పితరులు ప్రవక్తలు

11/75

9—అక్షరాలా ఏడు దినాల వారం

సబ్బాతు మాదిరిగానే వారం కూడా సృష్టితోనే ప్రారంభమయ్యింది.ద అది చెక్కుచెదరకుండా భద్రంగా నిలిచి బైబిలు చరిత్ర ద్వారా మనకు వస్తున్నది. లోకం చివరిదాకా కాలాన్ని కొలవటానికి మాదిరిగా దేవుడే మొట్టమొదటి వారాన్ని కొలిచి మనకిచ్చాడు. తక్కిన వాటికిమల్లే అందులో అక్షరాలా ఏడు దినాలున్నాయి. సృష్టికార్యం ఆరు దినాలుగా సాగింది. ఏదోనాడు దేవుడు విశ్రమించి ఆ మీదట ఆ దినాన్ని ఆశీర్వదించి దాన్ని మానవులకు విశ్రాంతి దినంగా ప్రత్యేకించాడు. PPTel 99.1

సీనాయి పర్వతం మీదనుంచి ఇచ్చిన ధర్మశాస్త్రంలో దేవుడు వారాన్ని గుర్తించాడు. అది ఏ వాస్తవాలపై ఆధారితమై ఉన్నదో వాటిని గుర్తించాడు. “విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము” అన్న ఆజ్ఞ ఇచ్చి ఆరు దినాల్లో ఏమీ చెయ్యాలో వివరించిన తర్వాత తన ఆదర్శాన్ని ప్రస్తావిస్తూ వారాన్ని ఆ విధంగా ఆచరించటానికి గల హేతువును ప్రభువు ఇలా వివరిస్తున్నాడు. PPTel 99.2

“ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి యేడవ దినమున విశ్రమించెను, అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను” నిర్గమకాండము 20:8-11. సృష్టి జరిగిన దినాలు అక్షరాలా నిజమైన దినాలని మనం నమ్మినప్పుడు ఇది చక్కని కారణంగాను బలమైన కారణంగాను కనిపిస్తుంది. వారంలో ఆరు దినాలు మానవుడు పనిచేయటానికి ఏర్పాటయ్యాయి. ఎందుకంటే మొదటి వారంలోని ఆరు దినాల్లో దేవుడు సృష్టికార్యాన్ని నిర్వహించాడు. సృష్టికర్త విశ్రాంతికి జ్ఞాపకార్థంగా మానవుడు వారంలో ఏడో రోజున ఏ పనీ చేయకుండా విశ్రమించాల్సి ఉన్నాడు. PPTel 99.3

అయితే మొదటి వారంలో చోటు చేసుకొన్న సంఘటనలకు వేలాది సంవత్సరాలు పట్టి ఉంటాయన్న ఊహ నాల్గో ఆజ్ఞను కూలదోస్తున్నది. తలా తోకా లేని అనిశ్చిత కాలం జ్ఞాపకార్థంగా ఖచ్చితమైన దినాలుగల వారాన్ని ఆచరించాలని మానవుల్ని దేవుడు ఆజ్ఞాపిస్తున్నట్లు ఇది సూచిస్తుంది. తాను సృజించిన మనుషులతో దేవుడు వ్యవహరించే పద్ధతి ఇది కాదు. ఆయన తేటతెల్లం చేసినదాన్ని ఇది అనిశ్చితం అస్తవ్యస్తం చేస్తున్నది. ఇది మిక్కిలి భయంకర రూపం ధరించిన నమ్మకద్రోహం. దాని నిజస్వరూపం మరుగుపడటంతో బైబిలును విశ్వసిస్తున్నట్లు చెప్పుకొనేవారు సైతం దాన్ని విశ్వసించి ప్రబోధిస్తున్నారు. PPTel 99.4

” యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత ఆకాశములు కలిగెను” “ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపడెను” కీర్తనలు 33:6, 9. దీర్ఘకాలంగా యుగయుగా లుగా కొనసాగిన అస్తవ్యస్త పరిస్థితిలో నుంచి భూమి క్రమక్రమంగా పరిణామం చెందిందన్న సిద్ధాంతాన్ని బైబిలు గుర్తించదు. సృష్టి అనంతరం వచ్చిపోతున్న దినాలకుమల్లెనే సృష్టివారంలోని ప్రతీదినంలోనూ ఉదయం సాయంత్రం ఇమిడి ఉ న్నాయని పరిశుద్ధ లేఖనం చెబుతున్నది. సృష్టికర్త పని ఫలితం ప్రతిదినం అంతంలో ప్రకటితమై మొదటివారం పనిదాఖలా చివర ఈ మాటలున్నాయి : దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటివాటి (తరముల) ఉత్పత్తి క్రమము ఇదే” ఆది కాండము 2:4. సృష్టి వారంలోని దినాలు అక్షరాలా నిజమైన దినాలు కావన్న అభిప్రాయాన్ని ఈ మాటలు సూచించటంలేదు.ప్రతీ దినాన్ని ఒక ఉత్పాదనగా వ్యవహరించటం జరిగింది. ఎందుకంటే ప్రతీ దినం దేవుడు తన పనిలో ఒక నూతన భాగాన్ని ఉత్పత్తి చేశాడు. PPTel 100.1

మోషే రచనల దాఖలాలు చెబుతున్న దానికన్నా భూమి ఎంతో పురాతనమైందని చెప్పటానికి తాము నిదర్శనం కనుగొన్నట్లు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అనేక వేల సంవత్సరాలు ఉనికిలో ఉన్న మనుషులు జంతువుల ఎముకలు యుద్ధపరికరాలు రాయిగా మారిన చెట్లు బయలుపడ్డాయి. వీటి పరిమాణం ఇప్పుడున్న వాటికన్నా ఎంతో పెద్దది. సృష్టి ఉదంతం వివరిస్తున్నదానికన్నా ఎంతో ముందు భూమి జనాభాతో నిండి ఉన్నదని ఆ జాతి ప్రజలు శరీర పరిమాణంలో ఇప్పటి ప్రజలకన్నా అధికులని దీన్నిబట్టి బోధపడున్నదని వాదిస్తున్నారు. ఇలాంటి వాదననుబట్టి బైబిలును నమ్ముతున్నామని చెప్పుకొనే అనేకమంది సృష్టి జరిగిన దినాలు సుదీర్ఘమైన పరిమితులు లేని కాలవ్యవధులన్న అభిప్రాయానికి వచ్చారు. PPTel 100.2

బైబిలును పరిగణించకుండా భూవిజ్ఞాన శాస్త్రం నిరూపించగలిగేది ఏమీ లేదు. విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణల పై విశ్వాసం పెట్టుకొన్న మనుషులు జలప్రళయానికి ముందు నివసించిన మనుషులు జంతువులు వృక్షాల పరిణామం గురించి అప్పుడు సంభవించిన మార్పులు గురించి సరియైన అవగాహన లేనట్లు కనిపిస్తున్నది. భూగర్భంలో దొరికిన అస్థికలు ఇప్పటి పరిస్థితులకన్నా అప్పటి పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు నిరూపించటం నిజమే అయినా ఆ పరిస్థితులు ఉన్న కాలాన్ని గురించి పరిశుద్ధ లేఖనాలు మాత్రమే వివరించగలవు. భూ విజ్ఞాన శాస్త్రం గ్రహించలేని అంశాల్ని జలప్రళయం చరిత్రలో పరిశుద్ధ లేఖనం విశదం చేస్తున్నది. నోవహు దినాల్లోని మనుషులు ఇప్పటి మనుషులకన్నా పరిమాణంలో ఎన్నోరెట్లు అధికులు, జంతువులు చెట్లు కూడా ఎన్నో రెట్లు పెద్దవి. జలప్రళయమప్పుడు ఇవి భూమిలో కూరుకుపోయి ఆనాటి ప్రజలు జలప్రళయం వల్ల నశించారన్నదానికి నిదర్శనంగా భావితరాల వారి కోసం భద్రపర్చబడి ఉన్నాయి. వీటి ఆవిష్కరణవల్ల పరిశుద్ధ లేఖన చరిత్రపై విశ్వాసం స్థిరపడాలన్నది దేవుని ఉద్దేశం. తమ మేలుకోసం దేవుడిచ్చిన వాటిని దుర్వినియోగపర్చటం ద్వారా శాపంగా మార్చిన జలప్రళయ పూర్వ ప్రజలు పడ్డ పొరపాటులోనే వ్యర్థ వాదాలకు దిగుతున్న ప్రజలు కూడా పడుతున్నారు. PPTel 100.3

