పితరులు ప్రవక్తలు

13/75

11—అబ్రాహాము పిలుపు

బాబేలు నుంచి ప్రజలు చెదిరిపోవటం జరిగిన తర్వాత విగ్రహారాధన మళ్లీ లోకమంతా వ్యాపించింది. కరడుగట్టిన దుర్మార్గుల్ని తమ దుర్మార్గాలకు విడిచి పెట్టి దేవుడు షేము సంతతివాడైన అబ్రాహాముని ఎంపిక చేసుకుని భావితరాల ప్రజలకోసం తన ధర్మశాస్త్ర పరిరక్షణ బాధ్యతకు అతణ్ని నియమించాడు. అబ్రాహాము మూఢ నమ్మకాలు, అన్యమతం నడుమ పెరిగాడు. దేవుని గూర్చిన జ్ఞానాన్ని భద్రపర్చిన తన తండ్రి కుటుంబీకులు సైతం తమ చుట్టూ ప్రబలుతున్న దుష్ప్రభావాలకు లొంగి యెహోవానుగాక “ఇతర దేవుళ్లను” కొలిచారు. అయితే నిజమైన విశ్వాసం అంతరించటానికి వీలులేదు. తన సేవ చేయటానికి దేవుడు ఎప్పుడూ ఒక శేషించిన జనాంగాన్ని సంరక్షిస్తూ వచ్చాడు. ఆదాము, షేతు, హనోకు, మెతూ షెల, నోవహు, షేము యుగాల పొడవునా దేవుని ధర్మవిధుల్ని భద్రపర్చారు. తెరహు కుమారుడు ఈ పరిశుద్ధ విశ్వాసానికి వారసుడయ్యాడు. అన్ని పక్కల నుంచి విగ్రహారాధనకు అతనికి ఆహ్వానాలు వచ్చాయి. కాని వాటిని అతడు అంగీకరించలేదు. అతడు విశ్వాసం లేని ప్రజల మధ్య విశ్వాసిగా నివసించాడు. తన చుట్టూ ప్రబలుతున్న అవినీతి అతణ్ని తాకలేదు. నిజమైన ఒకే ఒక దేవున్ని అతడు భక్తిగా ఆరాధించాడు. “తనకు మొట్ట పెట్టువారి కందరికి తనకు నిజముగా మొడ్డ పెట్టువారి కందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు.” కీర్తనలు 145:18 ఆయన తన చిత్రాన్ని అబ్రాహాముకి బయలుపర్చి తన ధర్మవిధుల్ని గూర్చిన జ్ఞానాన్ని క్రీస్తు ద్వారా లభించనున్న రక్షణను గూర్చిన జ్ఞానాన్ని అతనికి అనుగ్రహించాడు. PPTel 114.1

ఆనాటి ప్రజలకు మిక్కిలి ప్రియమైన విస్తారమైన సంతానాన్ని జాతి ఔన్నత్యాన్ని అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. “నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పచేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.” తన వంశంలోనుంచి లోక రక్షకుడు వస్తాడన్ని ప్రశస్త వాగ్దానాన్ని కూడా దీనికి జోడించి ఆ విశ్వాస వారసుడికి ఇచ్చాడు దేవుడు. “భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును.” అయినా వాగ్దానం నెరవేర్పుకు మొదటి షరతగా విశ్వాసం పరీక్షజరగాల్సివుంది. బలి అర్పణ జరగాల్సివుంది. PPTel 114.2

