యుగయుగాల ఆకాంక్ష

5/88

4—మీకు రక్షకుడు

మహిమరాజు తన్నుతాను తగ్గించుకుని మానవుడయ్యాడు. ఆయన భూలోక పరిసరాలు అనాగరికం, హేయం. ఠీవి హుందాతనం గల ఆయన బాహ్యాకృతి ఆకర్షించేదిగా ఉండకుండేందుకు ఆయన మహిమచే కప్పబడింది. ఆయన బాహ్య ప్రదర్శనను ద్వేషించాడు. ధనం, లోక ప్రతిష్ఠ, మనుషులు పరిగణించే గొప్పతనం వ్యక్తిని మరణం నుంచి కాపాడలేవు. లోక సంబంధమైన ఏ ఆకర్షణా మనుషుల్ని తన వద్దకు ఆకర్షించకూడదన్నది యేసు ఉద్దేశం. తనను వెంబడించగోరే వారిని పరలోక సత్య సౌందర్యం మాత్రమే తన చెంతకు తీసుకురావాలి. మెస్సీయా ప్రవర్తనను గూర్చి ప్రవచనం ఎంతో కాలంగా ప్రవచించింది. దైవవాక్యం ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి జనులు తనను అంగీకరించాలని ఆయన ఆకాంక్షించాడు. DATel 25.1

రక్షణ ప్రణాళిక విషయంలో దేవదూతలు విస్మయం చెందారు. మానవ రూపంలో అవతరించనున్న దేవ కుమారుణ్ని మానవులు ఎలా స్వీకరిస్తారో చూడటానికి దూతలు ఆశగా ఎదురుచూశారు. దేవుడు ఎన్నుకొన్న ప్రజల దేశానికి దూతలు వేంచేశారు. ఇతర దేశాల ప్రజలు కట్టు కథల్ని నమ్ముతూ అబద్ద దేవుళ్లను పూజిస్తోన్నారు. దేవుని మహిమ ఏ దేశానికి వెల్లడయ్యిందో, ఏదేశంలో ప్రవచన కాంతి ప్రకాశించిందో ఆ దేశానికి దూతలు వేంచేశారు. ఎవరికీ కనిపించకుండా దూతలు యెరుషలేముకు వచ్చారు. పరిశుద్ధ లేఖనాల విశ్లేషకుల వద్దకు, దేవుని మందిరంలో పరిచర్య చేసే వారి వద్దకు వచ్చారు. బలిపీఠం ముందు సేవ చేస్తున్న యాజకుడు జెకర్యాకు క్రీస్తు రాకడ సమీపంలో ఉందని అప్పటికే ప్రకటితమయ్యింది. అప్పటికే క్రీస్తు మార్గాన్ని సరాళం చేయాల్సి ఉన్న వ్యక్తి జన్మించడం, అతడి కర్తవ్యాన్ని మహత్కార్యాలు ప్రవచనం ధ్రువీకరించడం జరిగింది. ఆయన జనన వార్త, ఆయన కర్తవ్య ప్రాధాన్యం అన్ని చోట్లా ప్రచురితమయ్యింది. అయినా యెరుషలేము తన విమోచకుణ్ని స్వాగతించడానికి సంసిద్ధంగా లేదు. DATel 25.2

పవిత్ర సత్యాన్ని లోకానికి అందించడానికి దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజలు లెక్కలేనితనంగా, ఉదాసీనంగా ఉండడం చూసి పరలోక దూతలు విస్మయం చెందారు. అబ్రహాము సంతతి నుంచి దావీదు వంశంలో కన్యకకు క్రీస్తు జన్మించాల్సి ఉన్నాడన్న దానికి నిదర్శనంగా యూదు జాతిని దేవుడు పరిరక్షించాడు. అయినా ఆయన రాక సమీపంగా ఉన్నదన్న సంగతిని వారు గ్రహించలేదు. ఆలయంలో అనుదినం ఉదయ సాయంకాలాల బలులు దేవుని గొర్రెపిల్లను సూచించాయి. అయినా ఇక్కడ కూడా ఆయనను స్వీకరించడానికి సిద్ధబాటు లేదు. యుగాలన్నిటిలో అతి ప్రాముఖ్యమైన ఘటన సంభవించనున్న సంగతిని యాజకులు, బోధకులు తెలుసుకోలేకపోయారు. వారు తమ అర్థరహిత ప్రార్థనల్ని, ఆరాధనకు సంబంధించిన ఆచారాన్ని మనుషులకు చూపించుకోడానికి నిర్వహించేవారు. ధనం కోసం పోరాడూ లోక ప్రతిష్ఠ కోసం పాటుపడూ వారు మెస్సీయా ప్రత్యక్షత కోసం సిద్ధపడలేదు. అదే నిరాసక్తత ఇశ్రాయేలు దేశమంతటా వ్యాపించింది. స్వార్ధంతో లోకాశలతో నిండిన వారి హృదయాలు పరలోకాన్ని ఆహ్లాదపర్చిన ఆనందోత్సాహాలకు స్పందించలేదు. బహుకొద్దిమంది మాత్రమే ఆ అదృశ్యుణ్ని చూడాలని కాంక్షించారు. వీరి వద్దకే ఆపరలోక రాయబారులు వచ్చారు. DATel 26.1