అపనమ్మకం పుట్టించే కట్టు కథలని అంగీకరించటానికి ప్రజల్ని నడిపించటం సాతాను ఎత్తుగడల్లో ఒకటి. అతడు స్పష్టంగా ఉన్న దైవ ధర్మశాస్త్రాన్ని ఇలా మసకబార్చి దేవుని ప్రభుత్వానికి ఎదురు తిరగటానికి మనుషుల్ని ప్రోత్సహిస్తాడు. నాల్గో ఆజ్ఞ భూమ్యాకాశాల్ని సృజించిన దేవునిని స్పష్టంగా పేర్కొంటుంది గనుక దాన్ని నిరర్థకం చేయటానికి అతడు తీవ్ర కృషి సల్పుతాడు. PPTel 101.1

స్వాభావిక కారణాలవల్ల సృష్టి కలుగుతుందని వివరణ లివ్వటానికి నిత్యమూ కృషి జరుగుతున్నది. క్రైస్తవులమని చెప్పుకొనేవారు కూడా లేఖన సత్యాలకు విరుద్ధమైన మానవ జ్ఞానాన్ని అంగీకరిస్తున్నారు. దానియేలు ప్రకటన గ్రంథాలు గ్రాహ్యంకాని గ్రంథాలని చెబుతూ ప్రవచనాల్ని పరిశీలించం వ్యతిరేకించేవారు చాలామంది. అయినా వీరే మోషే దాఖలాలకు విరుద్ధంగా ఉన్న భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుల ఊహాగానాల్ని అంగీకరిస్తున్నారు. అయితే, దేవుడు బయలుపర్చినదాన్ని గ్రహించలేమనే వారు ఆయన బయలు పర్చని మానవ ఊహాగానాల్ని అంగీకరించటం ఎంత అసంబద్ధం! PPTel 101.2

“రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలు పర్చబడినవి ఎల్లప్పుడు మనవియు మన సంతతివియు నగునని చెప్పుదురు” ద్వితి 29:29. సృష్టి ప్రక్రియను తానెలా నిర్వహించాడో దేవుడు మానవులకు తెలియపర్చలేదు. అత్యున్నతుడైన దేవుని మర్మ సంగతుల్ని మానవ విజ్ఞాన శాస్త్రం పరిశోధించి తెలుసుకోలేదు. ఆయన ఉనికికి మల్లే ఆయన సృజనశక్తి మానవుడికి అగోచరం. PPTel 101.3