అబ్రాహాముకి దేవుని వద్దనుంచి ఈ వర్తమానం వచ్చింది. “నీవు లేచి నీ దేశము నుండి బయలుదేరి నీకు నీకు చూపించు దేశమునకు వెళ్లుము.” పరిశుద్ద వాక్య పరిరక్షకుడుగా తనను దేవుడు యోగ్యుణ్యి చేసేందుకు గాను అబ్రాహాము తన పూర్వజీవిత సంబంధాలు అనుబంధాల నుంచి వేరుకావటం అవసరమయ్యింది. తన సేవకుడికి దేవుడివ్వసంకల్పించిన శిక్షణకు బంధుమిత్రుల ప్రభావం అడ్డువస్తుంది. ఇప్పుడు అబ్రాహాముకి పరలోకంతో ప్రత్యేక సంబంధం ఏర్పడింది గనక అతడు పరాయి జనుల మధ్య నివసించాలి. అతడి ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి. లౌకిక ప్రజల ప్రవర్తన కన్నా వ్యత్యాసంగా ఉండాలి. మిత్రులకు అర్థమయ్యే విధంగా తన కార్యాచరణ విధానాన్ని వివరించలేడు. ఆధ్యాత్మిక విషయాలు అధ్యాత్మికంగానే అవగతం కావాలి. అయితే అతడి ఉద్దేశాల్ని కార్యాల్నీ విగ్రహారాధకులైన తన బంధుజనం అవగతం చేసుకోలేదు. PPTel 115.1

“అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను.” హెబ్రీ 11:8. అబ్రాహాము చూపిన సందేహ రహిత విధేయత బైబిలు అంతటిలోనూ విశ్వాసానికి గల నిదర్శనాల్లో ప్రధానమైనది. అతడికి విశ్వాసం “నిరీక్షింపబడువాటి యొక్క నిజస్వరూపమును, అదృవ్యమైనవి యున్నవనుటకు ఋజువైయున్నది.” హెబ్రీ 11: 1 . దాని నెరవేర్పుకి ఎలాంటి హామీలేకపోయినా అబ్రాహాము దేవుని వాగ్దానం నమ్మి గృహాన్ని బంధువుల్ని జన్మస్థలాన్ని విడిచి పెట్టి తాను ఎక్కడికి వెళ్తున్నదీ ఎరుగకుండానే దేవుడు నడిపించే స్థలానికి వెళ్లాలని ముందుకు సాగాడు. ‘విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సహవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశములో ఉన్నట్టుగా వార్దత్త దేశములో పరవాసులైరి.” హెబ్రీ 11: 9. PPTel 115.2

అబ్రాహాముకి వచ్చింది తేలికైన పరీక్ష కాదు. అతడు చేయాల్సిన సమర్పణ చిన్నదీ కాదు. అతణ్ని తన ప్రదేశానికి, బంధువర్గానికి, గృహానికి బంధించి ఉంచగల బలమైన బంధాలున్నాయి. అయినా దేవుని పిలుపును శిరసావహించటానికి అబ్రాహాము వెనకాడలేదు. వాగ్దత్త దేశంలోని భూమి సారవంతమైందా కాదా? శీతోష్ణ పరిస్థితులు ఆరోగ్యదాయమైనవా కావా? అక్కడి పరిసరాలు ‘ధనార్జనకు అనుకూలమైనవా కావా? అన్న ప్రశ్నలు అతడు వేయలేదు. దేవుడు మాట పలికాడు. ఆయన సేవకుడు దాన్ని తు.చ. తప్పకుండా ఆచరించాడు. తాను ఎక్కడ ఉండాలని దేవుడు కోరాడో అదే అతడికి లోకమంతటిలో మిక్కిలి సంతోషకరమైన స్థలం. PPTel 115.3