యోసేపు మరియలు నజరేతులోని తమ గృహం నుంచి దావీదు పట్టణానికి చేసిన ప్రయాణంలో వారికి దేవదూతలు తోడుగా వెళ్లారు. తన సువిశాల రాజ్యంలోని జనాభా నమోదుకు రోమా చక్రవర్తి జారీ చేసిన శాసనం గలిలయ పర్వత ప్రాంత ప్రజలకు కూడా వర్తించింది. బందీలుగా మగ్గుతున్న తన ప్రజల్ని విడుదల చెయ్యడానికి ప్రభువు అలనాడు కోరేషును సింహాసనానికి తెచ్చినట్లే యేసు తల్లి మరియను బే హేముకు తీసుకురావడంలో ప్రభువు సంకల్పాన్ని నెరవేర్చడానికి కైసరు ఔగుస్తు ఆయనకు ప్రతినిధి అయ్యాడు. ఆమె దావీదు వంశీయురాలు. దావీదు కుమారుడు దావీదు పట్టణంలో జన్మించాల్సి ఉన్నాడు. బేల్లెహేము నుంచి “ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు..... వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను” అని ప్రవక్త అన్నాడు. మీకా 5:2; అయితే ఆ పట్టణంలో తమ రాజవంశంలోని యోసేపు మరియలు గుర్తింపు సన్మానం లేనివారు. ఆ రాత్రి విశ్రాంతి తీసుకోడానికి ఆ పట్టణంలో స్థలంకోసం ఇరుకుగా ఉన్న వీధి ఈ చివరి నుంచి ఆ చివరి వరకూ నడిచారు. కాని ప్రయోజనం శూన్యం. వారికి సత్రంలో స్థలం దొరకలేదు. చివరికి పశువుల పాకలో కాస్త చోటు దొరికింది. ఇక్కడ, లోక రక్షకుని జననం చోటుచేసుకుంది. DATel 26.2

అది మనుషులికి తెలియదు కాని ఆవార్త పరలోకాన్ని ఆనందంతో నింపింది. దూతలు ఆ వెలుగులో నుంచి భూలోకానికి అమితాసక్తితో వస్తారు. ప్రభువు సన్నిధివల్ల లోకమంతా మరెక్కువ కాంతితో నిండింది. బేల్లె హేము కొండలపై ఆకాశంలో అసంఖ్యాకమైన దూతల సమూహం ఉంది. లోకానికి శుభవార్త ప్రకటించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. యెరుషలేములోని నాయకులు తమ దైవదత్త విధి పట్ల నమ్మకంగా ఉండి ఉంటే వారు యేసు జన్మను ప్రకటించడంలోని ఆనందాన్ని వారితో పంచుకునేవారు. ఇప్పుడు అది వారిని దాటి వెళ్లిపోయింది. DATel 27.1

దేవుడిలా అంటున్నాడు, “నేను దప్పిగల వాని మిద నీళ్ళను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను.” “యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టెను.” యెషయా 44:3; కీర్త 112:4, వెలుగును వెదకి దాన్ని ఆనందంతో స్వీకరించేవారికి దేవుని సింహాసనం నుంచి ప్రకాశవంతమైన కిరణాలు ప్రకాశిస్తాయి. DATel 27.2