వైజ్ఞానికంగాను కళల పరంగా విశేష జ్ఞానాభివృద్ధిని దేవుడిచ్చాడు. అయితే శాస్త్రవేత్తలుగా చెప్పుకొనేవారు ఈ అంశాల్ని కేవలం మానవ దృక్పథంతో పరిగణించి నప్పుడు వారి ప్రయోగ ఫలితాలు తప్పుదారి పడతాయి. మనం సిద్ధాంతీకరించేది లేఖన సత్యాలకు విరుద్ధంగా లేనంత సేపు దేవుని వాక్యం బయలు పర్చిన దానికి మించి ఊహించటం అమాయకత్వం కావచ్చు. కాని దేవుని వాక్యాన్ని విడిచి పెట్టి విజ్ఞాన శాస్త్ర సూత్రాల ఆధారంగా దేవుని సృష్టి కార్యాన్ని వివరించటానికి ప్రయత్నించేవారు అజ్ఞాత మహాసముద్రంలో సముద్రపటమూ దిక్సూచి లేకుండా కొట్టుకుపోతున్న ప్రయాణికుల్లా ఉంటారు. సృష్టికర్త ఆయన కార్యాలు తమ అవగాహనకు మించి ఉన్నందున ఆయనను ఆయన కార్యాల్ని ప్రకృతి చట్టాల ఆధారంగా వివరించలేకపోతున్నందుకు వారు బైబిలు చరిత్రను తోసిపుచ్చుతున్నారు. పాత కొత్త నిబంధనల విశ్వసనీయతను శంకించేవారు మరో అడుగు ముందుకు వేసి దేవుని ఉనికిని శంకించి తమ విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసపు బండల మీద పడి నశించటానికి మిగిలిపోతారు. PPTel 101.4

ఈ వ్యక్తులు సరళ విశ్వాసాన్ని కోల్పోతున్నారు. దేవుని పరిశుద్ధ వాక్యం పై స్థిరమైన నమ్మకం ఏర్పడాలి. శాస్త్రం విషయంలో మానవుల అభిప్రాయాల ప్రకారం బైబిలుని పరీక్షించకూడదు. మానవ జ్ఞానం విశ్వసనీయమైన మార్గదర్శికాదు. తప్పుపట్టటానికి బైబిలుని చదివే నాస్తికులు బైబిలు పై గాని శాస్త్రం పైగాని పరిపూర్ణ అవగాహన లేనందువల్ల అవి పరస్పర విరుద్దాలని భావిస్తారు. సరి అయిన విధంగా అవగాహన చేసుకొంటే ఆ రెంటి మధ్య సంపూర్ణ సామరస్యం కనిపిస్తుంది. దేవుని ఆత్మ నడుపుదల కింద మోషే రచించాడు. యదార్థమైన భూగర్భశాస్త్ర సిద్ధాంతం మోషే రచనలతో అన్వయించని ఆవిష్కరణల్ని ప్రకటించదు. సత్యం అది ప్రకృతిలో ఉన్నా దైవ వాక్యంలో ఉన్నా ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది. దైవ వాక్యంలో ఉద్ధండ పండితులు సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. తమ జ్ఞానం గురించి అతిశయిస్తున్న మానవులు అనుదిన జీవనంలోని సామాన్య విషయాల్లో సయితం తాము గ్రహించలేనిది ఎంత ఉన్నదో చూపించటానికి ఈ అంశాల పైకి గమనాన్ని ఆకర్షించటం జరుగుతున్నది. దేవుని జ్ఞానాన్ని అనగా ఆయన చేసిన వాటిని చేయగలవాటిని అవగతం చేసుకోగలమన్నది శాస్త్రవేత్తల భావన. ఆయన చట్టాలే ఆయనకు హద్దులు నియమిస్తాయన్నది వారి నిశ్చితాభిప్రాయం. PPTel 102.1

మనుషులు దేవుడు లేడని అంటున్నారు లేదా ఆయన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు లేదా మానవ హృదయాల్లో ఆయన ఆత్మ పనిచేయటంతో సహా సమస్తాన్ని వివరించటానికి పూనుకొంటున్నారు. ఆయన నామాన్ని ఘనపర్చటంలేదు. ఆయనశక్తి కి భయపడటంలేదు. దేవుని చట్టాల్ని గాని తన చిత్తం నెరవేర్చుకోటానికి వాటి ద్వారా పనిచేయటానికి ఆయనకున్న శక్తినిగాని అవగాహన చేసుకోని కారణంగా మానవాతీత శక్తిగల దేవుని వారు విశ్వసించరు. సాధారణ ప్రయోగం ప్రకారం “ప్రకృతి చట్టాలు” అన్న పదబంధం భౌతిక ప్రపంచ నియంత్రణకు వర్తించే చట్టాలని మనుషుల అవగాహన.అయితే వారి జ్ఞానం ఎంత పరిమితం! సృష్టికర్త చట్టాల ప్రకారం పని చేయటానికి గల పరిధి ఎంత విశాలం! అది మానవ మాత్రుల అవగాహనకు అందనిది! PPTel 102.2