అబ్రాహాము మాదిరిగానే అనేకమంది పరీక్షించబడ్డారు. ప్రత్యక్షంగా దేవుడే పరలోకం నుంచి పిలవటం వారు వినకపోవచ్చు. తన వాక్యంలోని బోధన ద్వారాను తన కృపాసంఘటనల ద్వారాను ఆయన పిలుపునిస్తాడు. ధనాన్ని పేరు ప్రతిష్టల్ని సంపాదించే ఉద్యోగాన్ని త్యాగం చేయటం, లాభసాటి అయిన స్నేహ సంబంధాలు వదులుకోవటం, బంధువుల్ని విడిచి పెట్టటం వంటి త్యాగాలు చేసి ఆత్మ నిరసన శ్రమలు కష్టాల మార్గాన్ని అనుసరించటానికి పిలుపు రావచ్చు. దేవుడు వారికొక పనిని నియమిస్తాడు. ఆ పనిని నిర్వహించటానికి ఎంతో అవసరమైన గుణగణాల అభివృద్ధికి సుఖజీవనం బంధుమిత్రుల ప్రభావం ప్రతి బంధకాలవుతాయి. అందుకు వారిని మానవ ప్రభావాల నుంచి సహాయ పరిధి నుంచి వేరుచేసి వారికి తన్నుతాను బయలు పర్చుకొనేందుకుగాను తన సహాయం అవసరాన్ని గుర్తించేలా వారిని నడిపిస్తాడు. ప్రభువు పిలుపు మేరకు తమకు ప్రియమైన అనుబంధాల్ని ప్రణాళికల్ని త్యాగం చేయటానికి ఎవరు సంసిద్ధంగా ఉంటారు? తమ నష్టాల్ని క్రీస్తు నిమిత్తం లాభాలుగా ఎంచి అచంచలమైన పరిపూర్ణమైన హృదయంతో నూతన కార్యరంగంలో నూతన విధుల్ని అంగీకరించటానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఇవి చేయటానికి సంసిద్ధత చూపే వ్యక్తి అబ్రాహాము విశ్వాసాన్ని కలిగి “మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము”, వాటితో పోల్చినప్పుడు “ఇప్పటికాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను” అన్నపౌలు విశ్వాసాన్ని పంచుకొంటాడు. 2 కొరి. 4:17, రోమా 8:18. PPTel 116.1

అబ్రాహాము “కల్దీయుల ఊరు” అనే పట్టణంలో నివసిస్తున్నప్పుడు అతనికి దేవుని పిలుపు వచ్చింది. దానికి విధేయుడై హారానుకు వెళ్లాడు. అక్కడి వరకు తన తండ్రి ఇంటివారు అతనితో వెళ్లారు ఎందుంటే వారు తమ విగ్రహారాధనతో పాటు నిజమైన దేవునిని కూడా ఆరాధించారు. తెరహు మరణం వరకు అబ్రాహాము హరానులోనే నివసించేవాడు. అయితే అతడి తండ్రి సమాధినుంచి దేవుని స్వరం మాట్లాడూ ముందుకు సాగమని అబ్రాహామును ఆదేశించింది. అబ్రాహాము సహోదరుడు నా హోరు తన కుటుంబాన్ని గృహాన్ని విగ్రహాల్ని విడిచి పెట్టలేపోయాడు. అబ్రాహాము భార్య శారయి, ఎప్పుడో మరణించిన హారాను కుమారుడు లోతు అబ్రాహాము యాత్రిక జీవితంలో పాలు పంచుకోటానికి ఎంపిక చేసుకొన్నారు. అయినా అరమ్నహరయీము నుంచి బయలుదేరిన బృందం చాలా పెద్దది. అప్పటికే అబ్రాహాముకి విస్తారమైన మందలు సేవకులు ఆశ్రితులతో ఊడిన సంపద ఉండటంతో తూర్పుదేశాల్లో తానే మిక్కిలి ధనికుడుగా పేరుపొందాడు. తన పూర్వికుల దేశం విడిచి పెట్టి వెళ్లిపోతున్నాడు. తనకున్నదంతా “హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసికొని” బయలుదేరాడు. ఈ బృందంలో చాలామంది స్వార్థప్రయోజనాసక్తితో కాక ఆధ్యాత్మిక ఆసక్తితో అబ్రాహామును వెంబడించిన వారున్నారు. హారానులో నివసించిన కాలంలో అబ్రాహాము శారయిలు ఇద్దరూ నిజమైన దేవుని విశ్వసించి ఆరాధించటానికి అనేకుల్ని నడిపించారు. వీరు ఈ పితరుడి కుటుంబంలో ఒక భాగమై అతడితో వాగ్దాత్త భూమికి పయనమయ్యారు. “కనాను దేశమునకు వెళ్లుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి”. PPTel 116.2