దావీదు బాలుడుగా మందల్ని కాసిన పొలాల్లోనే కాపర్లు ఇంకా రాత్రి పూట మందల్ని కాస్తున్నారు. ఆ నిశ్శబ్ద ఘడియల్లో వారు వాగ్దత్త రక్షకుడి గురించి మాట్లాడుకుని దావీదు సింహాసనానికి రానున్న రాజును గురించి ప్రార్ధన చేశారు. “ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత - భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు” DATel 27.3

ఈ మాటలు వింటున్న కాపరుల మనసుల్లో మహిమపూరిత దృశ్యాన్ని చిత్రించాయి. రక్షకుడు ఇశ్రాయేలుకు వచ్చాడు! ఆయన రాకతో అధికారం, ఔన్నత్యం, విజయం ముడిపడి ఉన్నాయి. ఇలాగుండగా వారు రక్షకుణ్ని దీనుడిగా, అవమానానికి గురి అవుతున్న వాడిగా గుర్తించడానికి దేవదూత వారిని సిద్ధం చెయ్యాల్సి ఉన్నాడు. దూత ఇలా అంటున్నాడు, “దానికిదే మికానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక తొట్టెలో పడుకొని యుండుట మీరు చూచెదరు.” DATel 28.1

దూత వారి భయాలను తొలగించి వేశాడు. యేసును ఎలా కనుగోవాలో వారికి తెలిపాడు. వారి మానవ బలహీనతను పరిగణనలోకి తీసుకుని ఆ దైవ తేజస్సుకు అలవాటు పడడానికి వారికి వ్యవధి ఇచ్చాడు. అంతట ఆ సంతోషాంనందాలకు అడ్డు అదుపులేదు. ఆ మైదానమంతా పరిశుద్ధ దూత సముహాల వెలుగుతో ప్రకాశించింది. భూగోళంపై నిశ్శబ్దం రాజ్యమేలింది; “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టమైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగును గాక ” అన్న స్తోత్రగానాన్ని వినడానికి పరలోకం నేలమీదకు వంగింది. DATel 28.2

మానవాళి ఈనాడు ఆ పాటను గుర్తిస్తే ఎంత బాగుండేది! అప్పుడు వెలువడ ప్రకటన, అప్పుడు నాటిన తంత్రి కాలం చివరి వరకూ లోకమంతటా వినిపిస్తూనే ఉంటాయి. నీతి సూర్యుడు ఆరోగ్యం కలుగజేసే రెక్కలతో ఉదయించినపుడు “సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు; ఆయనను స్తుతించుడి” అంటూ ఆ పాటను గొప్ప జన సమూహం పాడుతుంటే ప్రతిధ్వని లేస్తుంది. ప్రకటన 19:6. DATel 28.3

దూతలు మాయమవ్వగా వారితో ఆ వెలుగుకూడా మాయమయ్యింది. బేల్లెహేము కొండ మీదికి రాత్రి చీకట్లు మళ్లీ వచ్చాయి. అయితే మానవ మాత్రులు వీక్షించిన మిక్కిలి ప్రకాశవంతమైన వెలుగు ఆ కాపరుల మనసుల్లో నిలిచిపోయింది! “ఆ దూతలు తమ యొద్దనుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొట్టెల కాపరులు -జరిగిన యీ కార్యమును ప్రభువు మనకు తెలియజేసియున్నాడు; మనము బేల్లె హేమునకు వెళ్ళి చూతమురండని, యొకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టెలో పండుకొనియున్న శిశువును చూచిరి” DATel 28.4

అక్కడ నుంచి సంతోషంతో వెళ్లిపోయి తాము చూసిన సంగతులు విన్న సంగతులు వెల్లడి చేశారు. “గొట్టెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసికొని భద్రము చేసికొనెను. అంతట ఆ గొట్టెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి” DATel 29.1

గొర్రెల కాపరులు దేవదూతల పాటను విన్నప్పుడు పరలోకం భూలోకానికి ఎంత దూరంలో ఉందో ఇప్పుడూ అంతే దూరంలో ఉంది. సామాన్య మనుషులు సామాన్య పనిపాటులు చేసుకుంటున్న తరుణంలో వారిని దేవదూతలు మధ్యాహ్నం కలుసుకున్నప్పుడు, ద్రాక్షాతోటల్లో పొలాల్లో వారితో మాట్లాడినప్పుడు మానవుల పట్ల దేవుడు ఎంత శ్రద్ధ చూపించాడో నేడూ అంతే శ్రద్ధ చూపుతున్నాడు. సామాన్య బతుకులు వెళ్లదీసే మనకు పరలోకం అతిసమీపం కావచ్చు. దేవుని ఆజననుసరించి వచ్చేవారు వెళ్ళేవారు వేసే ప్రతీ అడుగుకీ పరలోక దూతలు చేయూతనిస్తారు. DATel 29.2

