారు! అన్యమతాంధకారంలో ఉన్న ఆత్మలు ఆయన కృపను అంగీకరిస్తుండగా, వెలుగు ప్రకాశిస్తోన్న క్రైస్తవ దేశాల్లో దాన్ని తృణీకరించే వారు ఎందరెందరు! DATel 341.1

కపెర్నహోముకి ఇరవై పైచిలుకు మైళ్ల దూరంలో సుందర యెఱ్ఱయేలు మైదానం పక్క భూభాగంలో నాయీననే గ్రామం ఉంది. అనంతరం యేసు ఇక్కడకు వెళ్లాడు. ఆయన శిష్యుల్లో చాలామంది ఇంకా ఇతరులు ఆయనతో ఉన్నారు. మార్గమంతా ప్రజలు ఆయన మాటలు వినడానికి వచ్చారు. జబ్బుగా ఉన్నవారిని స్వస్తపర్చడానికి ఆయన వద్దకు తెచ్చారు. మహాశక్తి సంపన్నుడైన ఆయన ఇశ్రాయేలు రాజుగా తన్నుతాను ప్రకటించుకుంటాడని ఆశగా ఎదురుచూశారు. ఆయన వెంట ఒక జన సమూహం వచ్చింది. ఆ సమూహం ఉత్సాహంతో ఆశాభావంతో ఆ కొండ మార్గమంతా ఆయనతో నడిచి కొండల్లోని ఆ గ్రామం గుమ్మం వరకు వచ్చింది. DATel 341.2

వారు గుమ్మం సమీపానికి వచ్చేసరికి గుమ్మంలో నుంచి ఓ శవాన్ని తీసుకురావడం కనిపించింది. శవాన్ని మోసే మనుషులు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ స్మశానం దిశగా వెళోన్నారు. మరణించిన వ్యక్తి శవాన్ని పాడెమీద పెట్టి మోస్తున్నారు. దాని చుట్టూ ఏడ్చేవారు గట్టిగా రోదిస్తూ నడుస్తున్నారు. మరణించిన వ్యక్తి పట్ల అభిమానాన్ని అతడి ఆప్తుల పట్ల సానుభూతిని చూపిస్తూ ఆ గ్రామ ప్రజలందరూ సమావేశమైనట్లున్నారు. DATel 342.1

అది సానుభూతి పుట్టించే దృశ్యం. మరణించిన వ్యక్తి తన తల్లికి ఒక్కడే కొడుకు. తల్లి విధవరాలు. ఏ కాకి అయిన ఆమె విలపిస్తూ తనకు ఒకే ఒక ఆధారం ఆదరణ అయిన కుమారుడి సమాధి స్థలానికి వెల్తోంది. “ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికర” పడ్డాడు. ఆమె ఏడుస్తూ ఆయన ఉనికిని గుర్తించకుండా గుడ్డిగా వెళోండగా ఆయన ఆమె పక్కకు వచ్చి “ఏడవవద్దు” అన్నాడు సున్నితంగా. యేసు ఆమె సంతాపాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు. అయినా సానుభూతి వ్యక్తం చేయకుండా ఉండలేకపోయాడు. DATel 342.2

“దగ్గరకు వచ్చి పాడెను” ముట్టాడు. మరణించిన వ్యక్తి శవాన్ని ముట్టినా ఆయనకు అపవిత్రత అంటలేదు. పాడెను మోస్తున్న వాళ్లు ఆగారు. ఏడ్చేవారి ఏడ్పు ఆగిపోయింది. ఆ రెండు జనసమూహాలు పెద్దంత నమ్మలేకుండా పాడె చుట్టూ నిలబడ్డారు. వ్యాధిని బహిష్కరించినవాడు దయ్యాల్ని వెళ్ళగొట్టినవాడు అయిన ఒక మహాత్ముడు వారి నడుమ ఉన్నాడు. ఆయనకు మరణంపై కూడా శక్తి ఉన్నదా? DATel 342.3

“చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాను” అని స్పష్టంగా అధికారంతో అన్నాడు. ఆ స్వరం మృతుడి చెవుల్లోకి పొడుచుకుంటూ వెళ్ళింది. ఆ యువకుడు కళ్ళు తెరిశాడు. యేసు అతడి చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. అతడి పక్క నిలిచి ఏడుస్తోన్న తల్లి మీద యేసు దృష్టి నిలిచింది. తల్లి కొడుకులు పరస్పరం దీర్ఘంగా ఆనంద పారవశ్యంతో కౌగిలించుకున్నారు. ప్రజలుమంత్రముగ్ధులైనట్లు నిశ్శబ్దంగా చూస్తు ఉన్నారు. “అందరు భయాక్రాంతు” లయ్యారు. ప్రజలు దేవుని ప్రత్యక్ష సముఖంలో ఉన్నట్లు నిశ్శబ్దంగా భయభక్తులో కాసేపు నిలబడిపోయారు. అంతట “గొప్ప ప్రవక్త బయలుదేరియున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమను గ్రహించియున్నాడనియు దేవుని మహిమపరచిరి.” సమాధి కార్యక్రమానికి వెళ్ళిన ప్రజలు విజయ ఊరేగింపుగా నాయీను గ్రామానికి తిరిగి వెళ్లారు. “ఆయనను గూర్చిన యీ సమాచారము యూదయ యందంతటను చుట్టుపట్ల ప్రదేశమంతటను వ్యాపించెను.” DATel 342.4

నాయీను గుమ్మం వద్ద దుఃఖిస్తూ నిలిచిన తల్లి పక్క ఉన్న ప్రభువు పాడే పక్క విలపించే ప్రతీ తల్లిని వీక్షిస్తోన్నాడు. మన దుఃఖాన్ని చూసి ఆయన సానుభూతితో చలించిపోతాడు. ప్రేమించి జాలిపడ్డ ఆయన హృదయం ఎన్నడూ మారని దయాహృదయం. మరణించిన యువకుడికి ప్రాణం పోసిన ఆయన మాట నాయీను యువకుడి చెవిలో పలికినప్పటికన్నా ఇప్పుడు తక్కువ శక్తి కలది కాదు. ఆయన ఇలా అంటున్నాడు, “పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. ” మత్త 28:18. కాలగమనంతో ఆ శక్తి ఏమి తగ్గలేదు. ఆయన కృప నిత్యం వినియోగమవుతున్నందువల్ల ఏ మాత్రం తరిగిపోలేదు. ఆయన్ని విశ్వసించే వారందరికీ ఆయన ఇంకా సజీవ రక్షకుడే. DATel 343.1

తన కుమారునికి ప్రాణమిచ్చి ఆ తల్లి దుఃఖాన్ని యేసు ఆనందంగా మర్చాడు. అయినా ఆ యువకుడు ఈ లోకంలో జీవించడానికి, ఈ జీవిత దుఃఖాన్ని శ్రమల్ని అనుభవించడానికి, ఆ మీదట మళ్లీ మరణం శక్తికి లొంగిపోడానికే ప్రాణభిక్ష పొందాడు. కాని మరణించిన ప్రియుల నిమిత్తం మన దుఃఖాన్ని ఈ వర్తమానంతో యేసు ఓదార్చుతున్నాడు, “నేను... జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ” “కాబట్టి పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయన కూడ రక్తమాంసములలో పాలివాడాయెను.” ప్రకటన 1:18; హెబ్రీ 2:14, 15. DATel 343.2

జీవించమని మృతుల్ని దైవ కుమారుడు ఆదేశించినప్పుడు సాతాను వారిని ఆపలేడు. క్రీస్తు వాక్యాన్ని విశ్వాసమూలంగా అంగీకరించిన ఒక ఆత్మను అతడు ఆధ్యాత్మిక మరణంలో ఉంచలేడు. పాపంలో మృతులైన వారందరితో దేవుడి మాటలంటున్నాడు, “నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము.” ఎఫెసి 5:14. ఆ మాటే నిత్య జీవం. మొదటి మానవుడికి జీవము నిచ్చిన మాట ఇంకా మనకు జీవం ఇస్తుంది. “చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాను” అన్న క్రీస్తు మాట నాయీను యువకుడికి జీవాన్నిచ్చిన రీతిగా “మృతులలో నుండి లెమ్ము” అన్నమాట దాన్ని విన్న ఆత్మకు జీవం. దేవుడు “మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవారసులనుగా చేసెను.” కొలొ 1:13. ఇవి మనకు ఆయన వాక్యం వాగ్దానం చేస్తోంది. మనం వాక్యాన్ని స్వీకరిస్తే మనకు విడుదల లభిస్తుంది. DATel 343.3

“మృతులలోనుండి యేసు లేపిన వాని ఆత్మ మిలో నివసించిన యెడల, మృతులలోనుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడ నాలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును.” “ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు. ఆమెదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము. రోమా 8:11; 1 థెస్స 4:16, 17. ఈ మాటలతో మనం పరస్పరం ఆదరించుకోవాల్సిందిగా ప్రభువు ఆదేశిస్తున్నాడు. DATel 344.1