వారు మొట్టమొదటగా ఆగిన స్థలంషెకెము. ఏబాలు గిరిజీము కొండలమధ్య ఒలీవ తోపులు, గలగల ప్రవహించే సెలయేళ్లతో ముచ్చట కొల్పే విశాలమైన లోయలో మస్తకి వృక్షాల నీడలో అబ్రాహాముతన శిబిరాన్ని ఏర్పాటుచేసుకొన్నాడు. అబ్రాహాము ప్రవేశించింది మంచి దేశం “అది నీటివాగులును, లోయలలో నుండియు కొండలలో నుండియు పారు ఊటలును అగాధ జలములు గల దేశము. అది గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లును గల దేశము.ఒలీవ నూనెయు తేనెయుగల దేశము.” ద్వితి 8:7, 8. అయితే ఆ యెహోవా భక్తుడికి ఆ కొండల మీద పంటలతో నిండి ఉన్న ఆ భూముల మీద క్రీనీడలు కనిపించాయి.“అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి.” అబ్రాహాము తాను నిరీక్షించిన దేశాన్ని చేరాడు, కాని అది ఒక పరాయి జాతి ఆధీనంలోను విగ్రహారాధన గుప్పెట్లోను ఉన్నది. అక్కడి చెట్ల తోపుల్లో అబద్ధ దేవుళ్లకు బలిపీఠాలు నిర్మించారు. పరిసర కొండల పై నరబలులర్పిస్తున్నారు. దేవుని వాగ్దానాన్ని విశ్వసించినా తీవ్ర భయాందోళనలతోనే అబ్రాహాము అక్కడ గుడారం వేశాడు. అప్పుడు “యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై - నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదనని” చెప్పాడు. దేవుని సముఖం తనతో ఉన్నది. దుష్టుల దయాదాక్షిణ్యాలకు తాను విడువబడలేదు అన్న నిశ్చయత తనకు లభించినప్పుడు అతడి విశ్వాసం ధృఢపడింది. “అతడు తను ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను”. ఇంకా సంచరిస్తూ బేతెలుకు దగ్గరగా ఒక స్థలానికి వెళ్లి అక్కడ మళ్లీ బలిపీఠం కట్టి ప్రభువు నామాన ప్రార్థన చేశాడు. PPTel 117.1

“దేవుని స్నేహితుడు” అబ్రాహాము మనకు గొప్ప ఆదర్శంగా నిలిచాడు. అతనిది ప్రార్థన ప్రధాన జీవితం. తాను ఎక్కడ గుడారం వేస్తే దాని పక్క ఒక బలిపీఠం కట్టి ఉదయం సాయంత్రం బలులకు శిబిరంలో ఉన్నవారందరినీ ఆహ్వానించేవాడు. ఇంకోచోటు వెళ్లటానికి గుడారాన్ని తీసివేసినప్పుడు బలిపీఠం మాత్రం అక్కడే ఉండేది. సంచారం చేసే కనానీయుల్లో కొందరు అనంతర సంవత్సరాల్లో అబ్రాహాము ఉపదేశాన్ని స్వీకరించారు. వారిలో ఎవరైనా అబ్రాహాము విడిచి వెళ్లిన బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు ముందు అక్కడికి ఎవరు వచ్చారో దాన్నిబట్టి గ్రహించేవారు. అక్కడ తమ గుడారం వేసుకొన్నప్పుడు బలిపీఠాన్ని బాగుచేసి అక్కడ సజీవ దేవున్ని ఆరాధించేవారు. PPTel 117.2

అబ్రాహాము తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ దక్షిణానికి వెళ్లాడు. మళ్లీ అతని విశ్వాసానికి పరీక్ష వచ్చింది. వర్షాభావం ఏర్పడింది. లోయల్లోని ఏరులు ఎండిపోయాయి. పచ్చికబయళ్లలోని గడ్డి ఎండిపోతుంది. మందలకు బయళ్లలో మేతలేదు. ఆహారంలేక శిబిరమంతా అలమటించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అబ్రాహాము దేవుని నడిపింపును ప్రశ్నించలేదు లేదా వెనక్కు తిరిగి కల్దీయుల బయళ్లవంక ఆశగా చూడలేదు. ఒకదాని వెంట ఒకటిగా శ్రమలు వచ్చినప్పుడు అబ్రాహాము ఏంచేస్తాడా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. అతడి విశ్వాసం సడలనంతకాలం భయపడాల్సిన పనిలేదని భావించారు. దేవుడు అబ్రాహాము స్నేహితుడని ఆయన అతన్ని నడిపిస్తున్నాడని గ్రహించి ధైర్యపడ్డారు. PPTel 118.1