పదార్థానికి ప్రధాన శక్తి ఉంటుందని పదార్థానికి కొన్ని గుణాలు ఆపాధితమైనప్పుడు అది తన సొంత శక్తితో మెలగటానికి సాధ్యపడుందని ప్రకృతి కార్యాలన్నీ నిర్ణీత నియమాల ప్రకారం జరుగుతాయని వాటిలో దేవుడు కూడా జోక్యం కలిగించుకోటానికి లేదని అనేకులు బోధిస్తున్నారు. ఇది తప్పుడు శాస్త్రం. దేవుని వాక్యం దీన్ని సమర్థించటం లేదు. ప్రకృతి దాని సృష్టికర్తకు దాసీ. దేవుడు తన చట్టాల్ని రద్దు చేయటంగాని వాటికి విరుద్ధంగా పనిచేయటంగాని జరుగదు. వాటిని ఆయన తన సాధనాలుగా నిత్యమూ వినియోగించుకొంటాడు. తనలో ఉండి తన చట్టాల ద్వారా పనిచేసే ఒక జ్ఞాని, సముఖం, క్రియాత్మక శక్తి గురించి ప్రకృతి సాక్ష్యమిస్తున్నది. తండ్రి కుమారులు ప్రకృతి ద్వారా నిత్యమూ పనిచేస్తారు. “నా తండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు. నేనును చేయుచున్నాను” అన్నాడు క్రీస్తు యోహాను 5:17. PPTel 103.1

నెహెమ్యా దాఖలు చేసిన లేవీయుల గీతంలో వారిలా పాడారు, “నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని... సృజించి వాటన్నిటిని కాపాడువాడవు” నెమెమ్యా 9:6. ఈ లోకానికి సంబంధించినంతవరకు దేవుని సృష్టికార్యం పూర్తి అయ్యింది. ఎందుకంటే “జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నియు సంపూర్తియై యున్నవి” హెబ్రీ 4:3. అయితే తాను సృజించిన సృష్టిని పోషించి కాపాడటంలో ఆయన శక్తి ఇంకా వినియోగమవుతూనే ఉన్నది. ఒకసారి ప్రారంభమైన జీవన ప్రక్రియ దానంతట అదే పనిచేస్తున్నందువల్లనే నాడికొట్టుకోటం, శ్వాసక్రియ సాగటం జరగటంలేదు. కాని ప్రతీ శ్వాస ప్రతీ హృదయ స్పందన మనం ఎవరిలో “బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నా”మో (అ.కా. 17:8) PPTel 103.2

ఆ దేవుని ఆలన పాలనకు ఒక నిదర్శనం. తనకు స్వాభావికంగా ఉన్న వక్తివల్లనే భూమి ఏటికేడాది సమృద్ధిగా పంటలు పండుతున్నది. సూర్యుడిచుట్టూ తన భ్రమణాన్ని కొనసాగిస్తున్నది. దేవుని హస్తం గ్రహాల్ని నడిపిస్తూ అంతరిక్షంలో వాటి ప్రస్థానాన్ని క్రమపద్ధతిలో ఉంచుతున్నది. “వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టినవాడే గదా. తన అధిక శక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచి పెట్టడు” యెషయ 40:6 ఆయన శక్తివల్లనే మొక్కలు పెరుగుతాయి, చెట్లు ఆకులు తొడుగుతాయి, పువ్వులు వికసిస్తాయి. ఆయన “పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు” కీర్తనలు 147:8 లోయల్ని సస్యశ్యామలం చేసేవాడు ఆయనే. “అడవి జంతువులన్నియు.. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసికొనజూచుచున్నవి”. అతి సూక్ష్మక్రిమి నుంచి మానవుడివరకూ ప్రతీ ప్రాణీ ఆయన సంరక్షణ క్రింద జీవిస్తుంది. కీర్తన కారుడు ఈ చక్కని మాటలు అంటున్నాడు, “ఇవన్నియు నీ దయకొరకు కని పెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చు కొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచివాటిని తిని తృప్తిపరచబడును” కీర్తనలు 104:20,21, 27, 28.ఆయన మాటకు పంచభూతాలు కట్టుబడతాయి. ఆయన ఆకాశాన్ని మేఘావృతం చేసి వర్షం కురిపిస్తాడు. ” గొట్టె బొచ్చువంటి హిమము కురిపించువాడు ఆయనే. బూడిదవంటి మంచుకణములు చల్లువాడు ఆయనే?” కీర్తనలు 147:16ఆయన ఆజ్ఞనియ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును భూమ్యంత భాగములో నుండి ఆయన ఆవిరిఎక్కజేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములలో నుండి గాలిని రావించును” యిర్మీయా 10:13 PPTel 103.3