బేల్లెహేము కథకు అంతం లేదు. అందులో “దేవుని బుద్ధి జ్ఞానముల బహుళ్యము” దాగి ఉంది. రోమా 11:33. పరలోక సింహాసనానికి మారుగా పశువుల తొట్టెని, దేవదూతల సహవాసానికి బదులుగా ఆ పాకలోని పశువుల సాహవాసాన్ని ఎంపిక చేసుకున్న రక్షకుని అపూర్వ త్యాగానికి మనం దిగ్ర్భాంతి చెందుతాం. ఆయన సముఖంలో మానవాహంకారం, ఆత్మ సమృద్ధి గద్దింపు తలవంపులు పొందుతాయి. ఆదాము ఏదేనులో పాపరహితుడుగా ఉన్నప్పుడు సైతం క్రీస్తు మానవ నైజాన్ని స్వీకరించడం ఆయనకు తీరని అవమానమై ఉండేది. కాని మానవ జాతి నాలుగు వేల సంవత్సరాల పాపం వల్ల బలహీనమైన మానవతను క్రీస్తు స్వీకరించాడు. ప్రతీ ఆదాము బిడ్డ మాదిరిగా ఆయన పారంపర్య సిద్ధాంత పర్యవసానాల్ని అంగీకరించాడు. ఈ పర్యవసానాలు ఏమిటి అన్నది ఆయన ఇహలోక సంబంధమైన పూర్వీకుల చరిత్ర తేటతెల్లం చేస్తోంది. మన దుఃఖాన్ని శోధనల్ని పంచుకుని పాప రహితమైన ఆదర్శాన్ని మనకు అందించడానికి అలాంటి పారంపర్యంతో ఆయన వచ్చాడు. DATel 29.3

పరలోకంలో ఉన్నప్పుడు క్రీస్తు హోదాను బట్టి సాతాను ఆయన్ని ద్వేషించాడు. అక్కడ తన స్థానాన్ని పోగొట్టుకున్నప్పుడు క్రీస్తును మరింత ద్వేషించాడు. పాప మానవుల్ని రక్షించడానికి కంకణం కట్టుకున్న ప్రభువును ద్వేషించాడు. అయినప్పటికీ తన రాజ్యంగా సాతాను పేర్కొంటున్న లోకంలోకి తన కుమారుడు రావడానికి దేవుడు అనుమతించాడు. నిస్సహాయ శిశువుగా మానవ బలహీనతకు లొంగే అవకాశంతో రావడానికి అనుమతించాడు. సామాన్యంగా ఎదురయ్యే ప్రమాదం ఆయనకు ఎదురవ్వడానికి అనుమతించాడు. ప్రతీ మానవుడులాగే అపజయం పొంది నిత్యం నశించే అవకాశంతో జీవిత పోరాటం పోరాడడానికి అనుమతించాడు. DATel 29.4

మానవ తండ్రి తన కుమారుడి విషయంలో ఎన్నో కోరికలు కలిగి ఉంటాడు. తన చంటి బిడ్డ ముఖంలోకి చూసి ప్రమాద భరిత సమస్యల గురించి భయపడూ ఉంటాడు. తన బిడ్డను సాతాను ప్రభావం నుంచి కాపాడాలని, శోధన నుంచి, సంఘర్షణ నుంచి నిరోధించాలని ఆకాంక్షిస్తాడు. తీవ్రమైన సంఘర్షణను ఎదుర్కోడానికి, ఎంతో భయంకర ప్రమాదాన్ని ఎదుర్కోడానికి దేవుడు తన ఏకైక కుమారుణ్ని అర్పించాడు. మన చిన్నారుల జీవిత మార్గాన్ని నిర్దిష్టం చేయడానికి ఆయనను అర్పించాడు. “ఇదీ ప్రేమ” పరలోకమా, ఆశ్చర్యపడు! భూలోకమా, విభ్రాంతి చెందు! DATel 30.1