దేవుడు నడిపింపు అబ్రాహాము వివరించలేకోయాడు. తాను నిరీక్షించింది పొందలేకపోయాడు. ఆయన తనకు దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని గట్టిగా నమ్మాడు, “నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.” తన మనుషులు మందల జీవితాల్ని ఎలా కాపాడుకోవాలా అని ప్రార్థన పూర్వకంగా పరిగణించాడు. కాని దేవుని మాట పై తన విశ్వాసాన్ని కదల్చటానికి పరిస్థితులకు తావీయలేదు. దుర్భిక్షను తప్పించుకోటనికి ఐగుప్తుకు వెళ్లాడు. కనానును త్యజించలేదు. లేదా ఆ విపత్కర పరిస్థితిలో తాను విడిచి వచ్చిన కల్దీయుల దేశానికి తిరిగి వెళ్లలేదు. ఐగుప్తులో కనానుకి దగ్గరలో తాత్కాలిక ఆశ్రయం పొంది అనంతరం దేవుడతనికి నియమించిన కనానుకు తిరిగివెళ్లాలని ఉద్దేశించాడు. PPTel 118.2

సమర్పణ, ఓర్పు, విశ్వాసాల్ని గూర్చి పాఠాలు నేర్పించటానికే దేవుడు అబ్రాహాముకి ఈ కష్టం కలిగించాడు. తర్వాత శ్రమలు భరించాల్సిన వారికి ఉపకరించేందుకు ఈ పాఠాలు దాఖలు కావాల్సి ఉన్నాయి. తమకు గోచరం కాని మార్గంలో దేవుడు తన బిడ్డల్ని నడిపిస్తాడు. అయితే తనను నమ్ముకొన్న ప్రజల్ని ఆయన మర్చిపోడు విడిచి పెట్టడు. యోబుకి శ్రమలు రావటానికి సమ్మతించాడు కాని అతణ్ని విడిచి పెట్టలేదు. ప్రియుడైన యోహానును పత్మాసు దీవిలో ఏకాంత వాసానికి బహిష్కృతుడవ్వటాన్ని అనుమతించాడు. కాని దైవ కుమారుడు అతణ్ని అక్కడ కలుసుకొన్నాడు. అక్కడ యోహాను మహిమకరమైన అమర దృశ్యాలతో నిండిన దర్శనం పొందాడు. తమ స్థిరమనుసువల్ల విధేయత వల్ల తాము ఆధ్యాత్మికంగా ధృఢపడేందుకు, తమ ఆదర్శం ఇతరులకు బలం చేకూర్చే సాధనంగా ఉండేందుకు తన ప్రజలకు శ్రమలు రావటాన్ని దేవుడు అనుమతిస్తాడు. “నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును... అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు.” యిర్మీయా 29:11. దేవుడు మన విశ్వాసాన్ని తీవ్రంగా పరీక్షించి మనల్ని విడిచి పెట్టేశాడనిపించేంతటి శ్రమలే మనల్ని క్రీస్తుకి మరింత దగ్గర చేసి మన భారాల్ని ఆయన పాదాలవద్ద విడిచి వాటికి మారుగా ఆయన అనుగ్రహించే సమాధానాన్ని అనుభవించటానికి తోడ్పడతాయి. PPTel 118.3

దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజల కష్టాల్ని కొలిమిలో పరీక్షిస్తాడు. కొలిమి మంటల్లోనే క్రైస్తవ ప్రవర్తన సువర్ణం మకిలిపోయి శుద్ధిపడ్తుంది. ఈ పరీక్షను క్రీస్తు గమనిస్తాడు. తన ప్రేమ కాంతిని ప్రతిబింబించేందుకు గాను ఈ ప్రశస్త లోహాన్ని శుద్ధిపర్చటానికి ఏమి అవసరమో ఆయనకు తెలుసు. కఠిన శ్రమల పరీక్ష ద్వారా దేవుడు తన సేవకులకు క్రమశిక్షణ నేర్పుతాడు.తన సేవ పురోభివృద్ధికి తోడ్పడే ప్రతిభ పాటవాలు కొందరిలో ఉన్నట్లు చూసి వారిని ఆయన పరీక్షిస్తాడు. తమకు తెలియకుండా దాగి ఉన్న లోపాల్ని బలహీనతల్ని బయలుపర్చి తమ ప్రవర్తనను పరిశోధించే స్థానాల్లోకి వారిని తెస్తాడు. ఈ లోపాల్ని సవరించుకొని తన సేవకు తమ్మును తాము యోగ్యుల్ని చేసుకోటానికి వారికి అవకాశమిస్తాడు. తమ బలహీనతలేంటో వారికి కనపర్చి తనపై ఆధారపడమని ఆయన వారికి బోధిస్తాడు. ఎందుకంటే వారికి సహాయం సంరక్షణ ఆయనే. ఈ రకంగా ఆయన ఉద్దేశం నెరవేర్తుంది. తాను ఎందు నిమిత్తమైతే ఆ సామర్థ్యాల్ని వారికిచ్చాడో ఆ కార్యసాఫల్యానికి కావలసిన జ్ఞానం శిక్షణ క్రమశిక్షణ వారికి లభిస్తుంది. దేవుడు కార్యరంగంలోకి పిలిచినప్పుడు వారు సర్వసన్నద్ధంగా ఉంటారు. భూమి పై ముగించాల్సిన పనిలో దేవదూతలు వారితో చెయ్యి కలిపి పనిచేస్తారు. PPTel 119.1

అబ్రాహాము ఐగుప్తులో ఉన్నకాలంలో అతనిలో మానవ బలహీనతలు లోటుపాట్లు నిదర్శనం కనిపించింది.శారయి తన భార్య అన్న సంగతి దాచి పెట్టటంలో దేవుని కాపుదల శ్రద్ధలపై తన నమ్మకాన్ని, తన జీవితం పొడుగునా కనపర్చుతూ వచ్చిన ఉదాత్త విశ్వాసాన్ని ధైర్యాన్ని నిరర్థకం చేశాడు. శారయి సౌందర్యవతి. నల్లని ఐగుప్తుమనుషులు రూపవతి అయిన ఆమెను ఆశిస్తారన్నది కాదు అతని అనుమానం. ఆమెను సంపాదించటానికి ఆమె భర్తను చంపుతారన్నదే అతని భయం. శారయి తన సోదరి అని చెప్పటంలో తాను అబద్దమాడటంలోదని, ఎందుకంటే ఆమె తన తల్లికి పుట్టకపోయినా తన తండ్రికి పుట్టిందేనని సమర్ధించుకొన్నాడు. కాని వారి వాస్తవ సంబంధం విషయంలోని ఆ దాపరికం వంచన. న్యాయవర్తనలో ఏ కొద్దిపాటి వక్రత కూడా దేవునికి సమ్మతంకాదు. అబ్రాహాము విశ్వాసంలోని లోటుపాట్ల మూలంగా శారయి గొప్ప ప్రమాదంలో చిక్కుకొన్నది. శారయి సౌందర్యాన్ని గురించి విన్న ఐగుప్తురాజు వివాహం చేసుకొనే ఉద్దేశంతో ఆమెను తన రాజభవనానికి రప్పించాడు. అయితే రాజకుటుంబం మీదికి తీర్పులు పంపటంద్వారా ప్రభువు శారయిని పరిరక్షించాడు. రాజు ఈ విధంగా అసలు విషయాన్ని తెలుసుకొని అబ్రాహాము చేసిన మోసానికి అతణ్ని గద్దించి ఇలా అన్నాడు. “నీవు నాకు చేసినదేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని యేల చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసికొందునేమో అయితే నేమి? ఇదిగో నీ భార్య, ఈమెను తీసికొని పొమ్ము.” PPTel 119.2