సమస్తానికి పునాది దేవుడే. వాస్తవ విజ్ఞాన శాస్త్రం ఆయన కార్యాలకు అనుగుణంగా ఉంటుంది. వాస్తవ విద్య ఆయన ప్రభుత్వానికి విధేయతను నేర్పుతుంది. శాస్త్రం కొత్త అద్భుతాల్ని మనదృష్టికి తెస్తుంది. అది ఉన్నతంగా పురోగమించి కొత్త లోతుల్ని పరిశోధిస్తుంది. కాని అది తన పరిశోధనల ద్వారా వెలికి తెచ్చే అంశాలు దైవ ప్రత్యక్షతలకు విరుద్ధంగా ఉండవు. శాస్త్రాన్ని నమ్ముకొని దేవుని గురించి తప్పుడు అభిప్రాయాలికి మద్దతు పలకటానికి అజ్ఞానం ముందడుగు వేయవచ్చు. కాని ప్రకృతి గ్రంథం దైవ వాక్యం ఒకదాని పై ఒకటి వెలుగును విరజిమ్ముతున్నాయి. ఇలా సృష్టికర్తను ఆరాధించటానికి ఆయన వాక్యాన్ని విశ్వసించటానికి మనకు మార్గం ఏర్పడుంది. PPTel 104.1

పరిమిత జ్ఞానం గల మానవుడు అపార జ్ఞాని అయిన దేవుని ఉనికిని, శక్తిని జ్ఞానాన్ని కార్యాల్ని పూర్తిగా అవగాహన చేసుకోటం సాధ్యం కాదు. ఒక పరిశుద్ధ రచయిత ఇలా అంటున్నాడు, “దేవునికి గూఢాంశములను నీవు తెలిసికొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణజ్ఞానము కలుగునా? అది ఆకాశవీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయుదువు? పాతాళముకంటె లోతుగానున్నది, నీవేమి యెరుగుదువు? దాని పరిమాణము భూమికంటె అధికమైనది, దాని వెడల్పు సముద్రముకంటె అధికమైనది” యోబు 11:7-9 లోక జ్ఞానుల్లో అత్యధికులు కూడా దేవున్ని అవగతం చేసుకోలేరు. మనుషులు నిత్యమూ అన్వేషిస్తూ నిత్యమూ నేర్చుకొంటూ ఉన్నా ఆయన్ని గూర్చి అంతుచిక్కని అనంతం మిగిలి ఉంటుంది. దేవుని శక్తిని ఔన్నత్యాన్ని గూర్చి సృష్టి సాక్ష్యమిస్తున్నది. “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది” కీర్తనలు 19:1. లేఖనాల్ని తమ మార్గదర్శిగా స్వీకరించేవారు దేవున్ని అవగాహన చేసుకోటానికి విజ్ఞాన శాస్త్రంలో గొప్ప సహాయాన్ని కనుగొంటారు. “ఆయన ఆశ్చర్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి” రోమా 1: 20. PPTel 104.2