రాజుకి అబ్రాహాము పట్ల విస్తారమైన సద్భావన ఉన్నది. ఇంత జరిగాక కూడ అతనికి గాని అతని బృందానిక గాని ఏ హానీ జరగటానికి ఫరోకి ఇష్టం లేక ఒక భటుణ్ని పిలిచి అబ్రాహామును అతని పరివారాన్ని క్షేమంగా తన రాజ్యం పొలిమేరల్ని దాటించమని ఆజ్ఞాపించాడు. ఐగుప్తీయులు పరదేశులైన గొర్రెల కాపరులతో కలిసి తినటం తాగటం వంటివి చేయకూడదంటూ ఈ సమయంలో చట్టాలు రూపొందిం చాడు. ఫరో అబ్రాహాము పట్ల ఉదారంగా వ్యవహరించాడు. కాని అతడు ఐగుప్తులో ఉండటానికి వీలులేదని చెప్పాడు. అజ్ఞానం వల్ల రాజు అబ్రాహాముకి గొప్పహాని చేయటానికి సిద్ధమయ్యాడు. కాని దేవుడు కలుగజేసుకొని మహపాతకం చేయకుండా రాజును కాపాడాడు. అబ్రాహములో దేవుని అనుగ్రహం పొందిన వ్యక్తిని ఫరో చూశాడు. దేవుని అదరానుగ్రహాల్ని పొందిన వ్యక్తి తన రాజ్యంలో ఉండటం ఫరోకు భయం పుట్టించింది. అబ్రాహాము ఐగుప్తులోనే ఉంటే పెరుగుతున్న తన సంపద, ప్రతిష్ఠ ఆదేశస్థులు అసూయపడి దురాశతో నిండి అతనికి హాని తల పెట్టటానికి కారణం కావచ్చు. దానికి ఫరోని బాధ్యుడుగా ఎంచటం రాజ కుటుంబం పై దేవుని తీర్పులు పడటం జరగవచ్చు. PPTel 120.1

ఫరోకి దేవుడు పంపిన హెచ్చరిక అన్యప్రజలతో అబ్రాహాము సంబంధాల విషయంలో అబ్రాహాముకి సంరక్షణగా పనిచేసింది. ఎందుకంటే ఆ రహస్యం దాగలేదు. అబ్రాహాము ఆరాధించే దేవుడు అతణ్ని కాపాడ్డాడని అతనికి అపకారం జరిగితే దానికి ప్రతీకారం జరుగుతుందని వ్యక్తమయ్యింది. పరలోక రాజు బిడ్డల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా అది ప్రమాదభరితం. ” అభిషేకించబడిన వారిని ముట్టకూడ దనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞఇచ్చి ఆయన వారి కొరకు రాజులను గద్దించెను” (కీర్త 105:14, 15) ఎన్నుకోబడ్డవారిని గురించి కీర్తనకారుడు ప్రస్తావించినప్పుడు అబ్రాహాము అనుభవంలోని ఈ ఆధ్యాయం గురించి మాట్లాడున్నాడు. అబ్రాహాముకి ఐగుప్తలో కలిగిన అనుభానికీ శతాబ్దాల అనంతరం అతని సంతతి ప్రజల అనుభవానికి దగ్గర పోలికలున్నాయి. ఇరువురూ కరవు మూలంగా ఐగుప్తు వెళ్లారు. ఇరువూరూ ఆ దేశంలో సంచరిచారు. వారి తరుపున దేవుని తీర్పుల కారణంగా ఐగుప్తీయులికి వారంటే భయం పుట్టింది. అన్యుల బహుమతులతో ధనికులై గొప్పసంపదతో ఇరువురూ బైటికి వెళ్లారు. PPTel 120.2